25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-23

పలు కారణాలవల్ల, ముఖ్యంగా డెడ్ లైన్ లేకపోవటంవల్ల , వ్యాసాల నడుమ ఎడం కాస్త ఎక్కువగా వుంటోంది. అందువల్ల, వ్యాసాలు నేను రాయటం ఆపేశాననుకుని, ఆపేశారా? అని అడిగిన వారికి, ఆపకండని ప్రోత్సహించినవారికి, ఈ విమర్శలవల్ల కథ విమర్శ ఎలాఉండాలో తెలుసుకోవటమేకాక, కథా రచనలో తీసుకోవాల్సిన మౌలికమైన జాగ్రత్తలు తెలుస్తున్నాయి, ఉపయోగకరంగా వున్నాయని తెలియబరచి ఉత్సాహాన్ని ఇస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ విమర్శ వ్యాసాలు నేను కొనసాగిస్తాను. ఆపేసే ఉద్దేశ్యం ఏకోశానాలేదు.
దగ్గుమాటి పద్మాకర్ కథలు మూడు, 1994లో పరిధులూ- ప్రమేయాలు, 2006లో యూ….టర్న్, 2009లో ఈస్థటిక్ స్పేస్ లను ఈ సంకలనాల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంచి తమ సంకలనాల్లో చోటిచ్చారు. ఈ కథలను చదివితే ఒక విషయం స్పష్టమవుతుంది. రచయితకు నేటి విద్యా విధానంపట్ల కొన్ని నిర్దిష్టమయిన అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి. అలాగే, మానవ సంబంధాలపట్ల కొన్ని అసంతృప్తులూ, ఆలోచనలూ ఉన్నాయి. వాటిని ప్రదర్శించేందుకు ఆయన కథను మాధ్యమంగా ఎన్నుకున్నారు. అయితే, ఏదో ఒక స్థాయిలో రచయిత కథను ఓవెర్టేక్ చేసి, తన అభిప్రాయాలను కథలో చొప్పించటం కనిపిస్తుంది. కథను దెబ్బతీసే అంశం ఇది. అంటే…రచయిత తాను చెప్పాల్సింది ఎంతో వుండటంతో, ఒక స్థాయికి కథను చేర్చాక, కథలో ఉన్న పరిమితులతో విసుగు చెంది స్వయంగా కథలో దూకి దాన్ని తనభిప్రాయ ప్రకటనతో ముగించేశాడన్నమాట..ఈ మూడు కథలు చదివితే కలిగే అభిప్రాయం ఇది.
పరిధులూ-ప్రమేయాలు కథలో రచయిత తాను ప్రదర్శించాలనుకున్న ద్వంద్వప్రవృత్తులను సంపూర్ణంగా, సంతృప్తికరంగా ప్రదర్శించలేకపోయాడన్న భావన కలుగుతుంది. చాలా అమెచ్యూరిష్ కథ ఇది. ఆనందరావనే దళిత సంఘం జిల్లా నాయకుడు దళిత సంస్కృతి అనే అంశంపై పాఠం చెప్పేందుకు పక్క జిల్లాకు వెళ్తాడు. అక్కడ ఆయన పాఠం అయిన తరువాత ఆ జిల్లా కన్వీనర్ గా వున్న శంకర్ అనే యువకుడు ఒక చీటీ పంపుతాడు. క్లాసులో సమాజంలో కులం అంతరించిపోవాలంటే కులాంతర వివాహాలు పోవటమే మార్గమని చెప్తాడు ఆనందరావు. కాబట్టి, తాను , ఆనందరావు కూతురు చంద్రావతిని వివాహం చేసుకుంటానని వుంటుందా చీటీలో. దానికి సమాధానంగా ఆలోచించుకోవాలంటాడు అన్నందరావు.ఆచరణలో మీరు చెప్పిన సూత్రం ఏ క్రమంలో ముందుకు వెళుతుందో పరిశీలించాలనుకుంటున్నాను. అది నాతోనే నాద్వారానే మొదలుపెట్టాలనుకున్నాను అంటాడు శంకర్. ఇక్కడ రచయిత చంద్రావతి వ్యక్తిత్వం గురించి ఒక పేరా రాస్తాడు. దళిత సమస్యకన్నా స్త్రీ అణచివేత ఇంకా ప్రాధాన్యమున్న సమస్య అని ఆమె అభిప్రాయం. పీడిత కులానికి చెందినా నేను స్త్రీని నాన్నా. అనటమేకాదు, పీడిత కులాల్లో అంటే దళిత పురుషులు అణచివేతకు గురిచేస్తున్న మా స్త్రీ జాతిని కనుక తొలగిస్తే, మీరెంత శాతం నాన్నా-నలభై శాతం కూడా వుండరు అని తేల్చిపారేస్తుంది వాళ్ళ నాన్న వాదనను. ఇంకా, అంబేద్కర్ నాలా ఆడదానిలా పుట్టివుంటే తన సర్వ శక్తులు పొయ్యికేసి వూది వూది ఊపిరిత్త్తయ్యేవాడు, దళిత శక్తి అయ్యేవాడుకాదు అంటుంది. ఆ చర్చ సందర్భంలో వాళ్ళ నాన్న కులాంతర వివాహం ప్రసక్తి తెస్తాడు. దానికి ఆమె సమాధానం ఇస్తుంది. ఒక అమ్మాయి, అబ్బాయి అవగాహనకు వచ్చి కులాంతరం చేసుకున్నా, కులంలోనే చేసుకున్నా అభ్యంతరంలేదుగానీ, ఇలా పనిగట్టుకుని యువతీయువకుల పెళ్ళిళ్ళు చేయాలనుకోవటం నాకు నచ్చదు అని చెప్తుంది. కులం ప్రాముఖ్యతను అంతరింపచేయడం కోసం వైవాహిక జీవితం ప్రాముఖ్యతను, అందులోని సంబంధాలను అప్రధానం చేస్తున్నారని అంటుంది. అప్పుడు శంకర్ సంగతి బయటపెడతాడాయన. మీరు పెత్తందారీ భావజాలంలోనే వున్నారని తండ్రితో అంటుంది. అంతేకాదు, పెళ్ళి తన వ్యక్తిగత విషయమని నాన్న తన హక్కులకు భంగం కలిగించకూడదనీ అంటుంది. ఆయన ఏమన్నా పర్సనల్, హక్కులు అంటూ ఎత్తగొట్టేస్తుంది. చివరలో, మీరింకెప్పుడూ నా పరిధిలోకి రాకుండావుండేందుకే ఇంత వాదన అని చివరలో న వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం నేను అంగీకరించలేను నాన్నా అంటుంది. ఆయన ఏదో అనబోతూంటే నే వెళ్తున్నా నాన్నా అని వెళ్ళిపోతుంది. ఇదీ కథ.
చదివిన తరువాత ఇందులో కథ ఏముంది??? అన్న ప్రశ్న జనిస్తుంది. కథ లేదు. వాదనలున్నాయి. అవీ ఏక పక్ష వాదనలు. ఉదాహరణలు, సమర్ధనలు లేని ప్రతిపాదనలున్నాయి. ఎమ్మే చదువుతున్న అమ్మాయి, తండ్రిని వ్యక్తిగత నిర్ణయాల్లో ఇతరుల ప్రమేయం అంగీకరించనని పరాయివాడిని చేసి మాట్లాడటము చాలా గొప్ప వ్యక్తిత్వమన్న అభిప్రాయం రచనలో కనిపిస్తుంది. నిజానికి ఈ కథకాని కథలో ఆలోచనలు, వాదనలు, అభిప్రాయాలున్నాయి కానీ కథలేదు. ఇందులోని ప్రతి అభిప్రాయాన్నీ, ప్రతి వాదనను ఖండించవచ్చు కానీ, అది ఈ వ్యాస పరిథిలోకి రాదు. కథగా చూస్తే….ఇది కథేకాదని ముందే అనుకున్నాం. ఎందుకు కాదంటే ఇది సంభాషణ. ఆరంభంలో ఆనందరావు అమ్మాయి వివాహం ప్రసక్తి తెచ్చి, తరువాత దాని నేపధ్యం చెప్పి, మళ్ళీ వర్తమానంలోకి వచ్చి అమ్మాయితో చర్చిస్తే అది కథ అయిపోదు. రచయిత వ్యాసం రాసి, ఆ వ్యాసాన్ని సంభాషణలు చేసి అక్కడక్కడా పాత్రల పేర్లుంచాడనిపిస్తుంది. దాంతో ఒక వ్యాసం కథను చదివినట్టుంటుంది తప్ప, కనీసం కథ వ్యాసాన్ని చదివినట్టుకూడా వుండదు. ఇది ఉత్తమ కథ ఎలా అయిందంటే…దీన్లో అమ్మాయి తల్లితండ్రులను తృణీకరించి గొప్ప గొప్ప సంభాషణలు చెప్పటం వుంది. అలా చెప్పటం గూప వ్యక్తిత్వం కదా!!! వివాహ వ్యవస్థ గురించి వ్యాఖ్యలున్నాయి. కులము, వివాహము వంటి చర్చల్లో, అమ్మాయి గొప్పగా మాట్లాడినట్తుంది..కాబట్టి ఫెమినిజమూ ఉన్నట్టే…అయితే..ఆ అమ్మాయి ఇంకా తండ్రి డబ్బులతో చదువుకుంటోంది. ఆయనను పరాయివాడంటోంది. ఆయన మంచివాడు కాబట్టి బెలగా చూశాడు. నాలాంటి వాడయితే…నన్ను పరాయివాడన్నవాళ్ళు నా ఇంట్లో వుంటూ నా డబ్బుతో చదువుతూ, నేను పెట్టిన అన్నంతో వొళ్ళు పెంచి నన్ను పరాయివాడన్నవాళ్ళు నా ఇంట్లో వుండాల్సిన అవసరంలేదు పోయి ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టుండమంటాడు. మళ్ళీ ఈ రచయితే, అది పితృస్వామ్యం, ధనాహంకారం అంటూ విమర్సించి వ్యాసంలాంటి కథ రాస్తాడు. దాన్ని ఈ సంపాదకులే ఉత్తమ కథ అని అంటారు. కథలో కథ వుండాలి. ఆ కథలో లాజిక్ వుండాలి. పాత్రలకు వ్యక్తిత్వాలుండాలి. అభిప్రాయాలను ఉపన్యాసాలుగా కాక కథ ద్వారా పాఠకులకు స్ఫురించాలి..అలాంటి లక్షణాలేవీఎ ఈ కథ పరిథిలో కనిపించవు. పైగా, కూతురు, ఒక హేతువాద యువకుడు తండ్రి తనకు పెట్టిన వెంకటేశ్వర్లు అన్న దేవుని పేరు కారణంగా సంఘర్షణ పదుతూండవచ్చు. అలాగే కులాంతరం చేసుకున్న వారి పిల్లల్లో తనలో ఏ కులం తాలూకు స్వచ్చమైన రక్తమూ లేదన్న ఆవేదన వుండవచ్చని అంటే అలా కూడా వుంటుందా అని ఆశ్చర్యపోతాడు తండ్రి. అంట అమాయకులా దళిత నాయకులు? అప్పుడు అనుమానం వస్తుంది. రచయిత అమాయకుడా? తండ్రి పాత్ర అమాయకుడా? ఉత్తమ కథల సంపాదకులు అమాయకులా? కథ అంటే ఏమిటో తెలియని భట్రాజ విమర్శకులు అమాయకులా అని. కానీ, కథంతా చదివిన తరువాత అసలు అమాయకత్వం ఇలాంటి కథలను ఉత్తమ కథలంటే నమ్మి చదివి మనకు అర్ధంకాలేదంటే ఇందులో ఏదో వుండివుంటుందని, ఉత్తమ కథ అనగానే భక్తిభావంతో తలలూపే తెలుగుపాఠకులదని బోధపదుతుంది.
యూ..టర్న్ ఒక యుటోపియన్ కథ. ఇందులో ఒక వ్యాపారి, మూడునెలలకోసారి తన లాభాల లెక్కలు చూసిన తరువాత రెండు మూడు రోజులు విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సారిమాత్రం ఒక స్కూల్లో ఒక మూడు రోజులు పిల్లలకు పాఠాలు చెప్తూ గడపాలనుకుంటాడు. ఆ మూడు రోజులూ పిల్లలతో హాయిగా పాఠాలు చెప్తూ గదుపుతాడు. చివరి రోజు శకుంతల అనే అమ్మాయి తాను దాచుకున్న బలపాలను తెచ్చి ఇస్తుంది అతనికి గిఫ్టుగా. అది ఆ వ్యాపారిలో ఆలోచనను కలిగిస్తుంది. తన మొత్తం ఆస్తిని విద్యా రంగంలో వెచ్చించాలని నిశ్చయించుకుంటాడు. స్కూళ్లు కట్టి సర్వస్వం త్యాగం చేయగల ధీరోదాత్తులను తయారుచేయగల స్కూళ్ళను, హృదయవైశాల్యాన్ని పెంచే విద్యను దేశానికి అందించాలని నిశ్చయించుకుంటాడు. కథ ఇతివృత్తం బాగానే వున్నా కథను చెప్పిన విధానంలోనే కథ దెబ్బతిన్నది. ఈ కథ ఆరంభంలో కూడా వ్యాపారి గురించి ఒక పేజీ అంతా రాసి అతడినో సమస్య బాధిస్తోండంటూ చెప్పి, ఫ్లాష్ బాక్ లో కథ చెప్పి, మళ్ళీ వర్తమానానికి వచ్చి ఓ సైకియాట్రిస్ట్ ని పిలిచి అతడితో నాలుగు పేజీలు( పాతికేళ్ళ కథ అంటూ అన్ని కథలూ ఒకచోట వేసిన సంకలనంలో నాలుగు పేజీలు…మామూలు పుస్తకంలో ఇంకా ఎక్కువే పేజీలుండవచ్చు) చర్చజరిపి నిర్ణయానికి రావటంతో కథ ముగుస్తుంది. అంటే కథగా ఆరంభమయి దాదాపుగా వ్యాసంలా ముగుస్తుందన్నమాట కథ. వ్యాపారి సైకియాట్రిస్టుల నడుమ సంభాషణల కొటేషన్లు తీసేస్తే ఒక నాలుగు పేజీల వ్యాసం అయిపోతుంది ఆ భాగమంతా. అయితే, విద్యావిధానంపట్ల, పిల్లల పత్ల రచయితకు కొన్ని ఆలోచనలు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఈ వ్యాసంగా పూర్తయ్యే కథ ద్వారా తెలుస్తుంది. కానీ, రచయితది చక్కటి శైలి..వ్యాసం అయ్యే సంభాషణ ఆరంభమయ్యేవరకూ కథను చక్కగా నదిపేడు.
గమనిస్తే, ఈ ఉత్తమ కథల సంకలనాల్లో మూడు అంతకన్నా ఎక్కువ కథలు ఉత్తమ కథలుగా ఎన్నుకున్న రచయితల కథలను పరిశీలిస్తే, ఆ మూడిత్లో కనీసం ఒక కథ అయినా దాంపత్య సంబంధాని దూషిస్తూనో, వైవాహికేతర సంబంధానికి సంబంధించినదో అయివుంటుంది. ఈ రచయిత మూడవ కథ ఈస్థటిక్ స్పేస్ ఈ కోవకు చెందినది. ఈ కథలో ఒక అమ్మాయి భర్తను కోల్పోతుంది. ఆమె పనిచేసే కాలేజీలోనే పనిచేసే ఆయన భార్య పోతుంది. అతనీమెతో సన్నిహితంగా వుంటూంటాడు. వారిద్దరికీ కాలేజీలో చదువుకునేప్పటినుంచీ పరిచయం వుంటుంది. అతదొకరోజు ఆమెని కోరిక కోరతాడు. ఆమె చెంపమీద ఒకటిచ్చి, నువ్వు కోరేది ఈ శరీరాన్నే కదా!! అది నా బాధ తీర్చాలనా? నీ బాధ తీర్చుకోవాలనా? అని ప్రశ్నిస్తుంది. అంతేకాదు. కంట్రోల్ లేదా? జ్ఞానం లేదా? అని మళ్ళీ కొట్టి చివరలో నాకూ నువ్వు తప్ప ఎవరున్నారని! వెళ్ళి రేపురా ఫో.. రెపటిలోగా మళ్ళీ నా శరీరం గురించిన స్పృహ నీకొచ్చిందంటే రానవసరంలేదని తలుపేసేసుకుంటుంది. మరుసటి రోజు కాస్త పిచ్చి చర్చలయ్యాక( నువ్వు సతీసవిత్రి లెవెల్లో వుంటావనుకోలేదు, నాలుగయిదు సంవత్సరాల ఆత్మీయ పరిచయస్తుడు సెక్స్ దగ్గరకు వచ్చేసేరికి పరాయివాడైపోతాడా? వంటి ప్రశ్నలతో పాటుగా..ఒంటరి రాత్రులలో నా భర్త స్మృతులతో నేనేవో తంటాలుపడుతూంటాను వంటి కంఫెషన్లూ) ఆమె అతడిని ముద్దుపెట్తుకుంటుంది. మన అభ్యుదయవాదులు, ఫెమినిస్టులూ, ఆధునిక ఆక్టివిస్టులూ దేనికోసం అర్రులుచాస్తూ కథలు రాసేస్తూ స్మతృప్తిపొందుతూ జీవిస్తున్నారో ఆ చర్య వారిద్దరిమధ్యా జరిగిపోతుంది. ఆ తరువాత ఈదరి మధ్యా మళ్ళీ చర్చ సాగుతుంది. తాను అతని ఆపేక్ష చూసి అతనికి దగ్గరయింది తప్ప సెక్స్ కోసం కాదంటుంది ఆమె. అంతటితో ఆగక, పిల్లల స్థాయి నుంచే సాంస్కృతిక విలువలు నేర్పాలంటుంది. ఎయిడ్స్ ప్రచారాన్ని నిగ్రహం చెప్పకుండా కందోంస్ వాడమనటాన్ని విమర్సిస్తుంది. ఆడవాళ్ళపై అఘాయిత్యం చేయాలని అనిపించిందా అని అతదిని అడుగుతుంది. అప్పుడప్పుడనిపించిందంటాతడు. పరాయి స్త్రీలమీద కోరికలు ఈస్థెటిక్ స్పేస్ లో స్తోరయి భార్యతో జరిగే సంగమంలో లీనమయ్యేవేమో అంటాడు. ఈస్థెటిక్ స్పేస్ లేకనే క్రూర ప్రవృత్తి పెరిగిందంటుందామె. మళ్ళీ ప్రకతనలు లెక్చరర్లు విద్యార్థుల గురించి చిన్న లెక్చరుంటుంది. ఇదంతా విని దిమ్మతిరిగిన స్నేహితుడు ప్రతిసారీ ఇంత లెక్చర్ వినాల్సొస్తుందనేమో మనం సంస్కారవంతమయిన స్నేహితులుగా మిగిలిపోదాం అంటాడు( ఈ సంస్కారవంతమయిన స్నేహం ఏమిటో రచయిత వివరించడు..బహుషా….ఆకలి చూపులు చూస్తూ, వేడి నిట్టూర్పులు విదుస్తూ, ఆకలేసిన కుక్క నా వేషాలు వేసి ఆకలిని తెలిపినట్టు తెలిపి కాస్త ముద్ద పారేస్తే తోక ఊపటం లేకపోతే మరో ఈస్థెటిక్ స్పేస్ వెతుక్కుని విలీనమ చేయటమోనేమో!!!!!) అతని మాటలకామె….ఆ క్షణంలో నేను నీకు పెట్టిన ముద్దు నీ ఆపేక్షకు పెట్టిన ప్రతిఫలం మాత్రమే..నీకు నేనొక గిఫ్ట్ మాత్రమే ఇస్తున్నాననుకున్నాను అంటుంది…
చివరికి ఈ కథ చదివిన మిత్రుడు వీళ్ళిద్దరూ శారీరకంగా కలుసుకోరంటావా? అనడిగితే, రచయిత శారీరక సంబంధం తప్ప కథలో ఏదీ లేదంటావా? అని ప్రస్నిస్తాడు. అంతేకాదు…అదేదో అక్రమమన్నట్టు శారీరక స్పృహతోనే మాట్లాడతావెందుకు? ప్రేమ పూర్వకమైన సంగమాన్ని గుర్తించవేమి అంటాడు.. దాన్ని ఇంకా పొదిగిస్తూ…కొన్ని సంగమాలు కంటి చూపుతో ముగుస్తాయి. ఇంకొన్న్ని కరచాలనంతోనో, కౌగ్లింతతోనో ముగియవచ్చు..మరికొన్ని శరీరంలోని అణువణువు ఈస్థెటిక్ స్పేస్ లోపల ఐక్యం కావడంతో ముగుస్తాయి అంటాడు.
ఇదంతా చదివిన తరువాత చివరికి రచయిత వివరణ చదివిన తరువాత…రచయితకే తానేమి రాశాడో…ఏమి రాయాలనుకున్నాడో అర్ధం కాలేదనిపిస్తుంది. ఒక పక్క ఆమె అతడు శారీరక సంబంధం గురించే సంఘర్షణ పడతారు. ఆమె అతని ఆపేక్షకు కరిగి గిఫ్ట్ ఇచ్చానంతుంది. మరోవైపు శారీరక స్ప్ర్హతో మాట్లాడతారెందుకు? ప్రేమ పూర్వకమైన సంగమాన్ని గుర్తించవెందుకు? అంటాడు రచయిత. ఆపేక్షకు ప్రతిఫలం శారీరక సౌఖ్యం గిఫ్టుగా లభించటం అని కథలో చూపుతూ ప్రేమ పూర్వకమైన సంగమం అనటం……ఏమితో మేధావుల ఆలోచనలు సామాన్యులకు అందవు…..పిచ్చిగా మూర్ఖత్వంలా అర్ధం పర్ధం లేనివిగా కనిపించవచ్చు అనిపిస్తుంది. ఇంతకీ ఈ కథలో ఏస్థెటిక్ స్పేస్ అంటే ఏమితో ఎక్కడా రచయిత వివరించలేదు.
కథలో ఈస్థెటిక్ స్పేస్ ప్రసక్తి మూడు సందర్భాల్లో వస్తుంది. మొదతి సారి, ఎయిడ్స్ కండోంల గురించి ఆమె లెక్చరిచ్చేప్పుడు…మనుషులు స్పేస్లో స్టేషన్లు నిర్మించి నివాసం ఉంటున్నారుగానీ, తమలో దాగివున్న ఈస్థెటిక్ స్పేస్ విలువను గుర్తించటంలేదు అంటుంది. స్రంగార అనుభవాలను నెమరువేసుకోవటం నేర్చుకోవటంలేదు అంటుంది. అంటే రచయిత ద్ర్ష్టిలో ఈస్థెటిక్ స్పేస్ సృంగారానికి దాన్ని నెమరువేసుకోవటానికి సంబంధించిందేమో అనిపిస్తుంది.
రెండవ సందర్భంలో అతడి పాత్ర, పూల మొక్కని పెంచే అలవాటు తనకు ప్రాణం విలువని నేర్పిందని, పాకెట్ మనీ దాచుకుని పండగలకు కొనుక్కునే అలవాటు పరాయి స్త్రీలమీద ఇష్టాలు కోరికలు ఈస్థెటిక్ స్పేస్లో స్టోరయి భార్యతో జరిగే సంగమంలో లీనమయ్యేవంటాడు. మరోమారు కొన్ని సంగమాల సంభాషణలో ఆమె శరీరంలోని అణువణువు ఈస్థెటిక్ స్పేస్లోపల ఐక్యం కావటంతో ముగుస్తాయని అంటుంది. ఈ మూదు సందర్భాలలోనూ శారీరక సంబంధానికి సమబంధించే ఈస్థెటిక్ స్పేస్ ని వాడతాడు రచయిత. అంతేతప్ప దాన్ని నిర్వచించి వివరించడు… ఏస్తేటిక్ అన్నది సౌందర్యానికి సంబంధించింది. రచయిత ఉద్దేశ్యం వ్యక్తి మనస్సులో సౌందర్యానుభూతికి సంబంధించిన అనుభూతుల స్థలం ఈస్థెటిక్ స్పేస్ అయివుండవచ్చేమో కానీ…….ఆ వివరణ ఈ కథ సందర్భంలో వొదగదు……
ఈ కథకూడా వ్యాసంలాంటి సంభాషణలతో వుంటుంది. ఒక ముగింపులేదు. ఆపేక్షకు ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన ఆమీ, అతనింకా తీవ్రమైన ఆపేక్ష చూపిస్తే ఇంకా తీవ్రమయిన గిఫ్ట్ ఇవ్వదని గ్యారంటీ లేదు. తెలివయినవాదయితే తీవ్రమయిన ఆపేక్షను ప్రదర్సిస్తూ గిఫ్టులు కొట్టేస్తూంటాడు……అర్ధం పర్ధంలేని వాదనలతో వున్న అర్ధంపర్ధంలేని ఉత్తమ కథ ఇది. కథలో పాత్రలకు వ్యక్తిత్వంలేదు. లాజిక్ లేదు. ఇంతకన్నా ఈ కథగురించి లోతుగా చర్చించటం అనవసరం. ‘ఈ మూడు కథలు చదివిన తరువాత, రచయితకున్న అయోమయాలు సందిగ్ధాలు కథలోని పాత్రలు, వాటి ఆలోచనలు కథా సంవిధానము ప్రదర్శిస్తాయనిపిస్తుంది. నిజానికి ఈ మూడు కథలనూ రచయిత కథలుగా కాక, సిద్ధాంత వ్యాసాల్లా రాస్తే మరింత ఉపయోగకరంగా వుండేదనిపిస్తుంది. అయినా ఈ మూడు కథలూ ఉత్తమ కథలుగా ఎంపికవటం సంపాదకుల్కు కథ అంటే వున్న ఉత్త– మోత్తమ అవగాహనే కారణమేమో!!!!
అయితే రచయితకు శుభ్రమయిన వచనం రాయటం తెలుసు . కథ చక్కగా చెప్పటం తెలుసు. కాబట్టి ఆలోచనలను ప్రకటించటం ప్రాధాన్యంగా కాక, జీవితంలోని వైరుధ్యాలను పాత్రల ద్వారా ప్రదర్శిస్తూ ఆ పాత్రల జీవితాల ద్వారా ఆలోచనలు పాథకులు గ్రహించేలా రాసే ప్రయత్నాలు చేస్తే చక్కని గుర్తిండిపోయే కథలు రూపొందుతాయనిపిస్తుంది. బహుషా రచయిత తనలోని ఈస్థెటిక్ స్పేస్ ని గుర్తించాల్సిన ఆవశ్యకత వుందేమో అనిపిస్తుంది.
వచ్చే వ్యాసంలో బెజ్జారపు రవీందర్ కథల విశ్లేషణ వుంతుంది.

September 11, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగుకథ విశ్లేషణ-22(3)

2005లో ఉత్తమ కథలలో ఒకటిగా నిర్ణయమైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథ వీరనారి. వీరనారి ఒక విచిత్రమయిన కథ. ఇదికూడా ఫాక్షన్ హత్యలకు సంబంధించిన కథ. అయితే ఈ కథ ఫాక్షన్ హత్యలు చేసేవారి భార్యల వైపునుంచి చెప్పిన కథ. మొగుడు బయటకువెళ్తే తిరిగి వచ్చేవరకూ వారు ప్రాణాలతో వస్తారో లేదొద అని భయపడుతూంటారు. ఎక్కడ ఎవరు హత్యకు గురయినా అది తమవారేనని బెదురుతూంటారు. ఈశ్వరమ్మ మొగుడు ఫాక్షన్ హత్యలు చేసేవాడు. అవన్నీ వద్దని మొగుడిని పిల్లాడినీ తీసుకుని వేరే చోటికి వస్తుంది ఈశ్వరమ్మ. కానీ వాళ్ళకు అనుక్షణం భయమే! ఎవరో హత్యకు గురయ్యారని తెలియగానే శోకాలు పెడుతూ బయలుదేరుతుంది ఈశ్వరమ్మ. అది తనవాడుకాదని తెలుసుకుంటుంది. ఇంతలో పక్కింట్లో ఆమె శోకాలు పెడుతుంది. పరుగెత్తుకువచ్చి కొడుకుని తీసుకుని ఆటోలో ఎతో వెళ్ళిపోతుంది. కాస్సేపటికి ఆమె తండ్రి వస్తాడు. విషయం ఏమిటంటే భర్తను చంపిన వాదిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకుని సిద్ధంగా పెంచకుండా ఆమె కొడుకు ప్రాణాలు కాపాడాలని అపకీర్తిని మూటకట్తుకోటానికి సిద్ధమయిందన్నమాట. మొగుడు ఖూనీ చేయబడితే పూర్వంలా వీరపత్నిగానో, వీరమాతగానో మారేందుకు ఇప్పటి పెళ్ళాలు ఇష్టపడరనీ, చచ్చిన మొగుడి శవాన్ని సైతం కళ్ళజూడరనీ, వీలైతే ఇప్పుడుండే తాళిని తెంచి మరో తాళికోసం ప్రయత్నిస్తారనీ దుర్గ పారిపోవటం వెనుక అర్ధంగా మొగుడికి చెప్పాలనిపించింది ఈశ్వరమ్మకు….అని రచయిత వ్యాఖ్యానిస్తాడు ఈశ్వరమ్మ ద్వారా. ఇదీ వీరనారి కథ. కథ ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. కానీ, సగం అయ్యేసరికి విసుగు వస్తుంది. కథ అర్ధమయిపోతుంది. చివరలో వీలైతే ఇప్పుదుండే తాళిని తెంచి మరో తాళికోసం ప్రయత్నిస్తారని అనటంతో కథ సంపాదకుల మెప్పుకోసం రాసిందేమో అనిపిస్తుంది. అంతేకాదు రచయిత exception ను norm గా చూపించే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. అందుకే, కథ బాగున్నట్టే అనిపించినా ఉత్తమ కథగా భావించటానికి మనసొప్పదు.
అత్యద్భుతమయిన కథతో ఆరంభించిన రచయిత సంపాదకుల మెప్పు పొందే మామూలు కథలను అతి మామూలుగా రాసే స్థాయికి దిగజారటం సెగ లోగిలి కథలో చూడవచ్చు. ఈ కథ 2008 ఉత్తమ కథల సంకలనంలో వుంది. ఇదె సంపాదకులకు అత్యంత ఆనందాన్ని సంతృప్తినీ ఇచ్చే వివాహవ్యవస్థను విమర్సించి లోపాలను మాత్రమే చూపే కథ. కనీసం ఆ చూపే లోపాలుకూడా తీవ్రమయినవి, భరించలేనివి, కొత్తవి కావు. ఈ కథ ఉత్తరం రూపంలో సాగుతుంది. రాణి అనే ఆమె శాంతి అనే ఆమెకు ఉత్తరం రాస్తుంది. కథ ఆరంభమే….ఐనా తిట్టేంత ధైర్యం నీకెక్కడ వుందిలే! అదుంటే నీ మొగుడు అంతగా కొత్త కొత్త తెలుగు పదాలను కనిపెట్టి నీ మీద ప్రయోగించడుకదా…అంటూ శాంతికి ఉత్తరం ఆరంభిస్తుంది రాణి. ఆ ఉత్తరంలో రాణి తమ దాంపత్యం గురించి చెప్తుంది. తిట్లు కొట్టుకోవడాలు అనే దృష్టికోణం నుంచి లోకాన్ని చూస్తూ మేమేదో సమస్యల్లేని జీవితాల్ని గడుపుతున్నామని ఊహించుకోవద్దు. మా బాధలు మాకుంటాయి. బాధల్లేని ఇల్లాలు ఈ భూప్రపంచంలో ఇంకా పుట్టలేదే పిచ్చిమొద్దూ!! అంటూ తన బాధలు చెప్పటం ఆరంభిస్తుంది. ఆమె అసలు బాధ ఏమిటంటే ఆమె మాటల్లోనే…..నా ఫిజిక్ కొంత ఎక్స్పోసింగ్ గా వుంతుందేమో! నువ్వు కూడా అప్పుడప్పుడూ కామెంట్ చేసేదానివి. నన్నేం చేయమంటావు చెప్పు? నా బాడీ నిర్మాణమే అంత. నాకు తెలుసు. పలుచని చీర కట్టుకుంటే నా శరీరంలోని ఎత్తుపల్లాలు స్పష్టంగా బయటకు కంపిస్తాయి. అందుకే వీలయినంతవరకు నా శరీరాన్ని దాచుకునే శైలిలోనే డ్రెస్ చేసుకుంటాను…..అని వీలయినంత పీపాలా కనిపించే చీరలేవేసుకుంటానని ఒకటో రెండో పల్చటి చీరలున్నాయని అవి నెలకో నెలన్నరకో ఒకసారి వేసుకుంటానని….అవి వేసుకున్నప్పుడు …నాకు నేను అందంగా కూడా కనిపిస్తాను. ప్యూపాను చీల్చుకొచ్చిన సీతాకోకచిలుకలా గాలిలో తేలిపోతున్నట్టుంటుంది. కానీ ఆరోజు లంచో డిన్నరో మానేస్తాడు మా ఆయన అంటుంది. అందుకని ఆయన క్యాంపుకు వెళ్ళినప్పుడు ఆ చీరలు కట్తుకుంటానని చెప్తుంది. అంతే కాదు…ఆయన బాధంతా- నలభై ఏళ్ళ వయసులో కూడా బింకం సడలని నా బాడీ స్ట్రక్చర్ కు సంబంధించిన ఇమేజ్ వాళ్ళ కళ్ళల్లో ఫిక్సయిపోయివుంతుందిట. మైండ్ లో సేవ్ అయి వుంటుందిట. కనీసం ట్వెంటీ ఫోర్ అవర్స్ అయినా మెమోరీలో ఉండి డిలీట్ కాదుట….ఇదీ ఆ పరమ సాధ్వీమణి రాణి సంసారంలో భరించలేని బాధ. కాబట్టి మా సంసారం ఓవెన్ లో మంట.కళ్ళకు కనిపించదు. అంటుంది. చివర్లో ఆయన చిన్న విషయాలకు కూడా కుళ్ళిపోయే దురదృష్టవంతుడని, ఒక హృదయ పూర్వకమయిన మాటతో, స్పర్శతో, చిరునవ్వుతో, నవ మన్మధుడిలా నా ప్రపంచంలోకి రారాజుగా రావచ్చు. స్వర్గం చూపించేదాన్ని…అని కథ ముగుస్తుంది.
ఇలాంటి కథలు చదివి దీర్ఘ నిట్టూర్పు విదవటం తప్ప ఏమీ చేయలేము. మానవ మనస్తత్వం తెలియకుండా, స్త్రీ పురుష మనస్తత్వాలు, సామాజిక మనస్తత్వాలతో పరిచయం లేకుండా. మానవ సంబంధాలలోని మాధుర్యపు చిరితరగ స్పర్శకూడా తెలియని వాళ్ళు ఇలాంటి కథలు రాసి అభ్యుదయవాదులుగానో, ఫెమినిస్టులు గానో చలామణీ అయిపోవాలని ప్రయత్నిస్తే అర్ధం చేసుకోవచ్చు. కానీ, చనుబాలు లాంటి పరమాద్భుతమయిన కథను సృజించిన రచయితకు సామాజిక మనస్తత్వం, మానవ మనస్తత్వం, స్త్రీపురుష సంబంధంలోని మాధుర్యం, ఇరువురు మనస్తత్వాలలోని తేడాలు, చిన్న చిన్న దోషాలను సర్దుకుని ఒకరి సాంగత్యంలోని మాధుర్యాన్ని మరొకరు జుర్రుకోవటం లాంటి విషయాలు తెలియవని అనేందుకు మనసొప్పదు. మరి అవి తెలిసినవాడు ఇలాంటి విచ్చిన్నకరమూ, అనౌచిత్యమయిన కథలు స్ర్జించి ఎందుకని దాంపత్యధర్మంలోని ఒక పార్శ్వాన్ని మాత్రమే చూపించాలని తపనపడుతూ దాన్నే చూపిస్తున్నారో అన్న విషయం ఆలోచించాల్సివుంటుంది. ఇంతవరకూ వీరు రాసిన ( అంటే ఈ ఉత్తమకథల సంకలనాల్లోని రచయితలు) కథల్లో ఒక్క కథలోనన్నా దాంపత్య జీవితంలోని మాధుర్యం కనిపించిందా? లేదు. అంటే ఆయా రచయితల జీవితాల్లో దాంపత్యంలో మధురానుభూతులేలేవా? అంతా అణచివేతలు, అన్యాయాలేనా? లేక కొందరు ఫెమినిస్టు రచయితల్లా, నా మొగుడొక్కడే మంచి మగాడు మిగతా అంతా నీచ నిక్ర్ష్టులంటారా? నా దాంపత్యంలో ప్రేమ మాధుర్యాలున్నాయి కానీ, మిగతావారి జీవితాల్లో లేవు అదే రాస్తున్నామని సమర్ధించుకుంటారా? కొందరు మహిళా రచయిత్రులు తాము హాయిగా కాపురాలు చేసుకుంటూ అక్రమ సంబంధాల సమర్ధన కథలు రాస్తూ ఆ బురద మా మనస్సుల్లోది కాదు, మేమంతా పతివ్రతలం అంటున్నట్టు ఈ రచయితకూడా తన కథను సమర్ధించుకుంటాడా? ఫలాన డ్రెస్ వేసుకుంటే నేను సెక్సీగా కనిపిస్తానని తెలిసి అలాంటి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చే మహిళలు అరుదు. చివరకు క్లబ్బుల్లో స్ట్రిప్ టీస్ నృత్యం చేసేవారుకూడా నిత్య జీవితంలో శుభ్రంగా దుస్తులు వేసుకుంటారు. వెకిలితనానికి వెకిలి ఆలోచనలకు తావివ్వరు. అలాంటిది నలభై వచ్చినా బింకం సడలని బాడీ స్ట్రక్చరంటూ దాన్ని చూపించే దుస్తులు వేసుకుంటే ఆ దుష్టుడు, అదే భర్తాధముడికి కోపం వస్తుందని చెప్పి సమర్ధించటం స్త్రీ మనస్సు తెలియని పురుష రచయితే రాయగలడు అనిపిస్తుంది. తన శరీరంలో ఏ భాగం కనిపిస్తుందోనని వొళ్ళంతా కప్పుకున్నా ఇంకా సరిచూసుకునే మహిళలు కోకొల్లలు. కానీ, నా శరీరం కనిపిస్తే మా ఆయన భరించలేడని కంప్లయింటు చేసి అదేదో క్షమించరాని నేరమయినట్టు చెప్పేవాళ్ళు మన కథల్లోనే కనిపిస్తారు. ఒక పురుషుడు తనవైపు చూస్తేనే చిరాకుపడతారు మహిళలు. అలాంటిది రచయిత ఇలా రాయటం, దాన్ని ఉత్తమ కథగా నిర్ణయించటం….అంతా మతితప్పిన వికృతవ్యవహారం అనిపిస్తుంది. అంతెందుకు ఈ కథ రాసిన రచయిత,విశ్లేషితున్న నేను, ఆ మాటకోస్తే ఏ స్త్రీ అయినా సంపాదకులతో సహా, ఏ పురుషుడయినా తన భార్య కానీ, చెల్లి కానీ, కూతురుకానీ వొళ్ళుకనిపించే దుస్తులు వేసుకుంటే నెలకొకసారేఅయినా ఎంత అభివృద్ధిచెందుతోంది దేశం అని ఆనందబాశ్పాలు రాలుస్తాడా? దాన్ని అభ్యుదయం అనుకుంటాడా? చనుబాలు కథ రాసిన రచయితనే ఈ కథ రాశాడన్న నిజం గుర్తుకొస్తే నిరాశా కలుగుతుంది. విరక్తిగా అనిపిస్తుంది.
మిగతా కథల విశ్లేషణ మరో వ్యాసంలో.

August 6, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-22(2)

సూర్యుడిని చూసిన కళ్ళు కాస్సేపు ఇంకా దేన్నీ చూడాలేవు. సన్నపురెడ్డి వేంకటరామిరెడ్డి కథ చనుబాలు చదివిన తరువాత కన్నీటి కథ చదివిన తరువాత కన్నీటి కథ నిరాశ కలిగించటంలో ఆశ్చర్యం లేదు. అదీగాక, ఏ రచయితయినా అన్నె రచనలూ, ఒకే స్థాయిలో రాయగలగటం కష్టమే. కథగా కన్నీటి కథలో లోపమేమీ లేదు. ఒక హంతకుడు, అంటే ఫాక్షన్ హత్యలు చేసేవాడు. బస్సెక్కుతాడు. బస్సులో ఓ పాప పక్కనకూచుంటాడు. ఆ పాప ఫాక్షన్ హత్యల్లో తండ్రిని కోల్పోతుంది. అది చూసి అతని మనసు మారిపోతుంది. కథ కాస్తవరకూ ఆసక్తి కరంగా సాగుతుంది. తరువాత కథ పూర్తికాకముందే కథ ముగింపు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలాంటి కథలు ఇంతకుముందు చాలా చదివి వుండటంవల్ల కథ కొత్తగా అనిపించదు. గొప్పగా అనిపించదు.
పాటలబండి చక్కని కథ. కథ ముగింపు ఊహకు అందేదే అయినా, కథలో కొత్త దనం లేకపోయినా కథ హాయిగా చదివిస్తుంది. పొలాల్లో నారుమళ్ళు వేస్తూ పాటలు పాడే పనివారిని చూస్తూంటే ఆ పొలం యజమానికి గిట్టదు. ఎందుకంటే కరెంటు వస్తూ పోతూ వుంటుంది. ఫ్యూజులు పోతూంటాయి. దాంతో నీరు పారినంతలో వేయాల్సివుంటుంది. పాటలలో వాళ్ళు సమయం వ్యర్ధం చేస్తున్నారనుకుంటుంది. కానీ, పాటే వారి శక్తి, వారి వేగం అని అర్ధం చేసుకుంటుంది చివరలో. కథలో రాయలసీమ రైతుల కరెంటు ఇక్కట్లను రచయిత చూపించారు. ఎక్కడ నేర్చుకున్నారీ పాటలను అని అడిగితే…..పాటలన్నీ బండినిండా పోసుకొని మీరు తోలకపోతావుంటే బండి మా ఇండ్లముందు వాటుబడింది. మేం పరుగెత్తుకుంటా వచ్చి అందినకాడికి పాటలేరుకొని కొంగులో పోసకపొయ్యినం…అంటారు. ఆ పొడుపు కథ అర్ధం వ్యవసాయిక జీవితపు మూలాల్లోకి వెళ్తేకానీ అర్ధం కాదు. దానికి రచయిత వ్యాఖ్యానం ఏమిటంటే…..మట్టిలో పొర్లాడే రైతుదనం నుంచి గట్తుమీద కూచుని అజమాయిషీచేసే రెడ్డిరికపు దశకేసి పయనించే తాము- తమకక్కరలేని శ్రమ సౌందర్యపు పాటల్ని బండికెత్తి దూరంగా తోలతావుంటే వాళ్ళు కాజేశారు. పనీ పాటా ఒకే ఆత్మ స్వరూపంగా భావించే అద్వైతానంద స్థితికి వాళ్ళు చేరుకుంటూవుంటే-పాటను వేరుచేసినపుడే స్వచ్చమైన పని అవతరిస్తుందన్న మేధావితనానికి తామిప్పుడు దగ్గరవుతున్నారు…వాళ్ళొచ్చి పాటల్ని కొంగులో పోసుకునిపోతూవుంటే వాళ్ళని అమాయకులుగా చూశారు. ఇప్పుడర్ధమవుతోంది ఎవరమాయకులో….అంటూ కథను ముగిస్తాడు రచయిత. కథ బాగానే అనిపిస్తుంది. కానీ, పనీపాటా ఒకే ఆత్మస్వరూపంగా భావించే అద్వైత సౌందర్యం అని వివరించటం బాగానే వున్నా…ఎందుకో కథ అసంతృప్తిగా అనిపిస్తుంది. కథకుడి ఉద్దేశ్యం సందిగ్ధంగా అనిపిస్తుంది. వాళ్ళని పనిచేస్తూ పాదుకోనిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా? లేక అజమాయిషీ చేసే రైతుకూడా పాడుతూ పనిచేయాలా? లేక రైతు కూలీల శ్రమ సౌందర్యాన్ని గుర్తించాలా? పాటలబండి అన్వయం బాగానేవున్నా..అర్ధం…లక్ష్యం సందిగ్ధమే!!!
మిగతా కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో…

August 5, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-22(1)

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఏడు కథలు, 1996లో చనుబాలు, 2000లో కన్నీటి కత్తి, 2001లో పాటలబండి, 2005లో వీరనారి, 2008లో సెగలోగిలి, 2009లో సుడిగాలి, 2012లో బిలం కథలను ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు.
చనుబాలు కథ చదివిన తరువాత మామూలు స్థితికి రావటానికి కొంత సమయం పడుతుంది. సామాన్య పాఠకుదిగా చదివితే అతి గొప్ప కథ ఇది అనిపిస్తుంది. రచయితగా చదివితే, ఇలాంటి కథ రాసిన రచయిత ప్రతిభ పట్ల అసూయ కలుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకొన్నందుకు, ఈ ఉత్తమ కథల సంపాదకులు చేసిన పొరపాట్లు, చూపిన పక్షపాతం వంటి దోషాలన్నిటినీ మాఫ్ చేసేయాలనిపిస్తుంది. నిజం…..ఈ కథ చదివిన తరువాత సంపాదకుల దోషాలను, పొరపాట్లనూ వదిలేసి ఈ కథను వదలకుండా ఉత్తమ కథగా నిలిపి అందరికీ అందించినందుకు అభినందించాలనిపిస్తుంది. చాలా గొప్ప కథ ఇది.
ఒక కథలో రచయిత ఎన్నెన్ని పొరలను ఇమిద్చాడో, ఎన్నెన్ని ఆలోచనలను రేకెత్తించాడో చెప్పటం సాధ్యం కాదు. నిజానికి ఈ కథా పఠనం వల్ల చెలరేగిన భావాల స్వరూపాన్ని అర్ధం చేసుకోవటానికి సమయం పదుతుంది.
ఒక ఊరి ప్రెసిడెంట్, అంటే , మనకీ కథ చెప్పేవ్యక్తి అన్నమాట ఆయనను అందరూ ఒక మాల అమ్మాయి పొట్టక్క పాలుతాగి పెరిగేడని ఏడిపిస్తూంటారు.అది ప్రెసిడెంట్ లో పొట్టక్క అంటే ద్వేషాన్ని కలిగిస్తుంది. కానీ, వాళ్ళమ్మ, పొట్టక్కపై ఈగ వాలనివ్వదు. దాంతో, పళ్ళు నూరటం తప్ప ఏమీ చేయలేకపోతూంటాడు. చివరికి ఒకరోజు పొట్టక్కను రానివ్వద్దని గట్టిగా అమ్మతో అంటే వాళ్ళమ్మ ఆవేశానికి వస్తుంది. అది నా పాలి దేవత…అని అరుస్తుంది. దాంతో తానే ఆమె పీడ వదిలించుకోవాలని నిస్చయించుకుంటాడు ప్రెసిడెంట్. అప్పుడు అక్కడ పొట్టక్క వేరేవారితో మాట్లాడే మాటలను బట్టి ఆమె అంటే తమ ఇంట్లో ఎందుకంత గౌరవమో తెలుస్తుంది అతడికి. అతను పుట్టినప్పుడు, వళ్లమ్మకు పాలు రాకపోతే, అదే సమయానికి ప్రసవించిన పొట్టక్క, తన పిల్లవాడిని నిర్లక్ష్యం చేసి మరీ ఇతడికి పాలిస్తుంది. అప్పుడతని మరో విషయం కూడా అర్ధమవుతుంది. ఇది అర్ధమవటానికి వీలుగా పొట్టక్క కథతో పాటూ సమాంతరంగా మరో కథ నడుస్తూంటుంది. ప్రెసిడెంటుగా వూళ్ళోని మాలవాళ్ళకు పక్కా బిల్డింగులు కట్టించాలని అతనికి వుంతుంది. కానీ వూళ్ళో వళ్ళకి స్థలం సరిపోదు. వారు వూళ్లో వుండటానికి పెద్దలు ఒప్పుకోరు. ఊరు విడిచి దూరంగా స్థలం తీసుకునేందుకు మాలలు ఒప్పుకోరు. వాళ్లలోనూ, ఆ వూళ్ళోనే వుండేవారు వూరు వదలమంటారు. వలస వచ్చినవారు స్థలం దొరికితే చాలన్నట్టుంటారు. ఆ సమయంలో ప్రెసిడెంతుకో విషయం తెలుస్తుంది. ఒకప్పుడు వూళ్లో అధిక స్థలం మాల వాళ్లదే. కానీ, కరువు వల్ల మాలలు పొట్ట చేతపట్తుకుని వలసపోతే, కాపులు గొల్లలు ఆ స్థలాలను ఆక్రమించుకుంటారు. ఈ నేపథ్యంలో, తన పిల్లవాడిని నిర్లక్ష్యం చేసి, తనకు పొట్టమ్మ పాలివ్వటం ప్రెసిదెంటుకు అర్ధం చెసిన విషయం ఏమిటంటే, వాళ్ళ జీవన మూలాల్లోంచి అస్తిత్వం పొందిన తాము ఎంతో సిగ్గుపడాలని బోధపడుతుంది. చనుబాలకు ప్రతిఫలంగా డబ్బులివ్వవచ్చు. కానీ, వాళ్ళ శ్రమను చనుబాలుగా తాగి పెంచుకున్న చదువు, విజ్ఞానం, రాజకీయ హోదా, ఆస్తులకు ప్రతిఫలం ఏమిస్తాడు….చివరి వాక్యం…….ఏ అగ్రకులస్థుడు మాత్రం వాళ్ళ చనుబాలు తాగకుండా ఇప్పుదుండే స్థాయికి ఎదిగేడని!!!
కథ చదువుతూంటే..ఒక వైపు పొట్టక్కకూ, ప్రెసిడెంటుకూ వున్న అనుబంధం ఆసక్తి కరం అనిపిస్తుంది. మరోవైపు మాలలు వూళ్లో ఇళ్ళు కట్టివ్వటం, వారి ఇళ్ళు ఊరికి దూరంగా కట్టాలన్న వూళ్ళోవాళ్ళ ఆలోచన వెనుక వున్న కారణాలు అనేక చేదు నిజాలను అతి సున్నితంగా ప్రదర్సిస్తాయి. మరో వైపు, చనుబాలు తాగి పెరగటాన్ని, వాళ్ళ శ్రమ, భూముల ఆధారంగా అస్తిత్వం పొండటం అన్న భావన్ అనేకానేక ఆలోచనలపై తెర తీస్తుంది. పల్లెల్లోని మనుషుల మనసుల్లోని వైరుధ్యాలు, బంధాలను నూతన కోణంలో చూపిస్తుంది.
కథలో రచయిత ప్రదర్సించిన పరిస్థితులు సార్వజనీనం కాకపోవచ్చు. కానీ, ఒక ప్రాంతపు జీవితాన్ని మూలాల్లోంచి చూపి బోధించిన కథగా ఈ కథ నిలుస్తుంది. రచయిత కథ చెప్పిన విధానం, పాత్రల వ్యక్తిత్వాలు, మనస్తత్వాలను తీర్చి దిద్దిన విధానం, జీవితాన్ని సజీవ చిత్రంలా కళ్ళముందు నిలుపుతుంది. ప్రతిభావంతుడయిన రచయిత, అక్షరాలతో దృశ్యాలను సజీవంగా పాఠకుడి మనోఫలకంపై నిలపటమన్న అత్యద్భుతమయిన రచనా సంవిధానానికి ఈ కథ చక్కని ఉదాహరణ.
వచ్చే వ్యాసంలో రచయిత ఇతర కథల విశ్లేషణ వుంటుంది.

July 28, 2017 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగుకథ విశ్లేషణ-21(2)

2007 సంవత్సరంలో కే ఎన్ మల్లీశ్వరి రచించిన కథ ఖాళీని ఉత్తమకథల్లో ఒకటిగా ఎంపిక చేశారు. నిజానికి ఈ కథను కథగా ఒప్పుకోవటం కష్టం. ఉత్తమ కథగా ఒప్పుకోవటం మరీ కష్టం. నిజానికీ కథలో కథ లేదు. కతనంలేదు. ఉన్నదంతా ఉత్తమ కథ సంపాదకులకే రోదనం వుంటే నచ్చుతుందో అదే. ఇది రాధ అనే అమ్మాయి మోనోలాగ్ లాంటిది. ఆమె ఏవేవో ఆశలతో సినిమా ప్రపంచంలోకి అడుగిడుతుంది. ఆంకర్ అవుతుంది. నలుగురు బాయ్ ఫ్రెండ్స్ వుంటే అందరూ దుహ్ఖ పడతారు. మన సంస్కృతి ఏమిటి? ప్రపంచంలో భారత స్త్రీకి వున్న విలువ ఏమిటి? లాంటి మాటలతో ఆమెని అంచనా కడతారు. ఆమెనిపెళ్లిచేసుకున్నవాడు డబ్బు కోరతాడు. సహజీవనం చేస్తున్నవాడు మోజు తీరగానే వెళ్ళిపోతాడు. అప్పుడామె డాక్టర్ దగ్గరకు వెళ్తే ఎంప్టీ సిండ్రోం అంటాడు.( నిజానికి ఇలాంటి సిండ్రోం లేదు. పిల్లలు వెళ్ళిపోతే తల్లితండ్రుల భావనను ఎంప్టీ నెస్ట్ సిండ్రోం అంటారు). డాక్టర్ ఆమెకేదో ఉద్భోధిస్తాడు. ఆమె స్నేహితురాలు దీప మనుషుల కన్నా వస్తువులు ముఖ్యమా? అనిపక్కనున్నవారి చేయి చేతిలోకి తీసుకుంటుంది. ఇది రాధికకు ధైర్యాన్నిస్తుంది. ఓ రాధికా భయపడకు.డాక్టర్ చెప్పిన నీ మేధస్సును తలచుకో….సక్రమంగా వున్న నీ శరీరాన్ని చూసుకో అనుకుంటుంది. హృదయమంతా ఏవోమొలకలు వస్తాయి. దీపపట్టుకున్న అతని మొహంలో విద్యుల్లతల్లా? అనుకుంటూంటే కథ పూర్తవుతుంది.
ఈ కథ రాధిక స్వగతం. ఆరంభంలో సంపాదకులు మెచ్చే కొన్ని పురుష దూషణ భావాలుంటాయి. రేయ్ పురుగా..ముఫైయారు, ఇరవై నాలుగు, ముఫైయారు కొలతల్ని తప్ప ఏనాడైనా హృదయాన్ని కావలించుకొన్నావా? …..పబ్లిక్ ప్రాపర్టీ….వెనుకనుంచెవరో తరుముకోస్తున్నారుముందునుంచెవరో మీదిమీదికొస్తున్నారు…పక్కలనుంచెవరో నొక్కేస్తున్నారు. నలిపేస్తున్నారు…
ఇంకేం…..కథ సూపరు….ఆడవాళ్ళని సెక్స్ ఆబ్జెక్టులుగా చూసేవారు, వారిని వాడుకునేవారు..సహజీవనం చేసి వదిలేసేవారు…అబ్బబ్బబ్బబ్బో..ఎంతెంత అభ్యుదయం? ఎంతెంత ఫెమినిజం? ఎంతెంత స్త్రీ స్వేచ్చ????? ఉత్తమ కథ అయిపోయింది.ఇదే కథ మామూలుగా ఇంకెవరో రాస్తే ప్రచురణకు స్వీకరించటం కూడా సందేహాస్పదమే. ఏమీ లేదీ కథలో….కథ ఉంటే కదా, కథనం ప్రసక్తి వస్తుంది. ఇక దీప ఎవరి చెయ్యి పట్టుకుందో తెలియదు . ఎందుకంటే స్టూడియో అంతా హడావుడి.దీప దూసుకువస్తోంది…. అని వుంటుంది…. ఆతరువాత అర్దం పర్ధంలేని ఆర్భాటపు సంభాషణలుంటాయి.. హఠాత్తుగా…దీప పక్కనున్న అతని చేతి పట్తుకుంటుంది. అతని మొహంలో విద్యుల్లతలుకనిపిస్తాయి రాధికకు….ఏమిటో….అవార్డు సినిమాల్లాగే, ఉత్తమ కథలూ ఏమి రాసినా మెచ్చి లేని అర్ధాలు చూసే వారికే అర్ధమవుతాయేమో!!!!!
2011లో ఉత్తమ కథగా ఎంపికయిన టెంకిజెల్ల కాస్త కథగా అనిపిస్తుంది. అయితే ఈ కథకూడా కాస్త అర్ధమవనట్టూ..కాస్త సంపాదకుల ఉత్తమ కథ ప్రామాణికాల సైధాంతిక సంత్ర్ప్తి కలిగించేట్టు వుంటుంది. పైగా, కథ మాండలీకంలో వుడటం ఆడెడ్ అట్రాక్షన్! ఒక భార్య భర్తతో కలసి వుండనంటుంది. ఆమెను వదలనంటాడు భర్త. ఇద్దరి మద్య గొడవ. వూర్లో పెద్దలు తీర్పు చెప్పాలి. వాళ్ళలోఒక పెద్ద మొగుడివైపు తీర్పు చెప్తాడు. మొగుడు ఆమెని ఎందుకు వదలనంటాడంటే, ఆమెదగ్గర ఉన్న సొరకాయబుర్రలో డబ్బులుంటాయి. వాటికోసం. వీళ్ళ గొడవ టీవీలకెక్కుతుంది. మొగుడి పక్సం తీర్పు చెప్పిన ప్రకాశాన్ని ఎవరో టెంకిజెల్ల కొడతారు. దాంతో మళ్ళీ ఈమె కలవగానే అతడు వీళ్ళ వైపు సానుభూతిగా మాట్లాడతాడు. ఇకపై టెంకిజెల్ల ఒక పోరాటరూపమని అందరూ అనుకుంటారు. అదీ కథ. అంతా అయిన తరువాత ఇదా కథ? అనిపిస్తుంది. అసంబద్ధము, అనౌచిత్యము అయిన కథ ఇది. ఒక్క వాదనకానీ, సన్నివేశము కానీ, బాగుందనిపించదు. పాత్రలవ్యకిత్వాల చిత్రణ అసలేలేదు. ఏదో ఫెమినిస్ట్ కథ రాసి మెప్పు పొందాలంటే ఇలాంటి కథ రాయకతప్పదు. చివరలో పోరాటమే మార్గమనటంతో విప్లవవీరులయిన సంపాదకవర్గమూ సంతృప్తి చెందుతుంది. ఇప్పటికే రెండు కథలు ఉత్తమ కథలయ్యాయి కాబట్టి వారి దృష్టిలో ఈ అభ్యుదయ విప్లవాత్మక అత్యుత్తమోత్తమ కథ చేరక తప్పదు. దీనికితోడు వందిమాగధ భట్రాజ గణ భజన బృందాలు ఒవెర్టైమె కే ఓవర్ టైంగా పనిచేస్తూంటాయి. ఇక కథ ఎవరికి కావాలి? ఈ మూడు కథలూ వార్త దిన పత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చినవే. అప్పటికి ఈ ఉత్తమ కథల సంపాదకులకు వార్తలో కథలంటే మక్కువ ఉండేది. తరువాత ఆంధ్రజ్యోతి వార్త స్థానాన్ని ఆక్రమించింది. వడ్దించేది మనవారే అయినప్పుడు మన విస్తరి కాకపోతే మరొకరి విస్తరిలో వడ్డనలుంటాయా? ఏమి రాసిన ఉత్తమమే….అందుకు నిదర్శనం ఈ కథ.
కే ఎన్ మల్లీశ్వరి కథలలో ఉత్తమంగా ఎంచుకున్న నాలుగు కథల్లోకి ఆసక్తి కరంగా, కథగా అనిపించే కథ 2013లో ఉత్తమ కథగా ఎంపికయిన బినామీ…కథ చెప్పిన విధానం బాగుంది. బుజ్జి అనే పాప దృక్కోణంలో కత ఆరంభించి, అయిమావతి అనే భర్త బాదితురాలు తనకు జరుగుతున్న అన్యాయానికి ప్రతిగా నల్ల మారెమ్మను తనపైకిజాతర సమయంలో ఆహ్వానించుకుని దేవికి ఎలమంద వల్ల అపచారం జరిగిందనిపించి నల్ల మారెమ్మ నీకేసే గుడ్లురిమి చూస్తోందిరో…అని అరవటంతో కథ పూర్తవుతుంది. కథ చదివిస్తుంది. అంతే…గొప్ప కథ అనలేము…బాగానేవుంది అనిపిస్తుంది. అయితే, మిగతా మూడు కథలతో పోలిస్తే, కథ పరంగా ఈ కథకు పాసు మార్కులొస్తాయి..
వచ్చే వ్యాసన్లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కతల విశ్లేసణ వుంటుంది.

July 2, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-21(1)

కే ఎన్ మల్లీశ్వరి నాలుగు కథలు 2005లో రెండంచుల కత్తి, 2007లో, 2011లో 2013లో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. ప్రస్తుత విశ్లేషణ పరిథి ఈ నాలుగు కథలకే పరిమితం. ఒక రచయిత ఎన్నో గొప్ప రచనలు చేసి వుందవచ్చు. లేక ఆయన రాసే ప్రతి అక్షరం అత్యద్భుతమని భావిచేవారుండవచ్చు. రాయకముందే పొగిడేసి, రాసినతరువాత దాన్లో లేనిపోని అర్ధాలు చూసి, ఆపాదించి మరీ పొగడవచ్చు. వాటితో ఈ విశ్లేషణకు సంబంధంలేదు. ఈ విస్లేషణ కేవలం ఈ నాలుగు కథలకే పరిమితం.
రెండంచుల కత్తి, కథ నిజంగానే రెండంచుల కత్తిలాంటిది. ఈ కథను పొగడకపోతే, కుల మతాల వివక్షతను సమర్ధించేవాడు. అభ్యుదయ భావాల వ్యతిరేకి. అభివృద్ధి నిరోధకుడు లాంటి పడికట్టు పదాలతో దూషణలకు గురయ్యే వీలుంది. పొగిడాలంటే, ఏ అంశాన్ని పొగడాలో వెతుక్కోవాల్సివుంటుంది. ఇది మహిమ అనే అమ్మాయి ప్రధానపాత్రగా సాగిన కథ. మహిత అనే అమ్మాయి అసాధారణమైన తెలివితేటలు కలది. వాళ్ళ నాన్న పెంపకంలో ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం మెండుగా కలది. ఆమె, తనకి ఇష్టమయిన కాలేజీలో చేరతానంటే, అక్కడ క్రమశిక్షణ వుండదని తండ్రి అభ్యంతరపెడితే, నాకుందికదా నాన్నా, అనగలిగేంత ఆత్మ విశ్వాసం కల యువతి మహిత. కాలేజీ వెళ్తుంది. ఒక అబ్బాయి చనువు తీసుకుంటే రాసుకు పూసుకుం కూర్చుంటేనే స్నేహం కాదు అని అతడిని ఎక్కడుంచాలో అక్కడుంచుతుంది. అంటే, అతి చనువు తీసుకునేవారిని ఎలా హద్దుల్లో పెట్టాలో ఆ అమ్మాయికి తెలుసన్నమాట. అయితే, క్లాస్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళెంతమంది అని లెక్చర్ అడిగితే, ఆమె తాను ఎస్సీనని నాన్న ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు కాబట్టి స్కాలర్షిప్ తీసుకోవట్లేదని చెప్తుంది. దాంతో కుర్రాళ్ళు ఆమెవైపు చులకనగా చూసి అసభ్యకరమైన సౌంజ్ఞ చేస్తారు. అంటే, ఇక్కడ అంతవరకూ ఎవరికీ ఆమె ఎస్సీ అని తెలియదని, ఎస్సీ అనగానే చులకన అయిపోయిందనీ, సమాజంలో ఎస్సీ ఎస్టీలపైన వివక్షత ఇంతగా వుందనీ రచయిత్రి ఈ సంఘటన ద్వారా చూపిస్తున్నారన్నమాట.( ఇక్కడే ఉత్తమ కథకి మార్కులు పడిపోయివుంటాయి. అగ్రవర్ణాల దౌష్ట్యం, కుల పిచ్చి చూపించటం ఎంత అభ్యుదయం!) అయితే, ఆమె ఎస్సీ అని తెలియగానే ఆమె స్నేహితుల సంఖ్య కుచించుకుపోతుంది. కాలేకీ ఆన్యువల్ డే ఆర్గనైజర్ గా మహిత సెలక్ట్ అవుతుంది. అందరూపాడే సినిమా పాటలు, వేసే డాన్సులు నచ్చవు. ఆమె అభ్యంతరం చెప్తే, సెక్రటరీ, మీ అమ్మాయిలు ఎవరినయినా బాయ్ ఫ్రెంద్ గా ఒప్పుకుంటారని జోక్ వేస్తాడు. ఆమె ఇంకా వాదిస్తే, ఫార్వార్డ్ కాస్ట్ లో అమ్మా నాన్న ఒప్పుకోరని భయం. మీ ఎస్సీ ఎస్టీల్లో ఏమిటీ ఆబ్జెక్షన్? అంటాడు. ఆమె ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తుంది. అయినా ఈ కాలంలో వీళ్ళతో ఎవరు పెట్టుకుంటారు. వూ అంటే కేసు, ఆ అంటే కేసు అని అనటం వింటుంది. అది విని ఈ విష సంస్కృతి వేళ్ళనుంచీ వ్యాపించివుందన్న విషయం అర్ధమవుతుంది. తండ్రి దగ్గర ఏడుస్తుంది. నేను పుట్టడటమే మెడ మీద కత్తితో పుట్టాను. ఇంతకాలం దాన్నుంచి ఎలా కాపాడాలో నువ్వు బాగానే చెప్పావు. కానీ ఇది రెండంచుల కత్తి నాన్నా. నేను ఎదుర్కోలేకపోతున్నాను…అంటూ ఏడుస్తుంది. ఆయన ఒక లెక్చరిస్తాడు. అయినా కులవివక్షకు గురైనా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఆత్మవిశ్వాసంతో వున్న నాన్న అండగా నిలబడ్డాక నేనెందుకు ఏడవాలి? అనుకుంటుంది. నువ్వు నమ్మిన దాన్ని ఆచరించు అని ఆమె అమ్మ నాన్న అంటారు. అదీ కథ.
కథ చదవగానే ముందు నవ్వొస్తుంది. ఇది ఒక మామూలు కథ. అభ్యుదయ అభివృద్ధికర భావల రచయితలుగా గుర్తింపు పొందాలని తపన పడుతూ ఆదిశగా తొలీడుగులు వేసేవారి తొలి కథలు ఇలాగేవుంటాయి. ఈ కథ చదవగానే ఇది ఉత్తమ కథగా ఎంపికవటంలో కథకన్నా ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషించినట్టున్నాయన్న ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే, కథలో సన్నివేశ సృష్టీకరణ కానీ, పాత్ర చిత్రణకానీ ఏమాత్రం సరిగాలేవు. మహిత పాత్ర ఆత్మవిశ్వాసం కల మహిళ. డిగ్రీ చదువుతోంది. ఏడ్పించి చనువు తీసుకునే మగపిల్లలనెలా దూరం పెట్టాలో, వారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. తండ్రిని వాదనలో ఓదించగలదు. కానీ, కుల వివక్షతను అంతవరకూ జీవితంలో అనుభవించలేదు. దాన్ని ఎదుర్కోలేదు. నిజానికి అమ్మాయిగా ఒక వివక్షత, కులం ఆధారంగా మరో వివక్షత, ఆకారం ఆధారంగా మరో వివక్షత..ఇలాంటి పలురకాల వివక్షతను ప్రతిఒక్కరూ ఎదుర్కోంటారు. అదేదో కొత్త విషయమన్నట్టు, భరించలేని విషయమన్నట్టు చూపాలని ప్రయత్నించటంలో తప్పులేకున్నా, ఆ ప్రయత్నంలో నిజాయితీ లేకపోవటం, అందుకోసం ఎంచుకున్న కథలో శక్తి లేకపోవటం వల్ల కథలో రచయిత్రి ప్రదర్సించాలనుకున్న కుల వివక్షత అనే అంశం కృత్రిమమై, హాస్యాస్పదమవుతుంది.
కుల వివక్షత అన్నది,సమాజంలో చ్ అలామనిలో వున్నదన్నది కాదనలేని అంశం. దాన్ని నిర్మూలించాలని చేస్తున్న ప్రయత్నాల ఫలితమేమో తెలియదు కానీ, రాను రాను కుల పరమయిన భావాలు మరింతగట్టి పడుతున్నాయి. బాహాటమవుతున్నాయి. ఉద్విగ్నతలు ఉచ్చమవుతున్నాయి. దీనికి కారణాలను లోతుగా విస్లేషించి, పరిష్కారాలను సూచించేబదులు, ఉన్న సమస్యను మరింత విక్ర్తంగా చూపించి, ఉన్న అపోహలను పెంచటం, స్ర్జనాత్మక రచయితలకు కూడదు. అది మామూలు బ్రతకనేర్చిన రచయితలు, ప్రతిభలేనివారు చేయాల్సిన పని. ఈ కథ సమస్య మూలాల్లోకి వెళ్ళదు. కారణాలను విస్లేషించదు. ప్రస్తుత పరిస్థితినీ చూపదు. కేవలం ఒక సంఘతనను చూపుతుంది. నిజానికి ఈ కథ అవాస్తవికంగా అనిపిస్తుంది. ఒకప్పుడు తరగతి గదులకు వచ్చి స్కాలర్షిప్పుల కోసం పిలవటమనేది జరిగేది. కానీ, ఒక విద్యార్ధి స్కూల్లో చేరగానే అతనిదే కులము, ఏ మతము, సామాజిక స్థితిగతులేమిటి వంటి విషయాలందరికీ తెలిసిపోతాయి. స్నేహాలు కూడా వీటి ఆధారంగా ఏర్పడతాయి. అక్కడొకటి ఇక్కడొకటి ఇందుకు భిన్నమయిన స్నేహాలు ఏర్పడ్డా అధిక శాతం ఒక పరిథిలోనే ఏర్పడతాయి. మరో విషయం ఏమిటంటే, కాలీజీల్లో చేరేసమయంలోనే పార్టీలవారీగా వచ్చి పరిచయాలు చేసుకుంటారు. కులాక సంఘాలవారూ వచ్చి పరిచయాలు చేసుకుంటారు. తమకులం వాదై వుండి తమ సంఘంలో చేరనివాడిని దూషిస్తారు. వేరే కులం వాడితో మాట్లాడితే బెదిరిస్తారు. ఈ విక్ర్త రూపం ఈ కథ పరిధి బాహిరం. ఎందుకంటే ఈ కథ మహిత అనే అమ్మాయి బాధను గ్లోరిఫై చేసి ఆమె కష్టాన్ని చూపే కథ కాబట్టి. ఇక ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయటమన్నది, ఎప్పటినుంచో వుంది. ఇటీవలే జైలు పాలయిన జడ్జి ఉదంతం దానికి పరాకాష్ట. బహు విభిన్నమయిన కోణాల్లో విస్తృతమయ్ ఉన్న ఒక ప్రధానమైన సమస్యను తేలికచేసి ప్రదర్సించిన ఈ కథ ఉత్తమ కథగా ఒప్పుకోవటం కష్టం. సమస్యను పై పైన్నే స్ప్ర్షించి తేలిక చేసి చిన్న అంశాలనుంచి జగద్రక్షక సిద్ధాంతాలను తీర్మానించే అనేక ఇలాంటి ఉత్తమత్వంలేని ఉత్తమ కథల జాబితాలో ఒదిగిపోతుందీకథ అతి సులభంగా. ఎందుకంటే రచయిత్రి తన మనస్సులోలోతుల్లో దర్సించి పలవరించి సృజించిన కథ కన్నా, మెప్పుకోసం, ఒక గుంపు ఆక్సెప్టన్స్ కోసం రచించిన కథ ఇది అనిపిస్తుంది. ఈ భావన ఖాళీ అన్న కథ చదివాక మరింత స్పష్టం అవుతుంది.
మిగతా కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో…

July 1, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized