Archive for the ‘pustaka paricayamu’ Category

అమ్మ కథలు- పుస్తక పరిచయం.

అమ్మంటే అనురాగం, అమ్మంటే అద్భుతమయిన ప్రేమ..అమ్మంటే ఆది దేవత.

ఈ నిజాలను నిరూపిస్తూ, అమ్మలోని అమ్మతనాన్ని పలు విభిన్న కోణాలలో ప్రదర్శించే 17 కథల సంపుటి , సమ్మెట ఉమాదేవి రచించిన అమ్మ కథలు.

అమ్మంటే, మనస్విని, కంలి, సహాన, అమ్మతల్లి, ఏ దరికో, మాన్వి, బతుకమ్మ, వెన్నెలమ్మ, చిలుకమ్మ, ఆశల పల్లకిలో, గూడు, నిశ్శబ్ద నిజం, చిన్నారి తల్లి, ఒకటి ఉద్యానవనం, అమ్మా బయలెల్లినాదే, కొత్త చిగుళ్ళు అనే 17 కథలున్నాయీ 190 పేజీల కథల పుస్తకంలో.

ఈ కథలన్నిటికీ అమ్మ కేంద్ర బిందువు. అమ్మ ప్రేమ, అమ్మ సౌజన్యం, స్నేహం, త్యాగం, మమకారం, వాత్సల్యం లాంటి అనేక లక్షణాలను తన కథలలో ప్రదర్శించారు రచయిత్రి. సముద్రంలోని నీరంతా సిరాగా మార్చి రాసినా సరిపోనన్ని నిర్వచనాలున్నాయి అమ్మ ప్రేమ గురించి అనే సమ్మెట ఉమాదేవి రచించిన ఈ కథలలో బతుకమ్మ, కంలి, సహాన, వంటి కథలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.

సమ్మెట ఉమాదేవి ప్రతిభకు అద్దం చూపటానికి కంలి కథ ఒక్కటి చాలని ముందుమాట రాసిన ముదిగంటి సుజాతా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమాదేవి సహానా కథ తల్లులందరికీ ఒక బాల శిక్షణ లాంటిదని, మరో ముందుమాట రాసిన శరత్ చంద్ర భావిస్తున్నారు. ఉమాదేవి కథలన్నిటా మనిషి సంస్కారాన్ని ఉన్నతీకరించాలన్న లక్ష్య శుద్ధి ద్యోతకమవుతుందని విహారి గారు భావిస్తే, ఏది కథగా చెప్పాలో, చెప్పాల్సింది ఏ మేరకు చెప్పాలో చక్కగా తెలిసిన రచయిత్రి ఉమాదేవి గారని, జగన్నథ శర్మ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.

కథా సాహిత్యంలో ప్రవేశించిన కొత్త కెరటంలాంటి సమ్మెట ఉమాదేవి కథల సంకలనం, అమ్మంటే ప్రతిఒక్కరు చదవాల్సిన పుస్తకం.

అమ్మ కథలు
పేజీలు-190.
వెల- రూ 100/-
ప్రతులకు; ఎం నీహారికా శ్రీనివాస్
984906722, 9502032810
హౌస్ నుం. 69 మరియు 80
ద్వారకా నగర్, ఫేస్-2 మియాపుర్ విలేజ్
అయ్యప్ప స్వామి మందిరం దగ్గర
బోడుప్పల్, హైదెరాబాద్-39.

బీ డీ నివేదితా దినేష్
8106678746
హౌస్ నుం 3-2-353, 2 ఫ్లూర్
స్వామి వివేకానంద స్ట్రీట్
ఆర్ పీ రోడ్, సికెందరాబాద్-3.

అన్ని పుస్తకాల దుకాణాలలోనూ లభ్యం.

April 9, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

బుద్ధుడు-బౌద్ధ ధర్మం- పుస్తక పరిచయం.

జీవితంలో వీలయినంత ఆనందాన్ని పొందాలని, జీవితాన్ని అనుభవించగలిగినంత అనుభవించాలనీ మనుషులంతా కోరుకుంటారు. జీవితాన్ని అనుభవించడం అనే పదానికి ఎవరి అర్ధాలు వారికున్నాయి. బుద్ధుని దృష్టిలో జీవితాన్ని అనుభవించడం అంటే నిర్భయంగా బ్రతకడం, అంటూ ఆరంభమవుతుంది, పొనుగోటి కృష్ణా రెడ్డి రచించిన ‘బుద్ధుడు- బౌద్ధ ధర్మం’ అనే 112 పేజీల పుస్తకం.

బుద్ధుడి గురించి, బౌద్ధ ధర్మం గురించి ఏమీ తెలియని వాళ్ళకు కనీస అవగాహన కలిగించేలా, సులభంగా అర్ధం అయ్యేలా ఒక చిన్న పుస్తకం రాయాలన్న రచయిత ఆలోచనవల్ల ఈ పుస్తకం రూపు దిద్దుకుంది.

అత్యంత సంక్లిష్టమయిన బౌధ చింతనా ప్రక్రియను, ఆ చింతనలోని జటిలత లోకి పోకుండా, ఆ జటిలత వెనుక దాగివున్న అసలు అర్ధాన్ని వదలిపెట్టకుండా సరళ భాషలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఈ గ్రంథాన్ని రచించారు పొనుగోటి కృష్ణా రెడ్డి.

ఈ గ్రంథంలో థేరవాద బౌద్ధానికి సంబంధించిన అనేక అంశాలను స్పృషించారు. కొన్ని చోట్ల మహాయానమూ చెప్పారు. ఇందులో బుద్ధుని జననం నుంచి నిర్వాణం వరకూ ముఖ్యాంశాలన్నీ ఒక ఎడతెగని ధారలా కూర్చారు. బుద్ధుని ముఖ్య బోధనలు, వర్ణ వ్యవస్థ నిరాకరణ, హిందూ కర్మ సిద్ధాంతానికి, బౌద్ధ కర్మ సిద్ధాంతానికీ తేడా, బౌద్ధంలో దేవుని స్థానాన్ని నీతి ఆక్రమించటం, దేవుని అనావశ్యకత, దశపారమితలు, విపశ్యనా ధ్యానం, బౌద్ధమత వ్యాప్తి, బౌద్ధానికి మనిషి కేంద్రమవటం, స్త్రీలకు బౌద్ధం కల్పించిన స్థానాల గురించీ గ్రంథంలో చర్చించారు.

తెలుగు ప్రపంచానికి బౌద్ధాన్ని ఆ బాలగోపాలానికి-పండితునికి, పామరునికి, పిల్లల నుంచి పెద్దలదాకా అర్ధం అయ్యేలా తన పాత్రికేయానుభవాన్ని రంగరించి చందమామ కథా చిత్రణ శైలిలో అందించారు పొనుగోటి కృష్ణా రెడ్డి అని ముందుమాటలో బుద్ధఘోషుడు అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో అక్కడక్కడా పొందుపరచిన చిత్రాలు గొప్పగా వున్నాయి.

బుద్ధుడు బౌద్ధ ధర్మం
112 పేజీలు, వెల రూ.100/-
ప్రతులకు;
విరాట్ పబ్లికేషన్స్,
హైదెరాబాదు-36.
సెల్ నం-09440974788.

April 8, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

వాచస్పతి-పుస్తక పరిచయం.

ఆకాశవాణి మన నిత్య జీవితంలో ఒక అవిభాజ్యమయిన అంగం. టీవీలొచ్చినా, నెట్ లూ, టాబ్ లు వచ్చినా, ఈనాటికీ రేడియో అంటే ఒక ప్రత్యేకమయిన అభిమానం మనస్సులో వుంది. రేడియో లో పాటలు వింటూ, పనిచేసుకుంటూ, టైం పై కన్నేసుకుంటూండటం అలవాటయిపోయింది. ఇప్పటికీ, టీవీల్లో వార్తలువింటూన్నా, ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు, కార్మిక కార్యక్రమాలు, బాలానందం, నాటికలు, సినిమా పాటలు, కవి సమ్మేళనాలు  ఒకటేమిటి, రేడియో ఒక మధురానుభూతుల వెల్లువ. రేడియో ముఖ్యంగా, ఆకాశవాణి, వివిధభారతి లు వినోదంతో పాతు విమ్నానాన్నీ అందించి సమాజ వ్యక్తిత్వ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తున్నాయి. అయితే, రేడియోలో మనకు వినిపించేవి స్వరాలే. ఆ స్వరాలు ఒదిగిన రూపాలు, వారి జీవితానుభూతులు, వారి జీవితాలలో సంఘర్షణలూ ఏమీ శ్రోతలకు తెలియవు. అనేక సందర్భాలలో ఈ అమృతమయమయిన స్వరాలు కేవలం శ్రోత మనసులో అస్పష్టమయిన రూపంగానే మిగిలిపోతాయి. అలాంటి అస్పష్టరూపాలకు రేఖామాత్రంగానయినా అసలు రూపాలను కనిపింపచేసే అత్యంత ఆసక్తికరమయిన అపురూపమయిన పుస్తకం అంబడిపూడి మురళీ కృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి లి సంకలనం చేసిన పుస్తకం, వాచస్పతి. ఇది, ఆకాశవాణి అనౌన్సర్లు, న్యూస్ రేడర్లు, డ్రామావాయిస్ స్టాఫ్ ఆర్టిస్టుల సంక్షిప్త జీవన రేఖల సంకలనం. తమ గాత్ర మధురిమనే తమ గుర్తింపుగా, చిహ్నంగా నిలచి దశాబ్దాలుగా విశిష్టసేవలందిస్తున్న ప్రతిభామూర్తులకిదొక చిరు నీరాజనంలాంటి పుస్తకం.

ఇదులో మొత్తం 129 వాచస్పతుల పరిచయాలున్నాయి. కేశవపంతుల నరసిమ్హ శాస్త్రి, ఎం. వి నాగ రత్నమ్మ లతో ఆరంభించి తెన్నేటి హేమలత, అద్దంకి మన్నార్, డాక్టర్ శమంతక మణి, శారదా శ్రీనివాసన్, రతన్ ప్రసాద్, ఇలియాస్ అహ్మద్, మట్టపల్లి రావు, ఉమాపతి బాలాంజనేయ శర్మ, ఇందిరా బెనెర్జీ, ఆకెళ్ళ సీతా దేవి లాంటి అనేక అత్యంత పరిచితమయిన స్వరాల, అపరిచిత జీవన రేఖలను పరిచయం చేస్తుందీ పుస్తకం. రేడియో అభిమానులందరూ తప్పకుండా స్వంతం చేసుకోవాల్సిన అమూల్యమయిన కానుక ఈ పుస్తకం. 

వాచస్పతి, 268 పేజీలు.
వెల-రూ 100/-
ప్రతులకు;
402, ప్రేమసాయి అపార్ట్మెంట్స్,
శ్రీనగర్ కాలనీ, హైదెరాబాద్-73.
ఫోన్; 040-23748383.

April 7, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

బాలల సముద్ర శాస్త్రం-పుస్తక పరిచయం.

పుస్తక పరిచయం పేజీని సహృదయంతో ఆహ్వానించి, అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు.
ఇవాళ్టి నుంచీ ఈ పేజీలో పుస్తక పరిచయాలు ఆరంభమవుతున్నాయి.
ముందు, నేను, వారమంతా అందిన పుస్తకాలను, వారానికి ఒక్క రోజు, ఆదివారం పరిచయం చేయాలనుకున్నాను. కానీ, అందిన పుస్తకాలను చూసిన తరువాత అన్నీ ఒక్క రోజులో చేసేకన్నా, కనీసం రోజుకొకటి చొప్పున, వీలయిన రోజు ఎన్ని వీలయితే అన్ని పరిచయం చేయాలని నిశ్చయించుకున్నాను. అంటే, ప్రతి రోజూ కనీసం ఒకటయినా పుస్తక పరిచయం తప్పకుండా వుంటుందన్నమాట.

అప్పుడప్పుడూ, ఏదయినా బాగా నచ్చిన హిందీ, ఇంగ్లీషు పుస్తకాలనూ పరిచయం చేస్తాను. కానీ, ప్రధానంగా తెలుగు పుస్తకాల పరిచయానికే ప్రాధాన్యం.

****************************************************************

సముద్రాలు భూమిపై 71 శాతం స్థలాన్ని ఆక్రమిస్తాయని అందరికీ తెలుసు. అలాంటి సముద్రాల గురించి, శాస్త్రీయ వి~ మ్నానాన్ని అందించే అరుదయిన పుస్తకం, బాలల సముద్ర శాస్త్రం.

పేరులోనే ఇది బాలల్కు విషయాన్ని సమగ్రంగా బోధించే పుస్తకమని తెలుస్తుంది. ఈ సముద్ర శాస్త్రాన్ని మొత్తం మూడు భాగాలలో సరళంగా వివరించారు, డాక్టర్, ఎం పీ మద్దులేటి రెడ్డి.

మొదటి భాగం మొత్తం 120 పేజీల పుస్తకం. ఈ భాగంలో సముద్ర శాస్త్రాల చరిత్ర, సముద్ర శాస్త్ర ప్రయోజనాల వివరణలున్నాయి. పూర్వీకులు ఉపయోగించిన వోడలు, వాటి చిత్రపటాలు ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ.
మన దేశంలో , ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఓషనోగ్రఫి నేర్పటం, గోవాలో ఓషనోగ్రఫి సంస్థ ఏర్పాటు అభివృద్ధులను వివరిస్తుందీ పుస్తకం. దీనితో పాటూ, ప్రపంచ మహా సముద్రాలు, వాటికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తుందీ పుస్తకం. శాంకేతిక విషయాలను, సామాన్యునికి అధమయ్యే రీతిలో తేలికగా వివరిస్తుందీ పుస్తకం.

బాలల సముద్ర శాస్త్రం రెండవ భాగం, మహా సముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, జీవ రాసుల గురించి వివరిస్తుంది. మొత్తం 136 పేజీలు కల ఈ భాగంలో సముద్రంలోని పలు రకాల జీవ, వృక్ష జాలాలగురించిన వివరణ, చిత్రపటాలు విన్నాయి. హడక్ చేపలు, ఫ్లౌండర్ చేపల తో పాటు తిమింగలాలు, రొయ్యల గురించి కూడా వివరణ వుందీ పుస్తకంలో.

బాలల సముద్ర శాస్త్రం మూడవ భాగం 108 పేజీల పుస్తకం. ఈభాగంలో సముద్రాలు, అందులో చెలరేగే అలల రకాలు, సముద్ర శాస్త్ర అధ్యయానికి ఉపయోగించే సధనాల వివరణ వుంది. చక్కని చిత్రపటాలున్నాయి.

మొత్తానికి ఈ మూడు పుస్తకాలు దగ్గర వున్నాయంటే సముద్ర శాస్త్రానికి సంబంధించిన మౌలికాంశాల వివరణ అందుబాటులో వున్నట్టే.

ఈ మూడు పుస్తకాలను రచించిన ప్రొఫెసర్ మద్దులేటి, జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త. కెనడాలో అట్లాంటిక్ సముద్ర తీరంలో పరిశోధనలు చేశారు. సముద్ర శాస్త్రంలో నూరు పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించారు.

ఈ మూడు పుస్తకాలను కర్నూలుకు చెందిన విద్యార్థి మిత్ర ప్రచురణలు ప్రచురించారు.

మొదటి భాగం వెల రూ 40/-
రెండవ భాగం వెల రూ40/-
మూడవ భాగం కూడ రూ 40/-.

ప్రతులకు;

విద్యార్థి మిత్ర ప్రచురణలు
ఫ్రెండ్స్ బుక్ డిపో
షాప్ నంబర్ 14, పార్కు రోడ్
మున్సిపల్ బిల్డింగ్స్, కర్నూల్-518001.
సెల్; 09441373304.

April 6, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

సాహిత్యకాగడాలో పుస్తకపరిచయాలు.

సాహిత్య కాగడా మళ్ళీ వెలుగుతోంది.. అంటే ఇంత కాలం ఆరిపోయిందని కాదు. వెలుగుతూనే వుంది కానీ, ఆ వెలుగు పదిమందికీ కనిపించలేదన్నమాట….

ఆరంభమ్నుంచీ సాహిత్య కాగడాకు సాహిత్య మాఫియా ముఠాలతో గొడవ. సాహిత్యాన్ని తమ గుప్పిట్లో (పత్రికల సాహిత్య పేజీలు) పెట్టుకుని, హైజాక్ చేసి పబ్బం గడుపుకుంటున్న వారితో గొడవ. నిజాన్ని నొక్కి పట్టి తమకు లాభించేదే నిజమని నమ్మిచే వారితో గొడవ..ముఖ్యంగా పత్రికలు తమ చేతిలో వున్నాయి కాబట్టి, పత్రికలు తప్ప మన సాహిత్యానికి మరో వేదిక లేదు కాబట్టి, తాము, తమ వారు తప్ప మరొకరు రాసేది సాహిత్యం కానట్టు, మరెవరూ రచయితలు కానట్టు వ్యవహరించే వారితో గొడవ. ఈ గొడవ పడటంలో పరాయివారినేకాదు, తన వారనుకున్న వారినీ వదలటంలేదు కాగడా..

అనగనగా ఒక పుస్తకాలమ్మే దుకాణం. దుకాణం కాబట్టి, ఎన్ని పుస్తకాలమ్మితే అంత లాభం. పుస్తకాలమ్మాలంటే ప్రచారం అవసరం. మన తెలుగు పుస్తకాలకు ప్రచారం పత్రికల ద్వారానే లభిస్తుంది. కానీ పత్రికలలో సాహిత్య పేజీలు మాఫియా ముథాల చేతుల్లోనే వున్నాయి. కాబట్టి కొందరు రచయితల పుస్తకాలకే వాతిల్లో స్థానం వుంటుంది. కానీ, ఇంకా అనేక మంచి పుస్తకాలకు కనుక ప్రచారం లభిస్తే, అలాంటి పుస్తకాలున్నట్టు తెలిస్తే కొనే పాథకులున్నారు. అలా తెలియటం వల్ల మామూలుగా మ్ముడు పోయే పుస్తకాలేకాక, ఇతర పుస్తకాలూ అమ్ముదు పోతాయి. అందువల్ల రచయితలకూ లాభం. దుకాణానికీ లాభం. అయితే, మామూలు సాహిత్య ముఠాల గుప్పిట్లో వున్న పత్రికలు అందరి గురించీ రాయవు. కాబట్టి, ఈ దుకాణమే ఒక పత్రిక పెట్టి, అందరు రచయితలకూ, అన్ని పుస్తకాలకూ సరయిన ప్రచారం ఇవ్వాలని నిశ్చయించింది. ప్రచారం పత్రికల్లో బాగానే లభిస్తున్న ముఠాలకు చెందిన రచయితలు కాక, మంచి పుస్తకాలు రాసి ముఠాల గుప్పిట్లో చిక్కనందువల్ల మరుగున పడిన రచయితల పుస్తకాలూ పదిమందికి తెలిసేట్టు చేసే ఇలాంటి పత్రిక అవసరం వుంది.

అనుకున్నట్తుగానే ఆ దుకాణం పత్రికను పెట్టింది. దాంతో, ముఠాలలో లేని రచయితలంతా తమకు ఇప్పుడయినా కాస్తయిన ప్రచారం లభిస్తుందని ఆశపడటంలో తప్పుందా? ఎప్పుడూ, ఏ పత్రిక్లలో చూసినా దర్శనమిచ్చే ఆస్థాన గణం కాక, ఇతర దౌర్భాగ్య రచయితల పుస్తకాలకూ ప్రచారం లభించి, తమకు మంచి రోజులు వస్తాయని ముఠేతర రచయితలు ఆశపడ్డారు. సాహిత్యకాగడా కూడా అలానే అనుకుని తప్పులో పదింది.

దుకాణం పత్రిక ఆరంభమయింది. ఆ పత్రిక కూడా సాహిత్య మాఫియా ముఠాల పత్రికల్లో ఒకటయింది. అవే పుస్తకాలు, వారే రచయితలు. పత్రికలలో కనిపించేవారే ఇక్కడా కనిపిస్తున్నారు. ఒక జర్నలిస్టు కథకుది పుస్తకానికి ఎలాగో పత్రికలలో ప్రచారం లభిస్తుంది. ఈ దుకాణం పత్రికలోనూ వారికే పెద్దపీట. అదే సమయానికి విడుదలయిన ఇతర రచయితలూ, వారి పుస్తకాలను ముఠాల పత్రికలు విస్మరించినట్టే దుకాణం పత్రిక కూడా విస్మరించింది. ఇప్పుదు చెప్పండి….బయట బోలెడన్ని ముఠాల బాకాల భేకాలుండగా, దుకాణానికీ, ఆ భేకాల్లో మరో భేకమయి, ఆ ఘూకాలకే బాకాలూదుతూంటే, ఇక అది అందరు రచయితల పుస్తకాలకెలా న్యాయం చేయగలుగుతుంది? బయట ముథాలే దుకాణం పత్రికలోనూ చేరి, అవే సంకుచితాలు, అవే రంగుటద్దాల కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తూంటే, ఇక సామాన్య రచయితలేమవుతారు? వారి పుస్తకాలున్నట్టు పదిమందికీ ఎలా తెలియాలి?

ఈ పరిస్థితి ఇలా వుండగా, తమ వ్యాపారానికి రచయితల దగ్గర పెట్తుబడి తీసుకుని పుస్తకాలమ్మే బాజార్లూ వెలుస్తున్నాయి. రచయిత రాయటము, పుస్తకాన్ని అచ్చువేసుకోవటమూ పెట్తుబడి. కానీ, ఇక అమ్మిపెట్టే బజార్లకూ పెట్టుబడి పెట్టే దుస్థితిని చూసి సాహిత్యకాగడా మండి పోతోంది. అయినా, అమాయక రచయితలు దుకాణం వైపు ఆశగా చూస్తున్నారు. మాయాబాజార్ల మోహంలో పడి పెట్టుబడి పెదుతున్నారు.

ఇది చూసి కాగడా వెలగటం ఆరంభమయింది.

ఇకపై, కాగడాలో వారానికి ఒక రోజు కొత్త పుస్తకాల పరిచయం వుంటుంది. ఇది పుస్తక సమీక్ష కాదు. విమర్శ కాదు. కేవలం పుస్తక పరిచయం మాత్రమే. కాబట్టి రచయితలు కాగడా వారి రచనలకు నిప్పతించి తమాషా చూస్తుందని భావించవద్దు. రచయితల వ్యక్తిగతాలతో సంబంధం లేకుండా ప్రతి రచయిత పుస్తకాన్నీ కాగడా పరిచయం చేస్తుంది. ఆ వారంలో ఎన్ని పుస్తకాలందితే, అన్ని పుస్తకాలనూ పరిచయం చేస్తుంది. పుస్తక సమాచారాన్ని వీలయినంతగా అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఇందులో కాగడాకు లాభం ఏమిటంటారా?

ఇప్పతికే కాగడా పత్రికలు చేయలేని పనులు చేసి చూపిస్తూ, సాహిత్య మాఫియా ముథాలు ఉలిక్కి పడేట్టు చేస్తోంది. కాగడా విమర్శలకు తట్తుకోలేక, ఒక మాఫియా ముథా పత్రిక, మంచికథను వెతికే నెపం మీద తమ కథలు, తమ వారి కథలకు ప్రామాణికత కల్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదొక ఉదాహరణ మాత్రమే…ఇలాంతివెన్నో వున్నాయి.

కాబట్టి, ఇక నుంచీ ప్రతి ఆదివారం, సాహిత్య కాగడాలో కొత్త పుస్తకాల పరిచయం వుంతుంది. కాగడాలో తమ పుస్తకాల పరిచయం కోరుకునేవారు ఒక్క కాపీ అందచేస్తే చాలు. మరొక్క సారి స్పష్టం చేస్తున్నాను. ఇది పుస్తక పరిచయమే తప్ప సమీక్ష కాదు, విమర్శకాదు.

పుస్తకాలను అందచేయాలనుకున్నవారు kmkp2025@gmail.com కు మెయిల్ చేస్తే అడ్రెసు ఇస్తాను. ఎలాంటి రంగుటద్దాలు, ఇజాలు, ముథాలు లేకుండా పుస్తకాలకు ప్రచారం కల్పించాలన్న వుద్దేశ్యం తప్ప మరొక వుద్దేశ్యం లేదు. ఇష్టమయిన వారు పుస్తకాలు పంపవచ్చు. ఒకవేళ పుస్తకావిషకరణ తేదీ నిర్ణయమయితే ఆవివరాల్లో అందించాలి. ఆవిష్కరణ అయిపోతే ఆ వివరాలు అందించినా చాలు.

రచయితలకెవరి ఫేవర్లూ అవసరం లేదు. ఏ ముథాలూ అవసరం లేదు. అతని ప్రతిభనే అతనికి విలువనిస్తుందని నమ్ముతోంది సాహిత్యకాగడా. ఇతర రచయితలకూ అదే చెప్తోంది.

మనకు ఎవరు అవకాశాలు కల్పించకపోయినా ఫరవాలేదు. మన సృజనాత్మకతతో మనకు అవకాశాలను మనమే కల్పించుకుందాం…

April 1, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

శ్రీకృష్ణదేవరాయలు- పాలపిట్ట సమీక్ష.

ఈ నెల పాలపిట్ట మాస పత్రికలో ప్రచురితమయిందీ సమీక్ష.

November 5, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu