Archive for April 8, 2008

డెవిల్ వేర్స్ ప్రాదా

కొన్ని సినిమాలు మొదటి దృశ్యం నుంచే ఆకర్షిస్తాయి.ఆరంభ సన్నివేశమునుంచే కథలో  లీనమయిపోతాము.పాత్రలతో తాదాత్మ్యం చెందుతాము.పాత్రల అనుభవాలు మనవి అవుతాయి.పాత్రల ద్వారా మనము మరో ప్రపంచములో విహరిస్తాము.మన ప్రపంచాన్ని అర్ధం చేసుకుంటాము.మన చుట్టూ వున్న సమాజం గురించి అవగాహనను ఏర్పరచుకుంటాము.అటువంటి అరుదైన అద్భుతమయిన సినిమాల జాబితాలో ‘డెవిల్ వేర్స్ ప్రాదా’ అనే సినిమా చేరుతుంది.
ఈ సినిమా కథ ఒక కోణము నుంచి చూస్తే మనకు అలవాటు అయినదే.ఒక అమ్మయకురాలు,కర్కోటకురాలి దగ్గర వుద్యోగానికి వస్తుంది.కొత్తలో కష్టాలు పడుతుంది.తరువాత అలవాటు పడుతింది.అధికారి ఆంతరంగికురాలు అవుతుంది.ఇటువంటి కథలు కోకొల్లలు.ఇటువంటి సినిమాలు కూదా బోలెడు చూశాము గతంలో.కానీ అటువంటి మామూలు సినిమాల స్థాయిని దాటి,ఉత్త్మచిత్రంగా ఈ సినిమా ఎదగటములో రెండు అంశాలు తోడ్పడ్డాయి.స్క్రిప్టు,నటీనటుల నటన అనే  రెండు అంశాలు ఈ సినిమాను ఎలివేట్ చేస్తాయి.
రాక్షసి అధికారిణిగా మెరిల్ స్ట్రీప్ అద్భుతంగా నటించింది అని చెప్పటం అందరికీ తెలిసిన విశయాన్నే మళ్ళీ చెప్పటం అవుతుంది.ఈ నటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఈ పాత్ర వేస్తే ఆ పాత్ర తానే అయిన భావనను కలిగిస్తుంది.టేబులు పయికి కోటు విసిరేయటం నుంచి చివరలో నాయికను చూసి నవ్వుకోవటం వరకూ ప్రతి సన్నివేశాన్ని తనదయిన రీతిలో సజీవం చేస్తుందీ మహా నటి.కళ్ళలో భావాలు అద్భుతంగా మారుతూంటాయి.వేయి పదాలు స్పశ్టం చేయలేని అమ్షాలను పెదవి విరుపుతో,చేతి ముడుపుతో,చిన్న కదలికతో ఈ నటి ప్రదర్శించిన తీరు నటన నేర్చుకోవాలనుకునేవారికి పాఠ్యపుస్తకంలా పనికివస్తుంది. ఒక వ్యక్తి ఇలా విభిన్నపాత్రలలో దూరి నటించగలగటం అమోఘం అనిపిస్తుంది.అయితే ఇంత గొప్ప నటి వున్నా స్క్రిప్టులో వొదిగి నటించింది తప్ప స్క్రిప్టు ఆమెకోసమని తయారుచేయలేదు. ఇక్కడే మనకు,వారికీ తేదా స్పశ్టమవుతుంది.వారు స్క్రిప్టును బట్టి నటులను ఎంచుకుంటే మనకు నటులు వుంటే చాలు స్క్రిప్ట్ అవసరం లేదు.
నాయిక పాత్రకు అన్న హథవే సరిగ్గా సరిపోయింది.అమాయకంగా,పెద్ద పెద్ద కళ్ళతో పాత్రోచితంగా నటించింది.ఆ పాత్ర పట్ల మనకు సానుభూతి కలగటంలో ఈ నటి తన వంతు బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించింది. ఇతర నటీ నటులు కూడా బాగా నటించి సినిమా స్థాయిని పెంచారు.దర్షకుడి ప్రతిభ అడుగడుగునా తెలుస్తూంటుంది.నగర ద్రుశ్యాలను చూపిన తీరు,అన్నా పాత్రలోని మార్పును చూపిన విధానము,మెరిల్ పాత్రను మలచిన తీరు సమ్మోహులను చేస్తాయి.ఎడిటింగ్ కూడా వుత్తమ స్థాయిలో వుంది.ముఖ్యంగా,మెరిల్ పాత్ర కోటును అన్నా పయికి విసిరేసిన ద్రుశ్యాలను తెరకెక్కించిన విషానము వారి ప్రతిభకు తార్కాణం.
ఈ సినిమా చక్కని సందేశం కూదా ఇస్తుంది.కారీర్ కావాలనుకునే వారు మిగతా అన్ని అంశాలను పక్కకు నెట్టేయాలి.అనుభంధాలు,ఆప్యాయతలు,మంచి చెడు మీమాంసలు,ఉచుతానుచితాలు మరచిపోవాలి.జాలి దయ లేని డెవిల్ లా మారాలి.అలా కాలేని వారు తమ ప్రాధాన్యాలను నిర్నయించుకోవాలి.తాము తమకు సంత్రుప్తి నిచ్చే పనులను చేస్తూ అనామకులుగా మిగిలినా బాధ పడకూడదు.లేదా,మానవ సంబంధాల కన్న వ్యక్తిగత కారీర్ అభివ్రుద్ధికే పెద్ద పీట వేయాలి.ఎవరేమన్న పట్టించుకోకూడదు.కరీర్కోసం అన్ని వదలిన పాత్ర మెరిల్.అన్నిటి కోసం కారీర్ను వదలిన పాత్ర అన్నా.ఈ రెండు పాత్రల ద్వార ఈ సినిమా ఒక గొప్ప సత్యాన్ని చూపుతుంది.ప్రపంచవ్యాప్తంగా మగ వారు కారీర్ కోసం ఏమి చేసినా ఎవరూ ఏమీ అనుకోరు.అదే ఒక మహిళ కరీర్ కి ప్రాధాన్యం ఇస్తే ఆమె దెవిల్ అవుతుంది.మనకన్న ఈ అంశంలో అమెరికన్లు ఎంతో వెనుకబడి వున్నారు.ఈ మనస్తత్వం వల్లనే ఇప్పుడు అమెరికన్లు హిల్లరీ వ్యతిరేకత చూపుతున్నారు. ఇలా,ఒక మామూలు సినిమాలో మానవ మనస్తత్వాన్నీ,సామజిక అపోహలను,వ్యక్తిగత ఆకాంక్షలను అతి సుందరముగా చూపే ఈ సినిమాను అందరూ తప్పనిసరిగా చూడాలి.ఆలోచించాలి.మంచి కథలు కాదు,మంచి స్క్రిప్ట్ సినిమాకు అయువుపట్టు అని దానికి తగ్గ నటన తోడయితే అది ఉత్తమ సినిమా అవుతుందని అర్ధంచేసుకుంటే కథలు లేవనే మన కళాకారుల ఏడుపులోని మొసలి కన్నీళ్ళు గ్రహింపుకు వస్తాయి.అందరికీ ఉగాది శుభాకాంక్షలు..

 

April 8, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.