Archive for April, 2008

నేను చదివిన మంచి పుస్తకం-మళ్ళీ నాలుగే!

ఏ రచయిత అయినా తన అనుభవాల ఆధారంగానే కథలను సృజిస్తాడు.ఎంత కల్పన జోడించినా,దానికి ఆధారం మాత్రం నిత్య జీవితంలోని అనుభూతి ఏదో వుంటుంది.అందుకే,తనలోకి చూసుకుంటూ,తన అనుభవాల విశ్లేశణ ద్వారా తనని తాను అర్ధంచేసుకుంటూ చేసే రచనలు చిరకాలం సజీవంగా వుంటాయి.రచయితను చిరంజీవిగా నిలుపుతాయి.అందుకే,ప్రతి రచయిత ఆరంభ కథలు నిజ జీవితంలోని అనుభవాల కాల్పనిక రూపాలే అవుతాయి.రచయితగా ఎదుగుతున్నా కొద్దీ ఆ కాల్పనిక శక్తి ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే నిజానుభవాలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయి.
కాళీపత్ణం గారి ఆరంభ కథలలో ఆయన అంతరంగం కనిపిస్తుంది.ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు,వాటికి ఆయన స్పందన,ఆయనలోని సంఘర్శణలు కథాంశాలుగా కనిపిస్తాయి.అందుకే ఆయన కథలు మధ్యతరగతి వారి జీవన చిత్రణలకు పరిమితమయ్యాయి.1949 నుంచీ ఆయనకు రకరకాల వ్యక్తులతో పరిచయమయింది.అనేక రకాల భావ జాలాలు ఆయన దృష్టికి వచ్చాయి.ఆయన పల్లె వాతావరణం నుంచి పట్టణానికి వచ్చారని,బెరుకు బెరుకుగా రచనలు చేసారని మనకు ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది.అయితే,రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ప్రభావం ఆయన పయిన అధికంగా పడింది.కానీ ఆలోచనలపయిన పడిన ప్రభావం కథల రూపంలో ఆచరణలోనికి వచ్చే సరికి సమయం పట్టింది.అందుకే,1949-55 నడుమ ఆయన కథలు మధ్య తరగతి జీవితాలకు సంబంధించినవే.అంటే,ఆయన అనుభవాలకు ప్రతిరూపాలే.అయితే,ఈ కథలలో అక్కడక్కడా,వామ పక్షాల భావాల ప్రభావం కనిపిస్తుంది.ఇది రచయితగా,రామారావు గారిలో సంధి దశను సూచిస్తుంది.
ఆ కాలంలో చాల మందిలో కనిపించిన ఘర్శణ రామారావు గారిలోనూ కనిపిస్తుంది.సాంప్రదాయం ఉగ్గు పాలతో నేర్చుకున్నారు.ఎదుగుతున్న కొద్దీ,తాము నేర్చుకున్న దానికీ,బయట అనుభవిస్తున్న దానికీ తేడా కనిపిస్తుంది.అగ్రవర్ణానికి చెందిన వాడవటం గర్వకారణం కాక సిగ్గు అయింది.తన సాంప్రదాయాన్ని,వారసత్వాన్ని కాదంటే కానీ సమాజంలో అమోదం దొరకటం కష్టం.దాంతో అనేకులు వ్యక్తి గత అభిప్రాయాలను పక్కన పెట్టి,సంఘం కోసం ఆధునిక అభ్యుదయ భావాలను స్వీకరించారు.సాంప్రదాయానీ,పద్ధతులను చులకన చేసారు.దోషాలను ఎత్తి చూపించి తమ అభివృద్ధి ధోరణిని చాటుకున్నారు.అసలు రహస్యం,నిరవాకాలు,కీర్తికాముడు,పెంపకపు మమకారం,జయప్రద జీవనం,రాగమయి,పలాయితుడు తదితర కథలన్నీ ఈ కోవకు చెందినవే.ఈ కథలు అన్నీ మామూలు కథలు.రామారావు గారి కథలు కాకపొతే పూర్తిగా చదవము.ఈ కథలలో జీవన చిత్రణ వున్నా ఎటువంటి ప్రత్యేకత లేని కథలివి.చిరకాలం గుర్తుంచుకునే అంశం ఒక్కటే కనబడదు.
గతంలోని కథలతో పోలిస్తే,నిడివి విశయంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.అంతకు ముందు,ఒక ఆలోచనను కథగా రాసిన రచయిత నిదానంగా కథను అభివృద్ధి చేయటం,పాత్రలను తీర్చి దిద్దటం కనిపిస్తుంది.అయితే.కథలో ఉద్విగ్నతను సృజించటం కనబడదు.ఒక నది,మైదానంలో మంద్రంగా ప్రవహించినట్టు,నింపాదిగా సాగుతాయి కథలు.రావి శాస్త్రి గారి ప్రభావం రామారావు గారి రచనా శైలి పయిన సులభంగా కనిపిస్తుంది.వ్యక్తుల బలహీనతలను చూసి నవ్వుకోవటం,మంచి తనన్ని బలహీనతగా చూపటం ఈ  కథలలో చూడవచ్చు.
సేనాపతి వీరన్న అనే కథలో రామారావు గారు చేసిన వ్యాఖ్య గమనార్హం
“మనం సాధారణంగా గ్రామాలూ,గ్రామీణులు స్వర్గ ఖండాలు,దేవతలూగా అభివర్ణింపబడటం చూస్తాం”అంటూ పల్లెలు ఏ విషయంలో పట్టణానికి భిన్నంకావని,అన్ని రకాల మోసాలుంటాయని రాస్తారు.చివర్లో”కాకపోతే,అఙానం అమాయకత్వం అనే ముసుగుల్లో మన పెద్దలు వానిని దాచి చూపొతుంటారు”.అంటారు.అంటే రామారావు గారికి తెలుసన్నమాట,పల్లె ప్రజలు అంత అమాయకులు కారని.ఇది మనకు ఆయన తరువాత కథలను విశ్లేశించటంలో వుపయోగ పడుతుంది.
1924-48 నడుమ రామారావుగారు కథలు రాయటం,తన భావాలను కథ రూపంలో ప్రకటించటం కనిపిస్తే,1949-55 నడుమ,రామారావు గారి అభిప్రాయాలు మారటం,ఆయన రచనా శైలి ప్రత్యేకంగా ఏర్పడటం గమనించవచ్చు.అతని రచనా సంవిధానంపయిన రావి శాస్త్రి ప్రభావం చూడవచ్చు.ఇందువల్ల కథల నిడివి పెరగటం,సన్నివేశాలను విపులంగా సృజించటం కనిపిస్తుంది.
ఇప్పుడు మనం రచయితగా రామారావు గారి జీవితంలో అత్యంత ప్రాధాన్యం వహించిన 1956-67 కాలంలో అడుగు పెడతాము.ఈ కాలంలోనే ఆయన యఙం  కథ రచించారు.ఇది వచ్చేసారి.

April 30, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఈ సినిమా చూడండి-Mr.HOLLAND'S OPUS

మంచి సినిమాలు తీయాలని వున్నా మంచి కథలు దొరకటంలేదని మనవారు వాపోతూంటారు.అదే సమయంలో,నాటకీయతను సృష్టించాలని స్క్రిప్ట్ రచయితలను వేధిస్తూంటారు.అనేక గంభీరమయిన సన్నివేశాలను నాటకీయత లేదని తిరస్కరిస్తూంటారు.ఇక,ఏదయినా కథ చెప్పగానే,ఇది ప్రేక్షకులకు పట్టదని పెదవి విరుస్తారు.కనీ,తరచి చూస్తే నిత్య జీవితంలో వున్నంత నాటకీయత,ఉద్విగ్నత,సస్పెన్సులు కల్పనలో కూడా వుండవు.కళ్ళు తెరచి చూస్తే,నిజ జీవితంలో వుండే అద్భుతమయిన డ్రామా,తెరపయిన కృత్రిమంగా సృష్టించిన మెలో డ్రామాలో వుండదు.ఈ నిజాన్ని స్పష్టం చేస్తుంది,రిచర్డ్ డ్రైఫస్ నటించిన ‘మిస్టెర్ హాలండ్స్ ఓపస్ ‘. మమూలు సంఘటనలను కూడా మధురమయిన మెలో డ్రామాలుగ మార్చి,ప్రేక్షకుల హృదయాలను కదిలించగలిగే శక్తివంతమయిన సన్నివేశాలుగా మలచ వచ్చని ఈ సినిమా నిరూపిస్తుంది.
ఈ సినిమాలో నాయకుడు మనలాంటివాడే.ఏవేవో చేయాలంకుంటాడు.తన ప్రతిభ ప్రదర్శన ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందాలనుకుంటాడు.గొప్ప సంగీతకారుడవ్వాలని వుంటుంది అతనికి.కానీ,తాత్కాలికంగా,పొట్ట నింపుకోవటానికి ఒక పాఠశాలలో సంగీతం నేర్పే అధ్యాపకుడిలా చేరతాడు.అతడికి పాఠాలు చెప్పటం అంటే విసుగు.పిల్లలను చూస్తే చిరాకు.అతడి ప్రవర్తనను గమనించిన ప్రినిసిపాల్ ఒక రోజు అతడితో అంటుంది.” పిల్లలకు విఙానం ఇవ్వటమే కాదు,ఆ విఙానానికి ఒక దిశను ఇవ్వటం కూడా అధ్యాపకుడి బాధ్యతనే” అని.ఇది నాయకుడిలో ఆలోచన కలిగిస్తుంది.నెమ్మదిగా, పిల్లలలో నేర్చుకోవాలన్న ఆకాంక్షను గుర్తిస్తాడు.వారిలో ఆసక్తిని రగిలిస్తాడు.అతడికి మరో కోలీగు ఫిసికల్ ఎడ్యుకేషన్ టేచెర్ తో దోస్తీ ఏర్పడుతుంది.ఇంతలో అతని భార్య గర్భవతి అవుతుంది.అంటే,కొన్నాళ్ళకోసం చేయలనుకున్న ఉద్యోగం ఇప్పుడు జీవితాంతం చేయాల్సి వస్తుందన్నమాట.చేసేదిలేక,దీన్లోనే ఆనందం పొందుతూంటాడు.కనీసం తన కొడుకుకి సంగీతం నేర్పి తాను సాధించలేనిది తన సంతానం ద్వారా సాధించాలనుకుంటాడు.ఇక్కడా విధి ఎదురుతిరుగుతుంది.అతడి సంతానానికి చెవులు వినిపించవు.ఈ నిరాశలో పూర్తిగా పనిలో నిమగ్నమవుతాడు.కొడుకుకు నేర్పలేనిది విద్యార్థులకు నేర్పి సంతృప్తి పొందుతాడు.ఇంతలో ఒక అమ్మాయి అతడిని ఆకర్షిస్తుంది.తన కలను నిజం చేసుకునేందుకు పారిపోతూ నాయకుడినీ రమ్మంటుంది.కానీ,తన పరిమితులు గుర్తించిన నాయకుడు ఆమెకు సహాయం చేస్తాడు కానీ అమెతో పారిపోడు.
ఇలా కాలం గడుస్తూంటుంది.కాలేగీలో కళల విభాగం అవసరంలేదని నాయకుడికి ఉద్వాసన చెప్తారు.దాంతో,ఇన్నళ్ళూ తాను సాధించింది ఏమీ లేదని,తన జీవితం వ్యర్ధమనీ భావిస్తాడు.తన వస్తువులు తీసుకుని వెళ్ళిపోతూంటే,ఆడిటోరియం నుంచి సంగీతం వినిపిస్తుంది.అతడి వద్ద చదువునేర్చుకున్న పాట విద్యార్థులంతా,అతడికి వీడ్కోలు పలికేందుకు వస్తారు.అతడి జీవితం వ్యర్ధం కాదని,తమ జీవితాలను ఆయన ప్రభావితం చేశాదని,ఆయన రచించిన సంగీతంలో రక రకాల వాయిద్యాలు తామని అంటారు.ఆయన రచించిన సింఫోనీని వాయిస్తారు.ఇదీ ఈ సినిమా కథ.
నిజానికి ఇలా చెప్తే ఏముందే సినిమాలో అనిపిస్తుంది.కానీ సినిమా చూస్తూంటే,కళ్ళు చెమ్మగిల్లితాయి.హృదయం బరువెక్కుతుంది.అనేక సందర్భాలలో ఎనలేని ఆలోచనలు ఉధృతమయిన తరంగాలుగా ఎగస్తాయి.
ముఖ్యంగా,తన కొడుకుకు చెవులు వినపడవని తెలిసిన సన్నివేశం,తాను కష్టపడి సంగీతం నేర్పిన ప్రతిభావంతుడయిన విద్యార్థి,యుద్ధంలో చనిపోయాడని తెలిసిన సన్నివేశం,తండ్రి,కొడుకుల నడుమ ఉద్విగ్నతలు,కొడుకు కోసం తండ్రి ప్రత్యేక ప్రదర్శన నివ్వటం  వంటి దృశ్యాలు,విద్యార్థినిలో ఒకేసారి తాను కోల్పోయిన ఆశల స్వరూపాన్ని,తనలో అణగారిన కోరికలనిఉ దర్శించి,బాధ్యతా యుతంగా వ్యవరించిన సన్నివేశాలు అద్భుతమయినవి.మనకు తెలియకుండానే మన్ల్ని మనం చూసుకుంటాము.మనకి మనము అర్ధమవుతాము.మన ప్రమేయం లేకుండానే మనలో కలిగే అశాంతికి కారణం మనకు అర్ధమవుతుంది.
అయితే,ఈ సినిమాలో రెండు దృష్యాలు మాత్రం పరమాద్భుతమయినవి.
చివరి సన్నివేశం సినిమాకే తలమానికమయినది.ఏ వ్యక్తి జీవితం వ్యర్ధం కాదు.ముఖ్యంగా ధ్యాపక వృత్తిలో వున్న వ్యక్తి జీవితం వ్యర్ధం అసలే కాదు.అతని ప్రభావంతో అనేకులు తమ జీవితాలను తీర్చి దిద్దుకుంటారు. ఈ అర్ధాన్నిచ్చే చివరి సన్నివేశం ఎదను ద్రవింప చేస్తుంది.హృదయం ఉప్పొంగేట్టు చేస్తుంది.సినిమా మనసులను కదిలించాలంటే,యుద్ధాలు,ప్రేమలు ఏడ్పులు పెడబొబ్బలు అవసరం లేదు.మమూలు మనిషి జీవితంలోని అతి మామూలు సంఘటనలోని అర్ధాన్ని వివరిస్తే చాలు అని నిరూపిస్తుందీ దృష్యం.
ఈ సినిమాలో అనేకాలోచనలు కలిగించే సన్నివేశం,కళలను కాలేగీలోంచి తొలగించే సందర్భంలో నాయకుడు వాదించే దృశ్యం.కళలు వ్యక్తులలో సున్నితభావనలను కలిగిస్తాయి.అటువంటి వాటికి వారిని దూరం చేయటమంటే,మనం ఆలోచనలు భావనలు లేని మర మనుషులను తయారు చేయటమే నన్న వాదన నిజం.మనము మన పిల్లలను చదువు పరీక్షలకు పరిమితం చేస్తూ వారిని సున్నితభావనలకు ఎల దూరం చేస్తున్నమో అత్యంత ప్రతిభావంతంగా బోధపరుస్తుందీ దృశ్యం.
ఈ సినిమలో రిచర్డ్ నటన అద్భుతం.సినిమాకు స్క్రిప్ట్ ప్రాణం.నెపధ్య సంగీతం అమోఘం.దర్శకుడి ప్రతిభ ఆదుగడుగునా కనిపిస్తూంటుంది.సన్నివేశ సృష్టీకరణ,చిత్రీకరణ,ఎడిటింగ్లు ఉత్తమ స్థాయిలో వున్నాయి.ఎటువంటి మెలో డ్రామా లేకుండా,సామాన్య జీవితాన్నే  అతధ్భుతమయిన డ్రామా గా మలచి ప్రదర్శించిన ఈ సినిమని తప్పకుండా చూడండి.ఆనందించండి.ఆలోచించండి.కళ ప్రధానోద్దేశ్యం వినోదంతో పాటు,ఆలోచనను విచక్షణనూ నేర్పటం.ఆ ఉద్దేశ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిన్స్తుందీ సినిమా.

April 29, 2008 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: sinemaa vishleashaNaa.

మీరు కోరిన పాట-చందన్ స బదన్!

ఆ కాలం లో యువతి అందాలు అందించే వ్యాపార వినోదాత్మకమయిన వస్తువు కాదు.ఆ కాలం లో యువకుల దృష్టిలో యువతి ‘మస్త్ మస్త్ చీజ్’ కాదు.ఆ కాలం లో యువకులను ఆకర్షించాలంటే యువతులకు అందాలు ఆరబోసి,వొళ్ళంతా చూపిస్తూ,వెర్రి మొర్రి గెంతులు గెంతుతూ, రెచ్చగొట్టే పిచ్చి పాటలు పాడుతూ,లైంగికానుభవం కోసం పురుషుడికన్నా తీవ్రంగా తపించిపోతున్నట్టు నిరూపించుకోవాల్సిన అవసరం  వుండేది కాదు.
ఆ కాలంలో యువకుల దృష్టిలో యువతులు అపురూపమయిన భగవంతుడి కళా నైపుణ్యానికి ప్రతీకలు.యువతులంటే చులకన భావం అస్సలే లేదు.వారి ఆలోచనలలో లైంగికత అంతస్సూత్రంగా వున్నా,అది ప్రాకృతికమే తప్ప దాన్లో వెకిలితనము,నైచ్యము అయినదేదీ వుండేది కాదు.యువతులు యువకులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ,అభిమానించుకుంటూ,ఒక సున్నితము,అద్భుతమూ,అద్వితీయమయిన సంబంధం తమ నడుమ ఏర్పరచుకోవాలని తపించేవారు.ఒకరి సాంగత్యంలో మరొకరు తమని తాము మరిచి,తమలోని దైవత్వ భావనను అర్ధం చేసుకోవాలని తహ తహ లాడేవారు.ఆ కాలంలో స్త్రీ పురుష సంబంధం లోని లైంగికత పరమాత్మాన్వేషణలో తోడ్పడే  అంశమే తప్ప అదే సంబంధ పరమార్ధం కాదు.ఈ భావనకు అద్దం పడుతుంది సరస్వతీచంద్ర సినిమా లోని సుందరమూ,సుకుమారమూ పరమ రమణీయమూ అయిన పాట చందన్ స బదన్.
ఈ పాట రాసింది ఇందీవర్.ఈయన తొలి రోజులలో అత్యద్భుతమయిన పాటలు రచించాడు.సరళమయిన హిందీ భాషనే వాడేవాడు. ఎంత సరళమంటే,పాటలు వింటూంటే నిర్మలమయిన నీటి ప్రవాహం గల గల పారుతున్న భావన కలుగుతుంది.స్వచ్చమయిన ప్రకృతి సౌందర్యం కనుల ఎదుట కదలాడుతుంది.రంగో చందోమె సమాయేగీ కిస్ తరహ్సె ఇత్నీ సుందర్ త(ఈ సౌందర్యం రంగులలో చ్చందస్సులో ఎలా ఇముడుతుంది? అంటే రంగులూ కవిత్వమూ కూడా వ్యక్త పరచలేని సౌందర్యమన్నమాట),ప్రియ ప్రాణేశ్వరీ,హృదయేశ్వరీ,యది ఆప్ హమే ఆదేశ్ కరేతో ప్రేం క హం శ్రీ గణేశ్ కరే వంటి పాటలూ ఈయన కలం నుంచి జాలువారినవే.తరువాత బప్పీ లహరీ తరగల్లో పడి తాకి తాకి,తోహ్ఫా లాయా వంటి పాటలు రాశాడు.సరస్వతీ చంద్ర లో మనకు ఇందీవర్ హృదయం,సృజనాత్మక ఆవేశం కనిపిస్తుంది. 
సంగీత దర్శకులు కళ్యాణ్జీ ఆనంద్జీ సంగీతం లోని ఉత్తమత్వానికి ఈ సినిమా పాటలు తిరిగులేని నిదర్శనాలు.
పాత కాలంలో నాయకుడి దృష్టి నాయిక వదనాన్ని వీడేది కాదు.తుంకొ దేఖతొ నజ్రే యె కహ్నే లగీ,హుంకొ చెహ్రేసె హట్నా గవారా నహీ అనేవాడు హీరొ.నాయిక లో నాయకుడు సృష్టిలోని సంపూర్ణ సౌందర్యాన్ని చూడగలిగేవాడు.ఆమెను ప్రకృతికి ప్రతీకలా భావించేవాడు.
చందన్ స బదన్ చంచల్ చిత్వాన్,ధీరే సె తెరా యే ముస్కానా…….
భావం సులభంగా  అర్ధమవుతుంది.ఇక్కడ గమనించవలసిందేమిటంటే నాయకుడు ఆమె చిరునవ్వును ప్రస్తావిస్తున్నాడు. నిజంగా ఆ కాలంలో యువతుల చిరునవ్వు,కడగంటి చూపులు చాలు యువకుల మనసూలలో మనోహరమయిన భావనల తూఫానులు కలిగించటానికి.అందుకే ముఝె దోష్ న దేనా జగ్వాలో హోజావు అగర్ మై దీవానా అంటున్నాడు. అంటే,చందనము వంటి ఆమె శరీరం,ఆందమయిన ఆమే వ్యక్తిత్వమూ,అన్నిటినే మించి ఆమె చిరునవ్వు లను చూసి తాను మైమరచి పోతే దోశం తనది కాదంటున్నాడు నాయకుడు.తెలుపు నలుపుల్లో మధుబాల,నర్గిస్,నూతన్,సాధన వంటి వారి మందహాసాలే యువకుల మదిలో మనోహరమయిన భావనల వెన్నెల తుఫానులను రేపేవి.అందుకే,ఆ కాలంలో యువతులు చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించారు.
విల్లు వంటి కనుబొమ్మలు,నల్లటి కాటుక నిండిన కళ్ళు,నుదుటి పయిన సూర్యుడిలాంటి ఎర్రటి బొట్టు,పేదవులపయిన కణకణ లాడే నిప్పుకణికలు…….
ఇక్కడ యువతి ప్రకృతి అయిపోయింది.ఆమె నుదుటి బొట్టు సూర్యుడట!ఇంక ఇల్లంటి భావన కలింగించిన యువతి పట్ల వెకిలి భావనలు కలగనే కలగవు.అటువంటి భావనలు కలిగేవారు ఇల్లాంటి ఉదాత్త భావనలు చేయలేరు. ఇంతటి అత్యుత్తమ సౌందర్యం కల యువతి నీడ తనపయిన పడిన ఈ భావుకుడి నీరస జీవితం రసబంధురమయిపోతుంది.అందుకే,సాయాభిజొతేరా పడ్జాయే ఆబాద్ హొ దిల్కా వీరానా అంటున్నాడు.ఆమె నీడ తోనే అతని హృదయంలోని శూన్యం వసంతమయిపోతుందట.
తన్ భీ  సుందర్,మన్ భీ సుందర్,తూ సుందర్ తా కీ మూరత్ హో,
సరళ మయిన భావం.కానీ మనసుకు ఆనదమూ,ఆహ్లాదమూ కలిగిస్తుంది.ఒక పవిత్ర భావనను ఎదలో జాగృతం చేస్తుంది.అటువంటి అపురూప సౌందర్యాన్ని దర్శించాలన్న తపనను ఎదలో కలిగిస్తుంది.నిజంగా అలాంటి సున్నితమూ,అపురూపమూ అయిన భావనలతో యువతిని అర్చించాలనిపిస్తుంది.కళల పరమార్ధం ఇదే.వ్యక్తిలోని సున్నిత భావనలను జాగృతం చేసి,తనలోని దైవత్వాన్ని క్షణం సేపయినా చూడగలిగేట్టు చేయటమే.
ఆమె అవసరం తనకు చాలా వుందంటున్నాడు.ఇంతకు ముందే తాను  ఆమె కోసం ఎంతో బాధపడ్డాడు.ఇక తనని బాధ పెట్టద్దంటున్నాడు.
ఇంతా భావస్ఫోరకంగా,సున్నితంగా,ఆర్తితో పాడుతున్న నాయకుడికి అంతే దీటుగా సమాధానం ఇస్తుంది నాయిక.
యె విశాల్ నయన్ జైసె నీల్ గగన్ పంచీ కి తర్హా ఖోజావూమై.
అతని కళ్ళు నీలి గగనం లా వున్నాయట.పక్షిలా ఆ గగనంలో తాను మైమరచి పోతానంటోంది.
సర్హానజొహో తెరె బాహోంకా అంగారోపర్ సోజావూమై
అతడి బాహువులు దిండులా తలక్రింద వుంటే,నిప్పుల్లో నయిన సుఖంగా నిద్రిస్తానంటోంది.అతనిపయిన ఆమెకు అంత నమ్మకం.అతని సాంగత్యంలో ఆమెకు అంత భద్రత.
సాధారణంగా పురుషులు స్త్రీ సంబంధంలో మానసికంగా అత్మ విశ్వాసాన్ని కోరతారు.తనని నమ్మి సంపూర్ణంగా అర్పించుకునే స్త్రీ కోసం తపిస్తారు.ఎటువంటి అహంకారాలు,హక్కుల గొడవలు లేకుండా స్వచ్చంగా తనను తనలాగే ఇష్టపడే స్నేహాన్ని కోరుకుంటారు.
తన పురుషుడి నుంచి స్త్రీ భద్రతను వంచిస్తుంది.అతని సాంగత్యంలో తనని తాను మరచిపోతుంది.అంటే విశ్వాసం,నమ్మకం,గౌరవాలు స్త్రీ పురుష సంబంధానికి ఇటుకలు సిమెంటూ అన్నమాట.లైంగికత వీటి తరువాత వస్తుంది.కానీ ఇప్పుడు లంగికతే ప్రాధాన్యం వహించటంతో అనేక సంబంధాలు తెగి పోతున్నాయి.బాంధవ్యాలలో సున్నితత్వం అదృష్యం అవుతోంది.నాయిక అతని చేతుల ఆసర వుంటే నిప్పుల్లో నయిన సుఖంగా నిద్రిస్తాననటం వెనుక ర్ధం ఇదే.
ఒక ప్రేమ గీతాన్ని ఇంత ఔచిత్యమూ,మానవ మనస్తత్వం పయిన అవగాహనలతో రచించేవారన్నమాట ఆ కాలం లో కవులు.అందుకే ఇప్పటికీ మనం ఆ పాటలు వింటూ మైమరచి పోతూంటాము.మనకు అసలు భావం బోధపడకున్నా,మన మనసులోని అసలు మనిషి మనసు ఈ పాటల్లోని అర్ధం గ్రహిస్తుంది.మనల్ని ఆనంద పరవశులను చేస్తుంది.
ఈ సినిమాలోనే మరో శృంగార దృశ్యంలో నాయిక నాయకులు వుత్తరాలు రాసుకుంటారు.
నీకు ఉత్తరంలో పూలు పంపాను,అవి పూలు కావు నాహృదయం అంటుంది నాయిక.అంతే కాడు,న హృదయానికి నీదయ్యే అర్హత వుందా?అని సున్నితంగా అడుగుతుంది.భావం గ్రహించగానే,మనసుకు ఎంతో సంతోశంగా,హాయిగా అనిపిస్తుంది.
ఈ కాలం వారికి ఈ పాటలలోని మాధుర్యం తెలియదు.అనుభవించే తీరిక లేదు.ఫాస్ట్ ఫుడ్ లాగే ఫాస్ట్ ప్రేమలయిపోయాయి. అందుకే,వారికి మనము కొత్త పాటలను ఎందుకు మెచ్చలేకపోతున్నామో అర్ధం కాదు.
మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ము వోవునే మదనములకు?
      

April 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

హర్భజన్ చెయ్యి,శ్రీశాంత్ చెంప-యే దిల్ మాంగే మోర్

ఏదయినా రోజూ చూస్తూంటే విసుగు వస్తుంది.20-20 ఆటలు కూడా రెండు మూడు రోజులు ఆ సక్తిగా అనిపించినా రోజూ చూడాలంటే విసుగు వచ్చేస్తోంది.బౌలర్ ఉఫ్ఫు పఫ్ఫు అంటూ చేమటలు కక్కుతూ,ఆయాస పడుతూ,శక్తి నంతా కూదదీసుకుని బంతి విసిరితే,బాట్స్మన్ అలవోకగా బంతిని బౌండరీ దాటించటం,గాల్లోకి లేపి లేపి కొట్టటం ఎక్సయిటింగ్ అనిపించినా,రాను రాను రొటీన్ అయి చికాకు ఆరంభయింది.ఎంతసేపూ వీర బాదుడు,పరుగో పరుగూ…ఏదో అప్పుడప్పుడూ అయితే బావుంటుంది కానీ,ఇష్టమని రోజూ గారెలు తింటే అజీర్ణం ఖాయం.20-20 గతి అంతే అయింది.ఒక పక్క రొటీన్  వీర బాదుడు చూస్తూంటే బౌలర్లకీ నరక యాతన ఎందుకో అని వారి పయిన జాలి కలుగుతోంది. మరో వయిపు,అలుపు లేకుండా గెంతే వయిపు,ఈ కర్రతో,ఆ బంతిని కొట్టటానికి వీళ్ళకి లక్షలు,బదటానికి వాళ్ళకి లక్షలు,ఇదంతా చేయించే వాళ్ళకి కోట్లు,మనకి సమయం వ్యర్ధం,జేబుకు చిల్లు,అరుపులు కేకలతో గొంతు నొప్పి.చెవులు హోరు.
అయితే,సైమొండ్స్ ఆట ఉత్సాహం కలిగించింది.ఆ ఉత్సాహం తగ్గే లోగా,యూసుఫ్ పఠాన్ తూఫాను తల తిప్పేసింది.ఒకడు రాక్షసుడయితే,మరొకడు వాడి తాత. సంగక్కారా ఆట కళాకారుడి కళా ప్రదర్శన అనిపించింది.కానీ,సైమొండ్స్ ఆట చూసిన తరువాత యూసుఫ్ బాదుడు చూడ బుద్ధి కాలేదు.బౌలర్లు జుట్టు పీక్కుని,తలలు బాదుకుంటూ,నిరాశా నిస్పృహలతో కన్నీళ్ళు పెట్టుకుంటూంటే అసలీ ఆటలన్నీ మనలోని సాడిస్టుని సంతృప్తి పరుస్తాయేమోనన్న ఆలోచన కూడా వచ్చింది.
ఇంతలో హఠాత్తుగా ఆసక్తికరమయిన,రొటీన్ కు భిన్నమయిన సంఘటన జరిగింది!
బంతి బదులు హర్భజన్ చెయ్యి విసిరాడు.చేతినే బాటుగా చేసుకొని,శ్రీశాంత్ చెంపనే బంతి అనుకొని స్క్వేర్ డ్రైవ్ చేసాడు.దాంతో ఒక్కసారిగా మళ్ళీ ఆటమీద ఆసక్తి పెరిగింది.బహుశా భవిష్యత్తులో ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చి ఆకర్షించటానికి ఆట మధ్యలో తన బౌలింగ్లో సిక్సెర్ కొట్టిన ఆటగాడిని ఒక చెంపదెబ్బ కొట్టే వీలు బౌలెర్ కి ఇవ్వాలి.తనని వంద పరుగుల దగ్గర ఔట్ చేసినా,సున్న పరుగులకు రన్ ఔట్ చేసినా వాడిని బాటుతో ఒకటిచ్చుకునే వీలుండాలి.అంతా అయిన తరువాత,ఇద్దరు కప్తాన్ల చెంప దెబ్బల సెషను వుండాలి.వీలయితే కోచులు కూడా పాల్గొంటే మరీ మంచిది.అప్పుడు  అరువు అభినందన అమ్మాయిల అందాల బదులు ఆటకు అనుబంధంగా చెంపదెబ్బల ప్రహసనాలు వినోదాన్ని ఇస్తాయి.అది రొటీన్ అయ్యేలోగా ఇంకేదో దొరుకుతుంది.వినోదమే వ్యాపారానికి ప్రాణ వాయువు కదా!అందుకే ప్రస్తుతానికి ఇటువంటి చెంపదెబ్బల వినోదం ఇంకా కావాలి.
అన్నిటి కన్నా మజా ఆటగాళ్ళు తరువాత సమర్ధించుకోవటంలో వుంది.హర్భజన్ వల్ల మన దేశంలో అన్నలు తమ్ముళ్ళను కొడతారని ప్రపంచానికి తెలిసింది.ఆ దెబ్బలు తింటేకానీ తమ్ముళ్ళకు తాము గెలిచామని అర్ధంకాదు.కన్నీళ్ళు రావు.
కొసమెరుపుగా,ప్రెస్ కాంఫరెన్స్ లో హర్భజన్ క్రికెట్ గురించే మాట్లాడతానంటే నవ్వు ఆగలేదు.బహుషా చెంప చెయ్యి క్రికెట్ గురించే మాట్లాడతానంటే అందరూ అపార్ధం చేసుకున్నారేమో!ఏమో నా ఈ బ్లాగు చదివిన వారికి ఎవరికయినా భవిష్యత్తులో చెంప-చెయ్యి ఆటల పోటీ నిర్వహించాలనిపిస్తే,నాకే ఆలోచన పయిన కాపీ రైటు వుందని మరచిపోకండి.

April 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

పాటలో మాటలు,మాటల్లో మనసులు-యే రాత్ భీగీ భీగీ.

కొన్ని పాటలు మామూలు ప్రేమ పాటలే అయినా,తరచి చూస్తే,అనంతమయిన తాత్వికతను తమలో పొందుపరచుకునివుంటాయి. మమూలు ప్రేమ పాటలను,సార్వజనీన తాత్విక గీతాలుగా మలచటంలో,హిందీ గేయ రచయిత శైలేంద్ర సుప్రసిద్ధుడు.
ప్యార్ హువా,ఇక్రార్ హువా,పాటలో,చివరి చరణంలో,మైన రహూంగి,తుం న రహోగే,ఫిర్భి రహేగి నిషానియా,అనటంతోటే పాట స్వరూపం మారిపోతుంది.ప్రేమికుల ప్రేమ వాళ్ళిద్దరికే పరిమితం కాదనీ,అది,సమస్త మానవ సమాజనికీ చెందినదనీ,ప్రేమ ద్వారా,ఇరువురు భౌతిక శరీర ధారులు,తమ భౌతిక శరీర పరిధిని దాటి,అనంత కాలం జీవించ గలిగే,చిరంజీవులవుతరనీ,అద్భుతమయిన తాత్వికార్ధాన్ని చివరి పంక్తులు పాటకు ఆపాదిస్తాయి.భౌతికంగా వ్యక్తులు మరణించినా,వారు తమ సంతానం ద్వారా తరతరాలు జీవితులేకదా!ఇదీ శైలేంద్ర గొపాతనం.అటువంటి తాత్వికతను ప్రదర్శించే మరో పాట,చోరీ చొరేఅ సినిమాలోని “యే రాత్ భీగీ,భీగీ”.
సినిమాలో సందర్భం మమూలే.నాయికా నాయకులు వొంటరిగా వుండాల్సి వస్తుంది.అప్పటికి వారు ఇప్పటంత అభివృద్ధి చెందలేదు కాబట్టి,కలలుకనవచ్చు,ఇష్టం వొచ్చినట్టు గెంతవచ్చు అని వారికి తెలియదు.అందుకని.నాయకుడు,హాయిగా వుయ్యాల్లో వూగుతూ,చంద్రుడి వయిపు చూస్తూ,మనసులోని శృంగారావేదనను పాటలో ప్రకటిస్తాడు.ఆకాలంలో నాయికలు నాయకులకేమీ తీసిపోయేవారు కారు.తెలివితేటల్లో,సంస్కారాల్లో నాయకుడిని మించి వుండేవారు.ఇప్పటి నాయికల్లా వొళ్ళుచూపి గెంతటటానికి తప్ప మరెందుకూ పనికిరాని వారు కారు వారు.అందుకే,నాయకుడికి దీటుగా జవాబు ఇస్తుంది.మధురమయిన సృంగార గీతాన్ని వెలయిస్తుంది.
చిక్కటి ఈరాత్రి,మధురమయిన ప్రకృతి,ఆహ్లాదకరమయిన వాతావరణం చందౄడు నెమ్మదిగావుదయిస్తున్నాడు,అంటాడు నాయకుడు.వావీ వరుసలు లేకుండా వాంచించటం,లైంగిక పరమయిన మాటలే శృంగారంగా చలామణీ అవుతున్న కాలంలో గాలి,నేల,ఆకాశం,వెన్నెలలలో అసలు శృంగారం దాగివుందని సున్నితంగా గుర్తుకుతెస్తుందీపాట.మన్నాడే పాట అందుకోగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.దానికి శంకర్-జైకిషన్  గిటార్ మృదువుగా తాళం వేస్తుంది.
 మన్సులో మంట రగిలించి,ఏమీ ఎరగనట్టు వున్నాడెందుకు చంద్రుడు,ఈ రాత్రి తన సైగలతో నిద్ర పోనీయటంలేదేల,అంటుంది నాయిక,లతా,మనోహరమయిన స్వరంలో.
పల్లవి అయిపోగానే,ఈ మృదు,మధుర భావనలను వయోలిన్ల లయ ద్వారా కొనసాగిస్తూ,చరణాల్లోకి లాక్కు పోతారు శంకర్-జైకిషన్లు.ఈ జంట సంగీతంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇది.పాటనుంచి,ఇంటెర్ల్యూడ్ సంగీతాన్ని విడదీయలేము.పాటలోని పదాలు,వాయిద్యాల లయ ఒక అవిభాజ్యమయిన గాన రస ప్రవాహంలా ఎదగటం వీరి ప్రత్యేకత.ఆవారాహూన్ అనగానే,ఊహుహూహూ  అనకుండా వుండలేము.
మొదటి చరణంలో నాయకుడు,ప్రకృతి ని వర్ణిస్తాడు,చల్లగా మరులుగొలిపే రీతిలో గాలి వీస్తోంది.నీలి ఆకాశం.పూవులు వివశమయినట్టు మత్తుగా వున్నాయి.ఇంత అందమయిన ప్రకృతి ఎదురుగా వున్నా మనసులో మాత్రం ఏదో అశాంతి కలుగుతోంది అంటాడు.
ఇది ప్రతి వ్యక్తి అంతరంగ చిత్రం.పురుషుడికి స్త్రే సాంగత్యం మాత్రమే ప్రశాంతతను ఇవ్వగలదు.యవ్వనంలో,పురుషుడికి తన మనసు కోరే స్త్రీ గురించి స్పష్టమయిన ఆలోచన వుండదు.ఎవరో కావాలి.ఆ ఎవరో వీరు అని నిర్దిష్టంగా చెప్పలేడు.దాంతో,యవ్వనంలో వయసు చేసే బాధకు  ఈ మనసు బాధ తోడవుతుంది.ఒక గమ్మత్తు లాంటి మత్తు మనసును ఆవరిస్తుంది.గమ్మత్తయిన మతూ మరింత అశాంతిని కలిగిస్తుంది.ఈ భావాన్ని నాయకుడు వెలిబుచ్చాడు.సినిమాలో ఈసందర్భంలో నాయికా నాయకుల పరిచయం ఇంకా ప్రేమగా పరిణమించదు.కానీ,యువతిని చూడగానే పురుషుడి మదిలో కలిగే భావ సంచలనం వల్ల అశాంతి జనిస్తుంది.అందుకే ఎక్కడా హీరో ప్రేమ అన్న పదం ఉపయోగించలేదు.ఇంత సుందరమయిన ప్రకృతి వున్నా హృదయంలో ఎందుకో అశాంతి అని ఆలోచిస్తున్నాడు.ఆ అశాంతికి కారణం మనము చర్చించాము. మనకు ఇప్పుడు తెలుసు.ఆ వయసులో తెలియదు.
నాయకుడి ఆలోచనాత్మకయిన ప్రశ్నకు నాయిక దీటుగా,తాత్వికమయిన సమాధానం ఇస్తుంది.
జో దిన్ కి వుజాలేమే న మిల దిల్ ఢూంఢే ఐసే సప్నేకో
ఇస్ రాత్ కి జగ్ మగ్ మే డూబీ మై ఢూంఢ్ రహీహూ అప్నేకో
అంటుంది.ఈ పాటలో ఇది కీలక మయిన చరణం.మానవ మనస్తత్వాన్ని విప్పి చూపే ఛరణం.శైలేంద్ర రచన చాతుర్యానికి,భావ గాంభీర్యానికి,తాత్వికతకు దర్పణం పడుతుందీ చరణం.మమూలు ప్రేమ పాటను తాత్విక శిఖరాలకు చేర్చే కవి అమోఘమయిన ప్రతిభకు తిరుగు లేని నిదర్శనం ఈ పాట.మంచి పాటకు సందర్భాలు దొరకటంలేదు అనేవారి చేతకాని తనానికి అద్దం పడుతుందీ పాట.
సాధారణంగా ప్రతి మనిషికీ ఒక కల వుంటుంది.ఆ కల ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి నిదర్శనం.ఒకో సారి వ్యక్తికి ఇది తన కల నిర్దిష్టంగా తెలియదు.దాని స్వరూపం తెలిసేవరకు,అతడు ఆవేదనకు,తనకే తెలియని,కారణం లేని అవేదనకు గురవుతూంటాదు.కానీ ఆ కల ఉదయపు వెలుతురులో దొరకదు.ఎందుకంటే,ఉదయపు వెలుతురులో అనేక విశయాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ప్రలోభంలో పడి మనల్ని మనమే మరచి పోతాము.కానీ రాత్రి ప్రశాంతతలో,వొంటరిలో,ప్రాకృతిక సౌందర్యం పరిమళిస్తూన్న సమయంలో,మనిషి తనలోకి తాను చూసుకోగలిగితే తన కల స్వరూపం అర్ధమవుతుంది.తన వ్యక్తిత్వం తనకు బోధపడుతుంది.నాయిక ఇదే అంటోంది.
నాయిక యువతి.ఆ వయసులో వుండే,కలలు కొరికలు ఆమెనీ కలవర పెడుతున్నాయి.అందుకే,ఈ ప్రశాంత రాత్రిలో,ఉదయపు వెలుతురులో ఎంత వెతికినా లభించని స్వప్నాన్ని స్వప్నాన్ని తనలో తాను తనను వెతుక్కుంటోంది.ఎందుకంటే,ఆ కల అర్ధమయితే,తనకు తాను అర్ధమవుతుంది.అందుకే రాత్రి జిలుగు వెలుగులలో మునిగి తనని తాను వెతుక్కున్నాను అంటోంది నాయిక.తరచి చూస్తే అనంతమయిన తాత్వికత.లేక పోతే యుగళ గీత్మ్.అంతే.(ఈ పదాల ఆధారంగా నేను ఆంధ్ర భూమి మాస పత్రికలో “స్వప్న వాసంతం”అనే నవల రాశాను.)
నాయిక జవ్వబు నాయకుడికి అర్ధమయింది.అమే తన లాంటి మానసిక స్థితిలోనే వుందని గ్రహించాడు.అందుకే,చివరి చరణంలో,ఈ విశాల ప్రపంచంలో పొరపాటునయినా తనను గుర్తుచేసుకునే వారు లేరా? అని అంటాదు.సమాధానంగా ఒక చిరునవ్వుతో స్వప్న ప్రపంచాన్ని సజీవ్ చేసేవారెవరూ లేరా అంటుంది నాయిక.వారి ప్రేమకు ఇది నాందీ ప్రస్తావన.
ఇదీ శైలేంద్ర గేయ రచన చాతుర్యానికి ఒక చిన్న ఉదాహరణ.తరచి చూస్తే,మమూలు మాటలలో,నిగూఢంగా వున్న మనసు మాటలు వినిపిస్తాయి.ఇటు వంటి మనసు మాటలనేకం మన కవులు పాటలలోని మాటలలో పొందుపరిచారు.వాటిని విశ్లేషిద్దాం. కలసి అనందిద్దాం.      

April 24, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

నేను చదివిన మంచిపుస్తకం- 4-కొనసాగింపు

1924-48 నడుమ,కాళీపట్ణం రామారావు గారు,23 కథలు రాశారు.1949-55 నడుమ 12 కథలు రచించారు.1956-67లలో,6 కథలు రచించారు.యఙ్నం ఈ ఆరు కథలలోనిదే!
ఇదే పుస్తకంలో,”కథ” అనే వ్యాసంలో,రామారావు గారు కథకు నిర్వచనం ఇచ్చారు.వృత్తాంతం,కథ కాదు అని తీర్మానించారు.బొమ్మకు,చిత్రానికి వుండే తేడా,కథకూ,వృత్తాంతానికీ వుంటాయని అన్నారు.వౄత్తాంతం ఎప్పుడు కథ అవుతుందంటే,”అంతర్గర్భిత విశేషాన్ని    వ్యక్తీకరించే వృత్తాంతమే కథ  కాగలదు.వ్యక్తీకరించటానికి ఏ విశేషమూ లేని  వృత్తాంతం ఒత్తి వృత్తాంతంగానే మిగిలిపోతుంది”.
మరో వ్యాసంలో,”వాస్తవాన్ని చెప్పగల రచనైనా అది హృదయాన్ని స్పృశించే వృత్తాంతం కాకుంటే కథ కాదు”,అన్నారు.
మొదటి నిర్వచనంతో సమస్య లేదు కానీ,రెండవ నిర్వచనంతో సమస్య వస్తుంది.
హృదయాన్ని స్పృశించటాన్ని ఎలా కొలుస్తాం?
 ఇంతకీ ఎవరి హృదయాన్ని స్పృశించాలి?
 పాఠకుల హృదయాలు అనటం తేలిక.కానీ ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఏకీభవించటం కష్టం.అటువంటిది,ఒక కథ విషయంలో ఎంత మంది అభిప్రాయాలను సేకరిస్తాం?
కాబట్టి,మనం విమర్శకుల పయిన ఆధార పడాల్సి వుంటుంది.విమర్శకులు నిష్పక్షపాతంగా విమర్శించేవారయితే సమస్య లేదు.వాళ్ళు రంగుటద్దాలు తగిలించుకుంటే సమస్య వస్తుంది.అటువంటప్పుడు,ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించి అధిక సంఖ్యాకులందామా?నిజం నంబర్లలో వుండదు అన్న తత్వవేత్త మాట విందామా?ఒక వేళ,ఆ వృత్తాంతం నా హృదయాన్ని కదిలించలేక పోతే,నేను కథ కాదంటే ఒప్పుకుంటారా?
నీ ఒక్కడికి నచ్చకుంటే నష్టం లేదు,పదిమందికి నచ్చితే చాలు,అంటే, కథకు సార్వజనీనమయిన నిర్వచనం ఇవ్వటం లో మనం విఫలమయినట్టే అవుతుంది.
కాళీపట్నం రామారావు గారి ఆరంభ రచనల విషయంలో నాకు కలిగిన మీమాంస ఇది.
అయితే,కాదెవరూ విమర్శకనర్హం అంటుంది మన సాంప్రదాయం.భగవద్గీత లో శ్రీ కృష్ణుడే అర్జునిడితో,అర్జునుడి బుద్ధికి విరుద్ధంగా తోచే మాట అంటే,అర్జునుడు అతడిని నిలదీస్తాడు.సంతృప్తి కరమయిన వివరణ ఇస్తే కానీ వదలడు.అంటే,భగవంతుడి నయినా ప్రశ్నించటం మన సాంప్రదాయమన్నమాట.ఒక వేళ,తర్కం ద్వారా నా పొరపాటు గ్రహించేట్టు ఏవరయినా చేస్తే,కృతఙతలు తెలియచేసుకుని,నా అభిప్రాయం మార్చుకుంటాను. అంతే కానీ నేను నిజమనుకున్న దాన్ని చెప్పే హక్కును మాత్రం ప్రశ్నించకూడదు.”నీతో ఏకీభవించకున్నా అభిప్రాయం వ్యక్త పరిచే నీ హక్కును నేను మన్నిస్తాను” అన్న తత్త్వవేత్త మాటను మననం చేసుకుంటూ అడుగు ముందుకు వేద్దాము.
రచనలను సంవత్సరం ప్రకారం వర్గీకరించినా,కథలను,స్కెచ్ లనుంచి వేరు చేయక పోవటంతో,కాస్త తిక మక కలుగుతుంది.స్కెచ్ లను కథలని భ్రమ పడతాం.కథలను స్కెచ్ లను కుంటాం.అయితే,ఆరంభ రచనలలో,మనకు రామారావు గారు తన చుట్టూ వున్న సమాజాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం కనిపిస్తుంది.మనుషులను గమనిస్తూ వారి మనస్తత్వాలను అంచనా వేయాలన్న తపన కనిపిస్తుంది.ఈ రచనలు భవిష్యత్తులో ఆయన చేయబోయే అద్భుతమయిన కథా రచనకు  తయారీ అనిపిస్తుంది.
అయితే,కథలలో ఆ కాలంలో ప్రచారంలో వున్న పాపులర్ ఆలోచనలను ప్రదర్శించటం కనిపిస్తుంది.సాధారణంగా,రచయితలు కొత్తల్లో ఎటువంటి కథలు సులభంగా ప్రచురితమవుతాయో చూసి అలాంటి కథలు రాస్తారు.ప్రాచుర్యంలో వున్న భావాలనే  ప్రకటిస్తారు.ఆరంభంలో కాళీపత్ణం రామారావుగారు ఇందుకు భిన్నం కాదని ఆయన ఆరంభ రచనలు నిరూపిస్తాయి.
భార్యను వేధించే భర్తలూ,పరాయి అమ్మాయిని ఆకలిగా చూసే పురుషులూ,పెళ్ళి చూపులను వ్యతిరేకించే యువతులూ,ఇంట్లో పడుండటాన్ని వ్యతిరకించే యువతులూ రామారావు గారి కథల్లో కనిపిస్తారు.ఒక రకంగా చూస్తే,భాషపయిన పట్టు,సరళమయిన శైలీ,భావ వ్యక్తీకరణలో లాలిత్యం వున్నా ఎటువంటి ప్రత్యేకత లేక ఆ కాలం లో వచ్చిన అనేక రచనలలాంటివే అనిపిస్తాయి తొలి రచనలు.
అవివాహితగానే వుండిపోతా కానీ….. అనే రచనలో 18ఏళ్ళ పిల్ల బలహీనుడు,పిరికిపంద,దరిదృడు,లోభి,పురుగు వంటి విశేషణాలతో తెలియని పురుషులందరినీ వర్ణించి,పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుంటుంది.ఈ కథ చాలు,రామారావు గారు ఆ కాలంలో ప్రచారంలో వున్న ఆలోచనలనే ప్రదర్శించారు తప్ప తనదయిన ప్రత్యేక అలోచనా పద్ధతిని అప్పటికి ఇంకా ఏర్పాటు చేసుకోలేదని అర్ధమవటానికి. రచయితగా ఆయన తనని తాను గుర్తిస్తున్న సమయం ఇది.తన శక్తిని,సృజనాత్మకతనూ అర్ధం చేసుకుంటున్న సమయం అది.దానిపయిన పూర్తిగా నియత్రణ సాధించని తరుణం అది.
వెనుక చూపు కథలో రామారావు గారి మనసులో ఆకాలం లో జరుగుతున్న సంఘర్షణ స్వభావాన్ని గమనించే వీలు కలుగుతుంది.ఇందులో,తాను మారటాన్ని గుర్తించి రచయిత ఆశ్చర్యపోవటం కనిపిస్తుంది.తనను ఓ పాత్రలో ఆరోపించి ప్రదర్శించటం రచయితలంతా చేసేదే!
1949 నుంచీ రామారావు గారి రచనలలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ఈ కథల గురించి మరోసారి.

April 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized