Archive for April 15, 2008

పత్రికలూ-బ్లాగులూ-రచయితలూ!

ఇటీవలే ఒక బ్లాగులో ప్రతివారూ విమర్శకులయిపోతున్నారని చులకనగా రాసినది చదివాను.బాధ అనిపించింది.ఎందుకంటే,బ్లాగు రచనకు పత్రికల రచనకు తేడా వుంది.పత్రికలలో సంపాదకులుంటారు.బ్లాగులలో బ్లాగరే సంపాదకుడు.వ్యంగ్యంగా అన్నా ఎవరి బ్లాగుకు వారే సుమన్ అన్నది అక్షరాలా నిజం.
ఒక రచన పత్రికలో పడాలంటే ఎటువంటి పరిచయాలు లేని రచయిత ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సివుంటుంది.ఎంతో అవేదనకు గురి కావాల్సివుంటుంది.ఒకోసారి ఇన్ని బాధలు పడుతూ ఎందుకు రాస్తున్నాడో రచయితకే అర్ధం కాదు.రాయటం మానేయాలనుకుంటాడు.కాని రచన అనేది ఒక తీరని దాహం.రాయకుండావుండలేను వాడే రచయిత అవుతాడు.రాయాలనుకున్నా అవరోధాలను అధిగమించలేనివారు రచయితలు కాలేరు.అందుకే ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటూ కూడా రచయితలు రచనలు చేస్తూనే వుంటారు.
నేను రచనలు ఆరంభించిన కొత్తల్లో నా అనుభవాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే ఆస్చర్యం వేస్తుంది.ఒకింత గర్వం కలుగుతుంది కూడా!
ముందుగా,ఒక చోట కూర్చుని ఏదయిన రాయగలగటం ఒక యఞానికేమీ తక్కువ కాదు.పెన్ను దొరకదు.కాగితాలు నచ్చవు.అన్నే కుదిరితే రాయాలనుకున్నది ఆవిరయిపోతుంది.ఎవరో వొస్తారు.ఏదో పని వస్తుంది.ఏదో చికాకు కలుగుతుంది.ఇవన్నీ దటుకుని రచన పూర్తి చేస్తే దాన్ని ఎవరికి పంపాలో అన్నది సమస్య.కొన్ని పత్రికలు సంవత్సరాల తరబడి రచనలు దగ్గర పెట్టుకుంటాయి.స్వీకరించరో,తిరస్కరించారో తెలపవు.ఒకటికి రెండు సార్లు అడిగితే,మీ కథ తీసుకుపొమ్మంటాడు.అందుకని ఎదురుచూస్తాం.మంచి మూడులో వుంటే స్వీకరించాం.వీలువెంబడి ప్రచురిస్తాం అంటారు.ఆ వీలు కోసం ఎదురుచూడాలి.ఏమయినా అంటే రచయిత కోపం కథకు చేటు.
ఇక కొందరువుంటారు వారికి ఏ కథ నచ్చదు.రచయితను నాలుగుమార్లు తిప్పుకుని,మార్పులు చేయించి,వాడి అహాన్ని అణగద్రొక్కితేగాని రచన ప్రచురించరు.చివర్లో మళ్ళీ వాళ్ళ స్వంత పయిత్యం చూపందే వారికి సంత్రుప్తిరాదు.వారు ఎంతకు ఎదుగుతారంటే అనువాద కథలో కూడా మార్పులు సూచిస్తారు.
ఒకసారి నేను తొలివేకువ అనేపదం వాడితే,మీరు సంస్క్రుతం రాస్తే ఎవరికి అర్ధమవుతుందండి?అని చీవాట్లు పెట్టి ఆ పదం స్థానంలో పల్లవించు అన్న పదం వుంచాడు.ఇది అసలు సంస్క్రుత పదం అన్నందుకు నా కథ పనికి రానిదయిపోయింది.
ఇంకా కొందరుంటారు.ఇదిగో వేస్తాం,అదిగో వేస్తాం అంటూ ఆరు సంవత్సరాలు గడిపి బాగాలేదండి అని వాపస్ ఇచ్చేస్తారు.అప్పటికి మనకు ఇంకా రాయాలని వుంటే మనం గొప్ప రచయితలమే!
ఇవన్నీ ఒకేత్తు,సంపాదించేవాడే సంపాదకుడు అనేవారు ఒక ఎత్తు.కథ వేస్తే నాకేంటట అంటారు?మనం తెల్ల మొహం వేస్తే మన కథ ఇంటికే.ఏమయినా సమర్పించుకోవాలి.బహుమతి దబ్బులు వద్దన్నవాడికి బహుమతులొస్తాయి.అన్నిటి పయిన మమకారాలు వదలుకుని,కేవలం అచ్చులో పేరు చూసేందుకు ఏమయినా చేసేందుకు సిద్ధంగా వున్న వారి కథలు పుంఖాను పుంఖాలుగా పడతాయి.జీ హుజూర్ భత్రాజులకు బాధలేదు.ఇజాలలో,వుద్యమాలలో,పెద్దవారి పరిచయస్తులు,మంచి వుద్యోగాలు వున్నవారు ఇటువంటి వారికి సమస్యలుండవు.ఈమధ్య ఎన్నారయిల రచనలను ప్రత్సహించటం ద్వారా విదేశీ ట్రిప్పులకెళ్ళవచ్చని వారికథల ప్రచురణ ఎక్కువవుతోంది.ఎన్నారయిలు కూడా స్వయంగా ఇక్కడకువచ్చి చూడలేరు కాబట్టి వారి పరిచయస్తులను నమ్ముతారు.డబ్బులిచ్చి టీవీలలో కనబడేవారు,డబ్బులుచ్చి కథలు నవలలు వేయించుకునేవారికి నో ప్రోబ్లెంస్.అలాకాక కేవలం ప్రతిభ పయిన ఆధార పడేవారికి చేదు అనుభవాలు మిగులుతాయి.

మిగతావారు మమూలు కథ రాస్తే సరిపోతుంది.మాలాంటివారు అద్భుతమయిన కథ రాస్తే తప్ప ప్రచురణకు నోచుకోదు.దాంతో అద్భుతంగా రాయటం అలవాటయిపోతుంది.ఇక్కడే మామూలు రచయితకు అసలు రచయితకు తేడా తెలుస్తుంది.
అయితే కథ ప్రచురణతో కథ అయిపోదు.దాన్ని చదివి స్పందించే వారు దొరకరు.అందరూ కాంప్లిమెంటరీ అడుగుతారు.కథ పడ్డందుకు దబ్బులురావు.కొంప్లిమెంటరీలకు ఖర్చవుతుంది.ప్రచురితమయిన కథని బ్రతికించుకోవాలంటే కథల సంకలనం అచ్చు వేయలి.కథ రాస్తే ఒక్క పయిసా రాదుకాని,అచ్చుకి వేలు ఖర్చు అవుతాయి.మళ్ళీ అందరూ కొంప్లిమెంటరీ అడుగేవారే.చదివి అభిప్రాయం ఎవ్వరూ చెప్పరు.
నేను ఎంతో క్లుప్తంగా రచయితల బాధలు వివరించాను.
ఒక పత్రికలో తన కథకు వేసిన బొమ్మను చూసి రచయిత బాధ పడ్డడు.సంపాదకుడిని కలిసి తన భ్యంతరం చెప్పాడు.దానికి అతడి సమాధనం ఏమిటంటే,మీ కథకు తగ్గ బొమ్మ వేసే పత్రికలొ ఐక పయిన కథలు రాయండి.
మరో సందర్భంలో తన కథ అచ్చులో వచ్చిన తప్పులను రచయిత చూపాడు.దానికి సమాధానం మీ చేతిరాత బాగాలేదు.డిటిపి చేసి పంపండి.
ఇదిగో ,ఇలాంటి అనేక బాధలుంటాయి.ముఖ్యంగా మీ కథ ఎంత గొప్పదయినా ఆ కుర్చీలో కూచున్నవాడికి నచ్చక పోతే అది ఎందుకూ పనికి రానిదే.
బ్లాగులో ఇలాంటి బాధలు లేవు.నాకు నచ్చింది నేను రాస్తాను.మీకు నచ్చితే చదువుతారు.లేకపోతే పట్టించుకోరు.స్పందన నాకు వెంటనే తెలుస్తుంది.అందుకే వారానికి యేడు వేర్వేరు పత్రికలలో యేడు వేర్వేరు శీర్శికలు రస్తూకూడా వారానికి యేడు రఒజులు బ్లాగులో ఏదోఒకటి పోస్ట్ చేస్తున్నాను.ఇప్పుడే రాత కూడా ఏ పత్రికలోనూ రాయలేను.బ్లాగు కాబట్టి ఇంత స్వేచ్చగా రాస్తునాను.
ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు.నావి ఇన్ని ఎలా ప్రచురితమవుతున్నాయని.దీని వెనుక పదహారేళ్ళ నిరంతర పోరాటం వుంది.అదీగక నా అద్రుష్టం బాగా   వుంది.నన్ను నా ప్రతిభను చూసి నిస్వార్ధంగా ప్రోత్సహించే వారు ఆ సమయానికి ఆయా స్థానాలలో వుండటం దైవికం.అందుకే రోజూ సరస్వతీ దేవికి నమస్కరిస్తూంటాను.నా బాధ్యతను,కర్తవ్యాన్ని సంక్రమంగా నిర్వహించేట్టు చేయమని ప్రార్ధిస్తూంటాను.నా పరిధిలో వీలయినంత రచయితలకు సహాయం చేస్తూంటాను.బాగారాసే రచయితలపయిన పాఠకుల ద్రుష్టి ప్రసరింపచేస్తూంటాను.కాబట్టి బ్లాగులలో ఎవరు రాయాలి,ఎందుకు రాయాలీ అని ఆక్షేపించేకన్న,వ్యక్తి కి సంపూర్ణ భావ వ్యక్తీకరణ వున్న బ్లాగులను ప్రోత్సహించాలి.నిర్మొహమాటమయిన అభిప్రాయాలతో సూచనలు చేయాలి.అయితే,ఎవరి బ్లాగుకు వారే సుమన్లయినా ఎవరికి వారు విచక్షణని సమ్యమనాన్నీ పాటించాలి.ఒకరికొకరు చేయూతనిస్తూ కలసి ముందుకు సాగాలి.

April 15, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized