Archive for the ‘క్రికెట్-క్రికెట్’ Category

పొమ్మనలేక పొగబెట్టటం అంటే ఇదే!

అందరూ ఎదురుచూస్తున్న గంగూలీ రిటయిర్మెంటు ఖరారయిపోయింది. ఆస్ట్రేలియాతో ఆడినతరువాత క్రికెట్టును వదిలేస్తానని గంగూలీ ప్రకటించటంతో ఒక వివాదాస్పద అధ్యాయంపైన తెర పడింది. గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, సచిన్ లు కొద్దిపాటి తేడాతో సమవయస్కులుగా పరిగణించవచ్చు. గంగూలీ, ద్రావిడ్ లయితే ఒకేసారి తెస్టులాడటం ఆరంభించినట్టే! మరి అలాంటప్పుడు అందరి దృష్టీ గంగూలీ మీదే ఎందుకున్నది అని ఆలోచిస్తే, ఆట ప్రావీణ్యం కన్నా అనేక ఇతర విషయాలు ఒక ఆటగాడి భవిష్యత్తును నిర్ణయిస్తాయని అర్ధమవుతుంది.

ముందుగా, మనము గ్రహించవలసిందేమిటంటే, మనకు మన వీరులను, దేశభక్తులను, మేథావులనేకాదు, ఆటగాళ్ళను కూడా గౌరవించటం రాదని మరోసారి ఋజువయింది.  డిల్లీ తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసాఫీసరు బలిదానం బూటకమని రాజకీయ నాయకులు తేల్చేస్తున్నారు. గాంధీ మోసమని మేథావులు తేలుస్తున్నారు. ఇలా అందరూ పనికిరానివారవుతున్న తరుణంలో సినిమావాళ్ళు క్రికెటర్లే దేవుళ్ళవటంలో ఆశ్చర్యంలేదు. ఆ దేవుళ్ళ వలువలుకూడా మనవారు వలిచేస్తున్నారు.

గంగూలీ మంచి ఆటగాడు. లేకపోతే ఇన్ని పరుగులు చేయలేడు. అయితే, గంగూలీ ఎవరిమాట వినడు. ఆయనదంతా రాజులాంటి వ్యవహారం. అందుకే అతనంటే అందరికీ అసూయ, కినుకలు. ఆయన వికయాలు సాధిస్తున్నంత కాలం ఎవరూ ఏమీ అనలేక పోయారు. కాస్త వెనుకపడగానే అందరూ ముందుకొచ్చారు. గంగూలీ హటావో అభియాన్ ను ఆరంభించారు. అయితే, గంగూలీకి దాల్మియా అండవున్నతకాలం, బెంగాలీ ప్రజల ఆదరణ వున్నంత కాలం సమస్య లేకుండా పోయింది. కానీ ఏదీ ఎల్లకాలం సాగదు. దాంతో గంగూలీ కాలం చెల్లిపోయింది.

ఎవరేమన్నా గంగూలీ గొప్ప ఆటగాడు. మన క్రికెట్ జట్టు మనస్తత్వం గంగూలీ హయాంలోనే మారింది. చెప్పినదానికి తలలూపే సౌమ్య బానిస మనస్తత్వం వదలి ఎవరినీ లెక్క చేయని దూకుడు మన జట్టులో కనబడటం గంగూలీ చలవే. చొక్క విప్పి బూతులు తిడుతూ సమబరాలు చేయటం, ఎదుటి కెప్టాన్ ఎదురుచూస్తున్నా పట్టించుకోక పోవటం లాంటి వన్నీ గెలిచినంతకాలం అలంకారాలయ్యాయి. ఓటమి ఎదురవగానే గుదిబండలయ్యాయి. అందుకే అందరూ గంగూలీ వెంట పడ్డారు. ప్రపంచం, భిన్నంగా వుండేవారిని భరించలేదు. వారి శక్తివంతులుగా వున్నంత కాలం తలవంచుతుంది. బలహీనులవగానే చీల్చి చెండాడుతుంది. కనీసం, ఒక మంచి ఆటగాడికి ఇవ్వాల్సిన మర్యాదను కూడా దక్కనివ్వదు. అందుకే గంగూలీ ఇంత కాలం పట్టుకుని వ్రేలాడటం ఆయన స్థాయిని దించింది. పొమ్మనలేక పొగబెడుతున్నా, ఇంకా చూరు పట్టుకుని వేలాడుతున్నాడెందుకన్న భావనను కలిగించింది. నిజానికి గంగూలీ ఎప్పుడో క్రికెట్ వదిలేసి వుంటే సెలెక్టర్ల చెంప మీద కొట్టినట్టుండేది. కానీ మళ్ళీ జట్టులోకి రావటం, తనని తాను నిరూపించుకోవటం, అయినా అతడిని జట్టులోకి తీసుకోకపోవటం లాంటి అంశాలు, సెలెక్టర్ల నైచ్యాన్ని ఎలాగో చూపుతాయి, కానీ గంగూలీ స్థాయిని కూడా దిగజారుస్తాయి.

గంగూలీ పని అయిపోయింది. ఇక మిగిలి వున్నది, ద్రావిడ్! నన్నడిగితే ద్రావిడ్ కూడా ఎప్పుడో సన్యాసం స్వీకరించాల్సింది. కెప్టెన్సీతో పాతు ఆడటం వదిలేస్తే గొప్పగా వుండేది. ఎందుకంటే ధోనీలాంటి వారు ఇప్పుడు ద్రావిడ్ గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అతని ఆట తీరును విమర్శిస్తున్నారు. కొత్త కొత్త ఆటగాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తనలాంటి వారి కాలం చెల్లిపోయిందని ద్రావిడ్ గ్రహించి పరువుగా తప్పుకుంటే మంచిది. ఇప్పటికే ద్రావిడ్ ను మనవారు ఎంతగా అవమానించాలో అంతగా అవమానిస్తున్నారు. అయినా గంగూలీలా ఆవేశపరుడు కాదు కాబట్టి గుట్టుగా అన్నీ భరిస్తున్నాడు. కానీ ఇలా ఇంకా చెల్లదని అర్ధంచేసుకుంటే మంచిది.

నిజానికి ద్రావిడ్, గంగూలీల కన్నా ముందు తెండుల్కర్ పక్కకు తప్పుకోవాలి. దెబ్బలతో బాధ పడుతున్నాడు. ఇంతకు ముందులా ఆడలేకపోతున్నాడు. అయినా అతనిపైన ఉన్న అభిమానం వల్ల ఎవరూ ఏమీ అనటంలేదు. కానీ సీనియర్లందరినీ వన్ డే జట్టునుంచి తొలగించి ఆయనను మాత్రం ఆడనివ్వటంలో వున్న సూచనను సచిన్ అర్ధంచేసుకుని గౌరవంగా తప్పుకుంటే అతని పరువుకూడా నిలుస్తుంది. లేకపోతే ఏదో ఒకరోజు ఎవరో అతడినీ తొలగిస్తారు. అప్పుడు మన కొత్త దేవుళ్ళంతా మసిబారతారు. మరీ కొత్తదేవుళ్ళు పుట్టుకోస్తారు. పాతబడేలోగా వరికీ పోగబెడతారు. కాబట్తి ద్రావిడ్, సచిన్లు కూడా పొమ్మనలేక పోగబెట్టేలోపల కిమ్మనకుండా పక్కకు తప్పుకుంటే గౌరవం నిలుస్తుంది. కొత్తవారు ముసలివారయ్యేలోగా కాస్తయినా ఆటలాడతారు. మనకూ హీరోలను గౌరవించటంలేదన్న బాధ తప్పుతుంది.

October 9, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

ఐ.పి.ఎల్. అయిపోయింది.లాంగ్ లివ్ ఐ.పి.ఎల్!

హమ్మయ్య!మొత్తానికి రోజూ సాయంత్రాలు టైం పాస్ చేసిన క్రికెట్ పూర్తయి పోయింది.షేన్ వార్న్ అనుకున్నట్టే గెలిచాడు.ఆఖరి బంతి లో అవసరమయిన ఒక్క పరుగు చేసి ఇల్లంటి పరిస్థితిలో వుండి వోడిపోయిన అనేక జట్లకు పాఠం నేర్పాడు.తొందరపాటు,ఉద్విగ్నతల వల్ల లాభం లేదని నిరూపించాడు.గెలవాలన్న పట్టుదల,ప్రతిభను నిరూపిచాలన్న ఆత్రం,అవకాశాన్ని వినియోగించుకోవాలన్న విచక్షణ వుంటే,పేరుతో సంబంధం లేకుండా ఆటగాళ్ళు విజేతలవుతారని వార్న్ నిరూపించాడు.ఆస్ట్రేలియా జట్టు ఒక మంచి కప్టెన్ ను ఉపయోగించుకోలేక పోయిందని ప్రపంచానికి ప్రదర్శించాడు.వ్యక్తిగత జీవితాన్ని ఆటకు ముడి పెట్టి,ఆటగాడి ఆటను నిర్ణయించటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది.రచయితను అతని రచన నుంచి వేరు చేసి చూసినట్టే,ఆటగాటగాడి వ్యక్తిగత జీవితాన్ని  ఆటతో కలిపి చూడకూడదు.
ఒక రకంగా చూస్తే,44 రోజుల పాటు జరిగిన ఈ పోటీ మన దేశ చరిత్రలో అనేక ప్రధానామ్షాలను సూక్ష్మంగా తన చరిత్రలో భాగం చేసింది.ఎంతో గొప్ప పేరుండి ఏదో ఉద్ధరిస్తారనుకున్న వారంతా మోసం చేసారు.దారి పక్కన పడిపోయారు.ఆసలు అడియాసలు చేసారు.ఎందుకూ పనికి రారనుకున్నవారు అనూహ్యమయిన ఆట ప్రదర్షించారు.మళ్ళీ మనలో ప్రతిభను విదేశీయుడే వెలికి తెచ్చి చూపాల్సి వచ్చింది.మన జట్లు అనేకం చివరి క్షణంలో తొందరపడి ఓడటం,అవకాశాలను జార విడుచుకోవటం,సరయిన సమయంలో దెబ్బతినటం వంటివన్నీ క్రికెట్ లోనూ చూడవచ్చు.కిల్లెర్ ఇన్స్టింక్ట్ లేక పోవటం జాతీయ జాడ్యం అని నిరూపితమయింది. కొందరు దేవుళ్ళయిపోవటం,ఆ దేవతలే పనికి రాక పోవటమూ చూశాము.
ఐ.పి.ఎల్ జరిగే సమయంలోనీ బాంబు పేలుళ్ళూ చూసాము.ఎన్నికల ఫలితాలూ చూసాము.అల్లర్లు,నిరసనలు,వివాదాలూ అన్నీ అనుభవించాము.అభినందల అరువు అమ్మాయిల గురించి అనవసర వివాదమూ చూసాము.సంస్కృతి దెబ్బతింటుందన్న వారే చివర్లో అరువు అందాలను చూస్తూ ఆనందించటమూ చూసాము.మన సమాజంలోని ద్వంద్వ ప్రవృత్తి,అపోహలూ అన్నీ చూసాము.చెంపదెబ్బాలూ చూసాము.అంటే ఈ ఐ.పి.ఎల్ పోటీలను సామాజిక,మానసిక,సాంస్కృతిక,చారిత్రిక,తాత్విక కోణాలలో విశ్లేశిస్తే మనగురించిన అనేక విశయాలు మనకే అర్ధమవుతాయన్నమాట.
కొందరు ఆటగాళ్ళనే పట్టుకుని వేలాడుతున్న మనకు మన వీధి వీధినా అద్భుతమయిన ప్రతిభ కల ఆటగాళ్ళున్నారని ఈ పోటీలు చూపించాయి.సమయంవస్తే,సమయానికి తగ్గ వ్యక్తులు ఉద్భవిస్తారు.కాబట్టి,ఒక ఆటగాడు లేక పోయినా,ఒక రాజకీయ నాయకుడు లేక పోయినా కొంపలు మునుగుతాయని భయపడనవసరం లేదు.కాశ్త దృష్టిని విశాలం చేసి చుట్టూ చూడాఅలి.వీధికో పఠాన్,గోస్వామి,అస్నోద్కర్ వంటి వారు దొరుకుతారు.లేకపోతే ఎప్పటికీ కొందరే కనిపిస్తూంటారు.మిగతా వారు నిరాశలో మగ్గుతారు.దేశంలో మంచి ఆటగాళ్ళు లేరని మనం బాధపడతాము.క్రికెట్లోనే కాదు మిగతా ఆటలకూ ఇది వర్తిస్తుంది.అయితే,క్రికెట్ లో ఉన్న ఆకర్శణ,దబ్బులు మిగతా ఆటల్లో లేవు.ఐ.పి.ఎల్ వల్ల మామూలుగా అవకాశాలు రాని వారందరికీ అవకాషాలు వచ్చాయి.మిగతా ఆటలకీ అదృష్టం ఎప్పుడో ఎదురుచూద్దాం!అప్పటి వరకూ క్రికెట్ స్వరూపాన్ని సంపూర్ణంగా మర్చిన ఐ.పి.ఎల్ ప్రభావాన్ని విశ్లేశిస్తూందాం.అందుకే ఐ.పి.ఎల్.అయిపోయింది.లాంగ్ లివ్ ఐ.పి.ఎల్. 

June 2, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

చివరకు నవ్వేదెవరు?

గెలిచిన వాడు నవ్వుతాడు.ఓడిన వాడు ఏడవలేక నవ్వుతాడు.ఇవాళ్ళ జరిగే ఫైనల్ లో ఎవరు నవ్వుతారు?ఎవరు ఏడవలేక నవ్వుతారు?క్రికెట్ ప్రేమికులందరి మనస్సుల్లో మెదలుతున్న ప్రశ్న ఇది.నిన్న పంజాబ్ ఓడిపోవటం లెక్క ప్రకారం జరగకూడని పని.కానీ విధికి దానిష్టం తప్ప మన లెక్కలతో పనిలేదు.మరీ ఘోరంగా ఓడిపోయింది పంజాబ్.అందరికన్నా ఎక్కువ పరుగులు పవార్ తీసాడంటేనే ఎంత ఘోరమయిన బాటింగ్ చేసారో ఊహించవచ్చు.మొదటి అయిదు ఓవర్లలో వికెట్ కోల్పోని జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ వుంటాయి.అలాగని.జయసూర్య,టెండుల్కర్ ఆడినట్టు పదో ఓవర్ వరకు పరుగులు తీయకుండా వికెట్ కోల్పకుండా వుండి లాభం లేదు.కాబట్టి,ఆట తీరును మొదటి ఆటగాళ్ళు నిర్ణయిస్తారు.అయితే,చెన్నై,రాజస్థాన్ జట్లలో ఇద్దరికీ గెలవాలన్న పట్టుదల వుంది.రెండు జట్లలో మంచి ఆటగాళ్ళు వున్నారు.బౌలింగ్లో చెన్నైకి,రాజస్థాన్ ఏమీ తీసిపోదు.బాటింగ్లో,రాజస్థాన్ కు చెన్నై తక్కువ కాదు.కాబట్టి రెండూ సమాన స్థాయి జట్లు ఫైనల్ చేరాయి అనుకోవచ్చు.రెండు జట్లకూ ప్రధాన తేడా,షేన్ వార్న్!కానీ,ఇంతవరకూ మురళీ ధరన్ సరిగా ఆడలేదు.అతడు బహుషా తన ప్రతిభ చూపేందుకు చివరి ఆటను ఎంచుకున్నాడేమో!అదేజరిగితే,ఎవరూ ఏమీ చేయలేరు.
రాజస్థాన్ రాయల్స్ శక్తి మొదటి ఆటగాళ్ళు.కీలకమయిన ఆటకు గ్రేం స్మిత్ లేక పోవటం పెద్ద దెబ్బ.అతని అనుభవం,పరిణతి ఇతరులనుంచి ఊహించటం కష్టమే! అదీగాక,చెన్నై జట్టులో మొదటి వికెట్ పోతే కుదురుగా ఆడే రైనా వున్నాడు.రాజస్థాన్ జట్టులో పఠాన్,షేన్ వాత్సన్ లున్నా,పఠాన్ కుదురుగా ఆడగలడన్నది సందేహాస్పదమే!అంటే,నిన్న పంజాబ్ కి జరిగినట్టు రెండు వికెట్లు త్వరగా పడితే,రాయల్స్ పని అయిపోతుంది.అలాకాక,తన్వీర్ విజృంభిస్తే,చెన్నైకి కష్టం అవుతుంది.
ధోనీ అంటే వ్యతిరేకత వున్నా,ధోనీ గెలవాలని అనుకోవటం స్వాభావికం.ఫస్ట్ బౌలింగ్ రాస్కల్సే నిన్న అతడి జట్టును గెలిపించారు.ఫైనల్స్ లో కూడా ఈ రాస్కల్స్ అతడిని గెలిపించాలి.అయితే,మొదటి నుంచీ అందరి అంచనాలను తల్ల క్రిందులు చేస్తూ,ఎవరూ పెద్దగా పట్టించుకోని ఆటగాళ్ళను మహా వీరులుగా తీర్చిదిద్దిన వార్న్ గెలవటం సమంజసం.కానీ,క్రికెట్ ఆటలో ఆరోజు ఎవరు బాగ ఆడితే వాడే విజేత.ఒక్క ఆట సరిగా ఆడకపోతే ఇంత శ్రమ హుష్ కాకీ అవుతుంది.డిల్లీ,పంజాబ్ ల గతి దీన్ని స్పష్టం చేస్తుంది.కాబట్టి పాత ఆటల ఫలితాలను పట్టుకుని వేలాడి లాభం లేదు.ఫైనల్స్ వేరే ఆట.ఇవాళ్ళ ఎవరికి అదృష్టం వుంటే వాడేఅ రారాజు!నైపుణ్యం మీద కాక అదృష్టం మీదే విజేత నిర్ణయం ఆధార పడి వుంది.అదృష్టం ఉత్తమ జట్టును వరించుగాక!

June 1, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

ఫైనల్స్ లో రాయల్స్.నీ గతేమిటి చెన్నై?

తొలి సెమి ఫైనల్ ఆట అనుకున్న రీతిలోనే సాగింది.టాస్ గెలవటం ఒక్కటే ఈ ఆటలో సెహ్వాగ్ చేసిన సరయిన పని.20-20 లో మంచి బాటింగ్ జట్టు ఎప్పుడూ ముందు బాటింగ్ చేయటం మంచిది.ఎందుకంటే,ఎంత గొప్ప ఆటగాళ్ళు వున్న జట్టయినా,ఎదురుగా,200 పరుగుల లక్ష్యం వుంటే తడబడక తప్పదు.మొదలు ఆడే జట్టు ఒక రెండు వికెట్లు పడ్డా చూసుకుని ఆడి వీలుచిక్కగానే స్కోరు పెంచవచ్చు.రెండోసారి ఆడే జట్టుకు ఆ సౌలభ్యం వుండదు.ఒక వికెట్ పడి,రెండు బంతులలో పరుగులు తీయక పోతే,ఒత్తిడి పెరిగి పోతుంది.దాంతో తొందర పడాల్సి వస్తుంది.ఆ తొందరలో మరొక వికెట్ పడితే,అంతా గోవిందా.నిన్న డిల్లీ విషయంలో జరిగింది ఇదే.
192 పరుగులు లక్ష్యం.సెహ్వాగ్ త్వరగా ఔట్ అయ్యాడు.దాంతో మిగతా వారి మీద ఒత్తిడి పెరిగింది.ఎదురుగా భారీ లక్ష్యం కనిపిస్తోంది.దాంతో ప్రతి బంతినీ బాదిపారెయాలన్న తొందర చూపారు.ఫలితంగా వెంట వెంటనే వెనుతిరిగారు.ఓడి ఇంటి దారి పట్టారు.
రాజస్థాన్ రాయల్స్ కూడా టాస్ గెలిచివుంటే ముందు బౌలింగ్ తీసుకునే వారు.కానీ ముందు బాటింగ్ చేయాల్సి వచ్చింది.గమనిస్తే,మొదటి మూడు ఓవర్లలో వాళ్ళు తొందర పడి బాదేయలేదు.జాగ్రత్తగా ఆడారు.వీలు చిక్కినప్పుడు పరుగులు తీసారు.అంతే తప్ప మొదతి బంతినుంచే బాదుడు ఆరంభించలేదు.కాస్త అలవాటవగానే విజృంభించారు.మూడు ఓవర్లలో 30 పరుగులు కూడా లేని వారు,6 ఓవర్లయ్యేసరికి 60 పరుగులు దాటారు.గ్రేం స్మిథ్ ఆట,అస్నోద్కర్ ఆట తీరు పరసోర విరుద్ధ మయినా,ఇద్దరి నడుమ మంచి సమన్వయం వుంది.సెహ్వాగ్.గంభీర్ లిద్దరూ మంచి జోడీ అయినా విఫలం కాకుండా నిలకడగా ఆడటంలో వీరిద్దరే ఉత్తములు.షేన్ వాత్సన్ ఆట రూపు రేఖలను మార్చేశాడు.యౌసుఫ్ పఠాన్ జాతీయ టేంలో ఈన్నికను సిక్సులు కొట్టి సంబరాలు జరుపుకున్నాడు.దాంతో,రాజస్థాన్ వారు హాయిగా,ఎటువంటి తొందరలు లేకుండా 192 సాధించగలిగారు.గమనిస్తే,ఆన్ని జట్ల లోకీ పూర్తిగా 20-20 ఆట తత్వాన్ని అర్ధం చేసుకున్నది ఈ జట్టే అనిపిస్తుంది.ప్రతి ఒక్క ఆటగాడికీ తాను చేయవలసింది తెలుసు.ఒకరు విఫలమయితే వెంటనే ఆ బాధ్యతను మరొకరు భుజానికి ఎత్తుకుంటున్నారు.కొందరు విఫలమన్న మాట తలపెట్టక జట్టు విజయానికి కారకులవుతున్నారు.మొన్న పంజాబ్ వారితో ఓడటంతో దిష్టి తీసేసినట్టయింది.మళ్ళీ ఫైనల్లో పంజాబ్ తో జరిగే ఆటలో రాజస్థాన్ వారు అసలు ఆట ఆడతారు.కప్పు గెలుచుకుంటారు అనిపిస్తోంది.
ఇవాళ్ళ జరిగే మరో ఆటలో చెన్నై జట్టుకు గెలవాలన్న పట్టుదల వుంది.గెలిచే శక్తి వుంది.కానీ రాజస్థాన్ వారు కూడా 20-20 ఆటను బాగా ఆకళింపు చేసుకున్నారు.మార్ష్ కనక బాఘా ఆడితే,సెహ్వాగ్,సంగకార,జయవర్దనేలు నిలబడితే-చెన్నై ఎదురు నిలబడటం కష్టం.పంజాబ్ జట్టు క్రమం తప్పకుండా ఉత్తమ స్థాయి ఆట ప్రదర్షిస్తూ ఈ స్థాయికి వచ్చారు.చెన్నై జట్టు ఇందుకు భిన్నంగా అప్పుడప్పుడే మంచి ఆట చూపింది.కాబట్టి పంజాబ్ గెలిస్తేనే న్యాయం జరిగినట్టు అవుతుంది.అయితే,దేవుడి కొలబద్దలు వేరు.కాబట్టి ఏమవుతుందో ఎదురుచూడటం తప్ప మార్గం లేదు.అయితే,అందాల ప్రీతి జింటా ఆనందంగా,బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతూ.నృత్యం చేస్తూంటే చూడాలని వుంది.కాబట్తి నా వోటు పంజాబ్ కే.ఎంతయినా,అందమే ఆనందం అన్నారు పెద్దలు.అదీగాక,ఎటువంటి భేషజాలు లేక హాయిగా ఆనందించగలిగేవారు ఎందరున్నారు.అలా ఆనందించేవారిని మరింత ఆనందింపచేయటంలో ఇంకెంతో ఆనందం వుంది.అవునా?

May 31, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

ఐ.పి.ఎల్ కప్పు ఎవరిది?

మొత్తానికి ఐ.పి.ఎల్ క్రికెట్ పోటీల్లో సెమి ఫైనల్ ఆడే జట్లేవో తెలిసిపోయింది.రాజస్థాన్,చెన్నై,పంజాబ్,డిల్లీ జట్లు ఓడితే ఇంటి దారి పట్టే సెమి ఫైనల్ లో తలపడతాయి.ఒక్క బంతి,ఒక్క ఓవరు,ఒక్క షాట్ మొత్తం ఆట స్వరూపాన్ని మార్చి,అదృష్టాన్ని తల్ల క్రిందులు చేసే పోటీల్లో ఎవరు తప్పకుండా గెలుస్తారో చెప్పటం సాహసమే కాదు,మూర్ఖత్వం కూడా అవుతుంది.కానీ,ముందు జరిగే దాన్ని ఊహించటం మానవుడి బలహీనత.ఊహించినట్టు జరిగితే గొప్ప అనుకోవటం,ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగితే,తలచినదే జరిగినదా దైవం ఎందులకు?అనుకోవటం మనకొక అలవాటు.
సెమీస్ లోకి రావటానికి చెన్నై జట్టు చాలా కష్ట పడటమే కాదు,మంచి పట్టుదలను ప్రదర్శించింది.రాజస్థాన్ వారితో రెండువందల పరుగులను వేటాడిన విధం వారి పట్టుదలను చూపిస్తుంది.చార్గెర్స్ ఎలాగో చార్గి లేక నిర్వీర్యులయి ఉన్నారు.దాంతో గెలుపు మొదటి ఓవర్లోనే చెన్నై దని స్పష్టమయింది.చెన్నై గెలుపు ముంబై వీరులను పూత్రిగా నేల పైకి దించింది.సచిన్ పేరు విజయానికి రాచబాట కాదని,క్రికెట్ 11 మంది కలసి ఆడేదని ఈ పాటికి ముంబయ్ జట్టులోని వారికి అర్ధమయి వుంటుంది.ముంబయ్ జట్టులో అనుభవం ఉన్న వారుండి కూడా చివరి ఓవర్లలో ఉద్విఙ్నతలను తట్టుకోలేకపోవటం వారి పరాజయానికి ప్రధాన కారణం. పంజాబ్ వారితో,రాజస్థాన్ వారితో చివరి బంతిలో ఒక్క పరుగుతో ఓడటం వారి సెమీస్ అర్హతను దెబ్బ తీసింది.
పంజాబ్ జట్టు పట్టుదల,విజయోత్సాహం ముంబయ్ ఆటలో చివరి బంతిలో యువరాజ్ ప్రత్యర్ధిని రనౌట్ చేసిన విధం  నిరూపిస్తుంది. విదేశీ స్వదేశీ ఆటగాళ్ళు కలసికట్టుగా,ఒక జట్టులా ఆడుతున్న ఈ జట్టు ఫైనల్ కి వెళ్తుందనిపిస్తుంది.కానీ,యువరాజ్,సంగకార,జయవర్దనేలు ఆడకపోతే జట్టు దెబ్బతింటుంది.
డిల్లీ జట్టుకు గంభీర్,ధవన్,మెక్ గ్రత్,సెహ్వాగ్ లు నాలుగు స్థంభాలు.అయితే,వీరిలో సెహ్వాగ్ ఆట ప్రాణం పోకడా ఎవ్వరూ చెప్పలేరు.రాజస్థాన్ వారితో,ఓడిన విధం వీరి బలహీనతలను స్పష్టం చేస్తుంది.
ఉన్న వారందరిలోకీ పటిష్టమయిన జట్టులా కనిపిస్తోంది రాజస్థాన్ జట్టు.బాటింగ్లోనూ,బౌలింగ్లోనూ ఎటువంటి బలహీనతలూ చూపటంలేదు.గెలవాలన్న పట్టుదలలోనూ ఎక్కడా సడలింపు కనబడటంలేదు.అయితే,సాధారణంగా అన్ని ఆటలూ గెలుస్తూఅ వస్తున్న వాడు అసలు ఆటలో ఓడతాడు.అలా అదృష్టం అడ్డుపడితే తప్ప రాజస్థాన్ వారే గెలుస్తారనిపిస్తుంది.మిగతా జట్లనీ ఏదో ఒక బలహీనతను చూపాయి.రాజాస్థాన్ వారు ఇంకా బలహీనతలను చూపాల్సివుంది.చూపితే,మిగతా ముగ్గురిలో ఎవరయినా గెలవవచ్చు.చూపక పోతే సమస్యే లేదు.
నాకు మాత్రం ఎందుకో రాజస్థాన్ వారు దెబ్బ తింటారనిపిస్తోంది.సాధారణంగా బలవంతుడంటే ఒక రకమయిన వ్యతిరేక భావం వుంతుంది.అందుకేనేమో!కానీ,ఈ ఐ.పి.ఎల్ కప్పు నిజంగా గెలిచే అర్హత మాత్రం వార్న్ కే వుంది.
ఈ పోటీల వల్ల సెలెక్టొర్ల పని కఠినం అయింది.కొత్త ఆటగాళ్ళను విడవలేరు.పాత వారిని వదలలేరు.అయితే,సచిన్ తప్ప మిగతా పాత వారిని ఎలాగో వదిలేశారు.సమస్య అల్ల కొత్త వారిలో ఎవరిని వదలాలన్నది.యూసుఫ్ పఠాన్,అస్నోద్కర్,నాయర్,ధవన్,మిశ్రా,గోస్వామి ఇలా కొత్త కొత్త వారంత మేమున్నాం అంటూ వచ్చేసారు.ఎవరిని వదలాలి?ఎవరిని మరవాలి?
ఇక ద్రావిడ్,సచిన్,గంగూలీ,లక్ష్మణ్ ల జట్టులు ఓడటంలో వాళ్ళ బాధ్యత పెద్దగా లేదనవచ్చు.ఇది 20-20 ఆట.కొట్టు,పట్టు.అంతే!కానీ,ఈ ఆట యువకులదే అన్నది చేదు నిజం.వీళ్ళు ఆడలేరని కాదు కానీ,అదే పనిగా ప్రతి బంతినీ బాదటం వీరికి అలవాటులేదు.20-20లో పెరుగుతున్న యువకులు ఇకపై పుడుతూనే బాదుతూ పుడతారు.వాళ్ళతో 5 రోజుల ఆట ఆడించినప్పుడు అసలు ప్రతిభలు తెలుస్తాయి.అప్ప్టి వరకూ అబంతికో హీరో పుడుతూనే వుంటాడు.ద్రావిడ్,సచిన్,గంగూలీ లు ముసలివారిలానే అనిపిస్తారు. 

May 28, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

ఆరేముందు వెలుగుతున్న దీపాలు-రైడెర్లూ,చాలెంజెర్లూ!

ఐ.పి.ఎల్ నెమ్మది నెమ్మదిగా చివరి దశ వైపు పాకుతోంది.ఆటలు ఊహించిన ఫలితాలతో కొత్తదనాన్ని,ఉత్సాహాన్ని,ఉద్విగ్నతనూ కోల్పోతున్నాయి.ఇప్పుడు ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రతిభలూ,నైపుణ్య ప్రదర్శనల పైన ఆసక్తి మిగిలి వున్నాయి.ఎందుకంటే,నెమ్మదిగా ముంబాయి దేవుడు కూడా మనిషేనని అర్ధమవుతోంది.సచిన్ ఆడటం మొదలుపెట్టిన ఆవేశం తగ్గి ముంబాయి ఆట మామూలు స్థాయికి వస్తోంది.ఇంకా జయసూర్యకు మత్తు దిగనట్టువుంది.కానీ మిగతావారు  భూమి మీదకు వచ్చేశారు.సచిన్ కూడా వయసు ప్రభావం గ్రహించినట్టున్నాడు.తనకన్నా ఎక్కువ వయసున్న జయసూర్య ధన ధనా కొడుతూంటే,చూసి ఆనందిస్తూ ఆటకు వయసుకూ సంబంధం లేదని ఆనందిస్తూన్నట్టున్నాడు.రాబోయే రెండు ఆటల్లో జయసూర్యకు దీటుగా సచిన్ ఆడకపోతే,దేవుడు కూడా ముంబాయిని సెమి ఫైనల్ కు పంపలేడు.
రాజస్థాన్ రాయల్స్ ఎదురులేని రాచరిక తేజాన్ని ప్రదర్శిస్తూన్నారు.అయితే ఇకనుంచీ ఒక్క ఆటలో చిన్న పొరపాటు జరిగినా ఇంతకాలం చూపిన ప్రతిభ వ్యర్ధమవుతుంది.అయితే,వున్న జట్లలో సంపూర్ణమయిన జట్టుగా ఎదిగింది రాజస్థాన్ రాయల్సే.
డెల్లి దయ్యాలను దురదృష్టం వెంటాడుతోంది.ఎప్పుడొస్తుందో తెలియని వర్షంలాంటి ఆటగాడు సెహ్వాగ్ నేతగా ఆడే ఈ జట్టు పరిస్థితి కూడా వచ్చీ రాని వానలా వుంది.చెన్నయ్ జట్టు గెలుపు ఓటమి పైన వీరు ముందుకు పోవటం ఆధార పడివుంది.
పంజాబ్ జట్టు,రాజస్థాన్ తరువాత బాగా ఆడుతున్న జట్టు.మిగిలిన ఆటలలో యువరాజ్ పెద్ద స్కోరు బాకీ వున్నడు.అదే జరిగితే ఈ జట్టు ఆనందిస్తుంది.కలకత్త తో జరిగిన ఆట వీరికి ఒక హెచ్చరిక లాంటిది.
చెన్నయ్ జట్టు పట్ల వ్యక్తిగతంగా వ్యతిరేకత లేక పోయినా,ధోనీ ఒక వ్యాపార ప్రకటనలో యూ,ఫాస్ట్ బౌలర్ రాస్కాల్స్ అనటంతో అతని పట్ల విముఖత కలిగింది.కాబట్టి ఏ ఫాస్ట్ బౌలర్ రాస్కలో చెన్నయ్ జట్టును మట్టి కరిపిస్తే చూసి ఆనందించాలని వుంది.
దక్కన్ చార్జెర్లు పాపం మంచి జట్టు వుండి కూడా మంచి ఆట చూపలేక పోయారు.అందరికీ రెండు పాయింట్లిచ్చే దయా దాక్షిణ్యాలుకల జట్టుగా మంచి పేరు మాత్రం సంపాదించారు.
కలకత్త రైడర్లు కూడా మంచి జట్టు అయివుండీ దెబ్బ తిన్నారు.ఆరిపోయే దీపం వెలిగినట్టు చివరి ఆటలో గంగూలీ బాగా ఆడాదు.ఇదే పట్టుదల మొదటి నుంచీ చూపితే బాగుండేది.
పోటీలు అయిపోతూంటే ఆట తీరు అర్ధమయింది బెంగళూరు చాలెంజెర్లకు.ద్రావిడ్ వ్యక్తిగతంగా ఉత్తమ ఆట ప్రదర్శిస్తున్నా,నాయకుడిగా విఫలమయ్యాడు.భారత జట్టు నాయకత్వం నుంచి తప్పుకోవటం మంచి నిర్ణయం అని రుజువయింది.ఆరంభమ్నుంచీ ఏడుస్తూ వస్తున్న ఈ జట్టుకు చివర్లో మంచి యువ ఆటగాళ్ళు దొరికారు.ఇతర జట్లలో యువకులు వచ్చిన అవకాశాలు వాడుకుంటూంటే ఈ జట్టులో అందరూ అన్ని బాధ్యతలూ ద్రావిడ్ పై నెట్టి ఊరుకున్నారు.ఇప్పుడు వారికి తాము చేజార్చుకున్న అవకాశాలు అర్ధమయ్యాయి.దాంతో చివరలో నయిన విజృంభిస్తున్నారు.ఈ గెలిచే అలవాటును వొచ్చే సంవత్సరం కొనసాగించాలి.
ఐ.పి.ఎల్ పోటీలవల్ల యువకులకు మంచి అవకాశాలు దొరికాయి.పాత హీరోలు అలసిపోయారని ఇప్పుడు కొత్త హీరోలు ముందుకు వచ్చారు.రోహిత్,అస్నోద్కర్,గోని,యూసుఫ్,గోస్వామి వంటి వారికి మంచి ఎక్స్పోజర్ లభించింది.
ఐ.పి.ఎల్ వల్ల కలిగిన మరో లాభమేమిటంటే,ఎండాకాలంలో పిల్లలను ఎలా ఆడించాలన్న బాధ తప్పింది.పొద్దుతినుంచి రాత్రి జరిగే ఆట చర్చ,అంతకు ముందు జరిగిన ఆట చర్చ.ఎండాకాలం గడిచిపోయింది.సినిమాలు,షికార్లూ అన్నితి బాధలు తప్పాయి.జూన్ లో స్కూళ్ళు తెరుస్తారు.అయిపోయాయి,సెలవులు.అందుకే అంటారు,ప్రతిదానివల్ల ఏవో లాభాలుంతాయని.
 

May 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్