Archive for June 11, 2008

ప్రేమంటే ఏమిటి?-నా నవలలోంచి.

ఒక బ్లాగులో ప్రేమ గురించి ఆసక్తి కరమయిన చర్చ చూశాను.నా నవల ‘అంతర్మధనం ‘ ఒక యువకుడి ప్రేమ భావనతో అనుభవాలు  కేంద్ర బిందువుగా సాగుతుంది.అందులో ఒక సందర్భంలో రెండు పాత్రల నడుమ ప్రేమ విషయంలో చర్చ జరుగుతుంది.ఆ భాగాన్ని మీ ముందుంచుతున్నాను.

ఏమిటోయ్ సెలవు రోజు కూడా ఒక్కడివే తిరుగుతున్నావు?అడిగాడు వీరభద్రం.
ఒక్కడినే తిరగటం ఏమిటి? అయోమయంగా అడిగాడు శరత్.
అదేనోయ్,నీ జంట ఏది?నీకింకా ప్రేయసి దొరకలేదా? వ్యంగ్యంగా అడిగాడు ఆనందరావు.
మనస్సులో వాళ్ళని తిట్టుకుంటూ పైకి ఏడవలేక నవ్వాడు శరత్.
ఏమిటీ నీకింకా చేపలు పట్టటం రాలేదా?లేక పిట్టలకు వల వేయటం నేర్వలేదా? నవ్వాడు ఆనందరావు.
శరత్ కు కోపం వచ్చింది.
నా దృష్టిలో అమ్మాయిలు పిట్టలూ,చేపలూ కారు.వ్యక్తిత్వమున్న మనుషులు.ప్రేమ అంటే చేపలు పట్టటం కాదు.అదొక అనిర్వచనీయమయిన ఆత్మానుభూతి.అన్నాడు శరత్.
ఆనందరావు పడీ పడీ నవ్వాడు.
చాలా రోజులకు ఓ అమాయకుడిని చూశాను.అందుకని నవ్వొచ్చింది.నీలాంటి వాళ్ళ ఆదర్శాల మేడిపళ్ళ పొట్టవిచ్చి చూపటం అంటే నాకు సరదా,అన్నాడు ఆనందరావు.
శరత్ కి చిరాకనిపించింది.
ఏమిటి,నా ఆదర్శాలలో మేడిపండుతనం?కయ్యానికి దిగుతూ అడిగాడు.
వ్యక్తిత్వమున్న మనుషులూ,అనిర్వచనీయమయిన ఆత్మానుభూతి.రెండూ మేడి పండు పదాలు.వీటి అసలు పేరు ఆత్మ వంచన.
ఎందుకు?
ముందు నీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటో చెప్పు.వ్యక్తిత్వాన్ని నిర్వచించు.ఆత్మానుభూతి అంటే వివరించు.ఆ తరువాత ఆత్మవంచన అంటే ఏమిటో చెప్తాను.
వాదన ఆరంభించింది మీరు.మీరే వివరించాలి,మొండిగా అన్నాడు శరత్.
ఆ పదాలకు అర్ధం ఏమిటో నీకు తెలియదు.దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నన్నే ఆరంభించమంటున్నావు.సరే కానీ,అన్నాడు ఆనందరావు.
ఆనందరావు ఆరంభించాడు.
ప్రేమ అంటే ఏమిటోయ్.ఏమీ లేదు.ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరినొకరు వాంచించటం ప్రేమ.ఆ ఒకరినొకరు ఎంత గాఢంగా వాంచించుకుంటారంటే,ఒకరు లేక ఒకరు బ్రతకలేరనుకుంటారు.కలసి బ్రతకాలనే వారి కోరిక ముందు సమాజం,తల్లిదండృలు,అన్నీ దిగదుడుపు.ఒకవేళ కలవలేకపోతే తాగి పనికిరానివారయినా అవుతారు.ఆత్మహత్యలు చేసుకుని చస్తారు.లేక ఖర్మకాలి ఎవరినయినా పెళ్ళిచేసుకుంటే వాళ్ళ జీవితాలు నరకంచేసి తామూ నరకంలో బ్రతుకుతారు.ఇదేనా ప్రేమ అంటే?
శరత్ మాట్లాడలేదు.
శరత్,ప్రేమ మానసిక బలహీనతకు పర్యాయపదమోయ్.
ప్రేమ మానసిక బలహీనతనా?ఒప్పుకోలేకపోయాడు శరత్.
నవాడు ఆనందరావు.
ప్రేమలో ఏముందోయ్,అమ్మాయి,అబ్బాయిలు ఒకరు లేక మరొకరు లేమని నిశ్చయించుకోవాలి.మనసున మనసై బ్రతుకున బ్రతుకై,తోడొకరుండిన అదే భాగ్యమనికదా మీ ప్రేమకు ఉత్తమ నిర్వచనం.అంటే నీ బాధలు,కష్టాలు,సుఖాలు పంచుకోటానికి ఓ తోడు కావాలనేకదా!ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయే మనిషి ఒంటరిగానే బ్రతుకుతాడు.ఒంతరిగానే పోతాడు.దీన్లో తోడు కోరుకోవటం మానసిక బలహీనత కాక మరేమిటి?ఎవర్నో మనం వాంచించాలని,ఎవరో మనం లేక పోతే బ్రతకలేని పరిస్థితి రావాలని కోరుకోవటం మానసిక బలహీనత కాక ఏమిటి?
మనిషి ఒంటరి ఎలా అవుతాడు?తల్లి తండ్రి,భార్య పిల్లలు,శరత్ మాటలకు అడ్డొచ్చాడు ఆనందరావు.
అంతా మనం ఆడుకునే నాటకం.తల్లితండృలకూ పిల్లలకూ మధ్య ఒక ప్రపంచానికీ మరో ప్రపంచానికీ మధ్య వుండే అంతరం వుంటుంది.భర్తకూ భార్యకూ అంతే.ప్రతి మనిషీ ఒక ప్రత్యేక ప్రపంచం.అది మరో ప్రపంచంతో ఎంతగా కలవాలని ప్రయత్నించినా ఒంటరే.ఒకవేళ కలిస్తే అది తన ప్రత్యేకత కోల్పోతుంది.అంటే వ్యక్తిత్వ రహితమై పోతుంది.తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.అంటే మీరూహిస్తున్న ఒకరిలో ఒకరు మమేకమయ్యే ప్రేమ వుండాలంటే వ్యక్తిత్వాలుండని పరిస్థితి రావాలి.
మీరు వక్ర భాష్యం ఇస్తున్నారు.రాధాకృష్ణుల ప్రేమ….
రాధాకృష్ణులది నిజమైన ప్రేమ అయితే మరి ఎనిమిదిమంది భార్యలెందుకు?అది కృత్రిమమయిన ప్రేమనా?కృష్ణ్డు భగవంతుడని భాష్యాలు చెప్పకు.కృష్ణ్డిని మామూలు మనిషి చేసి చూడు.కృష్ణ్డ్ మామూలు మగవాడు.రాధ వైపు ఆకర్షణ ఒక వైపు,అది వ్యక్తికి యవ్వనావిర్భావంలో తనకన్నా పెద్ద వయసువారివైపు ఉండే ఆకర్షణ.కాబట్టి కృష్ణ్డు రాధ వైపు ఆకర్షితిడయ్యాడు.ఈ ఆకర్షణ ఎక్కువ కాలం వుండదు.వ్యక్తి ఎదుగుతున్నకొద్దీ,వ్యక్తిత్వం ఏర్పడుతుంది.అతని దృక్కోణం మారుతుంది.రాధ ఆకర్షణను దాటి కృష్ణుడు ఎదిగాడు.కానీ ప్రథ అనుభవం చిరంజీవిగా వుంటుంది.ఆ వ్యక్తిపట్ల అనురాగాన్ని సజీవంగా వుంచుతుంది.అది కృష్ణుడికి రాధపై ఉన్న భావన.రాధ సంగతి వేరు.ఆమె జీవితంలోని అసంతృప్తిని తొలగించి,అద్భుతమయిన అనుభవాలను చూపి ఆనందాలందించిన కృష్ణుడు ఆమెకు దైవం అవటంలో ఆశ్చర్యం లేదు.పురుషుడి ప్రేమ భ్రమరం లాంటిది.పువ్వు నుంచ్ పువ్వుకు ఎగుర్తూ పోతుంది.స్త్రీ ప్రేమ పుష్పం లాంటిది.ఎగిరిపోయిన భ్రమరంకోసం ఎదురుచూస్తూంటుంది.
మతి ఎనిమిదిమంది భార్యలు?అడిగాడు శరత్.
ఒక పురుషుడు ఒక స్త్రీతో సంతృప్తిగా వుండగలగటం అసంభవం.జంతువులను చూడు.మగ జంతువు పని ఆడజంతువుతో సంభొగించి తన బీజం నిలపటమే.తన పని అయిపోగానే మరో ఆడజంతువును వెతుకుతూ పోతుంది.కీటకాలూ అంతే.మనుషుల్లో మౌలికంగా వున్న భావనా ఇదే.కాబట్టి స్త్రీని చూడగానే పురుషుడికి లైంగిక భావన కలగటంలో అతని ప్రమేయం ఏమీ లేదు.అందుకే ఎంతమంది స్త్రీలతో సంభొగించినా పురుషుడికి సంతృప్తి అనేది కలగదు.కానీ ఈ భావనను అడ్డుపెట్టకుండా వదిలేస్తే సమాజం అల్లకల్లోలమవుతుంది.అందుకని సమాజం నియమాలు నిబంధనలు విధించింది.ఇష్టం వచ్చినట్టు ప్రవహించే నదిలాంటి లైగిక భావనకు అడ్డుకట్టవేసి వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసింది.అందుకే శ్రీ కృష్ణుడు ఎనిమిది మంది భార్యలనూ ప్రేమించగలిగాడు.గోపికలతో రమించగలిగాడు.రాధని హృదయంలో నిలుపుకోగలిగాడు.కానీ అందరికీ అది సాధ్యంకాదు.మనస్సు సమాజం విధించిన ఆన్కల హద్దు దాటాలని ఉవ్విళ్ళూరుతుంది.ఏదో అర్ధంకాని ఆశ వైపు పరుగులిడుతూంటుంది.జీవితం అసంతృప్తిమయం అవుతుంది.ఈ అసంతృప్తిని సమర్ధులు కళల రూపంలో వ్యక్త పరుస్తారు.అదికుదరని వారు ఇతరుల అసంతృప్తి ఫలితాలయిన కళలను అనుభవించటం ద్వారా సంతృప్తి పడతారు.అందుకే మన పూర్వీకులు ఏక పత్నీ వ్రతానికి అంత ప్రాధాన్యమిచ్చి రాముడిని ఆదార్షం చేసారు.మనిషిలోని పషు ప్రవృత్తిని అరికట్టి తనదైన స్త్రీపైనే సర్వ దృష్ట్లను కేంద్రీకరించటమన్న అసాధ్యమైన పని సాధ్యం అని నిరూపించి పురుషోత్తముడయ్యాడు.మనవాళ్ళు ఏకస్త్రీ ప్రేమను పవిత్రమైన ప్రేమ చేసారు.అందుకే కళాకారులకు బాధ్యతలు విధించారు.కానీ ఆధునుక వ్యాపార యుగంలో వ్యాపారం అన్నిటికన్నా ప్రాధాన్యాన్ని వహించటంతో కళాకారుడు జీవిక కోసం కళతో వ్యాపారం చేయాల్సి వస్తోంది.దాంతో సులభంగా రెచ్చగొట్టగలిగే పషుప్రవృత్తి కళనే సృష్టిస్తున్నారు.దాన్ని చూసి ప్రజలు రెచ్చిపోతున్నారు.అర్ధమయిందా?ఇది చూసి పిల్లలు పుట్టినప్పటినుంచీ తెలియని ప్రేమ రాహిత్య భావనకు లోనై ప్రేమో రామచంద్రా అని కొట్టుకుపోతున్నారు.అంటే నీ వ్యక్తిత్వాలతో,ఆత్మానందాలతో సంబంధంలేని భావన ఇది.ఇది గాలి,నీరు,నిప్పు వంటి స్వాభావికమైన లైంగిక భావన.దాని చుట్టూ మనం కోటగోడలు కట్టి,సైనికులను పెట్టి,రంగులేని ఈ మ్మనసిక బలహీనత స్థాయికి తెచ్చాం.
శరత్ మనసు పాడయిపోయింది.
ఏమిటీ నామాటలు అర్ధం కావటంలేదా?అన్నిటికీ సెక్స్ మూలం అంటే జీర్ణించుకోలేక పోతున్నావా?వ్యంగ్యంగా అడిగాడు ఆనందరావు.
శరత్ మాట్లాడలేదు.ఆనందరావు నవ్వాడు.
ప్రపంచంలో,ముఖ్యంగా మన సమాజంలో ఆత్మ వంచన అందరికీ అలవాటయిపోయింది.నిజాలు జీర్ణించుకునే శక్తి కోల్పోయారు మనుషులు.తనకు ప్రియమైనది మాట్లాడేవాడే తనవాడు.నిజమయినా అప్రియమయినది చెప్పేవాడు చెడ్డవాడు.ఏ విషయాన్నయినా పైపైన స్పృషించి వదిలేయటంతోటే మాస్టర్ అయిపోతున్నాడు.లోతుగా వెళ్ళి శోధించేవాడు పిచ్చి వాడవుతున్నాడు.అర్ధమయిందా,ప్రేమ ప్రేమ అని పిల్లలను తప్పుదారి పట్టిస్తే కలిగే వ్యాపార లాభాలు చూసావా,సినిమాలు,టూత్ పేస్టులు,చాక్లెట్లు,బిస్కెట్లు,పెన్నులు నానా అడ్డమయిన గడ్డీ యువతీయువకుల ప్రేమ చూపించి అమ్ముకోవచ్చు.ప్రేమంటే ఏమీ లేదురా,అది మనిషిలోని జంతు భావనకు ప్రతి రూపం.దాన్ని ఒక వ్యక్తి పైన నిలుపుకోవటం మానవత్వానికి నిదర్శనం అనటంలో వ్యాపారం లేదు.లాభాలు లేవు.అర్ధమయిందా ప్రేమ అసలు రూపం?
మీరంతా సినికల్ గా చూస్తున్నారు.ప్రేమ భగవత్స్వరూపం.ఒక వ్యక్తి మీద ప్రేమ కలిగితే మిగతా ప్రపంచం శూన్యమయిపోతుంది,ఆవేశంగా అన్నాడు శరత్.
శరత్,ప్రస్తుతం మనకు ఊహలనిచ్చేవి సినిమాలే.సినిమాల్లో మన ఊహలకు రెక్కలనిచ్చేది హీరోయిన్లే.ఎంత కాలం నుంచి ఎంతమంది హీరోయిన్లు మన కలలను అలంకరించారో.యవ్వనంలో అంతా హీరోయిన్ల బొమ్మలు దాచుకున్నవారే.ఇప్పటికీ ఒక హీరోయిన్ వొళ్ళు చూపిందంటే చిన్న పెద్ద బారులు తీరతారు.అరవై ఏళ్ళ ముసలాయనయినా పదహారేళ్ళ పడుచును చూసేందుకు తహ తహ లాడతాడు.ఈ తహ తహను మన వ్యాపార కళాకారులు సొమ్ము చేసుకుంటున్నారు.పత్రికలు,టీవీలు అన్నీ ఈ తహ తహనే పెంచుతున్నాయి.మరి ఈ హీరోయిన్లను చూసేందుకు అంగలార్చే వారధికులు పెళ్ళయినవారే కదా! వాళ్ళంతా భార్యలను ప్రేమిస్తున్న వారే కదా!ఒకరిపై మనసు నిలపటంలో డొల్లతనం అర్ధమయిందా!
శరత్ బయటకు చూస్తూ కూచున్నాడు.
నీకింకో కోణంలో ప్రేమను చూపుతాను.ముందు మనం ప్రేమలో అందం చూస్తాం.కానీ సెక్సుకు అందంతో పనిలేదు.అదిగో ఆ అడుక్కునే ఆమెను చూడు.
శరత్ ఆవైపు చూశాడు.చింపిరి జుట్టుతో అసహ్యంగా వుంది.చంకలో పిల్లాడున్నాడు.
ఆమె ఎంతో అసహ్యంగా వుంది.అందం అన్నది ఆమె దరి దాపులకు రాదు.కానీ ఆమె కోసం కూడా ఆత్రపడేవారున్నారని చంకలో పిల్ల నిరూపిస్తుంది.
శరత్ విద్యుత్ఘాతం తగిలిన వాడిలా చూసాడు.ఆ అడుక్కునే ఆమె వైపు చూశాడు.సిగ్నల్ దగ్గర ఆగివున్న హోండాపై యువకుడి మీద వాలిన యువతి వైపు చూశాడు.రోడ్డు పక్కన పెద్ద బోర్డుపైన అందాలు ఆరబొస్తూ ఏదో అమ్ముతున్న యువతి బొమ్మ చూసాడు.మరో బోర్డుపై కౌగలించుకున్న హీరో హీరోయిన్ల అర్ధనగ్న బొమ్మ వైపు చూసాడు.అడుక్కుంటున్న అమ్మాయి వైపు చూసాడు.
అర్ధమయిందా పశువాంచలో ప్రేమలేదు.అందంలేదు.ఆకర్షణ లేదు.ఆ సమయానికి ఎవరు దొరికితే వారు.అలాంటి పశువును బంధించటానికే పవిత్ర ప్రేమలూ,సంసార బంధాలు,పురాణాల్లో పవిత్ర ప్రేమలు,నీ నవలల్లో త్యాగ ప్రేమలు.మన బ్రతుకంతా యాధృచ్చికమే.ఇద్దరు అనుకోకుండా కలుస్తారు.మాటి మాటికీ కలిస్తే,అవకాషాలు దొరికితే ప్రేమ అవుతుంది.ఎవరి దారిన వారు పోతే ప్రేమ లేదు,దోమ లేదు అర్ధమయిందా,నవాడు ఆనందరావు.
శరత్ లో అంతర్మధనం ఆరంభమయింది.
ఈ నవల 2000 సంవత్సరంలో నడుస్తున్న చరిత్ర పత్రికలో సీరియల్గా వచ్చింది.కస్తూరి ప్రచురణలు ప్రచురించాయి పుస్తకంగా.నెట్లో అజో విభో సైట్ లో దొరుకుతుంది. 

June 11, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.