Archive for the ‘పుస్తక పరిచయము’ Category

చిత్ర మాస పత్రికలో శ్రీకృష్ణదేవరాయలు సమీక్ష.

ఆగస్ట్ నెల చిత్ర మాస పత్రికలో శ్రీకృష్ణదేవరాయలు పుస్తక సమీక్ష ప్రచురితమయింది. రాసినది శ్రీవల్లీ రాధిక. శ్రీవల్లీ రాధిక సాధారణంగా పుస్తక సమీక్షలు రాయరు. అందుకే ఈ రివ్యూ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పైగా, నా పుస్తకాల గురించి సృజనాత్మక రచయితలు తమ అభిప్రాయాలను వ్యక్త పరచటం అత్యంత ఆనందకరమయిన విషయం.

July 29, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

మూడు పుస్తకాల సమీక్షలు.

ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమయిన సమీక్షలు ఇవి.

 

June 6, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము

నిజామాబాద్ సభ విశేషాలు.

నిజామాబాద్ సభ అత్యంత సంతృప్తిని కలిగించింది, ఆనందానుభూతిని  మిగిల్చింది.

సభ రైల్వే స్టేషన్ ఎదురుగా వున్న గీతాభవన్ లో. అక్కడ లైబ్రేరియన్ మేడిచర్ల ప్రభాకర రావు గారు పరిచయమయ్యారు. ఆయన దాదాపుగా 15 పద్య కావ్యాల పుస్తకాలు ప్రచురించారు. వాటిని చూపారు. వారితో మాట్లాడుతూ, సమయం చిక్కినప్పుడల్లా ఆ పద్యాలను చదువుతూ కూచున్నాను.

సభ ఆరంభమవుతోంది రమ్మని సభను ఏర్పాటు చేసిన కిరణ్ కుమార్ పిలిచారు. ఈయనను నేను దాదాపుగా అయిదారేళ్ళ క్రితం కేవలం 10 నిముషాలు కలిశాను. ఆయన నా నవల అసిధార చదివి నన్ను కలవటానికి నిజామాబాద్ నుంచి వచ్చాడు. అప్పుడొక 10 నిముషాలు మాట్లాడుకున్నాం. అప్పటి నుంచీ అప్పుడప్పుడూ ఫోను చేస్తూంటాడు. ఆంధ్రభూమిలో శ్రీకృష్ణదేవరాయలు సీరియల్ చదివి ఫోను చేస్తే త్వరలో అది పుస్తకం రూపంలో వస్తోందని చెప్పాను. అయితే నిజామాబాద్ లో సభ చేస్తానన్నాడు. అన్నట్టే సభను ఏర్పాటు చేశాడు.

సభ ఆరంభమవుతూంటే నేను అతడిని, అయాచితం నటేశ్వర శర్మ గారు రాలేదా అని అడిగాను. అదిగో అంటూ ఆయనను చూపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాము. నా రచనలు చదువుతూంటానని ఆయన చెప్పారు. కలసిన అయిదు నిముషాలలో ఆత్మీయులుగా మాట్లాడుకున్నాము. సాహిత్య మాఫియా ముఠాలు, సాహిత్య అంటరానితనం విషయాలలో మాకు చాలా మటుకు అభిప్రాయాలు కుదిరాయి.

ఇంతలో సభ ఆరంభమయింది. అందరినీ స్టేజి మీదకు పిలిచారు. అప్పుడు డాక్టర్ త్రివేణి గారిని చూశాను. అయితే, నా దృష్టి సభలో స్టేజీ క్రింద వున్న వారి పైనే వుంది. ఎందుకంటే స్టేజీపైన ఏడుగురుంటే స్టేజీ క్రింద ఆరుగురున్నారు. దానిలో ఒకామె అందరినీ స్టేజి పైకి ఆహ్వానించినామె. ఇదారు ప్రెస్ రిపోర్టర్లు!

నాకు చాలా నిరాశగా అనిపించింది. సభకు ముందే ఒకాయన అక్కడి రాజకీయాలగురించి చెప్పాడు. ఒక వర్గం వారు సభ చేస్తే మరో వర్గం వారు దాన్ని విజయవంతం కాకుండా చూస్తారని. కానీ, నాకెందుకో నిరాశగా అనిపించింది. ఎప్పుడు సాహిత్య ప్రపంచాన్ని ఈ వ్యక్తిగత రాజకీయాల జాడ్యాలు వదులుతాయో అనుకున్నాను.

ఇంతలో అధ్యక్షురాలు డాక్టర్ త్రివేణి గారు మాట్లాడటం ఆరంభించారు. అంతే నా నిరాశ క్షణంలో మాయమయిపోయింది. ఆమె నవలలోని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని చదవటమే కాదు, దాన్లో నేను చేసిన ప్రయోగాలను, చూపిన చమత్కారాలను అర్ధంచేసుకొని అనుభవించి వాటిని వివరిస్తోంది. నా మనసు ఆనందంతో విహంగమయి వినువీధిన విహరించసాగింది. ఎందుకంటే ఇంతకాలం నేను చేసిన రచనలను ఇంత లోతుగా అర్ధంచేసుకుని అనుభవించి వ్యక్త పరచే విమర్శకుడిని నేను కలవలేదు.

నేను నా ప్రతి రచనలో అనేక రకాల ప్రయోగాలు, చమత్కారాలు చేస్తూంటాను. అనేక విషయాలను పొందుపరస్తూంటాను. కానీ, మన పత్రికలలో సమీక్షల పరిథి కొద్ది లైన్లు మాత్రమే. సాహిత్య పేజీలలో విశ్లేషణలు కొద్ది మందికి మాత్రమే. అలాంటి పరిస్థితులలో నా రచనలలోని సొంపులను, సొబగులను, లక్ష్యాలను, లావణ్యాలను పాఠకులకు నేనే వివరించాల్సి వస్తుందని చాలా బాధ పడుతూన్నాను.

ఒక ఎడిటర్ ని కలసి రాజతరంగిణి కథలలో నేను చేసిన చమత్కారాలు, పొందుపరచిన అంశాలు, ప్రతీకలు వాటి నిగూఢార్ధాలు వివరిస్తూ నేను ఒక వ్యాసం రాసేందుకు అనుమతి అడిగాను. నేను చెప్పింది విని ఆయన నన్ను మెచ్చుకున్నాడు. ఈకాలంలో ఇలాంటి రచనలు చేయగలవాడు మరొకడులేడని పొగిడాడు. విమర్శకులంతా ఏదో పుస్తకం చదివి ముందుమాట ఆధారంగా నాలుగు ముక్కలు రాయగలిగేవారే తప్ప ఎవ్వరికీ విమర్శ అంటే ఏమిటో తెలియదని అన్నాడు. కానీ, నాకు కనుక నా కథల గురించి నేను రాసుకునే అవకాశాన్నిస్తే, గద్దల్లాంటి రచయితలంతా తమ కవితలు, కథలు, నవలలగురించి తాము రాసుకుంటామని చంపేస్తారని అన్నాడు. అందుకే, నా బాధ అర్ధమవుతూన్నా, నాపైన  సానుభూతి వున్నా, నా కోరిక సమంజసమయినదే అయినా, సారీ అన్నాడు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పత్రికలో అనేక కథకుల రచయితల కథలగురించి, రచనల గురించి ఘూకం కేక బేకం బాకాలు మోగుతూనేవున్నాయన్నది వేరే సంగతి. వారి పరిమితులను, బలహీనతలను నేను అర్ధం చేసుకోగలను. నాతో వుంటే, తనని కూడా హిందూ చాందసవాది అనుకుంటారని , మెయిన్ స్ట్రీం జర్నలిస్టులంతా దూరం పెడతారని నా పదేళ్ళ స్నేహితుడు నాతో మాట్లాడటమే మానేశాడు. అంత శక్తిమంతం మన సాహిత్య మాఫియా ముఠాల సాహిత్య అంటరానితనం.

అందుకే డాక్టర్ త్రివేణి గారు నా రచన గురించి వ్శదంగా, విపులంగా, లోతుగా విశ్లేశిస్తూంటే నేను పొంగిపోయాను. కల నిజమయినంతగా ఆనందపడ్డాను. ఇలాంటి ఒక్క విమర్శ వినేందుకు ఎన్ని అవమానాలయినా, వివక్షతలయినా అనుభవించవచ్చానిపించింది. ఆవిడని నేను చూడటం అదే ప్రధమం. మాకు పరిచయం కూడా కాలేదు. మేము ఒక్క మాటా మాట్లాడుకోలేదు. కానీ నా రచన ద్వారా ఆమె నా హృదయాన్ని తెరచిన పుస్తకంలా గ్రహించేసింది. నా రచనల నేపథ్యాన్ని, లక్ష్యాన్ని వివరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను సృజిచిన శ్రీకృష్ణదేవరాయల ద్వారా రచయితగా నన్ను సంపూర్ణంగా అర్ధంచేసుకుంది.

సభలో సంఖ్యల్;ఏరన్న నిరాశ మాయమయింది. నిజానికి ఆవిడ నాతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.

అయాచితం నటేశ్వర శర్మ గారు ఈ రచనను ఒక వచన కావ్యం అన్నారు. ధన్యుడను. ఆయన నా పదప్రయోగాల గురించి చెప్పారు. ఇదొక వచనకవిత్వమని నిరూపించారు. వచన కవిత్వంగా చలామణీ అవుతున్నదానిలో కనబడని రసం ఇందులో కనబడుతుందని అన్నారు.

పడాల రామారావు గారు మాట్లాడుతూ రచనలో నా చమత్కారాలను ఉదాహరించారు. పదాలను విరిచి, మార్చి నేను సృజించిన దృష్యాలను ఆయన ఎత్తి చూపించారు. ఇదొక వచన కావ్యమని నిర్ధారించారు.

ఇంతలో సభ నిండింది. కానీ, అప్పటికే నా కడుపు, హృదయం నిండిపోయాయి.

నేను శ్రీకృష్ణదేవరాయల రచన చేసిన విధానాన్ని నాపై పరిమితులను అధిగమించిన వైనాన్ని వివరించాను. నా రచనను ఇంత లోతుగా చదివి అర్ధం చేసుకున్న వారికి జోహార్లర్పించాను. చారిత్రిక నవలల ప్రయోజనం సమకాలిక ప్రపంచానికి అవి ఇవ్వగల సందేశాలను వివరించాను.

ముఖ్యంగా, రాయలను మోసం చేసిన తురకవాడికి ఆదిల్షా ఆశ్రయమిచ్చి, అలాంటివాడులేడని బుకాయిస్తే రాయలు తురకల సామ్రాజ్యాలపై దాడిచేసి వారికి గుణపాఠాన్ని నేర్పిన వైనాన్ని ప్రస్తుతం మనం దావూద్ ఇబ్రహీం, ముంబాయి దాడుల సమయంలో మన నేతల ప్రవర్తనతో పోల్చి చూపాను. అంతేకాదు, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోనివారు ఆ తప్పిదాలను మళ్ళీచేస్తారు కాబట్టి వారికి ఆ తప్పిదాలను గుర్తుచేయాల్సిన బాధ్యత సృజనాత్మక కళాకారులది, మేధావులదీ అని చెప్పాను. మన మేథావులు ఆ పని చేయటంలేదు. పైగా మన ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తున్నారు. కాబట్టి సృజనాత్మక రచయితగా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నానై, నన్ను ఎంతగా విస్మరించాలని సాహిత్య పెద్దలు ప్రయత్నిస్తూన్నా విస్మరించేవీలివ్వటంలేదనీ చెప్పాను. పత్రికలు కొన్ని నా పుస్తకాల సమీక్షలు ఇవ్వకపోయినా, పుస్తకాల దుకాణాలు నా పుస్తకాలు అమ్మకపోయినా, ఇప్పుడు పాఠకులే ముందుకు వచ్చి సభలు చేస్తున్నారని, ఆ రకంగా పాఠకులను నేను చేరుకోగలుగుతున్నానేఎ చెప్పాను. ఈ సందర్భంలో ఒక రాజతరంఘిని కథ, మూలంలో ఏలావుంది, దాన్ని నేను ఆధునిక సమాజానికి ఎలా అన్వయిస్తూ కథను సృజించానో చెప్పాను. సబ్భలో వున్నవారిపైన దాని ప్రభావం చూసిన తరువాత నాకొక నమ్మకం కలిగింది. ఎవరెంత ప్రయత్నించినా, నా రచనలు పాఠకులను చేరితేచాలి, అవి వారి హృదయాలలో నిలుస్తాయి. సభ అయిన తరువాత ఒకాయన వచ్చి, నేను రాసిన మర్మయోగం చదివినప్పటినుంచీ నన్ను కలవాలనుకుంటున్నానని చెప్పాడు. మరొకాయన అసిధార, భారతీయ వ్యక్తిత్వ వికాసం గురించి అడిగాడు. ఇంకొకాయన రియల్ స్టోరీలగురించి పొగిడాడు. నాకు ఎంతగా ఆనందంగా అనిపించిందంటే నేను ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు, 14500 అడుగులవద్ద మంచు తుఫానులో ఇరుక్కుని, రాత్రంతా వణుకుతూ తల్లారి చూస్తానో లేదనుకుంటూ గడిపినతరువాత ఉదయం 330-4 గంటల నడుమ ఆకాశంలో సూర్యునివెలుగురేక కనిపించి, క్షణంలో కొండల శిఖరాలన్నీ బంగారురంగులోకి మారినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ సభ పూర్తయ్యేసరికి అంత ఆనందం కలిగింది.

సభలో ఒకాయన మొదటినుంచీ మూలన కూచుని శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం చదువుతున్నాడు. సభ అయిన తరువాత ఆయన నా దగ్గరకు వచ్చు చేయికలిపి ఈతరానికి తగ్గ రచన ఇది. ఇంతకన్నా ఎక్కువయితే వారు చదవరు. ఇంతలోనే నాయకత్వ లక్షణాలు, ధార్మికత, ఆధ్యాత్మికత,నైతికవిలువలు, మన ధర్మం. వంటి అన్ని విషయాలు చెప్పారు అని కౌగలించుకున్నాడు. ఆయన తన విద్యార్ధులకు ఇచ్చేందుకు 35 కాపీలు కొన్నాడు. ఇది పాఠ్యపుస్తకాలతో పాటూ చదివిస్తాను. అన్నాడు.

ఆనందం, సంతోశం, సంతృప్తి అన్న పదాలు సరిపోవటంలేదు.

మరుసటి రోజు, అంటే ఇవ్వాళ్ళ నేను అక్కడి విధ్యార్ధినీ విధ్యార్ధులతో ఎంత ఆనందంగా ముచ్చటించానంటే, వారూ నన్ను అభిమానించారు. నా ఆ ఆనందం ఇంకా తగ్గలేదు.

నేను క్లాసయిన తరువాత వచ్చేస్తుంటే, నా క్లాసు విన్న ఒక అధ్యాపకుడు బస్సుఎక్కిస్తూ అన్నాడు,  అసిధార కొన్ని కాపీలు కావాలని. నేను కాపీలయిపోయాయి. మళ్ళీ ప్రింటు చేయాలి, కానీ, కొత్త పుస్తకాలు ప్రింటు చేయాల్సినవి బోలెడుండగా, పాతవాటినే ప్రింటు చేయటము అమ్ముడవుతాయో లేదో ఎదురుచూడటం మూర్ఖత్వమని ఆగానని చెప్పాను. దానికాయన నా చేతిలో చేయివేసి చెప్పాడు, ఎంతవుతుందో చెప్పండి, ఇక్కడి ఉపాధ్యాయులమంతా చందాలు వేసుకుని రిప్రింటు ఖర్చు భరిస్తామన్నాడు.

my cup is full. i have no more to say…only a lot to write

May 15, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము

దాశరథి సినిమా పాటలు- పరిచయం.

ఆ కాలంలో కవులు  సినిమా పాటలు రాసేవారు. ఆ కాలంలో కవులంటే ప్రాచీన సాహిత్యంపైన పట్టువున్నవారు. భాష పై పట్టువున్నవారు. ఆధునిక ప్రపంచంతో అడుగులో అడుగు కలిపి నడిచేవారు. దాంతో వారికి భావ గాంభీర్యం వుండటమే కాదు, తమ భావాలను వ్యక్తంచేసే భాషా సౌలభ్యం కూడా వుండేది. అది వారు రాసిన పాటలలో ప్రస్ఫుటంగా కనిపించేది. అందుకే వారు ఆనాడు రాసిన పాటలు ఈనాడు కూడా శ్రోతల గుండెలలో మారుమ్రోగుతున్నాయి. నవతరం వారిని కూడా అలరిస్తున్నాయి. తరాలతో సంబంధంలేకుండా మానవ మనసూలోపల వుండే సున్నితమయిన భావాలను స్పందింపచేస్తున్నాయి. అందుకే ఈనాటికీ ఆ పాటలు వసివాడలేదు. అలాంటి అసలు సిసలయిన సినీ కవుల కాలంలో దిగ్గజం లాంటివాడు దాశరథి. దాశరథి రచించిన కొన్ని పాటల సంకలనం ఈ పుస్తకం. దీని సంకలన కర్త కే. ప్రభాకర్.

ఇందులో మొత్తం 124 పాటలున్నాయి. నా కంటి పాపలో నిలిచిపోరా తో మొదలయి నీ రూపమే…నామదిలోన తొలిదీపమై తో పూర్తవుతుందీ సంకలనం.

ఇందులోని పాటలు చదువుతూంటే వెంటనే పాటలు పాడుకోకుండా వుండలేము. ఆ పాటలు వినకుండా వుండలేము. అయితే ఈ సంకలనం వల్ల గొప్ప లాభం ఏమిటంటే మన దృష్టిని పాటలలో సాహిత్యం వైపు మళ్ళిస్తుందీ సంకలనం.

ఈ నాటి పున్నమి, ఏనాటి పున్నెమో… అని చదవగానే ఒక్క క్ష్ణం ఒక అవ్యక్తమయిన ఆనంద భావన మెరుపులా మెరుస్తుంది. ఇక్కడ మనల్ని భావం మురిపిస్తుందా, దాన్ని వ్యక్త పరచిన తీరు అలరిస్తుందో చెప్పలేము.

ఖుషీ ఖుషీ గా నవ్వుతూ పాటలో … చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసి పోదమా హాయిగా… అన్న పదాలు చదవగానే ఒక హాయి భావన చల్లని గాలి తరగలా తాకుతుంది. ఎక్కడినించి వచ్చిందీ సౌఖ్య భావన?

ఇక గోదారీ గట్టుందీ పాటలో పిట్టమనసూ పిసరంతయినా పెపంచమంతా దాగుందీ, అంతుదొరకని నిండుగుండెలో ఎంత తోడితే అంతుందీ… అన్న పాదాల గురించి, భావం గురించీ ఎంత రాస్తే అంత వస్తుంది. ఎంత ఆలోచిస్తే అంత బొధపడుతుంది.

ఒహో గులాబి బాల పాటలోనయితే పదాలతో ఆడటం కనిపిస్తుంది. రూపం చూసీ వస్తారు, చూపుల గాలం వేస్తారు, రేకుల చిదిమీ, సొగసులు నులిమీ, చివరకు ద్రోహం చేస్తారు… ఎంత అలతి అలతి పదాలలో ఎలాంటి సార్వజనీన సత్యాన్ని ఎంత సుందరంగా ఇమిడ్చారో కవి.

మంటలు రేపే నెల రాజా పాటయితే నిరాశా నిస్పృహలకు అంతులేని పాతాళంలాంటిది. కానీ ఈ పాట ఎంత పాడుకుంటే అంత సాంత్వననిస్తుంది. ఆకాశానికీ అంతుంది, నా ఆవేదనకూ అంతేదీ… మదిలో శాంతీ లేనపుడూ ఈ మనిషినీ దేవుడూ చేశాడూ…. వహ్.. వహ్

రారా కృష్ణయ్యా అయితే అత్యద్భుతమయిన పాట. నిజమైనా కల అయినా నిరాశలో ఒకటేలే, ఈ వేళ నాలో ఎందుకో ఆశలు, గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో, ఇంతేనయ తెలుసుకోవయ, ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే, మనసే కోవెలగా మమతలు మల్లెలుగా, ఈ చల్లని లోగిలిలో, ఈ బంగరు కోవెలలో,  అందాల జలపాతం చిందించు జల్లులలో, సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనె చూసానులే, ఇలా వొక దాన్ని మించిన పాట మరొకటి. అతద్భుతమయిన సాహిత్యం, అతి సుందరమయిన భావంతో చదువుతూ పాటలు పాడుకొంటూ, పాటలు వింటూ మరో లోకాలకు వెళ్ళిపోతం.
దాశరథి వీణ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ నా కళ్ళు, మనసు, బుద్ధి, హృదయం ఒక పాట దగ్గర ఆగిపోయాయి. ముందుకు కదలనని మొరాయించాయి.

ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే…. ఏమి పాట! ఏమి భావం! ఏమి పదాలు!

నిదురమబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే,
బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్య కన్య్వై రావే…….

అసలు ఎలాంటి సృజన శీలురు వారు! ఎంత సుందరమయిన భావం! ఎంత మృదువయిన పదాలు! ఇలాంటి భావాలను ఇంత సుందరంగా వ్యక్త పరచగలిగే కవులేరీనాడు? అలా వ్యక్త పరచినా విని ఆనందించే శ్రోతలేరీ?

శ్రోతలున్నారు. అందుకే నవ తరం కూడా ఈ పాటలకు భావాలకు స్పందిస్తోంది. కానీ ఇదే మీకు నచ్చుతుందని వారి పైన బలవంతంగా రుద్దుతున్న వెర్రి మొర్రి భావాలు, వాటికనుగుణంగా రాసే కపులూ…………

ఈ పుస్తకం మనల్ని ప్రస్తుతం నుంచి మన మనసులోతుల్లో అణగివున్న సున్నిత భావనల ప్రపంచంలోకి తీసుకు వెళ్తుంది.

ఈ పుస్తకంలో ఒక పొరపాటుంది.  ఎంటీరామారావు ఆరాధన సినిమాలోని నీకేలా ఇంత నిరాశా పాటను  నాగేశ్వరరావు ఆరాధనగా పొరబడ్డారు సంకలన కర్త.

ఈ పుస్తకం దొరకు చోటు
2ఎల్, 3 ఫేస్, కే పీ హెచ్ బీ కాలనీ, హైదెరాబాద్-72.
ఫోను- 9440136665.
వెల- రూ.100/-

May 5, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము

చిత్ర లో భారతీయ వ్యక్తిత్వవికాసం సమీక్ష.

మే నెల చిత్ర మాస పత్రికలో భారతీయ వ్యక్తిత్వ వికాసం ఉస్తకం పైన వచ్చిన సమీక్ష ఇది.

May 3, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము

శ్రీకృష్ణదేవరాయలు- పుస్తకావిష్కరణ సభ విశేషాలు.

నిన్న హుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు పుస్తకావిష్కరణ సభ జరిగింది. సభకు దాదాపుగా 400 మంది హాజరయ్యారు.

ఒకరకంఘా చెప్పాలంటే గుంటూరు ప్రజలు చాలా అదృష్టవంతులు. వారికి బృందావన్ గార్డెన్స్ అని వేంకటేశ్వరాలయం వుంది. ఆ ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కళాక్షేత్రం అని వుంది. ఈ కళాక్షేత్రంలో రోజూ ఏదో ఒక స్భ జరుగుతుంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య ప్రాధనా అంశాలుగా సభలు జరుగుతాయి. సంవత్సరంలో 365 రోజులూ ఏదో ఒక సత్కాలక్షేపం వుంటుంది. అందుకే, సాయంత్రం అయిందంటే అధిక సంఖ్యలో గుడికి వస్తారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న సభలో పాల్గొంటారు.

అలాంటి ఒక సాయంత్రంలో ఒక గంటన్నర పుస్తకావిష్కరణకు కేటాయించారు. మా కార్యక్రమం తరువాత కూచిపూడి నృత్య రూపకం వుంది.

సభ సమయానికి ప్రారంభమయింది. పులిచెర్ల సాంబశివరావు గారు సభకు అధ్యక్షత వహించారు.

అధ్యక్షోపన్యాసంలో ఆయన చారిత్రిక నవలలు ఇప్పుడు రావటంలేదని, అందుకే చారిత్రిక నవలలు రచించటం ఎంత సాహసమో దాన్ని ప్రచురించటమూ అంతే సాహసం పత్రికలకి అన్నారు. అందులో శివాజీ, కృష్ణదేవరాయలు, రాణాప్రతాప్ లాంటివారి జీవిత కథలు రాస్తే పత్రికలు వేయటం అరుదని అన్నారు. ఈ రచనను ప్రచురించినందుకు ఆంధ్రభూమి వారపత్రిక సంపాదక వర్గాన్ని ఆయన అభినందించారు. శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వంలో చరిత్రకారులు చూపన్ కోణాన్ని ఈ రచన ఆవిష్కరించిందని అన్నారు.

పుస్తకాన్ని సూర్యదేవ రవికుమార్ గారు విపులంగా సమీక్షించారు. ఇంతకన్నా గొప్పగా చారిత్రిక నవల రాయటం సాధ్యం కాదని అన్నారు. పాతకాలం నాటి గొప్ప రచయితల స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక పాథకుడికి అత్యంత సులభంగా అర్ధమయ్యే రీతిలో రచన సాగిందన్నారు. అంతేకాదు, రాయల వైభవం, ధర్మ దీక్ష, ఆధ్యాత్మికతలు ఎదకు హత్తుకు పోతాయని అన్నారు.

పులుచెర్ల సాంభశివరావు గారు, నన్ను మాత్లాడమని ఆహ్వానిస్తూ, ఈ నవల చదివిన తరువాత మరో సారి హంపికి వెళ్ళలనిపిస్తున్నదని అన్నారు.

నేను నా ఉపన్యాసంలో చరిత్ర రచనకు, చారిత్రిక నవలా రచనకూ వున్న తేడాను వివరించాను, ఒక శాసనం చూసి దాన్లో వున్న అంశాల ఆధారంగా చరిత్రకారులు చరిత్రను నిర్ణయిస్తారు. కానీ, నవలా రచయిత ఆ శాసనం వెనుక వున్నదాన్ని మనసుతో చూసి, ఆ శాసననికి కారణమయిన వ్యక్తుల అంతరంగాలలోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తాడు. ఒకగుడి రాజు కట్టిస్తే, ఆ గుడి కట్టటం వెనుక వున్న సామాజిక, చారిత్రిక, మానసిక, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆ సంఘటనను నటకీయంగా, ఆసక్తికరంగా సృజిస్తాడు రచయిత.

మన దేశ చరిత్రలో మనకు తెలియకుండానే ఒక వైచిత్రి ప్రవేశించింది. అదేమిటంటే, మన రాజులు ఎంత గొప్పవాళ్ళయినా మన చరిత్రకారులు వాళ్ళ లోపలకే ప్రాధాన్యం ఇస్తారు. అదే, మహమ్మదీయ రాజులు ఎంత క్రూరులు, కిరాతకులూ అయినా, వారి ప్రేమలకే ప్రాధాన్యం ఇస్తారు. అక్బర్ సలీం అనార్కలి, తాజ్ మహల్, రోషనార ఇలా ఒకో రాజు పేరు చెప్తే వారి ప్రేమ గాథలే గుర్తుకువస్తాయి. అదే మన రాజుల పేర్లు చెప్తే, విక్రమాదిత్యుడు అనగానే, వున్నాడో లేదో తెలియదు అంటారు. భోజుడు, అనగానే వున్నట్టేవున్నాడు అంటారు. శివాజీ అనగానే చిట్టెలుక అంటారు. కృష్ణదేవరాయలు అనగానే, క్రూరుడు, కోపిష్టి, అప్పాజీ కళ్ళు పీకించాడు అంటారు. చరిత్ర రచనలోని ఈ వైచిత్రిని ఖండిస్తూ, తొలితరం రచయితలు చారిత్రిక నవలలు రచించారు. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసిమ్హ శాస్త్రి, అడవి బాపిరాజు వంటివారు ఒక ఉద్యమంలా నవల రచనచేస్తూ మనవారి ఔన్నత్యాన్ని వివరించాలని ప్రయత్నించారు. కానీ, అనేక కారణల వల్ల అలాంటి రచనలు దాదాపుగా అదృశ్యమయ్యాయి. ఇప్పుడు నాకు అవకాశం రాగానే నేను వారి అడుగుజాడలలో నడుస్తూ, నా ప్రత్యేక శైలిని జోడించి, నా ఆలోచనలు, నమ్మకాలకు, చారిత్రిక ఆధారాలను జోడిస్తూ రచన చేశానని చెప్పాను.

భారతీయ ధర్మ రక్షణ పోరాటం ప్రపంచంలోనే అద్వితెయమయినదని, విదేశీ మూకల అకృత్యాలను తట్టుకుని, సామాజిక పరిస్థితులకనుగుణంగా ఎలా మన ధర్మం కొత్త కొత్త పోకడలు పోయిందో వివరించాను. రచన చదివి నిర్మొహమాటంగా అభిప్రాయాన్ని తెలపాలని కోరాను.

శ్రీ బొల్లేపల్లి సత్యనారయణగారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆతరువాత గుడిబయట ఒక దుకాణంలో పుస్తకాన్ని అమ్మకానికి పెట్టాము.

సభ చివరలో నాకు సన్మానం చేశారు. సన్మానన్ని స్వీకరిస్తూ నేనొక మాట అన్నాను.

రచయితకు అసలు సన్మానం శాలువా కప్పటం, పొగడటం కాదు, అతని రచనలను చదివి నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పటం, నచ్చితే మరో పదిమందిదో చదివిచటం అన్నాను.

స్టేజి దిగేలోగా కబురొచ్చింది, ఇంకా కాపీలు కావాలంటున్నారని.

నేను బరువు మోయలేక, ఎవరుకొంటారులే, అన్న అలసత్వం వల్ల, 42 కాపీలే తీసుకెళ్ళాను. చొవరికి డిమాండు చూసి, ఆవిష్కరించి స్టేజి మీద వున్న పుస్తకాలను కూడా అమ్మకానికి పెట్టాల్సివచ్చింది. అంతేకాదు, ఇంకా పుస్తకాలు కావాలన్న వారి పేరు అడ్రెసు తీసుకున్నాను. సోమవారం వారికి పుస్తకాలు పంపుతానని వాగ్దానం చేశాను. మొత్తం 40 పుస్తకాలు అమ్ముడయితే, మరో 60 పుస్తకాల ఆర్డరు తీసుకుని వచ్చాను.

ఈ పుస్తకం అమ్మకాలు చూస్తే ఒకతి అనిపించింది. తెలుగు పుస్తకాలకు పాఠకులున్నారు. పుస్తకాలు కొనేవారున్నారు. కానీ, వారికి నచ్చిన ఒక పుస్తకం మార్కెట్ లో వచ్చినట్టు వారికి తెలియటంలేదు. తెలిసినా ఒక పద్ధతి ప్రకారం పుస్తకాలు వారికి  అందనీయటంలేదు. దాంతో పాథకులు దూరమవుతున్నారు.

నిన్న సభ జరుగక పోయివుంటే, ఈ వంద మందికి ఇలాంటి పుస్తకం వుందని తెలిసేది కాదు. తెలిసినా పుస్తకాల దుకాణంలో పుస్తకం దొరికేది కాదు. దాంటో పుస్తకాలెవ్వరూ కొనటంలేదని, చదివే అలవాతు తగ్గిందని మనం తీర్మానించేస్తున్నాం.

మొన్న ఒక రోజు నేను విశాలంధ్రకు వెళ్ళి సౌశీల్య ద్రౌపది పుస్తకం కావాలన్నాను. అక్కడ కుర్రాడు నన్ను వెర్రి వాడిని చూసినట్టు చూసి అదేం పుస్తకం అన్నాడు. అంతేకాదు, అక్కడ కౌంటర్ లో కూచున్నావిడతో సౌశీల్య ద్రౌపదిట అన్నాడు. ఆమెకూడా అదేం పుస్తకం అంది. అక్కడ రాక్ లో యార్లగడ్డ ద్రౌపది, పక్కనే ప్రతిభారాయ్ యాఙ్న సేనిలు వున్నాయి. అదీ కథ.

అప్పుడనిపించిందినాకు, ఇలా పలు ప్రాంతాలలో సభలు జరిగితే కనీసం కొంతమందికయినా అలాంటి ఒక పుస్తకం వుందని తెలుస్తుంది కదా, అని. గుటూరులో నయితే రెడీమేడ్ వేదిక వుంది. మిగతా ప్రాంతాలలో ఇది ఖర్చుతో కూడుకున్న పని.

కొసమెరుపేమిటంటే, పుస్తకాలి ఏ దుకాణంలో పెట్టి అమ్మామో, ఆమెకు పుస్తకానికి అయిదు రూపాయలిస్తానని అన్నాను. పుస్తకాలన్నీ అమ్మి డబ్బులు తీసుకుంటూంటే ఆమె, ఇంకొన్ని పుస్తకాలు తేనందుకు అలిగింది. అంతేకాదు. ఇలాంటి పుస్తకాలు రాసి, తన దగ్గరే అమ్మమంది. ఆమెకు నిన్న చాల లాభం వచ్చిందిట.

ఇవీ పుస్తకావిష్కరణ  సభ విశేఅషాలు. ఫోటోలు రాగానే పోస్టు చేస్తాను.

మీరుకూడా పుస్తకం చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి. పుస్తకం కినిగే లో నయితే ఈ వారాంతం సగం ధరకే దొరుకుతుంది.

May 1, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము