Archive for the ‘క్రికెట్-క్రికెట్’ Category

రాహుల్ ద్రావిడ్ ది మంచి నిర్ణయం.

వన్ డే ఆటలు, 20-20 ఆటలనుంచి రిటయిర్మెంటు ప్రకటించటం రాహుల్ ద్రావిడ్ లాంటివాడే ఇలా తీసుకోగలడు.

నిజానికి రాహుల్ ద్రావిడ్ అంత ఆవేశం ప్రదర్శించడు. దూకుడుగా వుండడు. దాంతో అందరూ అతడిని పక్కన పెడుతూంటార్య్. బాగా ఆడుతూ కూడా జట్టులోంచి తొలగించినా అతనేమీ అనడు. అతని అభిమానులూ మౌనంగా బాధపడతారు తప్ప బహిరంగంగా వారూ అతనిని సమర్ధించరు.

కానీ, రాహుల్ ద్రావిడ్ వ్యక్తిత్వంలో ఒక కాఠిన్యం వుంది. ఒక నిర్ణయాత్మకమయిన లక్షణం వుంది.

ఎలాగయితే మైదానంలో ఆట ఆరంభించిన తరువాత ఎలాంటి కఠినమయిన బౌలింగయినా పట్టుదలగా నిలబడతాడో, అక్కడ ఎంత నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాడో, నిజ జీవితంలోనూ అవసరమయినప్పుడూ అంతే కథినంగా, నిర్ణయాత్మకంగా, ధైర్యంగా నిలుస్తాడు.

కెప్టెన్సీ తీసుకున్న తరువాత, జట్టులోకి యువకులను తీసుకురావటంకోసం రాహుల్ ద్రావిడ్ అనేక కఠినమయిన నిర్ణయాలను తీసుకున్నాడు. అవన్నీ గ్రెగ్ చాపెల్ నెత్తిన చుట్టుకున్నాయన్నది వేరే విషయం. కానీ, వాటి ప్రభావంతోనే, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా వున్నప్పుడు కొందరు అతనితో సహకరించలేదన్నది అందరికీ తెలుసు.

సచిన్ రెండువందల పరుగుల దగ్గర వున్నప్పుడు డిక్లేర్ చేయటం మరో కఠిన నిర్ణయం. ఆ సమయంలో అది సరయిన నిర్ణయం. ఆట కన్నా ఆటగాడు గొప్ప కాదని నిరూపించిందా నిర్ణయం.  ఆట త్వరగా ముగిసింది కాబట్టి అందరూ రాహుల్ ని విమర్శించారు కానీ, అదే, పాకిస్తాన్ వారు పట్టుదలగా ఆడివుంటే, త్వరగా డిక్లేర్ చేయలేదని తిట్టేవారు.

తనకెవరూ సహకరించటంలేదని, చివరికి బీసీసీఐ వారు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని, రాహుల్ కెప్టేన్సీని వదలుకోవటం, తన శక్తినీ, బలహీనతలను తెలుసుకున్న వ్యక్తి తీసుకున్న నిర్ణయం.

ఆ నిర్ణయం ఫలితంగా కొందరు సెలెక్టర్ల అసలు రూపు బయటపడింది. ఫలితంగా బాగా ఆడుతున్న రాహుల్ ను వండే జట్టు నుంచి తొలగించారు. బాగా ఆడుతూన్నా, వేగంగా పరుగులు తీయటంలేదని జట్టునుంచి తొలగించినా మానసికంగా దెబ్బ తినని రాహుల్, సెలెక్టర్ల ఈ చర్యకు మానసికంగా గాయపడ్డాడు. పైగా, తాను ఎంచుకున్న ధోనీ, యువకులు కావాలని రాహుల్ నే పక్కన పెట్టటం కూడా అతడిని తీవ్రంగా గయ పరచింది. అందుకే, ఆ తరువాత చాలా కాలం రాహుల్ ద్రావిడ్ మమూలుగా తనకలవాటయిన ఆటను ప్రదర్శించలేక పోయాడు.

కానీ, సెలెక్టర్లకు రాహుల్ విలువ తెలుసు. అందుకే, కఠినమయిన విదేశీ పర్యటనల్లో వండే ఆటలకూ అతడిని ఎంపిక చేసి, భారత్ లో ఆడే ఆటలకు, మంచి ఆట ప్రదర్శించినా పక్కన పెడుతూ వచ్చారు.

గత రెండేళ్ళుగా తెస్టుల్లో తప్ప రాహుల్ మరో ఆట ఆడలేదు. వండేలు, 20-2 లలో అతడి పేరే ఎవ్వరూ తలవలేదు. ఇప్పుడు హఠాత్తుగా, ఇంగ్లాండులో కొత్త హీరోలేవరికీ సరిగ్గా ఆడరాదని స్పష్టమవగానే మళ్ళీ రాహుల్ అందరికీ గుర్తుకువచ్చాడు.

మళ్ళీ ఇండియాలో పటీలనగానే రాహుల్ అవసరం వుండదు. కాబట్టి ఇప్పుడు బాగా ఆడినా లాభం వుండదని ద్రావిడ్ కి తెలుసు. పైగా, ధోనీ ఇప్పుడు అవసరం వుంది కాబట్టి, రాహుల్ ఎంపికను వొప్పుకున్నా, క్రితం సారి వండేఅలలో రాహుల్ ను ఎంపిక చేసినప్పుడు చేసిన అవమానం రాహుల్ ద్రావిడ్ కాబట్టి బయట పొక్కలేదు. అందుకే, ఇప్పుడు తనని జట్టులోకి ఎంచుకోవటం ద్రావిడ్ కు షాక్ తగిలినట్టయివుంటుంది. గుడ్డి కన్ను తెరిస్తే ఎంత, మూస్తే ఎంత అనీ రాహుల్ ద్రావిడ్ కు తెలుసు. నిజానికి, జట్టులోంచి తీసేసిన తరువాత రిటయిర్మెంటు ప్రకటించే అవమానం కన్నా, జట్టులో వుండి రిటయిర్మెంటు ప్రకటించే అవకాశం ఇచ్చిన బీసీసీఐ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారివల్ల తనకయిన గాయాన్ని తొలిసారిగా ప్రదర్శించాడు. అదీ నవ్వుతూ, మర్యాదగా, కానీ, అత్యంత నిర్ణయాత్మకంగా!. అదీ రాహుల్ ద్రావిడ్ అంటే.

బౌలర్ ఎంతటి భయంకరమయిన బంతి వేసినా, జాగ్రత్తగా దాన్ని ఎదురుకుంటూ, బౌలర్ కి విసుగురప్పించి, అతనితో తప్పులు చేయించి, ఒక పద్ధతి ప్రకారం, మానసిక యుద్ధంలో విజయం సాధించే రాహుల్ ద్రావిడ్ సరయిన నిర్ణయాన్ని అభినందిస్తూ, ఇక వండేఅలు, 20-20 లలో రాహుల్ పడే బాధను చూడటం తప్పి,దని సంతోషిస్తున్నాను. ఎందుకంటే, పరుగులకోసం రాహుల్, పిచ్చి షాట్లు కొడుతూంటే, ప్రేక్షకులను ఆకర్శించాలని ఒక శాస్త్రీయ విద్వాంసుడు, వెర్రి కూతలు కూస్తున్నట్టు వుంటుంది.

బయ్ రాహుల్ ద్రావిడ్. ఇక తెశ్తు క్రికెట్ మిగిలింది. అదీ త్వరలోనే వదిలేస్తాడనిపిస్తోంది.

August 7, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్

దక్కన్ చార్జర్లకు అభినందనలు-రాయల్ చాలెంజర్లకు, వొచ్చేసారి చూసుకుందాం!

అందరూ ఆశించినట్టే, అందరూ ఊహించినట్టే దక్కన్ చార్జర్లు ఐపీఎల్ కప్పును గెలుచుకున్నారు.  క్రితం సారి చొవరలో వున్నవారు, ఈసారి శిఖరాన్ని చేరటం నిజంగా గొప్ప విషయమే!

ఆట ఆరంభంలోనే గిల్లి అవుటయినా, మరో వైపు గిబ్స్ నిలబడి కుదురుగా ఆడుతూ పరిస్థితికనుగుణంగా ఆడి జట్టుకు మంచి స్కోరునిచ్చాడు.

రాయల్ చాలెంజర్లలో తొందరపాటు కనిపించింది. గెలిచిపోవాలన్న ఆత్రుత కనిపించింది. అదే వారిని దెబ్బ తీసింది.

అందరి దృష్టీ తనపైనే వుండటం ఇంకా అలవాటు కాని పాండే త్వరగా వెనుతిరిగాడు. ఇది ఆరంభంలోనే చాలెంజర్లపైన ఒత్తిడి పెంచింది. దీనికి తోడుగా, కాలిస్, ద్రావిడ్ లు త్వరగా అవుటయిపోవటం చాలెంజర్ల గెలుపును ప్రశ్నార్ధకం లో పడేసింది.

పరుగుల లక్ష్యాన్ని చేరటంలో ప్రధాన సూత్రం, ఆరంభంలోనే అధికంగా వికెట్లను కోల్పోకూడదు. చాలెంజర్లు త్వర త్వరగా వికెట్లు కోల్పోయారు. కుదురుగా నిలబడి, వికెట్ కాపాడుకుంటూ, పార్టర్షిప్పును అభివృద్ధి చేయటంలో ఎవరూ శ్రద్ధ చూపలేదు. ఇలా చేయగలిగిన ద్రావిడ్ అవుటవటం చాలెంజర్లు కోలుకోలేని దెబ్బ.

ఆతరువాత జరగాల్సిందే జరిగింది. ఉథప్పాను చివరకు పంపటం ప్రణాళికా పరంగా మంచిది. కానీ, మరో వైపు అందరూ అనవసరంగా అవుటవుతూండటం, ఉథప్పా నిర్లక్ష్యంగా ఆడటం, చివరి ఓవర్లో బాటుతో బంతిని కొట్టలేకపోవటం చాలెంజర్లకున్న ఆ వొక్క ఆశనూ అడుగంటించాయి.

చివరివరకూ ఉత్తమ ఆట చూపిన దక్కన్ చార్జర్లు గెలిచారు. ఐపీఎల్ విజేతలుగా నిలిచారు.

నిజానికి, కాస్త జాగ్రత్తగా ఆడివుంటే, చాలెంజర్లు సులభంగా గెలిచేవారు. గెలుపు సులభమన్న భావన చాలెంజర్లను దెబ్బ తీసింది. ఆటలో మౌలిక సూత్రాలను విస్మరించటం చాలెంజర్ల శాపమయింది. ఇందుకు సీనియర్ ఆటగాళ్ళయిన కాలిస్, ద్రావిడ్ లదే బాధ్యత. వారు కనక ఒక వైపు నిలబడివుంటే ఇతరులకు ధైర్యం వచ్చేది.

దక్కన్ చార్జర్లకూ, రాయల్ చాలెంజర్లకూ నడుమ తేడా, గిబ్స్!

అసలయిన ఆటలో అద్భుతంగా ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు గిబ్స్.

ఇదీ ఈసారి ఐపీఎల్!

దక్కన్ చార్జర్లను అభినందిస్తూ, ఇక, దృష్టిని టీ20 ప్రపంచ కప్ వైపుకు మళ్ళిద్దాం!

May 25, 2009 ·  · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్

ఐ పీ ఎల్ లో గెలుపెవరిది? నా అభిప్రాయం.

ఇది భవిష్యవాణి కాదు. ఇంతవరకూ జరిగిన ఆటలనూ, జట్టుల ఆట తీరునూ గమనిస్తూంటే నాకు ఏర్పడిన అభిప్రాయాన్ని వ్యక్తపరచటం తప్ప మరేమీ కాదు.

ఈసారి ఐపీఎల్ అంతగా ఆకర్షణీయంగా లేదు.

అనేక ఆటలు ఆరంభంలోనే గెలుపెవరిదో అర్ధమయిపోయేట్టే వున్నాయి. ఏవో కొన్ని ఆటలలో చివరి బంతివరకూ ఆట సాగింది. చివరి ఓవర్లో డక్కన్ చార్జర్లు 21 పరుగులు చేసి నెగ్గటమూ, ఒక పరుగుచేయలేక ముంబాయివారు మూడు వికెట్లు కోల్పోయి వోడటమూ, రాయల్ చాలెంజర్ల తరఫున హటాత్తుగా పాండే కళ్ళు తెరచి బాటు వూపటమూ లాంటి అప్పుడప్పుడూ మెరిసిన మెరుపులుతప్ప ఐపీఎల్ లో ఉద్విఙ్నతా, ఉత్సాహాలు కొరవడ్డాయి.

ఇలా సాగుతూ సాగుతూ చివరి నిర్ణయాత్మకమయిన ఆట వరకూ వచ్చేశాము.

ఆరంభంలో బాగా ఆడిన డిల్లీ వారు చివరలో చతికిల పడ్డారు. డిల్లీవారికి ప్రధానంగా సెహవాగ్, గంభీర్ల వీర విహారం ప్రాణం. ఈసారి అది కుదరలేదు. ఇతరులు ఆదుకుంటూ వచ్చారుకానీ, అసలయిన ఆట వచ్చేస్రికి అందరూ అలసిపోయారు. ఆరంభంలో మెక్ గ్రాత్ ను ఆడించకపోతే అదో స్ట్రాటెజీ అనిపించింది. కానీ, సెమీ ఫైనల్ లో గిల్‌క్రిస్ట్, సిమ్మండ్స్ లాంటి ఆటగాళ్ళతో కీలకమయిన ఆట ఆడేటప్పుడయినా మెక్ గ్రాత్ ను ఆడించాల్సింది. పరుగుల వరదకు అడ్డుకట్ట వేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఎందుకో డిల్లీవారు ఆయనను వెంట తిప్పుకునేందుకే ఇష్టపడ్డారు.

ముంబాయివారు కూడా, సనత్, సచిన్ ల పైనే అధికంగా ఆధారపడ్డారు. వారి వైఫల్యం, జట్టు పరాజయంగా మారింది. కానీ, కొన్ని కీలకమయిన ఆటల్లో గెలుపు అంచులనుంచి ఓటమి కోరలకు చిక్కారు. ఇది వారి ప్రణాళికా వైఫల్యాన్ని సూచిస్తుంది.

నిరుటి విజేతలు, రాజస్థాన్ రాయల్స్ ఈసారి మొదటి నుంచీ అటూ ఇటూ గానే ఆడుతున్నారు. గ్రేం స్మిత్ సరిగా ఆడలేక పోవటం, అస్నోద్కర్ వంటి యువ ఆటగాళ్లు మెరవలేకపోవటంతో పాటు, యూసుఫ్ పఠాన్ అప్పుడప్పుడే బాగా ఆడటం వారిని దెబ్బతీసింది.

పంజాబ్ కింగులుకూడా కీలకమయిన ఆటగాళ్ళ పసలేని ఆటవల్ల దెబ్బతిన్నారు. సంగక్కార, మాహెలాలు ఆడినప్పుడు గెలుపు, ఇతర సమయాల్లో ఓటమి. యువి పాపం బంతిని కొట్టటంలో కన్నా విసరటంలోనే రాణించాడీసారి. అందుకే హాట్ ట్రిక్ తీసి కూడా ఆట ఓడిపోవాల్సివచ్చింది.

బెంగాల్ రైడర్లు పాపం. వారికి వచ్చే ఐపీఎల్ కన్నా మంచి కోచ్, కెప్టేన్లతో సహా మంచి యజమాని దొరుకుతాడని ఆశిద్దాం.

చెన్నై ఆటగాళ్ళుకూడా హేడెన్, రైనాల పైనే అధికంగా ఆధారపడ్డారు. వారు రాణిస్తే జట్టు విజయం సాధిస్తుంది. లేకపోతే అంతా దైవాధీనం. ఎందుకో ధోనీ ఈసారి ఎప్పటిలాగా అడుతూ పాడుతూన్నట్టు కనబడలేదు. ఉద్విఙ్నతలూ, చిరాకులు కనిపించాయి. బహుషా ప్రేమలో పడ్డాడేమో! లేక ఆడీ ఆడీ గెలిచీ గెలిచీ విసుగొస్తోందేమో.

డక్కన్ చార్జర్లుకూడా గిల్‌క్రిస్ట్, రోహిత్ లపైన అధికంగా ఆధారపడుతూన్నారు. గిల్‌క్రిస్ట్ అధ్భుతమయిన ఆటగాడు. కానీ ప్రతిసారీ పరుగులు చేయలేడు. రోహిత్ శర్మ ఎప్పుడు పిడుగులు కురిపిస్తాడో ఎప్పుడు తుస్సుమంటాడో తెలియదు. సిమ్మండ్స్ ఆడతాడు. అవసరమయితే ఒక్కడే జట్టును గెలిపించగలడు కూడా. ఈసారి ఇంకా గిబ్స్ నిద్రలేచినట్టులేడు. గిబ్స్ కనక కొట్టటం ఆరంభిస్తే బంతి రాకెట్ లేకుండా చంద్రమండలం చేరుతుంది. ప్రత్యర్ధికి తాను ఎన్నో నరకంలో వున్నాడో తెలియదు. గిల్ క్రిస్ట్ కొదుతూంటే అందంగా వుంటుంది. గిబ్స్ బాదుడు నరకమే.  కానీ ఈయన ఎందుకో ఉదాసీనంగా ఆడుతున్నాడు.

బాంగళోరు ఆటగాళ్ళు ఎంత దిగజారాలో అన్ని లోతులకు దిగజారి ఒక్కో మెట్టే ఎక్కివస్తూ పైకి చేరుకున్నారు. ఇతర జట్లతో పోలిస్తే, బాంగళోర్ జట్టులోనే స్థానిక యువ ఆటగాళ్ళు తమ శక్తిని సరిగా ప్రదర్శించలేదు. అవకాశాలను వినియోగించుకోలేదు. కాలిస్, టైలొర్, ఉథప్పా లాంటి ఆటగాళ్ళున్నా ఆరంభంలో ఎవ్వరూ సరిగ్గా ఆడలేదు. ఉథప్పా ఆట ఎక్సయిటింగా వుంటుంది. కానీ ఎప్పుడోతప్ప ఈయన కుదురుగా ఆడడు. ఎప్పుడూ వెళ్ళి విశ్రాంతి తీసుకోవటానికే చూస్తాడు. ఇంతకాలం బాంగళోరు జట్టుకు సరయిన ఆరంభ ఆటగాళ్ళు లేనిలోతు తీవ్రంగా వుండేది. ద్రావిడ్ ఓపెనర్ గా వస్తే, అతడవుటయితే జట్టులో ఆడేఅ ఒక్క ఆటగాడూ అవుటయిపోయేవాడు. జట్తు పని అయిపోయేది.

ద్రావిడ్ గొప్ప ఆటగాడు. అతడికి రావాల్సిన గుర్తిపు రాలేదు. అతడి ఆట గురించి అనేక అపప్రధలూ, అపోహలూ ప్రచారంలో వున్నాయి. అందరిలాగా అతడు మాటకాడు కాడు. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడు. ఆకట్టుకోవాలని ప్రయత్నించడు. ప్రేఖ్స్కులకోసం ఆడడు. జట్టుకోసం ఆడతాడు. మనవారికి ఇది అవసరంలేదు. ఈసారి ఐపీఎల్లో బంగళోరును ఆదుకుంటూవస్తున్నదీ ద్రావిడే.

అయితే, కాలిస్ సరిగా ఆడటంలేదని అతడి బదులు కుంబ్లేని కెప్టెన్ చేయటం బెంగళోరు జట్టుకు -ipl-1లాభించింది. క్రిందనున్నవాడు వెళ్తే పైకే అన్నట్టు బెంగళోరు వారు విజయాలు సాధించటం ఆరంభించారు. కాలిస్ ఆడటం మొదలుపెట్టాడు. టైలర్ వీర విహారం ఆరంభించాడు. విరాట్ కోహ్లీకి ఆడకతప్పలేదు. ఈలోగా మనిష్ పాండే తెరపైకి వచ్చాడు.

నిన్న చూశాను మనీష్ పాండే ఆట. అతని టైమింగ్ ఎంత గొప్పగా వుందంటే నా కళ్లను నేనే నమ్మలేక పోయాను. ఇన్నాళ్ళూ ఏమూల దాగేడీ అబ్బాయి అనిపించింది. పళ్ళు పట పట లాడిస్తూ బాటు వూపే ప్రసక్తే లేదు. అన్నీ నేలమీదనుంచి బౌండరీకి పరుగెత్తే షాట్లే. బంతిని లేపి కొట్టినా ఫీల్డర్లు లేని స్థలంలోనే. ఆధునిక ద్రావిడ్ లా అనిపించాడు. అతనోవైపు ఆడుతూంటే మరో వైపు ద్రావిడ్ తన రీతిలో ఆడుతూంటే బెంగళోరు జట్టుకేమీ ఢోకా లేదనిపించింది. వీరిద్దరూ అవుటయినా ఇంకా విరాట్, బౌచర్‌లు వున్నారు. బౌచర్ ఆటలను ముగించటంలో పేరున్నవాడు. ఉథప్పాను కూడా ముందు పంపేకన్నా చివరలో పంపితేనే రాణిస్తాడు.

ఇవన్నీ చూస్తూంటే ఈసారి ఐపీఎల్ బెంగళోరు వారిదే అనిపిస్తోంది.

డెక్కన్ చార్జర్లకన్నా బెంగళోరు శక్తివంతమయిన జట్టులా ఎదుగుతోంది.

గిల్లి అవుటయితే, రోహిత్ అవుటయితే డెక్కన్ చార్జర్లు కళవళ పడతారు.

ipl-3బెంగళోరు వారికి అందరూ అవుటవటం అలవాటే. నిలిచి ఆడటం వారికి అద్భుతం. ప్రస్తుతం. కాలిస్, మనీష్ పాండేలు మంచి ఫాంలో వున్నారు. ద్రావిడ్ బాటింగ్ కు కుదురునిస్తాడు. టైలర్, బౌచర్, ఉథప్పాలు బంతులను బౌండరీ దాటిస్తారు. అందుకే, కుంబ్లే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాడు. వీరు మూడు నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాలు సాధిస్తున్నారు. కాబట్టి దక్కన్ చార్జర్లు గెలవాలని వున్నా, బెంగళోరు వారే గెలుస్తారని అనిపిస్తోంది.

ముఖ్యంగా మనీష్ పాండే లాంటి యువ ఆటగాడు, ద్రావిడ్ లాంటి అనుభవఙ్నుడు, కాలిస్, టైలర్, బౌచర్ లలాంటి ఆటగాళ్ళున్న బెంగళోరు జట్టు, మళ్ళే వారికి గతం గుర్తొచ్చి ఓడటంలోనే మజా వుందనిపిస్తే తప్ప, తప్పకుండా గెలుస్తుందనిపిస్తుంది.

ఐపీఎల్ ప్రధానంగా బాటుగాళ్ళ ఆట. బంతులు విసిరేవారికన్నా బంతులను కొట్టే వార్రే ఆట ఫలితాన్ని అధికంగా నిర్ణయిస్తారు. కాబట్టి బంతిగాళ్ళకన్నా బాటుగాళ్ళ గురించే ఎక్కువగా చర్చించాల్సివుంటుంది.

20-20 ఆటలలో ఫీల్డింగ్ అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. దెక్కన్ చార్జర్లకన్నా బెంగళోరు వారు ఫీల్డింగ్ లోనూ పట్టుదల చూపుతున్నారు.

గెలవాలన్న పట్తుదల బెంగళోరు వారిలో కనిపించినంతగా డక్కన్ వారిలో కనబడటం లేదు. కాబట్టి, ipl-4కాస్త అదృష్టం తోడయితే, బెంగళోరువారే ఈసారి ఐపీఎల్ విజేతలవుతారని నా అభిప్రాయం.(ఈ అభిప్రాయాం ఏర్పడటంలో ద్రావిడ్, కుంబ్లే, కాలిస్ లంటే నాకున్న ప్రత్యేక ఇష్టమూ, మనీష్ పాండే అంటే కొత్తగా ఏర్పడుతున్న ఇష్టమూ తోడ్పడివుంటాయి.)

 ipl-2iplipl

May 24, 2009 ·  · 2 Comments
Posted in: క్రికెట్-క్రికెట్

మన టీవీ విశ్లేషకులకు క్రికెట్ ఆట తెలుసా?

టీవీ చానెళ్ళలో ఐపీఎల్ క్రికెట్ పోటీల ఆటల విశ్లేషణలు వింటూంటే ఈ సందేహం పదే పదే కలుగుతోంది. తెలుగు చనెళ్ళలోనే కాదు, ఇంగ్లీషు చానెళ్ళలో కూడా, గతంలో క్రికెట్ ఆట ఆడినవారు కూడా చేసే వ్యాఖ్యలు వింటూంటే, వీరు క్రికెట్ ఆట కన్నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తుంది.

నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ ఆట అత్యద్భుతం. బంతిని ఎంత కసిగా కొట్టాడంటే, ఇంకాస్త  బలము ఉపయోగించి కొడితే బంతి బోఉండరీనేకాదు, సముద్రాలు దాటి మన దేశంలో వచ్చి పడుతుందేమో అనిపించింది. ఒక ఆటగాడు అలా ఆడుతూంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి సమయంలోనే కెప్టేన్ చాతుర్యం తెలిసేది.

కెప్టేన్ తన బవులర్లతో మాట్లాడాలి. వారికి ధైర్యాన్నివ్వాలి. బంతులను యార్కర్లుగా వేయాలని చెప్పాలి. అవసరమయితే, ఓవరుకు ఆరుబంతులూ యార్కర్లే వేయమనాలి. స్పిన్నర్లకు, కూడా, బంతులను దాదాపుగా బాటు క్రిందకు వేయమనాలి. దాంతో ఆటగాడు ఆత్మ రక్షణలో పడతాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టలేదు. పైగా, ఆసమయానికి రాజస్థాన్ వారు అయిదు వికెట్లు కోల్పోయి వుండటంతో, ఆటగాడు తప్పనిసరిగా వికెట్ కాపాడుకోవటం పైన దృష్టి పెట్టాల్సివుంటుంది.

మన విశ్లేషకులెవ్వరూ ఈ విషయం ప్రస్తావించటంలేదు. గతంలో అనేక మార్లు స్టీవ్ వా ఇలాంటి పద్ధతులద్వారా అపజయాలనుంచి విజయాలు సాధించాడు. ఈ విషయాలు చర్చించేబదులు, మన వారు మెక్ గ్రాత్ ని కూచోబెట్టారు, కాలిగ్ వుడ్ ని ఆడనీయటం లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరంతా డిల్లీ జట్టులో భవిష్యత్తులో ఉపయోగపడే surprise ఆటగాళ్ళు. ఈ ప్రణాళికను అర్ధం చేసుకోకుండా, అక్కడికి ఆడుతున్నవారికి చేతగానట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చేతకాని జట్టుతోటే ఇంతవరకూ డిల్లీ జట్టు గెలుస్తూవస్తోంది. ఒక ఆటలో దెబ్బ తినగానే పనికిరానివారన్నట్టు వ్యాఖ్యానించటం అర్ధం లేనిది. రాబోయే రెండవ భాగం ఆటలలో మెక్ గ్రాత్ ఆడతాడు. అప్పటికి అతను ఫ్రెష్ గా వుంటాడు. ప్రభావం చూపుతాడు.

ఇదే ఆటలో గ్రేం స్మిత్ గురించి మన మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆట గురించి తెలియని వారు చేయాల్సిన వ్యాఖ్యలవి. గ్రేం స్మిత్ సరిగా ఆడలేకపోతున్నాడు. దాని ప్రభావం రాజస్థన్ జట్తు అనుభవిస్తోంది. కాబట్టి ఈసారయినా సరిగ్గా ఆడాలని నిశ్చయించుకునివుంటారు. కనీసం త్వరగా అవుటవద్దని నిర్ణయించుకుని వుంటారు. 20-20 ఆటలోనేకాదు, ఏ ఆటలోనయినా ఆరంభ ఆటగాళ్ళపైన బాధ్యత ఎక్కువ. వారిచ్చే ఆరంభంపైనే జట్టు పరుగులు సాధించటం వుంటుంది. కాబట్టి ఒక ఆరంభ ఆటగాడు త్వరగా అవుటయిపోతే, ఇంకో ఆటగాడు ఆత్మ రక్షణతో ఆడాల్సి వుంటుంది. పరుగులు వేగంగా తీయకున్నా ఒక వైపు వికెట్ పోకుండా ఆపాల్సివుంటుంది. ఇది తరువాత వచ్చే ఆటగాళ్ళలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వారు షాట్లు కొట్టి రిస్కు తీసుకుంటారు. తగిలితే గెలుపు, లేకపోతే ఓటమి. కానీ, ఒక వైపు ఒకరు అవుట్ కాకుండా నిలబడటం తప్పనిసరి. ఇద్దరు ఓపెనర్లు అవుటయితే అప్పుడు వన్ డౌన్ ఆటగాడు ఈ బాధ్యతను నిర్వహిస్తాడు.

అందుకే, నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ చెలరేగి విజయాన్ని సంభవం చేయటం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో, మరో వైపు గ్రేం స్మిత్ నింపాదిగా ఆడటమూ అంతే ప్రాధాన్యం వహిస్తుంది. ఇందుకు భిన్నంగా అతడు అవుటయిపోయుంటే, పఠాన్ కు పార్ట్నెర్లు మిగిలేవారుకారు. ఇంతకు ముందు అనేక ఆటల్లో ఇది జరిగింది. అందుకు ఈ సారి స్మిత్ ఆట ఎంతో ప్రణాళికానుసారంగా ఆడింది.

కానీ, మన విశ్లేషకులు స్మిత్ ను దుయ్యబడుతున్నారు. స్మిత్ వేగంగా పరుగులు తీయాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు. గమనిస్తే, రెండు సార్లు పఠాన్ కాచవుటబోయి తప్పించుకున్నాదు. అతడు అవుటయినా, తరువాత వచ్చే ఆటగాడికి స్మిత్ ను చూసి ధైర్యం వచ్చేది, వెగంగా పరుగులు తీసే ప్రయత్నాలు చేసేవాడు. కనీసం ఒకవైపు వికెట్ భద్రంగా వుందికదా అన్న ధైర్య అది. ఇక్కడ ఓటమి కన్నా, విశ్వాసం ప్రాధాన్యం వహిస్తుంది. విశ్వాసం అపజయాన్ని విజయంగా మారుస్తుంది. నిన్నటి ఆటలో జరిగింది అదే. మెరుపులు కురిపించిన పఠాన్ విజయానికి ఎంత కారకుడో, నింపాదిగా ఆడిన స్మిత్ కూడా అంతే కారకుడు.

ఇది అర్ధం చేసుకోకుండా మన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించటం చూస్తూంటే, వీరికి క్రికెట్ అసలు తెలుసా? అన్న సందేహం వస్తోంది. ఇది మన ప్రేక్షకుల అభిప్రాయాలను ఏర్పరుస్తుందని గమనిస్తే, క్రికెట్ ఆట అంటే సిక్సులు-ఫోర్లే అన్న అభిప్రాయం ఎందుకు స్థిరపడుతోందో అర్ధమవుతుంది.

April 29, 2009 ·  · 3 Comments
Posted in: క్రికెట్-క్రికెట్

ఐపీఎల్-నాలుగాటల సమీక్ష!

ఐపీఎల్ క్రికెట్ పోటీలో ఇప్పటికి నాలుగాటలయ్యాయి. ఈ నాలుగులో మొదటి రెండు ఆటలు ఎంత ఆసక్తి కలిగించాయో, మిగతా రెండు ఆటలు అంత చప్పగా వున్నాయి. మన దేశంలో పోటీలు జరగపోవటం వల్ల టికెట్ కలెక్షన్లలో తేడాలు వుండొచ్చుగానీ, టీవీలో చూసేవారిలో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.

మొదటి ఆటలో సచిన్ ఆట ఎంతో ఆనందాన్ని కలిగించింది. 20-20 ఆటలో కళ్ళుమూసుకుని బాటు వూపటానికి ప్రాధాన్యం వున్నా సాంప్రదాయిక ఆట తీరు, మెళకువలు, నైపుణ్యాల ఆవశ్యకతను స్పష్టం చేసింది సచిన్ ఆట తీరు. ఈ పోటీలలో రాణించటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు సచిన్.

ముంబాయి గెలుపు సులభంగానే సాధ్యమయింది. ఆ ఆటలో సచిన్ తప్ప చెప్పుకోతగ్గ అంశం మరొకటి లేదు. ఆట చప్పగానే సాగినా సచిన్ ఆట ఆటస్థాయిని పెంచింది.

రెండవ ఆటలో షేన్ వార్న్ బౌలింగ్ చూస్తూంటే అద్భుతం అనిపించింది. ఇతను ఆటగాడా మాయల మాంత్రికుడా అనిపించింది. కొత్త ఆటగాళ్ళయితే, ఆయన వేస్తున్న బంతులేమిటో, ఎటు తిరుగుతాయో కూడా అర్ధం కానివారిలా కనిపించారు. ముఖ్యంగా, కుది వైపునుంచి వంకరగా ఎడమవైపు పడి, హఠాతుగా వికెట్ పైకి దూసుకువెళ్ళిన బంతి అయితే అమోఘం.

వార్న్ బంతులను చక్కగా ఎదుర్కోగలిగాడు డ్రావిడ్. అంతేకాదు, ఇంకా గోడలో శక్తి సన్నగిల్లలేదని నిరూపించాడు. ద్రావిడ్ ఆట తీరు పరమాద్భుతం. సాంప్రదాయిక ఆట పద్ధతిలోనే ఆడుతూ 48 బంతులలో 66 పరుగులు చేయగలగటం నిజంగా నైపుణ్యం వున్న ఆటగాడు సందర్భాన్ని పట్టి ఆటను మార్చుకోగలడని మరోసారి స్పష్టం చేసింది. అయితే, ద్రావిడ్ రక్షణగా ఆడుతూ, షాట్లు కొడుతూంటే ఒక మంచి ప్రకృతి దృష్యాన్ని చూసినట్టుంటుంది. అదే అతడు పళ్ళు బిగబట్టి, కళ్ళు మూసి బాతును ఊపుతూంటే, బుద్ధిమంతుడు అల్లరి చేయాలని ప్రయత్నించి భంగ పడ్డట్టుంటుంది.

ద్రావిడ్ ఆట చక్కటి ఫీలింగ్ కలిగిస్తే, కుంబ్లే బంతులు ఆశ్చర్యం కలిగిస్తాయి. వయసును బట్టి ఆటగాళ్ళు ఆటనుంచి విరమించుకోవాలని కోరటం సబబు కాదేమో అనిపిస్తుంది.

ఈ ఆట కూడా చప్పగానే సాగినా, వార్న్, ద్రావిడ్, కుంబ్లేల వ్యక్తిగత ఆట తీరు ఆట స్థాయిని పెంచి ఆనందం కలిగిస్తుంది.

ఈ విషయం మిగతా రెండు ఆటల గురించి అనలేము. పంజాబ్ జట్టు వర్షంలో కొట్టుకుపోతే, ఆ వర్షంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కురిపించటం సెహవాగ్ వంతయింది. కానీ, 12 ఓవర్లు, 6 ఓవర్లాటలు  ఆనందం అంతగా కలిగించవు. ఏమో, కొన్ని రోజుల్లో రెండోవర్లు, మూడోవర్లూ ఆడినా ఆశ్చర్యంలేదేమో!

డక్కన్ చార్జర్ల ఆట కూడా ఇంతే! రెండు ఓవర్లలోనే కలకత్తా వారి పని ఖతం అని తేలిపోయింది. నలుగురు కాదుకదా, 11 మంది కెప్టెన్లున్నా ఇలాంటి ఆట తీరువల్ల ఎలాంటి లాభంవుండదు. కాబట్టి, జట్టు సభ్యులలో పోరాట పటిమను పెంచే ప్రయత్నాలు చేయాలికానీ, ఎంత మంది కెప్టెన్లన్న మీమాంసలవల్ల మొదటికే మోసం వస్తుంది.

ఇంతవరకూ జరిగిన ఆటలు చూస్తే, క్రితంసారి దెబ్బ తిన్న జట్లన్నీ ఈసారి గతం తప్పులనుంచి పాఠాలు గ్రహించి తప్పులు దిద్దుకున్నాయనిపిస్తుంది. గెలవాలన్న పట్టుదలతో వున్నాయనిపిస్తుంది. కనీసం, ఓడినా, గౌరవంగా ఓడాలన్న ఆలోచన కనిపిస్తోంది. గత సంవత్సరం కోల్పోయిన పరువును నిలబెట్టుకోవాలన్న తపన కనిపిస్తోంది.

గతంలో  గెలిచి ఇప్పుడు దెబ్బ తిన్నవ్వారు, పట్టుదలకు వస్తే, గతంలో దెబ్బతిన్నవారు ఇప్పుడు గెలవాలన్న పట్టుదల కనబరిస్తే, ఇక రాబోయే ఆటలన్నీ దీపావళి సంబరాలే అనిపిస్తుంది. ఇది, ఎంతవరకూ నిజమవుతుందన్నది, ఇంకొన్ని ఆటలు చూస్తే తెలిసిపోతుంది.

కానీ, మన దేశంలో జరిగితే ప్రేక్షకులు చూపే ఉత్సాహం మాత్రం ఈ ఆటలలో కొరవడింది. టీవీల్లో చూసేవారి ఆనందాన్ని ఈ అమ్షంకూడా తగ్గిస్తుఓంది.

April 20, 2009 ·  · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్

హమ్మయ్యా! టెస్టు డ్రా చేసి బ్రతికించారు!

మొత్తానికి న్యూజీలాండులో తెస్టు సిరీసు గెలిచే అవకాశాలను సజీవంగా వుంచుకుని మన క్రికెట్ ఆటగాళ్ళు మనల్ని బ్రతికించారు.

క్రికెట్ ఒకరోజు ఆటగా, 20-20 గా రకరకాల రూపాలు ధరించినా తెస్టు మాచ్ కున్న  విలువ వేరు. అయిదు రోజుల ఆట అని బోరు అన్నా, ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే టెస్టు గీటురాయిలాంటిది.

20-20 పోటీల్లో, బంతిని బౌండరీ దాటించటంలో ప్రావీణ్యం తెలుస్తుంది. వొత్తిడికి లొంగకుండా, క్రీజువద్ద ఎక్కువ సమయం గడపకుండా, లేడికి లేచిందే పరుగన్నట్టు బాటు పుచ్చుకుందే కొట్టటానికన్నట్టు ఆడగలగాలి.

ఒకరోజు పోటీలో కాస్త తీరిక దొరుకుతుంది. ప్రణాలిక ప్రకారం ఆడాలి. ఇన్నింగ్స్ ను నిలబెట్టే వీలుంటుంది. వికెట్లు త్వరగా పోయినా, నెమ్మదిగా, 50 ఓవర్లలో నిలదొక్కుకుని ఆడి జట్టుని గట్టెక్కిచ్చే వీలుంటుంది.

అయిదు రోజుల ఆట ఆటగాడి వ్యక్తిత్వానికి పరీక్షలాంటిది. 20 ఓవర్లో, 50 ఓవర్లో ఓపిక పడితే అయిపోదు. అయిదు రోజులు అదే ఏకాగ్రత, అదే పోరాట పటిమ, అదే పట్టుదల నైపుణ్యం చూపాల్సివుంటుంది. అందుకే, 20-20 ఆటలో గొప్పగా విజయం సాధించిన వారు 50-50 ఓవర్లలో అంత ప్రతిభను చూపలేరు.

50-50లో అద్భుతంగా ఆడినవారు అయిదు రోజుల ఆటలో నిలద్రొక్కుకోలేరు.  టెస్టు పోటీల్లో అద్భుతమయిన ఆట చూపేవారు ఒకరోజు పోటీలలో నిలబడలేరు.

కానీ, అన్ని ఆటలలోనూ ఆటగాడికి అవసరమయిన నైపుణ్యం ఒక్కటే. ఆటగాడు సందర్భాన్ని అనుసరించి, వేగంగా పరుగులు తీయటం, కాస్త నిలబడిన తరువాత పరుగులు తీయటము, నింపాదిగా ఆడుతూ వీలును బట్టి పరుగులు తీయటమూ చేయాలి. అంతే, ఇది అర్ధమయినవారు ఏరకమయిన ఆటలోనయినా పేరు పొందుతారు.

గౌతం గంభీర్ 20-20 నుంచి పూర్తిగా తేరుకోకముందే 50 ఓవర్ల ఆటవచ్చింది. దానికి అలవాటయ్యేలోగా తెస్టు మాచ్ వచ్చింది. అందుకే, అతడు నిరాశ కలిగించాడు. కానీ, రెండో తెస్టు రెండో ఇన్నింగ్స్ లో అతడికి ఎలా ఆడాలో అర్ధమయింది. ద్రావిడ్ మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కడ ఆపాడో రెండో ఇన్నింగ్స్ అక్కడి నుంచే ఆరంభించాడు. నిజానికి ఇటువంటి సందర్భాలలో ఆడటం ద్రావిడ్ కు కొట్టినపిండి. మొదటి సారి తొందరపడి, తెండోసారి దురదృష్టం వల్ల  ద్రావిడ్ 100 పరుగులు చేయలేకపోయాడు. లక్ష్మణ్ ద్రావిడ్ తరువాత ఇలాంటి పరిస్థితిలో ఎలా ఆడాలో తెలిసినవాడు. అందుకే అతడు రెండి ఇన్నింగ్స్ లోనూ చక్కగా ఆడాడు. యువరాజ్ సింగ్ కు ఇది తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితి. ఆడాడు. సెహవాగ్ అలవాటయిన రీతిలో ఆడాడు. కానీ, పరిస్థితికి తగ్గట్టు ఆడలేదు. సచిన్ ఎలా ఆడినా అద్భుతమే.

అయితే, మనవాళ్ళు ఆటను డ్రా చేయటం వల్ల మనం బ్రతికి పోయాం. లేకపోతే, టీవీ చానళ్ళలో మిడి మిడి ఙ్నానపు యాంకర్లు గొప్ప గొప్ప ఆటగాళ్ళను పనికిరాని వారిలా దూశించి, అవమానపరచటం ఒక వారంపాటు భరించాల్సి వచ్చేది. బ్యాటు పుచ్చుకోవటం సరిగ్గా తెలియని విశ్లేషకులంతా చానళ్ళలో వచ్చేసి ఆటగాళ్ళపైన అక్కసు ప్రకటించటం చూడాల్సివచ్చేది. పత్రికలన్నీ ఆటగాళ్ళని తిట్టేవి.

ఒక వారం క్రితం ఈ ఆటగాళ్ళనే, ఈ చానళ్ళు, ఈ పత్రికలు పొగిడాయి. ఆకాశానికి ఎత్తేశాయి. మొదటి ఇన్నింగ్స్‌లో చతికిలబడగానే, మన వాళ్ళు ప్రాక్టీసు బదులు ఎంజాయ్ చేశారని పదే పదే దూషించాయి. అసలు మనవాళ్ళకు ఆట రానట్టే చర్చలు జరిగాయి.

ఒక తెలుగు చానల్లో ఇంకా బొడ్డూడని వార్తగత్తె మన ఆటగాళ్ళు జిడ్డు ఆట చూపారని తన అమూల్యమయిన అభిప్రాయం ప్రకటించింది. నిజానికి వార్తగత్తెల వ్యాఖ్యలు స్క్రిప్తు రయిటర్లు రాస్తారు. అంటే, ఆట సమయమూ సందర్భమూ కూడా తెలియని స్క్రిప్టు రచయితలు, తిట్టి గొప్పగా భావించుకునే న్యూనతా భావం తో సతమతమయ్యేవారూ మనకు వార్తలూ విశ్లేషణలూ అందించి మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నారన్నమాట. ఈ చానళ్ళే ఒక రోజు ముందు మనవారు అనవసరమయిన షాట్లు కొట్టబోయి అవుటయ్యారని తిట్టాయి. తెల్లారేసరికి జిడ్డూఅట చూపారని హేళన చేస్తున్నాయి.కొందరు ఎక్స్పర్టులయితే, ధోనీ లేకపోటంవల్ల ఆటగాళ్ళు ఆడలేకపోతున్నారని అన్నారు. సచిన్, ద్రావిడ్ లాంటి ఆటగాళ్ళు ధోనీ లేకపోతే ఆడలేరన్నమాట!

ఆట గురించి, ఆటలో మెళకువల గురించి తెలియని వారు, సమయమూ సందర్భమూ గ్రహించనివారు మన చానళ్ళలో నిండి వున్నారు. అందుకే ఆటను డ్రా చేసి మన ఆటగాళ్ళు మనల్ని బ్రతికించారు. లేకపోతే ఈ పాటికి టీవీలనిండా, పత్రికలనిండా, మన ఆటగాళ్ళ పైన విమర్షలుండేవి. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ ల కన్నా ఆట ఎక్కువగా తెలిసినట్టు ప్రతివాడూ వ్యాఖ్యానించేవాడు. ఆట డ్రా అవటంవల్ల మనమీ దుస్థితినుంచి తప్పించుకున్నాము. అందుకు మనము ఆటగాళ్ళకు కృతఙ్నలమయివుండాలి.

అందుకే డ్రా చేసి మనల్ని బ్రతికించారు మన ఆటగాళ్ళు.

March 30, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్