Archive for May, 2008

ఫైనల్స్ లో రాయల్స్.నీ గతేమిటి చెన్నై?

తొలి సెమి ఫైనల్ ఆట అనుకున్న రీతిలోనే సాగింది.టాస్ గెలవటం ఒక్కటే ఈ ఆటలో సెహ్వాగ్ చేసిన సరయిన పని.20-20 లో మంచి బాటింగ్ జట్టు ఎప్పుడూ ముందు బాటింగ్ చేయటం మంచిది.ఎందుకంటే,ఎంత గొప్ప ఆటగాళ్ళు వున్న జట్టయినా,ఎదురుగా,200 పరుగుల లక్ష్యం వుంటే తడబడక తప్పదు.మొదలు ఆడే జట్టు ఒక రెండు వికెట్లు పడ్డా చూసుకుని ఆడి వీలుచిక్కగానే స్కోరు పెంచవచ్చు.రెండోసారి ఆడే జట్టుకు ఆ సౌలభ్యం వుండదు.ఒక వికెట్ పడి,రెండు బంతులలో పరుగులు తీయక పోతే,ఒత్తిడి పెరిగి పోతుంది.దాంతో తొందర పడాల్సి వస్తుంది.ఆ తొందరలో మరొక వికెట్ పడితే,అంతా గోవిందా.నిన్న డిల్లీ విషయంలో జరిగింది ఇదే.
192 పరుగులు లక్ష్యం.సెహ్వాగ్ త్వరగా ఔట్ అయ్యాడు.దాంతో మిగతా వారి మీద ఒత్తిడి పెరిగింది.ఎదురుగా భారీ లక్ష్యం కనిపిస్తోంది.దాంతో ప్రతి బంతినీ బాదిపారెయాలన్న తొందర చూపారు.ఫలితంగా వెంట వెంటనే వెనుతిరిగారు.ఓడి ఇంటి దారి పట్టారు.
రాజస్థాన్ రాయల్స్ కూడా టాస్ గెలిచివుంటే ముందు బౌలింగ్ తీసుకునే వారు.కానీ ముందు బాటింగ్ చేయాల్సి వచ్చింది.గమనిస్తే,మొదటి మూడు ఓవర్లలో వాళ్ళు తొందర పడి బాదేయలేదు.జాగ్రత్తగా ఆడారు.వీలు చిక్కినప్పుడు పరుగులు తీసారు.అంతే తప్ప మొదతి బంతినుంచే బాదుడు ఆరంభించలేదు.కాస్త అలవాటవగానే విజృంభించారు.మూడు ఓవర్లలో 30 పరుగులు కూడా లేని వారు,6 ఓవర్లయ్యేసరికి 60 పరుగులు దాటారు.గ్రేం స్మిథ్ ఆట,అస్నోద్కర్ ఆట తీరు పరసోర విరుద్ధ మయినా,ఇద్దరి నడుమ మంచి సమన్వయం వుంది.సెహ్వాగ్.గంభీర్ లిద్దరూ మంచి జోడీ అయినా విఫలం కాకుండా నిలకడగా ఆడటంలో వీరిద్దరే ఉత్తములు.షేన్ వాత్సన్ ఆట రూపు రేఖలను మార్చేశాడు.యౌసుఫ్ పఠాన్ జాతీయ టేంలో ఈన్నికను సిక్సులు కొట్టి సంబరాలు జరుపుకున్నాడు.దాంతో,రాజస్థాన్ వారు హాయిగా,ఎటువంటి తొందరలు లేకుండా 192 సాధించగలిగారు.గమనిస్తే,ఆన్ని జట్ల లోకీ పూర్తిగా 20-20 ఆట తత్వాన్ని అర్ధం చేసుకున్నది ఈ జట్టే అనిపిస్తుంది.ప్రతి ఒక్క ఆటగాడికీ తాను చేయవలసింది తెలుసు.ఒకరు విఫలమయితే వెంటనే ఆ బాధ్యతను మరొకరు భుజానికి ఎత్తుకుంటున్నారు.కొందరు విఫలమన్న మాట తలపెట్టక జట్టు విజయానికి కారకులవుతున్నారు.మొన్న పంజాబ్ వారితో ఓడటంతో దిష్టి తీసేసినట్టయింది.మళ్ళీ ఫైనల్లో పంజాబ్ తో జరిగే ఆటలో రాజస్థాన్ వారు అసలు ఆట ఆడతారు.కప్పు గెలుచుకుంటారు అనిపిస్తోంది.
ఇవాళ్ళ జరిగే మరో ఆటలో చెన్నై జట్టుకు గెలవాలన్న పట్టుదల వుంది.గెలిచే శక్తి వుంది.కానీ రాజస్థాన్ వారు కూడా 20-20 ఆటను బాగా ఆకళింపు చేసుకున్నారు.మార్ష్ కనక బాఘా ఆడితే,సెహ్వాగ్,సంగకార,జయవర్దనేలు నిలబడితే-చెన్నై ఎదురు నిలబడటం కష్టం.పంజాబ్ జట్టు క్రమం తప్పకుండా ఉత్తమ స్థాయి ఆట ప్రదర్షిస్తూ ఈ స్థాయికి వచ్చారు.చెన్నై జట్టు ఇందుకు భిన్నంగా అప్పుడప్పుడే మంచి ఆట చూపింది.కాబట్టి పంజాబ్ గెలిస్తేనే న్యాయం జరిగినట్టు అవుతుంది.అయితే,దేవుడి కొలబద్దలు వేరు.కాబట్టి ఏమవుతుందో ఎదురుచూడటం తప్ప మార్గం లేదు.అయితే,అందాల ప్రీతి జింటా ఆనందంగా,బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతూ.నృత్యం చేస్తూంటే చూడాలని వుంది.కాబట్తి నా వోటు పంజాబ్ కే.ఎంతయినా,అందమే ఆనందం అన్నారు పెద్దలు.అదీగాక,ఎటువంటి భేషజాలు లేక హాయిగా ఆనందించగలిగేవారు ఎందరున్నారు.అలా ఆనందించేవారిని మరింత ఆనందింపచేయటంలో ఇంకెంతో ఆనందం వుంది.అవునా?

May 31, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

నిన్న నేను గంధర్వుడి గానం విన్నాను!

నిజం!నిన్న నేను గంధర్వుడి గానం విన్నాను.నాకు గంధర్వుడి గానం ఎలా వుంటుందో తెలియదు.కానీ మనకు తెలియని విశయాలు,అనుభవానికి రాని అంశాలు,అనుభవించిన వారి ద్వారా గ్రహించవచ్చంటుంది శాస్త్రం.అలాంటి పెద్దవారి అనుభవాలు విని,చదివి గంధర్వ గానం ఎల్లా వుంటుందో ఒక అభిప్రాయానికి వచ్చాను.అయితే,నిన్న నేను విన్న గానం నా ఊహలను మించింది.గంధర్వ గానం గురించి నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నిటినీ తుడిచి పెట్టి నూతన నుభూతినీ,అనుభవాన్నీ మిగిల్చింది.
నిన్న నేను సికింద్రాబాద్ లో జరిగిన బాల మురళీ కృష్ణ గాన కచేరీకి వెళ్ళాను!

నిజానికి,నా మితృడు పిలిచినప్పుడు వెళ్ళకూడదనే అనుకున్నాను.టీవీలో చూస్తూంటాను.కాసెట్లో,సీడీలో వింటూంటాను.అంతదూరం వెళ్ళి చూడాలా,అనుకున్నాను.కానీ రాస్తున్న నవల ఒక మెలిక కదలకపోవటంతో మార్పు వుంటుందని వెళ్ళాను.నా జీవితానికి ఒక అమూల్యమయిన,అపురూపమయిన, అద్వితీయమయిన అనాందానుభూతిని సంపాదించుకున్నాను.
సముద్రాన్ని బొమ్మల్లో చూడటం వేరు.సినిమాలో చూడటం వేరు.అనంత నీలి ఆకాశం నీడలో,అప్రతిహతంగా ఎగసిపడే అలలతో నిత్య సంచలనాలతో,కనిపించే అనంత పాథోరాశిని ప్రత్యక్షంగా చూడటం వేరు.
సముద్రం ఎదురుగా కూచుని,ఉవ్వెత్తున తాకే అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతూ కూడా,ఇంకా ఇంకా సముద్ర లోతులలోకి వెళ్ళి ఆ అనంత శక్తి విరాట్స్వరూపాన్ని అనుభవించాలన్న ఆతృత కలిగినట్టే,బాల మురళీ గాన అనంత రస ప్రవాహంలో లోతులలోకి వెళ్ళి అద్భుతాలను అనుభవించాలన్న కోరిక కలిగింది.ఆయన సృజించిన రస ప్రవాహంలో ఉక్కిరి బిక్కిరయి,తీయ తెనియ మాధుర్యము అనుభవిస్తూ నా ప్రాణాలు విడవటాన్ని మించిన ఆనంద్మ్ మరొకటి లేదనిపించింది.
హిమాలయాల్లో,14000 అడుగుల ఎత్తున మంచు తుఫానులో ఇరుక్కున్నప్పుడు సృష్టి అపరిమిత శక్తి గ్రహింపుకు వచ్చి నేనెంత అల్పుడనో అర్ధమయింది.అనంత పాథోరసిముందూ అలాంటి భావనే కలిగింది.ఇప్పుడు బాల మురళీ గానం వింటూంటే అలాంటి భావన కలిగింది.
నేను సంగీతాన్ని అనుభవించగలవాడనే తప్ప శాస్త్రీయంగా తెలిసిన వాడను కాదు.రాగాల మాధుర్యాన్ని అనుభవించగలను తప్ప రాగాలు తెలియదు నాకు.స్వరాల తీయదనం గుర్తించగలను తప్ప స్వర స్వరూపం గ్రహించలేను.కానీ నిన్న ఆయన గానం ప్రత్యక్షంగా వింటూంటే నా ఇంద్రియాల పరిథి విస్తృతమయిన భావన కలిగింది.నాలో నాకే తెలియని రాగాల స్పందనలు నిర్దిష్ట రూపం ధరించాయి. స్పష్టమయిన ఆకారంతో నన్ను చేయి పట్టుకుని వింత వింత లోకాలకు తీసుకు పోయాయి.నాలో ఇంత గాఢమయిన భావనుభూతి వుందని నాకు అప్పుడే అర్ధమయింది.
ఇంతకాలం నాకు సంగీతమంటే చిన్న చూపు వుండేది.సంగీతం అస్పష్ట కళ.కేవలం రాగంతో వ్యక్తి సంపూర్ణ భావానుభూతి పొందలేడు.దానికి సాహిత్యం తోడవకుంటే సంగీతానికి నిర్దిష్ట స్వరూపం లేదు అనుకునే వాడిని.కానీ ఆ అభిప్రాయం పటాపంచలయింది.ఒక పదాన్ని మానవ కంఠ స్వరం ఎన్ని విధాలుగ పలుక గలదో,ఎన్ని చిత్ర విచిత్ర పోకడలు పోగలదో,ఎన్నెన్ని వింత వింత అనుభూతులు సృజించగలదో,ఆత్మ లోతులలో ఎన్నెన్ని విభిన్న స్పందనలు కలిగించగలదో నిన్న తెలిసింది.అనుభవమయింది.మానవ స్వరమే కాదు,దానితో పోటీగా మానవ కళా నైపుణ్యం,జీవం లేని వాయిద్యాలను సజీవం చేసి మానవ స్వరానికి దీటుగా రాగాలు పలికించగలగటం తెలిసింది.ఆ కళాకారుల కళ ఆత్మ అర్ధమయింది.

భారతీయ ధర్మంలో కళ ఏదయినా అది భగవంతుడిని చేరే మార్గం.కళ ద్వార కళాకారుడు తన ఆత్మలోని లోలోతు స్పందనలను బహిర్గత పరుస్తాడు.ధన్యుడవుతాడు.ఆ కళను అనుభవించటం ద్వారా వ్యక్తి కళాకారుడి భావావేశంతో తాదాత్మ్యం చెందుతాడు.తానూ తరిస్తాడు.తనలో నిలచివున్న ఆత్మ స్వరూపాన్ని గ్రహిస్తాడు.ఆధ్యాత్మిక జ్యోతిని దర్శిస్తాడు.సాహిత్యమయినా,చిత్రలేఖనమయినా,గానమయినా,కళ పరమార్ధం ఇదే.అందుకే కళలు సరస్వతీ స్వరూపాలు.ఆ సరస్వతీ వీణా నాదానికి మానవ కంఠ రూపం బాల మురళీ కృష్ణ.
నిన్నటితో సంగీతం పయిన నా అభిప్రాయం మారిపోయింది.గంధర్వ గానం రాయిని కూడా కరగిస్తుంది.మోడును చిగురింప చేస్తుంది.ఎడారిలో వసంతాన్ని చిగురింపచేస్తుంది.మనిషి ఆత్మకు రెక్కలిస్తుంది.శారీరక పరిథిని దాటి వినీల విశాల విహాయసంలో వీర విహారం చేసే శక్తినిస్తుంది. అందుకే బాల మురళీది గంధర్వ గానం.ఆయన గాన గంధర్వుడు.ఆయన గానం విన్న నేను ఇంకా గంధర్వ లోకమ్నుంచి మానవ లోక్లోకి రాలేదు.దిగిరాను దిగిరాను దివినుంచి భువికి అని అక్కడే ఆలోకంలోనే వుండిపోవాలనుంది. 

May 29, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఐ.పి.ఎల్ కప్పు ఎవరిది?

మొత్తానికి ఐ.పి.ఎల్ క్రికెట్ పోటీల్లో సెమి ఫైనల్ ఆడే జట్లేవో తెలిసిపోయింది.రాజస్థాన్,చెన్నై,పంజాబ్,డిల్లీ జట్లు ఓడితే ఇంటి దారి పట్టే సెమి ఫైనల్ లో తలపడతాయి.ఒక్క బంతి,ఒక్క ఓవరు,ఒక్క షాట్ మొత్తం ఆట స్వరూపాన్ని మార్చి,అదృష్టాన్ని తల్ల క్రిందులు చేసే పోటీల్లో ఎవరు తప్పకుండా గెలుస్తారో చెప్పటం సాహసమే కాదు,మూర్ఖత్వం కూడా అవుతుంది.కానీ,ముందు జరిగే దాన్ని ఊహించటం మానవుడి బలహీనత.ఊహించినట్టు జరిగితే గొప్ప అనుకోవటం,ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగితే,తలచినదే జరిగినదా దైవం ఎందులకు?అనుకోవటం మనకొక అలవాటు.
సెమీస్ లోకి రావటానికి చెన్నై జట్టు చాలా కష్ట పడటమే కాదు,మంచి పట్టుదలను ప్రదర్శించింది.రాజస్థాన్ వారితో రెండువందల పరుగులను వేటాడిన విధం వారి పట్టుదలను చూపిస్తుంది.చార్గెర్స్ ఎలాగో చార్గి లేక నిర్వీర్యులయి ఉన్నారు.దాంతో గెలుపు మొదటి ఓవర్లోనే చెన్నై దని స్పష్టమయింది.చెన్నై గెలుపు ముంబై వీరులను పూత్రిగా నేల పైకి దించింది.సచిన్ పేరు విజయానికి రాచబాట కాదని,క్రికెట్ 11 మంది కలసి ఆడేదని ఈ పాటికి ముంబయ్ జట్టులోని వారికి అర్ధమయి వుంటుంది.ముంబయ్ జట్టులో అనుభవం ఉన్న వారుండి కూడా చివరి ఓవర్లలో ఉద్విఙ్నతలను తట్టుకోలేకపోవటం వారి పరాజయానికి ప్రధాన కారణం. పంజాబ్ వారితో,రాజస్థాన్ వారితో చివరి బంతిలో ఒక్క పరుగుతో ఓడటం వారి సెమీస్ అర్హతను దెబ్బ తీసింది.
పంజాబ్ జట్టు పట్టుదల,విజయోత్సాహం ముంబయ్ ఆటలో చివరి బంతిలో యువరాజ్ ప్రత్యర్ధిని రనౌట్ చేసిన విధం  నిరూపిస్తుంది. విదేశీ స్వదేశీ ఆటగాళ్ళు కలసికట్టుగా,ఒక జట్టులా ఆడుతున్న ఈ జట్టు ఫైనల్ కి వెళ్తుందనిపిస్తుంది.కానీ,యువరాజ్,సంగకార,జయవర్దనేలు ఆడకపోతే జట్టు దెబ్బతింటుంది.
డిల్లీ జట్టుకు గంభీర్,ధవన్,మెక్ గ్రత్,సెహ్వాగ్ లు నాలుగు స్థంభాలు.అయితే,వీరిలో సెహ్వాగ్ ఆట ప్రాణం పోకడా ఎవ్వరూ చెప్పలేరు.రాజస్థాన్ వారితో,ఓడిన విధం వీరి బలహీనతలను స్పష్టం చేస్తుంది.
ఉన్న వారందరిలోకీ పటిష్టమయిన జట్టులా కనిపిస్తోంది రాజస్థాన్ జట్టు.బాటింగ్లోనూ,బౌలింగ్లోనూ ఎటువంటి బలహీనతలూ చూపటంలేదు.గెలవాలన్న పట్టుదలలోనూ ఎక్కడా సడలింపు కనబడటంలేదు.అయితే,సాధారణంగా అన్ని ఆటలూ గెలుస్తూఅ వస్తున్న వాడు అసలు ఆటలో ఓడతాడు.అలా అదృష్టం అడ్డుపడితే తప్ప రాజస్థాన్ వారే గెలుస్తారనిపిస్తుంది.మిగతా జట్లనీ ఏదో ఒక బలహీనతను చూపాయి.రాజాస్థాన్ వారు ఇంకా బలహీనతలను చూపాల్సివుంది.చూపితే,మిగతా ముగ్గురిలో ఎవరయినా గెలవవచ్చు.చూపక పోతే సమస్యే లేదు.
నాకు మాత్రం ఎందుకో రాజస్థాన్ వారు దెబ్బ తింటారనిపిస్తోంది.సాధారణంగా బలవంతుడంటే ఒక రకమయిన వ్యతిరేక భావం వుంతుంది.అందుకేనేమో!కానీ,ఈ ఐ.పి.ఎల్ కప్పు నిజంగా గెలిచే అర్హత మాత్రం వార్న్ కే వుంది.
ఈ పోటీల వల్ల సెలెక్టొర్ల పని కఠినం అయింది.కొత్త ఆటగాళ్ళను విడవలేరు.పాత వారిని వదలలేరు.అయితే,సచిన్ తప్ప మిగతా పాత వారిని ఎలాగో వదిలేశారు.సమస్య అల్ల కొత్త వారిలో ఎవరిని వదలాలన్నది.యూసుఫ్ పఠాన్,అస్నోద్కర్,నాయర్,ధవన్,మిశ్రా,గోస్వామి ఇలా కొత్త కొత్త వారంత మేమున్నాం అంటూ వచ్చేసారు.ఎవరిని వదలాలి?ఎవరిని మరవాలి?
ఇక ద్రావిడ్,సచిన్,గంగూలీ,లక్ష్మణ్ ల జట్టులు ఓడటంలో వాళ్ళ బాధ్యత పెద్దగా లేదనవచ్చు.ఇది 20-20 ఆట.కొట్టు,పట్టు.అంతే!కానీ,ఈ ఆట యువకులదే అన్నది చేదు నిజం.వీళ్ళు ఆడలేరని కాదు కానీ,అదే పనిగా ప్రతి బంతినీ బాదటం వీరికి అలవాటులేదు.20-20లో పెరుగుతున్న యువకులు ఇకపై పుడుతూనే బాదుతూ పుడతారు.వాళ్ళతో 5 రోజుల ఆట ఆడించినప్పుడు అసలు ప్రతిభలు తెలుస్తాయి.అప్ప్టి వరకూ అబంతికో హీరో పుడుతూనే వుంటాడు.ద్రావిడ్,సచిన్,గంగూలీ లు ముసలివారిలానే అనిపిస్తారు. 

May 28, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

సగటు మనిషి స్వగతం-2

అదేమిటో,ఒకో రోజు ఏమీ తోచదు.ఏ పనే చెయ్యబుద్ధికాదు.అటువంటప్పుడు టీవీలో చానళ్ళు తిప్పుతూ కూచుంటే సమయం హాయిగా,ఆనందంగా గడిచిపోతుంది.నాకయితే,పాటల చానళ్ళు,ముఖ్యంగా తెలుగు సినెమా పాటల చానళ్ళు,నోరు కట్టేసి,హీరో హీరోయిన్ల గెంతులు చూడటం సరదా.వాళ్ళ వెర్రి చేష్టలు,పిచ్చి గెంతులు,అర్ధం పర్ధం లేని కదలికలు చూస్తూంటే తెలుగు ప్రేక్షకులకు జోహార్లర్పించాలనిపిస్తుంది.మన టేస్టు అనితర సాధ్యం.ఇటువంటి వాటిఅదేమిటో,ఒకో రోజు ఏమీ తోచదు.ఏ పనే చెయ్యబుద్ధికాదు.అటువంటప్పుడు టీవీలో చానళ్ళు తిప్పుతూ కూచుంటే సమయం హాయిగా,ఆనందంగా గడిచిపోతుంది.నాకయితే,పాటల చానళ్ళు,ముఖ్యంగా తెలుగు సినెమా పాటల చానళ్ళు,నోరు కట్టేసి,హీరో హీరోయిన్ల గెంతులు చూడటం సరదా.వాళ్ళ వెర్రి చేష్టలు,పిచ్చి గెంతులు,అర్ధం పర్ధం లేని కదలికలు చూస్తూంటే తెలుగు ప్రేక్షకులకు జోహార్లర్పించాలనిపిస్తుంది.మన టేస్టు అనితర సాధ్యం.ఇటువంటి వాటి నుంచి వినోదం పిండుకోవటం మనకే సాధ్యం!
ఇలా ఒక రోజు చానళ్ళు తిప్పుతున్నా.అందులో హీరో ఓ హోటల్లో పనిచేస్తూంటాడు.ఒక లవ్ లెటర్ కాలేజీ అమ్మాయిల పుస్తకంలో పెట్టేస్తాడు,రహస్యంగా.తరువాత తెలుస్తుంది,ఒక అమ్మాయి బదులు హీరొయిన్ పుస్తకంలో పెడతాడు.ఆమె తండ్రి దాన్ని చూసి,ఆమెని తిట్టి పెళ్ళి నిశ్చయించేస్తాడు.ఇది తెలిసి హీరో బాధ పడతాడు.’నా వల్ల పొరపాటు జరిగింది.సరిదిద్దుతానంటాడూ.నేను సంతోషించా.తప్పును నిర్భయంగా ఒప్పుకునేవాడు  గొప్పవాడు,సరిదిద్దుకునేవాడు మహాత్ముడు.యువతకు గొప్ప ఆదర్శం ఇది.అందరికీ చెప్పాలనుకున్నా.అయితే,నా సగటు బుర్రకు మన సినీ మేధావుల ఆలోచనలు ఎలా అందుతాయి? ఈ పెళ్ళీఅపుతా!అని కాలరెగరేశాడు హీరో!ఓరి దొంగ వెధవా వెళ్ళి నిజం చెప్తే అయిపోయేదానికి పెళ్ళి ఆపాలనే విధ్వంసపుటాలోచనలు చేస్తావేరా భడవా! అని లెంపలు వాయించాలనిపించింది.కానీ అదే సినిమాను మలుపు తిప్పే కీలక సన్నివేశం.ఇలాంటి మెలికల మలుపులు నా లాంటి సగటు మేధ మెచ్చదని చానల్ తిప్పా.
ఆ చానల్ లో ఆసక్తి కరమయిన సంఘటన వస్తోంది.నాయిక ఓ కంపెనీ మేనేజర్ లా వుంది.హీరోని చడామడా తిడుతోంది.వారెవా వుమెన్ పవెర్ అనుకున్నా.ఇంతలో హీరో పళ్ళు బిగించీఏమే నీవెంట తిరుగుతున్నానని నీకు తెలుసు కదే.నిన్ను ప్రమిస్తున్నానని చెప్పా కదే.నన్ను ప్రేమించక పోతే నిన్ను పొడిచి చంపుతానే.నే ముఖం మీద ఏసిడ్ పోస్తానే’అంటూ ప్రేమతో చేయబోయే రాక్షస ప్రేమకృత్యాలన్నీ వర్ణించసాగాడు.నాగుండె దడదడ లాడింది.’ఓరి వీడి పవిత్ర రాక్షస ప్రేమ కూలా!
వీడిలా తిట్టగానే అమ్మాయి గెంతుతూ పాటపాడి జలపాతాల్లో తడిసి ఉల్లిపొర తెల్లదుస్తుల్లో తన ప్రేమ ప్రకటించింది.ఇదా ప్రేమ పొందే విధానం!సగటు మనిషిగా సగం జీవితం గడిపిన నాకు ఙ్నానోదయమయింది.నన్నెవరూ ఎందుకు ప్రేమించలేదో తెలిసింది.’నా హృదయంలో నిదురుంచే చెలీ’ అని పాడితే ఎవ్వరూ పట్టించుకోలేదు.అందుకే మోస్ట్ మోడెర్న్ పాట తయారుచేసుకున్నా.’కాలాష్నికోవ్ తో కాలుస్తా,కోలాలో విషం కలిపి తాగిస్తా,కాల్చే ఆసిడ్ ముఖం మీద పోస్తా,నన్ను ప్రేమిస్తే ఓ సోడాబుడ్డి,నిన్ను నరకంలో రంభను చేసి ఆడిస్తా.లేకపోతే కత్తితో కసా పిసా పొడుస్తా’వహ్వా!ఈ పాటతో ప్రపంచంలో ప్రేమ నింపేస్తా!
ఇంతలో నా సగటు బుర్రకో ఆలోచన వచ్చింది.సినిమాలో హీరోయిన్ ను హీరో తిట్టినా,కొట్టినా,బెదిరించి భయపెట్టి రాక్షసుడిలా ప్రవర్తించినా,ఇంత కూడా గౌరవం ఇవ్వకుండా చులకనగా చూసినా అందరూ మెచ్చుకుంటారు.మరి నిజ జీవితంలో ఇలా చేసే కుర్రాళ్ళని ఉరితీయాలని,జైళ్ళలో తోయాలని డిమాండ్లెందుకు చేస్తారు?ఏమిటో,నా సందేహం విని ఇంట్లోవాళ్ళు,ఎవ్వరూ టీవీ చూస్తే ఆలోచించరు.ఆలోచిస్తే టీవీ చూడరు ‘అన్నారు.
ఆలోచిస్తాను కాబట్టే నేనున్నాను అని తత్వవేత్తలంటూంటే,ఆలోచనల్లేకుండా బ్రతకమంటారేమిటి?తిట్టుకుంటూ ఫారిన్ చానెల్ తిప్పా.ఈ విదేషీయులకు బ్రతకటం రాదు.జీవితాన్ని అనుభవించటం రాదు.మనమేమో ఎంచక్కా ప్రేమిస్తూ బతుకుతూంటే వీళ్ళు చెట్లెంట,పుట్టలెంట,పిట్టలెంట,గుట్టలెంటా పడి పరిశోధిస్తూ తిరుగుతారు.చెట్లు పుట్టలెంట తిరిగితే ప్రేయసి కోసమే తిరగాలని తెలియదు వీళ్ళకు.పాపం పురుగులు,పువ్వుల వెంట పడి జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు.ఏమిటో ఎంతవద్దన్నా ఆలోచనలు వస్తూనేవున్నాయి.ఎవరయినా ఆలోచనలు ఆపే అద్భుత యంత్రం కనుక్కుంటే బావుంటుంది.ఏమీ తోచక టీవీ నోరుకట్టి తెలుగు పాటల గెంతులు చూస్తూ కూచున్నా.ఇదే బాగుంది!
 
(25-5-2008 ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో ప్రచురితమయింది.)  

May 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఆరేముందు వెలుగుతున్న దీపాలు-రైడెర్లూ,చాలెంజెర్లూ!

ఐ.పి.ఎల్ నెమ్మది నెమ్మదిగా చివరి దశ వైపు పాకుతోంది.ఆటలు ఊహించిన ఫలితాలతో కొత్తదనాన్ని,ఉత్సాహాన్ని,ఉద్విగ్నతనూ కోల్పోతున్నాయి.ఇప్పుడు ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రతిభలూ,నైపుణ్య ప్రదర్శనల పైన ఆసక్తి మిగిలి వున్నాయి.ఎందుకంటే,నెమ్మదిగా ముంబాయి దేవుడు కూడా మనిషేనని అర్ధమవుతోంది.సచిన్ ఆడటం మొదలుపెట్టిన ఆవేశం తగ్గి ముంబాయి ఆట మామూలు స్థాయికి వస్తోంది.ఇంకా జయసూర్యకు మత్తు దిగనట్టువుంది.కానీ మిగతావారు  భూమి మీదకు వచ్చేశారు.సచిన్ కూడా వయసు ప్రభావం గ్రహించినట్టున్నాడు.తనకన్నా ఎక్కువ వయసున్న జయసూర్య ధన ధనా కొడుతూంటే,చూసి ఆనందిస్తూ ఆటకు వయసుకూ సంబంధం లేదని ఆనందిస్తూన్నట్టున్నాడు.రాబోయే రెండు ఆటల్లో జయసూర్యకు దీటుగా సచిన్ ఆడకపోతే,దేవుడు కూడా ముంబాయిని సెమి ఫైనల్ కు పంపలేడు.
రాజస్థాన్ రాయల్స్ ఎదురులేని రాచరిక తేజాన్ని ప్రదర్శిస్తూన్నారు.అయితే ఇకనుంచీ ఒక్క ఆటలో చిన్న పొరపాటు జరిగినా ఇంతకాలం చూపిన ప్రతిభ వ్యర్ధమవుతుంది.అయితే,వున్న జట్లలో సంపూర్ణమయిన జట్టుగా ఎదిగింది రాజస్థాన్ రాయల్సే.
డెల్లి దయ్యాలను దురదృష్టం వెంటాడుతోంది.ఎప్పుడొస్తుందో తెలియని వర్షంలాంటి ఆటగాడు సెహ్వాగ్ నేతగా ఆడే ఈ జట్టు పరిస్థితి కూడా వచ్చీ రాని వానలా వుంది.చెన్నయ్ జట్టు గెలుపు ఓటమి పైన వీరు ముందుకు పోవటం ఆధార పడివుంది.
పంజాబ్ జట్టు,రాజస్థాన్ తరువాత బాగా ఆడుతున్న జట్టు.మిగిలిన ఆటలలో యువరాజ్ పెద్ద స్కోరు బాకీ వున్నడు.అదే జరిగితే ఈ జట్టు ఆనందిస్తుంది.కలకత్త తో జరిగిన ఆట వీరికి ఒక హెచ్చరిక లాంటిది.
చెన్నయ్ జట్టు పట్ల వ్యక్తిగతంగా వ్యతిరేకత లేక పోయినా,ధోనీ ఒక వ్యాపార ప్రకటనలో యూ,ఫాస్ట్ బౌలర్ రాస్కాల్స్ అనటంతో అతని పట్ల విముఖత కలిగింది.కాబట్టి ఏ ఫాస్ట్ బౌలర్ రాస్కలో చెన్నయ్ జట్టును మట్టి కరిపిస్తే చూసి ఆనందించాలని వుంది.
దక్కన్ చార్జెర్లు పాపం మంచి జట్టు వుండి కూడా మంచి ఆట చూపలేక పోయారు.అందరికీ రెండు పాయింట్లిచ్చే దయా దాక్షిణ్యాలుకల జట్టుగా మంచి పేరు మాత్రం సంపాదించారు.
కలకత్త రైడర్లు కూడా మంచి జట్టు అయివుండీ దెబ్బ తిన్నారు.ఆరిపోయే దీపం వెలిగినట్టు చివరి ఆటలో గంగూలీ బాగా ఆడాదు.ఇదే పట్టుదల మొదటి నుంచీ చూపితే బాగుండేది.
పోటీలు అయిపోతూంటే ఆట తీరు అర్ధమయింది బెంగళూరు చాలెంజెర్లకు.ద్రావిడ్ వ్యక్తిగతంగా ఉత్తమ ఆట ప్రదర్శిస్తున్నా,నాయకుడిగా విఫలమయ్యాడు.భారత జట్టు నాయకత్వం నుంచి తప్పుకోవటం మంచి నిర్ణయం అని రుజువయింది.ఆరంభమ్నుంచీ ఏడుస్తూ వస్తున్న ఈ జట్టుకు చివర్లో మంచి యువ ఆటగాళ్ళు దొరికారు.ఇతర జట్లలో యువకులు వచ్చిన అవకాశాలు వాడుకుంటూంటే ఈ జట్టులో అందరూ అన్ని బాధ్యతలూ ద్రావిడ్ పై నెట్టి ఊరుకున్నారు.ఇప్పుడు వారికి తాము చేజార్చుకున్న అవకాశాలు అర్ధమయ్యాయి.దాంతో చివరలో నయిన విజృంభిస్తున్నారు.ఈ గెలిచే అలవాటును వొచ్చే సంవత్సరం కొనసాగించాలి.
ఐ.పి.ఎల్ పోటీలవల్ల యువకులకు మంచి అవకాశాలు దొరికాయి.పాత హీరోలు అలసిపోయారని ఇప్పుడు కొత్త హీరోలు ముందుకు వచ్చారు.రోహిత్,అస్నోద్కర్,గోని,యూసుఫ్,గోస్వామి వంటి వారికి మంచి ఎక్స్పోజర్ లభించింది.
ఐ.పి.ఎల్ వల్ల కలిగిన మరో లాభమేమిటంటే,ఎండాకాలంలో పిల్లలను ఎలా ఆడించాలన్న బాధ తప్పింది.పొద్దుతినుంచి రాత్రి జరిగే ఆట చర్చ,అంతకు ముందు జరిగిన ఆట చర్చ.ఎండాకాలం గడిచిపోయింది.సినిమాలు,షికార్లూ అన్నితి బాధలు తప్పాయి.జూన్ లో స్కూళ్ళు తెరుస్తారు.అయిపోయాయి,సెలవులు.అందుకే అంటారు,ప్రతిదానివల్ల ఏవో లాభాలుంతాయని.
 

May 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

తెలుగు రచయితల సంఘం ఏర్పాటు-రచయితలు గైర్ హాజరు!

ఇవాళ్ళ అంటే,22.5.2008 నాడు హైదేరాబాదులో తెలుగు రచయితలనందరినీ ఒక దగ్గర చేర్చాలనే ఉద్దేశ్యం తో సృజని అంటే,సృజన జన నిలయం అనే సంస్థ ఏర్పాటయింది. మాధాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గాలెరీ ఆడిటోరియం లో ఈ సంస్థ ఏర్పాటు సమావేశం జరిగింది.
రాంపా అనే కార్టూనిస్ట్,హాస్య కథల రచయిత స్వయంగా పూనుకుని,రచయితలందరినీ కలసి ఈ సంస్థ ఏర్పాటుకు కారకులయ్యారు.మృణాలిని,తనికెళ్ళ భరణి,జనార్దన మహర్షి,ఇంద్రగంటి జానకీ బాల వంటి వారు ఈ సంస్థ కార్యవర్గం లో సభ్యులు.అయితే,సభకు మాత్రం,మృణాలిని,తనికెళ్ళ భరణిలు వచ్చారు.మిగతా వారు రాలేదు.ఆపద్ధర్మంగా ఎమెస్కో అధినేత దూపాటి విజయ కుమార్ గారు చివరి క్షణంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఇంత చేసీ సభలో రచయితలు లేరు.

హైదెరాబాదులో అలవాటయిన తీరులో సాహిత్య సమావేశాలకు రచయితలు దూరంగా వున్నారు.మొత్తం హాలులో పట్టుమని పది మంది లేరు.రాంపా గారు గత నేల రోజులుగా ఇదే పనిగా అందరినీ కలిసి బ్రతిమిలాడి,ఒప్పిస్తే వస్తామన్న అందరూ ఏవేవో పనుల వల్ల రాలేక పోయారు.ఇదీ మన తెలుగు రచయితల పరిస్థితి.
తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం ఏ ఉద్యమంలోనూ చేరక,ఏ ఇజానికీ కొమ్ము కాయక,ఎటువంటి వర్గానికీ,ప్రాంతీయ కూటములకు చెందక పోతే రచయితకు మనుగడ లేదు.అలాంటి కూటములు వర్గాలకూ అతీతంగా రచయితలందరినీ కేవలం సాహిత్య సంబంధంతో కలపాలనుకుంటే ఇదే పరిస్థితి!
అయితే,ఎంత దూర ప్రయాణమయినా చిన్న తొలి అడుగుతో ఆరంభమవుతుంది.ఇది శుభారంభమని అనుకుంటున్నాము.ఎలాగో బంతిని మైదానంలోకి విసిరాము.ఇక అది ఎటు ప్రయాణిస్తుందో,ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి.
వొచ్చే నేల మళ్ళీ సమావేశమయి,సభ్యత్వ వివరాలు,కార్య ప్రణాలికలూ వేయాలని అనుకుంటున్నాము.
ప్రస్తుతం ఒక రచయిత తన రచనలను బ్రతికించుకోవాలంటే తానే పుస్తకాలను అచ్చువేసుకోవాల్సి వస్తోంది.ఆ తరువాత పట్టుమని పది కాపీలు కూడా కొనేవాళ్ళు లేరు.ఈ పరిస్థితి మార్చాలని మా ఉద్దేశ్యం.రచయితలంతా ఒక సంఘంలా ఏకమయి,ఒక రచయిత పుస్తకాలు మరో రచయిత కొనేలా చేయాలని మా పధకం.కనీసం అచ్చయితే వంద పుస్తకాలయినా అమ్ముడుపోయేట్టు చూడాలని మా తాపత్రయం.పుస్తకం అచ్చయితే ఆ విశయం పది మందికీ తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా కల.ఇజాలకు,కుల మత ప్రాంతీయ సంకుచిత భావలకు అతీతంగా తెలుగు సాహిత్యాన్ని నిలపాలన్నది మా కోరిక.
నెట్ లో ఇంతమంది రచయితలున్నారు.ఆసక్తి వున్నవారు మాతో చేరాలని వుఙ్నప్తి.రచయితలకోసం రచయితలు ఏర్పరుచుకుంటున్న సంస్థ సృజని.మీ అందరి ప్రోత్సాహం మాకు ఊపిరి.హైదెరాబదు రచయితలకు తీర లేదు.నెట్ రచయితల స్పందన ఎలా వుంటుందో?

May 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized