Archive for April 29, 2008

ఈ సినిమా చూడండి-Mr.HOLLAND'S OPUS

మంచి సినిమాలు తీయాలని వున్నా మంచి కథలు దొరకటంలేదని మనవారు వాపోతూంటారు.అదే సమయంలో,నాటకీయతను సృష్టించాలని స్క్రిప్ట్ రచయితలను వేధిస్తూంటారు.అనేక గంభీరమయిన సన్నివేశాలను నాటకీయత లేదని తిరస్కరిస్తూంటారు.ఇక,ఏదయినా కథ చెప్పగానే,ఇది ప్రేక్షకులకు పట్టదని పెదవి విరుస్తారు.కనీ,తరచి చూస్తే నిత్య జీవితంలో వున్నంత నాటకీయత,ఉద్విగ్నత,సస్పెన్సులు కల్పనలో కూడా వుండవు.కళ్ళు తెరచి చూస్తే,నిజ జీవితంలో వుండే అద్భుతమయిన డ్రామా,తెరపయిన కృత్రిమంగా సృష్టించిన మెలో డ్రామాలో వుండదు.ఈ నిజాన్ని స్పష్టం చేస్తుంది,రిచర్డ్ డ్రైఫస్ నటించిన ‘మిస్టెర్ హాలండ్స్ ఓపస్ ‘. మమూలు సంఘటనలను కూడా మధురమయిన మెలో డ్రామాలుగ మార్చి,ప్రేక్షకుల హృదయాలను కదిలించగలిగే శక్తివంతమయిన సన్నివేశాలుగా మలచ వచ్చని ఈ సినిమా నిరూపిస్తుంది.
ఈ సినిమాలో నాయకుడు మనలాంటివాడే.ఏవేవో చేయాలంకుంటాడు.తన ప్రతిభ ప్రదర్శన ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందాలనుకుంటాడు.గొప్ప సంగీతకారుడవ్వాలని వుంటుంది అతనికి.కానీ,తాత్కాలికంగా,పొట్ట నింపుకోవటానికి ఒక పాఠశాలలో సంగీతం నేర్పే అధ్యాపకుడిలా చేరతాడు.అతడికి పాఠాలు చెప్పటం అంటే విసుగు.పిల్లలను చూస్తే చిరాకు.అతడి ప్రవర్తనను గమనించిన ప్రినిసిపాల్ ఒక రోజు అతడితో అంటుంది.” పిల్లలకు విఙానం ఇవ్వటమే కాదు,ఆ విఙానానికి ఒక దిశను ఇవ్వటం కూడా అధ్యాపకుడి బాధ్యతనే” అని.ఇది నాయకుడిలో ఆలోచన కలిగిస్తుంది.నెమ్మదిగా, పిల్లలలో నేర్చుకోవాలన్న ఆకాంక్షను గుర్తిస్తాడు.వారిలో ఆసక్తిని రగిలిస్తాడు.అతడికి మరో కోలీగు ఫిసికల్ ఎడ్యుకేషన్ టేచెర్ తో దోస్తీ ఏర్పడుతుంది.ఇంతలో అతని భార్య గర్భవతి అవుతుంది.అంటే,కొన్నాళ్ళకోసం చేయలనుకున్న ఉద్యోగం ఇప్పుడు జీవితాంతం చేయాల్సి వస్తుందన్నమాట.చేసేదిలేక,దీన్లోనే ఆనందం పొందుతూంటాడు.కనీసం తన కొడుకుకి సంగీతం నేర్పి తాను సాధించలేనిది తన సంతానం ద్వారా సాధించాలనుకుంటాడు.ఇక్కడా విధి ఎదురుతిరుగుతుంది.అతడి సంతానానికి చెవులు వినిపించవు.ఈ నిరాశలో పూర్తిగా పనిలో నిమగ్నమవుతాడు.కొడుకుకు నేర్పలేనిది విద్యార్థులకు నేర్పి సంతృప్తి పొందుతాడు.ఇంతలో ఒక అమ్మాయి అతడిని ఆకర్షిస్తుంది.తన కలను నిజం చేసుకునేందుకు పారిపోతూ నాయకుడినీ రమ్మంటుంది.కానీ,తన పరిమితులు గుర్తించిన నాయకుడు ఆమెకు సహాయం చేస్తాడు కానీ అమెతో పారిపోడు.
ఇలా కాలం గడుస్తూంటుంది.కాలేగీలో కళల విభాగం అవసరంలేదని నాయకుడికి ఉద్వాసన చెప్తారు.దాంతో,ఇన్నళ్ళూ తాను సాధించింది ఏమీ లేదని,తన జీవితం వ్యర్ధమనీ భావిస్తాడు.తన వస్తువులు తీసుకుని వెళ్ళిపోతూంటే,ఆడిటోరియం నుంచి సంగీతం వినిపిస్తుంది.అతడి వద్ద చదువునేర్చుకున్న పాట విద్యార్థులంతా,అతడికి వీడ్కోలు పలికేందుకు వస్తారు.అతడి జీవితం వ్యర్ధం కాదని,తమ జీవితాలను ఆయన ప్రభావితం చేశాదని,ఆయన రచించిన సంగీతంలో రక రకాల వాయిద్యాలు తామని అంటారు.ఆయన రచించిన సింఫోనీని వాయిస్తారు.ఇదీ ఈ సినిమా కథ.
నిజానికి ఇలా చెప్తే ఏముందే సినిమాలో అనిపిస్తుంది.కానీ సినిమా చూస్తూంటే,కళ్ళు చెమ్మగిల్లితాయి.హృదయం బరువెక్కుతుంది.అనేక సందర్భాలలో ఎనలేని ఆలోచనలు ఉధృతమయిన తరంగాలుగా ఎగస్తాయి.
ముఖ్యంగా,తన కొడుకుకు చెవులు వినపడవని తెలిసిన సన్నివేశం,తాను కష్టపడి సంగీతం నేర్పిన ప్రతిభావంతుడయిన విద్యార్థి,యుద్ధంలో చనిపోయాడని తెలిసిన సన్నివేశం,తండ్రి,కొడుకుల నడుమ ఉద్విగ్నతలు,కొడుకు కోసం తండ్రి ప్రత్యేక ప్రదర్శన నివ్వటం  వంటి దృశ్యాలు,విద్యార్థినిలో ఒకేసారి తాను కోల్పోయిన ఆశల స్వరూపాన్ని,తనలో అణగారిన కోరికలనిఉ దర్శించి,బాధ్యతా యుతంగా వ్యవరించిన సన్నివేశాలు అద్భుతమయినవి.మనకు తెలియకుండానే మన్ల్ని మనం చూసుకుంటాము.మనకి మనము అర్ధమవుతాము.మన ప్రమేయం లేకుండానే మనలో కలిగే అశాంతికి కారణం మనకు అర్ధమవుతుంది.
అయితే,ఈ సినిమాలో రెండు దృష్యాలు మాత్రం పరమాద్భుతమయినవి.
చివరి సన్నివేశం సినిమాకే తలమానికమయినది.ఏ వ్యక్తి జీవితం వ్యర్ధం కాదు.ముఖ్యంగా ధ్యాపక వృత్తిలో వున్న వ్యక్తి జీవితం వ్యర్ధం అసలే కాదు.అతని ప్రభావంతో అనేకులు తమ జీవితాలను తీర్చి దిద్దుకుంటారు. ఈ అర్ధాన్నిచ్చే చివరి సన్నివేశం ఎదను ద్రవింప చేస్తుంది.హృదయం ఉప్పొంగేట్టు చేస్తుంది.సినిమా మనసులను కదిలించాలంటే,యుద్ధాలు,ప్రేమలు ఏడ్పులు పెడబొబ్బలు అవసరం లేదు.మమూలు మనిషి జీవితంలోని అతి మామూలు సంఘటనలోని అర్ధాన్ని వివరిస్తే చాలు అని నిరూపిస్తుందీ దృష్యం.
ఈ సినిమాలో అనేకాలోచనలు కలిగించే సన్నివేశం,కళలను కాలేగీలోంచి తొలగించే సందర్భంలో నాయకుడు వాదించే దృశ్యం.కళలు వ్యక్తులలో సున్నితభావనలను కలిగిస్తాయి.అటువంటి వాటికి వారిని దూరం చేయటమంటే,మనం ఆలోచనలు భావనలు లేని మర మనుషులను తయారు చేయటమే నన్న వాదన నిజం.మనము మన పిల్లలను చదువు పరీక్షలకు పరిమితం చేస్తూ వారిని సున్నితభావనలకు ఎల దూరం చేస్తున్నమో అత్యంత ప్రతిభావంతంగా బోధపరుస్తుందీ దృశ్యం.
ఈ సినిమలో రిచర్డ్ నటన అద్భుతం.సినిమాకు స్క్రిప్ట్ ప్రాణం.నెపధ్య సంగీతం అమోఘం.దర్శకుడి ప్రతిభ ఆదుగడుగునా కనిపిస్తూంటుంది.సన్నివేశ సృష్టీకరణ,చిత్రీకరణ,ఎడిటింగ్లు ఉత్తమ స్థాయిలో వున్నాయి.ఎటువంటి మెలో డ్రామా లేకుండా,సామాన్య జీవితాన్నే  అతధ్భుతమయిన డ్రామా గా మలచి ప్రదర్శించిన ఈ సినిమని తప్పకుండా చూడండి.ఆనందించండి.ఆలోచించండి.కళ ప్రధానోద్దేశ్యం వినోదంతో పాటు,ఆలోచనను విచక్షణనూ నేర్పటం.ఆ ఉద్దేశ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిన్స్తుందీ సినిమా.

April 29, 2008 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: sinemaa vishleashaNaa.