Archive for April 24, 2008

పాటలో మాటలు,మాటల్లో మనసులు-యే రాత్ భీగీ భీగీ.

కొన్ని పాటలు మామూలు ప్రేమ పాటలే అయినా,తరచి చూస్తే,అనంతమయిన తాత్వికతను తమలో పొందుపరచుకునివుంటాయి. మమూలు ప్రేమ పాటలను,సార్వజనీన తాత్విక గీతాలుగా మలచటంలో,హిందీ గేయ రచయిత శైలేంద్ర సుప్రసిద్ధుడు.
ప్యార్ హువా,ఇక్రార్ హువా,పాటలో,చివరి చరణంలో,మైన రహూంగి,తుం న రహోగే,ఫిర్భి రహేగి నిషానియా,అనటంతోటే పాట స్వరూపం మారిపోతుంది.ప్రేమికుల ప్రేమ వాళ్ళిద్దరికే పరిమితం కాదనీ,అది,సమస్త మానవ సమాజనికీ చెందినదనీ,ప్రేమ ద్వారా,ఇరువురు భౌతిక శరీర ధారులు,తమ భౌతిక శరీర పరిధిని దాటి,అనంత కాలం జీవించ గలిగే,చిరంజీవులవుతరనీ,అద్భుతమయిన తాత్వికార్ధాన్ని చివరి పంక్తులు పాటకు ఆపాదిస్తాయి.భౌతికంగా వ్యక్తులు మరణించినా,వారు తమ సంతానం ద్వారా తరతరాలు జీవితులేకదా!ఇదీ శైలేంద్ర గొపాతనం.అటువంటి తాత్వికతను ప్రదర్శించే మరో పాట,చోరీ చొరేఅ సినిమాలోని “యే రాత్ భీగీ,భీగీ”.
సినిమాలో సందర్భం మమూలే.నాయికా నాయకులు వొంటరిగా వుండాల్సి వస్తుంది.అప్పటికి వారు ఇప్పటంత అభివృద్ధి చెందలేదు కాబట్టి,కలలుకనవచ్చు,ఇష్టం వొచ్చినట్టు గెంతవచ్చు అని వారికి తెలియదు.అందుకని.నాయకుడు,హాయిగా వుయ్యాల్లో వూగుతూ,చంద్రుడి వయిపు చూస్తూ,మనసులోని శృంగారావేదనను పాటలో ప్రకటిస్తాడు.ఆకాలంలో నాయికలు నాయకులకేమీ తీసిపోయేవారు కారు.తెలివితేటల్లో,సంస్కారాల్లో నాయకుడిని మించి వుండేవారు.ఇప్పటి నాయికల్లా వొళ్ళుచూపి గెంతటటానికి తప్ప మరెందుకూ పనికిరాని వారు కారు వారు.అందుకే,నాయకుడికి దీటుగా జవాబు ఇస్తుంది.మధురమయిన సృంగార గీతాన్ని వెలయిస్తుంది.
చిక్కటి ఈరాత్రి,మధురమయిన ప్రకృతి,ఆహ్లాదకరమయిన వాతావరణం చందౄడు నెమ్మదిగావుదయిస్తున్నాడు,అంటాడు నాయకుడు.వావీ వరుసలు లేకుండా వాంచించటం,లైంగిక పరమయిన మాటలే శృంగారంగా చలామణీ అవుతున్న కాలంలో గాలి,నేల,ఆకాశం,వెన్నెలలలో అసలు శృంగారం దాగివుందని సున్నితంగా గుర్తుకుతెస్తుందీపాట.మన్నాడే పాట అందుకోగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.దానికి శంకర్-జైకిషన్  గిటార్ మృదువుగా తాళం వేస్తుంది.
 మన్సులో మంట రగిలించి,ఏమీ ఎరగనట్టు వున్నాడెందుకు చంద్రుడు,ఈ రాత్రి తన సైగలతో నిద్ర పోనీయటంలేదేల,అంటుంది నాయిక,లతా,మనోహరమయిన స్వరంలో.
పల్లవి అయిపోగానే,ఈ మృదు,మధుర భావనలను వయోలిన్ల లయ ద్వారా కొనసాగిస్తూ,చరణాల్లోకి లాక్కు పోతారు శంకర్-జైకిషన్లు.ఈ జంట సంగీతంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇది.పాటనుంచి,ఇంటెర్ల్యూడ్ సంగీతాన్ని విడదీయలేము.పాటలోని పదాలు,వాయిద్యాల లయ ఒక అవిభాజ్యమయిన గాన రస ప్రవాహంలా ఎదగటం వీరి ప్రత్యేకత.ఆవారాహూన్ అనగానే,ఊహుహూహూ  అనకుండా వుండలేము.
మొదటి చరణంలో నాయకుడు,ప్రకృతి ని వర్ణిస్తాడు,చల్లగా మరులుగొలిపే రీతిలో గాలి వీస్తోంది.నీలి ఆకాశం.పూవులు వివశమయినట్టు మత్తుగా వున్నాయి.ఇంత అందమయిన ప్రకృతి ఎదురుగా వున్నా మనసులో మాత్రం ఏదో అశాంతి కలుగుతోంది అంటాడు.
ఇది ప్రతి వ్యక్తి అంతరంగ చిత్రం.పురుషుడికి స్త్రే సాంగత్యం మాత్రమే ప్రశాంతతను ఇవ్వగలదు.యవ్వనంలో,పురుషుడికి తన మనసు కోరే స్త్రీ గురించి స్పష్టమయిన ఆలోచన వుండదు.ఎవరో కావాలి.ఆ ఎవరో వీరు అని నిర్దిష్టంగా చెప్పలేడు.దాంతో,యవ్వనంలో వయసు చేసే బాధకు  ఈ మనసు బాధ తోడవుతుంది.ఒక గమ్మత్తు లాంటి మత్తు మనసును ఆవరిస్తుంది.గమ్మత్తయిన మతూ మరింత అశాంతిని కలిగిస్తుంది.ఈ భావాన్ని నాయకుడు వెలిబుచ్చాడు.సినిమాలో ఈసందర్భంలో నాయికా నాయకుల పరిచయం ఇంకా ప్రేమగా పరిణమించదు.కానీ,యువతిని చూడగానే పురుషుడి మదిలో కలిగే భావ సంచలనం వల్ల అశాంతి జనిస్తుంది.అందుకే ఎక్కడా హీరో ప్రేమ అన్న పదం ఉపయోగించలేదు.ఇంత సుందరమయిన ప్రకృతి వున్నా హృదయంలో ఎందుకో అశాంతి అని ఆలోచిస్తున్నాడు.ఆ అశాంతికి కారణం మనము చర్చించాము. మనకు ఇప్పుడు తెలుసు.ఆ వయసులో తెలియదు.
నాయకుడి ఆలోచనాత్మకయిన ప్రశ్నకు నాయిక దీటుగా,తాత్వికమయిన సమాధానం ఇస్తుంది.
జో దిన్ కి వుజాలేమే న మిల దిల్ ఢూంఢే ఐసే సప్నేకో
ఇస్ రాత్ కి జగ్ మగ్ మే డూబీ మై ఢూంఢ్ రహీహూ అప్నేకో
అంటుంది.ఈ పాటలో ఇది కీలక మయిన చరణం.మానవ మనస్తత్వాన్ని విప్పి చూపే ఛరణం.శైలేంద్ర రచన చాతుర్యానికి,భావ గాంభీర్యానికి,తాత్వికతకు దర్పణం పడుతుందీ చరణం.మమూలు ప్రేమ పాటను తాత్విక శిఖరాలకు చేర్చే కవి అమోఘమయిన ప్రతిభకు తిరుగు లేని నిదర్శనం ఈ పాట.మంచి పాటకు సందర్భాలు దొరకటంలేదు అనేవారి చేతకాని తనానికి అద్దం పడుతుందీ పాట.
సాధారణంగా ప్రతి మనిషికీ ఒక కల వుంటుంది.ఆ కల ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి నిదర్శనం.ఒకో సారి వ్యక్తికి ఇది తన కల నిర్దిష్టంగా తెలియదు.దాని స్వరూపం తెలిసేవరకు,అతడు ఆవేదనకు,తనకే తెలియని,కారణం లేని అవేదనకు గురవుతూంటాదు.కానీ ఆ కల ఉదయపు వెలుతురులో దొరకదు.ఎందుకంటే,ఉదయపు వెలుతురులో అనేక విశయాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ప్రలోభంలో పడి మనల్ని మనమే మరచి పోతాము.కానీ రాత్రి ప్రశాంతతలో,వొంటరిలో,ప్రాకృతిక సౌందర్యం పరిమళిస్తూన్న సమయంలో,మనిషి తనలోకి తాను చూసుకోగలిగితే తన కల స్వరూపం అర్ధమవుతుంది.తన వ్యక్తిత్వం తనకు బోధపడుతుంది.నాయిక ఇదే అంటోంది.
నాయిక యువతి.ఆ వయసులో వుండే,కలలు కొరికలు ఆమెనీ కలవర పెడుతున్నాయి.అందుకే,ఈ ప్రశాంత రాత్రిలో,ఉదయపు వెలుతురులో ఎంత వెతికినా లభించని స్వప్నాన్ని స్వప్నాన్ని తనలో తాను తనను వెతుక్కుంటోంది.ఎందుకంటే,ఆ కల అర్ధమయితే,తనకు తాను అర్ధమవుతుంది.అందుకే రాత్రి జిలుగు వెలుగులలో మునిగి తనని తాను వెతుక్కున్నాను అంటోంది నాయిక.తరచి చూస్తే అనంతమయిన తాత్వికత.లేక పోతే యుగళ గీత్మ్.అంతే.(ఈ పదాల ఆధారంగా నేను ఆంధ్ర భూమి మాస పత్రికలో “స్వప్న వాసంతం”అనే నవల రాశాను.)
నాయిక జవ్వబు నాయకుడికి అర్ధమయింది.అమే తన లాంటి మానసిక స్థితిలోనే వుందని గ్రహించాడు.అందుకే,చివరి చరణంలో,ఈ విశాల ప్రపంచంలో పొరపాటునయినా తనను గుర్తుచేసుకునే వారు లేరా? అని అంటాదు.సమాధానంగా ఒక చిరునవ్వుతో స్వప్న ప్రపంచాన్ని సజీవ్ చేసేవారెవరూ లేరా అంటుంది నాయిక.వారి ప్రేమకు ఇది నాందీ ప్రస్తావన.
ఇదీ శైలేంద్ర గేయ రచన చాతుర్యానికి ఒక చిన్న ఉదాహరణ.తరచి చూస్తే,మమూలు మాటలలో,నిగూఢంగా వున్న మనసు మాటలు వినిపిస్తాయి.ఇటు వంటి మనసు మాటలనేకం మన కవులు పాటలలోని మాటలలో పొందుపరిచారు.వాటిని విశ్లేషిద్దాం. కలసి అనందిద్దాం.      

April 24, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.