Archive for June 14, 2008

హేతువాది చిదంబరం చిందులు(వ్యంగ్యాస్త్రం)

మందు మేలా ఆగాల్సిందే.మనం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న కాలం లో కూడా ఇంకా ఏనుగు మందులేమిటి?శరీరాన్ని అణువణువూ పరెషీలించగల ఆధునిక యంత్ర పరికరాలుండగా,అన్ని రోగాలకీ ఒకే మందేమిటి?నాన్సెన్స్,చిర చిర లాడేడు చిదంబరం.
కొన్ని వందలేళ్ళుగా,నసిగారెవరో.
నాన్సెన్స్ లో సెన్స్ లెస్నెస్.వందల ఏళ్ళుగా వున్నవన్నీ మంచివేనా?వందేళ్ళక్రితం చద్దన్నం తిని,పొలం పనులకు బయలు దేరేవారు.వేప పుల్లల్తో పళ్ళుతోమేవారు.ఇప్పుడవన్నీ వాడుతున్నామా?
అవన్నీ మంచివేనండి.సున్ని పిండి స్నానం వల్ల చర్మం సున్నితమవుతుంది.చలి కాలం పగలదు.క్రీములు,స్నోలు వాడక్కర్లేదు.మన పనికిరావన్నవన్నీ పనికొస్తాయని అమెరికా వాడు పేటెంటు తీసులుంటున్నాడు,అన్నారెవరో.
అయితే పొండి.సున్ని పిండి రాయండి.మట్టి పూసుకుని వేపాకు పట్టుకుని తిరగండి,అరిచాడు చిదంబరం.అతడి దృష్టిలో ఎదురు వాదించే వారంతా అనాగరికులు,నిరక్షరాస్యులు.
కొన్ని వందల ఏళ్ళనుంచీ ప్రతి డిసెంబరు నెలలో ఒక వారంపాటు ఆ గ్రామంలో ఏనుగు మందు మేలా జరుగుతుంది.ఆ వారం ఏనుగును చరకుడు పూనుతాడని ఆ గ్రామ ప్రజల నమ్మకం.ఆ సమయంలో మంత్రించిన మందును,ఏనుగు తొండంతో మనుషుల గొంతులోకి విరజిమ్ముతుంది.అలా నాలుగు సంవత్సరాలు వరుసగా ఆ మందు సేవిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని ప్రజల నమ్మకం.ఆ నమ్మకంలో ఎంత నిజం వుందో తెలియదు కానీ,ప్రతి సంవత్సరం రోగుల సంఖ్య పెరుగుతోంది.
రేషనల్ ఆలోచనల రారాజు,లౌకిక భావ భాగ్య విధాత బిరుదాంకిత చిదంబరం కారుకి జనాల క్యూ అడ్డుపడటంతో అతని దృష్టి ఈ విషయంపై పడింది.విషయం తెలుస్తూనే మండిపడ్డాడు.
ఏనుగుని చరకుడు పూనటం ఏమిటి?అదీ డిసెంబర్ నెలలో ఒక వారాంలోనేనా?సరే పూనాడని నమ్ముదాం.ఏదో మందును మంత్రించి విరజిమ్మటం ఏమిటి?సరే మంత్రించారనుకుందాం.దాన్నేదో గ్లాసులో ఎత్తి పొసుకుని తాగెయ్యకుండా,ఏనుగు తొండంతో చిమ్మటం ఏమిటి?ఏనుగు గురి తప్పితే?ఆ మందేదో గొంతుకు అడ్డుపడితే?
ఇన్ని వందలేళ్ళుగా అలా ఎప్పుడూ జరగలేదు,అనారెవరో.
అది పట్టించుకోలేదు చిదంబరం.
అసలు ఏనుగు తొండంలో ఎన్నెన్నో బాక్టీరియాలుంటాయి.వైరస్లుంటాయి.అవి మనిషి శరీరంలో చేరితే?మనల్ని పీడిస్తున్న బర్డ్ ఫ్లూ,చికెన్ గున్యాలకు ఏనుగు మాన్యా తోడవుతుంది.కాబట్టి ఏనుగు మందు మేలాని వెంటనే ప్రభుత్వం నిషేధించాలి.అలసి వాలిపోయాడు చిదంబరం.
    
            ***********************************

చిదంబరం కేకలను పత్రికలు పెద్దగా ప్రచురుంచాయి.మీడియా చర్చలతో దద్దరిల్లింది.
మందు మేలాలో మందు లేదు.మౌఢ్యం వుంది.అది అనాగరిక మేలా.పాత రాతియుగం నుంచీ పదిలంగా వస్తూన్న బుద్ధిలేని తనం మేలా,దొరికిన అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నాడు చిదంబరం.
చిదంబరం కేకలతో దేశ వ్యాప్తంగా నిద్ర పోతున్న రేషనల్ థాట్స్ సంస్థలన్నీ నిద్ర లేచాయి.ఆ గ్రామం వైపు ప్రయాణమయ్యాయి.
ఇంత మంది మనుషులు ఒక చోట గుమిగూడితే శుభ్రత ఎలా వుంటుంది?ప్రజల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గటమేమో కానీ అంటురోగాల పంటలు పండుతాయి,అని తీర్మానించారు.
ఆ తీర్మానం వింటూనే ప్రతిపక్షాలు ఎగిరిపడ్డాయి.
ఇంతమంది ఒక చోట చేరతారని ప్రభుత్వానికి ముందు తెలియదా?సరయిన చర్యలెందుకు చేపట్టలేదు?అంటూ విరుచుకు పడ్దారు.
ఏదీ ఇంకా అంటువ్యాధులేవీ ప్రబల లేదు కదా?విస్తుపోయింది ప్రభుత్వం.ఉన్న వ్యాధుల గురించే ఆలోచించే తీరిక లేదు,ఇంకా రాని వాటి గురించి ఏమాలోచిస్తాం,అన్నాడు మంత్రి.
ఈ దేశంలో అసలు విషయం దారి మళ్ళటానికి పెద్ద కష్టం అవసరంలేదు,అని తిట్టుకుంటూ మళ్ళీ మీడియావారి వెంట పడి ఇంటర్వ్యూలివ్వసాగాడు చిదంబరం.
ఏనుగు ఎంగిలి మందుతో రోగాలు నయమయిపోయేట్టయితే ఇక ఇన్ని మందులెందుకు?డాక్టర్లెందుకు?సూపర్ స్పెషాలిటీలెందుకు?వీధికో ఏనుగు,ఊరికో ఏనుగు ఇచ్చేస్తే సరిపోదా?వాదన ఆరంభించాడు.
మా సాంప్రదాయం అది,అన్నారెవరో.
అంధ విశ్వాస ప్రక్షాళనే నా లక్ష్యం.సాంప్రదాయాలంటే నాకు లెక్కలేదు.ఏమిటీ మందు ప్రత్యేకత?దాన్ని విశ్లేశించాల్సిందే,పట్టుబట్టాడు చిదంబరం.
అది మంత్రించిన మందు.దాన్నెలా పరిశీలిస్తారు? సందేహించారెవరో.
దాంతో వాదనలో తాను వోడిపోతున్నాననిపించి చిదంబరం రూటు మార్చాడు.ఒక వైపు మూర్ఖత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తూనే,మరో వైపు భూత దయ సంఘాల తలుపులు తట్టాడు.అవన్నీ కూడా రోడ్ల మీదకు ఉరికి వచ్చాయి.మనిషి స్వార్ధం కోసం ఏనుగును హింసించటం ఇక పై చెల్లదు అంటూ పోరాటం ఆరంభించారు.
మావటీ వాడు ఏనుగును పొడుస్తున్న ఫొటో ప్రచురించి ఒక పత్రిక ప్రజల మనస్సాక్షిని తట్టి లేపింది.
తమ రోగాలు నయమవటం కోసం ఏనుగుల స్వేచ్చను హరిస్తున్న స్వార్ధపరుల ఆట కట్టాలని మేధావులు గవర్నరుకు వినతి పత్రం సమర్పించారు.
ఏనుగుల స్వేచ్చను పరిరక్షిస్తూ మందు ఏనుగులను జూ కు తరలించాలని డిమాండు చేసారు.
వారి సానుభూతి భావనకు ప్రభుత్వం స్పందించింది.అంతకాలం బందీల్లా వున్న ఏనుగులను జూలకు తరలించాలని నిశ్చయించింది.
ఏనుగులే లేకపోతే ఏనుగు మందేమిటని ప్రజలు గొణుక్కున్నారు.డాక్టర్లను ఆశ్రయించి డబ్బులు వొదుల్చుకోసాగారు.ఇక మళ్ళీ చిదంబరం కారుకు ఆ దారిలో ప్రజల క్యూలు అడ్డు రాలేదు.అది చూసి మూఢ నమ్మకాలను అంతమొందించానని గర్వించేవాడు చిదంబరం.
అయితే,ఈ గొడవ పూర్తయిన కొద్ది కాలానికే చిదంబరం ఆస్పత్రి పాలయ్యాడు.డాక్టర్లు ఆధునిక వైద్య పరికరాలతో అతని శరీరం అణువణువు పరిశీలించి అర్ధంకాని పేర్లు అనంతంగా వాడీ,వాడీ చివరికి ఏమీ లేదని తేల్చి డబ్బు గుంజి ఇంటికి పంపేసారు.
రోగమొస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి కానీ ఏనుగు దగ్గరకెళ్తారా?అని తన అనుభవాలను ఒక గొప్ప పుస్తకంలో పొందు పరచి డాక్టర్ ఫీజు ఖర్చు రాబట్టుకోవాలని ప్రయత్నాలను ఆరంభించేశాడు.
చివరగా….జూకి లారీలో వెళ్తున్న ఏనుగుకు ఎందుకో హఠాతుగా మెలకువ వచ్చి లారీలో లేచి నిలబడి వొళ్ళు విరుచుకుంది.దాంతో లారీ బోల్తా పడింది.ఏనుగుతో పాటూ లారీ డ్రైవర్,క్లీనర్ రోడ్డు మీద పోతున్న ఇద్దరు మరణించారు.
అప్పటి నుంచీ ప్రజలు ఆ దారిలో రాత్రిళ్ళు వెళ్ళేందుకు భయపడసాగారు.
ఏనుగు దయ్యమయి ఆ దారిన వెళ్ళేవాళ్ళందరి పై ఏదో విరజిమ్ముతోందని ప్రజలు నమ్మసాగారు.
మూఢ ప్రజలు,మూఢ నమ్మకాలు.వీళ్ళని బాగు పరచటం దేవుడి తరం కూడా కాదు.కానీ మానవ ప్రయత్నం చేయక తప్పదు,అని వ్యాఖ్యానించాడు చిదంబరం.
అయితే,తన ఆరోగ్యం దృష్ట్యా ఆ దారిలో వెళ్ళే ప్రయత్నాలేవీ అతను చేయలేదు.

ఇది డిసెంబర్ 2006 విపుల లో ప్రచురితమయింది.

June 14, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.