Archive for April 9, 2008

కొత్తపాళీ ఆలోచనకు నా లోచనాలు!

జీవిత పరమార్ధం ఏమిటని కొత్తపాళీ ఇచ్చిన ఆలోచన ఆధారంగా జరిగిన చర్చ చూశాను.చర్చలో నేనూ పాల్గొనాలని అనుకున్నాను.ఇంతలో ఒక సంఘటన జరిగింది.ఈ రాతకు నాందీ ప్రస్తావన అయ్యింది.
నిన్న రాత్రి నిద్రపట్టలేదు. అర్ధరాత్రి అందరూ హాయిగా,ప్రశాంతంగా నిద్రిస్తున్నారు.ఇంటి బయటకు వచ్చాను.అలవాటుగా బాల్కొనీలో పచార్లు మొదలుపెట్టాను.
అంతా నిశ్శబ్దం.జగతి సర్వం ముడుచుకుని పడుకున్న భావన.చెట్ల ఆకుల పయిన వెలుతురు గాఢ నిద్రపోతోంది.ఆకాశంలో తారలు నల్లటి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాయి.ఉద్యంపూట అందంగా కనిపించే మామిడి తోట చిక్కని చీకటి ముద్దలా కనిపిస్తోంది.జడలు విరబోసుకున్న రాక్షసుల్ల అనిపిస్తున్నాయి నల్లతి ముద్దల్లంటి చెట్లు.ఎందుకో తెలియని భయం మనసులో కలిగింది.అంతలోనే,ఇంత ప్రశాంతత రోజూ రాత్రి మన చుట్టూ వుంటే మనము అనుభవించలేముకదా అనిపించింది.చీకటిలో ఎంతో అందం వుంది.దీపాల వెలుగు వల్ల ప్రాక్రుతిక సౌందర్యాన్ని అనుభవించలేకపోతున్నాము.ఇటువంటి రాత్రి,అందరూ ఇళ్ళల్లో దీపాలు ఆర్పివేయటంవల్ల కేవలం తారల వెలుతురులో జగతి అస్పశ్టమయిన అందంతో అలరారుతోంది.
అంతలో ఒక ఆలోచన వచ్చింది.అప్పుడు హఠాత్తుగా నా గుండె ఆగిపోతే………
ప్రపంచానికి ఏమీ నష్టంలేదు. ఇవే రాత్రులు,ఇవే తారకలు,ఇవే గాలులు,ఇవే దారులు….మారితే పథికులు మారతారు.అంతే!ఇంతేనా మనిషి జీవితం?సోమర్సెట్ మాం అంటాడు,గాలిలో కలిసి పోయే పొగ లాంటిది జీవితం అని.అంతేనా?
నావాళ్ళు బహుశా కొన్ని రోజులు ఏడుస్తారు.ఆ తరువాత ఎవరి జీవితం వారిది.ఎవరి కోసం ఆగని సూర్యుడు వస్తూనే వుంటాదు.ఎందుకూ ఆగని భూమి తిరుగుతూనే వుంటుంది.
మరి నేను,ఈ నేను అనే నేను, ఏమవుతుంది?
నా శరీరం ఏమవుతుందో తెలుసు.కానీ నాకేమవుతుందో తెలియదు.
అంతలో ఒక దోమ నా మీద వాలింది.వెంటనే దాన్ని కొట్టాను.అది చఛ్ఛింది.దోమ చచ్చింది.దానిలోని చైతన్యం ఏమయింది?నేనూ అంతేగా?
ఎలాగో అనిపించింది.నేను అలా నుంచుంటే,నా లోపల నా ప్రమేయం లేకుండా,అనుక్షణం కొట్టుకునే గుండె దయా దాక్షిణ్యాల పయిన ఆధారపడివున్నాను అన్న ఆలోచన బలంగా తాకింది.అవును నా ఊపిరిపయి నాకు నియంత్రణ లేదు.నా ఆలోచనలపయి నియంత్రణ లేదు.నా గుండె పయి నియంత్రణ లేదు.దేన్నీ నియంత్రించలేని నేను నా తోటి మనవుడిని నియంత్రించి నా ఆధిక్యం చాటాలనుకుంటాను.అందరికన్నా అధికుడనని అందరూ గుర్తించాలని తపన పడతాను.అప్పుడు నాకు అర్ధమయింది.
ప్రపంచంలో నిజమయిన అందం ప్రశాంతమయిన జీవనంలో వుంది.మనిషి తనలోని మనిషితో,సాటి మనుషులతో సమన్వయం సాధించి,ఎటువంటి అసూయలు,ఆరాటాలు,ఆవేష కావేషాలు  లేకుండా హాయిగా ప్రశాంతంగా జీవించటాన్ని మించిన లక్ష్యం, అందం మరొకటి లేదు.
మనిషి జీవితం అల్లిన తివాచీ వంటిది.దాన్లో నైపుణ్యం వుంటుంది.ప్రతిభ వుంటుంది.పద్ధతి వుంటుంది.అందం వుంటుంది.ఆనందం వుంటుంది.మనిషి చేయాల్సిందల్ల తన తివాచీ రూపు రేఖలని గుర్తించి అనుసరించటమే.
పల్ప్ ఫిక్షన్ సినిమాలో వాడు దొంగ.ప్రాణం ప్రమాదంలో పడితే కానీ వాడికి ఆలోచనలు రావు.కానీ,మనలాంటి మామూలు మనుషులను ఈ ఆలోచనలు అనుక్షణం వెంటాడుతూ వుంటాయి.అనేక పనులు క్రింద నలిగి వున్నా అవకాశం దొరకగానే తలెత్తుతాయి. అల్లకల్లోలం చేసి వెళ్తాయి.
శరత్ చంద్ర నవల శ్రీకాంత్ లో బర్మా ప్రయాణ సంఘటన,గంగా నదిలో సంఘటనలు,నవలలోని అనేకానేక సంఘటనలలో ఇటువంటి ఆలోచనలు కనిపిస్తాయి. ఇవి ప్రతి మనిషి మనసులోని మౌలిక ఆలోచనలు.మనిషి చేయవలసిందల్లా, ఒక్క క్షణం ఆగి తనలోకి చూసుకుంటే చాలు!            
     

April 9, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized