Archive for April 17, 2008

నేను చదివిన మంచి పుస్తకం-4

కాళీ పట్ణం రామారావు గారి పేరు వినని తెలుగు పాఠకులు వుండరు.ముఖ్యంగా,కథ పయిన ఏమాత్రం ఆసక్తి వున్నవారయినా ఆయన గురించి,కథానిలయం పేరిట ఆయన కథకు చేస్తున్న సేవ గురించి వినే వుంటారు.ఇటీవలె కథా నిలయం వెళ్ళినప్పుడు ఆయన నాకు బహుమతిగ ఇచ్చిన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.ఈ పరిచయం రెండు భాగాలలో చేస్తాను.మొదటి భాగంలో పుస్తక పరిచయం వుంటుంది.రెండవ భాగంలో కథల విశ్లేశణ,నిర్మొహమాటమయిన విశ్లేషణ వుంటుంది.
ఇంతకీ కాళీ పట్నం గారు నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం పేరు ‘కాళీపట్నం రామారావు రచనలు ‘

974 పేగీలు వున్న ఈ పుస్తకంలో కాళీపట్నం గారు రాసిన ప్రతి అక్షరం వుంది.ప్రకాశకుల మనవి పేగీ దాటగానే 1938 లో ఫోర్తు ఫారం లో రామారావు గారు చదువుతున్నప్పటి ఫొటో వుంది.అది చూస్తూంటే గమ్మత్తు అనిపిస్తుంది.ఈనాడు ఎదురుగా వున్న 87 ఏళ్ళ మనిషిని ఆ ఫొటో లో వెతుకుతాం.
కొడవగంటి కుటుంబరావు,రాచకొండ విశ్వనాథ శాస్త్రి,వేల్చేరు నారాయణరావు గారు వంటివారి ముందుమాటలతరువాత అసలు పుస్తకం మొదలవుతుంది.
ఈ పుస్తకాన్ని 1924-48,1949-55,1956-67,1968-72,1973-92 నుంచి ఇప్పటి వరకు అనే భాగాలుగా విభజించారు.ప్రతి భాగం ఆరంభంలో ఆ పీరియడ్లో రామారావుగారి జీవితంలో ప్రధాన సంఘటనలు,ఆయన చేసిన రచనలపయిన,ఆయా సంఘటనల వలన ఆయన ఆలోచనలలో కలిగిన మార్పులూ వివరించిన తరువాత,ఆ కాల పరిథిలో ఆయన చేసిన రచనలు పొందు పరిచారు.ఇందువల్ల,రచయితగా ఆయన ఎదిగిన వైనం,జీవితంలో కలిగిన మార్పులు ఆయన ఆలోచనలపయి ప్రభావం చూపిన విధానం తెలుసుకునే వీలు కలుగుతుంది.అంటే,మామూలు మనిషి ఒక రచయితగా రూపు దిద్దుకోవటం,రచయిత ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటం,తన రచనలతో సమాజాన్ని ప్రభావితం చేయటం గ్రహించే వీలు పాఠకుడికి కలుగుతుందన్నమాట!ఒక పద్ద్ధతి ప్రకారం రచయిత రచనలలో కలిగే మార్పులను తెలుసుకొనే వీలు కలుగుతుందన్నమాట.వెరసి,రచయితగా రామారావు గారి రచనా సంవిధానాన్ని గ్రహించటమే కాకుండా,వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకునే వీలు కలుగుతుందన్నమాట.
ఈ పుస్తక్లో గొప్ప గుణమేమిటంటే,రామారావుగారిని ఆకాశానికి ఎత్తేయక పోవటం.సాధారణంగా,ఎవరినయినా పొగడాలంటే,మనవారు ఇంద్రుడు,చంద్రుడు,దేవుడు అన్నట్టే పొగడుతారు.అందుకు భిన్నంగా రామారావు గారి గురించి ఒక్క అతిశయోక్తి లేదు.ఆడంబర విశేశణాలగణాలు లేవు. ఉన్నది ఉన్నట్టు సరళంగా,సూటిగా చెప్పటం కనిపిస్తుంది.ఆపయిన కథలను పాఠకుడి ఎదురుగా పెట్టి,ఎవరి బుద్ధికి తోచినట్టు వారు గ్రహించే వీలు కల్పించారు.ఇక్కడే రామారవుగారి వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది.ఆయన ఎంత నిరాడంబరుడో అంత నిగర్వి అని అర్ధమవుతుంది.ఆయన వూ అంటే,పొగడ్తల ప్రభంజనాలు పొర్లించేందుకు బోలెడంతమంది సిద్ధంగా వున్నారు.కానీ ఆయన వారందరిని అదుపులో వుంచి,తనని తన కథలలో వెతుక్కోమన్నారు.తన కథల గురించి ఎవరికి వారే అభిప్రాయాలు ఏర్పరచుకునే వీలు కల్పించారు.ప్రక్రుతి తన గొప్పతనం తానే చెప్పుకోదు.మనుషులు గ్రహిస్తారు.అలా,ఈ పుస్తకంలో రామారావుగారి గొప్పతనం ఎవరో చెప్పితే కాదు,పాఠకడు తనతట తాను గ్రహిస్తాడు.
ఈ పుస్తకానికి వివిన మూర్త్య్,సై సంపాదకత్వం వహించారు.వెల,పేపెర్ బాక్-150/-,హార్డ్ కవెర్-300/-.ఈ పుస్తకంలోని కథల నిర్మొహమాట,నిష్పక్షిక విశ్లేశణ మరోసారి.   

April 17, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu