Archive for June 9, 2008

సహవాసి యేడుతరాలు,హేలీ రూట్స్ ఒకటేనా?

దిల్ గారు నా పురాణ ప్రలాపానికి సంబంధించిన వ్యాఖ్య చేస్తూ కొన్ని మంచి అంశాలను సూచించారు.ధన్యవాదాలు.వాటికి అక్కడే సమాధానం ఇచ్చాను.కానీ ఒక విషయానికి అక్కడే సమాధానం ఇస్తే సరిపోదనిపించింది.అందుకే ఈ వ్యాసం రాస్తున్నాను.
నా రాతల్లో,గమనిస్తే,నేను సహవాసి గారి అనువాద చాతుర్యాన్ని గురించిన సందేహాలు ఏవీ వ్యక్తం చేయలేదు.నేను చేసిన వ్యాఖ్య దృష్టి గురించి.
ప్రతి రచయితకూ,ఆమాటకొస్తే ప్రతి వ్యక్తికీ తనదయిన ప్రత్యేకమయిన దృష్టి వుంటుంది.అతని ఇష్టాయిష్టాలను అతని దృష్టి ప్రభావితం చేస్తుంది.దీని గురించి మన ప్రాచీన సాహిత్యంలో ఒక కథ వుంది.
నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును స్పర్శించారు.తోకను స్పృషించినవాడు ఏనుగంటే తోకనే అనుకున్నాడు.తొండాన్ని తాకిన వాడు ఏనుగంటే తొండమే అనుకున్నాడు.ఇలా.అంటే ఏవరి దృష్టిని బట్టి,పరిమితులను బట్టి వారు విషయాన్ని అర్ధం చేసుకునే విధం వుంటుందన్నమాట.సరయిన సత్యం తెలియాలంటే వ్యక్తి తన పరిమితులను దాటి చూడగలగాలి.సమ్యక్ దృష్టిని ప్రదర్శించాలి.
ఆదినుంచీ మన తెలుగు సాహిత్యంలో వామ పక్ష భావాలు ప్రదర్శించిన రచయితలకే గుర్తింపు లభిస్తూ వచ్చింది.దాంతో వ్యక్తిగతాభిప్రాయాలతో సంబంధం లేకుండా గుర్తింపు కోసం,సమాజంలో ఒక స్థాయి చేరుకోవటం కోసం రచయితలు  ప్రచారంపొంది,ప్రచలితంలో వున్న భావాలనే ప్రకటిస్తూ వచ్చారు.అందుకే,తెలుగు సాహిత్యంలో విమర్శకులు మంచి కథ,కథాంశము వంటి వాటి చుట్టూ కంచెలు కట్టారు.వాటిని చట్రాల్లో బిగించారు. గమనిస్తే,ఇప్పటికీ పేదవారి గురించి,పేదరికం గురించి రాసిన రాతలే మంచి రచనలుగా చలామణీ అవుతాయి.నచ్చినా నచ్చకున్నా ఆ రచనలను పొగడటం వల్ల పేదవారికేమీ చేయటంలేదన్న అపరాధ భావన సంతృప్తి చెందుతుంది.ఇది సమాజంలో అడుగడుగునా చూడవచ్చు.ఆమధ్య  ఒక టీవీ చానెల్ పోటీల్లో పకిస్తాన్ వారు పాల్గొంటే ప్రతిభ లేకున్నా కావాలని పాకిస్తానీవాడికే ప్రథమ బహుమతి ఇవ్వటం అందరమూ చూశాము.అలాంటిదే ఇది.తమ విషాల హృదయం చాతుకోవటానికి,దయార్ద్ర హృదయం ప్రకటించటానికి సాహిత్యంలో కూడా ఇదే జరుగుతోంది.అందుకే,మీకు వందేళ్ళ కథల సంకలనాల్లో విశ్వనాథ సత్యనారాయణతో సహా  అనేక సాంప్రదాయిక రచయితల కథలు కనిపించవు.ఎందుకంటే సాహిత్య రంగంపైన పట్టు సాంప్రదాయిక వాదులకు లేదు.వారు,చాందసవాదులు,అభ్యుదయ నిరోధకులూ అయ్యారు.ఇది ఇప్పటికి కూడా కొనసాగుతోంది.
ఇటీవలే ఒక సభలో ఒక పత్రిక ఎడిటర్ కలిశాడు.ఇంకో పత్రికలో వతున్న నా నవల చదివానన్నడు.ఎలావుందని అడిగా.
నీ రచన శైలితో మాకు ఇబ్బంది లేదు.నీ భావాలతోనే ఇబ్బంది అన్నాడు.
అందరూ ఒకేలా ఆలోచిస్తే ఎవరూ ఆలోచించనట్టేఅ.అన్నంలో ఉప్పు కారం అవసరమయినట్టే,ప్రపంచంలో భిన్నాభిప్రాయాల అవసరంవుందని అన్నా
అంటే,ఆయన తన పత్రికలో కేవలం తన భావాలను సమర్ధించేవారికే ప్రోత్సాహం ఇస్తాడన్నమాట.నిజంతో,రచనా నాణ్యతతో పనిలేదు.
ఇంకో పత్రిక ఎడిటర్,నువ్వు హిందూ ధర్మం గురించి రాయటం మానెయ్యి,నీకు పేరొస్తుంది అని సలహా ఇచ్చాడు,ఆయన ఎడిటర్ అవగానే ఆ పత్రికలో నా శీర్షికను ఆపుతూ.
దీన్ని బట్టి మీకు అర్ధమయ్యే వుంటుంది,తెలుగు సాహిత్యంలో నెలకొని వున్న పరిస్థితి.(ఇవి మచ్చుకి మాత్రమే)
ఇప్పుడు సహవాసి అనువదించిన రూట్స్ దగ్గరకు వద్దాం.
రూట్స్ తెలుగులో సన్ క్షిప్త అనువాదమే తప్ప పూర్తి అనువాదం కాదు.ఈ పుస్తకానికి ముందు మాటలోనే ప్రచురణకర్తలు ‘ తెల్లవాళ్ళు దాతలుగా,నల్లవాళ్ళు గ్రహీతలుగా వుండే వ్యవస్థ పోయి,సమాన భాగస్వాములుగా వుండే వ్యవస్థ కోసం అమెరికాలోని నల్లజాతి పోరాడుతోంది.ఈ పోరాట ప్రతిధ్వనులు అలెక్స్ హేలీ యేడు తరాలలో బానిస వాడల్లో అనేక తూర్లు వినిపిస్తాయి ‘ అని వ్యాఖ్యానించారు.
ఆంగ్లం లో రూట్స్ చదివిన వారికి ఎక్కడా ద్వేషం కనబడదు.తెల్లవారిని దూషించటం కనబడదు.పరిస్థితిని వున్నది వున్నట్టు వివరించటం కనిపిస్తుంది.తిరుగుబాటు గురించిన వార్తలు వినిపిస్తాయి.కానీ దానికి ప్రధాన పాత్రధారి స్పందనలో సానుకూలత కనబడదు.ఆరంభంలో తనని పట్టుకున్న వారిని చంపాలని ఆలోచించినా అతడికి ఎంతసేపూ తప్పించుకుని తనవారి దగ్గరకు పారిపోవాలని వుంటుంది తప్ప మరో ఆలోచన వుండదు.ఎప్పుడయిదే అది కుదరదని అర్ధమవుతుందో అప్పుడు,తన సంస్కృతీ సాంప్రదాయాలను తరువాతి తరానికి అందజేయలన్న తపన చూపుతాడు.
but,their worst enemy,it seemed to kuntaa,was themselves…..
he vowed to himself that now more than ever,his dignity must become as a shield  between him and all those who called themselves niggers.how ignorant of themselves they were;they knew nothing of their ancestors,as he had been taught from boyhood.kunta reviewed in his mind the names of the kintes from the ancient clan in old mali down across the generations in mauretania,then in gambia all the way to his brothers and himself;and he thought of how the same ancestral knowledge was possessed by every member of his kafo.’
ఇలా ఆలోచించి కుంటా తన పూర్వీకుల గురించి తన సంతానానికి తెలపాలని నిశ్చయించుకుంటాడు.కుంటాకు పాప పుట్టిన సందర్భంలో ఆమెకు ఆఫ్రికా పేరు పెట్టలంటాడు.ఆఫ్రికాలోలాగ పద్ధతులు పాటించాలంటాడు.కానీ అతని భార్య ఒప్పుకోదు.అప్పుడు ఆమెతో పోరాడి,పాపను బయటకు తీసుకువెళ్తాడు.
then,under the moon and stars,kunta raised the baby upwards,turning,the blanketed bundle in his hands so that the baby’s right ear touched against his lips.and then slowly and distinctly in mandinka,he whispered three times into the tiny ear.your name is kizzy.it was done,as it had been done with himself,as it would have been done with this infant had she been born in her ancestral homeland.she had become the first person to know who she was.
kunta felt africa pumping in his veins-and flowing from him into the child,the flesh of him and bell-as he walked on a little farther.
ఈ సన్నివేశం లో రచయిత దృష్టి తెలుస్తుంది.అలెక్స్ హేలీకి తెల్లవాళ్ళ అణచివెత చూపాలని లేదు.ఒక ఆటవికుడు,తన పద్ధతులను సజీవంగా ఒక తరం నుంచి మరో తరానికి అందించాలన్న తపన పట్టుదలలను చూపాలని ప్రయత్నించాడు.లేకపోతే ఈ దృష్యాన్ని ఇంత విపులంగా,ఎద కదిలేలా వర్ణించాల్సిన అవసరం లేదు.దీనికి తెలుగు అనువాదంలో కీలకమయిన వాక్యాలు,కుంటా తపనను తెలిపే వాక్యాలు కనబడవు.
‘నీ పెరు కిజ్జీ అని మూడు తూర్లు స్పష్టంగా ఉచ్చరిస్తూ ఊదాడు.”
ఇంతే,అంటే,కుంటా ఇలా చేయటం వెనుక ఉన్న పరమార్ధాన్ని పలుచన చేసి అసలు విషయాన్ని కప్పిపుచ్చటం జరిగిందన్నమాట.ఇలా అడుగడుగునా కుంటా తన సంస్కృతిని నిలబెట్టుకోవాలన్న తపనకు సంబంధించినవాటన్నిటినీ విస్మరించారు.ఏమయినా అంటే,ఇది సన్ క్షిప్త అనువాదం కదా అంతా వున్నదున్నట్టు చేయలేము అని తప్పించుకుంటారు.ఇదంతా ఎందుకంటే,ప్రజలకు అణచివేత తెలియాలి కానీ,అణచివేతలో కూడా తన పూర్వీకుల సాంప్రదాయాల్ని నిలపటంకోసం పడిన తపన తెలితకూడదన్నమాట.ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.ఇల్లంటి ఉదాహరణలనేకం వున్నాయి.అందుకే,తెలుగులో అలెక్స్ హేలీ పుస్తకంలో అక్షరాల అర్ధాలు వచ్చాయి కానీ  వటి భావం రాలేదు.అలెక్స్ హేలీ లక్ష్యం తెలుగు పాఠకులకు చేరలేదు.
ఇంతెందుకు,పేరులోనే హేలీ వుద్దేష్యం తెలుస్తుంది.నవల పేరు రూట్స్.అంటే అర్ధం చెప్పవలసిన అవసరం లేదు.తన ప్రాచీనులను వెతుకుతూ తన మూలాలను చేరుకోవటాన్ని సూచిస్తుంది ఇది.తెలుగులో ఇది యేడు తరాలయింది.యేడు తరాల అణచివేత చూపుతుందన్నమాట.రూట్స్ పదంలోని విస్తృతి యేడు తరాలలోని సంకుచితిని అర్ధంచేసుకుంటే,నా వ్యాఖ్యలోని వుద్దేష్యం అర్ధమవుతుంది.నేను సహవాసి యేడుతరాలు,హేలీ రూట్స్ ఒకటేనా?అని ఎందుకు అడిగానో తెలుస్తుంది. మాంగల్యం తంతునా అంటే తంతునా వుంది కాబట్టి తంతునా? అని అడగడటం ఎలాంటిదో,యేడుతరాలు రూట్స్ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుదనటం అలాంటిది. 
 

June 9, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu