Archive for June 7, 2008

పురాణ ప్రలాపం-ఒక ప్రేలాపన!

సా ధారణంగా,ఏదయినా విమర్శకు స్పందిస్తే,ఆ విమర్శకు ప్రామాణికత ఆపాదించినట్టవుతుంది.ఆ విమర్శ లేని ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.కానీ,ఒకో సారి విమర్శకు స్పందించక పోవటం కూడా,విమర్శతో ఏకీభవించినట్టవుతుంది.మౌనం అర్ధాంగీకారం కదా!అందుకే,పురాణ ప్రేలాపనకు స్పందించాల్సి వస్తోంది.లేకపోతే,ఈ పుస్తకం గురించి ఇంత కూడా చర్చించాల్సిన అవసరం లేదు.ఇలా చర్చింటం వల్ల ఆ పుస్తకానికి ప్రచారం ఇచ్చినట్టవుతోంది,అనవసర ప్రాధాన్యం ఇస్తున్నట్టవుతోంది.అయినా సరే,ఒకే విషయాన్ని పదే పదే అంటూండటం వల్ల ఆబధ్ధం కూడా నిజమని భ్రమ పడే వీలుంది.ప్రచారం ద్వారా,మేకను కూడా,గాడిదగా చేయవచ్చని,పంచతంత్రం కథ చెప్తుంది.దీన్నే,పాశ్చాత్యులు తరువాత గోబెల్స్ ప్రచారంగా పేరు పెట్టారు.కాబట్టి,ఎప్పుడో ఒకప్పుడు,స్పందించటం అనవసరం అనిపించినా స్పందించక తప్పదు.కత్తిమీద సాములాంటిది ఇది.
పురాణ ప్రలాపంలోని విమర్శలలో కొత్తదనం లేదు.ఇటువంటి విమర్శలు ఊహ తెలిసినప్పటినుంచీ వింటూనే వున్నాము.ఇలాంటి విమర్శలు చేయటం వల్ల లాభాలున్నంట వరకూ వింటూనే వుంటాము.నిజానికి ఈ పుస్తకంలోని ఒక్క వాదనలో కూడా కొత్తదనం లేదు.రాముడు సీతను కష్ట పెట్టటం దగ్గరనుంచి,భగవద్గీత లోని వైరుధ్ధ్యాలు,ధర్మ శాస్త్రాలలోని సందిగ్ధాలూ అన్నీ ఎప్పటి నుంచో మనకు వినిపిస్తూన్నవే.అలెక్స్ డుబోయిస్ అనే ఫ్రెంఛి మత ప్రచారకుడు పద్ధతి ప్రకారం మన సంస్కృతీ సాంప్రదాయాలను విమర్శించాడు.ఆ వారసత్వంలోనివే మన సంస్కృతి పైన హేతువాదులు చేస్తున్న విమర్సలు.సాధారణంగా ఎవరికీ ఎదుటి వాడి గొప్పతనం ఒప్పుకోవాలని వుండదు.అందులో,తామే జగదోద్ధారకులు అన్న అభిప్రాయంతో ప్రపంచమంతా తమ మత ప్రచారం చేస్తున్న వారికి ఎదుటి వారి గొప్పతనం ఒప్పుకోవటం కన్న ప్రాణాలు కోల్పోవటం సులభం .వారు,చేసిన రంధ్రాణ్వేశణ ఫలితాలనే మన హేతువాదులు పట్టుకుని వేళ్ళాడుతున్నారు తప్ప స్వయంగా వీరు హేతువులకోసం చేసిన అణ్వేషణ ఏమీ లేదు.
మీరంతా,అలెక్స్ హేలీ రాసిన రూట్స్ చదివి వుంటారు.ఆ నవలలో హేతువాదులకు,నల్ల వారు తెల్ల వారిని అణచటం కనబడింది కానీ,ఒక నల్ల వాడు తన సంస్కృతీ పరిరక్షణకోసం పడిన ఆరాటం కనబడలేదు.తెల్ల వారికి తెలియకుండా,తన భాషను,సాంప్రదాయాలనూ తరువాత తరాలకు అందజేయాలన్న తపన కనబడదు.వీరు చేసిన అనువాదంలో కూడా ఆయా భాగాలు కనబడవు.అటవికుడిగా,అనాగరికుడిగా ఈసడించే ఆ నల్లవాడికి తన ఆటవిక సంస్కృతి అంటే ఎంతో గౌరవం వుంది.ఆత్మాభిమానం వుంది.ఆత్మ గౌరవం వుంది. అందుకే,పట్టుబట్టి తన వారసత్వాన్ని సంతానానికి అందించాడు.తద్వారా అలెక్స్ హేలీ తన పూర్వీకులను చేరగలిగాడు.
ఈ సందర్భంలో హేలీ ఒక గొప్ప వ్యాఖ్య చేస్తాడు.హేతువాదుల హేతువుకు ఆ వ్యాఖ్య అందలేదు.తన పూర్వీకులున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు హేలీ సిగ్గుపడతాడు.తాను అమెరికానుంచి వచ్చాడు,తాను నాగరీకుడు,తాను ఉన్నతుడు అన్న ఆలోచనల బదులు న్యూనతా భావానికి గురవుతాడు.తన తోటి నల్ల వారిని చూసి వాళ్ళలా పవిత్రంగా లేక తెలుపువాడి రక్తంతో అపవిత్రమయిన తనని చూసి సిగ్గుపడతాడు.ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశం అది.అంటే,హేలీ అణ్వేషణ,అణచివేత గురించి కాదు.తన పూర్వీకులకోసం.వారి సంస్కృతీ సాంప్రదాయాల లోని స్వచ్చత కోసం.
ఇప్పుడు ఆలోచించండి,ఒక ఆటవికుడికి తన పూర్వీకుల పట్ల,సంస్కృతీ సాంప్రదాయాల పట్ల అంత గౌరవం,అంత అచంచలమయిన విశ్వాసం ఉంటే,ఆద్యంతాలు లేని మన భారతీయ ధర్మం చూసి మనం ఎంత గర్వించాలి!అనేక ఒడిదుడుకులు తట్టుకుని జీవనదిల అనంత కాలం నుంచి ప్రవహిస్తున్న మన జీవన స్రవంతిని చూసి ఎంత ఆత్మగౌరం.ఎంత ఆత్మ విశ్వాసం తెచ్చుకోవాలి.ఇందుకు భిన్నంగా,మనం మన పూర్వీకులలోని లోపాలను మాత్రమే చూస్తున్నాము.వారి దోషాలను మాత్రమే ఎంచి వారిని చులకన చేసి,మనకు మనమే కాదు,రాబోయే తర తరాలకూ అన్యాయం చేస్తున్నాము. మనల్ని చూసి మనమే సిగ్గుపడి.ద్వేషాలు పెంచుకుని,మన నడుమ అడ్డుగోడలు నిర్మించుకుని కొట్టుకుని చస్తున్నాము.దేశమంటూ లేక ప్రపంచంలోని పలు ప్రాంతాలలో కాందిశీకులయి,అణచివేతకు గురయికూడా,తమ ప్రత్యేక దేశం సాధించటంలో ఇస్రాయెల్ వారికి స్ఫూర్తి తమ సంస్కృతి నుంచి లభించింది.అంతకన్నా,ప్రాచీనమయిన పరంపర మనది. దాన్ని అర్ధం చేసుకుందాం.తెలుసుకుందాం.లోపాలను సవరించుకుందాం.సమన్వయంతో సామరస్యాన్ని సాధించి సగర్వంగా నిలబడదాం.ఇదీ మనం చేయవలసింది.అంతేకానీ చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూసి.మాకే అంతా తెలుసన్నట్టు ప్రవర్తిస్తూ అనంతమయిన మన వారసత్వాన్ని చేజేతులా నేల పాలు చేసుకోవద్దు.రత్నాలను రాళ్ళని భ్రమసి పారేసుకోవద్దు.ఏ చరిత్ర,సంస్కృతీ లేని వారు తమదంటూ చరిత్రనూ,సంస్కృతీ,సాంప్రదాయాలనూ ఏర్పాటు చేసుకోవాలని తపన పడుతూంటే,ప్రపంచానికి మార్గదర్శనం చేయాల్సిన మనం మనల్ని మనమే ఈసడించుకుంటూ,న్యూనతా భావానికి గురయి అనుకరణల్లో పడి స్వీయ వ్యక్తిత్వాన్ని మరచిపోయి,ఎందుకూ పనికి రాని భికారీల్లా మిగిలిపోవాలని తహ తహ లాడుతున్నాము.అదే అభ్యుదయమని,అదే హేతువాదమని,అదే నాగరికత అని భ్రమ పడి దీపం వైపు పరుగెత్తే శలభాల్లా ఆత్ర పడుతున్నాము.
లోపాలు లేని సమాజం లేదు.అణచివేతకు గురికాని సమాజం లేదు.అన్యాయాలు అక్రమాలు లేని జీవన విధానం లేదు.కానీ,ఇన్నిటి నడుమ వుంటూ కూడా,సాటి మానవుడితో సమన్వయం సాధించి.సుఖంగా శాంతంగా జీవించే మార్గం భారతీయ ధర్మంలో దొరుకుతుంది.ఒకే నిజాన్ని పలువురు పలురకాలుగా చెప్తారు,నదులు ఏ మార్గంలో ప్రయాణించినా,సాగరమే వాటి గమ్యం, అన్ని వైపుల నుంచీ వున్నత మయిన ఆలోచనలకు ఆహ్వానం,ప్రపంచమంతా ఒకే కుటుంబం  వంటి అనేక వున్నతమయిన భావాలకు ఆలవాలం మన ధర్మం.నా దేవుడే గొప్ప,నా మాట వింటే సరే,లేక పోతే చంపుతా,నేను తప్ప వేరే దేవుడు లేడు,కాదంటే ఖతం లాంటి ఆలోచనలున్న మత్తలపయిన హేతు వాదులు విరుచుకు పడ్డా అర్ధం వుంది.వాటన్నిటినీ వొదిలి పెట్టి,కొందరి దేవుడు నీళ్ళలో వుంటే,ఇంకొందరి దేవుడు కర్ర లో వుంటాదు.కొందరి దేవుడు రాయిలో వుంటే కొందరి దేవుడు చెట్టులో వుంటాడు.కొందరి దేవుడు శూన్యంలో వుంటే ఇంకొందరికి దేవుడే లేడు అనె విశాల భావాలను మించి హేతువాదం మరొకతుందా?అయినా హేతువాదులు ఆ ధర్మంపైనే ఎందుకు విరుచుకు పడతారు?
బ్రిటీషువారు మన పతనం గురించి రాశారు.మన గొప్పతనం గురించి మనమే రాసుకోవాలన్న వివేకానందను మించిందా వీరి హేతువాదం?హిందూ ధర్మంలోని లోపాలను వివేకనంద విమర్శించినంతగా ఈ హేతువాదులుకూడా విమర్శించలేదు.కానీ,వివేకానంద విమర్శలో  ధర్మం పట్ల గౌరవం వుంది.అవగాహన వుంది.లోపాలను సరిచేసి మళ్ళీ ధర్మాన్ని అత్యున్నత స్థాయికి నిలపాలన్న అభిమానం వుంది.  ముఖ్యం గా ఆత్మ గౌరవం వుంది.ఆత్మ విశ్వాసం వుంది.మన ఆధునిక హేతువాదుల్లో ద్వేషం వుంది.చులకన వుంది.ఇల్లంటి వారివల్ల హాని కలుగుతుంది తప్ప మేలు కలగదు.
అరబిందో రచనలకన్న హేతువాదమా వీరిది?శంకరాచార్యులు,రామానుజాచార్యులకన్న మేధస్సుందా ఈ హేతువాదుల్లో?వుంటే వారి రాతలు,చేతలూ ఇలావుండవు.మన హేతువాదుల అవగాహనా రాహిత్యానికి,ఆలోచనా శూన్యతకూ,ఆత్మగౌరవ రాహిత్యానికి,హేళన చేసే తత్వానికి  మరో నిదర్శనం పురాణ ప్రలాపం.ఈ పుస్తకం గురించి వారు చేస్తున్న గోల, వొట్టికుండ అందరినీ ఆకర్శించి తన గొప్ప చూపుకోవాలనే తపనకు నిదర్శనం. ఆ సభకు జనాలు వచ్చరంటే రారూ మరి.పెద్ద మనుషులున్నారు ఈ పుస్తకం వెనుక.సభకు వచ్చి పుస్తకాన్ని పొగడి పెద్దవారి మంచి దృష్టిలో పడితే బోలెడన్ని లాభాలుంటాయి.పైకి పొగడి లోపల రామ రామ అనుకుంటే చేసిన పాపం పోతుంది.రాముడేమన్న పై ఆఫీసరు లాంటి వాడా,అన్నీ మనసులో పెట్టుకుని అవకాశం రాగానే తొక్కేయటానికి!పాపం అందరినీ ప్రేమిస్తాడు.క్షమించి వదిలేస్తాడు.అదే హేతువాదుల ధైర్యం.

June 7, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu