Archive for the ‘Uncategorized’ Category
నాకు ఆశ్చర్యంగా వుంది…
నిజం….
నాకు నిజంగా ఆశ్చర్యంగా వుంది.
ఇటీవలె ఒక బ్లాగులో, ఓ టీవీ ఆంకర్ తన యాజమాన్యాన్ని విమర్శిస్తూ ఏదో రాసిందికాబట్టి ఉద్యోగం లోంచి తీసేసారని విమర్శిస్తున్నారు. ఆ అమ్మాయి, భావ వ్యక్తీకరణ స్వేచ్చను నిలబెడుతున్నట్టు పొగుడుతూ, ఆమె అలాగే నిజాలు చెప్తూండాలని ప్రోత్సహిస్తూ, జర్నలిస్టులనూ, మీడియా వారినీ దుయ్యబడుతున్నారు.
ఇదంతా చూస్తూంటే నాకు ఆశ్చర్యంగా వుంది.
సాధారణంగా, ఏ సంస్థలోనయినా, సంస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిని, అవి నిజాలే అయినా, భరించరు. అలా వ్యాఖ్యలు చేసినవాడు ఎంత గొప్పవాడయినా, సహించరు.
ఒక సంస్థలో పనిచేస్తున్నవారు ఆ సంస్థపట్ల లాయల్ గా వుండాలని కోరుకుంటారు. అందుకే, నిజాలు బయట పెట్టాలనుకున్నవారు, విమర్శించాలనుకున్నవారు మారుపేర్లు వాడతారు. ఆకాశరమన్నలవుతారు.
అంతెందుకు, నేను పనిచేసే సంస్థలో ఆర్ టీ ఏ ను ఉపయోగించేహక్కు, ఆ సంస్థ వుద్యోగులకు లేదు. వేరే ఎవరి ద్వారాన అడిగించాల్సివుంటుంది.
ఇదంతా ఎందుకు చెప్తున్నాననంటే, పాపం, ఆ అమ్మాయి ఎవరో ఇంకా తన కేరీర్ ఆరంభంలోనే వున్నట్టుంది. వీళ్ళు ఆమెని పొగిడి, మునగ చెట్టు ఎక్కించి, ఆమె చేసింది సరయినదే అన్న భావం కలిగిస్తున్నారు. ఆ అమ్మాయి, వీళ్ళ పొగడ్తలను నిజమే అనుకుంటే ఆమె కేరీర్ దెబ్బ తింటుంది.
చర్చిల్ లాంటి నాయకుడే ఒకసారి ఒక మాటన్నాడు. చెప్పింది విని ప్రశ్నించకుండా పనిచేసే సగటు ఉద్యోగి, ప్రశ్నించే తెలివయినవాడికన్నా వెయ్యిరెట్లు నయమని.
కాబట్టి, యాజమాన్యం, ఉద్యోగులనుండి, క్రమశిక్షణ, విశ్వాసము కోరటంలో ఎలాంటి తప్పులేదు.
నిజం చెప్పటం మంచిదే. కానీ, సమయాసమయాలు, అనువయిన సందర్భమూ చూసుకుని నిజం, నొప్పించని రీతిలో చెప్పాలి. లేకపోతే, నిజం నాగుపామయి కాటేస్తుంది-
నేను కథలు రాసే కొత్తల్లో, ఒకాయన తనకోకథ రాసితే, రేడియోలో కథ చదివే అవకాశం ఇప్పిస్తానన్నాడు.
నేను కథ రాసిచ్చా.
అతను రేడియోలో కథ చదువుతూంటేనే వింటూ అసూయతో చచా. ఆతరువాత దానికి ఆయనకు వస్తున్న రెస్పాన్స్ చూసి కాలి చచ్చా. దాంతో, కనబడిన అందరికీ అది నా కథ అని చెప్పి ఏడవటం ఆర్మభించాను.
అప్పటికి నాదొక్క కథ కూడా ప్రచురితం కాలేదు. నేనెవరో ఎవరికీ తెలియదు. నాకూ ఎవరూ తెలియరు. మా ఇద్దరికీ తెలిసిన వారికి చెప్పుకుని ఏడ్చా. అది ఆయనకు చేరింది. ఆయన నన్నేమనలేదు. కానీ, రేడియోలో పరిచయం చేయలేదుసరికదా, నన్ను ఆయన సర్కిల్ నుంచి బహిష్కరించాడు. మంచికథ రాసిచ్చినందుకు పొగిడినవాడే, నన్నుచూస్తే ముఖం తిప్పుకుపోయాడు. అతని మిత్రులు కూడా, అక్కడ దెబ్బతిన్న వాడిని నేనయినా, నేనే తప్పుచేసినట్టు చూసేవారు.
అప్పటినుంచీ నేను ఘోస్ట్ రచనలు చేయకూడదని నిర్ణయించుకోవటమేకాదు, అన్నివేళలా నిజ,ం చెప్పటం మంచిదికాదని గ్రహించాను.
అంటే, ఇద్దరు మనుషుల మధ్యనే నిజం ఇలాంటి నష్టాన్ని కలుగచేస్తే, ఒక పెద్ద సంస్థలో పనిచేసేవ్యక్తి ఆ సంస్థ గురించి తన అభిప్రాయాలు వ్యక్తం చేయటంలో ఇంకెంత జాగ్రత్త వహించాలి?
అలా వ్యక్తంచేసే వారిని బ్లాక్ లిస్టులో పెట్టి ఎవ్వరూ దగ్గర రానీయరు. అంతెందుకు, మనమే వేరేవారి గురించి, నిజాలే అయినా, వ్యాఖ్యానించేవారిదగ్గర జాగ్రత్తగా వు,ంటాం.
కాబట్టి, ఎంతటి నిజాలయినా, వ్యక్తం చేసేందుకు విచక్షణ అవసరం.
ఇదేదో ఆ అమ్మాయికి చెప్పేబదులు, యాజమాన్యాన్ని తిట్టటం, మీడియాలోని వారందరినీ దూషించటం, ఇలా చేసేవారిపట్ల కన్నా, ఇదంతా చూస్తూ గొప్పపని చేసేసామని భ్రమ పడే అమాయకులను తలుచుకుంటే జాలి అనిపిస్తుంది.
నేను ఎమ్మెస్సీ పూర్తయిన తరువాత వీడ్కోలు పార్టీలో చదువులగురించి, ల్ప్రొఫెసర్ల గురించి నా అభొప్రాయాలను నిర్మొహమాటంగా నా ఉపన్యాసంలో చెప్పాను. మిగతా అంతా డిప్లొమాట్లలా మాట్లాడేఅరు.
ఎమ్మెసీ తరువాత నాకు రీసెర్చి గయిడుగా వ్యవహరించేందుకు ఒక్క ప్రొఫెసర్ ముందుకు రాలేదు. నేను ఉపన్యాసం ఇచ్చినప్పుడు అందరూ పొగిడారు. హీరోని చేశారు. కానీ, అందువల్ల నష్టం ఎవరికి? నన్ను హీరో అన్నవారే ఆ తరువాత పొగరుబోతుకు తగిన శాస్తయిందని అన్నారు. తాము డాక్టరేట్లు తీసుకుంటూంటే నన్ను తలవలేదుకూడా.
కాబట్టి, మీడియాలోనే వున్నవారేకాదు, ఎవరయినాసరే, నిజం చాలా విలువయినది. దాన్ని అంతే విలువగా చూసుకోవాలి. నోరుందికదా అని నిజం చెప్తానంటే, నోత్లోకి పోయేవేళ్ళే కరువవుతాయి. అలాగని అన్ని అన్యాయాలను సహించాల్సిన అవసరం లేదు.. విచక్షణ చాలా అవసరం.
అనరాని చోట అధికులమనరాదు. కొంచెముండుటెల్ల కొదువకాదు, అన్నదాన్ని అర్ధం చేసుకోవాలి.
దిల్ కీ బాత్ కహీన్ లబ్ పేనా ఆజాయే, వెనుకున్న భయాన్ని తెలుసుకోవాలి.
గమనిస్తే, ఆతరువాత మీడియాలోవారిని విమర్శిస్తున్న వారెవారూ పేర్లు బయట పెట్టటంలేదు. వీరు మీడియాలోలేకున్నా, వారితో సత్సంబంధాలకోసం, ధైర్యంగా నిజాలు చెప్తున్నట్టు చేస్తూ, శతృవులపైన బాణాలు జాగ్రత్తగా సంధిస్తున్నారు, పేర్లు చెప్పకుండా………
June 8, 2010
·
Kasturi Murali Krishna ·
5 Comments
Posted in: Uncategorized
హాసం సభకు ఆహ్వానం!
ప్రతి నెల చివరి శనివారం త్యాగరాయ గాన సభ మినీహాలులో హాసం క్లబ్ సమావేశాలు జరుగుతాయి. ఈసారికూడా జరుగుతున్నాయి.
ఈ నెల సమావేశం లో సినీ నటి గీతాంజలికి సన్మానం వుంటుంది.
ఆ తరువాత నేను సమర్పించే గీతాంజలి వుంటుంది. ఈసారి గీతాంజలి వేటూరి, మజ్రూహ్ ల గీతాంజలి.
అందరూ వచ్చి సభను జయప్రదం చేయాలని ప్రార్ధన.
May 28, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: Uncategorized
సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ, హైదరాబాదులో….
తెనాలిలో సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఆ వివరాలు త్వరలో తెలుపుతాను. ఇప్పుడు, హైదరాబాదులో, 8వ తారీఖున పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ఆ సహకు అందరికీ ఆహ్వానం. ఆహ్వాన పత్రం తో పాటూ, సౌశీల్య ద్రౌపది పుస్తక ముఖచిత్రం కూడా జతపరుస్తున్నాను.
May 5, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: Uncategorized
తెలంగాణా తేట గీతం-2
ధర్మపురి ప్రయాణం లో నేను రాసుకున్న రెండవ పాట ఇది. ఈపాటలో చమత్కారం నాకు బాగా నచ్చింది. పదాలు వాడిన విధానం అద్భుతం. పాట ఇది.
పున్నపు వెన్నెల వలలో పూసీ కాయంగ వలలో
అమాస చీకటిలో వలలో ఆగి కాయంగా వలలో
చుక్కల రాణి వల్లో చూడనిచ్చినాదీ వల్లో
చూసినంతయూ చూసీ వల్లో సుడికొంగులువట్టే వల్లో
మైకొంగులు వట్టే వల్లో మీరెవ్వారే వల్లో
మేనత్తకొడుకూనీ వల్లో నీబావనీ వల్లో
నీ అమ్మనాన్నలకూ వల్లో నేనే అల్లుడినీ వల్లో
వాళ్ళింటి ముంగట వల్లో కల్యాప చెట్టూ వల్లో
కోతలు కాసిందీ వల్లో పూతలు పూసిందీ వల్లో
కాయలు కోపిచ్చీ వల్లో కాటుకలిప్పిచ్చీ వల్లో
ఇదికాస్త మాఇంటికీ వల్లో ఇచ్చీవస్తావా వల్లో
ఇచ్చీవత్తురుగానీ వల్లో ఇల్లూ ఎరుకలేదూ వల్లో
పోయీవత్తునుగానీ వల్లో పోలికతెలియరాదూ వల్లో
పోంగా మా ఇల్లూ వల్లో పోకల దర్వాజా వల్లో
రాంగా మా ఇల్లూ వల్లో రంగుల తలుపూలూ వల్లో!!!!.
March 10, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: Uncategorized
తెలంగాణా తేట గీతం-1
ఇటీవలె నేను ధర్మపురికి వెళ్ళాను.
ఆరోజు స్వామివారి కళ్యాణం జరుగుతోంది. ఇసకేస్తే రాలనంత జనం. అయినా, తెలిసిన వారుండటంతో దర్శనాలు సులభంగా అయ్యాయి.
ఆ హడావిడినుంచి బయటకు వచ్చి, గుడికి దూరంగా, ప్రశాంతంగా వున్న చోట విశ్రాంతి తీసుకుంటూంటే కొందరు ఆడపిల్లలు ఇల్లిల్లూ తిరుగుతూ పాటలు పాడటం వినిపించింది.
ఆ పాటలు వింటూ వారిని వెంబడించాము.
వారందరూ 10 నుండి 14 ఏళ్ళ లోపు వారు. జాతరలో ఏవయినా కొనుక్కునేందుకు ఇలా పాటలు పాడి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ పాటలు వాళ్ళ అమ్మలు నేర్పారట.
వారిని అడిగి కొన్ని పాటలు రాసుకున్నాను. వాటిల్లో ఒకటి ఈ పాట.
పాటలో పదాలు చూడండి. సాహిత్యం చూడండి. చమత్కారం చూడండి. శృంగారం చూడండి. గడుసుదనం, అమాయకత్వాలు చూడండి. అత్యద్భుతంగా వున్నాయీ పాటలు వారు పాడుతూంటే. అందులోని ఒక పాట ఇది. వీలువెంబడి మిగతా పాటలు అంద్చేస్తాను.
ఈ పాటలో ఓ రాణి అన్నచోట ఎవరిపేరయినా పెట్టుకోవచ్చట.
కందిపూసె కందిగాసె
కంది కోడలు నంది మేసె
నందీవేల నువ్వేరాగనే
ఒ రానీ, మందీ కండ్లు మంట మండెనే, నా రాణీ
దుంపు దుంపు నీ కురులు
దుయ్యరారు, ముడువరారు
దూసిమడసె కొప్పు వెట్టవే
ఓరానీ, కొప్పునిండా గుప్పెడు మల్లెలే…
కొప్పును చూసిరాపోతివే నా రానీ……
March 8, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: Uncategorized
సప్తగిరి చానెల్ లో వేదిక కార్యక్రమం చూడండి!
ఆదివారం అంటే 8వ తారీఖున, రాత్రి ఎనిమిది గంటలకు వేదిక అనే చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది.
ఈ వేదిక కార్యక్రమం లో మహిళల సమానహక్కులు, అవకాశాలు అనే అమ్షం పైన చర్చ జరుగుతుంది.
ఈ చర్చలో నేను, కొండవీటి సత్యవతి గారు, ఎం వీ లక్ష్మి గారు పాల్గొన్నాము.
ఈ కార్యక్రమం చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.
సప్తగిరి చానెల్ లో….
ఆదివారం, 8వ తారీఖు,
రాత్రి 8 గంటలకు,
వేదిక కార్యక్రమము చూడండి.
March 5, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Tags: కొండవీటి సత్యవతి, భూమిక, వేదిక, సప్తగిరి · Posted in: Uncategorized


