Archive for the ‘విశ్వనాథ కథాసాహిత్యం.’ Category

విశ్వనాథ సాహిత్యం-3

విశ్వనాథ సాహిత్య సాగరంలో మునకలేసేముందు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఇతర రచయితలకూ, విశ్వనాథ రచనలకూ ఒక మౌలికమయిన తేడా వుంది. ఇతర రచయితలు తమ స్థాయిలో అతి సున్నితంగా రాస్తారు. అతి గొప్పగా భావ వ్యక్తీకరణ చేస్తారు. తమ చుట్టూ వున్న సమాజాన్నీ మనుషులనూ మనస్తత్వాలనూ ఎంతో గొప్పగా విశ్లేషిస్తారు. అనేక విషయాలను సూటిగా, నిర్భయంగా తమ రచనల్లో ప్రకటిస్తారు. కానీ, విశ్వనాథ వారిలా, ప్రతి చిన్న విషయాన్నీ లోలోతుల్లోకి వెళ్ళి విస్లేషించి, విమర్శించిన వారు అరుదు. అంతేకాదు, ప్రతి విషయాన్ని ఇతరుల్లా ఆయన సిద్ధాంత లోచనాలలోంచి చూడడు. అలా చూడాలనీ ప్రయత్నించడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ మట్టి, ఏ గాలి, ఈ జాతి, ఈ జాతి ఆత్మ దృష్టితో చూస్తాడు. అందుకే, విశ్వనాథ వారు సాహిత్యం అన్నది అసహజమయిన ప్రవృత్తిని వృద్ధి పొందించేదుకు రాయకూడదని నమ్మేరు. ఆయన రచనలన్నీ సహజమయిన కామకొరధాదులు సముద్దీపించటానికే సృజించినవి.

ఇక్కడ ఈ సహజ, అసహజ ప్రవృత్తులంటే ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అర్ధం చేసుకుంటే విస్వనాథ సాహిత్యాన్ని చూడాల్సిన దృష్టి అర్ధమవుతుంది.

సహజ ద్వేషమన్నది హృదయంలోఅంచి పుడుతుంది. ఒకడు మచ్చడు. వాదు చేసే పనులు నచ్చవు. పలు కారణాల వల్ల వాడంటే కోపం కలుగుతుంది. అది ద్వేషంలా పరిణామం చెందుతుంది. అలాగే ప్రేం కూదా. ఈ భావనల వల్ల సుఖం కలగవచ్చు. దుహ్ఖం కలగవచ్చు. ఇవన్నీ వ్యక్తిగత భావనలు. ఒక రచన చదువుతూంటే కూడా ఈ భావనలు కలుగుతాయి. ఇవి శరీరంపైన ప్రభావం చూపవు. అంటే ఆ రచన సహజ ప్రవృత్తిని ఉద్దీప్తం చేస్తున్నదన్నమాట.

ఇందుకు భిన్నంగా, అంటే వ్యక్తిగతమయిన భావనలకు భిన్నమయిన భావనలను కూడా సాహిత్యం కలిగ్స్తుంది. కానీ, అవి, అసహజమయిన భావనలు. ఇక్కడ వ్యక్తితో సంబంధం వుండదు. వ్యక్తినిమరచి ఒక సమూహాన్ని ద్వేషించే భావనలు కలిగించే అలాంటి సాహిత్యం అధికంగా సిద్ధాంతగతమయిన సాహిత్యం. అంటే, హృదయంలో జనించే సహజ భావనలకు భిన్నంగా మనస్సులో జనిస్తాయీభావనలు. అవి అసహజమయిన భావనలు. అలాంటి భావనలను కలిగించే రచనలను రచయితలు చేయకూడదన్నది విశ్వనాథ ప్రగాఢ విశ్వాసం. అంటే రచనకు జీవితము, ప్రపంచము ప్రేరణ అయినా, ఆ ప్రేరణ కు సిద్ధాంత లోచనాల దృష్టిని ఆపాదించకూడదన్నమాట రచయిత.

ఒక రచన చదువుతూంటే, నాయకుడి పైన ప్రేమ కలుగుతుంది. విలన్ పట్ల క్రోధం కలుగుతుంది. కానీ, ఈ ప్రేమకానీ, క్రోధం కానీ నవల పఠనం పూర్తవటంతో పూర్తయిపోతాయి. కానీ, సిద్ధాంతగత సాహిత్యం వల్ల జనించిన భావనలు పాత్రల పరిథి దాటి, సమాజంలోని వ్యక్తుల సమూహాలవైపు ప్రసరిస్తాయి. ఇలాంటి అసహజ ప్రవృత్తి ఉద్దీపితమవటం వల్ల సమాజంలో ద్వేష భావనలు ప్రజ్వరిల్లుతాయి. ఉద్విఙ్నతలు చెలరేగుతాయి. స్నేహ సౌభ్రాత్రుత్వ భావనలు దెబ్బతింటాయి. సమాజంలోని సమతౌల్యం దెబ్బతింటుంది. శాంతి, ప్రశాంతతలకు భంగం కలుగుతుంది. తద్వారా సమాజం బలహీనమవుతుంది. ఇది దేశానికి, సంస్కృతి సాంప్రదాయాలకు, దేశ మౌలిక అస్తిత్వానికి ప్రమాదకరం. కాబట్టి రచయితలు, ఆవేశపరుల్లా కాక, ఆలోచనలున్న విఙ్నాన వంతుల్లా, విచక్షణ వున్న వారిలా, ద్రష్టల్లా వ్యవహరించాల్సి వుంటుంది. రచయిత అలా వ్యవహరించక తాత్కాలిక ఆవేశాలకు లోనయి రచిస్తే, దాని దుష్ప్రభావం రచయిత పైనేకాదు, సమాజం పైన కూడా వుంటుంది. ఒక్కసారి ఇప్పుడొస్తున్న సాహిత్యం, దాన్ని సృజిస్తున్న రచయితల రంగుటద్దాలు, సమాజంలో అవి సృష్టిస్తున్న విభేదాలు, ఉద్విఙ్నతలను గమనిస్తే విశ్వనాథ ఆలోచనలలో లోతు, వాటిలోని సామంజస్యమూ స్పష్టమవుతాయి. ఇలా, ద్రష్టలా వ్యవహరించటం, విచక్షణతో రచనలను సృజించటం, భూత కాలం పట్ల గౌరవం, వర్తమానం పట్ల అవగాహన, భవిష్యత్తుపట్ల ఆలోచన వున్న ద్రష్టలాంటి భారతీయ రచయిత విశ్వనాథ సత్యనారాయణ.

ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న తరువాత విశ్వనాథ సాహిత్య సాగరంలో అడుగిడటం ఆరంభిద్దాము.

October 12, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

విశ్వనాథ సాహిత్యం-2

విశ్వనాథ సాహిత్య సాగరం వైపు చూపు ప్రసరింపచేసేముందు, సాహిత్యం గురించి విశ్వనాథ అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సివుంటుంది. ఎలాగో ఆయన సాహిత్యాన్ని తెలుసుకుంటూపోతూంటే ఆయన దృక్పథం, ఆయన దృక్కోణం, ఆలోచనా విధానాలు తెలుస్త్యాయి. కానీ, ఎలాగయితే, సముద్రపు అలల్లో ఆడుకోవటానికి, అలల తాకిడి ఆనందన్ని అనుభవించటానికి సిద్ధమయ్యేముందు కొన్ని తయారీలు చేస్తామో, పాంటు పైకి మడవటం, చెప్పులు విడవటం, అలల తాకిడి ఎక్కువుంటే ఒకరి చేయి ఒకరు పట్టుకోవటం లాంటివి, అలాగే, విశ్వనాథ సాహిత్య సాగరపుటలలను తాకేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సివుంటుంది. ఇవి తెలుసుకున్న తరువాత, అలల్ను ఎదుర్కోవటం కాస్త అలవాటయిన తరువాత, లైఫ్ జాకెట్ వేసుకుని నీళ్ళల్లో దిగాల్సివుంటుంది. ఆతరువాత ఆ సముద్రపులోతులలో ఎవరెవరి సంస్కారాన్ని, దృష్టిని బట్టి వారు అణ్వేషించుకోవాల్సివుంటుంది. వారి వారి సంస్కారాన్ని బట్తి కొందరికి మొసళ్లు, సొర చేపలు, తుఫానులే కనిపిస్తాయి. ఇంకొందరికి, సముద్ర గర్భంలో నిక్షిప్తమయి వున్న అనేకానేక అమూల్యమయిన అద్భుతాలు దర్శనమిస్తాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సంధియుగానికి చెందినవాడు. పూర్వ సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం తరగని కాలం అది. కానీ, ఆధునిక భావాల పవనాలు బలంగా వీయటం ఆరంభమయిన కాలమూ అది. మరో వైపు, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం జాతిలో సంపూర్ణంగా అంతరించని కాలము అది. ఇంకో వైపు, అప్పుడప్పుడే విషంలా నెమ్మదిగా పాకుతున్న కాలం. విశ్వనాథ వారి మాటలలోనే చెప్పాలంటే,’నా-ఆ పసినాటికి ఇంగ్లీషు చదువు నేటికివలె త్రెంచరాని ముళ్ళుగా, త్రెంచినచో నెత్తురుకారెడి ముళ్ళుగా అల్లుకొనలేదు.’ అంటాడు. ఆ కాలం నాటి చదువు గురించి, ‘ పల్లెటూళ్ళలోని ఆనాటి చదువు పెద్ద పుస్తకమును చదివి అర్ధము చేసికొనుట. పెద్ద పుస్తకమనగా, కవిత్రయము యొక్క భారతము, పోతన్న గారి భాగవతము, భాస్కర రామాయణము, ఈ మూడింటికి పెద్ద పుస్తకమని పేరు.’ అంటే ఆ కాలంలో కాస్త చదువు వచ్చిన వాడూ చక్కని తెలుగు తెలిసినవాడే నన్న మాట. అందుకే, విశ్వనాథ, ‘నా ఆంధ్రభాషా పాండిత్యమునకు ప్రధాన గురువు మా తండ్రి, నా కుటుంబము, మాయూరు, ఆనాటి బొచ్చగాండ్రు, మా పాలేళ్ళూ అన్నాడు. ఎందుకంటే, ఈనాటి విద్యా వంతులతో పోలిస్తే, ఆనాటి నిరక్షరాస్యులే ఎక్కువ విద్యావంతులు. ఈ విషయాన్నే చెప్తూ, విశ్వనాథ, తనలాంటి వాతావరణంలోనే పెరిగినా, తన సోదరులు పాందిత్యమున్నా మహాకవులెందుకు కాలేదో స్పష్టంగా వివరించారు.’నా జీవలక్షణములో కవితా శక్తివున్నది. కల్పనా శక్తి వున్నది. ఆంధ్రభాషా సాహిత్య శక్తియున్నది. నాకివియన్నియు దోహదములైనవి. వారికి కాలేదూ అంటాడు. అంతేకాదు, తాను పన్నెండు పదమూడేళ్ళు వచ్చేవరకూ పల్లెలో తెలుగ్ భాషను చదువుకున్నానని, వాళ్ళకు కొంచెము ఙ్నానము వచ్చిన తరువత పల్లెటూరి సంపర్కము తక్కువయిపోయిందని, అందుకని వారు కవులయినా మహా కవులు కాలేక పోయారనీ అంటాడు. ఇక్కడే, సాహిత్యం పట్ల తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు విశ్వనాథ.

“వొట్టిపట్టణములలో పెరిగినవాడు నేటి ఇంగ్లీషు రచయితల వలె తయారగును. పరుల భావములను తీసికొని ఒకడు శబ్దములమీద, మరియొకడు పెర యూహలమీద సాము గరిడీలు చేసెడివాడు. సాంప్రదాయ దూరుడు, ఆర్ద్రతా విరహితుడు అవుతాడు. సాహిత్యమునందు రసమనునది వున్నది. అది విషయానందమునకు దాటినది. జీవుని సమాశ్రయించియున్న మాయను భేదించి బ్రహ్మపదార్ధమును లిప్తకాలమునందు తన్ను తనదిగా జేసికొను లక్షణము తెలియనివాడు. తెలియనిచో నష్టములేదుకానీ, దానిని తిరస్కరించువాడు. ద్వేషించువాడు.” ఇవన్నీ లేనిదే సాహిత్యమన్నమాట. అందుకే అవకాషం దొరికినప్పుడల్లా రసమే సాహిత్యంలో ప్రధానమయిన విషయమని విశ్వనాథ ప్రకటిస్తూ వచ్చాడు. తన రచనలలో, తాను రాసిన ప్రతి అక్షరంలో భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చూపించాలని ప్రయత్నించాడు. జాతి దృష్టిని పరాయీకరణనుంచి, పరాయి భావనలను గుడ్డిగా, బానిసల్లా అనుసరించి, తమ స్వంతమయిన మణి మాణిక్యాలను రాళ్ళనిపొరబడి పారవేయకుండా నిజానిజాలు వివరించాలని ప్రయత్నించాడు.

విశ్వనాథ దృష్తిలో సాహిత్యం సరస్వతి. తాను సృజించే ప్రతి అక్షరం పార్వతీదేవి పాదాల అర్చనకోసం జన్మించిన పుష్పం. “వేదశాత్రోపనిషదాదులు సరస్వతి. కావ్యములయందు గూడ నుదార బుద్ధులయిన పండితులు సరస్వతిని ప్రతిపాదించిరి. ఈ సరస్వతిని రక్షించుట సత్కవియొక్క ధర్మము.” ఇదీ కవి బాధ్యత, ధర్మములను గురించి విశ్వనాథ అభిప్రాయం. ఈ ధర్మ నిర్వహణకొసం, తన బాధ్యతను సక్రమంగా నిర్వహించటం కొసమే ఆయన సాహిత్యాన్ని సృజించారు. ఎన్నడూ, ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురయినా, ఎన్ని దూషణలనెదుర్కొన్నా ఆయన తన ధర్మ నిర్వహణ మానలేదు. తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. తన లక్ష్యానుంచి పక్కకు తొలగలేదు.అయితే, దేశ సామాజిక మనస్తత్వంలో వస్తున్న మార్పును విశ్వనాథ గమనించాడు. ఆ మార్పును అడ్డుకోవటం కన్నా, ఆ వీస్తున్న పవనాల దిశను నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటూ, గతానికి భవిష్యత్తుకూ వర్తమానాన్ని వారధిలావాడుకోవటం నేర్పాలని తన రచనల ద్వారా ప్రయత్నించాడు.

తన ఈ ప్రయత్నం అపోహలకు, హేళనకు, దూషణలకు, తిరస్కారాలకూ గురవుతుందని, గురవుతున్నదనీ ఆయనకు తెలుసు. అయినా తాను నమ్మింది ప్రకటిస్తూ పోయాడు. “పూర్వ మహాకవులను గూర్చికూడా శాఖాభేదములతో వ్యవహరించెడి యీ కితవసాహిత్యవేత్తృప్రపంచమున నా సాహిత్య ప్రయాణము మిక్కిలి ఎగుడు దిగుడులతో సాగిపోయినది.” అని చెప్పుకున్నాడు. అంతేకాదు,” నేటికిని నా సూక్ష్మతమాభిదర్శనపు వ్యావృత్తియు విషయాభిముఖీనమైన హేతుకల్పమును నన్ను కొందరు ఈర్ష్యాగ్రస్తులచేత ద్వేషింపబడునట్లు చేయుచున్నవి” అని తన 74వయేట ఆత్మకథలో వ్రాసుకున్నారు విశ్వనాథవారు.

టూకీగా సాహిత్యం పత్ల విశ్వనాథవారి దృక్కోణం ఇది. అందువల్ల వారు ఎదుర్కొన్న సమస్యల స్వరూపమూ ఇదే.

విశ్వనాథ దృష్టిలో కావ్యము సహజమయిన కామక్రోధాదులను సముద్దీపింపచేయటానికి సృజించటం జరుగుతుంది. వ్యక్తిగతమయిన క్రోధము సహజము, సిద్ధాంతగతమయిన క్రోధము అసహజము. కాబట్టి, సిద్ధాంత గతమయిన క్రోధాన్ని ప్రజ్వరిల్లింపచేసేందుకు రాసేది అసహజమయిన కావ్యము. సహజమయిన భావనలను కలిగించే కావ్యం వల్ల పొందే సుఖదుహ్ఖాలు పాంచభౌతిక శరీరానికి సంబంధించనివి. అంటే అలౌకికమైనవి. ఇలాంటి అలౌకిక భావనలను కలిగించే సహజమైన కావ్య సృజన సాహిత్య లక్ష్యము, లక్షణము అన్నది విశ్వనాథ భావన. ఆయన సాహిత్యాన్ని ఈ భావన ద్వారా విశ్లేషించాల్సి వుంటుంది.

అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సహజ అసహజ భావనలలో వ్యక్తిగతానికి, సిద్ధాంతానికి తేడా ఏమిటన్నది.

ఇది వచ్చే వ్యాసంలో.

(ఈ వ్యాసంలో విశ్వనాథ వారి మాటలుగా ఉదాహరించినవన్నీ ఆయన ఆత్మకథ లోనివి.సరస్వతికి సంబంధించిన వ్యాఖ్య, కావ్యానందం లోనిది.)

September 11, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

విశ్వనాథ సాహిత్య పరిచయం-నాందీ ప్రస్తావన.

విశ్వనాథ సత్యనారయణ గారి సాహిత్యాన్ని పరిచయం చేయాలన్న ఆలోచన ఎప్పటినుంచో వుంది. ఆయన సాహిత్యంపైన ఎవరయినా విమర్శనాస్త్రాలు సంధించినా, ఆయన పైన దూషణబాణాలు విసిరినా, ఆయన సాహిత్యాన్ని దుర్వ్యాఖ్యానంతో తీసిపారేస్తూన్నా, ఆయన సాహిత్యంలోని అర్ధాలను, పరమార్ధాలనూ, గూఢార్ధాలనూ , నిగూఢార్ధాలనూ వివరించాలన్న తీవ్ర తపన కలుగుతూండేది. ముఖ్యంగా, ఆయన సాహిత్యాన్ని చదవని వారు, ఆయన సాహిత్యం దరిదాపులకు కూడా వెళ్ళని వారు, కనీసం ఆయన పుస్తకన్ని ముట్టుకుని కూడా చూడని వారు సైతం, వారూ వీరూ అన్న మాటలను ప్రామాణికంగా తీసుకుని తెలిసీ తెలియక ఒక మహా సాగరంలాంటి సాహిత్యాన్ని తీసిపారేస్తూంటే వీరందరికీ విశ్వనాథ సాహిత్య సాగరంలోని అధ్బుతమయిన విషేషాలను వివరించాలన్న తపన కలుగుతూండేది.

మనకు మంచి తెలిస్తే పది మందితో పంచుకుంటే మంచి పెరుగుతుంది. అందుకని, విశ్వనాథ సాహిత్యాన్ని నేను అర్ధం చేసుకున్న రీతిలో ఇతరులకు చేరువ చేస్తూ, నేను గ్రహించిన మణిమాణిక్యాలు, అందుకున్న అమూల్యమయిన సంపదలను అందరితో పంచుకోవలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను.

ఈ విషయాన్ని ఒక వ్యాస పరంపరగా రాస్తానని ఏ పత్రికతో అన్నా ఏదో ఒక కారణం చెప్పి ఎత్తగొట్టేవారు. నిలదీసి అడిగితే, ఆయన సాహిత్యంలో ఇప్పటి తరానికేముంది అని తమ అఙ్నానాన్ని ప్రదర్శించుకున్నారు. కొందరు, ఆయన్ సాహిత్యాన్ని పరిచయటం చేయటం మతానికి సంబంధించింది, వొద్దులెండి అని తమ లౌకికతను చాటుకునేవారు. ఆ చ్చాందసుడా, వొద్దొద్దు అని తమ భ్యుదయ ప్రోగ్రెస్సివ్ భావాలు చూపేవారు.

ఇలాంటి అనేక అనుభవాల వల్ల విసిగిపోయాను. ఇంతలో బ్లాగులు లభించటం వల్ల బ్లాగులో రాదామనుకున్నాను. పత్రికలలో వున్న పరిమితులు బ్లాగులో వుండవు. కానీ, అనెక కారణాల వల్ల ఆయన్ చిన్న కథల పరిచయం ఆరంభించి కొన సాగించలేకపోయాను.

చివరికి, ఇప్పుడు, అనేక కారణాల వల్ల, నేను పత్రికలలో కాలం లను స్వచ్చందంగా తగ్గించుకుంటున్నాను. కాబట్టి, నేను ఇష్టంగా చేయాలనుకుంటున్న పనులను బ్లాగు ద్వారా వెలువరించాలని నిశ్చయించాను. పత్రికలు ప్రచురించ నిరాకరించినవి, నాకు నచ్చినవి, బ్లాగు ద్వారా పాఠకులకు చేరువచేయాలన్న ప్రయత్నం ఆరంభించాను. అందులో భాగంగా, ఫేస్ బుక్ లో సాహిత్యకాగడా పేజీని ఆరంభించి, నిర్మొహమాటమయిన విమర్శలు చేస్తున్నాను. నా బ్లాగులో నేను ఎంతో కాలంగా అనుకుంటున్న విస్వనాథవారి సాహిత్యాన్ని పరిచయం చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాను.

నా జీవితంలో కీలకమయిన దశలో విశ్వనాథ సాహిత్యం నాకు పరిచయం అయింది. అది వ్యక్తిగతంగా నాకెంతో లాభించింది. ఇతరులు సందేహాలలో కొట్టుకుపోతున్న వేళ, నేను నిశ్చలంగా నిలవగలిగాను. విశ్వనాథ సాహిత్యంతో పరిచయం లేకపోవటం వల్ల్, సమాజము, యువ తరమూ, యువ రచయితలూ ఎంతగానో నష్టపోవటం చూస్తున్నాను. అందుకని, నేను అర్ధం చేసుకున్న విశ్వనాథను అందరితో పంచుకునే ప్రయత్నం ప్రారంభిస్తున్నాను.

విశ్వనాథ సాహిత్యం అనంతమయిన సాగరం. నేను పండితుడను కాను. కానీ, సృజనాత్మక రచయితగా, సున్నిత మనస్తత్వం కలవాడిగా, భావుకుడిగా, రొమాంటిక్ గా, దేశ భక్తుడిగా, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం, వారసత్వం, వాఙ వారసత్వం, వాఙయాలపైన అచంచలమయిన విశ్వాసం వున్నవాడిలా నాకు అర్ధమయిన విశ్వనాథను మీముందుంచుతున్నాను. స్వీకరించినా, తిరసరించినా….విశ్వనాథార్పణం

September 10, 2013 · Kasturi Murali Krishna · 7 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

విశ్వనాథ కథలు-విమర్శ– ఉపోద్ఘాతం-2

విశ్వనాథ కథా సాహిత్యాన్ని విమర్సించేకన్నా ముందు మరిన్ని అప్రస్తుతంగా అనిపించే అవసరమయిన విషయాలను ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ఎందుకంటే వీటివల్ల మనకు విస్వనాథ సాహిత్య సృజన గురించిన అవగాహన కలుగుతుంది. విశ్వనాథ ప్రత్యేకం కాదనీ ప్రపంచ సాహిత్య స్రవంతిలో ఒక ధారలో భాగమని స్పష్టమవుతుంది.

విశ్వనాథ సాహిత్యాన్ని గురించిన సమగ్ర ద్రుక్పథాన్ని కలిగించటానికి నేను అధికంగా ఆఫ్రికన్ రచయితల రచనలను ఉదాహరిస్తున్నాను. దీనికి కారణం ఏమిటంటే మనకూ ఆఫ్రికన్లకూ బోలెడన్ని విషయాలలో సారూప్యతలున్నాయి.

మనలాగే వారూ శ్వేతేతరులు. మనలాగే వారికీ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానాలు, ధర్మాలు, భాషలూ వున్నాయి. మనలాగే వారూ బానిసలయ్యారు. మనలాగే వారిగురించీ బోలెడన్ని అపోహలూ, అవాకులూ చవాకులూ ప్రచారంలో వున్నాయి. మనలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకూ ఒకేరకమయిన ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. మనలాగే వారి అస్తిత్వమూ, అటు క్రీస్టియానిటీ ఇటు ఇస్లామీయుల వల్ల ప్రమాదంలో పడింది. మనలాగే వారిలోనూ అనేక అంతర్గత విభేదాలూ, విద్వేషాలూ సృష్తించారు. మనలాగే వారూ ఈనాటికీ అనాగరికులుగా చలామణీ అవుతున్నారు. కాబట్టి వారి సాహిత్యాన్ని, వారి ప్రయత్నాలనూ గమనిస్తే మనకు మన ప్రయత్నాలూ అర్ధమవుతాయి. మన దేశంలోనూ ఆత్మ గౌరాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచేరీతిలో జరిగిన సాహిత్య స్ర్జన స్వరూపాన్ని రంగుటద్దాలు, అపోహలు లేకుండా అర్ధంచేసుకో గలుగుతాము. అయితే, ఏదేశానికాదేశానికి ఒక ప్రత్యేక జీఎవలక్షణం వుంటుంది. అందువల్లా లక్ష్యాలు ఒకటే అయినా స్వరూపాలు వేరవుతాయి. ఇది కూడా మనం విస్వనాథ సాహిత్యాన్ని విస్లేషించేసమయంలో పరిగణనకు తీసుకోవాల్సి వుంటుంది.

***

ఆఫ్రికా తొలితరం ఆంగ్ల రచయిత అమోస్ తుతువోలా ది పాం వైన్ డ్రింకార్డ్ అనే నవలను రచించాడు. ఈ నవలను ప్రచురించవద్దని కోరిన వారందరూ విదేశాలలో వున్న నల్లవారే. ఈ నవలలో వున్న ఆంగ్ల వ్యాకరణ దోషాలను ఎత్తి చూపించి చీదరించుకున్న వారంతా ఆంగ్లం నేర్చి విదేశాలలో వున్న నల్లవారే. నల్లవారి రచనలను తక్కువ చేస్తూ after reading a few pages you tell yourself you are plodding. but when u are reading the same thing written by an english person or somebody who lives in england you find you are enjoying because the language is so academic and so perfect. అని రాసినవారూ నల్ల ఆంగ్ల రచయితలే. అంటే, పాలకుల అభిప్రాయాలకు భిన్నమయిన అభిప్రాయాన్ని వెలిబుచ్చినా, పాలకుల గొప్పతనం కాక తమ ఔన్నత్యాన్ని కించిత్తయినా ప్రదర్సించినా మేధావులు ఒప్పుకోరన్నమాట. ఎందుకంటే, వారికి తెలిసినంత మనకు తెలియదు కదా. వాడు తప్పుచెప్పినా దాన్లో అర్ధాలుంటాయి. మనం నిజం చెప్పినా అది పనికిరానిదన్నమాట. ఇక్కడ పాలకులతోపాటూ వామపక్ష మేధావులనూ జోడిస్తే మన పరిస్థితికి దగ్గరగా వస్తాము.
అయితే, ఆఫ్రికన్లు ఇప్పుడు, ఆంగ్లం వదిలి స్థానిక భాషలలో ఉద్యమంలా రచనలు చేస్తున్నారు. మన దగ్గర రంగుటద్దాల చూపుల వల్ల, స్వతంత్ర బానిస మనస్తత్వం వల్ల స్థానిక భాషలు అస్తిత్వం కోల్పోయే స్థితికి దిగజారుతున్నాయి.

మిగతాది మరో భాగంలో…

November 17, 2012 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: Uncategorized, విశ్వనాథ కథాసాహిత్యం.

విశ్వనాథ కథలు- విమర్శ- ఉపోద్ఘాతం.

విశ్వనాథ కథలగురించి చర్చ ఆరంభించేముందు కొన్ని అప్రస్తుతంగా అనిపించే అవసరమయిన విషయాలు ప్రస్తావించుకోవాల్సి వుంటుంది.

ప్రపంచంలో ఇతరుల పాలనలో వున్న దేశాల సాహిత్యంలో ఒక సారూప్యత వుంటుంది. ఇది చాలా ప్రధానమయిన విషయం.

ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ప్రతి దేశంలో అనేక విభిన్న ఆచార వ్యవహారాలు, పద్ధతులు, జీవన విధానాలూ వుంటాయి. ఎవరికి వారికి వారివారి పద్ధతులు గొప్ప. కానీ, ఎప్పుడయితే ఈ ప్రజలు పరాయి పాలనలోకి వస్తారో, అప్పుడు, వీరు తమ స్వీయ పద్ధతుల స్థానంలో పాలకుల వ్యవహారాలను ఆచరించాల్సి వస్తుంది. ఇది, పాలకుల ఆధిక్యతకు నిదర్శనం. కానీ, అందరూ పాలకుల ఆధిక్యతను ఆమోదించరు. కొందరు, తమ స్వీయ పద్ధతులను కొనసాగించాలని చూస్తారు. దాంతో ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణలో స్థానికులను ఒకటిగా చేయటంలో, పాలకుల పట్ల స్థానికులలో వ్యతిరేకత పెరగటంలో , వారి ప్రాచీన పద్ధతులు ప్రధాన పాత్ర వహిస్తాయి.

అయితే, బానిసలుగా కొంత కాలం మనటం వల్ల స్థానికులలోనే వేర్వేరు దృక్కోణాలు ఏర్పడతాయి. పాలకులు ప్రామాణికంగా భావించినదాన్ని నమ్మి తమనితాము కించపరచుకునేవారు,ఇందుకు భిన్నంగా, తమ గొప్పతనాన్ని నమ్ముతూ, పాలకులను తక్కువ చేసేవారూ తయారవుతారు. ఏదయినా విషయాన్ని అన్నికోణాలలో చూసి వివరించేవారు అరుదవుతారు. సాధారణంగా ఈ పని మేధావులు, కళాకారులు చేస్తారు. కానీ, అనేక సందర్భాలలో కళాకారులు సైతం అవేశాలకు గురవుతారు. పాలకులను నమ్మేవారి హేళనకూ గురవుతారు. కానీ, వీరు తమ జాతి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఉద్దీపితం చేస్తారు. వారి కళ ప్రాధాన లక్ష్యం అదే.

అలెక్స్ హేలీ పేరు అందరికీ పరిచయమే. ఈయన ప్రధానంగా రూట్స్ రచించింది, మన వామపక్ష విమర్శకులు ప్రచారం చేసినట్టు, అణచివేతను దోపిడీనీ చూపటానికి కాదు. అలెక్స్ హేలీ రచనలో అడుగడుగునా, తన పూర్వీకులను అనాగరికులుగా భావించిన వారి అమానుష అనాగరికత పట్ల ఆక్రోషం, తన తెగ వారి ఔన్నత్యాన్ని ప్రదర్శించటం.

ఈ రచనలో చివరలో ఒక సంఘటన వుంటుంది. ఎంతో కష్టపడి తన పూర్వీకుల తెగను కలుసుకుంటాదు అలెక్స్. అప్పుదు, తన వారిని చూసి సీగుపడతాడు. ఎందుకంటే వారంత నల్లగా తాను లేనందుకు. తన నలుపులో తెలుపు కలిసినందుకు తాను అపవిత్రుడనని సిగ్గుపడతాడు. న్యూనత భావానికి గురవుతాడు.

చినువా అచెబె అనే నైజీరియా రచయిత వున్నాడు. ఆయన తల్లి తండ్రి క్రైస్తవం స్వీకరించారు. కానీ, కాస్త స్వతంత్రం రాగానే అచెబె, తన క్రీస్టియన్ పేరును వదిలి, సాంప్రదాయిక పేరు పెట్టుకున్నాడు. అతడి రచనలన్నీ తన తెగ ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చూపించేవే. ఆయన రచించిన థింగ్స్ ఫాల్ అపార్ట్ నవలనూ వామపక్షీయులు అణచివేతకు ప్రతీకగా నిలపాలని తహతహలాడతారు. కానీ అచెబె రచనలలో అణచివేత కన్నా క్రీస్టియన్ మిషనరీల వల్ల తాము కోల్పోయిన తమ తనాన్ని ప్రదర్శించటమే వుంటుంది. మిషనరీల అన్యాన్ని ఎత్తి చూపటమే వుంటుంది. అచెబె రచనా శైలి కూడా ప్రాచీన తెగలు కథలు చెప్పే పద్ధతిలో వుంటుంది. వారు పండుగలు పబ్బాలు నిర్వహించుకునే విధానన్ని చూసి గర్విస్తున్నట్టుంటుంది.

అచెబె చెప్పే ఆఫ్రికా కథ వొకతుంది. ఒక ఆఫ్రికా తెగవారి పక్క గ్రామంలో మరో తెగ వారు వచ్చారు. ఈ కొత్తగా వచ్చిన వారికి దేవుళ్ళు లేరు. వారు పాత తెగ వారి దగ్గరకు వచ్చి మీ దేవుళ్ళను మేము వాడుకోవచ్చా అని అడిగారు. పాత తెగవారు జాలిపడి తమ దేవుళ్ళనిచ్చారు. కానీ ఒక నియమం పెట్టారు. అదేమిటంటే, కొత్త తెగవారి దేవుళ్ళను పాత తెగ దేవుళ్ళ కొడుకులని పిలవాలి తప్ప పాత తెగల దేవుళ్ళ పేరుతో పిలవవద్దు. అంటే ఆఫ్రికా తెగలలో ఎవరికి వారికి ప్రత్యేకత, స్వాతంత్ర్యం వుండాలని వుండేది తప్ప, తమ దేవుళ్ళను అందరిపై రుద్దాలనీ, అందరూ తమ దేవుళ్ళనే పూజించాలనే సంకుచితత్వాలు లేవన్నమాట.

విశ్వనాథ సత్యనారయణ రచనలను కూడా, ఈ నేపథ్యంలో మనము అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. విష్లేషించాల్సి వుంటుంది.

November 12, 2012 · Kasturi Murali Krishna · 6 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

విశ్వనాథ కథలు- విమర్శ: నాందీ ప్రస్తావన.

నేను ఎప్పటినుంచో విశ్వనాథ వారి సాహిత్యాన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా రాస్తానని అనలేను. సమయం కుదిరినప్పుడు రాస్తాను.

కథల ప్రసక్తి వచ్చినప్పుడలా మన ప్రొఫెషనల్ విమర్శకులు గురజాడ తో ఆరంభించి శ్రీపాద, కొడవటిగంటి, బుచ్చిబాబు, గోపీచంద్, చలం మధురాంతకం రాజారాం, ఇలా సాగుతారు. మధ్యలో కాళీపట్నం, రావిశాస్త్రి, చాసో ల ద్వారా ఇప్పటి విప్లవ, ఉద్యమ రచయితల దగ్గరకు వస్తారు.

వీరిలో ఒక రకం వారు, సంఘటనల నడుమ చుక్కలు వుంటే కథ, లేకపోతే కథానిక అంటూ సిద్ధాంతాలు చేస్తారు. ఇంకో రకం వారు, ఎత్తుగడ, ముగింపు, శైలి,శిల్పం అంటూ అవేమిటో వారికీ తెలియని శాస్త్రాలు చెప్తారు. అయితే వీరంతా అత్యుత్తమ కథకులుగా పరిగణించే వారిలోనూ, అత్యుత్తమ కథలుగా ఉదాహరించేవాటిలోనూ, ప్రామాణికంగా సూచించే వాటిలోనూ విశ్వనాథ పేరు కానీ, అతని కథలు కానీ కనపడవు. చాలామందికి విశ్వనాథ కథకుడనీ తెలియదు. అనేకులు ఆయన పేరు చెప్తేనే పాపం శమించుగాక అన్నట్టు చెవులు, కళ్ళు మూసుకుంటారు. ఘూకం కేకల్ల, బేకం బాకల్లా కథల గురించి మాట్లాడేవారెవ్వరూ పాపం చాందస, బూజుపట్టిన, బూర్జువా భావ సమర్ధక, సాంప్రదాయ బురదనే పరిమళంగా భావించే అంధ అహంకారిలా విశ్వనాథను కొట్టి పారేస్తారు తప్ప ఆయనను చదవాలనేకాదు, కనీసం ఆయన పుస్తక దర్శన పాపానికి కూడా ఒడిగట్టినవారు కాదు. అలాంటి వారికోసమేకాదు, సామాన్య పాఠకులకూ సాటి రచయితలకూ కూడా విశ్వనాథ కథా సాహిత్యాన్ని పరిచయం చేయాలని నాకెప్పటినుంచో ఆలోచన వుంది. కానీ, అది కార్య రూపం దాల్చటంలో ఇటీవలె బ్లాగులోకంలో ఈమెయిల్ ద్వారా విశ్వనాథపై రారా రాసిన వ్యాసాం అండటం ఎంతో తోడ్పడింది. నేనిలా కాలయాపన చేస్తూంటే కాలం మించి పోతుందేమో అన్న ఆలోచన కలిగింది. అందుకే కనీసం మధ్యముడిలా అయినా మిగిలిపోదామని ఆరంభించాను.

ఇకపై అవకాశం దొరికినప్పుడల్లా ఒకో విశ్వనాథ కథను పరిచయం చేస్తాను. ఇది ఆరంభ వ్యాసము. పరిచయ వ్యాసమే. ముందురాబోతున్నాయి విశ్వనాథ కథల పరిచయాలు.

November 1, 2012 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.