Archive for June 16, 2008

సగటు మనిషి స్వగతం-4

నాజు,న జర్నలిస్టు ఫ్రెండుని చూస్తే అసూయ అనిపిస్తుంది.ఎక్కడికి పోయినా ప్రెస్ అంటాడు.పోలీసులు,రాజకీయ నాయకులు అంతా ప్రెస్ అన్న పదం వినగానే అటెన్షన్ లోకి వచ్చేస్తారు.అదే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు.పైగా నన్ను చూడగానే పది రూపాయలు ఫైను వేసే చోట వంద వడ్డిస్తారు.
ఒకసారి,నా ఫ్రెండు అండతో నేనూ ప్రెస్ అని మా పంచాయతీ ప్రెసిడెంటుని బెదిరించాలని ప్రయత్నించి భంగ పడ్డాను.ఇల్లు కట్టేందుకు పర్మిషన్ ఇవ్వటానికి డబ్బులడిగిందామె.’ ఔరా ముదితల్ నేర్వగలేని విద్య భువి యందు లేదు లేదు లేనేలేదు ‘ అంకుంటూ ప్రెస్ బాంబు వేసా.’ మీ అవినీతి అక్రమాలను పత్రికల్లో ప్రచురిస్తా ‘ అని సినిమా హీరోలా గంభీరంగా బెదిరించా.
ఆమె బెదరలేదు సరికదా,నేనే గుండెలదిరి చచ్చేట్టు నవ్వింది. ‘వేసుకో రాసుకో,రాసుకును వొళ్ళంతా న్యూస్ ప్రింటు పూసుకో ‘ అంటూ సొరుగులోంచి పత్రికల కట్టింగుల గుట్టలు నా ముఖాన విసిరికొట్టింది.’ఇదిగో నా మీద ఇంతమంది ఇవన్నీ రాసారు.నువ్వూరాయి, నాకేం నష్టం? అంది.అంతటితో ఆగలేదు. ‘అవినీతి చెయ్యనిది ఎవరు?మన సమాజానికి ఆక్సిజన్ అవినీతి.అవినీతి ఇప్పుడు అసలు నీతి.అది చెయ్యని వాడు పనికిరాని వాడు.బతకలేని వాడు.నేను అడిగినదానికన్న రెట్టింపు డబ్బులియ్యి అప్పుడే సంతకం పెడతాను ‘అని డిమాండ్ చేసింది.
నకేం చెయ్యాలో తోచలేదు సరికదా మావాడి చేతిలో వజ్రాయుధం నా దగ్గర పెళ్ళినాటి ప్రమాణంలా అయిపోయింది.ఎంతైనా సగటు మనిషిని కదా!వాలి ఎదుట నిలిచినవాళ్ళ సగం బలం తగ్గుతుందట.అలా నా ఎదుటికి వచ్చినవాళ్ళ బలం పెరుగుతుందేమో!
అలాంటి నా ఫ్రెండు పరుగుపరుగున ఇంటికి వచ్చాడు.ఒరే నేనిక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పకు,అని మంచం కింద దూరాడు.
సగటు మనుషుల ఇళ్ళగురించి మీకు తెలుసు.ఇంట్లో చెత్తనంతా మంచంకింద కుక్కుతాం.వీడు వారం రోజులు మంచంకింద దగితే కలిగే కలకలం గురించి చెప్పనక్కర్లేదు.
నెమ్మదిగా విషయం కనుక్కున్నాను.
ఏం చేయాలిరా,మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం వచ్చేసింది.ఒకప్పుడు వాక్ స్వాతంత్ర్యం వుండేది.వినదగునెవ్వరు చెప్పిన అనేవారు.ఇప్పుడు తన్ను స్వాతంత్ర్యం వచ్చింది.తన్నదగు నెవ్వరేమన్నా అంటున్నారు.ఒక పక్క చెట్లు తగ్గిపోతున్నాయని గోల పెడుతున్నారు.కానీ కొట్టడానికి బలమైన కర్రలకు మాత్రంలోటు లేదు.పెట్రోలు ధరలు మండుతున్నాయంటారు.వాహనాలకే దొరకటంలేదంటారు.కానీ మనుషులపైపోసి తగలబెట్టటానికి పెట్రోలు లోటు అడ్డు రావటంలేదు.ఏం రాసినా ఎవరో ఒకరికి కోపం వస్తోంది.దాడులు చేస్తున్నారు.పగుల గొడుతున్నారు.తగులబెడుతున్నారు.ఇంకా తంతాం అని బెదిరిస్తున్నారు.ఇక నుంచీ అన్ని సంఘాలు,పక్షాల ప్రతినిధులూ,కర్రలు,పెట్రోలు పట్టుకుని పత్రికల కార్యాలయాల ఎదుట నుంచుంటారట.అందుకే ఏం చేయాలో తోచక పరుగెత్తుకు వచ్చా.కాస్త ఆలోచించుకోనీ. అన్నాడు.
వాడి మాటలు వింటూంటే నా సగటు బుర్రలో ఒక ఆలోచన వెలిగింది.నిరసన ప్రదర్షనలకు ఇందిరా పార్క్ దగ్గర ప్రత్యేక స్థలం కేటాయించి నట్టు,హింస జరిపేందుకు కూడా నగరంలో ఏదో మూల హింస స్థలిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.ఎవరి పైన కోపం వచ్చినా ఆ స్థలంలోకి వెళ్ళి దిష్టి బొమ్మలు తగులపెట్టవచ్చు.అందుకోసమే పెట్టిన వస్తువులు విరగ్గొట్టవచ్చు.ఇలా కసి తీర్చుకునేవారి కోసం నగరంలో చెత్తనంతా అక్కడ పారేస్తే కసితీర చెత్త గుట్టలను కొడతారు.కాలుస్తారు.రోజూ ఎవరో ఒకరికి కోపం వస్తూనే వుంటుంది.చెత్తను కసి తీరెందుకు సృజనాత్మకంగా వాడవచ్చు.నా ఆలోచన నాకే నచ్చింది.అంతా నాది సగటు బుర్ర అంటారు కానీ,ఎంత జీనియస్ అయితే ఇలాంటి ఆలోచన వస్తుంది!
రేపటి నుంచి ఏం రాయాలో అని గొణుక్కుంటున్నాడు నా ఫ్రెండు.అది చూసి బ్రిలియంట్ ఆలోచన పారేశా.ఎందుకో ఈ రోజు నా సృజనాత్మకత పొంగి పొర్లుతోంది.
ఒరేయ్ వాళ్ళ మీదా వీళ్ళమీదా రాసి తన్నులెందుకు తింటావు?మన సమస్యలన్నిటికీ పరిష్కారాలు వేదాలు పురాణాల్లో దొరుకుతాయంటారు.నీ సమస్య పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది.నీ కసి తీరా వాటిని విమర్షించు.పీకి పాకాన పెట్టు.అడిగేదెవరు?పైగా నిన్ను పొగడుతారు.సన్మానాలు జరుగుతాయి.
నా మాట పూర్తికాకముందే పరుగెత్తాడు వాడు.ఆ తరువాత జరిగింది చెప్పాలంటే సిగ్గు వేస్తుంది.నేన్నట్టే వాడికి బోలెడన్ని సన్మానాలు జరిగాయి.తన్నాలని వచ్చినవారే సన్మానించారు.
అందుకే నేను సగటు మనిషిగా మిగిలిపోయాను.వాడికిచ్చిన ఆలోచన నేను అమలు చేయవచ్చు కదా!నా ఆలోచనతో వాడు సెలబ్రిటీ అయిపోయాడు.నేను ఎవరూ గుర్తించని లివింగ్ లీజెండ్ లా సగటు మనిషిలా మిగిలిపోఅను!    

June 16, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.