Archive for June 13, 2008

భూత్ బంగ్లా(కథ)

ఆమెకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.

అంత పెద్ద అందమయిన బంగళా అలా పాడుపడి వుండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.

ఎంతో అందంగా వుంది బంగళా.కనీ ఎవరూ వుండకపోవటంతో దుమ్ము కొట్టుకుపోయి,బూజు పట్టి పాడయిపోయినట్టు కనిపిస్తోంది.దుమ్ము ధూళి శుభ్రం చేసి,బూజు దులిపి శుభ్రంగా కడిగి రంగులు వేయిస్తే రాజ భవనంలా వుంటుంది.సినిమాల్లో చూపించే ధనవంతుల బంగళాలకేమాత్రం తీసిపోదు.

అంతలో ఆమెకో ఆలోచన వచ్చింది.

ఈ బంగళాను కొనేసి దీన్ని అందంగా తయారు చేసి సినిమా షూటింగులకు ఇవ్వచ్చు.లేకపోతే,టూరిజం వారికి అద్దెకివ్వచ్చు.బోలెడన్ని డబ్బులు అప్పనంగా వచ్చిపడతాయి.

ఆమె కళ్ళముందు సుందరమైన దృశ్యాలు కనబడుతున్నాయి.బోలెడంత మంది సినిమావాళ్ళు తిరుగుతున్నారు.కార్లు,వ్యాన్లు ఇంటిముందు ఆగివున్నాయి.రకరకాల సందడులతో కళకళ లాడుతూ కనిపిస్తోంది భవంతి.కుప్పలు తెప్పలుగా డబ్బు ఆకాశమ్నుంచి వర్షిస్తున దృశ్యం కళ్ళముందు కదలాడుతోంది.

ఆమె నెమ్మదిగా భవనం వైపు నడిచింది.

ఆ నిశ్శబ్దంలో ఆమె కాళ్ళకింద నలుగుతున్న ఎండుటాకుల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది.ఆమె భవనాన్ని సమీపిస్తోంటే గాలి పెద్దగా వీయటంతో తుఫాను వచ్చినట్టు ఎండుటాకులన్నీ పెద్ద శబ్దంతో గాల్లోకి ఎగిరాయి.

భవనం గేటు తీస్తూంటే దాన్ని తీసి చాలా కాలమయింది కాబోలు,కీచు మంటూ కేక పెట్టింది.ఆ శబ్దానికి దొంగతనంగా భవంతి ఆవరణలో దూకి ఆడుకుంటున్న పిల్లలు ఉలిక్కిపడి ఈవైపు చూశారు.ఆమే ఇంటి యజమాని అనుకున్నారేమో పెద్దగా కేకలు పెడుతూ గోడ దూకి పారిపోయారు.

నవ్వుకుంది ఆమె.పిల్లలు ఇంతే,స్థలం దొరికితే చాలు ఆడుకునేందుకు దొంగతనంగా గోడలు దూకుతారు.ఎవరయినా వస్తే బెదిరిపారిపోతారు.తన చిన్నతనంలో తానెన్నిసార్లు అలా తోటల్లో దొంగతనంగా దూకింది గుర్తుకు తెచ్చుకుని మధురంగా నవ్వుకుంది ఆమె.

గేటు శబ్దం విని బంగళా కాపలాదారు కాబోలు వచ్చాడు.ఆడవాళ్ళు ఒంటరిగా అంత దూరం రాగలరని ఊహించి వుండడు.అందుకే ఆమెని చూసి బెదిరి షాక్ తిన్నాడు.

ఏం తాతా,ఎవరూ లేరా?నవ్వుతూ అడిగింది.

లేదమ్మ ఎవ్వరూ వుండటంలేదు.అతడి గొంతులో వణుకు తెలుస్తోంది.

ఎందుకు తాతా ఇంత మంచి బంగళాను పాడు పెట్టారు?ఎవరికీ వుండటం ఇష్టంలేకపోతే అమ్మేయవచ్చుగా,చాలా ధర పలుకుతుంది.చనువుగా లోపలకు వచ్చి హాలు చూస్తూ అంది.

అతడు వణుకుతూ ఆమె వెనకే వచ్చాడు.ఎవ్వరూ కొనటానికి రావటంలేదమ్మా,అనాడు.

బయట కలకలం వినిపిస్తే తొంగి చూసింది.ఇందాక పారిపోయిన పిల్లలు గోడకవతలనుండి తొంగి చూస్తున్నారు.ఆమె ఆవైపు చూడగానే అరుస్తూ పారిపోయారు.

పిల్లలు,వాళ్ళకుతూహలం.ఏంతాతా,ఎవ్వరూ ఎందుకు కొనటానికి రావటంలేదు?అడిగింది.

ఏం చెప్పాలమ్మ ఇక్కడ దయ్యం తిరుగుతుందని ఎవ్వరూ రావటంలేదు.నేను కూడ ఆపుడప్పుడువచ్చి చీకటి పడేలోగా వెళ్ళిపోతాను.

పిచ్చా వెర్రా…ఈకాలంలో ఇంకా దయ్యాలను నమ్మేవారున్నారా?దయ్యం పేరు చెప్పి ఇంత మంచి ఇంటిని పాడు పెడతారా?మూర్ఖులు,దయ్యంలేదు గియ్యంలేదు,ఎక్కడుందా దయ్యం నేను చూస్తాను,హూంకరించిందామె కోపంగా.

నువ్వే ఆ దయ్యం తల్లీ అంటూ ముసలాయన పరుగు లంకించుకున్నాడు.

అతడి వెర్రి భయాన్ని చూస్తూ ఆమె మూర్ఖులు అనుకుంటూ పకపక నవ్వింది.దయ్యాల్ని నమ్ముతారు పిచ్చి వాళ్ళు సీలింగ్ నుంచి వేలాడుతూ అనుకుంది.

 

ఈ కథ 8-6-08 వార్త లో ప్రచురుతమయింది.

 

June 13, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.