Archive for June 20, 2008

యజ్ఞం-విమర్శ కొనసాగింపు.

సాధారణంగా కథకుడు కథా రచన చేసేటప్పుడు ఒక అస్పష్టమయిన ఊహతో ఆరంభిస్తాడు.రచన సాగుతున్న కొద్దీ ఊహ స్పష్టమయిన రూపు దిద్దుకుంటుంది.పాత్రలు నిర్దిష్టమయిన వ్యక్తిత్వాన్ని ధరిస్తాయి.కథ పరిథి విస్తృతమవుతుంది.యజ్ఞం కథ చదువుతూంటే రచయిత కథను అంచెలంచెలుగా తీర్చి దిద్దటం కనిపిస్తుంది.కథ సాగుతున్నా కొద్దీ ఒకో విషయం మనకు తెలుస్తూంటుంది.కథాంశంలో మార్పు లేకున్నా కథ లో ప్రతీకల స్వరూపం మారుతూంటుంది.
కాళీపట్నం రామారావు గారి ఇతర కథలలో కనిపించే శైలి ఈ కథలోనూ కనిపిస్తుంది.సుదీర్ఘంగా పాత్రలను పరిచయం చేయటం,వాటి సంభాషణలు,కథ నిడివి పెరగటం వంతి వన్నీ ఈ కథలోనూ కనిపిస్తాయి.అయితే,ఇతర కథలకూ ఈ కథకూ తేడా కథాంశం.ఇంతవరకూ రామారావుగారి కథలన్నీ మధ్యతరగతికి సంబంధించినవి.మధ్యతరగతి బ్రతుకులలోని సందిగ్ధాలు,సంఘర్షణలూ ఆయన కథలు ప్రతిబింబించాయి.కానీ ఆ కథలు తనకు సంతృప్తి నివ్వలేదని,రాయాలనుకున్నది వేరు,రాస్తున్నది వేరు అవుతోందనీ ఆయన స్వయంగా అన్నారు.అంటే,ఈ కథలో ఆయన పల్లెటూరిలో అట్టడుగు వర్గాలవారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిబింబించారు.ఆయనకు ఎంతో పేరు తెచ్చిందీకథ.ఈ కథను ఆయన స్వయంగా ముద్రించారు.కాబట్టి అట్టడుగు వర్గాల అణచివేత,సామాజిక అన్యాయాలు ఆయన తన కథలలో ప్రతిబింబించాలని అనుకున్నట్టు మనం అర్ధం చేసుకోవటంలో తప్పులేదు. ఈ అన్యాయాలను ప్రతిబింబించటంద్వారా సమాజంలో పాత వ్యవస్థలోని కుళ్ళును,స్వార్ధాలను ప్రకతించి,కొత్త వ్యవస్థకు దారి సూచించాలనుకోవటం ఆయనకు సంతృప్తినిచ్చే అంశం అనీ అనుకోవచ్చు.ఒక రకమయిన విప్లవాన్ని,సామాజిక నియమ నిబంధనలు,సూత్రాలను కూలద్రోయటం ఆయన ప్రదర్శించాలని అనుకునారనీనుకోవటానికి కథలో చివరి వాక్యం ‘ ధర్మ పన్నాలెంతవరకూ,అంతా నువ్ చెప్పినట్టువినేవరకు,ఆ తరువాత? ‘  బలాన్నిస్తుంది.
అప్పల్రాముడు అప్పు తీసుకున్నాడు.కానీ ఆ అప్పు తీరుస్తే అతనికి నిలువ నీడవుండదు.దాంతో ఊళ్ళోవాళ్ళు న్యాయం చేయాలని అనుకుంటాడు.న్యాయం లభించదు.అప్పల్రాముదు తిరగబడడు.అతని కొడుకు వ్యవస్థను ధిక్కరిస్తాడు.అదీ ఎలాగ,తన సంతానాన్ని నరికి.చంపి,ఇప్పుడు అచ్చు రిపోర్టుకోస్తావా,కూనీ మాఫీ చేస్తావా అని నిలదీయటంలోనీ నీతి సూత్రాలు,నియమాలూ పాటించిననత మటుకే నన్న భావం వస్తుంది.అంటే,ఎదుటి వాడు నిన్ను అణగద్రొక్కే వకాశం నువ్విచ్చినంతకాలమే వాడు అణగ దొక్కుతాడన్న ఆలోచననిస్తుంది.కాబట్టి,నియమాలను,వ్యవస్థనూ లెక్క చేయకు.పోరాడి న్యాయం సాధించు,న్యాయం దక్కకపోతే తిరగబడు అన్న ఆలోచనను ఎంతో సూన్నితంగా నర్మ గర్భితంగా అందిస్తోందీ కథ.
రామారవుగారు స్వతహాగా మృదుభాషి.మితభాషి.సున్నిత హృదయుదు.ప్రతి వ్యక్తినీ ఎంతో మర్యాదగా ఆదరంగా చూస్తారు.ఆయన ఎవరినీ నొప్పిచరు.ఒక్క పరుషవాక్యం ఆయన నోటివెంట రాదు.అటువంటి సౌజన్యమూర్తి,ఉత్తమ వ్యక్తి విప్లవ భావజాల ప్రభావంలోకి వస్తే,ఆ ప్రభావంతో తన స్వభావానికి విరుద్ధంగా,తన మానసిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని తన రచనలలో ప్రతిబింబించాలని ప్రయత్నిస్తే అది యజ్ఞం కథలానే వుంటుంది.
ఈ కథలో ఇతర విప్లవ కథలకు భిన్నంగా వ్యవస్థను చిన్నభిన్నం చేయాలన్న ఆలోచన కనిపించదు.తనని తాను హింసించుకోవటం ద్వారా సామాజిక మనస్సాక్షిని జాగృతం చేయాలన్న తపన కనిపిస్తుంది. తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుంది.పిల్లవాడు తల్లిని ప్రేమిస్తాడు.కానీ పిల్లవాడు చెడు దారిలో పడతాడు.అప్పుడు తల్లి పిల్లవాడిని దూషిస్తే వాడిలో పట్టుదల పెరుగుతుంది. అందుకు తల్లి పిల్లవాడిని ఏమీ అనదు.తాను బాధ పదుతుంది.వాడితప్పుకు తాను శిక్ష విధించుకుంతుంది.పిల్లవాడిలో ఇది పరివర్తన కలిగిస్తుంది.శంకరాభరణం సినిమాలో కూతురు రాగం తప్పు పాడితే తండ్రి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు.అలాంటిదే ఇది.ఇది గాంధీ గారి పద్ధతి కూడా.ఎవరయినా ఆయన చెప్పిన మాట వినకపోతే గాంధీజీ సత్యాగ్రహం చేసేవారు.తింది మానేసేవారు.అది చూడలేక దెబ్బకు అంతా దిగి వచ్చేవారు.
రామారావుగారు గాంధేయవాది ఒకప్పుదు.విరసంలోకి వచ్చాక ఆయనకు గాంధీతో సహా ఇతర నాయకులు, సిద్ధాంతాల మీద నమ్మకం పోయింది.కానీ మనో అంతరాళలో ఆయన గాంధేయవాదే.అందుకే ఈ కథలో సీతారాముడుకి తిరగబడే అవకాసం వున్నా తన సంతానాన్నే చంపుకుంటాడు.కనీసం శ్రీరాములుని పల్లెత్తు మాటయినా అనడు.  అంటే రామారావుగారు విరసంలో వుంటూ విప్లవ భావాలను నమ్మినా ఆంతరంగికంగా ఆయన సాత్వికుడు.రక్త పాతం,ఆవేశాలు ఆయనకు నచ్చవు.అందుకే ఆయన పాత్ర తన నిరసనను గాంధేయ పద్ధతిలోనే ప్రదర్సించింది.అందుకే,అనేక విప్లవ సమర్ధకులుకూడా ఆయనను ఈ కథ ఆధారంగా విమర్శించారు.
ఈక్కడే మనకు శ్రీరాములు నాయుడు పాత్ర ప్రాధాన్యం అర్ధమవుతుంది.
శ్రీరాములు నాయుడు మంచివాడు.ఊరికి మంచి చేయాలని సంకల్పించినవాడు.అతని వల్ల ఊరు అభివృద్ధి చెందుతుంది.ఊళ్ళోకి స్కూళ్ళు వస్తాయి.రోడ్లు వస్తాయి. వ్యాపారాలు వస్తాయి.జీవన పద్ధతులు మారతాయి.అలాగే ఆయన అందరినీ గౌరవిస్తాడు.కులం ఆధారంగా వ్యక్తులను చిన్న చూపు చూడటం ఆయనకు నచ్చదు.అందుకే ఒక పాత్ర ‘ ఈయన అన్నిటికీ శాంతే నంటారు.అవతలి వాళ్ళకి నచ్చచెప్పటం చేతకాక నీ మీద నీకొచ్చిన కోపాన్ని వాళ్ళమీద కోపంగా భావించి,దానిని ప్రదర్శించటం వల్ల కార్యాలు సానుకూల పడవంటాడు.జనం చేసిన తప్పులు మనం కూడతీసుకోవచ్చు.కానీ మనమే తప్పులు చేస్తే-మనం కూడదీసుకోలేమంటాడు ‘  అంటుంది.
అంటే ఇక్కడ రామారావుగారు శ్రీరాములు నాయుడు పాత్రను గాంధీకి ప్రతీకగా వాడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.శ్రీరాములు నాయుడు పాత్రద్వారా గాంధీగారి నడవడిని,గుణాలను,ఆయన్ నిర్ణయాల ప్రభావాన్ని ప్రదర్శించి విమర్శిస్తున్నారన్నది చివరలో అప్పల్రాముడు శ్రీరాములు నాయుడుని విమర్శించిన మాటలు మరింత స్పష్టం చేస్తాయి.
‘ నువ్వుత్త యెర్రి పీరువి.లోకమంత నువ్ సెప్పినట్టినాలని,ఇంటారని నీ మనసులో ఓ ఉద్దేశ్యం.ఈ రాజ్యాన్ని నిన్ను ఏలే దొరలెవరో యెరుగుదువా-అదిగో ఆ బాబులిద్దరు.ఆళ్ళకు ఆళ్ళు సేసుకోలేని మంచిని నువ్వు చేసినంత కాలవే నీ రాజ్యం.ఆ తరువాత ఆళ్ళెవరో నువ్వెవరో.ఆ సంగతి నీ కిప్పుడు తెలియదు. ‘
ఈ వాక్యాలు శ్రీరాములుని ఉద్దేశ్యించి అన్నా అవి ఆ పాత్ర పరిథిని దాటి మహాత్మా గాంధీని తిన్నగా చేరతాయి.
గాంధీజీ దేశం మంచికోరి నిర్ణయాలు తీసుకున్న వాటి వల్ల అట్టడుగు వాడికి ఎటువంటి లాభం అందలేదని,ఆయన చర్యలవల్ల పైనున్న వారే బాగుపడ్డారనీ,ఆయన వారి చేతిలో కీలు బొమ్మ అనీ వాళ్ళాకు లాభం వున్నంతవరకే గాంధీ మాట విన్నారని,ఆ తరువాత ఆయనను పక్కన నెట్టేసారనీ మనకు తెలుసు.ఇక్కడ రామారావుగారు అదే అంటున్నారు.దానికి వామపక్ష సిద్ధాంతాన్ని జోడించారు.అయితే,రామారావు గారి సున్నిత,సాత్విక మనస్తత్వానికి వామపక్ష భావాలకూ పొసగదు.రావి శాస్త్రి గారి ప్రభావంతో ఆయన ఆ భావాలవైపు మళ్ళినా ఆయన కథారచనలో ఆయనకీ అంశాల పట్ల పట్టు లేదని మనం సులభంగా గ్రహించవచ్చు.ఇది రేపు.

June 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu