Archive for April, 2008

వహ్వా,షేన్,వార్న్!

రాజస్థాన్ రాయల్స్ లో షేన్ వార్న్ తప్ప పేరున్న ఆటగాడు మరొకడు లేడని అందరి అభిప్రాయం.అదే,పంజాబ్ కింగ్స్ జట్టులో బ్రెట్ లీ,యువరాజ్,సంగక్కారా,జయవర్దనే లాంటి ఆటగాళ్ళు వున్నారు.కాబట్టి,గెలుపు యువరాజుదే నని అందరు పండితులు తీర్మానించేశారు.చివరికి,రాజస్థాన్ వారు కూడా ఇలాగే భావిస్తున్నారని,మునాఫ్ పటేల్ వ్యాఖ్యలు నిరూపించాయి.కానీ,ఆత్మవిశ్వాసం,నైపుణ్యం,గెలవాలన్న పట్టుదలలు వుంటే,అంచనాలతో,గణాంక వివరాలతో,పండితుల అభిప్రాయాలతో సంబంధం లేదని,షేన్ వార్న్,షేన్ వాట్సన్‌లు నిరూపించారు.జట్టు లో గెలవాలన్న పట్టుదలను కలిగించటమే కాకుండా,గెలుస్తామన్న నమ్మకాన్ని కలింగించి,వార్న్,నాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు.నయం,ఈయన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయివుంటే వారిని గెలవటం మరింత కష్టమయ్యేది!
ఒక వ్యక్తి ఆటను ఎలా ప్రభావితం చేయగలడో,వార్న్ ఈ ఆటలో చూపించాడు.రాజస్థాన్ జట్టు పెద్ద స్కోరు వయిపు పరుగుడుతూంటే,వరుసగా వికెట్లు తీస్తూ,20-20 ఆటలో ప్రతిభవుంటే,బౌలర్లదే పైచేయి అని నిరూపించాడు.అతడి బౌలింగ్‌లో యువరాజ్ ఇచ్చిన కాట్చ్ పట్టివుంటే,వారు వంద పరుగులు కూదా సాధించలేక పోయేవారు.బాట్స్మన్ ఆటగా పరిగణించే 20-20 లో బౌలర్‌దే పైచేయి అని చూపించాడు.
ఇక టార్గెట్ చేరేందుకు రాజస్థాన్ రాయల్స్ అడుగులు తడబడ్డా,షేన్ వాట్సన్ ఆటను దారి మళ్ళించాడు.అతడికి యువ ఆటగాడు జడేజా తోడవటంతో రాయల్స్ విజయం సాధించారు.
ఈ పోటీ ఒక విశయాన్ని స్పష్టం చేస్తుంది.క్రికెట్ ఆటలో మౌలికంగా ప్రావీణ్యం వుంటే,టెస్ట్ అయినా,50 ఓవర్లయినా,20-20 అయినా ఆటగాళ్ళకు ఇబ్బంది లేదు.ఇబ్బంది ఎవరికయినా వుంటే లోపం వాళ్ళలో తప్ప ఆటలో లేదు.ఇక,ఇది క్రికెట్టా,వ్యాపారమా అని ఈసడించేవారికి,ఒకటే సమాధానం.ఇది వ్యాపార యుగం.కళలే వ్యాపార మయమయినప్పుడు,క్రికెట్ వ్యాపారం అవటంలో ఆశ్చర్యం లేదు.
చూస్తూంటే,ఈ 20-20 ఆట క్రికెట్ స్వరూపాన్ని మార్చేసేట్టున్నాయి.ఒక రకంగా ఇది వాంచనీయం.మార్పు ప్రకృతి సహజం.తరాన్ని.కాలాన్ని బట్టి ఏదయినా మారుతుంది.కాబట్టి,మార్పును ఆహ్వానించాలి.అర్ధం చేసుకోవాలి.ఈ పోటీలవల్ల జరుగుతున్న మరో మంచి పరిణామం ఏమిటంతే,యువ ఆటగాళ్ళకు ఆట్Yఅ మెళకువలు తెలుస్తున్నాయి.వారికి అంతర్జాతీయంగా తమ స్థాయి తెలుస్తోంది.విదేశీయులు ఆటకు మానసికంగా ఎలా తయారవుతారో,తెలుసుకునే వీలు కలుగుతోంది.అయితే,ఈ ఙానాన్ని వారు ఇతర రకాల క్రికెట్ ఆడే సందర్భాలలో వాడుకోవటం లో వారి వ్యక్తి గత ప్రతిభ కనిపిస్తుంది.
ఇవాళ్ళ,జరిగే ఆటలో,శాహిద్ అఫ్రిది,గిల్‌క్రిస్ట్ లు కలసి ఓపెన్ చేయటం కోసం క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తునారు!

April 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

నైట్ రైడర్లు,రోయల్ చాలెంజెర్లు.

నిన్న జరిగిన రెండు పోటీలూ ఉత్కంఠ భరితంగా సాగాయి.నైట్ రైదర్ల ఆట కన్నా రోయల్ చాలెంగెర్ల ఆట మరింత ఆసక్తి కరంగా సాగింది.
మొన్న పిడుగులు కురిపించిన బ్రెండన్ నిన్న క్షణంలో వెనుతిరిగాడు.అంతే,ప్రతి రోజూ మన రోజు కాదు గదా!గంగూలీకి కాస్సేపు ఆడక తప్పలేదు.హస్సీ ఆట చూడ ముచ్చటగా అనిపించింది.అతడు ఇన్నింగ్స్ ను తీర్చిదిద్దిన విధం బాగుంది.తన పరిమితులను,జట్టు అవసరాలను దృష్టిలో వుంచుకుని అతను చాలా బాగా ఆడాడు.పాపం వివిఎస్,వేణుగోపల రావు లు తమ ప్రతిభను కనబరచలేక పోయారు.సిమ్మొండ్స్ తప్ప దక్కన్ చార్గెర్స్ ఎవ్వరూ పరిస్థితికి తగ్గట్టు ఆడలేక పోయారు.వారి స్కోరు చూడగానే గెలుపు ఎవరిదన్నది తెలిసిపోయింది.కానీ,వాస్.ఆర్ పి సింగ్ లు ఆటలో ఉత్కంఠ ను కలిగించారు.పిచ్ ను సరిగ్గా వుపయోగించుకున్నారు.కానీ,మిగతా బౌలర్లు అంత నైపుణ్యం చూపక పోవటంతో నైట్ రైడర్లు గెలిచారు.
బాంగలోర్ చాలెంగెర్లు మొన్నటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు.ప్రత్యర్ధి స్కోరు చూసి భయపడి తొందర పడి లాభంలేదని గ్రహించారు.పైగా,శివ్‌నారాయణ్ రాక వారికి అదనపు బలాన్ని ఇచ్చింది.ఈసారి,పరుగులు తీయటంకన్నా వికెట్ పడకుండా కాపాడుకోవటానికి ప్రాధాన్యం ఇచ్చారు.వీలు దొరికినప్పుదు చందెర్పాల్ పరుగులు తీశాడు.వికెట్ ముందు అతడు నిలబడే విధానం విచిత్రంగా వున్నా,బంతి వేయగానే,సరయిన పొసిషన్లోకి వచ్చేసి షాట్ కొట్టటం అద్భుతం అనిపిస్తుంది.అతడి ఆట తీరుకీ,ద్రావిడ్ ఆట తీరుకూ తేడా స్పష్టంగా తెలుస్తుంది.అవకాశం లేని చోట,అవకాశాన్ని సృష్టించుకుని చందెర్పాల్ పరుగులు చేస్తున్నాడు.అదేసమయానికి రాహుల్ పరుగులు తీయటానికి కష్టపడుతున్నాడు.రాహుల్ ఆట శాస్త్రీయంగా సరీయినదే.కానీ ఈ ఆటల్లో ప్రతి బంతిలో పరుగులు తీసే వైపే దృష్టి వుండాలి.అయినా,రాహుల్ బౌండరీలు చేసిన శాట్లు చూస్తే,త్వరలో ఈ ఆటలోని మెళకువలు కూడా అతను గ్రహిస్తాడని అర్ధమవుతుంది.మొదటి వారు త్వరగా ఔట్ కాక పోవటంతో,తరువాత వారికి స్వేచ్చగా పరుగులు తీసే వీలు కలిగింది.కాల్లిస్ నిలకడగా అడితే,విరాట్,బౌచర్‌లు మెరుపులు కురిపించారు.ఉత్కంఠ భరితమయిన రీతిలో తమ జట్టును గెలిపించారు.టెస్త్ జట్టు అని అందరూ హేళన చేసినా టెస్ట్ ఆడేవాడే అన్ని రకాల ఆటలలోనూ ఆడగలడని నిరూపించారు.శాస్త్రీయ సంగీతం వస్తే,ఏ రకమయిన పాట అయినా పాడవచ్చు.అలాగే ఇది కూడా.రోయల్ చాలెంగెర్లు కనక తమ శక్తిని గ్రహించి తగ్గట్టు ఆడితే,పేరున్న వారిని కూడా మట్టి కరిపించ గల సత్తా  వుంది వీరిలో.
క్రికెట్,ఎటువంటి పోటీ అయినా,ఆటగాళ్ళు పట్టుదలగా ఆడి,నైపుణ్యం ప్రదర్శిస్తే ప్రజలు దాన్ని ఆదరిస్తారు.టెస్ట్ ఆటకు ఎంత నైపుణ్యం కావాలో 20-20 కి కూడా అంతే నైపుణ్యం కావాలి.ప్రతి బంతిలో పరుగు చేయగలిగే సత్తా కావాలి.ప్రేక్షకులకు ఆట ఏదయినా ఎక్సయిట్మెంట్ కావాలి.అది 20-20 లో పుష్కలంగా దొరుకుతోంది.కాబట్టి అపోహలన్నీ వదలి ఆనందిద్దాం.బాగా ఆడినవారిని అభినందిద్దాం.

April 21, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

అయ్య బాబోయ్ టి-20!!!

అయ్య బాబోయ్ టి-20! నిజంగా,క్రికెట్ ఆటను ఎంతగా విమర్శించినా,ఎంతగా అసహ్యించుకున్నా,వినోదాన్ని అందించటంలో క్రికెట్ ఆటను మించి మరో ఆట లేదనిపిస్తుంది,20-20 ఆటలను చూస్తూంటే.ఎలాగయితే,20వ శతబ్ద ఆరంభంలో,ఆవిర్భవించిన కొత్తకళ,సినిమా,మిగతా అన్ని కళలను మింగెస్తూ వస్తోందో,అల్లాగే,21వ శతాబ్దపు ప్రజల మనస్తత్వాన్నీ,వాళ్ళకు థ్రిల్లింతలు కలింగించే సూత్రాలను చక్కగా ఆకళింపు చేసుకున్న క్రికెట్,మిగతా ఆటలన్నిటినీ మింగేసినా ఆశ్చర్యం లేదు.ప్రేక్షకులకు అనుక్షణం వినోదాన్ని అందించే వుద్దేశ్యం తో పుట్టిన 20-20,21వ శతాబ్దంలో,అందరికీ,శార్ట్ కట్ వినోదాన్ని అందించటంలో సఫలమవుతోంది.మొదటి ఆట లో,బ్రెండొన్ పరుగులు చేసిన విధానం నుంచి తేరుకోకముందే,నిన్న్న,హుస్సీ వీరబాదుడు,కళ్ళు తిప్పేసాయి.గమనిస్తే,టెస్ట్ ఆటల్లో బాగా రాణించిన వారే,ఈ ఆటల్లో కూడా రాణించటం మనం చూడవచ్చు.మురళీథరన్,మెక్ గ్రాథ్ వంటి వారు తమ బౌలింగ్ తో ఆటని మలుపుతిప్పటం చూడవచ్చు.బాట్స్మెన్లు కూడా,ఆకడ ఆడేవారే,ఇక్కడ ఆడుతున్నారు.దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే,ఆటను ఎన్ని రకాలుగా మార్చినా,ఆటలో ప్రావీణ్యం వున్న వారు బాగా ఆడతారు.లేనివారు,ఆట ఏదయినా అంతే సంగతులు.ఇంతవరకు జరిగిన ఆటలలో,బాగా ఆడిన వారంతా విదేశీయులు,ఒక్క ధిల్లీ ఆట మినహాయిస్తే.మన సిమ్హాల అసలురూపన్ని మనకు నిక్కచ్చిగా చూపిస్తున్నాయీఆటలు.అయితే,ఇలా అనుకోవటం తొందరపాటు అవుతుందేమో.ఇంకా బోలెడన్ని ఆటలున్నాయి.చూద్దాం!కానీ,20-20ఆటలు మాత్రం తక్కువ సమయంలో,మామూలు కన్నా ఎక్కువ ఉత్తేజాన్ని ఇస్తున్నాయి.హాప్పీ వ్యూయింగ్!

April 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

పాపం ద్రావిడ్!

కొందరి అద్రుష్టం ఇంతే.వాళ్ళకు ప్రతిభ వుంటుంది కానీ ఎవ్వరూ గుర్తించేందుకు ఇష్ట పడరు.కానీ,అందరికీ వారి అవసరం వుంటుంది.అలాగని,వారి ప్రతిభ చూపించుకునే అవకాశం వస్తే,చిత్తుగా దెబ్బ తింటారు.అటువంటి దురద్రుష్టవంతుల్లో అగ్రస్థానం రాహుల్ ద్రావిడ్ దే.
రాహుల్ ఎప్పుడు బాగా ఆడినా అందరి ద్రుష్టి,వేరే మరో ఆటగాడిపయిన వుంటుంది.మొన్నకూడా,రాహుల్ పది వేల పరుగులను,సెహ్వాగ్,మూడు వందలు మింగేసాయి.అందరి ద్రుష్టి ప్రధానంగా,సెహ్వాగ్ పయినే వుండి పోయింది.ఇతర టెస్ట్ ఆటల్లో కూడా,అందరూ పిచ్చి షాట్లు కొట్టి అవుటయితే,రాహుల్ కు మాత్రం ఎవరయినా ఆడలేనంత అద్భుతమయిన బంతులొచ్చాయి.ముఖ్యంగా,అహ్మదాబాద్ రెండు ఇన్నింగ్స్ లోనూ,కాంపుర్ మొదటి ఇన్నింగ్స్ లోనూ ఆడలేనటువంటి బంతులొచ్చాయి.దాంతో,రాహుల్ వందకొట్టినా వుండే చిన్నచూపు సున్నాకు మరింత పెరిగింది.
నిన్న,20-20 ఆటలో కూడా,బ్రెండొన్ ఆట,జీవితంలో ఒక్కసారి అలా ఆడతారు.అదీ రాహుల్ జట్టుతో కావటం రాహుల్ దురద్రుష్టం.ఎందుకంటే,ప్రత్యర్ధి అలా ఆడినప్పుడు,ఎవరు మాత్రం చేసేదేమీ లేదు.ఎవరు ఓడిపోయినా,సానుభూతి తో చూస్తారేమో కానీ,రాహుల్ ఓడితే మాత్రం,నేరం రాహుల్ దే.
అతడు 20-20 కి పనికి రాడని,అతని పని అయిపోయిందనీ,వ్య్యాఖ్యలు వస్తున్నాయి.రాహుల్ అలోచనా పరుడయిన ఆటగాడు.కానీ మన దేశంలో,మాటలకు,అరుపులకు వున్న విలువా,మౌనానికి,ఆలోచనకు లేదు.అదీగాక,అతడికి అద్రుష్టం లేదు.గెలుపు అన్ని అవలక్షణాలను కప్పి పుచ్చుతుంది.ఓటమి,మంచిని కూడా,పనికిరానిదిగా చేస్తుంది.అందుకే,అంగట్లో అన్నీవున్నా,రాహుల్ గతి మాత్రం,అయ్యో పాపం! 

April 19, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నేను చదివిన మంచి పుస్తకం-4

కాళీ పట్ణం రామారావు గారి పేరు వినని తెలుగు పాఠకులు వుండరు.ముఖ్యంగా,కథ పయిన ఏమాత్రం ఆసక్తి వున్నవారయినా ఆయన గురించి,కథానిలయం పేరిట ఆయన కథకు చేస్తున్న సేవ గురించి వినే వుంటారు.ఇటీవలె కథా నిలయం వెళ్ళినప్పుడు ఆయన నాకు బహుమతిగ ఇచ్చిన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.ఈ పరిచయం రెండు భాగాలలో చేస్తాను.మొదటి భాగంలో పుస్తక పరిచయం వుంటుంది.రెండవ భాగంలో కథల విశ్లేశణ,నిర్మొహమాటమయిన విశ్లేషణ వుంటుంది.
ఇంతకీ కాళీ పట్నం గారు నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం పేరు ‘కాళీపట్నం రామారావు రచనలు ‘

974 పేగీలు వున్న ఈ పుస్తకంలో కాళీపట్నం గారు రాసిన ప్రతి అక్షరం వుంది.ప్రకాశకుల మనవి పేగీ దాటగానే 1938 లో ఫోర్తు ఫారం లో రామారావు గారు చదువుతున్నప్పటి ఫొటో వుంది.అది చూస్తూంటే గమ్మత్తు అనిపిస్తుంది.ఈనాడు ఎదురుగా వున్న 87 ఏళ్ళ మనిషిని ఆ ఫొటో లో వెతుకుతాం.
కొడవగంటి కుటుంబరావు,రాచకొండ విశ్వనాథ శాస్త్రి,వేల్చేరు నారాయణరావు గారు వంటివారి ముందుమాటలతరువాత అసలు పుస్తకం మొదలవుతుంది.
ఈ పుస్తకాన్ని 1924-48,1949-55,1956-67,1968-72,1973-92 నుంచి ఇప్పటి వరకు అనే భాగాలుగా విభజించారు.ప్రతి భాగం ఆరంభంలో ఆ పీరియడ్‌లో రామారావుగారి జీవితంలో ప్రధాన సంఘటనలు,ఆయన చేసిన రచనలపయిన,ఆయా సంఘటనల వలన ఆయన ఆలోచనలలో కలిగిన మార్పులూ వివరించిన తరువాత,ఆ కాల పరిథిలో ఆయన చేసిన రచనలు పొందు పరిచారు.ఇందువల్ల,రచయితగా ఆయన ఎదిగిన వైనం,జీవితంలో కలిగిన మార్పులు ఆయన ఆలోచనలపయి ప్రభావం చూపిన విధానం తెలుసుకునే వీలు కలుగుతుంది.అంటే,మామూలు మనిషి ఒక రచయితగా రూపు దిద్దుకోవటం,రచయిత ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటం,తన రచనలతో సమాజాన్ని ప్రభావితం చేయటం గ్రహించే వీలు పాఠకుడికి కలుగుతుందన్నమాట!ఒక పద్ద్ధతి ప్రకారం రచయిత రచనలలో కలిగే మార్పులను తెలుసుకొనే వీలు కలుగుతుందన్నమాట.వెరసి,రచయితగా రామారావు గారి రచనా సంవిధానాన్ని గ్రహించటమే కాకుండా,వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకునే వీలు కలుగుతుందన్నమాట.
ఈ పుస్తక్లో గొప్ప గుణమేమిటంటే,రామారావుగారిని ఆకాశానికి ఎత్తేయక పోవటం.సాధారణంగా,ఎవరినయినా పొగడాలంటే,మనవారు ఇంద్రుడు,చంద్రుడు,దేవుడు అన్నట్టే పొగడుతారు.అందుకు భిన్నంగా రామారావు గారి గురించి ఒక్క అతిశయోక్తి లేదు.ఆడంబర విశేశణాలగణాలు లేవు. ఉన్నది ఉన్నట్టు సరళంగా,సూటిగా చెప్పటం కనిపిస్తుంది.ఆపయిన కథలను పాఠకుడి ఎదురుగా పెట్టి,ఎవరి బుద్ధికి తోచినట్టు వారు గ్రహించే వీలు కల్పించారు.ఇక్కడే రామారవుగారి వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది.ఆయన ఎంత నిరాడంబరుడో అంత నిగర్వి అని అర్ధమవుతుంది.ఆయన వూ అంటే,పొగడ్తల ప్రభంజనాలు పొర్లించేందుకు బోలెడంతమంది సిద్ధంగా వున్నారు.కానీ ఆయన వారందరిని అదుపులో వుంచి,తనని తన కథలలో వెతుక్కోమన్నారు.తన కథల గురించి ఎవరికి వారే అభిప్రాయాలు ఏర్పరచుకునే వీలు కల్పించారు.ప్రక్రుతి తన గొప్పతనం తానే చెప్పుకోదు.మనుషులు గ్రహిస్తారు.అలా,ఈ పుస్తకంలో రామారావుగారి గొప్పతనం ఎవరో చెప్పితే కాదు,పాఠకడు తనతట తాను గ్రహిస్తాడు.
ఈ పుస్తకానికి వివిన మూర్త్య్,సై సంపాదకత్వం వహించారు.వెల,పేపెర్ బాక్-150/-,హార్డ్ కవెర్-300/-.ఈ పుస్తకంలోని కథల నిర్మొహమాట,నిష్పక్షిక విశ్లేశణ మరోసారి.   

April 17, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

పత్రికలూ-బ్లాగులూ-రచయితలూ!

ఇటీవలే ఒక బ్లాగులో ప్రతివారూ విమర్శకులయిపోతున్నారని చులకనగా రాసినది చదివాను.బాధ అనిపించింది.ఎందుకంటే,బ్లాగు రచనకు పత్రికల రచనకు తేడా వుంది.పత్రికలలో సంపాదకులుంటారు.బ్లాగులలో బ్లాగరే సంపాదకుడు.వ్యంగ్యంగా అన్నా ఎవరి బ్లాగుకు వారే సుమన్ అన్నది అక్షరాలా నిజం.
ఒక రచన పత్రికలో పడాలంటే ఎటువంటి పరిచయాలు లేని రచయిత ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సివుంటుంది.ఎంతో అవేదనకు గురి కావాల్సివుంటుంది.ఒకోసారి ఇన్ని బాధలు పడుతూ ఎందుకు రాస్తున్నాడో రచయితకే అర్ధం కాదు.రాయటం మానేయాలనుకుంటాడు.కాని రచన అనేది ఒక తీరని దాహం.రాయకుండావుండలేను వాడే రచయిత అవుతాడు.రాయాలనుకున్నా అవరోధాలను అధిగమించలేనివారు రచయితలు కాలేరు.అందుకే ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటూ కూడా రచయితలు రచనలు చేస్తూనే వుంటారు.
నేను రచనలు ఆరంభించిన కొత్తల్లో నా అనుభవాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే ఆస్చర్యం వేస్తుంది.ఒకింత గర్వం కలుగుతుంది కూడా!
ముందుగా,ఒక చోట కూర్చుని ఏదయిన రాయగలగటం ఒక యఞానికేమీ తక్కువ కాదు.పెన్ను దొరకదు.కాగితాలు నచ్చవు.అన్నే కుదిరితే రాయాలనుకున్నది ఆవిరయిపోతుంది.ఎవరో వొస్తారు.ఏదో పని వస్తుంది.ఏదో చికాకు కలుగుతుంది.ఇవన్నీ దటుకుని రచన పూర్తి చేస్తే దాన్ని ఎవరికి పంపాలో అన్నది సమస్య.కొన్ని పత్రికలు సంవత్సరాల తరబడి రచనలు దగ్గర పెట్టుకుంటాయి.స్వీకరించరో,తిరస్కరించారో తెలపవు.ఒకటికి రెండు సార్లు అడిగితే,మీ కథ తీసుకుపొమ్మంటాడు.అందుకని ఎదురుచూస్తాం.మంచి మూడులో వుంటే స్వీకరించాం.వీలువెంబడి ప్రచురిస్తాం అంటారు.ఆ వీలు కోసం ఎదురుచూడాలి.ఏమయినా అంటే రచయిత కోపం కథకు చేటు.
ఇక కొందరువుంటారు వారికి ఏ కథ నచ్చదు.రచయితను నాలుగుమార్లు తిప్పుకుని,మార్పులు చేయించి,వాడి అహాన్ని అణగద్రొక్కితేగాని రచన ప్రచురించరు.చివర్లో మళ్ళీ వాళ్ళ స్వంత పయిత్యం చూపందే వారికి సంత్రుప్తిరాదు.వారు ఎంతకు ఎదుగుతారంటే అనువాద కథలో కూడా మార్పులు సూచిస్తారు.
ఒకసారి నేను తొలివేకువ అనేపదం వాడితే,మీరు సంస్క్రుతం రాస్తే ఎవరికి అర్ధమవుతుందండి?అని చీవాట్లు పెట్టి ఆ పదం స్థానంలో పల్లవించు అన్న పదం వుంచాడు.ఇది అసలు సంస్క్రుత పదం అన్నందుకు నా కథ పనికి రానిదయిపోయింది.
ఇంకా కొందరుంటారు.ఇదిగో వేస్తాం,అదిగో వేస్తాం అంటూ ఆరు సంవత్సరాలు గడిపి బాగాలేదండి అని వాపస్ ఇచ్చేస్తారు.అప్పటికి మనకు ఇంకా రాయాలని వుంటే మనం గొప్ప రచయితలమే!
ఇవన్నీ ఒకేత్తు,సంపాదించేవాడే సంపాదకుడు అనేవారు ఒక ఎత్తు.కథ వేస్తే నాకేంటట అంటారు?మనం తెల్ల మొహం వేస్తే మన కథ ఇంటికే.ఏమయినా సమర్పించుకోవాలి.బహుమతి దబ్బులు వద్దన్నవాడికి బహుమతులొస్తాయి.అన్నిటి పయిన మమకారాలు వదలుకుని,కేవలం అచ్చులో పేరు చూసేందుకు ఏమయినా చేసేందుకు సిద్ధంగా వున్న వారి కథలు పుంఖాను పుంఖాలుగా పడతాయి.జీ హుజూర్ భత్రాజులకు బాధలేదు.ఇజాలలో,వుద్యమాలలో,పెద్దవారి పరిచయస్తులు,మంచి వుద్యోగాలు వున్నవారు ఇటువంటి వారికి సమస్యలుండవు.ఈమధ్య ఎన్నారయిల రచనలను ప్రత్సహించటం ద్వారా విదేశీ ట్రిప్పులకెళ్ళవచ్చని వారికథల ప్రచురణ ఎక్కువవుతోంది.ఎన్నారయిలు కూడా స్వయంగా ఇక్కడకువచ్చి చూడలేరు కాబట్టి వారి పరిచయస్తులను నమ్ముతారు.డబ్బులిచ్చి టీవీలలో కనబడేవారు,డబ్బులుచ్చి కథలు నవలలు వేయించుకునేవారికి నో ప్రోబ్లెంస్.అలాకాక కేవలం ప్రతిభ పయిన ఆధార పడేవారికి చేదు అనుభవాలు మిగులుతాయి.

మిగతావారు మమూలు కథ రాస్తే సరిపోతుంది.మాలాంటివారు అద్భుతమయిన కథ రాస్తే తప్ప ప్రచురణకు నోచుకోదు.దాంతో అద్భుతంగా రాయటం అలవాటయిపోతుంది.ఇక్కడే మామూలు రచయితకు అసలు రచయితకు తేడా తెలుస్తుంది.
అయితే కథ ప్రచురణతో కథ అయిపోదు.దాన్ని చదివి స్పందించే వారు దొరకరు.అందరూ కాంప్లిమెంటరీ అడుగుతారు.కథ పడ్డందుకు దబ్బులురావు.కొంప్లిమెంటరీలకు ఖర్చవుతుంది.ప్రచురితమయిన కథని బ్రతికించుకోవాలంటే కథల సంకలనం అచ్చు వేయలి.కథ రాస్తే ఒక్క పయిసా రాదుకాని,అచ్చుకి వేలు ఖర్చు అవుతాయి.మళ్ళీ అందరూ కొంప్లిమెంటరీ అడుగేవారే.చదివి అభిప్రాయం ఎవ్వరూ చెప్పరు.
నేను ఎంతో క్లుప్తంగా రచయితల బాధలు వివరించాను.
ఒక పత్రికలో తన కథకు వేసిన బొమ్మను చూసి రచయిత బాధ పడ్డడు.సంపాదకుడిని కలిసి తన భ్యంతరం చెప్పాడు.దానికి అతడి సమాధనం ఏమిటంటే,మీ కథకు తగ్గ బొమ్మ వేసే పత్రికలొ ఐక పయిన కథలు రాయండి.
మరో సందర్భంలో తన కథ అచ్చులో వచ్చిన తప్పులను రచయిత చూపాడు.దానికి సమాధానం మీ చేతిరాత బాగాలేదు.డిటిపి చేసి పంపండి.
ఇదిగో ,ఇలాంటి అనేక బాధలుంటాయి.ముఖ్యంగా మీ కథ ఎంత గొప్పదయినా ఆ కుర్చీలో కూచున్నవాడికి నచ్చక పోతే అది ఎందుకూ పనికి రానిదే.
బ్లాగులో ఇలాంటి బాధలు లేవు.నాకు నచ్చింది నేను రాస్తాను.మీకు నచ్చితే చదువుతారు.లేకపోతే పట్టించుకోరు.స్పందన నాకు వెంటనే తెలుస్తుంది.అందుకే వారానికి యేడు వేర్వేరు పత్రికలలో యేడు వేర్వేరు శీర్శికలు రస్తూకూడా వారానికి యేడు రఒజులు బ్లాగులో ఏదోఒకటి పోస్ట్ చేస్తున్నాను.ఇప్పుడే రాత కూడా ఏ పత్రికలోనూ రాయలేను.బ్లాగు కాబట్టి ఇంత స్వేచ్చగా రాస్తునాను.
ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు.నావి ఇన్ని ఎలా ప్రచురితమవుతున్నాయని.దీని వెనుక పదహారేళ్ళ నిరంతర పోరాటం వుంది.అదీగక నా అద్రుష్టం బాగా   వుంది.నన్ను నా ప్రతిభను చూసి నిస్వార్ధంగా ప్రోత్సహించే వారు ఆ సమయానికి ఆయా స్థానాలలో వుండటం దైవికం.అందుకే రోజూ సరస్వతీ దేవికి నమస్కరిస్తూంటాను.నా బాధ్యతను,కర్తవ్యాన్ని సంక్రమంగా నిర్వహించేట్టు చేయమని ప్రార్ధిస్తూంటాను.నా పరిధిలో వీలయినంత రచయితలకు సహాయం చేస్తూంటాను.బాగారాసే రచయితలపయిన పాఠకుల ద్రుష్టి ప్రసరింపచేస్తూంటాను.కాబట్టి బ్లాగులలో ఎవరు రాయాలి,ఎందుకు రాయాలీ అని ఆక్షేపించేకన్న,వ్యక్తి కి సంపూర్ణ భావ వ్యక్తీకరణ వున్న బ్లాగులను ప్రోత్సహించాలి.నిర్మొహమాటమయిన అభిప్రాయాలతో సూచనలు చేయాలి.అయితే,ఎవరి బ్లాగుకు వారే సుమన్లయినా ఎవరికి వారు విచక్షణని సమ్యమనాన్నీ పాటించాలి.ఒకరికొకరు చేయూతనిస్తూ కలసి ముందుకు సాగాలి.

April 15, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized