Archive for the ‘సినెమా రివ్యూ’ Category

ముగ్గురు ఇడియట్లు-ఒక ఫూలు-ఒక తెలివయినవాడు.

పేరు చూడగానే ఇది దేని గురించో తెలిసిపోయివుంటుంది.

నేను థ్రీ ఇడియట్లు చూడలేదు. ఇప్పుడే చూడను కూడా. అమీర్ ఖాన్ తప్ప కాలేజీ స్టూడెంటుగా three-idiots2వేయగల మరో యువనటుడు లేని దౌర్భాగ్యం మనది. దిల్ చాహ్తా హై లోనే అమీర్ కాలేజీ స్టూడెంట్ అంటే కష్టంగానే ఇష్టం కాబట్టి నమ్మాల్సివచ్చింది. అందుకే టీవీలో ఫ్రీగాకానీ, ఎవరయినా సీడీ ఇస్తేకానీ తప్ప థియేటర్లో ఈ సినిమా చూడను. కాబట్టి సినిమా తీసినవారికీ, ఈ సినిమాకు ప్రేరణ అయిన ఫైవ్ పాయింట్ సం వన్ రచయిత చేతన్ భగత్ కూ నడుమ జరుగుతున్న గొడవ గురించి నేనేమీ వ్యాఖ్యానించను. కాబట్టి నా ముగ్గురు ఇడియట్లు సినిమా నిర్మాత విధు వినోద్ చోప్ర, స్క్రిప్ట్ రచయిత హిరానీ, అమీర్ ఖాన్లు ( వాళ్ళే చెప్పుకున్నారు)

ఒక ఫూలెవరూ అంటే ,ఇంకెవరు, మన రచయిత చేతన్ భగత్.

సినిమావాళ్ళు రచయితలకు గౌరవమిఏనాడూ ఇవ్వలేదు. సలీం జావేద్, గుల్షన్ నందా, షైలేంద్ర, సాహిర్ మజ్రూహ్, దేవులపల్లి  ల కాలం చెల్లిపోయింది. ఆకాలం లోనే మజ్రూహ్   ఎంత గాయపడివుంటాడో ఒక సంఘటన నిరూపిస్తుంది.

దస్తక్ అనే సినిమాలో ఒక వేశ్య పాడే అధ్బుతమయిన గజల్ రాశాడాయన.

హం హై మతాయెకూచవో బాజార్ కీ తరహFive_Point_Someone-What_not_to_do_at_IIT
ఉఠ్ తీహై హర్ నిగాహ ఖరీదార్ కీ తరహ

అంటే, ఆమె బజార్ లో వస్తువులా కూచుందట. ప్రతి ఒక్కడూ ఆమెను కొనేవాడిలానే చూస్తున్నాడట.

హృదయవిదారకమయిన దుస్థితి.

ఆపాట విని ఎందరో మజ్రూహ్ ని అడిగారట. వేశ్యల గురించి బోలెడన్ని కవితలు, పాటలు వచ్చాయికానీ, ఇంతలోతయిన భావం, వేశ్యల మానసికగాయాన్ని ప్రతిబింబించే గేయం ఇంతవరకూ రాలేదు, దీనికి ప్రేరణ ఏమిటీ అని అడిగేవారట.

దానికి మజ్రూహ్ సమాధానం ఏమిటంటే, వేశ్యలకన్నా దయనీయమయిన స్థితిలోంచి వచ్చిందీ గేయం. వేశ్యలతో శరీరాన్ని బేరమాడతారు. వాడుకున్నతరువాత ఏడుస్తూనయినా డబ్బులిస్తారు. రచయితల మేధలతో ఆడుకుంటారు. కనీసం డబ్బులయినా ఇవ్వరు. అదీ ఈ కవితకు ప్రేరణ అన్నాడట. మజ్రూహ్ అంటే గాయం అని అర్ధం.

ఇది రచయితల పరిస్థితి,. కనీసం చేతన్ భగత్ కు ఏదో రూపంలో క్రెడిట్ దక్కుతోంది. సంతోశించక గోల చేసి తాను ఫూలునని నిరూపించుకుంటున్నాడు.happy+days అయితే చేతన్ కూడా తాను ఫూలునని ఎప్పుడొప్పుకుంటాడంటే, క్రెడిటూ పాడూ లేకుండా, కాస్త స్వంత పైత్యం జోడించి, సూపెర్ హిట్ తీసిన తెలివయినవాడి సినిమా హేపీడేయ్స్ చూస్తే.

ఒప్పుకోరా? ఒప్పుకోరని చెప్పండి, తరువాత పోస్టులలో హేపీడేయ్స్ లో ఫైవ్ పాయింట్ సం వన్ ను చూపిస్తాను.

January 2, 2010 · Kasturi Murali Krishna · 6 Comments
Posted in: సినెమా రివ్యూ

తలత్ మహమూద్-ఒక పరిచయం!

క్రితం నెల ఈభూమి మాస పత్రికలో  పాడుతా, తీయగా, శీర్షికన ప్రచురితమయిన వ్యాసం.

talattalat1

December 10, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: సినెమా రివ్యూ

తప్పక చూడవలసిన సినిమా, నింగీ-నేలా, నాదే!

iwngs2రేపు విడుదలవుతున్న నింగీ, నేలా, నాదే- అనే సినిమాను అందరూ, పిల్లలూ, పెద్దలూ, మొత్తం కుటుంబ సభ్యులూ అందరూ కలసి తప్పనిసరిగా చూడవలసిన సినిమా.

ఇది, చైనా సినిమా ఇన్విసిబుల్ వింగ్స్ కు తెలుగు తర్జుమా.

ఒక 15 ఏళ్ళ అమ్మాయి, ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోతుంది. అయినా, అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని, తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు అవసరంలేదని, ఆత్మశక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుంది. అంగవైకల్యం శరీరానికేననీ, మనోశక్తితో అన్ని వైకల్యాలను అధిగమించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చనీ నిరూపిస్తుంది.

iwingsఈసినిమా చూస్తూంటే ప్రతి చిన్న కష్టానికీ కృంగిపోతూ, న్యూనతాభావానికి గురవుతూ, ఆత్మహత్యలవైపు పరుగిడేవారందరికీ బుద్ధివచ్చి స్ఫూర్తి జాగృతమవుతుంది.

తాము వెనుకబడి వున్నాము కాబట్టి తమకు చేయూతలేనిదే నిలబడలేమని దీనాలాపాలు, ఆక్రందనలు చేసేవారందరికీ, ఆత్మశక్తి, ఇచ్చాశక్తి అనే పదాల అర్ధాలు బోధపడతాయి. మనస్సాక్షి జాగృతమయి సిగ్గిలుతుంది.

మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, అతని ఆత్మబలం తప్ప మరెవెరి చేయూత అవసరంలేదన్న నిజాన్ని నిక్కచ్చిగా చూపుతుందీ సినిమా.

ప్రతి ఒక్కరూ, ఒకతికి రెండుసార్లు చూసి స్ఫూర్తిని పొందవలసిన అద్భుతమయిన సినిమా ఇది.

iwngs3ఈ సినిమాను చలన చిత్రోత్సవంలో చూశాను. ఇప్పుడిది అనువాదమయి, పాటలు చేర్చుకుని వస్తోంది. చూడండి. ఇతరులకు చూపించండి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే, మరిన్ని మంచి చిత్రాలు మనకందుతాయి. లేకపోతే, ఎవరూచూడరని. అవే ప్రేమలూ, అవే గెంతులు, పూబంతుల ప్రతీకల కుళ్ళు సినిమాలే మనకు గతి అవుతాయి.

July 2, 2009 ·  · 2 Comments
Posted in: సినెమా రివ్యూ

నా తల్లో జేజమ్మ వదిలింది!

నిన్న హాయిగా ఇంట్లో కూచుని పుస్తకాలు చదువుకుంటున్న నన్ను నా మిత్రాధముదు చలో సినిమాకి అని లాక్కుపోయాడు. అరుంధతి అనే సినిమా హాలులో కూచోబెట్టాడు.

ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా వినివుండటంవల్ల, చదివి వుండటం వల్ల, సినిమా సూపెర్ హిట్ అయివుండటం వల్ల నేనుకూడా సరే పద అన్నాను.

సినిమా చూశాను.

మొదటి దృశ్యం చూస్తూంటేనే, ఇలాంటి సినిమాలు బోలెడన్ని చూశామన్న భావన కలిగింది. సినిమా కొనసాగుతూంటే అది బలపడింది.

విశ్రాంతి సమయంలో వెళ్ళిపోదాం, అన్నాడు నా మితృడు. కానీ, డబ్బులు పెట్టినందుకు పూర్తిగా చూడాలి, అని వాడికో అయిస్ క్రీం కొనిచ్చి, ఇద్దరమూ, తెరపై రక్తపాతాలూ, పగలూ, ప్రతీకారాలూ, మాయలూ, మంత్రాలూ, నవ్వుతూ, జోకులేసుకుంటూ చూశాము.

సినిమా అయిన తరువాత, జేజమ్మా, జేజమ్మా, అనిపాడుకుంతూ బయటకు వచ్చాము. దెబ్బకు తలలో జేజమ్మ వదిలింది.

ఎక్సోర్సిస్ట్, ఓమెన్, పోల్టెర్గీస్ట్, నైట్ మేర్ ఆన్ ది ఎల్మ్ స్ట్రీట్, డ్రాకులా, మమ్మీ, ఇంకా, ఇలాంటి, అనకొండాలు, భయంకరమయిన జీవుల వాతపడే సినిమాలూ, ఈవిల్ డేడ్డులూ, వంటి సినిమాలు చూసీ, చూసీ విసిగి హారర్ సినిమాలు చూస్తూ నవ్వుకునే స్థితికి చేరుకున్నవారికి అరుంధతి, సీ గేడు సినిమా.

ఇలాంటి సినిమాలతో పెద్దగా పరిచయం లేని వారికి ఇదొక అధ్బుతమయిన సినిమా. మన తెలుగు తెరపైన, ఇలాంటి, సాంకేతిక అద్భుతాలు చూడటం ఆనందం కలిగించే విషయమే అయినా, కథ పరంగా, స్క్రిప్తు పరంగా, ఎడిటింగ్ పరంగా, ఇంకా అనేక ఇతర సాంకేతిక అంశాల పరంగా చూస్తే, అరుంధతి బిలో ఆవెరేజ్ సినిమాగా మిగులుతుంది.

సినిమాలోని అనేక సన్నివేశాలు మనకు గతంలో చూసిన, అలవాటయిన సన్నివేశాలను ఙ్నప్తికి తెస్తాయి.

ఆడ్రే రోస్ తో సహా గతంలోని వాంపయిర్,  హారర్, దయ్యాల సినిమాలన్నీ గుర్తుకు వస్తాయి.

నాణెం నుదుటిన వొత్తగానే సెగలూ, పొగలొచ్చి దయ్యం పారిపోవటంలాంటివి, శిలువ చూపగానే, నుదుటిన వొత్తగానే సైతాను పారిపోయే సన్నివేశాలను గుర్తుకు తెస్తుంది.

సజీవ సమాధిచేసి, వాడు చచ్చిపోతే, ఉలిక్కిపడి ఆశ్చర్యపడటం నవ్వుతెస్తుంది.

దేవుడి గదిలో వున్నా, దయ్యం తనపనులు చేసేసుకు పోవటం, ముగ్గును తొలగించేందుకు నీళ్ళను ఉపయోగించటం మంచి హాస్య సన్నివేశం. ఒక దశలో ఆ గదిలో టైటానిక్ ను ముంచేన్ని నీళ్ళున్నాయేమో ననిపించింది.

కార్లోంచి లోయలో పడ్డ ఫకీరు, చెట్టు ఈవిల్ డేడ్ లో లాగా ఇనుప సమాధిలో బంధిస్తే దాన్ని చేదించుకుని వచ్చి, నాయికకు ఆయుధాన్నివ్వటం లాంటి సన్నివేశాలు, గద్వాల్ దాటనివ్వనన్న దయ్యం, వికారాబాదు వరకూ నాయికను పోనివ్వటం, కొబ్బరికాయలు తలపైన మోదుతూంటే రక్తం ధారలా కారటం,  ఇలా ఒకటేమిటి, ప్రతి సన్నివేశం ఈ సినిమాను ఒక హాస్య చిత్రంగా తీర్చి దిద్దటంలో ఇతోధికంగా సహాయపడ్డాయి.

నిశ్చితార్ధం అయిన తరువాత, కాబోయే మొగుడు ఊరొస్తే, ఇంటికి రమ్మనే బదులు అర్ధరాత్రి పాడుపడిన కోటలోకి రమ్మనగానే వెళ్ళటం, ఫకీరు చెప్పేదాకా సెల్ ఫోను చేయాలని గుర్తుకు రాకపోవటం, ఎవరయినా కోటలోకి వెళ్తూంటే, ఉట్టిగా అడ్డుపడే ఓ దయ్యం (సస్పెన్స్ పెంచుతున్నమనుకుని, అపహాస్యం పాలు చేస్తుంది), ఇలాంటి అర్ధంపర్ధం లేని పాత్రలూ, సన్నివేశాలూ, ఈ సినిమా లోని హాస్యాన్ని మరింత పెంచుతాయి.

అఘోరీలవద్దనుంచి శక్తులు సంపాదించిన విలన్, కోటలోకి వచ్చి, చేయి విసిరి అందరినీ చంపేయటం చూస్తూంటే, రిటర్న్ ఆఫ్  ది డ్రాగన్ లో బ్రూస్లీ, చెక్కిన సన్నని ముక్కలను విసరటం గుర్తొచ్చి, నవ్విస్తుంది. వాడొచ్చి నానా హంగామా చేస్తూంటే, కత్తి పట్టుకున్న నాయిక కత్తిని పడేసి, వాడిముందుకు వెళ్ళి నిలబడటం అర్ధంలేనిది. నాయిక పైటను తీయించి నాట్యమాడించే వీలు కళాకారులకు కలిగింది.

విలన్ మాటి మాటికీ, నాయిక వాసన చూడటం కుక్కను గుర్తుకు తెస్తుంది. వాడి కేకలు, అరుపులు, ప్రతిగా నాయిక, రేయ్ అని అరుపులు, అబ్బబ్బ, చెవులు చిల్లుపడేశాయి. బహుషా, అప్పుడేనేమో నా తల్లో జేజమ్మ, కదలటం మొదలయివుంటుంది.

సినిమా మొదట్లో, నాయిక రేషనల్ వాదన చేసి, ఒక బంధువు దయ్యం వదలటం నుంచి కాపాడుతుంది. తరువాత వాడికి చికిత్స మాట తలపెట్టదు. ఇంటిలో సరిగా వుంచదు. మళ్ళీ చెట్టుకి కట్టేస్తుంది ఇంటి బయట. అలాగే, కొడుకు సమాధిలోంచి లేవటానికి ఎదురుచూసిన వాడి తల్లి ఆతరువాత ఏమయిందో మనకు తెలియదు. ఇలాంటి స్క్రిప్టు లోపాలు అనేకానేకాలు.

నాయిక కొన్ని సందర్భాలలో అందంగా కనబడుతుంది. ఆమెకు శాస్త్ర్ర్య నృత్యం రాదని తెలుస్తుంది సులభంగా. మిగతా వారంతా, అరుపులు, కేకలు, ఓవరాక్షన్లతో తల హోరెత్తిస్తారు.

సినిమాలో క్రౌర్యం, హింస హద్దులు దాటింది. ఒక అమ్మాయిని, కత్తితో వొళ్ళంతా గాయాలు చేసి, ఆమె ప్రాణాలు పోతూంటే, ఆమెను అనుభవించి, నీప్రాణాలు సుఖంగా పోతున్నాయని అనిపించటం, ఈ దృష్యాన్ని విపులంగా చూపటం అనవసరం. విలన్ క్రూరుడని చూపాలంటే, ఇలాంటివేవీ లెకుండా కూడా చూపవచ్చు. కానీ, ప్రజలు పెద్ద ఎత్తున సినిమాను ఆదరించటంతో లోపాలన్నీ హుష్ కాకీ అవుతాయి. లోపాలు వెతికేవాడు రంధ్రాన్వేషి అవుతాడు.

అయితే, ప్రజలు ఈ సినిమాను ఇంతగా ఆదరించటం, ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మన ప్రేక్షకులు, కాస్తయినా నాణ్యమయిన సినిమాకోసం మొహం వాచి వున్నారు. ఏమాత్రం కొత్తదనం కనబడినా, భిన్నంగా వున్నా, ఆదరించి, మూస సినిమాలపట్ల వ్యతిరేకతను తెలుపుతున్నారు. ఇది గమనించి కళాకారులు ప్రేక్షకులివే చూస్తారని కాక, తమ మనసుకు నచ్చిన సినిమాలు నాణ్యంగా తీస్తూ ఉన్నత ప్రామాణికాలేర్పరచాలి.

ఇక్కడే మరో విషయాన్ని గమనించాలి. మన స్థాయిలో సీ గ్రడు సినిమా స్థాయిలో వున్న స్లం డాగ్ మిలియనీర్ వాళ్ళకు అద్భుతంగా అనిపిస్తోంది. అవార్డుల వర్షాలు కురుస్తున్నాయి.

వారి స్థాయితో పోలిస్తే, సీ గ్రేడు స్థాయి సినిమా అయిన అరుంధతి, మన దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఇతర కళాకారులకు ఆదర్శమవుతోంది.

సినిమాలో అరుపులు కేకలతో నా తలలో జేజమ్మ పూర్తిగా వదలిపోయింది. ఇప్పుడర్ధమయివుంటుంది మీకు, బ్రహ్మబుధ్ ని ఈ సినిమావైపుకు కూడా నేనెందుకు పోనీయటంలేదో!

February 15, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ

మురికివాడల మిలయనీర్ కుక్కను చూశాడు బ్రహ్మబుధ్!

చాలా రోజుల తరువాత సుఖంగా నిద్రలోకి జారుకుంటూంటే, జర్రున బుర్రలోకి జారి, నన్ను కొర కొర మిర్రి మిర్రి చూస్తూ, ఉలిక్కిపడి లేచేట్టు చేశాడు బ్రహ్మబుధ్.

ఇన్నిరోజులు ఏమై పోయావు నాయనా కాస్త ప్రశాంతంగా నిద్రపోయాను. మళ్ళీ ఏ సినిమా చూశావు నా ప్రాణం తీయటానికి, అని నేను అడిగే లోపలే బ్రహ్మ బుధ్ నోరు విప్పాడు.

నేను మిలియనీర్ కుక్కను చూశాను, అన్నాడు.

మిలియనీర్ కుక్కనా? కొంపతీసి నువ్వు సామ్యవాద భావజాల ప్రభావంలోకి వచ్చేయలేదు కదా! ధనవంతులందరినీ, దొంగలుగా, రక్తం పీల్చే జలగలుగా, నీచ్ కమీనే కుత్తేలుగా చూపించి, పేద ప్రజలకు సంతోషం కలిగించి, వారి దగ్గర డబ్బులతో లక్షలు గడించటం మా కళాకారులకలవాటు. పేదరికం చూసి మెచ్చుకుని, అవార్డులిచ్చి, తమ నేర భావనను  కడిగేసుకోవటం పెద్దలకలవాటు. అలా నువ్వు కూడా ధనవంతులమీద ద్వేషం పెంచుకున్నావా, మిలియనీర్ కుక్క అంటున్నావు, అడిగా.

నేను చూసింది మామూలు మిలియనీర్ కుక్కను కాదు. మురికివాడల కుక్క మిలియనీర్ ను చూశాను, అన్నాడు గంభీరంగా.

అదేమిటి? అడిగాను అయోమయంగా.

అదేమరి. అందరూ అద్భుతమని పొగడుతూంటే, అవార్డు పిక్చరంటూంటే పరుగు పరుగున పోయి చూశా.

అర్ధమయింది, ఒహో, ఆస్కారు ఆస్కారమున్న సినిమానా? చాలా గొప్ప సినిమాటకదా? ముంబాయి మురికివాడలను పంచరంగులలో పరమ రమణీయంగా చూపాడట కదా? ఈ సినిమాలో కనిపించినంత అందంగా ముంబాయి నిజంగా లేదని ఎవరో అన్నారు. ఇదా మీ చికాగో? అని ఇంకో ఫ్రెండడిగాడు. ముంబాయిలో మురికీఅడలు చూస్తేనే ఆర్ధిక ఇబ్బందులలో వున్న విదేశీయులకు సంతృప్తి కలుగుతుంది, తామింకా ఎంత దిగజారాలో తెలుస్తుందని ఇంకెవరో అన్నారు…..

ఇంకా ఏదో అనబోతున్న నన్ను కోపంగా చూశాడు బ్రహ్మబుధ్.

సినిమా చూసింది నేను. మాట్లాడుతున్నది నువ్వు. అన్నాడు.

నోరు మూసుకున్నా.

అదొక అధ్బుతమయిన మురికివాడ. దాన్లో అల్లరి పిల్లలు. మురికివాడల ముద్దుపిల్లలు, విమాన రోడ్డులో క్రికెట్ ఆడుతూంటే స్కూటర్ మీద పోలీసులు వెంబడిస్తారు. పరుగెత్తే పిల్లలను ఆ పోలీసులు అరగంట వెంబడిస్తారు. కానీ పట్టుకోలేరు. నిజానికి ఎంతో దగ్గర వుంటుందీ అద్భుతమయిన సన్నివేశం.

ఇద్దరు పోలీసులు ఒక్క పిల్లవాడిని కూడా పట్టుకోలేరా?

అతి సహజంగా నిజాన్ని ఉన్నదున్నట్టు చూపారీ సన్నివేశంలో.

ఏమిటీ నిజం?

మీ పోలీసులు పెద్ద పెద్ద టెర్రరిస్టులనే కాదు, చిన్న చిన్న పిల్లలను కూడా వేటాడి పట్టుకోలేరు. ఈ నిజం ప్రపంచానికంతా తెలుసు. ఇప్పుడీ సినిమాలో అది చూస్తున్నారు. అందుకే ప్రపంచానికి అంత పిచ్చి పడుతోంది.  ఆవెంటనే ఇంకో గొప్ప నిజం చూపారు. పాపం, అరగంట వేటాడిన తరువాత పిల్లలు దొరికితే పోలీసులు వదిలేస్తారు.

మరి అంత సేపు ఎందుకు వేటాడినట్టు? అడిగాను.

మరి ఆ సీను చూడగానే విమర్శకుల తల తిరిగిపోయివుంటుంది. పోలీసులెప్పుడూ పనికిరాని చేసులే చేస్తారన్న నిజాన్ని ఇంత గొప్పగా. అతి సహజంగా చూపినందుకు వారు ఉప్పొంగి పోయివుంటారు. అన్నాడు.

తరువాత? అడిగాను.

తరువాత ఈ సినిమాకే హైలటనదగిన దృశ్యం వస్తుంది. మన బాల వీరుడు, వీరోచితంగా, తడికల బహిర్భూమిలో వుంటాడు. వీరుడితో పాటు టాప్ ఆంగిల్ షాటులో వాడి క్రింద పచ్చగా పడివున్న మలాన్ని చూపుతాడు. ఎంతో సహజంగా, నిజానికి అతి దగ్గరగా వుందా సుందర మయిన సీను. తెరపైన ఆ సీను చూస్తూంటే, నాకయితే కొన్నేళ్ళు కడగని కక్కోసు వాసనతో హాలు నిండిపోయినట్టు అనిపించింది. కానీ ఒకటి మాత్రం నిజం, విదేశీ  కెమేరా కన్నులోంచి మాత్రం మలం కూడా అందమయిన మలాంలా కనిపించింది. అందుకే ఈ సినిమాకు ఉత్తమ చాయాగ్రహణం అవార్డు తప్పదు.

నాకేమనాలో తోచలేదు. నేనేమయినా అనేలోపలే బ్రహ్మబుధ్ మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఆతరువాత వస్తుంది పరమాద్భుతమయిన సీను. ఈ సినిమాలోకెల్లా ఉత్తమమయిన దృశ్యం. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ తీయలేనిది, ఇకపై ఎవరు తీసినా ఇంతబాగా తీయలేనిదీ అయిన సీనది.

ఊరించక త్వరగా చెప్పు. బ్రహ్మబుధ్ కి బహిర్భూమి దృశ్యాలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు వీడి ద్వారా, మన విమర్శకులకూ ఇలాంటి దృశ్యాలు ప్రీతి పాత్రమని తెలుస్తోంది.

మన బాల వీరుడు, వీరోచితంగా పోరాడుతూ, బయటకు వెళ్ళనని మారాం చేస్తున్న మలాన్ని అతి కష్టం మీద బయటకు తోస్తూంటే, అమితాభ్ బచ్చన్ అనే మరో గొప్ప వీరుడి హెలికాప్టర్ వస్తుంది. ఇది కూడా టాప్ ఆంగిల్ లో, క్రింద పచ్చటి మలం, పైన నుంచుని పిల్లవాడు ఆకాశాన్ని చూస్తూంటాడు. ఎంత ప్రతీకాత్మకమయిన సీనది? ఎన్నెన్ని తాత్విక భావాలకాలవాలమా సీను?  అయితే, అందరూ అమిత్ ను చూడాలని పరుగెత్తుతూంటే  మన హీరో తడికల మలాలయంలో బందీ అవుతాడు. కానీ అమిత్ ను చూడాలని ఆత్రం. అప్పుడేం చేస్తాడో తెలుసా?

ఏం చేస్తాడు.

బయటకు వెళ్ళేదారిలేక మల రంధ్రంలోకి దూకుతాడు. మల సముద్రంలో పడతాడు. వొళ్ళంతా మలంతో  అలాగే అమిత్ ను కలవాలని పరుగులు పెడతాడు. నాకయితే ఎ సినిమా దర్శకుడికి దర్శకత్వం రాదనిపించింది. లేకపోతే, ఇంత గొప్ప సన్నివేశంలో బాల వీరుడు, వొళ్ళంతా మలం అతుక్కుని అతిగొప్ప ప్రాకృతిక పెయింటు పూసుకుని పచ్చబంగారులోకం, నాదె కావాలి ఎల్లప్పటికీ, ప్రపంచమంతా పచ్చ పచ్చగా, పచ్చి పచ్చిగా పచ్చదనంతో పచ్చ పచ్చ లాడాలి, పచ్చబంగారులోకం అయిపోవాలీ ప్రపంచం, అని పాట పెట్టేవాడిని నేనయితే. ఆ పాటకోసం. మలం పూసుకున్న వెయ్యి మంది మురికి వాడల స్త్రీ పురుషులు నృత్యం చేస్తూంటే, ఆ మురికి వాడలలో పందులు వాళ్ళ వొంటిపయినుంచి మలాన్ని నాకుతూంటే, పేదరికాన్ని అతిదగ్గరగా చూపినట్టుండేది, అంత పేద రికంలోనూ వాళ్ళు ఆనందిస్తున్నట్టు చూపినట్టుండేది. కాస్త సెక్షప్పీలుకూడా వుండేది. కానీ అంత గొప్ప అవకాశాన్ని వదలుకున్నాడు దర్శకుడు. ఆ జాలితో విదేశీయులు ఈ సినిమాకు అవార్డులిస్తున్నారు. ఇదే మనవారయితే పాటలు పెట్టేవారు కదా!

నాకు నోట మాట రాలేదు. ఇదేమి సీను, ఇదేమి దృశ్యం? ఇదేమి కల్పన? కడుపులో తిప్పింది. వీడు చెప్తూంటేనే ఇలావుంటే ఇక చూసినవారికి ఎలావుండివుంటుంది? మన షారుఖ్ ఖాను, ఇతర హీరో హీరోయిన్లంతా ఎన్నారై సినిమాల్లో ధనవంతులు. విదేశీయులకు దీటుగా ఆడతారు. పాడతారు. మన ఆర్ధికాభివృద్ధిని చూపుతారు. దేశంలో అంతా డబ్బులతో కళకళ లాడుతూ ప్రేమించేస్తున్నట్టు  చూపుతారు. అది చూసి కుళ్ళుకునే విదేశీయులకు ఈ మలం దృశ్యాలు సాంత్వననిచ్చి వుంటాయి. పర్లేదు, మనం ఎంత దిగజారినా ఇండియన్లు మనకన్నా కిందేవుంటారన్న భరోసానిచ్చివుంటుందీ సినిమా. అందుకేనేమో వాళ్ళు సంతోశంతో ఇంతగా ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నారు.

అప్పుడే ఏమి చూశావు. ఆ మలంతో వాడలాగే అమిత్ ను చేరుకుంటాడు. అమిత వాడికి ఆటోగ్రాఫిస్తాడు. ఇక్కడకూడా ఆ పిల్లవాడు అమిత్ తో పాటపాడినట్టు పెడితే బాగుండేది. అమిత్ కూడా ఆనందించేవాడు.

బ్రహ్మబుధ్ దయవుంచి ఆపు. నాకింక వినాలని లేదు. బ్రతిమిలాడుకున్నాను.

ఏమిటీ, నిజాన్ని భరించలేవా? ఉన్నదున్నట్టు చూపితే ఉలుకెక్కువా? పేదవారి మురికివాడలను చూపితే మీకు అసూయనా? నిజానికి దగ్గరగా వుండాలని ముద్దులు, పడకగది పనులు ఉన్నవి ఉన్నట్టు చూపితే లేని అభ్యంతరం ఇలాంటి పేదల మల ప్రదర్శన దృశ్యాలకు ఎందుకు వస్తుంది? మీరంతా హిపోక్రట్లు. ఈ సినిమాలో ఈ ఒక్క సీనేకాదు, మిగతా సీన్లన్ని ఎంత సహజంగా వున్నాయి తెలుసా, రైల్లోంచి క్రిందపడిన పిల్లలు తాజ్ మహల్ చేరతారు. చెప్పులెత్తుకుపోతారు. గైడ్లవుతారు. చదువురాదు కానీ, ఇంగ్లీషు మాట్లాడేస్తారు. తుపాకులు పట్టుకుని కాలుస్తారు. అబ్బో నిజానికి అతి దగ్గరగా సహజత్వమంటే ఇదే అన్నట్టున్న ఈ సినిమాలో మురికివాడ్ల మలాన్ని చూపితే అభ్యంతరపెట్టటం నీ కుళ్ళిన జాతీయ భావాల సంకుచితాన్ని సూచిస్తుంది. అందుకే, నేనిక నీకు కథ చెప్పను. గొప్పపనులెలాగో చేయలేవు. వేరే వాడు గొప్ప పని చేస్తే చూసి ఆనందించలేవు. కుళ్ళు బోతువు. అని అరిచాడు.

నాకీ సినిమా గురించి చెప్పొద్దు. గట్టిగా అరిచాను.

అయితే ఫో. పచ్చబంగారులోకం, నీకె కావాలి స్వంతం అని పాడటం మొదలుపెట్టాడు.

అది నా భ్రమనో, నిజమో తెలియదు కానీ నా మెదడంతా వెయ్యి సెప్తిక్ టాంకులు నింది పొంగి పొర్లుతున్న భావన కలుగుతోంది.

February 2, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ

బ్రహ్మబుధ్ అవార్డు సినిమాలు చూశాడు-3

హాలీవుడ్ సినిమా ప్రస్తావన తెస్తూనే బ్రహ్మ బుధ్ సీరియసయిపోయాడు. అసలు సినిమాలెందుకు తీస్తారు? అనడిగాడు.

నాకు కంగారుగా అనిపించింది. కడుక్కోని కక్కోసును చూపిన అద్భుత నటనని చూసి, అనుభవించి ఆనందించిన వీడు, హాలీవుడ్ లో ఏ సినిమా చూశాడో, దాన్లో ఏమేమి అర్ధాలు తీస్తాడో అని భయం వేసింది. పండిత సభలో, మూర్ఖుల సమక్షం లో మౌనం భూషణం అన్నారు పెద్దలు. కాస్త పెద్దలను గౌరవించే బూజు పట్టిన పాత భావాలవాడిని కాబట్టి వారి మాటను పాటించాను. మౌనంగా వుండిపోయాను.

నేనెంత సేపటికీ మాట్లాడకపోయేసరికి, బ్రహ్మబుధే అన్నాడు, సినిమాలు తీసేది అందరూ చూడటానికే కదా?

తలవూపాను.

మరి ఎవరికీ అర్ధం కాకుండా తీస్తే అర్ధం ఏమయినావుందా? అలాంటి సినిమాకు అవార్డిస్తే, అర్ధం కాకుండా తీయటమే ఉత్తమము అని ప్రోత్సహించినట్టవుతుందికదా?

ఇంతకీ నువ్వుచూసిందే సినిమా? ఏమేమి అవార్డులొచ్చాయి? అడిగాను.

నాకదంతా తెలియదు. నేను పరిషోధించి, విమర్శకులు గొప్పగా పొగిడిన జాబితాను తయారుచేసాను. దాన్లో అందరూ ఈ సినిమాను గొప్పగా పొగిడారు. అందుకని చూశాను.

ఏమిసినిమా అది? ఎలావుంది? అడగకుండా వుండలేకపోయాను.

ఆ ఆ ఆహ్ అగ్రు అక్రుప్తిదుఏక్ఫ్జ్ద్ హ్ఫ్ఫ్గిఉగ్ద్జ్ కపీసిపీతుపీలేఅకొచివ్త్రెంద్క్స్ల్

నాకు భయం వేసింది. వీడేభాషలో మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. వాడికేమయిందో అర్ధం కావటం లేదు.

భయం భయంగా వాడి వైపు చూస్తున్న నన్ను చూసి నవ్వాడు.
భయపడకు. నాకేమీ కాలేదు. ఇప్పుడు నేనన్న మాటలలోంచి అర్ధాలు వెతుకు. ఆఙ్నాపించాడు.

వొద్దు బాబూ అంత శిక్ష వేయకు. బ్రతిమిలాడాను.

అలావుంది సినిమా. దాన్లో అర్ధాలు వెతుక్కోవాలి. అందుకే అవార్డులు, ప్రశంసలూనేమో. అవార్డివ్వకపోతే సినిమా అర్ధం చేసుకునే తెలివి లేదని ఒప్పుకోవాల్సి వస్తుంది. తెలివి లేదని ఎవరు ఒప్పుకుంటారు. నీలాంటి మూర్ఖుదు తప్ప అన్నాడు. పక పక నవ్వి, చెప్డికు పుప్డికుం దిప్డికు డప్డికు, డప్ డప్ లుప్ చుప్ కప్ సుప్ టప్ టుప్ త్ర్ర్ర్ గ్ర్ర్ర్ మీఎ లీ లూఒ వ్త్రెక్

చేతులు జోడించాను. నాయనా, నన్నెందుకిలా చంపుతావు. నువ్వసలు భూమ్మీదకు వచ్చింది రీసెర్చ్ చేయటానికా, నన్నిలా చంపటానికా? అడిగాను దీనంగా.

నేను రీసెర్చే చేస్తున్నాను. మీ మానవ మనస్తత్వాన్ని తిరిగి వెతుకుతున్నాను. ఇప్పుడు చూడూ, ఆ అర్ధం కాని సినిమాలో అర్ధాలున్నాయని ఒకడు గొప్ప సినిమా అనగానే, కాదంటే ఎక్కడ తనని మూర్ఖుడంటారో నని ప్రతివాడూ దాన్ని గొప్ప సినిమా అని తన తెలివిని నిరూపించేసుకుంటున్నాడు.

నాయనా ఆ సినిమా ఏమిటో త్వరగా చెప్పి చంపు. నీ అనాలిసిస్ లతో నన్ను ఇలా ఉప్పు పాతర వేసి, కొంచెం కొంచెం కొరుక్కు తినకు. అదేదో సినిమాలో కొరుక్కుతినమని అడిగిన హీరోయిన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని కొరుక్కు తిను అన్నాను దాదాపుగా ఏడుస్తూ.

నేను చూసిన సినిమా పేరు పిప్పి కల్పన. కనీసం పిప్పిలోనయినా కాస్త రసముంటుంది. లేని రసాన్ని కల్పించుకుని చూడమని పేరులోనే చెప్పేస్తున్నాడు. అందుకని లేని రసాన్ని ఊహించి, నోరూరి, పొగిడేస్తున్నారేమో, అన్నాడు.

పిప్పి కల్పనా? అదేమి సినిమా.

నా మాట విన్నట్టు లేడు. చెప్తూపోయాడు.

ఒక హోటల్ లో ఇద్దరు కూచుంటారు. వాళ్ళెవరో మనకు తెలియదు. హఠాత్తుగా ఆ హోటల్ లో దొంగతనం చేయాలనుకుంటారు.

ఆగి నా వైపు కోపంగా చూశాడు.

అంతే. ఆ తరువాత ఇద్దరు వీరులు నడుస్తూ, అర్ధం లేని మాటలు మాట్లాడుతూ ఒక గదిలో దూరి ఒకడిని చంపేస్తారు.

ఇంకా కోపంగా చూశాడు.

అంతే, హఠాత్తుగా ఒక బాక్సరు కథ వస్తుంది.

ఇంకింకా కోపంగా చూశాడు.

మళ్ళీ ఒక వీరుడు వీరి డాన్స్ చేస్తారు. ఆమె ఏదో చేస్తే ముక్కులోంచి రక్తం వస్తుంది. ఆమెని తీసుకెళ్ళి గుండెలో సూది గుచ్చగానే లేచి అరుస్తుంది,

ఇమికింకింకింక కోపంగా చూశాడు.

హఠాత్తుగా ఎవడో వచ్చి పిల్లవాడికి గడియారమిస్తాడు. మళ్ళీ బాక్సరు చపుతాడు. పరుగెత్తుతాడు. ఎవడో పట్టుకుంటాడు. ఏదో చేస్తాడు. వాడు, ముందు వీరులలో ఒకడిని కాల్చేస్తాడు.

ఇంకికంకికంకింకికంక కోపంగా చూశాడు.

ఆ చచ్చిన వీరుడు ముందు వీరుడితో కలిసి మళ్ళీ చంపితే ఇంకెవడో వస్తాడు.వీళ్ళిక్కెవరినో పిలుస్తారు. ఇంకేవరో వస్తారు. మళ్ళీ హోటల్ లో దొంగ తనం దగ్గరికొస్తారు, ఆగి నావైపు చూసాడు.ఇదీ సినిమా.

అది చాలా గొప్ప సినిమా. నీకర్ధం కాలేదు, అన్నాను ధైర్యం చిక్కబట్టుకుని.

నవ్వాడు. సినిమా చూసి బయటకు వస్తూంటే, నన్నొకడు అడిగాడు. ఒక వీరుడిని బాత్రూంలో కాల్చి చంపాడు కదా. వాడు మళ్ళీ వచ్చాడేమిటి, అని. అని నవ్వాడు.

ఆ సినిమా నీకు అర్ధం కాలేదు. దాని గురించి బోలెడన్ని చర్చలు జరిగాయి. బోలేడంత మంది స్ఫూర్తి పొందారు. అది చూసి జీవితమంటే ఏమిటని చర్చించారు. తాత్వికులయ్యారు, ఇంకా ఏదో చెప్ప బోతున్న నావైపు బ్రహ్మ బుధ్ కోపంగా చూస్తూంటే ఆగిపోయాను.

ద్ఫక్ష్స్గ్గ్ద్.క్జ్స్జ్గొప్యుహ్/క్లుయ్తుక్ల్న్మ్.ం ం,చ్కంగ్ఫ్స్రిళ్ బ్ద్ఫ్గ్ఘ్ల్క్  పౌక్గ్మ్  బ్ఫ్గ్స్ద్య్త్య్ల్గ్ ప్క్ఝ్బ్వ్ వ్ద్ఫ్బ్మిహ్ల్బ్త్గ్చ్క్హ్రొబ్ఫె జ్ఫ్ఘిప్[ప్ ంగ్ర్ద్ఫుఇక్మ్

వొద్దు చాలు చాలు, అరిచాను. ఏడ్చాను. జుట్టు పీక్కున్నాను.

శాంతించాడు. నేనన్న పై మాటలలో బోలెడన్ని అర్ధాలున్నాయి. అవి వెతికి, అర్ధం చేసుకుని నాకు చెప్పు. అప్పుడు నేను మళ్ళీ ఆ సినిమా చూసి అర్ధాలు వెతుకుతాను. లేకపోతే నా అక్కసు తీరే దాకా కక్కోసు వీరుడి చక్కని చిక్కని టక్కరి, టిక్కరి నటన నా అక్కసు తీరే దాకా చూడాల్సిందే. లేకపోతే, నేనన్న మాటలు నీ చెవుల్లో మారు మ్రోగుతూనేవుంటాయి, అన్నాడు. నా మెదడులో తిష్ట వేశాడు.

alien-410
alien-48alien-49

January 23, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ