Archive for the ‘pustaka paricayamu’ Category

మృత్యులోయ-పుస్తక పరిచయం.

బాల్యంలో వినే అద్భుతమయిన సాహస గాధలు, మాయ మంత్ర తంత్రాల కథలు పిల్లల్లో కథలపట్ల ఉత్సాహం కలిగించటమే కాదు, వారి సృజనాత్మకతకు రెక్కలనిస్తాయి. వారిని ఒక ఊహాత్మక ప్రపంచంలో విహరింపచేస్తాయి. వారి వ్యక్తిత్వానికి ఒక దిశ నిస్తాయి. 1950 నుంచి 1980 వరకూ తెలుగు పిల్లల ఊహల ఎదుగుదలలో అత్యంత ప్రధాన పోత్ర పోషించాయి, చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటి పత్రికలు. ఇప్పుడవి లేని లోటు, లేకపోవటం వల్ల దుష్పరిణామాలు తెలుస్తున్నాయి. ఈ పత్రికల ద్వారా, తానెవరో ఎవరికీ తెలియకున్నా, తన రచనల ద్వారా కొన్ని తరాలకు ఊహలుపోసిన మహా రచయిత అౙ్నాతంగా మని ౙ్నాతంగా లేని తెలుగు జాతి మేలు రచయిత దాసరి సుబ్రహ్మణ్యం.

అద్భుతమయిన కథనంతో అందమయిన రంగు రంగుల బొమ్మలతో చదివేవారికి వర్తమానంలో మరో ప్రపంచ విహారాన్ని కలుగచేసి, భవిష్యత్తుకు వెంటాడే స్మృతుల సమాహారాన్ని అందిస్తాయి ఆయన రచనలు. 1954 లో తోక చుక్కతో ఆరంభమయిన ఆయన రచనలు మూడు దశాబ్దాలపాటు బాలల ఆలోచనల లోకాలకు ఊహలు నేర్పాయి. 1971-74 ప్రాంతంలో బొమ్మరిల్లు పత్రికలో ధారా వాహికంగటి తరం కోల్పోతున్నది స్పష్టం చేస్తుంది.

అద్భుతాలతో నిండినా ఈ రచనలో తర్కానికి ప్రాధాన్యం వుందని, గగుర్పాటుకు గురి చేస్తూ, ఉత్కంఠను రేకెత్తించే ఈ సాహస కథ అడుగడుగునా వ్యంగ్య చతురోక్తులతో అలరించటం దాసరి ముద్ర అని ముందుమాట మరో ప్రపంచంలో వసుంధర వ్యాఖ్యానించారు. మృత్యులో ప్రచురణ మజిలీ గురించు రచన శాయి నాలుగు మాటలు రాశారు. మృత్యులోయ కు బొమ్మలు గీసింది ఎం కే బాషా, ఎం ఆర్ ఎన్ ప్రసాద రావులు. ఈయన సామాన్యుడు కాదంటూ పుస్తకం చివరలో దాసరి వేంకట రమణ రాసిన వ్యాసం పుస్తకానికి వన్నె తెచ్చింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా వివరించటమే కాదు, పుస్తక తయరీ వెనుక వున్న తపన, పట్టుదల అభిమానాలను చేరువ చేస్తుంది.

పుస్తకాన్ని రూపొందించిన విధానం, బొమ్మరిల్లు పత్రికకు మల్లే పేజీలు మేకప్ చేయటం, అట్టలలోనూ బొమ్మలుంచటం ఈ పుస్తక పఠనానుభవాన్ని గతం నాటి మధుర స్మృతుల బాటలో మరోసారి ప్రయాణింప చేస్తుంది. మన తెలుగు సాహిత్యంలో సృజనాత్మకత ఏ స్థాయిలో దిగజారిందో, మన తరువాత తరాలు ఎందుకని క్యూలుకట్టి మరీ హారీ పోటర్లు చదువుతూ తెలుగు సాహిత్యాన్ని విస్మరిస్తున్నారో స్పష్టంగా బోధపరుస్తుందీ పుస్తకం.

పెద్దలు పిల్లలయి తాము చదువుతూ, పిల్లలకు చదివి వినిపిస్తూ వారి బాల్యాన్ని అర్ధవంతం ఆనందమయం చేయటానికి తోడ్పడుతుందీ పుస్తకం. తప్పకుండా కొని ఇంట్లో పెట్టుకుని, పదే పదే చదువుతూ ఆనందిస్తూండాల్సిన పుస్తకం ఇది.

మృత్యులోయ, 312 పేజీలు
వెల రూ. 150/-
ప్రతులకు
వాహిని బుక్ ట్రస్ట్, 1-9-286/3, విద్యా నగర్, హైదెరాబాద్-44
మంచి పుస్తకం, 12-13-450, స్ట్రీట్ నం.1, తార్నాక. సికెందెరాబాద్-17, ఫోన్; 9490746614.
అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు.

April 17, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

మా కథలు 2012-పుస్తక పరిచయం.

దశాబ్దాలుగా తెలుగు పత్రికలలో కథలు వెలువరిస్తూ, పాఠకుల ఆదరాభిమానాలు పొందుతూ, చక్కని గుర్తింపు సాధించికూడా, అనేక కారణాలవల్ల ప్రతి సంవత్సరం ఉత్తమ కథలను ఎంపిక చేసే సంకలనాలలో స్థానం పొందని సుప్రసిద్ధ రచయితలు, సంకలన కర్తల దృష్టిదోషాలవల్ల తమ కథలు ఎట్టి పరిస్థితులలో సంకలనాలలో చోటుచేసుకోవని అర్ధంచేసుకున్నారు. కానీ, ఎలాగయినా ఏదో ఒక సంకలనంలో తమ కథను చూసుకోవాలన్న అభిప్రాయంతో, ఎవరూ తమ సంకలనాలకు తమ కథను ఎంచుకోకపోతే, తామే ఒక కథల సంకలనాన్ని తయారుచేసి తమకథలను ప్రచురించుకోవాలని తెలుగు కథ రచయితల వేదికగా ఏర్పడ్డారు. 2012లో వివిధ పత్రికలలో ప్రచురితమయిన తమ కథలలోంచి తామే ఉత్తమమయిన దానిగా భావించిన తమ కథనొక్కొక్కదాన్ని ఎంచుకుని, మా కథలు 2012 పేరిట ఒక కథల సంకలనాన్ని వెలువరించారు. సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ ఆలోచనలు పంచే 30 కథల సమాహారంగా ఈ సంకలనన్ని తీర్చి దిద్దారు.

కన్నెగంటి అనసూయ, ఎలక్ట్రాన్, కేబీ కృష్ణ, పి. చంద్ర శేఖర ఆజాద్, అంబళ్ళ జనార్ధన్, తిరుమలశ్రీ, దాట్ల దేవదానం రాజు, గన్నవరపు నరసిమ్హ మూర్తి, మంజరి, కే.మీరాబాయి, గంటి భానుమతి, మంథా భానుమతి, ఆకునూరి మురళీ కృష్ణ, గుమ్మడి రవీంద్ర నాథ్, రాచపూటి రమేష్, వడలి రాధా కృష్ణ, వేదగిరి రాంబాబు, జియో లక్షణ్, వాణిశ్రీ, కోపల్లె విజయ ప్రసాద్, అత్తలూరి విజయలక్ష్మి, పొత్తూరి విజయ లక్ష్మి, శరత్ చంద్ర, సలీం, సిమ్హ ప్రసాద్, ఎం. సుగుణారావు, చెన్నూరి సుదర్షన్, సమ్మెట ఉమాదేవి, రసరాజు, మంత్రవాది మహేశ్వర్ వంటి 30 కథకుల కథలున్నాయీ సంకలనంలో.

2012లో ప్రచురింపబడిన తమ కథలలో ఉత్తమమైనదినిర్ణయించుకునే స్వేచ్చ ఆయా రచయితలదేననీ, వారే కథలను ఎన్నుకుని పంపారని, ఇందులోని 30 కథలు, వివిధ సమస్యల్ని ప్రతిబింబించాయని, ఈ కథల ద్వారా, రచయితలు సమాజాన్ని ఏరకంగా చూస్తున్నారు, వారు ఎన్నుకున్న వస్త్వులు ఎలా వుంటున్నాయి, కథన రీతులు ఏ రకంగా వున్నాయి అని పాఠకులు, విమర్శకులు పరిశీలించటానికీ సంకలనం దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ప్రచురణ కర్తలు మామాట అనే ముందుమాటలో వ్యక్తం చేశారు. తెలుగులో పాఠకులు తగ్గిపోతున్న తరుణంలో పుస్తకం కొని చదవటాన్ని ప్రోత్సహించటానికి అతి తక్కువ వెలకీ పుస్తకాన్ని అందించామనీ, పాఠకులు ప్రోత్సహిస్తారన్న విశ్వాసాన్నీ వారు ప్రకటించారు.

తెలుగు పాఠకులపై తెలుగు కథా రచయితలుంచిన విశ్వాసాన్ని నిలపుకోవాల్సిన బాధ్యత తెలుగు పాఠకులదే.

మా కథలు 2012, పేజీలు, 258
వెల రూ. 99/-
ప్రతులకు
సీ హెచ్ శివ రామ ప్రసాద్
స్వగ్రు మెంట్స్ సీ బ్లాక్
ఫ్లాట్ నం. 2, భాగ్య నగర్ కాలనీ
కూకట్ పల్లి, హైదెరాబాద్-72.
ఫోన్-9390085292.

అన్ని ప్రధాన పుస్తక విక్రయకేంద్రాలు.

April 16, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

హిందూ మహా యుగము-పుస్తక పరిచయము.

సుమారు నూరేళ్ళ క్రిందట ప్రచురితమయిడున పుస్తకం విడులయినప్పటినుంచీ అయిదు సంవత్సరాలపాటూ వరుసగా ప్రతి సంవత్సరం ఒక నూతన ముద్రణకు నోచుకుంది. అత్యంత ఆశ్చర్య కరమయిన విషయం ఇది. కానీ, 1907 వ సంవత్సరంలో తొలిసారిగా విడుదలయిన ఆ పుస్తకం ఈనాటికీ ప్రామాణికంగా వుండటమే కాదు, అనేక విలువయిన అంశాలతో వుంది. అందుకే, ఈ గ్రంథాన్ని ఆ కాలంలో తెలుగువారు ఎంతో ఆదరించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు రచించిన , హిందూమహాయుగము అను హిందూ దేశ కథాసంగ్రహము అనే అత్యుత్తమ చారిత్రిక గ్రంథం 2002లో మళ్ళీ ముద్రణకు నోచుకుంది. అయోధ్య నుండి లంకకు శ్రీ రాముడి పథ సంచార పటంతో కూడిన ఈ పుస్తకం అత్యంత ఆసక్తి కరమయినదే కాదు ఎంతో ప్రధాన్యం కలది కూడా.
లక్ష్మణరావు ఏ రచన చేసినా దానికి దేశ భక్తి కారణము, ప్రేరణము, వస్తునిష్ఠ ప్రధానంగా వుండేదని వారి జీవిత విశేషాలను తెలియ చేసే వ్యాసంలో అక్కిరాజు రమాపతి రావు గారు రాశారు. తిరోగమన భావాల నుంచి దేశం బయట పడి, తన మతం, తన సంస్కృతి పురోగమనం సాధించాలని, సాటి దేశాలలో మన దేశం తల ఎత్తుకుని గౌరవ స్థాయి సముపార్జించుకోవాలన్న ఆశయంతో ఆయన రచనలు చేశారన్నారు. భారత దేశ చరిత్రలో హిందువుల అవివేకం వల్ల, అనైకమత్యం వల్ల, స్వార్ధ పరత్వం వల్ల, సాటి వారిని చూసి ఓర్వలేని తనం వల్ల, ఈర్ష్య వల్ల తమ సర్వనాశనం ఎలా సిద్ధింప చేసుకున్నారో హిందూ మహా యుగంలో ప్రస్తావించారు. నిష్పక్షపాతమయిన దృష్టితో, జిమ్న్యాసతో, ప్రచీన భారత దేశ చరిత్రను తెలుసుకోగోరేవారికి ఇది ప్రామాణికమయిన, సంగ్రహమయిన, సాధికారికమయిన గ్రంథం. ఇది రచితమయిన నూరేళ్ళ తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగటం ఆశ్చర్యమని ఈ పరిచయంలో అక్కిరాజు రమాపతి రావు వ్యాఖ్యానించారు.
ఈ పుస్తకం రచించిన నాటికి మొహెంజొదారో, హరప్పాల గురించి తెలియదు. అయినా, వేదకాలం, క్షాత్ర కాల హిందూ సంస్కృతి, మేధా వైభవం, పరాక్రమం, సాంఘిక జీవనం ఎంతో ఆసక్తి కరంగా వర్ణించారని, సంగ్రహంగా శడ్దర్శనాల గురించి చెప్పారనీ, రాముడు అయోధ్యనుంచి లంక వరకూ జరిపిన ప్ర్యాణాన్నీ ఈ పుస్తకంలో వర్ణించారనీ, ఈ గ్రంథం, భారతీయులకు కావలసిన జాగృతిని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, దృఢ సంకల్పాన్ని సమకూర్చగలదని తమ విశ్వాసమని ప్రకాశకులు విమ్నప్తిలో పేర్కొన్నారు.
లక్ష్మణ రావు నేటి సామ్య వాదుల చరిత్ర రచనా ధోరణిలా కాక ఆనాటికి జరిగిన పరిశోధనల ఆధారముగా నిశ్పక్షపాతంగా చరిత్రను రాశారని ఆమోదంలో శివానంద మూర్తిగారు తెలిపారు.
ఈ పుస్తకంలో మొత్తం 6 ప్రకరణాలున్నాయి. మొదటి ప్రకరణము హిందూ దేశము అందలి జనులు, రెండవ ప్రకరణము, ఋగ్వేద యిగము, మూడవ ప్రకరణము, క్షాత్ర యుగము, నాల్గవ ప్రకరణము, సూత్ర యుగము, అయిదవ ప్రకరణము, బౌద్ధ యుగము, చివరి ప్రకరణము పౌరాణిక యుగము.
ఆయన రాసినంత కమనీయంగా ఇంతవరకూ తెలుగులో చరిత్ర పుస్తకం రాలేదు. ఈ వంద ఏళ్ళలో ఎవరూ ప్రాచీన భారత దేశ చరిత్ర రాయలేదు. వేదకాలం నుంచి ముఘల్ సామ్రాజ్యం వరకూ ఒక ఆసక్తికరమయిన నవల లాగా వారు రచించారు. ఆయన రాసిన భారత దేశ చరిత్ర గ్రంథాలలో ఇది మొదటిది. చరిత్ర పట్ల ఆసక్తి కల ప్రతిఒక్కరు తప్పకుండా కొని చదివి భద్రపరచుకుని, పదిమందికీ చెప్పాల్సిన గ్రంథం ఇది.
హిందూ మహాయుగం అను హిందూ దేశ కథా సంగ్రహము.
సంపాదకుడు- అక్కిరాజు రమాపతి రావు.
పేజీలు-250. వెల; రూ 100/-
ప్రతులకు
ప్రధానమయిన పుస్తక విక్రయ శాలలన్నీ
అక్కిరాజు రమా పతి రావు, 2-2-18/47, బి-20, ఫ్లాత్ నం; 104, శ్రీ సాయి క్రుపా రెసిడెన్సీ, డి డి కాలనీ, హైదెరాబాదు-13.
ఫోను; 040-27602352.

April 13, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

ఆనందం-బాల కథల సంపుటి-పుస్తక పరిచయం.

కథలు పిల్లల్లో ఆలోచనలను కలిగిస్తాయి. వారి వ్యక్తిత్వాన్నితీర్చి దిద్దుతాయి. వారిలో చైతన్య దీపాలు వెలిగిస్తాయి. గత మూడు దశాబ్దాలుగా చందమామ పత్రికలో క్రమం తప్పకుండా కథలు రాస్తూ బాలల సాహితీ సేవ చేస్తున్న దాసరి వేంకట రమణ రచించిన 22 బాల కథల సంపుటి ఆనందం.
ఈ సంపుటిలో మొత్తం 22 కథలున్నాయి. ఆనందం, తెలివైనవాడు,సుప్రతీకుడి ప్రశ్నలు, మేలు కుట్టిన దొంగ, రూపాయి సమస్య, అసూయ, ఉత్తముడు, గానుగెద్దు-గంగిరెద్దు, తండ్రికానుక, కూర్మావతారం, ఆటలో ఆనందం, నమ్మకం వంటి కథలున్నాయి. వీటిల్లో, ఆనందం, సుప్రతీకుడి ప్రశ్నలు, కూర్మావతారం, ఆటలో ఆనందం, లోకనాథుడి పాండిత్యం, త్రిధాముడి కల, మేలుకుట్టిన దొంగ అనే ఏడు కథలు, విజయవాడ దగ్గరలో వున్న ఒక స్కూలులో పాఠ్యాంశాలుగా ఎంపికయ్యాయి.
దాసరి వేంకట రమణ గారి కథలు ముచ్చటగా వున్నాయని రావూరి భరద్వాజగారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక బాల సాహిత్యంలో దాసరి గారి విశిష్ట స్థానాన్ని ఈ సంపుటి బలపరుస్తుందని వసుధర వ్యాఖ్యానించారు. బాలసాహిత్య పరిషత్ ప్రచురించిన తొలి పుస్తకం ఇదని చొక్కాపు వేంకట రమణ గారన్నారు.
అందమయిన ముఖచిత్రంతో, లోపల చక్కని బొమ్మలతో వున్న చక్కని బాల కథల సంపుటి ఆనందం.
పేజీలు 120, వెల రూ100/-
ప్రతులకు
బాల సాహిత్య పరిషద్, 5-5-13/పి-4
క్రాంతి హిల్స్, సుష్మా థియేటర్ పక్కన
వనస్థలిపురం, హైదెరాబాద్-70
ఫోన్; 040-24027411.
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో లభ్యం.

April 12, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

షడ్రుచులు, తెలంగాణా వంటలు-పుస్తక పరిచయం.

366 New Likes
383 Talking About This
10,117 Weekly Total Reach
ఆరంభించినప్పుడు ఇంతగా స్పందన వుంటుందనుకోలేదు. ఈ అభిమానం చూశాక బాధ్యత పెరిగింది. ఇంతమంది తెలుగు పుస్తక ప్రేమికులున్నారని, కొత్త తెలుగు పుస్తకాలకు సంబంధించిన సమాచారం కోసం ఇంతగా ఎదురుచూస్తున్నారనీ ఇప్పుడే తెలిసింది. చినుకులా ఆరంభమయి, వర్షమయి,వడగళ్ళవానయి, కుంభవృష్టి అయి, జల ప్రళయమయినట్టు, తెలుగు పుస్తకాలపయిన ఆదరణ ఇంతింతయి, ఇల అంతవ్వాలని ఆశిస్తున్నాను. గమనిస్తే, లైకుల ద్వారా తమ అభిమానాన్ని చూపిన వారిలో కేవలం ఒక శాతం మాత్రమే రచయితలు, సాహిత్యానికి సమబంధించిన వారు మాత్రమే. మిగతావారంతా పాథకులే. అంటేనే తెలుగు పత్రికలు, విమర్శకులు, రంగుటద్దాల సహిత్య హంతకులు, మాఫియా ముఠాల వల్ల ఎంతగా తెలుగు సాహిత్యం, భాష, పుస్తకాలు దెబ్బతింటున్నాయో. ఇది చూసయిన తెలుగు పుస్తకాన్ని ఒక వైభవాత్మకమయిన స్థానానికి చేర్చటం కోసమయినా సంకుచితాలు, సంకోచాలు వదలి సామాన్యులమంతా ఒకటవుదాం. మాఫియా ముఠాలు, రంగుటద్దాలు, హై బ్రో విమర్శకులను వారి దారికి వదలి మన దారిలో మనం ప్రయాణిద్దాం.

అప్నీ మంజిల్ సచ్ కీ మంజిల్, అప్నా రస్తా నేక్ ( మన గమ్యం సత్యం, మన దారి స్వచ్చం) అని పాడుకుంటూ ముందుకు సాగుదాం.

****************************************************************

రుచి అన్నది నాలికకు మాత్రమే పరిమితం, గొంతు దిగిన తరువాత రుచి లేదు, పచి లేదు అంటారు. కానీ, రుచి భావనను ఇనుమడించి, మెదడులో ఒక ఆనందకరమయిన భావన కలిగించటంలో వంట కనిపించే విధానం, ఘుమఘుమలు ప్రధాన పాత్రవహిస్తాయి. అంటే కన్ను, మెదడు, నాలికల మధ్య సమన్వయం వల్లనే సంతృప్తి ఆనందాలు కలుగుతాయన్నమాట. అందుకే, వంట, వండిన పదార్ధాలను అందంగా కూర్చటం కూడా ప్రధానమయిన కళలుగా గుర్తింపు పొందుతున్నాయి. ఆ కళల్లో ఒకటయిన వంటల తయారీ గురించి తెలిపే పుస్తకం, తెలంగాణా వంటలు.

ఈ పుస్తకాన్ని రచించిన జ్యోతి వలబోజు, సరయిన పనిముట్లు , కొద్దిగా ప్రోత్సాహం దొరికితే ఒక స్త్రీ పట్టుదలతో సాధించగల విజయానికి ఒక నిలువెత్తు ఉదాహరణ అని తెలంగాణా వంటలు పుస్తకానికి ఒక చిన్నమాట రాసిన ఎస్.నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

జ్యోతి గారిలో ఇన్వెంటివ్ మైండ్ ని మనం గమనించవచ్చు అంటారు మల్లాది తన మల్లాది మాటలో. ఒక కొత్త వంటకాన్ని కనిపెట్టేవారే మానవాళికి మేలు చేస్తున్నారని, అలాంటి వారిలో జ్యోతి గారొకరనీ ఆయన రాశారు.

నామాటలో రచయిత్రి, మా ముందు తరానికి, నా తరానికి చెందిన తెలంగాణా ప్రాంతపు సాంప్రదాయకమయిన వంటకాలకు అక్షర రూపమిచ్చి అందమయిన పుస్తకంలా తయారుచేసి రాబోయే తరానికందివ్వాలన్న కోరిక వల్ల ఈ పుస్తకం రూపొందిందని రాశారు. అట్ట వెనుక తన మాట రాస్తూ సీ ఉమాదేవి, తను పుట్టిపెరిగిన తెలంగాణా ప్రాంతపు శాకాహారపు రుచులను ఏడాది కాలంగా ఎంతో శోధన చేసి పుస్తక రూపంగా అందించారని పేర్కొన్నారు.

ఇంత మంది ఇన్ని రకాలుగా ప్రశంసించిన ఈ పుస్తకంలో మొత్తం 288 పేజీల్లో, 267 రకాల వంటకాల తయారీ పొందుపరచి వుంది. పసందయిన మెనూ పేరిట, వంటల వర్గీకరణ వివరాలున్నాయి. ఇందులోని వంటలను స్వీట్లు, నాస్తా, పప్పులు, పచ్చళ్ళు, కూరలు-పులుసు-అన్నం అనే 4 వర్గాలుగా విభాగించారు. స్వీట్లలో మొత్తం 41 రకాల స్వీట్ల తయారీని తెలిపారు. 55 రకాల నాస్తాల తయారీ వివరణ వుంది. 26 రకాల పప్పులున్నాయీ పుస్తకంలో. 41 రకాల పచ్చళ్ళ తయారీలున్నాయి. కూరలు పులుసు అన్నం విభాగంలో 104 రకాల వంటకాలను పలు ఉప విభాగాలలో పొందుపరచారు. టమాట, వంకాయ, ఆలుగడ్డ, బీరకాయ, సెనగపప్పు, ఆనపకాయ, బెండకాయా లతో సహా మొత్తం, 21 రకాల కాయలతో 91 రకాల వంటలున్నాయి. 6 రకాల చారులు, 7 రకాల అన్నాలూ వున్నాయి. పుస్తకం చివరలో 8 రంగుల పేజీల్లో కొన్ని వంటకాల బొమ్మలూ వున్నాయి. ఇల షడ్రుచులను అందంగా అందించిన ఈ పుస్తకం కొన్నవారి ఇళ్ళల్లో నిత్యం రుచికరమయిన వంటలే. ఇక ఆలస్యం దేనికి?

షద్రుచులు(తెలంగాణ వంటలు)
288 పేజీలు, వెల; రూ 150/-
ప్రతులకు
నవోదయ బుక్ స్టోర్స్,కాచిగూడ.
లేక
జ్యోతి వలబోజు
08096310140.

April 11, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

శీలా సుభద్రాదేవి కవిత్వం-పుస్తక పరిచయం.

మనసు లేని దానిగా పుట్టివుంటే
బాధే లేకుండా పోయేది
మనసుండీ ముఖం లేకుండా అవుతోంది కదా
అదీ ఎదుర్కోవాల్సిన ఇబ్బంది

అంటూ ఆరంభమయ్యే కవిత , నాదైన నాది. ఈ కవితలో కవయిత్రి తనకంటూ ఒక స్వంత గుర్తింపు సాధించాలన్న మహిళ తపనను అత్యద్భుతంగా, ప్రతీకాత్మకంగా చిత్రించారు.

తనకో ముఖమంటూ లేదని గ్రహించాక,
అప్పట్నుంచీ మొదలుపెట్టాను నా పోరాటాన్ని
నాకో ముఖాన్ని మొలిపించుకోటానికో
ఒక చిరునామా అతికించుకోటానికో, అంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధన కోసం తన తపనని హ్ర్ద్యంగా వర్నిస్తారు. చివరలో,
నాకు ముఖం మొలిచేంత వరకూ
కలంతోనైనా, కత్తితోనైనా
నా మెదణ్ణి నేను తవ్వుకుంటూనే వుంటాను, అంటారు.

ఇలాంటి అత్యంత ఆలోచనాత్మకూ, కవితాత్మకమూ అయిన కవితల సంకలనం 1975 నుంచి 2009 నడుమ సీలా సుభద్రా దేవి రచించిన కవితలన్నితినీ ఒక చోట చేర్చి సమగ్ర పుస్తకంగా ప్రచురించిన , శీలా సుభద్రా దేవి కవిత్వం.

504 పేజీల ఈ పుస్తకంలో 1980లో ముద్రితమయిన, ఆకలి నృత్యం, 1987లో ముద్రితమయిన , మోళి, 1994లో ప్రచురితమయిన, తెగిన పేగు, 1996 లో ప్రచురితమయిన, ఆవిష్కారం, 1999నాటి ఒప్పుల కుప్ప, 2001 నాటి యుద్ధం ఒక గుండెకోత, 2007 లోని ఏకాంత సమూహాలు, 2009 నాతి బతుకు పాటలో అస్తిత్వ రాగం, వంటి కవిత్వ సంకలనాలన్నీ కలిపి వున్నాయి. పుస్తకం చివరలో నా కవితా యాత్ర అన్న శీర్షికన కవయిత్రి తన కవిత్వ రచన ప్రస్థానాన్ని టూకీగా వివరించారు.

గుండె స్పందించినది, హృదయం చెమ్మ గిల్లేలా చేసినది, కళ్ళు ఎరుపెక్కించినది ఏ చిన్న సంఘటనో, దృశ్యమో అయినా చాలు కవిత్వంగా చెక్కుకోవచ్చు అంటారు. అంతేకాదు, ఏది రాసినా నేను నమ్మిన విషయాలనే, నేను స్పందించిన సంఘటనల్నే, నేను దగ్గరగా చూసిన సమాజంలోని జీవితాల్నే, నేను గమనించిన దృశ్యాల్నే నిజాయితీగా కవిత్వీకరిస్తాను, అంటారు. ఒకవాదానికో, ఇజానికో కట్టుబడి కావాలని రాయలేదు అని స్పష్టంగా చెప్తారు.

పుస్తకానికి ముందు మాటలో కాత్యాయనీ విద్మహే, విలువల విధ్వంసం ఎక్కడ ఏ రంగంలో జరిగినా సుహద్రా దేవి సహించలేరు అంటారు. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటికే సుభద్రా దేవి పురుషాహంకారాన్ని సంబోధిస్తూ, సవాల్ చేస్తూ కవిత్వం వ్రాశారన్నారు. చివరలో మొత్తం మీద శీలా సుభద్రా దేవి కవిత్వమంటే ఒక సంపూర్ణ స్త్రీ జీవిత చిత్రపటం. స్త్రీ జీవితంలోని రకరకాల వెలుగు నీడల నేపథ్యంలో అవిశ్రాంత, అసంతృప్త, అశాంత స్త్రీల ఆరాటపు అలికిడిని కంగారు కదలికను ఏక కాలంలో వినిపించే చూపించే శబ్ద చిత్రాలీ కవితలంటారు.

ఆధునిక కవిత్వ ప్రపంచంలోని ద్వేషాలు, సంకుచితాలులేని శుభ్రమయిన, ఆలోచనాత్మకమయిన కవిత్వాన్ని ఆస్వాదించాలనుకునేవారందరికీ కరువుతీరా దప్పికను తీర్చే ఒయాసిస్ నీటిలాంటివీ కవితలు. తప్పక చదవండి. అసలు కవిత్వ పఠనానందాన్ని, సంతృప్తిని పొందండి.
శీలా సుభద్రాదేవి కవిత్వం
504 పేజీలు, వెల; రూ 200/-
ప్రతులకు
2/చ్, బ్రహ్మానంద నగర్
మలక్పెత్, హైదెరాబాద్-36.

April 10, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu