Archive for June 3, 2008

పుస్తకావిష్కరణ సభ-అందరికీ ఆహ్వానం!

బ్లాగు మితృలందరికీ ఇదే సవినయ,సాదర ఆహ్వానం!
నేడు,అంటే,4.6.2008,బుధవారం,సాయంత్రం ఆరుగంటలకు,చిక్కడపల్లి లోని త్యాగరాజ గాన సభలో పుస్తకావిష్కరణ సభ వుంది.

కవి శ్రీ ముకుంద రామారావు రచించిన,తాత్విక కవితల సంకలం ‘నాకు తెలియని నేనెవరో?’,ఆవిష్కరణ జరుగుతుంది.

అధ్యక్షులు-శ్రీ జయధీర్ తిరుమల రావు.

ఆవిష్కర్త-డాక్టొర్ సీ.నారాయణ రెడ్డి.

విశిష్ట అతిథి-శ్రీ ఇంద్రగంటి శ్రీకంత శర్మ.

వక్తలు- శ్రీ గుడిపాటి
         వఝుల శివ కుమార్.
బ్లాగు మితృలంతా విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందని అభ్యర్ధన.

June 3, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

సగటు మనిషి స్వగతం-3

మొన్న ఓ ఫ్రెండ్ ఇంటికెళ్ళ.ఇంట్లో అడుగు పెడుతూంటేనే అందరూ టీవీ ముందు కూచుని కనిపించారు.ఆశ్చర్యపోయాను.ఇంత పొద్దున్నే ఇంట్లోని ముసలివాళ్ళంతా టీవీ ముందు ఏం చేస్తున్నారో అర్ధం కాలేదు.ఆ సమయంలో ఏ ప్రతీకార క్రూర కుట్రల ఘోర కర్కోటక బహుభార్యాత్వ మాఫియా ముఠాల ప్రేమ కథల సీరియళ్ళు రావు.అందరూ ఇంత ఆసక్తిగా టీవీ ముందు కూచున్నారెందుకో?
అదే అడగబోయి,తెరచు కున్న నోరు మూత పడలేదు.హాస్య చిత్రాల్లో దెబ్బలు తిన్న జోకర్ ముఖాన ముక్కు,కళ్ళ రంధ్రాలు తప్ప ఇతరమంతా కట్లతో నిండినట్టు,టీవీ మొత్తం గుడ్డతో కట్లు కట్టారు.మధ్యలో చిన్నగా తెర కనిపిస్తోంది.
ఏమైంది టీవీకి?,అడిగా.
ష్..ష్!అన్నారు.టీవీ అంతా కట్లు కట్టి ఏం చూస్తున్నారో అర్ధం కాలేదు.టీవీకి కట్టిఉన్న గుడ్డలు లాగేసా.హాహాకారాలు చేసారంతా.
ఏమిటిదంతా?అంటూ టీవీ వైపు చూసిన నేను బిత్తర పోయాను.ఎంతయినా సగటు మనిషిని కదా!విషయం అర్ధమయ్యేసరికి సమయం పట్టింది.
టీవీలో ఏదో పుణ్యతీర్థాల కార్యక్రమం వస్తోంది.అయితే,టీవీ టీవీ తెర క్రికెటర్ ఒంటిలా,వ్యాపార ప్రకటనలతో,ఫ్లాష్ వార్తలతో,క్రింద స్క్రోల్ అయ్యే వార్తలతో నిండి వుంది.వాటన్నిటి నడుమ పుణ్యతీర్థం తాలూకు దృశ్యాలు కనబడీ కనబడనట్టున్నాయి.ఎంత వద్దనుకున్నా,దృష్టి రక రకాల రంగుల్లో వస్తున్న మెరుపు వార్తలు ప్రకటనల వైపే వెళ్తోంది.
ఇంతలో,టీవీలో అర్ధనారీశ్వరుడిని చూపారు.కళ్ళు చికిలించి సరిగ్గా చూద్దామనుకునేసరికి క్రింద ఎర్రటి అక్షరాలతో ‘మెరుపు వార్తా వచ్చింది.నెల రోజులుగా బహిష్టు వస్తున్న యువకుడు అని.ఎంత వద్దనుకున్నా దృష్టి ఆ బహిష్టు వార్త పైకే పోతోంది.భక్తి శ్రద్ధలతో టీవీకి కట్టు కట్టి ఆ చానెల్ కి ఫోను చేసాను.
‘ఇది అన్యాయమండి.కనీసం పుణ్య క్షేత్రాలు చూపుతున్నపుడన్నా,ఫ్లాష్ లు,ప్రకటనలు తగ్గించి తెరలో సగమయినా బొమ్మ కనబడేట్టు చేయండి ‘ బ్రతిమిలాడాను.ఎంతయినా సగటు మనిషిని కదా,అందరినీ బ్రతిమిలాడాలి.ఒదిగి వుండాలి.సగటు మనిషి కోపం శ్వాసకు చేటు.
నా అభ్యర్ధన విని ఆయన మండి పడ్డాడు.’మాకు ప్రకటనలే రెవెన్యూ.ప్రకటనలు లేకపోతే కార్యక్రమాలు లేవు.భూతద్దం పెట్టుకు చూడండి.టీవీకి కట్టుకట్టి చూడండీఅన్నాడు.అప్పుడర్ధమయింది ఈ ముసలాళ్ళకు ఆలోచన ఎలా వచ్చిందో.
అయితే నా నోరు ఊర్కోలేదు.’ఇంకో చానెల్ లో తెర మొత్తం కనిపిస్తుందీఅన్నాను.
‘ఆ చానెల్ ఎవ్వరూ చూడరు.అందుకే ప్రకటనలుండవు.మాది అందరూ చూస్తారు.అందుకే ప్రకటనలూఫోను నా మొఖాన కొట్టినట్టు పెట్టేసాడు.
ఔరా!మనం చూస్తే ప్రకటనలొస్తాయి.కానీ,ప్రకటనలొస్తే మనం కార్యక్రమం చూడలేము.ఇదెక్కడి గోల?రయీ మనదే,వూడే పళ్ళూ మనవే!దబ్బు మాత్రం వాళ్ళకి.
నిజం!ఈ సత్యం ఇంకో రూపంలో ఔభవానికి వచ్చింది.అర్జెంటుగా ఓ మితృడి దగ్గరకు బయలు దేరా.రోడ్డంతా ట్రాఫిక్ జాం.ఎన్నికల ప్రచారంతో రోడ్డు నిండి పోయింది.అదేదో ఇంగ్లీష్ సినిమాలో రోడ్ జామయిందంటే,బ్రెడ్ తీసుకురా అంటాడు.నవ్వాలో ఏడవాలో తెలియలేదు.వాళ్ళు వెళ్తూనే,ఓ సినిమా హీరో అభిమానులు రోడ్డు నింపేసారు.మళ్ళీ ట్రాఫిక్ జాం.ఈ సారి బ్రెడ్ తెచ్చుకునే ఓపిక కూడా లేదు.అప్పుడు అనిపించింది.సగటు మనిషి జీవితం ఎంత దుర్భరం!
మనం చూస్తే టీవీ చానళ్ళకు ప్రకటనలు వస్తాయి.మనం ఓట్లేస్తే నాయకులకు అధికారం వస్తుంది.మనం వేలం వెర్రిగా చూస్తే హీరో సూపర్ స్టార్ అవుతాడు.కానీ టీవీ చూడాలంటే ప్రకటనలు అడ్డొస్తాయి.నయకుడు బైలెళ్ళితే రోడ్డు ఆగిపోతుంది.సూపర్ స్టార్ల సంగతి చెప్పనక్కర్లేదు.అదే మరి…రాయీ మనదే-ఊడే పళ్ళూ మనవే!భోగం వాళ్ళది.సగటు మనుషుల జీవితం ఇంతే.శ్రమ మనది.ఫలం వాడిది!

June 3, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.