Archive for April 22, 2008

నేను చదివిన మంచిపుస్తకం- 4-కొనసాగింపు

1924-48 నడుమ,కాళీపట్ణం రామారావు గారు,23 కథలు రాశారు.1949-55 నడుమ 12 కథలు రచించారు.1956-67లలో,6 కథలు రచించారు.యఙ్నం ఈ ఆరు కథలలోనిదే!
ఇదే పుస్తకంలో,”కథ” అనే వ్యాసంలో,రామారావు గారు కథకు నిర్వచనం ఇచ్చారు.వృత్తాంతం,కథ కాదు అని తీర్మానించారు.బొమ్మకు,చిత్రానికి వుండే తేడా,కథకూ,వృత్తాంతానికీ వుంటాయని అన్నారు.వౄత్తాంతం ఎప్పుడు కథ అవుతుందంటే,”అంతర్గర్భిత విశేషాన్ని    వ్యక్తీకరించే వృత్తాంతమే కథ  కాగలదు.వ్యక్తీకరించటానికి ఏ విశేషమూ లేని  వృత్తాంతం ఒత్తి వృత్తాంతంగానే మిగిలిపోతుంది”.
మరో వ్యాసంలో,”వాస్తవాన్ని చెప్పగల రచనైనా అది హృదయాన్ని స్పృశించే వృత్తాంతం కాకుంటే కథ కాదు”,అన్నారు.
మొదటి నిర్వచనంతో సమస్య లేదు కానీ,రెండవ నిర్వచనంతో సమస్య వస్తుంది.
హృదయాన్ని స్పృశించటాన్ని ఎలా కొలుస్తాం?
 ఇంతకీ ఎవరి హృదయాన్ని స్పృశించాలి?
 పాఠకుల హృదయాలు అనటం తేలిక.కానీ ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఏకీభవించటం కష్టం.అటువంటిది,ఒక కథ విషయంలో ఎంత మంది అభిప్రాయాలను సేకరిస్తాం?
కాబట్టి,మనం విమర్శకుల పయిన ఆధార పడాల్సి వుంటుంది.విమర్శకులు నిష్పక్షపాతంగా విమర్శించేవారయితే సమస్య లేదు.వాళ్ళు రంగుటద్దాలు తగిలించుకుంటే సమస్య వస్తుంది.అటువంటప్పుడు,ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించి అధిక సంఖ్యాకులందామా?నిజం నంబర్లలో వుండదు అన్న తత్వవేత్త మాట విందామా?ఒక వేళ,ఆ వృత్తాంతం నా హృదయాన్ని కదిలించలేక పోతే,నేను కథ కాదంటే ఒప్పుకుంటారా?
నీ ఒక్కడికి నచ్చకుంటే నష్టం లేదు,పదిమందికి నచ్చితే చాలు,అంటే, కథకు సార్వజనీనమయిన నిర్వచనం ఇవ్వటం లో మనం విఫలమయినట్టే అవుతుంది.
కాళీపట్నం రామారావు గారి ఆరంభ రచనల విషయంలో నాకు కలిగిన మీమాంస ఇది.
అయితే,కాదెవరూ విమర్శకనర్హం అంటుంది మన సాంప్రదాయం.భగవద్గీత లో శ్రీ కృష్ణుడే అర్జునిడితో,అర్జునుడి బుద్ధికి విరుద్ధంగా తోచే మాట అంటే,అర్జునుడు అతడిని నిలదీస్తాడు.సంతృప్తి కరమయిన వివరణ ఇస్తే కానీ వదలడు.అంటే,భగవంతుడి నయినా ప్రశ్నించటం మన సాంప్రదాయమన్నమాట.ఒక వేళ,తర్కం ద్వారా నా పొరపాటు గ్రహించేట్టు ఏవరయినా చేస్తే,కృతఙతలు తెలియచేసుకుని,నా అభిప్రాయం మార్చుకుంటాను. అంతే కానీ నేను నిజమనుకున్న దాన్ని చెప్పే హక్కును మాత్రం ప్రశ్నించకూడదు.”నీతో ఏకీభవించకున్నా అభిప్రాయం వ్యక్త పరిచే నీ హక్కును నేను మన్నిస్తాను” అన్న తత్త్వవేత్త మాటను మననం చేసుకుంటూ అడుగు ముందుకు వేద్దాము.
రచనలను సంవత్సరం ప్రకారం వర్గీకరించినా,కథలను,స్కెచ్ లనుంచి వేరు చేయక పోవటంతో,కాస్త తిక మక కలుగుతుంది.స్కెచ్ లను కథలని భ్రమ పడతాం.కథలను స్కెచ్ లను కుంటాం.అయితే,ఆరంభ రచనలలో,మనకు రామారావు గారు తన చుట్టూ వున్న సమాజాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం కనిపిస్తుంది.మనుషులను గమనిస్తూ వారి మనస్తత్వాలను అంచనా వేయాలన్న తపన కనిపిస్తుంది.ఈ రచనలు భవిష్యత్తులో ఆయన చేయబోయే అద్భుతమయిన కథా రచనకు  తయారీ అనిపిస్తుంది.
అయితే,కథలలో ఆ కాలంలో ప్రచారంలో వున్న పాపులర్ ఆలోచనలను ప్రదర్శించటం కనిపిస్తుంది.సాధారణంగా,రచయితలు కొత్తల్లో ఎటువంటి కథలు సులభంగా ప్రచురితమవుతాయో చూసి అలాంటి కథలు రాస్తారు.ప్రాచుర్యంలో వున్న భావాలనే  ప్రకటిస్తారు.ఆరంభంలో కాళీపత్ణం రామారావుగారు ఇందుకు భిన్నం కాదని ఆయన ఆరంభ రచనలు నిరూపిస్తాయి.
భార్యను వేధించే భర్తలూ,పరాయి అమ్మాయిని ఆకలిగా చూసే పురుషులూ,పెళ్ళి చూపులను వ్యతిరేకించే యువతులూ,ఇంట్లో పడుండటాన్ని వ్యతిరకించే యువతులూ రామారావు గారి కథల్లో కనిపిస్తారు.ఒక రకంగా చూస్తే,భాషపయిన పట్టు,సరళమయిన శైలీ,భావ వ్యక్తీకరణలో లాలిత్యం వున్నా ఎటువంటి ప్రత్యేకత లేక ఆ కాలం లో వచ్చిన అనేక రచనలలాంటివే అనిపిస్తాయి తొలి రచనలు.
అవివాహితగానే వుండిపోతా కానీ….. అనే రచనలో 18ఏళ్ళ పిల్ల బలహీనుడు,పిరికిపంద,దరిదృడు,లోభి,పురుగు వంటి విశేషణాలతో తెలియని పురుషులందరినీ వర్ణించి,పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుంటుంది.ఈ కథ చాలు,రామారావు గారు ఆ కాలంలో ప్రచారంలో వున్న ఆలోచనలనే ప్రదర్శించారు తప్ప తనదయిన ప్రత్యేక అలోచనా పద్ధతిని అప్పటికి ఇంకా ఏర్పాటు చేసుకోలేదని అర్ధమవటానికి. రచయితగా ఆయన తనని తాను గుర్తిస్తున్న సమయం ఇది.తన శక్తిని,సృజనాత్మకతనూ అర్ధం చేసుకుంటున్న సమయం అది.దానిపయిన పూర్తిగా నియత్రణ సాధించని తరుణం అది.
వెనుక చూపు కథలో రామారావు గారి మనసులో ఆకాలం లో జరుగుతున్న సంఘర్షణ స్వభావాన్ని గమనించే వీలు కలుగుతుంది.ఇందులో,తాను మారటాన్ని గుర్తించి రచయిత ఆశ్చర్యపోవటం కనిపిస్తుంది.తనను ఓ పాత్రలో ఆరోపించి ప్రదర్శించటం రచయితలంతా చేసేదే!
1949 నుంచీ రామారావు గారి రచనలలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ఈ కథల గురించి మరోసారి.

April 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

వహ్వా,షేన్,వార్న్!

రాజస్థాన్ రాయల్స్ లో షేన్ వార్న్ తప్ప పేరున్న ఆటగాడు మరొకడు లేడని అందరి అభిప్రాయం.అదే,పంజాబ్ కింగ్స్ జట్టులో బ్రెట్ లీ,యువరాజ్,సంగక్కారా,జయవర్దనే లాంటి ఆటగాళ్ళు వున్నారు.కాబట్టి,గెలుపు యువరాజుదే నని అందరు పండితులు తీర్మానించేశారు.చివరికి,రాజస్థాన్ వారు కూడా ఇలాగే భావిస్తున్నారని,మునాఫ్ పటేల్ వ్యాఖ్యలు నిరూపించాయి.కానీ,ఆత్మవిశ్వాసం,నైపుణ్యం,గెలవాలన్న పట్టుదలలు వుంటే,అంచనాలతో,గణాంక వివరాలతో,పండితుల అభిప్రాయాలతో సంబంధం లేదని,షేన్ వార్న్,షేన్ వాట్సన్లు నిరూపించారు.జట్టు లో గెలవాలన్న పట్టుదలను కలిగించటమే కాకుండా,గెలుస్తామన్న నమ్మకాన్ని కలింగించి,వార్న్,నాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు.నయం,ఈయన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయివుంటే వారిని గెలవటం మరింత కష్టమయ్యేది!
ఒక వ్యక్తి ఆటను ఎలా ప్రభావితం చేయగలడో,వార్న్ ఈ ఆటలో చూపించాడు.రాజస్థాన్ జట్టు పెద్ద స్కోరు వయిపు పరుగుడుతూంటే,వరుసగా వికెట్లు తీస్తూ,20-20 ఆటలో ప్రతిభవుంటే,బౌలర్లదే పైచేయి అని నిరూపించాడు.అతడి బౌలింగ్లో యువరాజ్ ఇచ్చిన కాట్చ్ పట్టివుంటే,వారు వంద పరుగులు కూదా సాధించలేక పోయేవారు.బాట్స్మన్ ఆటగా పరిగణించే 20-20 లో బౌలర్దే పైచేయి అని చూపించాడు.
ఇక టార్గెట్ చేరేందుకు రాజస్థాన్ రాయల్స్ అడుగులు తడబడ్డా,షేన్ వాట్సన్ ఆటను దారి మళ్ళించాడు.అతడికి యువ ఆటగాడు జడేజా తోడవటంతో రాయల్స్ విజయం సాధించారు.
ఈ పోటీ ఒక విశయాన్ని స్పష్టం చేస్తుంది.క్రికెట్ ఆటలో మౌలికంగా ప్రావీణ్యం వుంటే,టెస్ట్ అయినా,50 ఓవర్లయినా,20-20 అయినా ఆటగాళ్ళకు ఇబ్బంది లేదు.ఇబ్బంది ఎవరికయినా వుంటే లోపం వాళ్ళలో తప్ప ఆటలో లేదు.ఇక,ఇది క్రికెట్టా,వ్యాపారమా అని ఈసడించేవారికి,ఒకటే సమాధానం.ఇది వ్యాపార యుగం.కళలే వ్యాపార మయమయినప్పుడు,క్రికెట్ వ్యాపారం అవటంలో ఆశ్చర్యం లేదు.
చూస్తూంటే,ఈ 20-20 ఆట క్రికెట్ స్వరూపాన్ని మార్చేసేట్టున్నాయి.ఒక రకంగా ఇది వాంచనీయం.మార్పు ప్రకృతి సహజం.తరాన్ని.కాలాన్ని బట్టి ఏదయినా మారుతుంది.కాబట్టి,మార్పును ఆహ్వానించాలి.అర్ధం చేసుకోవాలి.ఈ పోటీలవల్ల జరుగుతున్న మరో మంచి పరిణామం ఏమిటంతే,యువ ఆటగాళ్ళకు ఆట్Yఅ మెళకువలు తెలుస్తున్నాయి.వారికి అంతర్జాతీయంగా తమ స్థాయి తెలుస్తోంది.విదేశీయులు ఆటకు మానసికంగా ఎలా తయారవుతారో,తెలుసుకునే వీలు కలుగుతోంది.అయితే,ఈ ఙానాన్ని వారు ఇతర రకాల క్రికెట్ ఆడే సందర్భాలలో వాడుకోవటం లో వారి వ్యక్తి గత ప్రతిభ కనిపిస్తుంది.
ఇవాళ్ళ,జరిగే ఆటలో,శాహిద్ అఫ్రిది,గిల్క్రిస్ట్ లు కలసి ఓపెన్ చేయటం కోసం క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తునారు!

April 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్