Archive for June 10, 2008

సగటు మనిషి స్వగతం-3

ఏమిటోసగటు మనిషి నుదుటన అదృష్టం అన్నది రాయటం మరచిపోతాడేమో దేవుడు.లేకపోతే,ఇన్ని బాధలు పడుతూ జీవితం నెట్టుకు రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి.ఒకటి,రెండు కాదు జీవితమంతా బాధామయ వేదనల రోదనలే.పెద్ద బాధలు వదిలేయండి.చిన్న చిన్న బాధలే ఎంతెంత పెద్దగా ఏడిపిస్తాయో!
అదేమిటో,ఎప్పుడూ నేనున్న కాలనీలోనే కరెంటు పోతుంది.అందరికీ కరెంటుంటుంది.నాకే,సరిగ్గా నేనేదయినా చదవాలనుకున్నా,కార్యక్రమం చూడాలనుకున్నా,పది మంది ఇంటికి వచ్చినా,మా ఇంట్లో గాఢాంధకారం.
కరెంటు పోగానే టార్చి కోసం వెతకటం ఓ ప్రహసనం.కాళ్ళు మొలుచుకొచ్చినట్టు,అది పెట్టిన చోట వుండకుండా,మా ఇంట్లో నాకే తెలియని రహస్య స్థలాలలో దాక్కుంటుంది.టార్చేకాదు,ఎప్పుడు ఏది అవసరమయితే అదే కనిపించదు.రెండు,మూడు గంటలు వెతికి విసిగి ఎలాగో పని గడిపేస్తే,అప్పుడు వెక్కిరింపుగా నవ్వుతూ ఎదురుగానే కనబడి ఒళ్ళు మండిస్తుంది.
టార్చి దొరకలేదని కొవ్వొత్తి వెలిగిద్దామంటే అది దొరకదు.కొవ్వొత్తి దొరికితే అగ్గిపెట్టె దొరకదు.తీరా అష్టకష్టాలు పడి,దీపం వెలిగిస్తే ‘దీపమెందుకు నేనుండగా ‘ అని కరెంటు వస్తుంది.కరెంటు వచ్చింది కదా అని దీపం ఆర్పితే,’వెలిగించారుగా దీపం,మీ మొహాలకి ఆ గుడ్డి వెలుతురు చాల్లే ‘అని అలిగి కరెంటు పోతుంది.మళ్ళీ కొవ్వొత్తి వెలిగిస్తే మళ్ళీ పరుగెత్తుకొస్తుంది.
నేనున్న కాలనీలో ఎప్పుడూ కరెంటు పోతూ,పక్క కాలనీలో దీపాలు ఎప్పుడూ వెలుగుతూండటం చూసి ఇల్లు ఆ కాలనీకి మార్చుకున్నాను.నా దురదృష్టం కూడా నాతో పాటూ కాలనీ మార్చిందని వేరే చెప్పనక్కర్లేదు కదా!
కరెంటు విషయమే కాదు,బస్సు చూడండి.అవసరం లేనప్పుడు అయిదు నిముషాలకొకటి వచ్చి ఊరిస్తుంది.అవసరమయినప్పుడు ప్క్కటీ రాదు.వచ్చినా మనుషులతో నిండి వస్తుంది.స్టాపులో ఆగదు.అర్జెంటు పను వుండి ఆటో ఎక్కితే,ట్రాఫిక్ జామవుతుంది.ఆటో పాడవుతుంది.నేనెక్కితే ఎంత సూపర్ ఫాస్ట్ రైలయినా లేటవుతుంది.ఈ బాధలెందుకని అందరూ కొంటున్న ద్విచక్ర వాహనం కొంటే,నేను కొన్న బండికి మాత్రం రిపేర్లొస్తాయి.నేనుకొనగానే బండి ధర తగ్గిపోతుంది.పెట్రోలు ధర రోజుకి పది రూపాయలు పెరుగుతుంది.
కరెంటు,బస్సులే కాదు కరెక్టుగా నా వంతు రాగానే కౌంటరు మూత పడుతుంది.నేను రూలు పాటించినా ఫైను కట్టాల్సి వస్తుంది.
నేనెప్పుడు గుడికెళ్ళినా ఎవరో వీ ఐ పీ లు వస్తారు.వంద రూపాయలు పెట్టి ప్రత్యేక దర్శనం టికెట్ కొంటే,ఆరోజు ప్రధాని వస్తాడు.సినిమా హాల్లో ఎప్పుడూ నా ముందు అమితాభ్ అన్న వచ్చి కూచుంటాడు.ఇంతవరకూ ఏ సినిమా కూడా పూర్తి తెరపై చూడలేదు.తలల మధ్యనుంచి,వాళ్ళెటు కదిలితే,వ్యతిరేక దిశలో కదుల్తూ చూసా తప్ప ప్రశాంతంగా చూడలేదు.
అందరికీ అడిగినంత,అడగంగానే లీవు దొరుకుతుంది.నా దగ్గరకు రాగానే,ఇంపార్టెంటు పని వస్తుంది.ఇన్స్పెక్షన్ వస్తుంది.
ప్రమోషన్ కూడా,నా ముందువరకూ వచ్చి,దీర్ఘకాల మలబద్ధక రోగిలా ఆగిపోతుంది.ఒక వేళ వచ్చినా అది మోషనా,ప్రమోషనా అర్ధం కాదు.అందరూ కోరిన చోట పోస్టింగ్ సాధిస్తారు.నాకు మాత్రం అందరూ వద్దన్న నరకంలో దొరుకుతుంది.
ఇవకాదు,నాకెవరయినా ఆటగాడు ఇష్టం అన్నా,నటుడు ఇష్టమయినా వాళ్ళ పని అయిపోతుంది.నాకు స్టెఫీ గ్రాఫ్ అంటే ఇష్టం.అనగానే,ఆవిడ ఆట మాని పెళ్ళిచేసేసుకుంది.రాహుల్ ద్రావిడ్ ఇష్టం అనగానే అతడు బంతిని చూసి బాంబని బెదురుతున్నాడు.
బ్రతికిన వాళ్ళని పోనీ,పోయిన వాళ్ళు కూడా నా వల్ల తిట్లు తింటున్నారు.నాకు మహాత్మ గాంధీ అంటే ఇష్టం.అంతే,అందరూ పని గట్టుకుని,మరీ గాంధీ గారిని ఘోరంగా,వక్ర దృష్టి తో చూసి,ప్రతి పనికీ వక్ర భాష్యం ఇచ్చి చంకలెగరెస్తున్నారు.చిన్న చిన్న బాధలు ఇంతింత బాధ పెడుతూంటే,కనీసం దేవుడితో మొర పెట్టుకుందామంటే,దేవుడు లేడు లేడు అంటున్నారు.అంతా భ్రమ అంటున్నారు.మూర్ఖత్వం అని తిడుతున్నారు.కనీసం రామా అనటానికి కూడా లేకుండా పోయింది.
ఏమి చేయమంటారు చెప్పండి?ప్రపంచమంతా సగటు మనిషి పయిన కక్ష కట్టినట్టుంది.

ఇది,8-6-2008 ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురిత మయింది.

June 10, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized