Archive for June 8, 2008

నేను జల్సా సగం చూశానోచ్!

నిన్న నా మితృడు నన్ను బలవంతంగా సినిమాకు లాక్కెళ్ళాడు.ఎప్పుడూ ఇంట్లో పుస్తకాల మధ్య కూచుని లాభం లేదు.బయట ప్రపంచాన్ని గమనించని రచయిత రచయిత కాడు.ప్రజలేమి కోరుకుంటున్నారో తెలుసుకో!అని లెక్చరిచ్చి మరీ తోలుకెళ్ళాడు.నేను కూడా,ప్రజలు మెచ్చిన సినిమా ఆ సామాజిక మనస్తత్వాన్ని,ప్రజల ఆశలు,నిరాశలను ప్రతిబింబిస్తుంది కాబట్టి చూస్తే తప్పు లేదన్న ఆలోచనతో వెళ్ళా.

ఇంకా తేరుకోలేక పోతున్నా!మేము వెళ్ళేసరికి సినిమా ఆరంభమయింది.అడుగు పెడుతూనే పుల్ల లాంటి వొంటిలో కళ్ళు తప్ప మరేమే లేని(మెదడు కూడా లేదని త్వరలో తెలిసింది) ఓ అమ్మాయి,తయారు చేయటంలో దేవుడు ఏదో లోపం చేయటం వల్ల సరిగా ఏర్పాటు కాని అమ్మాయి(మెదడు వ్యవస్థ కూడా సరిగా ఏర్పడలేదని అర్ధమయిపోయింది) లిద్దరూ కలసి కాలేజీలో సీనియర్లు అనాగరికంగా ఏడిపిస్తూంటే(మన సినిమాల్లో నాగరికమయిన కాలేజీలను ఆశించటం మూర్ఖత్వం),వొళ్ళంతా ఎర్రటి ఆఫ్రికా జాతి మానవ భక్షక చీమలు పాకుతూ కొరికుతూంటే,స్థిరంగా నిలబడలేక అటూ ఇటూ గెంతుతూ,అర్జెంటుగా వస్తూన్నా ఆపుకుంటూ బహిర్భూమికి పరుగెత్తలేక,కాలుతున్న లోహ కప్పుపయిన చిందులు వేసే పిల్లి లా కదిలే హీరో దగ్గరకు వస్తారు.అసలే నెల రోజులు తిండి లేని నక్కలా వున్న హీరో,వొళ్ళంతా చీమలు కరుస్తూంటే గెంతులు వేస్తూ పోయి బలంగా వున్న వాడిని దెబ్బ వేస్తాడు.వాడు పడిపోతాడు.జరిగింది అర్ధమయ్యే లొపల నమ్మలేని దృశ్యం వచ్చింది.తాగు బొతూ,నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యర్ధ ప్రలాపి,అమ్మాయిలంటే గౌరవమూ,మర్యాదాలేని అనాగరిక అల్ప బుద్ధి కలవాడూ అయిన హీరో అసందర్భ అనాగరిక ప్రేలాపన చూస్తూ కూడా ఒక మెదడు లేని పిల్ల ఐ లవ్ యూ అంటుంది.దానికి ఈ ఆఫ్రికా జాతి చీమలు మరింతా కసిగా కరుస్తున్నట్టు హీరో ఇంకా పిచ్చిగా ప్రవర్తిస్తాడు.ఇది చూసి ఇంకో మెదడు లేని పిల్ల ఈ అనాగరిక అర్భకుడు ఎలాంటి అమ్మాయి కావాలంటూంటాడో అలా అవ్వాలని తపన పడుతుంది.ఇదేమిటో అర్ధమయ్యేలోగా,హిందీ అపహరణ్ సినిమాలోలా జైలు లోంచే విలన్ హత్యలు చేస్తూంటాడు,ఘోరంగా,కృరంగా,కర్కొటకంగా,రాక్షసులే భయపడే రీతిలో హత్యలు చేస్తాడు.నాకు తెరపైన కనిపిస్తున్న దానికన్నా,తెరముందు,ఇదంతా ఆనందంతో చూస్తున్న పెద్దలు,మహిళలూ,యువతీ యువకులు,పిల్లలనూ చూస్తూంటే భయమూ బాధలూ ఎక్కువయ్యాయి.ఈ హింసలు ఈ హీరోయిజాలు పసివారి మెదళ్ళను ఎంత ఘోరంగా ప్రభావితం చేస్తాయో ఊహించాలంటేనే భయం వేస్తుంది.
ఇక హీరో హీరోయిన్ల రొమాన్స్ మొదలయింది.హీరోగాడో పెద్ద విఞాని అయినట్టు ఆడవాళ్ళ గురించి అభిప్రాయాలు చెప్తూంటే,కళ్ళు తప్ప మెదడులేని అమ్మాయి కళ్ళింతలు చేసి విని వెర్రిదవుతూంటుంది.అది చూసి నాకు ఇటు అటు కూచున్న యువ జంటలు వాళ్ళ స్థాయిలో వెర్రెక్కి పోయారు.
ఆహా, నా మనసు ఒక్క సారిగా ఆనాటి రొమాన్స్ వైపు పరుగెత్తింది.నాయిక కడగంటి చూపులో ఎనలేని శృంగార భావాల కావ్యాలు కదిలేవి.నాయికా నాయకుల ప్రేమ భావన ఎదలోతుల్లో పూయించిన మల్లెల పరిమళం జీవితాంతం వెన్నంటి వుండి శృంగారపుటాలోచనలకు పరిమళం అద్దేది.
ఇంతలో గుండెలదిరే బీటుతో ఒక పాట వచ్చింది.హాలు వూగి పోయింది.పోన్లే అర్ధం లేకున్న ఇది బాగానేవుందనుకునే లోపల హీరొని చూసిన విల్లన్  పిచ్చెక్కిన కుక్కలా హీరో వెంట పడతాడు.హీరోని చంపమని అనుచరులను పంపుతాడు.అదేమిటో అసంబద్ధ మలుపు అర్ధం చేసుకునే లోపలే హీరోల తాగుళ్ళు,వ్యర్ధ ప్రలాపనలూ,నాయిక మెదడెదగని ప్రేమ ప్రలాపనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఇంతలో ఈ సినిమాలో నాకు అద్భుతం అనిపించిన ఒకే ఒక్క దృశ్యం వచ్చింది.
మండుటెండలో చల్లని నీడలా,ఎడారిలో ఒయాసిస్సులా,కారు చీకటిలో,వెలుగునింపే తారల్లా,భానుమతి స్వరం వినిపించింది.మనసున మల్లెల మాలలూగెనే అన్న పాట వినిపించింది.అది చూసి ఆనందించేలోగా,హీరో తాగి వస్తే,వాడి కోసం ఇంకో బాటిల్ తెచ్చానని హీరోయిన్ అంటుంది.మల్లెల మాలలు కాస్త బ్రాందీ బాటిళ్ళయిపోయాయి.ఇక సినిమా చూడలేక పోయాను.
ఆతరువాత,కార్లో ఒక పాత్రని హిన్సించిన తీరు,ఆ తరువాత హీరో పశువులా అందరినీ చంపి,సాడిస్తుకే పెద్దన్నలా ప్రవర్తిస్తో అదే హీరోయిజం అంటూంటే,అది చూసి ప్రజలు ఉబ్బి తబ్బిబ్బవుతూంటే ఇక వుండలేక పోయాను.ఇది చాలదన్నట్టు,హీరో నక్సలిసం గురించి లెక్చరిచ్చి,పేదల గురించి మాట్లాడే హక్కు తనకే వుందనటంతో షాకు తగిలింది.అదేదో టీవీ ప్రకటనలో లాగా,షాక్ లగ లగ అని నా జుట్టు అట్టలాగా లేచి నిలబడింది.నేనూ లేచి నిలబడ్డా.సినిమాలో చలోరే చలోరే అంటూ హీరో రక్త పిపాసి,రాక్షస పిశాచి గర్వంగా ఎటో పోతున్నాడు.నా మితృడిని వదలి బయటకు వచ్చా.వాడూ వెంటే వచ్చాడు.ఇద్దరమూ,గేటు వాడిని బ్రతిమిలాడి తలుపులు తెరిపించుకుని పరుగు పరుగున థియేటర్ దాటి వచ్చేసాము.తరువాత ఏమయిందో తెలుసుకోవాలనీ లేదు.
కానీ,ఇల్లాంటి సినిమాలు చూస్తూ ఆనందిస్తున్న సామాజిక మానసిక స్థితినీ భవిశ్యత్తునూ ఊహించాలంటేనే భయం వేస్తోంది.
ఇంటికొచ్చేసరికి గ్లోబల్ వార్మింగ్ గురించి అందరూ చర్చిస్తున్నారు.కొత్తపాళీ గారు నన్నూ పాల్గొన మన్నారు.కానీ నాకు గ్లోబల్ వార్మింగ కన్న సినిమాల ప్రభావ పొల్యూషన్ ఎక్కువ భయపెడుతోంది.అందుకే నేమో తీవ్ర వాదుల దాడుల్లో రక్తపుటేరులు పారుతూన్న మనకు ఏమీ అనిపించటంలేదు.సినిమాల్లో హింస చూస్తూ నిజ జీవితంలో హింసను ఎంజాయ్ చేయటం అలవాటయి పోయినట్టుంది.సినిమాల్లో వొళ్ళు తప్ప మెదడు లేని నాయికలను చూస్తూ ఆడవాళ్ళంత అంతే అన్న నమ్మకం స్థిరపడుతున్నట్టుంది.అందుకే వయసుతో,సామాజిక స్థాయితో నిమిత్తం లేకుండా మహిళలంతా వేధింపులకూ,అత్యాచారాలకూ గురవుతున్నారు.సమాజం ఆ వార్తలు చూస్తూ జల్సా చేసుకుంటోంది.
ఏమో,ఇంటికి వచ్చి  చాయాగీత్ వింటూ,టాగోర్ గీతాంజలి చదివితే కానీ మామూలు మనిషిని కాలేక పోయాను.
ఇంకా పూర్తిగా తేరుకోలేదు.
దీన్ని ఎవ్వరూ సినిమా రెవ్యూగా భావించకూడదు.ఎందుకంటే సినిమా నేను పూర్తిగా చూడలేదు.
    

June 8, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.