Archive for the ‘sahityakaagada’ Category

1929లో కాబట్టి రాయగలిగిన పొలిటికల్లీ పూర్తిగా ఇంకరెక్ట్ కథ.

సాహిత్య కాగడాలో వేలూరి శివరామ శాస్త్రి గారి గురించిన వ్యాసాలకు ఈ వ్యాసం తరువాత కాస్త విరామం వుంటుంది.

ఈవారం పరిచయం చేస్తున్న కథ గురించి తెలుసుకున్న తరువాత ఎందుకని వేలూరి శివరామ శాస్త్రిగారు, ఆయన కథలను ఎవరూ ఎందుకు ప్రస్తావించరో అర్ధమవుతుంది. ఆయన చేదు నిజాలను ఎంత నిక్కచ్చిగా ప్రదర్శించారో తెలియటంతో పాటూ పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథలెలా వుంటాయో స్పష్టమవుతుంది. నిజాలు చెప్పటం నేరమయిన మన సాహిత్య ప్రపంచంలో, ఇలాంటి నిజాలు చెప్పిన వేలూరి గారిని తలవటమెంత పాపమో బోధపడుతుంది.

కథ పేరు వ్యత్యము.

కథ తొలి వాక్యంలోనే చూచాయాగా కథాంశం తెలుస్తుంది.

‘నరసిమ్హులుకు కాటడు పాలేరు. ఇపుడిరువురికిని సుమారు ఎనుబడేండ్లు.’

ఈ వాక్యం చదవగానే మారుతున్న కాలాంతో, మారుతున్న తరాలతో రూపాంతరం చెందుతున్న జీవన విధానాలు, ఆలోచనలు, విలువలు, తద్వారా రూపాంతరం చెందుతున్న మానవ సంబంధాల స్వరూపాన్నీ ఈ కథ ప్రదర్శించబోతోందని ఊహించవచ్చు.

వారిరువురికి ఎనబదేండ్లు అనటంతోటే ఒక తరం, ఆ తరం ప్రాతినిథ్యం వహించే విలువలన్నీ అవసాన దశలో వున్నాయని తెలుస్తుంది.

నరసిమ్హులుకి కాటడు, పాలేరు నమ్మినబంటు మాత్రమే కాదు, ప్రాణానికి ప్రాణం కూడా.

‘దొరవలన పాలేరును పాలేరువలన దొరయు సుఖజీవనమొనరించిరీ అన్న వాక్యం ద్వారా రచయిత సమాజంలో ఒక పద్ధతి ప్రకారం నెలకొల్పుతున్న అపోహలు, అపవాదులు, దురూహల అసలు రూపాన్ని బట్టబయలు చేస్తాడు, ఎలాంటి ఉపన్యాసాలు, సిద్ధాంత చర్చలూ లేకుండా.

దొరకొడుకు సోములు. పాలేరు కొడుకు రాములు. ఒకరోజు కాటడు, సోములుకెదురుపడతాడు. అప్పుడు సోములు, దూరముగానుండూ అంటాడు. అంటే మారుతున్న తరంతో మారుతున్న విలువల ఆధారంగా మారుతున్న మానవసంబంధాలను ఈ వొక్క సంఘటన ద్వారా రచయిత ప్రదర్శిస్తున్నాడు. తండ్రికి ప్రాణం, కొడుకుకి దూరం (అంటరానివాడు).

కాటడు తానుదాచిన నూరుకాసులను దొర దగ్గర దాస్తాడు. ఈ విషయం కొడుకులకూ చెప్తారు. పాత తరం మరణిస్తుంది.

తండ్రి మరణం తరువాత సోములు తన పొలమేకాదు, రాములుకిచ్చిన పొలంలోనూ వ్యవసాయం మానేసి వ్యాపారం చేస్తాడు. రాములు, సోములు వద్దకొచ్చి, పొలంలో వ్యవసాయం చేస్తానంటాడు. ‘తమ నాయనగారి అనుగ్రహమునే తమరు నాయెడ నవలంబింపుడు. నేను మీ వ్యవసాయమంతయు చేసెదను.’ అంటాడు.

కానీ, సోములు అందుకు నిరాకరిస్తాడు.’ నీకు పొలమును లేకు. కాసులంతకన్న లేవూ అని పత్రాలు చింపేస్తాడు.

దాంతో రాములు దయనీయమయిన స్థితికి దిగజారతాడు. తినటానికి తిండి వుండదు. అప్పుడు, రెబెకా అనే యువతి అతనిపై జాలి చూపిస్తుంది. తిండి పెడుతుంది. ఆమె తండ్రి రాములు మతం మార్చుకుని కూతురిని పెళ్ళి చేసుకోమంటాడు.

‘నేనిపుడు నిరుపేదను. మతము పుచ్చుకొనినంత మాత్రమున పిల్లనిత్తువా?’ అని అడుగుతాడు. దానికి ఆమె తండ్రి, మతం మారితే ‘నీవు పంతులవగుదువూ అని ఫాదరీ దగ్గరకు తీసుకెళ్తాడు.

ఫాదరీ అతడికి కిరస్తానీ గురించి చెప్తాడు. ఒక నెల రోజుల తరువాత రాములు జకరయ్య అవుతాడు. రెబెకాకు అతడికి పెళ్ళవుతుంది.

నూరునేబది రూకలు నాకిచ్చుచో పాతికరూకల పంతులపని ఇప్పిస్తానని ఫాదరీ అంటాడు.

‘ అయ్యా, అన్నముచే కడుపు నిండుననియూ, బైబిలుచే నోరు నిండుననియు సద్ వృత్తిచే మనస్సు నిండుననియు నేను మతమున గలిసితిని. నాకు పాటకూటికి టికాణా లేదు” అంటాడు.

చివరికి జకరయ్య పంతులు, రెబెకా పంతులమ్మ అవుతారు.

‘రెబెకా జకరయ్యలు ప్రతి ఆదివారము నాడును యేసు పేర పావలా ముదుపు కట్టవలసియుండెను. వేరు వేరు పండుగలలో పందుగపందుగకు ఒకొక రూపాయి యీయవలసి వచ్చెను. నెలకొక రూపాయి ఇచ్చి మత వా~ంమయము కొనవలసి యుండెను. ఇదియంతయు చూడగా కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో లాగుకొను చందముగాయుండెను. ‘

ఇలాంటి స్థితిలో జకరయ్య ఫాదరీ దగ్గరకు వెళ్ళి ఇది అన్యాయమంటాడు. అప్పుడా ఫాదరీ ‘ మీకును ఏసునకును సాక్షాత్సంబంధము లేదు. మాగుండా మీరాయేసు ముంగిలికి మాత్రమే రాగలరూ అని తిడతాడు. ఉద్యోగంలోచి తీసేస్తాడు, ఎందుకంటే జకరయ్య యేసు చెప్పిన సూక్తులను ఫాదరీకి చెప్పి అతని నైచ్యాన్ని, యేసు బోధలకు వ్యతిరేకంగా వున్న అతని ప్రవర్తనను ఎత్తి చూపిస్తాడు.

అప్పుదు రెబకా’ కిరస్తానీ మతము కాని మతమూ అంటుంది.

జకరయ్య, ‘విద్యావినయములుకల బ్రాహ్మణుదును మాలడును ఎరుకగలవారికొకటే యని చదువుచు దానియర్ధమును త్ర్ణీకరించు సోములుగారే చెడ్డవారని యనుకొంతిని. దైవమును చింతించుచుండువారిని దైవమే కాపాదునని చదువు పాదరీ సోములుగారికి తీసిపోయెనా? ఏమతములో తప్పున్నది, స్వార్ధపరుడగు మానవులో గాక?’ అని ప్రశ్నిస్తాడు.

ఇదీ కథ. కథ గురించి తెలిస్తూంటేనే ఎంతగా పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథనో ఇది అర్ధమవుతుంది.

ఎంత ధైర్యం లేకపోతే, భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఒకప్పుడు ఇప్పతిలా లేదని, కులాలున్నా వారి నదుమ సఖ్యత, స్నేహము, అవగాహన గౌరవాలుండేవని చెప్పటం ఎంత ఘోరం? ఇంత పచ్చి చేదు నిజాన్ని చెప్తే, సమాజంలో ద్వేష భావనలు రెచ్చగొడుతూ పబ్బం గదుపుకునే వారి మనుగడలేమి కావాలి?

మతం మారిపోయినా, హిందువులుగా వున్నప్పుడు పొందే సౌకర్యాలన్నీ పొందుతూ, అందువల్ల లాభపడుతూ, ఆవలి గట్టుకెళ్ళి, ఈవలి గట్తుపై దుమ్మెత్తి పోసి, ఏరు దాటి తెప్ప తగలేస్తూ, పబ్బం గడుపుకునే వారికి ఇలాంటి కథలు ప్రచారంలోకి వస్తే ఎంత నష్టం? తమ అసలు రూపాలను కథకులు ఇలా బయట పెడుతూంటే వారి మనుగడ ప్రస్నార్ధకమయిపోదూ?

అందుకే, ఏదో 1929లో కాబట్టి ఇలాంటి కథ ఆయన రాశాడు, పత్రికలు వేశాయి. ఇప్పుడు ఇలాంటి కథలు రాసే ధైర్యమెవరూ చేయరు. చేసినా జాగృతి లాంటి పత్రిక కూడా వేసే ధైర్యం చేయదు. దాంతో మసిపూసిన మారు నిజాలే తప్ప అసలయిన చేదు నిజాలను రచయితలు ప్రదర్శించే సాహసం చేయటం లేదు. దాంతో కొన్ని తరహా కథలేతప్ప తెలుగు సాహిత్యం తెలుగు సమాజిక జీవితాన్ని సంపూర్ణంగా ప్రదర్సించలేక పోతోంది.

అందుకే, విదేశీ సాహిత్యంలో తీవ్రవాదాన్ని నిరసిస్తూ, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాం సమాజంలో జరుగుతున్న సంఘర్షణ, సామాజిక, మానసిక సందిఘ్ధాలను చూపుతూ కథలొచ్చాయి కానీ, తెలుగులో మాత్రం మైనారిటీలెంట భయంతో వణికి పోతున్నారు, మెజారిటీలెలా తమ మతాన్ని మైనారిటీలపై రుద్దుతున్నారో తప్ప మరో రకమయిన కథలు రావటం లేదు. వాతికి ఆదరణ లేదు. అందుకే, వేలూరి వారి గతి పట్టకుండా వుండాలనే కథకులంతా పొలితికల్లీ కరెక్ట్ కథలే రాస్తున్నారు. విమర్శకులూ ఆ పరిథిలోనే తమ బావుల్లో కప్పలుగా భద్రంగా వున్నారు. తెలుగు సాహిత్యాన్ని వీధిలో పారేశారు. పాథకులు పారిపోతున్నారు.

December 22, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada

1927నాటి వేలూరి గారి అద్భుతమయిన కథ.

వేలూరి శివరామ శాస్త్రి గారి కథ పరిచయానికి వచ్చిన స్పందన చూసి ఉత్సాహంతో కాగడా ఆయనవే మరిన్ని పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ విస్ఫోటనాత్మకమయిన కథలను పరిచయం చేయాలని నిశ్చయించుకుంది.

మామూలు కథలు రాసే సాధారణ రచయిత అయినా, ఏదో ఒక ఉద్యమానికి, సిద్ధాంతానికి చెందినవాడయితే అతది పేరును, కథలను ఏదో రకంగా సజీవంగా వుంచుతారు. ముఖ్యంగా, వామ పక్షభావాలు, విప్లవాత్మక భావాలు, ఇతర ఉద్యమాలు, విప్లవాల భావాలు ప్రదర్శించే పిల్లి కూడా మాంసాహర పులులా భయంకర సహితీ వేత్త అయి బహుమతులందుకుంటుంది తెలుగు సాహిత్యంలో. అలాకాక, అతి గొప్ప కథలు రాసిన మహా రచయిత అయినా, భుజానికెత్తుకునే భజనగాళ్ళ విప్లవ గణాలు లేకపోతే మరుగున పడిపోతాడు. భావి తరాలకతనెవరో తెలియని పరిస్థితి వస్తుంది. కథలు, సాహిత్యం గురించి అంతా తెలుసన్నట్టు మాట్లాడేవారు కూడా వజ్రం అంటే తెలియకుండా వజ్రాలలో మునిగి తేలుతున్నట్టు మాట్లాడుతూ మభ్యపెడుతున్నారని వేలూరి లాంటి వారి రచనలు చదువుతూంటే తెలుస్తుంది. విశ్వనాథ అధ్యాపక వృత్తిలో వున్నవాడు కాబట్తి, ఆయనకనేక శిష్యులు, వారిలో కొందరు ఉన్నత స్థానాలలో వుండటం వల్ల ఆయన రచనలు సజీవంగా వున్నాయి, లేకపోతే, ఈ వామపక్ష అభ్యుదయ విప్లవాల అరుపులు కేకల హోరులో ఆయనకూ వేలూరి వారి గతి పట్టేది.

శివరామ శాస్త్రి గారు వేదాంతం, దర్శనాలు, సాంప్రదాయిక శాస్త్రాలు అధ్యయనం చేశారు. తిరుపతి వేంకట కవుల శిష్యులు. అవధానాలు చేశారు. ఆయన గ్రుహస్తాశ్రమాన్ని వాన ప్రస్థంలా కుటీరం నిర్మించుకుని గడిపారు. లోకానికి దూరంగా అధ్యనము, పథనము, రచనలు చేస్తూ గడిపారు. ఆయన స్నేహితులు పూనుకుని కొన్ని రచనలను భద్రం చేశారు కాబట్తి కొన్ని రచనలయినా మనకు లభిస్తున్నాయి. అనెక రచనలాయనవి కాలి బూదిదయిపోయాయి.

కథలలో అత్యంత నిగూఢమయిన, అతి క్లిష్టమయిన తాత్విక సత్యాలను, మీమాంసలను, అతి సరళమయిన రీతిలో ప్రదర్శించటం అత్యధ్భుతమయిన కథ సౌందర్యోపాసనలో కనిపిస్తుంది.

అలకనందుడనే రాజులు లేక లేక విజయవర్మ అనే కొడుకు పుడతాడు. విజయవర్మను రాజు గారాబంగా పెంచుతాదు. విజయవర్మకు సౌందర్యోపాసన అధికము. పిల్లవాదిని గురుకులం పంపే సమయం వస్తుంది. పంపాలా, వద్దా, అని రాజు ఆలోచిస్తూంటే విజయవర్మ స్వయంగా గురుకులానికి వెళ్తాడు. తాను రాకుమారుడయినా, గురుకులంలో పాతించే నియమాలన్నీ విజయవర్మ పాతిస్తూటాడు.

ఇక్కడ రచయిత కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు.

వస్తువునందలి యందమును జూచి యానందించుట కొందర ప్రకృతి. అందమగు వస్తువును త్యాగము గావించి యానందించుట కొందర ప్రకృతి. అందమగు వస్తువునుపభోగించుట కొందర ప్రకృతి.

విచ్చిన పూవునందు భగవంతుని జూచి యానందించు వారొకరు. దానిని గోసి తెచ్చి భగవంతుని బూజించి యానందించు వారింకొకరు. దానిని త్రుంచి తురుమున తురుముకొని యానందించు వారు మరియొకరు.

విజయవర్మ ఆశ్రమంలో కొన్ని అందమయిన విషయాలు చూస్తాడు.

మరుసటి రోజునుంచీ ఆశ్రమంలో విద్యార్థుల వస్తువులు మాయమవుతూంటాయి. దాంతో అల్లకల్లోలమవుతుంది ఆస్రమం. రకరకాల కథలు ప్రచారంలోకి వస్తాయి.

ఇది విజయవర్మ మనసులో దొంగతనమంటే ఏమిటన్న మీమాంసను రగిలిస్తుంది.

ఇక్కడే రచయిత ప్రతిభ తెలుస్తుంది. కథా గమనానికి భంగం కలగకుండా, పాథకుడికి ఏదో బఒధిస్తున్నట్తు విసుగు రాకుండా గొప్ప తర్కాన్ని తాత్విక సత్యాన్ని రచయిత చిన్న వాక్యాలు, అలతి పదాల్లో చూపిస్తాడు.

ఒక రాజును జయించి మారియొక రాజు వాని భూమినంతయు గలుపుకొనుచున్నాడు. అది పరాక్రమము.

పొలతిని పురుషుడును పురుషుని పొలతియు పరస్పరమాకర్షించి అపహరించుకొనుచున్నారు. ఇది ప్రేమ.

ప్రతి నిముషము ప్రతివాదును పంచభూతములను అపహరించుచునే యున్నాడు. ఇది దైవర్ణము.

పట్టుపదనిచో రాజు. పట్తుపదినచో దొంగ.

జగత్తంతయు దొంగల కొట్టు.

ఇలా ఆలోచిస్తున్న విజయవర్మకు దొంగతనమంటే ఏమిటో తెలుసుకోవాలని వుంటుంది.చర్చ ఇలా సాగుతుంది.

అయ్యా దొంగతనమనిన నేమి?
ఒకని వస్తువును మరియొకడు వాని యనుమతి లేక తనదిగా జేసికొనుట దొంగతనము. ఇది సామాన్య లక్షణము.

వస్తువొకనిదెటులగును?
ఈ బట్ట నేను నేసికొంటిని. ఇది నాది.
దీనిని దేనితో నేసిరి?
ప్రత్తినూలితో.
ప్రత్తియేడది?
ప్రత్తి మొక్కనుండి వచ్చినది.
ప్రత్తి మొక్క?
భీమినుండి.
భూమియెవరిది?
రేనిది.
రేనిదెటులాయెను?
రేడు జయించెను.
దేనిచే?
సైనికుల శక్తిచే.తన పరాక్రమముచే.
అగుచో రేడు దొంగ కాడా?
దొంగకాదని యెవడందుడు?కాని మిగిలిన దొంగల విప్లవమునుండి లోకుల గాపాడుటకీ గజదొంగ కావలయును. అది అన్యథ సిద్ధమగుచో నీ దొంగతో నంతగా పనిలేదు.

ఈ చర్చ జరిగిన రాత్రి విజయవర్మకొక కల వస్తుంది. ఆ కలలో అతదు ఇతర విద్యార్థులనుంచి దొంగిలించిన వస్తువులు తమ బాధలు చెప్పుకుంటాయి. అన్నీ కలసి విజయవర్మ మీదకు యుద్ధానికి వస్తాయి.

మరుసటి రోజు విజయవర్మ అందరి దగ్గరనుంచీ తాను దొంగిలించిన వస్తువులు వారికిచ్చేస్తాడు. ఈ ప్రపంచమున దొరకన్న వేర దొంగ యెవడు? అని అదుగుతాడు.

అప్పుడు గురువుగారు శిక్షగా అతదికి రాజ్యం కట్టబెడతారు. అందరూ తథాస్తు అంటారు. అప్పుడు విజయవర్మకు సౌందర్యబోధ కలుగుతుంది.

విజయవర్మకేమో గానీ, ఈ కథ చదివిన పాథకుడికి పలు రకాల, పలు ప్లేన్లలో సౌందర్యబోధ కలుగుతుంది.

ఇది ఎంతో గొప్ప కథ. చదివిన పాథకుదికి ఙ్నానం కలుగుతుంది. అవగాహన వస్తుంది, తన గురించి, తన చుట్టూ వున్న అంతహ్ బాహ్య ప్రపంచంగురించీ అవగాహన వస్తుంది.

ఈ కథలో విప్లవాలు లేవు కాబట్టి దీన్ని భావి తరాలకు అందించకపోతే నష్టం ఎవరికి? సమస్త ప్రపంచానికి.

అందుకే, విశ్వనాథ వారు ఒక మాట అన్నారు. సాహిత్యం సిద్ధాంతగతం కాకూడదని, తద్వారా సమాజంలో అసహజమయిన ద్వేష భావనలు చెలరేగుతాయని అందుకే, సిద్ధాంతగత సాహిత్యం సాహిత్యం కాదనీ అంటారాయన.

ఇలాంటి కథలు చదివితే వ్యక్తికి ఉద్రేకాలు, ద్వేషభావనలు కలుగవు. అవగాహన, విచక్షణ అలవడతాయి. విప్లవాలు, ద్వేషాలూ, చంపటాలూ లేకపోతే అది సాహిత్యం ఎలా అవుతుందనేవారికి నమస్కారం పెట్టి మరో అద్భుతమయిన కథ రేపు చెప్పుకుందాం.

December 5, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: sahityakaagada

సాహిత్యకాగడా మెచ్చిన 1949 నాటి పొలిటికల్లీ ఇన్ కరెక్టు కథ.

ఎప్పుడూ నిప్పు రవ్వలు వెదజల్లటమేనా? దారి చూపే దివ్వెగా కాగడా పనిచేయదా? అని ప్రశ్నిస్తూ వచ్చిన కాగడాభిమానుల సూచనను మన్నించి ఈవారం నుంచీ కాగడా మెచ్చిన, కాగడాకు నచ్చిన, సాహిత్య ప్రపంచం విస్మరించిన గొప్ప కథలను, కథకులను కాగడా వీలువెంబడి పరిచయం చేయాలని నిశ్చయించింది. అందుకిదే నాందీ ప్రస్తావన.

యువ కథకులేకాదు, తల పండిన కథకులు కూడా నోరిప్పితే గురజాడ, శ్రీపాద అంటారు. ఇంకా వెనక్కు వస్తే, కొకు, చలం, గోపి చంద్ అంటారు. ఇంకా వెనక్కు వస్తే, వోల్గా, కుప్పిలి పద్మ, కాశీభట్ల అంటారు. ఇంకింకా వెనక్కు వస్తే, ఇలాంటి పేర్లే వినిపిస్తాయి. నిన్న మొన్న కళ్ళు తెరచిన కథకులయితే, వెనక్కు చూడ కుండానే, తన కళ్ళెదుట వున్న, అనిల్ రాయలు, శివ సోమయాజులు, వేంపల్లె షరీఫ్ లాంటి పేర్లు చెప్పేసి తాము మెచ్చిన రచయితలు తప్ప మిగిలినవారంతా సోసో సాసా అంటారు.
ఇది ప్రస్తుతం ఏ రచయితను కదిపినా తెలుస్తుంది. తా వలచింది రంభ, తాను మునిగింది గంగ అని పెద్దలు ఊరకనే అనలేదు. ఎవరికి వారు కూటములుగా, ముఠాలుగా విడిపోయి విడిపోయి తమవారే గొప్ప అనుకోవటం వల్ల, వీరేర్పరచిన బాటలో తరువాత వారు గుడ్డిగా ప్రయాణించటం వల్ల, ఒకో తరానికి మనం ఎంతెంతో ముందుకు పోతున్నాము. ఇలా ముందుకు పోతూ, ఒకరిద్దరిని వెంట మోస్తూ, అనేకులను విస్మరిస్తున్నాము. దాని వల్ల, రాను రాను కొత్త తరాలకు గతం అన్నది తెలియని పరిస్థితి వస్తోంది. గతం గురించి తెలుసుకోవాలన్న తపన నశించి, తనకు తెలిసిన రెండు మూడు పేర్లే సర్వస్వం అని విర్రవీగటం, అది కాదన్న వాదిని పట్తించుకోక తమ మూర్ఖత్వంలో తాముండటం ఆనవాయితీగా మారుతోంది. ఇంకా యువ తరమయితే ఆ రెండు మూడు పేర్లూ వదలి, తమ స్నేహితులే అతి గొప్ప రచయితలు, వారి వెనకా ఎవరూ లేరు. ముందు వుండబోరన్నట్టు ప్రవర్తిస్తున్నాను.

కానీ, గతాన్ని విస్మరించిన ఏ జాతికీ భవిష్యత్తు లేనట్టు, తమ పూర్వీకుల సాహిత్యాన్ని విస్మరించిన ఏ సాహిత్యానికి కూడా భవిష్యత్తు వుండదు. తన పూర్వీకుల భుజాన నిలబడి మరింత ముందుకు చూడగలిగినది సాహిత్యమయినా, సమాజమయినా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది. ఇందుకు భిన్నంగా వర్తించ్స్తే, సాహిత్య మయినా, సమాజమయినా, యముని మహిషపు లోహ ఘంటల ఖణేల్, ఖణేళ్ళు వినాల్సివస్తుంది. గమనిస్తే, పాశ్చాత్య రచయితలు, వారు ఎలాంటి రచనలు చేసేవారయినా, తమ పూర్వీకుల సాహిత్యం గురించి ఖ్షుణ్ణంగా తెలిసిన వారయి వుంటారు. మన తెలుగు సాహిత్యకారులు, వారు పండితులయినా, ప్రొఫెస్సర్లయినా, ఈ విషయంలో తమ కంటి ముందు 15 సెంటీమీటర్ల దూరం కూడా చూడలేని హ్రస్వ దృష్టులే.

తెలుగు సాహిత్యంలో పొలిటికల్లీ కరెక్టు కథలే ఎందుకు రాస్తారో, అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుత కథకుడు వేలూరి శివ రామ శాస్త్రి గారికి పట్టిన గతిని గమనిస్తే అర్ధమవుతుంది.

వేలూరి గారు చాలా గొప్ప కథకుడు. అనన్య సామాన్య మయిన శైలీ శిల్పాలతో, సమకాలీన సంఘటనలను, నిక్కచ్చిగా, చేదు నిజాలను ఏమాత్రమూ ఏమార్చకుండా, కుండలు బ్రద్దలు కొడుతూ తన కథలలో ప్రదర్శించారు. ఆయన కథలు చదువుతూంటే, కాల యంత్రంలో వెనకకు ప్రయాణించినట్టనిపిస్తుంది. ఆయన కథలు చదువుతూంటే ఇప్పటి సమాజంలో మనం అనుభవిస్తున్న అనేక సమస్యలకు బీజాలు పడిన విధానమే కాదు, అందుకు కారణాలు తెలుస్తాయి. సమస్యల స్వరూపాలు, పరిష్కారాలూ బోధపడతాయి. అంతేకాదు, ఆయన కథలు మన సామాజిక అభివృద్ధిలో, చరిత్రలోని కీలకమయిన ఘట్టాలను సజీవంగా నిలిపే శక్తి కలవీ అని తెలుస్తుంది. ఆయన కథలు చదువుతూంటే ఎందుకని అవి పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథలో ఎందుకని ఏ విమర్శఖ శిఖామణీ, కథల కాణాచులూ, కథల ప్రాణ ప్రదాతలు, రక్షకులు, స్టేజీలెక్కి కథలెలా రాయాలో చెప్పే ఘనాతిగజఘనులూ ఈయన కథలను తలవరో, కనీసం తెలుసుకోరో, ప్రస్తావించక పోవటం వల్ల, ఈయన కథలు కనబడ్డా ఎవరూ పట్టించుకోకుండా ఎందుకు చేశారో తెలుస్తుంది.

వేలూరి శివ రామ శాస్త్రి గారి జీవిత కాలం, 1892 నుండి 1967. అంటే బ్రిటీష్ వారి హయాం, స్వాతంత్ర్య పోరాటం, నల్ల దొరల ప్రజాస్వామ్యం వంటి వన్నీ ఆయన అనుభవించారు. తన అనుభూతిని, భావి తరాలకు అందించారు.

1949 కాలం లో ఆయన రచించిన నకలు హైదెరాబాదు అన్న కథను ఈ వారం కాగడా పరిచయం చేస్తోంది. కథ చెప్పక మునుపే ఇది పూర్తిగా, పొలిటికల్లీ, సోషల్లీ, ఇంకా ఎన్నెన్ని ఇల్లులున్నాయో అన్నన్ని ఇల్లుల ప్రకారమూ రాయకూడని ఇంకరెక్ట్ కథ. ఎందుకో, కథ చదివితేనే తెలుస్తుంది.

అది నిజాములో ఒక జాగీరు. దానికి మురాద్ అని అపర నిజాం లాంటి జాగీరు. ఆ జాగీరులో 800 గడపలు, ఒక వంద గడపలకు గజ గజ లాడతాయి. ఏ గడపలెవరివో చెప్పనక్కర్లేదు. ఎంత పొలిటికల్లీ చెప్పకూడని నిజాన్ని చెప్పేశాడు రచయిత.

ఇంతలో ఒక రోజు ఆ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎవరో ఎగరేస్తారు. అపర నిజామయిన మురాద్ కు ఆగ్రహం వస్తుంది. జెండా ఎగరేసిన కాఫిరెవరంటాడు, మురాద్. అతని సేనన్ని బజ్జు అందరినీ రెచ్చగొడతాడు. తాను వెనుక నిలబడి రజాకార్లను ఉసి గొల్పుతాడు. రజాకార్లకు, ఇతర ప్రజలకు నదుమ గలాటా మొదలవుతుంది.

రజాకార్లు దెబ్బలు తింటూంటారు. రజాకార్లకిపుడు సంఖ్యాబల ప్రాబల్యము తెలిసి వచ్చెను అంటాడు రచయిత.

ఇంతలో, బజ్జు తుపాకీ తెస్తాడు. టపాకాయ పేల్చి తుపాకీ పేలినట్టు భ్రమ కలిగించటంతో ప్రజలు పారిపోతారు. రజాకార్లు విజృంభిస్తారు.

రజాకార్ల గృహములలో చెరపబడిన ఆడువారి యేడుపులు వినబడుచుండెను. అంటాడు రచయిత.

గ్రాహంపై పట్టు సాధించిన తరువాత బజ్జు మళ్ళీ తన అనుచరులను రెచ్చగొడతాడు. ఇంకా తమ మతములో చేరని వారిని, రజాకార్ల చేరుడు, ఎవడే పొలములో కాలు పెట్టునో వానిదే పొలము అని ప్రకటిస్తాడు. దాంతో పలువురు హరిజనులు రజాకార్లలో చేరి పొలాలు సాధిస్తారు. ఆ భయంతో, బంగారం తీసుకొని పారి పోతున్న వారిపై రజాకార్లు దాడి చేస్తారు.

తెల్లవారులోపల బజ్జు ఇల్లు బంగారమాయెను. అంటాడు రచయిత.

ఇంతలో కొత్త కోడండ్రు నవాబుకొక రేయి నజురానా అన్న ఫర్మానాను అనుసరించి బసవన్న గౌడు కొత్త కోడలిపై మురాద్ కన్నేస్తాడు. కోడలు గౌరమ్మ, మురాద్ భార్య ఫాతిమా అండ కోరుతుంది. ఫాతిమా, మారు వేషంలో గౌరమ్మ శయన మందిరానికి చేరుతుంది.

ఇంతలో మురాద్ చర్య తెలుసుకున్న యువకులు అతనితో యుద్ధానికి సిద్ధపడతారు. మురాద్ కు రక్షణగా రజాకార్లు వుంటారు.

మురాద్ గౌఉరమ్మ ఇల్లు చేరతాడు. ఫాతిమాను చూస్తాడు. ఆపై జరిగింది రచయిత రాతలోనే….

మురాద్ కుప్పున కూలెను. వాకిట కర్రలు లేచెను. రజాకార్ల తలలు పగిలెను.

అప్పుడు గూడెములో కొందరు కర్రలతో కత్తులతో బసవ గౌడు గదిలో ప్రవేశింప పోయిరి. ఫాతిమా ద్వారమునకడ్డుగా నిలిచి యు యస్ ఓ కు అపీలు చేసికొననిదే మీరు మా నిజాం గారిని బందీగా చేయవలదు అనెను.

సరిగ్గా ఆ సమయముననే -నిజాం హిందుస్తాన్ సేనలను తన సంస్థానము లోనికాహ్వానించెనని రేడియో

వానలో వాకిట పడియున్న బజ్జు, నిజాం గారికి ఒక కన్ను హిందువు, ఒక కన్ను ముసల్మాన్ అని యరచెను.

లోపల పడియున్న మురాద్, నేను కంఠము వరకు హిందువును, ఆపైని ముసల్మానును, అని అందరకును సలాము కొట్టి మరల నమస్కారము చేసెను.

ఇదీ కథ. ఈ కథ గురించి ఎవరూ ఎందుకు ప్రస్తావించరో, వేలూరి వారి కథలను గుర్తు చేసుకునేందుకే ఎందుకిష్టపడరో సులభంగా వూహించవచ్చు. ఎందుకని ఇలాంటి కథలను విస్మరించటం వల్ల, మరో రచయిత ఇలాంటి చేదు నిజాలు రాయకుండా చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ప్రయత్నాల ఫలితమే, ఈనాడుక మైనారిటీ కథలంటే, దేశంలో ఇస్లామీయులంతా పోలీసు దమనకాండలకు భయపడుతూబితుకు బితుకు మంటూ బ్రతుకుతున్నారనీ, మసీదుకెళ్ళాలంటే వనికి పోతున్నారనీ, మసీదు దగ్గర చెప్పులు పెట్తుకునే పిల్లాడు, ఎక్కడో చదువ్కుని నగరానికి వచ్చిన అమాయక యువకుడు అంతా అభద్రతతో అణగిపోతున్నారనీ స్థిరపడ్డాయో, ఇందుకు భిన్నంగా రాస్తే ఎవ్వరూ ఎందుకు పట్తించుకోరో తెలుస్తుంది. అర్ధసత్యాలనే అసలయిన సత్యాలుగా నమ్మించటం, నిజాన్ని తొక్కిపట్టటం తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సమస్యలస్వరూపం చెప్పకుండానే తెలుస్తుంది.

December 4, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada

ఫ్రంట్ సీట్ , కుప్పులి పద్మ కథ చదివిన సాహిత్యకాగడ.

చాలా రోజుల తరువాత మళ్ళీ సాహిత్యకాగడా జోలికి వచ్చాను. కాగడా జోలికి రాకపోవటానికి కారణాలనేకం. ఇప్పుడు, హఠాత్తుగా కాగడాను వెలిగించటానికి మాత్రం ఒకటే కారణం. కాగడా వెలిగించటానికి భరించలేనంత ప్రేరణ లభించటమే.

రచయితలందరికీ ఇది అనుభవమే. ఏవేవో రాయాలనుకుంటాడు. ఆలోచిస్తూంటాడు. కానీ, రాసే సమయం వచ్చేసరికి ఇవాళ్ళ కాదు,రేపు అనుకుంటూ వాయిదా వేస్తూంటాడు. కానీ, ఇంతలో హఠాత్తుగా ఏదో ఆలోచన వస్తుంది. దాన్ని రాయకుందావుండలేడు. ఎన్నో ఆలోచనలు ఇంకా ఆలోచన స్థాయిలో వుందగానే, ఈ ఆలోచన రచన రూపం ధరిస్తుంది.

సాహిత్యకాగడాలో ఎన్నో రాయాలని, ఇప్పుదు కాదు తరువాత అనీ, ఇవాళ్ళ కాదు రేపు అనీ అనుకుంటూ అనుకుంటూ వుండగానే, ఏమీ తోచక ఒక కథ చదివాను. అది చదివినప్పతినుంచీ నవ్వు ఆగటంలేదు. నవ్వీ నవ్వీ కన్నీళ్ళొచాయి. కన్నీళ్ళు కదుపునొప్పిగా మారాయి. అయినా నవ్వాగటంలేదు. ఇలాంటి చిన్న పిల్లలు కూడా నవ్వి, నేనేమన్నా తెలివి హీనమయిన చిన్నపిల్లలా కనిపిస్తున్నానా అనే కథలు రాసే పెద్ద రచయితలున్నారా అని తలచుకున్న కొద్దీ కుళ్ళీ కుళ్ళీ నవ్వొస్తోంది.

ఇంతకీ సాహిత్యకాగడాకి అంత నవ్వు తెచ్చిన కథేమిటంటారా….కాస్త ఆగండి.

ఈమధ్య రేదియోలో ఒక ప్రకటన వస్తోంది. విద్యాబాలన్ అనే నటి, నేను కాదు హీరోయిన్, ఫలానా ఆమె, పెళ్ళయిన మూదో రోజే ఇంత్లో టాయిలెట్ లేదని భర్తను వదిలి వచ్చింది. టాయిలెట్ కట్టే వరకూ ఇంటికి పోలేదు, కాబట్టి ఆమెనే అసలు హీరోయిన్ అంతుందా ప్రకటనలో విద్యాబాలన్.

అది విన్నప్పుడల్లా నవ్వొస్తుంది. టాయ్ లెట్టే కాదు, ఏ కోరిక అయినా తీరకపోతే వదిలివెళ్ళిపోతానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పనులు సాధించలనుకోవటం పిచ్చి తనము, వెర్రి తనము, మూర్ఖత్వము, చిన్న పిల్ల తనము లాంటి ఇంకెన్నో తనాలతో పాటు నైచ్యము కూడా. పైగా కొత్తగా పెళ్ళయిన పిల్ల మూడో రోజుననే ఇల్లొదిలి వెళ్ళిపోవటాన్ని హీరోయిన్ తనంగా చూపటం అత్యంత హేయమయిన ఆలోచన. కానీ మన ప్రభుత్వ కార్యాలయాల్లో , ముఖ్యంగా సృజనాత్మకత అవసరం వున్న కార్యాలయాల్లో పనిచేసేవారి సృజనాత్మకత గురించి ఏమాత్రం పరిచయం వున్న వారికయినా ఇంతకన్నా ఘోరమయిన ప్రకటనలు రానందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగని ప్రయివేటు వారి సృజనాత్మకత కూడా ఏమీ గొప్పగ అనుకునే వీలు లేదు. బైకు చూస్తే మైకమొచ్చి ఎక్కేసే మెదడు లేని యువతులు, పెళ్ళికెళ్తూ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోతే బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇచ్చినవాడిని పెళ్ళాడేస్తావా అనడిగే శూన్య బుద్ది యువతులు, తన దగ్గరకే మగాడొచ్చినా, కుక్కలు ఉచ్చపోసి తమ స్థలాన్ని నిర్ణయించుకున్నట్టు ఒక సెంట్ స్ప్రే చేసి ఇది నాది అనే జంతువుల్లాంటి యువకులూ, అదే గొప్ప అన్నట్టు మురిపెంగా చూసే ముద్దుగుమ్మటాలూ(కావాలని చేసిన టైపోటే) , ఇవన్నీ మన ప్రైవేట్ రంగం సృజనలే. అయితే సృజనాత్మక రచయితలూ, మహిళల గౌరవాన్ని నిలబెట్టి వారి స్వేచ్చ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబింపచేసేందుకు కంకణం కట్టుకున్న రచయిత్రులూ ఇలాంటి సృజనాత్మకతనే ప్రదర్సిస్తే నవ్వక ఏడుస్తామా? మహిళోద్ధరణ కార్యక్రమంలో ఉద్ధరణ ఉద్ధరిణలో పట్టేంత కూడా లేదని నిరూపిస్తూ కథలు వారే రాసుకుంటూంటే అది గ్రహించలేని విమర్శక ప్రపంచాన్ని, సాహిత్య పండితులను, అమాయక పాథకులను చూస్తూ ఏడవటం మొదలుపెదితే ప్రపంచమే మునుగుతుంది కాబట్టి నవ్వీ నవ్వీ చావకతప్పదు.

అనగనగా ఒక అమ్మాయి. ఆమెకు ఒక అబ్బాయితో పెళ్ళయిపోతుంది. అత్తగారింటిలో ఆమెకు పుట్టింట్లో వున్నట్టుండదు. దాంతో ఇల్లొదిలి పోతుంది. ఆమె ఇల్లొదిలిన కారణం తెలుసుకుని ఆడపడుచు అమ్మో నాకు పెళ్ళయితే నేనూ ఇలాంటి బాధలు పడాల్సి వస్తుందేమో, కాబట్టి, అమ్మా నాకు తగ్గ అత్తమామలున్న పిల్లాడితోనే పెళ్ళి చెయ్యమంటుంది. అత్తగారు కూడా తన తప్పు గ్రహించి సరిదిద్దుకుంటుంది. ఇదీ కథ. ఇదో కథా?

జీవితమంటేనే రాజీ పడటం. మనం కోరుకున్నవేవీ కోరుకున్న రీతిలో దొరకవు. అలాంటప్పుడు, దొరికిన దానితో సంతృప్తి పడుతూ, దొరకగలిగే దానికోసం ప్రయత్నించాలి. ప్రతికూల పరిస్థితులను అనుకూలమయిన స్థితులుగా మార్చుకోవాలి. అలాంటి ఓఅర్పు, నేర్పు మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనాలు లాంటి మంచి చెప్పాల్సింది పోయి, కథకులు కూడా సిల్లీ విషయాలను మరింత సిల్లీగా చూపిస్తూ కల్లబొల్లి రాతలతో కుళ్లు పరిష్కారాలు చూపుతూ అదే ఉద్ధరణ అనుకోమంటే నవ్వు రాక మరేమొస్తుంది.

ఇంతకీ, కథలో ఇల్లొదిలిన అమ్మాయి సమస్యలేమితో తెలుసా? మచ్చుకి,

అమ్మాయి తన వస్తువులు భర్త గదిలోనే సర్దుకుంది. కానీ షూ రేక్ బెడ్ రూం లో లేదు. బెడ్ రూం తో మరో రూం వుంటే ఎంచక్కా పెళ్ళికి ముందు తన గదిలో ఎలా సర్దుకునేదో అలాగే సర్దుకునేది. అలా లేదు కాబట్టి, మరో రూం కావాలని ఇల్లొదిలేస్తుంది.ఇంతకీ ఆమె పెట్టుకోవాల్సిన వస్తువులేమిటో తెలుసా?
టెడ్డీ బేర్లు, పోస్టర్లు…..పైగా పురుషులవల్ల జరిగే ఘోరమయిన తప్పిదంలా ఆగదిలో ముందే అన్నీ భర్త వస్తువులతో నిండిపోయింది కాబట్టి ఆమె వస్తువులు(టెడ్డీ బేర్లు, పోస్టర్లు) పెట్టుకునేందుకో గది కావాలి. లేకపోతే మొగుడిని వదిలిపో!!
ఇది కారణం నంబర్ వన్ మాత్రమే!

అత్తగారింటిలో సిస్టెమాటిక్ గా ఒక పులుసు, ఒక పూట పప్పు ఇలా డైటీషియన్ చార్ట్ లా సాగుతుందట మెనూ. అమ్మాయికి, ఫ్రై అలవాటు. పాపం తోట కూర తినటం అంటే ప్రాణ సంకటం. పైగా, నువ్వేం తింటావని ఏమీ అడిగి చేయరని కోపం. లంచ్ బాక్స్ లో సరిపడినంతే పెడతారని బాధ. ఇంకా, పుట్టింట్లో వారంలో మూడు సార్లు పిజ్జా ఆర్డర్ చేసుకుని తినేదట. లాప్ టాప్ లో చాట్ చేస్తూనో, మ్యూసిక్ వింటూనో, సినిమా చూస్తూనో పిజ్జా తినేది. ఫ్రెండ్స్తో కలసి గోల చేస్తూ గోడ మీద గ్రాఫిటీ రాసేదట. పెయింటింగు, సాంగ్, డాన్స్ లు చేసేది. పెళ్ళితో లైఫ్ లో ఫన్ అంటా డిలీట్ అయిపోయిందని, యెంతో ఇష్టంగా ఆర్డర్ చేసిన చికెన్ నెగెట్స్ తినటం మరచిపోయి మరీ చెప్ప్తుందా అమ్మాయి తాను ఇల్లొదిలేందుకు దారి తీసిన ఘోరమయిన కారణాలు చెప్తూ…..
ఇదంతా రాస్తూంటేనే నవ్వొస్తోంది……

అమ్మాయి మొగుడికి, అత్తకి పాఠం చెప్పటానికి ఇల్లొదిలిన కారణాలు చూసిన తరువాత, ఈ అమ్మాయి పెళ్ళెందుకు చేసుకుందో, పెళ్ళంటే ఏమనుకుని చేసుకుందో, అసలు సంసారమంటే తెలియని వసంత కోకిల లాంటి అమ్మాయేమో అనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయిలకు పెళ్ళంటే ఏమిటి, జీవితంలో కలసివుండాలంటే రాజీ పడటం ఎలా, ఇచ్చి పుచ్చుకోవటం, సహనము, శాంతం లాంటివి చెప్పి ఒక అవగాహన, ఆలోచనలు కలిగించేబదులు ఆ అమ్మాయి ఏదో గొప్ప కార్యం సాధించినట్టు రచయిత్రి రాయటము అమితానందాన్ని కలిగించింది.

అహాన్ రచయిత్రులెంత ఊహాశాలులు? వాళ్ళక్కడ రై మాన్ లు, ఫారెట్ గంపుల్లాంటి దిఫెరెంట్ మనుషుల్లో గొప్పతనాలు చూపితూంటే, స్త్రీలు మాత్రం దిఫెరెన్స్ లో వెనుకబడివుండటం ఎందుకని చూపించారేమోనన్న ఉన్మత్త ఊహ కాగడాకు కలిగింది.

ఆఫ్ట్ వేర్ చదివే అమ్మాయిలు జీవితం గురించి నిర్దిష్టమయిన అభిప్రాయాలు కలిగివుంటారని, తమకేం కావాలో తెలుసుకుని, తన పురుషుడినుంచి అది సాధించుకునే తెలితేటలు అందరికీ కాకున్నా కొందరికయినా వుంటాయన్న భ్రమలో వున్న కాగడా మూర్ఖత్వానికి కపాల మోక్షం కలిగించిందీ కథ.

ఫ్రెండ్స్ తో తినటం, పిజ్జాలు తింటూ సినిమా చూడటం, గోడలపై గ్రాఫిటీలు రాయటం(మగవారు లావెటరీ గోడలపై గ్రాఫిటీ రాస్తే, కనీసం ఇంట్లో గ్రాఫిటీ రాసుకునేందుకో గది అయినా అమ్మాయికి లేకపోవటం ఎంత వివక్ష????) అదే జీవితం అనుకునే అమ్మాయిలకు, జీవితం గురించి వివరించి చెప్పేబదులు రచయిత్రి ఎంత గొప్ప మార్గం చూపారో తలుచుకుంటే నవ్వీ నవ్వీ కాగడా రవ్వలు కూడా నవ్వులయిపోతున్నాయి.

ఇంకా, బోలెడన్ని కంప్లయింట్లున్నాయి అమ్మాయికి. పెళ్ళయిన అమ్మాయి, షార్ట్స్, థ్రీ ఫోర్థ్స్ జీన్స్, లీవ్ లెస్ వేసుకోనివ్వటం లేదని, వెస్ట్రన్ మీద బావుండని బొట్తు పెట్టుకోమనటం, జుట్టుకి క్లిప్ పెట్టుకోలేక పోవటం, పెద్దాళ్లున్నారని ఇంట్లో షార్ట్స్ వేఉకోలేకపోవటం, తనూ, భర్త ఇంట్లో కాందిల్ లైట్ దిన్నర్ చేసుకోలేక పోవటం, కారులో భర్త పక్కన కూచోలేకపోవటం(పనికిరాని మొగుడి పనికిరాని తల్లో తండ్రో ఆ ఈట్ కాజేసి అన్యాయం చేతూంటారెప్పుడూ, అత్తా మామల అన్యాయం నశించాలి…దీనికి కారు మొదటి ఈటు రాజకీయమని పేరు….ఎవరయినా…కారులో ఏ ఈతుకాఏటీ వేర్వేరు కార్లుగా విడిపోవాలని ఉద్యమాలు చేస్తే దానికి కాగడా ఈ కథ ఆధారంగా పాటలు, ఇనిమాలు రాసి తీసి మద్దతునిస్తుంది.) ఇలాంటి సిల్లీ పనికిమాలిన, పనిలేని తిన్నదరక్క ఏర్పరచుకున్న బోలెడన్ని భరించలేని బాధల కారణంగా అమ్మాయి వేరు కాపురం అంటుంది. దానికి రచయిత్రితో పాతు విమర్శక షిఖామణులు, పండిత పాఠకాగ్రేసరులు, కొందరేమ్రాసినా లైకులు, వ్యాఖ్యలతో మద్దతునిచ్చే ఫేస్ బుక్ సాంప్రదాయ సహన బోధ తీవ్రవాద వ్యతిరేకులతో పాటూ పాత్రలూ మద్దతునిచ్చేస్తాయి. సర్వేజనా సెపెరేట్ భవంతు , ఇదెంతో గొప్ప కథని తంతూ అనేస్తాయి.

ఇంతకీ, అత్తగారు అమ్మాయితో పనంతా చేయిస్తే అదీ బాధే. అత్తగారు అన్నీ కూచో పెట్తి చేస్తే అదీ బాధే, ఇలా చిన్న చిన్న విషయాలకు రాజీ పడని వాళ్ళు రేపు భర్తతో సెపరేట్ కాపురం పెట్టినా, రోజూ నీతో కాండిల్ లైట్ డిన్నరేమిటి, నా స్నేహితులతో రోజూ, బోరెచ్చినప్పుడప్పుడప్పుడు నీతో..కాదంటే నీది మగ బుద్ధి, జై డైవోర్స్ అంటారు. కాబట్టి ఈ కథలో చూపింది పరిష్కారం కాదేమో.

సాహిత్యకాగడాకయితే ఈ అమ్మాయిని( రచయిత్రిని కాదు,కథలో పాత్రని) కొన్ని రోజులు నిర్బంధంగా ఎవరి పేరు తలిస్తే ఇలాంటి స్త్రీ వాద కథలు రాసేవారందరికీ సిమ్హస్వప్నమో, ఏ పేరు చెప్తే వీఅరంతా కలాలు కాగితాలు వదిలి లెంపలేసుకుని చక్కగా రాయటం ఆరంభిస్తారో వారింట్లో వుంచితే కానీ ఆమె మెదడెదగదు, చెప్పులు బెద్ రూం లో పెట్తుకోవటం, జుట్టు వదులుగా వేసుకోవటం, క్లిప్పులు పెట్టుకోకపోవటం, పిజ్జాలు బర్గర్లు తింటూ, దాన్సులు చేయటం, గోడలపైన గ్రాఫిటీలు రాయటం లాంటి కుర్ర చేష్టలు, బుద్ధిలేని ఆలోచనలతో పాటూ ఇంత ఎదిగినా ఇంకా టెడ్డీ బేర్ల స్థాయిని దాటకపోవటం వంటివన్నీ చక్కబడతాయి.దెబ్బకి ఒక వ్యక్తిత్వం వచ్చి మనిషిల మనగలగటం తెలుసుకుంటుంది. అయితే, ఇలాంటి మెదడెదగని సంతను ఆవిడ ఇంటికి 20000కిలోమీటర్ల దూరానికి కూడా రానీయరు.

అయితే, ప్రభుత్వ ప్రకటనలోలా ఈ అమ్మాయి హీరోయిన్ లా ప్రవర్తించింది కాబట్టి ఇది గొప్ప కథ అవుతుంది. పైగా ఇది రాసిన రచయిత్రికి పెద్ద పేరుంది కాబట్టి ఇది తప్పనిసరిగా మెదడెదగని పాత్రలను, అర్ధంలేని సమస్యలను ఋష్టించి, పనికిమాలిన పరిష్కారాలిచ్చే ప్రాతినిథ్య కథలలో అగ్రస్థానంలో నిలుతుందనటంలో సందేహం లేదు.

అయితే, ఇందుకు భిన్నంగా అమ్మాయికి నిజానిజాలు వివరించి, ప్రతి వ్యక్తికీ బాధ్యత వుంటుందని చెప్పి, వివాహం ఆషామాషీకాదని, అదొక సామాజిక బాధ్యత అని చెప్పి, కుతుంబ విలువలు, బంధాలు, బాంధవ్యాల స్వరూపాలను బోధించి, నేను, నాది, నాకే అనే స్వార్ధ జంతువులా కాక, మనిషిలా ఎదగమని బోధించే కథ రాస్తే, అది పాత చింతకాయ పచ్చడి అవుతుంది. అభివృద్ధి నిరోధక దుష్ట కథ అవుతుంది. అది చెప్పటము, చదవటమే కాదు, అలాంటి మంచి ఆలోచనలు నేర్పటమూ ఘోరమయిన పాపం అవుతుంది. పిల్లలకు మంచి చెప్పేవారు లేకపోవటం, మంచి చెప్పేవారిని పక్కకు నెట్టటం వల్లనే మన సమాజంలోకూడా విడాకులు విపరీతమవుతున్నాయి. దాంపత్యం అపహాస్యమవుతోంది. అలాంటి పరిస్థితులలో పిజ్జ తినకు ఆరోగ్యం పాడవుతుందని మంతెన సత్యనారాయణ రాజు చెప్పాలి కానీ, అత్తగారో, భర్తనో చెప్తే అది అణచివేతకాక పోతే ఇంకే అభ్యుదయ భావమవుతుంది?

అయితే, ఈ కథ, ఇలాంటివింకెన్నో కథలు చదివిన తరువాత, ఈ ఈ కథను మెచ్చినవారూ, సమర్ధించేవారూ, పొరుగువాడిని చూసి నేర్చుకునే తెలివిని ప్రదర్శిస్తే మంచిదేమో అనిపిస్తుంది.

కాగడా తనకు తోచింది చెప్పింది. అనిపించింది రాసింది. మెచ్చితే సరి. మెచ్చనివారు విశ్వనాథ చెలియలికట్ట చదివితే ఇంకా మంచిది.
Like ·

November 24, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada

కథలు- కార్యశాలలూ.

ఇటీవలె కథలకు సంబంధించి రెండు సమాచారాలు ఈ-మైల్ లో వచ్చాయి. అవి వచ్చినప్పటి నుంచీ సాహిత్యకాగడా కు పనిమొదలయింది.

ఒక మెయిల్ కథాకార్యశాలకు సంబంధించింది. రెండవ మెయిల్ కథలకు సంబంధించిన సమావేశం గురించి.

ఈ రెండూ చూసిన తరువాత కాగడాకు ఇలాంటి కార్యశాలలూ, సమావేశాల గురించి ఎవరూ అడగకున్నా(ఎవరో అడగాలని ఎదురుచూసి మోసపోకుమా అని ఓ మహాఉగకవి ఎప్పుడో చెప్పాడుకదా) సాహిత్యప్రపంచంలో నెలకొని వున్న అపోహల(కాగడా వ్యక్తిగతానుభవాలు, ఇతర స్నేహితుల అనుభవాల ఆధారంగా ఏర్పడిన వ్యక్తిగత అభిప్రాయాలు) గురించి అందరికీ తెలపాలనిపించింది.(కార్డు రాస్తే పోతుందికదా అనేవారికి; కార్డులకూ, కవర్లకూ కాలం ఎప్పుడో చెల్లింది. ఇది ఫేస్ బుక్కులు, బ్లాగులు, ట్విట్టర్ల కాలం).

ముందుగా సాహిత్యకాగడా మరో సారి ఒక విషయం స్పష్టం చేస్తోంది.

మన తెలుగుసాహిత్య రంగంలో, విమర్శక ప్రపంచంలో, సాధారణ పాఠకుల మనస్సుల్లో, ఒక అపోహ స్థిరంగా నాటుకునివుంది. నిజానికి దాన్ని అపోహ అనటం కుదరదు. ఎందుకంటే, ఆ అపోహ ఎంతో నిజం కాబట్టి. ఎవరయిన ఎవరినయినా విమర్శిస్తే, ఆ విమర్శలో నిజానిజాలు చూడకుండా, విమర్శ సబబా, కాదా, కువిమర్శనా, సహృదయంతో చేసిన విమర్శనా అన్నది చూడకుండా, ప్రతి విమర్శకూ వ్యక్తిగతాలు ఆపాదించాలని చూస్తారు. ఎవరినయినా విమర్శిస్తే, ఆ విమర్శ వెనుక వ్యక్తిగత కక్షనో, అసూయనో వున్నట్టు భావిస్తారు. అలా ఆరోపించటం ద్వారా విమర్శను పక్కదారి పట్టిస్తారు. దృష్టి అసలు విషయం నుంచి వ్యక్తిగతం వైపు మళ్ళుతుంది. కనీసం సాహిత్యకాగడా విషయంలో వ్యక్తిగతాలకు తావులేదని అర్ధం చేసుకోవాలి. విమర్శ సాహిత్యానికి సంబంధించిందే తప్ప దాన్లో వ్యక్తిగతమయినదేమీలేదని అర్ధం చేసుకోవాలి.

ఇక కథలకారశాలల దగ్గరకు వస్తే, కార్యశాల అన్న పదానికి ఇంగ్లీషులో సమానార్ధక పదం, వర్క్ షాప్.

వికిపీడియా ప్రకారం, వర్క్ షాప్ అంటే, Beginning with the Industrial Revolution era, a workshop may be a room or building which provides both the area and tools (or machinery) that may be required for the manufacture or repair of manufactured goods. Workshops were the only places of production until the advent of industrialisation and the development of larger factories.

అంటే, ఒక ఫాక్టరీలో వస్తువుల తయారీ జరిగే స్థలమన్నమాట కార్యశాల. అక్కడ తయారయ్యే వస్తువులన్నీ ఒకే రకంగా వుంటాయి. నాణ్యతనేకాదు, రంగు, రూపు, రుచి వంటివన్నీ ఒకే రకంగా వుండాలి. అలా వుండని వాటినీ, తేడాలున్న వాటినీ క్వాలిటీ కంట్రోల్ వారు ఏరి ఏరి చెత్తలో పారేస్తారు. లేకపోతే, కరగించి మళ్ళీ సరిగ్గా తయారు చేస్తారు. ఒకవేళ ఇలా తయారయ్యే వస్తువుల్లో ఏవయినా తేడాలుంటే, అవి, యాజమాన్యం, వస్తువుల తయారీని నిర్ణయించేవారూ ముందే అనుమతించిన మార్పులే అయివుండాలి. లేకపోతే కుదరదు.

ఇది చదువ్తూంటే రవీంద్రనాథ్ టాగోర్ రాసిన డ్రేమర్ కథ గుర్తుకువస్తోంది. జార్జ్ ఆర్వెల్ రాసిన 1984, ఆల్డస్ హక్స్లే రాసిన బ్రేవ్ న్యూవరల్డ్ వంటివన్నీ గుర్తుకువస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథలనేకం గుర్తుకువస్తున్నాయి. వర్క్ షాప్ అంటే ఇదన్నమాట.

కథల వర్క్ షాప్ అంటే ఇలాంటి మూస కథలు, కొన్ని ఆమోదించబడిన పరిథులకు లోబడి సృజించే ఒకే రకమయిన కథల తయారీ జరిగే స్థలమన్నమాట. అందుకే, కథాకార్యశాల అనగానే ఉలిక్కిపడి కాగడా అందులో కథలెలా రాయాలో నేర్పించే మేస్త్రీలెవరా అని చూసింది. అది చూసిన తరువాత తెలుగు సాహిత్యం మరో పది తరాలపాటు ఇప్పుడు కొందరు గీచిన గీటుదాటకుండా ఎలా నడుస్తోందో , అలానే, అదేదారిలో నడవటానికి మూసల అచ్చుపోసే కథాకార్యశాల ఇది అని అర్ధమయిపోయింది. ఇదొక ముఠామేస్త్రీల కార్యశాల అని కథలపాఠాలు చెప్పేవారు, కార్యక్రమ నిర్వాహకుల పేర్లు స్పష్టం చేస్తాయి.

ప్రపంచంలో అందరూ ఒకేలా వుండాలన్న, అస మంజస రంగుటద్దాలు కట్టుకున్నవారు నిర్వాహకులు. ఒకేరకమయిన భావాన్ని, ఆలోచనను తిప్పీ తిప్పీ చెప్పిన విషయాన్ని చెప్పినట్టే చెప్పుకొచ్చే, ఆవుకు నాలుగుకాళ్ళ వ్యాసరచయితలాంటి సృజనాత్మక కథా రచయితలు, నేను, నాకు, నాకే అనేటతువంటి విషాలమయిన, ఉపఓగకరమయిన సంకుచిత దృష్టి కలవారు, నలుగురితోపాటూ నారాయణా(దైవం నారాయణ కాదు) అనేవారూ, ఆమోదయోగ్యమయిన మూస కథలు, పొలిటికల్లీ కరెక్టు కథలు, రంగుటద్దాల్లో మాత్రమే ఎర్రగా, పచ్చగా కనిపించే కథలు రాసేవారంతా( వీరిలో ఇంకా బొడ్డూడని, తప్పటడుగుల బుడి బుడి రచయితలు, విభిన్నత్వం లేక ఏకత్వంలోనే వైవిధ్యాన్ని చూడాలని, చూడలేని వారికి చూపెట్టి దబాయించి వొప్పించే రచయితలూ కథలగురించి కార్యశాల కార్యకర్తలని చూసిన తరువాత, తెలుగు కథ భవిష్యత్తుకేమాత్రం ధోఖా( హిందీ పదం) జరగనివ్వదీ మూసకథావస్తువులకర్మాగారకార్యశాల అని స్పష్టమయింది.

ఇక కథతో ఒక సాయంత్రమంటూ పలువురు కథకులను ఒక చోట చేర్చి పాఠకులతో ముఖాముఖీ ఏర్పరచిన కార్యక్రమ నిర్వాహకుల ఆలోచన అభినందనీయమయినా, కార్యక్రమం జరిగిన తీరు చూసిన తరువాత మాత్రం, మళ్ళే ఆవుకు నాలుగు కాళ్ళే గుర్తుకువస్తుంది.

కథ అన్నది సృజనాత్మక ప్రక్రియ. సృజనాత్మకత సంకెళ్ళలో వొదగదు. కానీ, మన కథల నేర్పువారంతా కథా రచనలో నేర్పరులు కారు. వీలు చిక్కగానే కథ, కథానికల నడుమ తేడా గురించి తలలు బద్దలుకొట్టుకునే రీతిలో వాదించుకుంటారు. అలా వాదిస్తున్న వారెవరికీ ఏ విషయం గురించి వాదిస్తున్నారో అవగాహనే వుండదు. ఈ మధ్యలోకి ఎత్తుగడలు, ముగింపులు, శైలీ, షిల్పం అంటూ తరగతుల్లో పాఠాలు చెప్పే పంతుళ్ళు, ప్రొఫెసర్లు, బోసి నోళ్ళతో, మార్కులేసే మూసిన మెదళ్ళతో రంగంలోకి దూకుతారు. ఈ వాదోపవాదాలు, తమ వాదనే సరయినదని ఎవరెవరో విదేశీయులు, విదేశీయుల భావాలని నొక్కిచెప్పే స్వదేశీ విమర్శకులు, వీరందరినీ చూస్తూంటే కథలు రాయాలనే ఉత్సాహం ఎవరికయినా వుంటే అది కారి నీరై పరుగుపెట్టి పోతుంది. అయితే, వీళ్ళిలా చర్చలు చేస్తూ అహాలను సంతృప్తి పరచే ఈగోల సాహసయాత్రలో వుంటూన్న సమయంలో, నిజంగా కథలు రాసేవారూ, రాయాలనుకునేవారూ కథలు రాస్తూనో, చదువుతూనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

ఇలా జరుగుతున్న కథా కార్యశాలలూ, కథలగురించిన సమావేశాలూ చూస్తూంటే, తెలుగుకథ ఎందుకని ఇప్పుడున్న స్థితిలో వుందో అర్ధమవుతుంది.

కథలు రాయాలనుకునేవారికి, బాబూ, మీరు కథలు రాయాలనుకుంటే ముందు రాసేయండి. వస్తువు, ఎత్తుగడ, ముగింపు, శైలీ, షిల్పం వంటి వాటిని పట్తించుకుని కూచుంటే, కథ రాయటం కాదుకదా, ఏది ఏమిటో కూడా తెలియని అఓమయంలో పడి పోవటం తథ్యం.

కథలు రాయాలనుకునేవారికి ముందు చదవటం అలవాటు చేయాలి. అదీ, మన రంగుటద్దాల విమర్శకులు మెచ్చిన గుప్పెడుమంది జాతీయ అంతర్జాతీయ కథకుల కథలు మాత్రమే కాదు. మన సాహిత్యంలోని కథలేకాదు, అంతర్జాతీయ సాహిత్యంలోని రచనలూ, అవి ఇవీ, వారూ వీరూ అని లేకుండా చదవాలి. ఏ రచనలు తన మనసుకునచ్చుతున్నాయో గమనించి, అలాంటి రచనలు మరింతగా చదవాలి. ఆపై, తన మనసులో కలుగుతున్న సంచలన స్వరూపాన్ని అర్ధం చేసుకునే ప్రాయత్నం చేయాలి. తద్వారా కలిగే మథనం ఫలితంగా కథలు వాటంతట అవే వస్తాయి. మూసల్ల్లో అచ్చులు పోసిన విమర్శకులు మెచ్చే చచ్చు పుచ్చు కథలు కాదు, పాథకులు చదివి, మెచ్చి, పది కాలాలపాతు తమ మదుల్లో దాచుకునే అసలయిన కథలు వస్తాయి.

ఏ కార్యశాలల్లో శిక్షణ పొందారు, ఈనాడు మనం గొప్ప కథకులుగా భావిస్తున్న కథకులంతా. ప్రపంచమే వారి కార్యశాల. మనస్సే కథల సృజనవేదిక. పేరుమోసిన కథకులనేకులస్సలు సరిగ్గా చదువుకోనేలేదు.

అదీగాక కథలు రాసేసమయంలో ఏ రచయితకూడా వీళ్ళు చెప్తున్నట్టు వస్తువులు, ఎత్తుగడలు, శైలి, శిల్పాల గురించి ఆలోచించరు. కథలు రాయాలనుకున్నవారు, రాయకుండా వుండలేరు. వారు ఎలాగయినా రాస్తారు. కాదేదీ కవితకనర్హం అంటే చప్పట్లుకొట్టే మనమే, కథలుఇలాగే వుండాలి, ఇవే వస్తువులుండాలి, ఇలాగే రాయాలి, ఇది కథ, బెత్తెడుంటే కథకాదు, కథానిక, ఇంకాస్త లాగితే పెద్దకథ లాంటివన్నీ కథకులకు అవసరంలేదు. కథకుడు కథ రాసిన తరువాత దాన్ని విశ్లేషించి, విమర్శించాల్సిన వారంతా, ముందే, కథలు ఇలాగే, వీటిగురించే రాయాలని కంచుకోటలు, ముళ్ళకంచేలు కట్టి ఇలాగే రాయాలంటే అలా వచ్చేవి కార్యశాలల కర్మాగారపు సరకులు తప్ప కథలు కావు.

పేరు పొందిన కథకులూ, కాఫ్కా, విలియం ఫాక్నర్, సీపీ స్నో, జేంస్ జాయ్స్, బెర్టోల్ట్ బ్రెక్ట్, టీ ఎస్ ఇలియట్, ఆడెన్, ఎర్నెస్ట్ హెమింగ్వే, సీ ఎస్ ఫారెస్టర్ వంటి వారంతా, హారర్ కథలు, క్రైం కథలూ రాసినవారే. ముందు రచయిత తనకు నచ్చినట్టు స్వేచ్చగా రాయటం అలవాటు చేసుకుంటే తరువాత ఏదయినా రాచవచ్చు. కానీ, కథలు రాయకముందే టెక్నిక్కులూ, ముగింపులూ, క్లాసిక్కులూ ప్రయోగాలూ అంటూ ఏవేవో ఎవరికీ అర్ధంకాని , ఎవరికీ తెలియని విషయాలగురించి, అన్నీ తమకే తెలిసినట్టు మాట్లాడుతూ అహాన్ని సంతృప్తి పరచుకుంటూ పోతూంటే పలు రకాల కథలు చదివే సమయం కానీ, రాసే సమయం కానీ వుండదు. అందుకే, ఇప్పుడు తెలుగు సాహిత్యంలో రికమండేషన్ రాయల్ కథకులూ, డబ్బులిచ్చి, కాకాలు పట్టే భేకాల కథకులు, గుంపులూ, భజనగాళ్ళు, వందిమాగధ వీర కథకులు, మూఅసకథల మొనగాళ్ళు గా మన కథకులు తయారవుతున్నారు. కార్యశాలలూ, కర్మాగారాల వస్తువులు సృజనాత్మక కథలుగా చలామణీ అవుతూ పాఠకులను దూరం తరిమి తరిమి కొడుతూ సాహిత్య్య హత్యను రైట్ రాయల్ గా చేస్తున్నాయి.

October 20, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sahityakaagada

ఇంత చెత్త అనువాదం చేసిందెవరో……

ఈవారం సాహిత్యకాగడా ఒక విచిత్రమయిన సంకటంలో ఇరుక్కుంది.

ఏదయినా పుస్తకాన్ని సమీక్షించాలన్నా, విమర్శించాలన్నా పుస్తకాన్ని పూర్తిగా చదవటం మౌలిక అర్హత.

పుస్తకంలో రచయిత ప్రదర్శించిన విషయం గురించి కొంత ముందే తెలిసి వుండటమో, కనీసం విషయాన్ని ప్రస్తావించేముందు దానిగురించి తెలుసుకోవటమో వాంచనీయం.

ఒకవేళ పుస్తకం అనువాదమయితే, అనువాద నాణ్యతను గురించి వ్యాఖ్యానించేముందు, మూలాన్ని చదివివుండటం ఆవశ్యకమయిన విషయం.

అయితే, ఈ నియమాలను, మౌలిక విషయాలనూ విస్మరించిమరీ సాహిత్యకాగడా ఒక పుస్తకం, అదీ అనువాద పుస్తకంపైన వెలుతురు ప్రసరింపచేయకుండావుండలేకపోతోంది. ఎందుకంటే, 19వ పేజీనుంచి ఆరంభమయిన అసలు పుస్తకాన్ని 40 పేజీలవరకు చదివేసరికి సాహిత్యకాగడా మతి మద్రాసుబండి ఎక్కి ముంబాయి వెళ్ళాలని తపనపడి ఎర్నాకులంలో దిగి ఫ్రెంచి భాషలో కవిత్వం రాసి సోమాలియా పైరేట్లతో సన్మానంచేయించుకోవాలని ఎవరెస్టును ఎక్కే మానసిక స్థితికి చేరుకుంది.

గుండె లుంగలుచుట్టుకునిపోయి, మెదడు మోకాలిలోచేరి కాళ్ళవేళ్ళతో ఆలోచించాలని తపనపడేట్టుచేసే ఈ అతి ఘోర దారుణ భీషణ దావనలంలాంటి భయంకర్ అనువాదకుడు తెలుగుభాషోద్ధారకుడు. అంతేకాదు, ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించింది, తెలుగుభాషోద్ధారకులేకాదు, యువ రచయితల తెలుగు భాషా ప్రావీణ్య రాహిత్యానికి చింతిస్తూ తన ఎడిటింగ్ ప్రఙ్నతో వారిని బెదరగొట్టి దూరం తరిమేసే పండితప్రకాండుడు కావటమూ సాహిత్యకాగడాను మండించి మండించి మండిస్తోంది.

అందుకే, పుస్తకం పూర్తిగా చదవకున్నా, ఒరిజినల్ చదవకున్నా, చదివిన 40పేజీల అనువాదాన్నే వ్యాఖ్యాన రహితంగా అందరిముందూ వుంచుతోంది కాగడా. నిజానిజాలు నిర్ణయించుకోండి, తెలుగు సాహిత్యం గురించి ఆలోచించండి. ఒక అత్యుత్తమ ప్రచురణ సంస్థ, ఒక అత్యుత్తమ అనువాదకుడిగా పేరుపొంది, అత్యుత్తమ సంపాదకుడిగా మన్ననలుపొందే అనువాదకుడు, మరో అత్యుత్తమ పండితుడు, ప్రతిపదాన్ని పట్టి పట్టి చూసే ఎడిటరూ కలసి ఇలాంటి పుస్తకాన్ని రూపొందించారంటే మన స్థాయి ఏ స్థాయిలో వుందో గమనించమంటోంది సాహిత్యకాగడా ఈ విషయాలను మీముందుంచుతూ…

ముందుమాటల అనువాదాన్ని వదిలేద్దాం.

కానీ, ముందుమాటవల్ల తెలిసేదేమిటంటే, ఇంగ్లీషులో ఈ పుస్తకం రాస్తున్నారని తెలిసినప్పటినుంచీ ప్రచురణకర్త రచయిత వెంటపడి మరీ అనువాదానికి ఆమోదం తీసుకుని ఈ పుస్తకాన్ని ముద్రించాడన్నది.

అన్ని మాటలూ అయి అసలు పుస్తకం 19వ పేజీలో ఆరంభమవుతుంది.

మొదటి పేరాలోనే ఆక్కడ వాతావరణమంతా విద్యుదావేశంతో నిండి వుంది, అన్న వాక్యం కనిపిస్తుంది. కళ్ళు మెదడు అక్కడ ఆగుతాయి.

ellectric or electrified వంటి పదానికేదో విద్యుదావేశం తెలుగు పదంగా తోస్తుంది. అన్వయం, సమన్వయం రెండూకుదరవు. కానీ, అర్ధంచేసుకుని, ఇదేదో ఉత్తేజితమన్న అర్ధం వచ్చే ఆంగ్లపదతెలుగానువాదం అనుకుని ముందుకు సాగితే, రెండు లైన్ల తరువాత మళ్ళీ ఒక అడ్డంకి…

ఒకవైపు ఓర్పులేని ప్రేక్షకుల ఈలలు, ఇంకోవైపునుంచి, స్త్రీలను ఉద్రేకపరిచే కేకలూ చెవులుబద్దలుకొడుతున్నాయి.

ఇందులో ఈ స్త్రీలను ఉద్రేకపరిచే కేకలు అర్ధం కాదు. దీని అమంగ్ల మూల వాక్యాన్ని ఊహించటమూ కష్టమే. shouts that excite females? బాబోయ్, తెలుగు తెలుగులోనే అర్ధం కాకపోయినా ఫరవాలేదు, కానీ, తెలుగును ఇంగ్లీషులోకి పత్తికొండనాగప్ప పదిరూపాయలు ఎగవేశాదు(cotton mountain cobra father ten rupees jumped away) లా చేయకూడదని నిర్ణయించుకోవటం ఉత్తమంలా వుంది.

అతి కష్టం మీద నవ్వునూ ఏడుపునూ ఆపుకుంటూ ఒక పేజీ చదివిన తరువాత, రంగ స్థలంపై ఏక పాత్రాభినయం ఆయనలొని బెరుకును ఊడగొట్టేసింది, అన్న వాక్యం దగ్గర ఆగిపోతుంది. బెరుకును వూడగొట్టటానికి ఆంగ్ల పదప్రయోగం ఊహించటం కష్టం కాదు. కానీ అనువాదకుడికి ఆ పదానికి ఈ వూడగొట్టటమనే పత్తికొండ నాగప్పకు cotton mountain cobra fatherలాంటి పదం తట్టటం ఆశ్చర్యం.అనువాదకుడి పేరు తెలుసుకున్న తరువాత మీరూ ఆశ్చర్యపోతారు.

ఇంకాస్త ముందుకు వెళ్ళగానే, ఆత్మాభిమానమనే అవతారంలో అతడు తన చుట్టూ వున్న ప్రపంచాన్ని నూతనకాంతిలో దర్శించటం ప్రారంభించాడు.

ఇక్కడ నూతన కాంతికి, ఆంగ్లం newlight అని ఇట్టే గ్రహించవచ్చు. కానీ, ఆత్మాభిమానమనే అవతారం ఏమిటో, అనువదించిన అవతార అనువాదకులేచెప్పాలి.

ఇంకా వరుసగా వచ్చే ఈ వాక్యాలు చూడండి…

అతడు స్కూలు చదువును మధ్యలోనే చాలించుకోవాల్సిన కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన బిడ్డ. శ్రద్ధతో తనను సాకే తండ్రి నీడను కోల్పోయిన బిడ్డ. ఆరాధనామూర్తిగా వుండవలసిన నాన్నను కోల్పోయినబిడ్డ.

ఎన్ని బిడ్డలో….అయినా అన్ని బిడ్డల అర్ధమొకటే. అనువాదకుడు, అన్నిటినీ కలిపి అర్ధం వచ్చే వాక్యాన్న్ని ఒకటి రాసేబదులు, మళ్ళీ పత్తికొండ నాగప్పకే పెద్ద పీట వేశాడు.

అదే పేరాలో నాలుగు లైన్ల తరువాత….

ఇవాళ్టి యువతరం, స్వశక్తి పై గాకుండా……..ఒక పోషకుడి మీదనో, ఒక ఙ్నానపిత మీదనో లేదా ఒక సహాయకుడి మీదనో ఆధారపడజూస్తారు.

ఈ ఙ్నానపిత అనగానేమి. knowledge father? father of knowledge?

దీని తరువాతనే…

కానీ ఆర్ధిక సహాయంకోసం, సామాజిక సహకారం కోఅం, మానసికమయిన ఆత్మీయతానుబంధం కోసం ఇతరులపైన ఆధారపడటమన్నది చాలా ఖరీదయిన ప్రయోగం.

అంతా అర్ధమయినట్టుంది. కానీ ఏమీ బోధపడినట్టు లేదు. సామాన్యులకందని గొప్ప అనువాదం.

5వ తరగతిలో తాను చదువు చాలించిన కుర్రాడు.(fullstop పుస్తకంలోదే) కాని వివిధ చోట్ల మూడేళ్ళు పనిచేసిన తరువాతేనిమిదో తరగతిలో చేరడమే ఆశ్చర్యకర సన్నివేశం. ఈ వాక్యం తరువాత ఆ ఆశ్చర్యాన్ని మరచి పుస్తకం స్టేజ్ ఫియర్ గురించి చర్చిస్తుంది. అనువాదకుడు కళ్ళు తెరచి ప్రతి పదానికీ సరయిన పాదాన్ని నిఘంటువులో చూసి ఎంచుకుంటే ఎడిటర్ కళ్ళుమూసి పెన్నుమూసి ఎడిటింగ్ నిర్వహించినట్టున్నారు.

ఇంకో గొప్ప వాక్యం చూడండి…

ఇలాంటి రోగం ఒకటి ప్రచలితమవుతోందని తెలియనందుకు ఎవరూ చింతించనక్కర్లేదు సుమా! ఎందుకంటే ఇలాంటి జబ్బు ప్రతీ కుటుంబంలోనూ విస్తరించి వుంది….. ప్రతికుటుంబంలో విస్తరించి వున్నా తెలియనందుకు చింతించకూడని జబ్బు? అతిగొప్ప సంశయాత్మకానువాద బ్రహ్మ బిరుదు సిద్ధంగా వుంది.

19వ పేజీనుంచి, 23వ పేజీవరకు వచ్చేసరికి ఓపిక నశిస్తోంది…

అయినా ఒకటి రెండు అమోఘమయినా అనువాదోదాహరణలిచ్చి(ఈ పదాన్ని చూడగానే ఈ పుస్తక సంపాదకుడు అనువాదూదాహరణలనాలి, ఈ కొత్తతరం రచయితలకు వ్యాకరణం తెలియదు అని నొసలు చిట్లించి రచయితలతో పది మార్లు తిరగ రాయించి, ప్రచురణార్హం కాదని తిప్పి పంపేస్తాడు. అతనే ఈ పుస్తకాన్ని ప్రచురణార్హంగా నిర్ణయించాడు) ముగిస్తాను.

ఒకానొకప్పుడు దగడు పూర్వీకులు బతకడానికి సరిపడా వున్న స్థితిమంతుల కుటుంబమే…..ఇది నా తప్పుకాదు, పుస్తకంలో వాక్యం ఇలానే వుంది.

దుర్భర దారిద్ర్యం ఆకుటుంబాన్ని మరణ మహాసముద్రంవైపుకు నెట్టేసినట్టయింది….

మద్రాసురైలెక్కి ముంబాయి పోవాలనుకుని ఎర్ణాకులంలో దిగి….అనిపిస్తోంది కదా!

కీలకమయిన ఈ విజయబీరం శివరాం కీర్తి కిరీటంగా వుండిపోయింది.

విజయబీరం?????????

కుర్ర దగడును తన అమ్మలు పనిమనుషులుగా పొందిన అనుభవం మానసికంగా క్రుంగదీస్తోంది. అమ్మలు పనిమనుసులుగా పొందిన అనుభవం…the experience of having his mothers work as maid servants….. కు పత్తికొండనాగప్ప లాంటి అనువాదం అనుకుంటాను.

ఈ వాక్యాలుచదివి పరస్పర వ్యతిరేకంగా వున్న భావాన్ని గమనించండి…

తమ ముగ్గురినీ సాకగలుగుతున్నానన్న తృప్తి వుండేది. అలా నెత్తిమీదకొచ్చి కూర్చున్న ఆకలి మిత్తిని పక్కకునెట్టేయగలిగానన్న తృప్తివుండేది. కాని రోజంతా కష్టపడితే అతనికి మిగిలింది మాత్రం చేతికీ నోటికీ అందనంత నామ మాత్రపు బత్తేలే!

ఒకపక్క సంతృప్తి వుందంటూ మరో వంక చేతికీ నోటికీ అందనిదంటున్నాడు…ఏమిటో…

ఇలా పడుతూ, ఏడుస్తూ, మూడవ అధ్యాయానికి వచ్చేసరికి, ఆ అధ్యాయంలోనే మొదటి పేరాలో ఒక పదప్రయోగం చూసిన తరువాత కాగడా మండిపోయింది.

కాబట్టి దగడు ఏపని చేసినా సంతోషంగా కష్టించి పనిచేసేవాడు, ఉత్సాహంగా చేసేవాడు. అదిన్నీ ఏదో మొక్కుబడిగా కాకుండా నా బొందో అంటూ పనిలో తలముంకలై చేసేవాడు.

ఈ నా బొందో ఏమిటో తలబద్దలుకొట్టుకున్నా అర్ధం కావటంలేదు. ఇదేదయినా స్థానిక పదమా? మాండలీకమా? అచ్చుతప్పా?

ఏమో…….

ఈ పుస్తకం ఎలాగోలాగ పూర్తి చేస్తాను. కానీ, ఈ పుస్తకాన్ని అనువదించింది, ఏ బీ కే ప్రసాద్ అని, సంపాదకత్వం డాక్టర్, డీ చంద్ర శేఖర రెడ్డి అనిగానీ, ప్రచురించింది ఎమెస్కో అని గానీ నమ్మలేకపోతోంది, జీర్ణించుకోలేక పోతోంది, తట్టుకోలేక పోతోంది సాహిత్య కాగడా.

ఈ పుస్తకం సుషీల్ కుమార్ షిండే జీవిత చరిత్ర, నా తలరాత రాసిందెవరు.

తెలుగు సాహిత్య తలరాత రాస్తోందెవరో………

September 27, 2013 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: sahityakaagada