Archive for June 21, 2008

యజ్ఞం-అర్ధాలు,అపార్ధాలు,అనర్ధాలు!

యజ్ఞం కథమీద జరిగినంత విపులమయిన చర్చ తెలుగు సాహిత్యంలో మరే కథమీద జరగలేదనటం అతిశయోక్తి కాదు.ఈ కథపైన అందరికన్నా తీవ్రమయిన విమర్శచేసింది రంగనాయకమ్మ అని ముందు మాటలో చెప్పారు.దాంతోపాటే,రంగనాయకమ్మగారి విమర్శలోని మూడు ప్రధానాంశాలనూ ప్రస్తావించారు.అవి,
1.శ్రీరాములునాయుడు పాత్ర చిత్రణకు సంబంధించినది
2.అప్పల్రాముడు,గోపన్న ఇద్దరూ పేదలే.వారి మధ్య తగాదా చూపటంవల్ల వర్గ పోరాటానికి లాభంలేదు.
3.ముగింపు జుగుప్సా కరంగా వుంది.
ఈ అంశాలలో మొదటి రెండు అంశాలను మనం ప్రస్తావించుకున్నాము.శ్రీరాములు నాయుడు గాంధేయవాదే కాదు,గాంధీకి ప్రతీక.ఎలాగయితే గాంధీజీ అనేక మంచి కార్యక్రమాలు,ఎవరికోసం చేపట్టారో వారికి అంతగా ప్రయోజనం కలిగించలేదో, అలాగే,శ్రీరాములు చేపట్టిన అనేక కార్యక్రమాలవల్ల వూరి వారికి,ముఖ్యంగా పేదలకు అన్యాయం జరిగిందని రచయిత అప్పల్రాముడి పాత్రద్వారా ప్రదర్శించారు.వూరికి స్కూళ్ళు వచ్చాయి,రోడ్లు వచ్చాయి,కానీ దాని వల్ల పేదలు మరింత నిరుపేదలయ్యారు(అప్పల్రాముడు),మధ్యతరగతి వారు పేదలయ్యారు(గోపన్న).దీన్లో బాగుపడింది ధనికులే.ఇదీ రచయిత చెప్పాలనుకున్న అంశం.కథలో ఈ అంశం స్పష్టంగానే వచ్చింది.
అలాగే ముగింపు గురించి కూడా మనం చర్చించాం.ముగింపు జగుప్సాకరంగా వుందనటం కథ లక్ష్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదనటానికి నిదర్శనం.రంగనాయకమ్మ గారు సూచించినట్టు,పేదవారు తిరగబడటమో,శ్రీరాములు పొరపాటు గ్రహించటమో జరిగివుంటే ఇది మామూలు కథగా మిగిలిపోయేది.ముగింపు ఈ కథకు ఆయువుపట్టు.మనుషుల్ని అమానుషంగా చంపే విప్లవపోరాటాలను సమర్ధించేవారికి ఈ ముగింపు జగుప్స కలిగించటం ఆశ్చర్యమే.భూస్వామిని చంపటం ఆనందం.పేదవాడు ఆవేశంలో తనని తాను శిక్షించుకోవటంద్వారా సామాజిక మనస్సాక్షిని తట్టిలేపాలనుకోవటం జగుప్సాకరమన్నమాట!పైగా,రచయిత ఈ ముగింపు ద్వారా గాంధేయ సిద్ధాంతాన్ని దాని వేలితో దానికన్నే పొడుస్తున్నటయింది. గాంధీ వ్యవస్థను మారుస్తున్నట్టు కనిపించినా ఆయన వున్నవారి కొమ్ము కాస్తున్నాడు తప్ప లేనివారికేమీ సాయం చేయటంలేదన్న భావనను బలంగా చెప్తున్నారు రచయిత.ఈ నిస్సహాయ ఆక్రోషం నుంచే వ్యవస్థను మార్చే బలమయిన ఆవేశం విప్లవంలా వెల్లువవుతుందని ప్రతీకాత్మకంగా చూపుతున్నారు రచయిత.ఈ నిజాన్ని కథలో చివరి సంభాషణలు స్పష్టం చేస్తాయి.అయితే,రంగనాయకమ్మగారు ఆరోపించినట్టు కథను బలహీనం చేసింది,గాంధేయవాదం పట్ల రామారావుగారి అవగాహనాలోపంకాదు,రామారావు గారి వ్యక్తిత్వంలోని సాత్వికత.
రచయిత ఎంత ప్రతిభావంతుడయినా,ఎంత ఉన్మత్త ఊహాశాలి అయినా తన వ్యక్తిత్వాన్ని దాటి రచనలు చేయలేడు.రచయిత తన మనసులోతుల్లోంచి జనించిన ఆలోచనలకు,తన అనుభవాలద్వారా గ్రహించిన పాఠాలను జోడించి, సృజనాత్మక సరస్సులో తడిసి ముద్దయిన భావలు,ఊహలతో రంగరించి చేసిన రచన అత్యుత్తమ రచన.ఇందుకు భిన్నంగా రచయిత తన స్వభావానికి విరుద్ధంగా రచన చేయాలని ప్రయత్నిస్తే,ఎంత గొప్పగా రచనను సృజించినా దాన్లో ఎక్కడో ఏదో లోపం వుంటుంది.
రామారావుగారు స్వతహాగా సాత్వికులు.ఆయన ఎటువంటి,ఆవేశకావేశాలు,వాదవివాదాలజోలికి పోరు.హింస ఆయన వ్యక్తిత్వంలోనే లేదు.లోతయినాలోచన,అవగాహనలు ఆయనకు అలవాటు.అటువంతి వ్యక్తి వామ పక్షభావాల ప్రభావంలో పడ్డారు.రావిశాస్త్రి లాంటి మహా రచయిత ప్రభావానికి గురయ్యారు.దాంతో అంతవరకూ తన అనుభవాల ఆధారంగా,ఆలోచనల ఆధారంగా రచించిన రచనల పత్ల అసంతృప్తి కలిగింది.పేదల గురించి,పీడితులు తాడితుల గురించి,అణచివేతలు అక్రమాల గురించి,విప్లవాల గురించి,వ్యవస్థ వ్యతిరేకత గురించి రాసేదే అసలు సాహిత్యం అన్న నిర్ణయానికి వచ్చి తన రచనలను అలా మలచాలని తపన పడ్డారు.కానీ,చేప గాలిలో ఎగరలేదు,పక్షి నీటిలో ఈదలేదు.రచయిత ఎంత ప్రయత్నించినా తన స్వభావాన్నికి విరుద్ధంగా రచన చేయలేడు.
రావిశాస్త్రి గారి ప్రసిద్ధ రచన పిపీలికం.దాన్లో ఒక చీమ ద్వారా ప్రతీకాత్మకంగా,అట్టడుగువారిని,అగ్రవర్ణాలవారు ఎలా మాయలో వుంచుతున్నారో అద్భుతంగా చూపుతారు.చీమలన్నీ తమ అసలు శక్తిని గుర్తిస్తే పాములాంటి సామాజిక నిబంధలను మట్టి కరిపిస్తారని అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శిస్తుందాకథ.రావిశాస్త్రి గారి స్వభావంవేరు.ఆయన తీవ్రతలు,అనుభవాలు వేరు.రామారావుగారు వేరు.కానీ రావిశాస్త్రి గారిలా రచన చేయాలన్న భావనతో రామారావుగారు తనదయిన ధోరణిలో వామ పక్ష భావజాలాన్ని ప్రదర్సించాలని ప్రయత్నించారు.కానీ,రావిశాస్త్రి గారిలా నిక్కచ్చిగా,నిర్ణయాత్మకంగా,కఠినంగా వ్యవహరించలేకపోయారు.రావిశాస్త్రి కథలో ద్వైదీ భావనకు తావులేదు.చీమలు మంచివి.మిగతా వ్యవస్థ అంతా చెడ్డది.అంత తెలుపు,నలుపులో స్పష్టంగా తాను చెప్పదలచుకొన్నది చెప్పారు.రామారావుగారు అలా కాదు.
తన కథలో ప్రతి దానికీ కారణాలివ్వాలని ప్రయత్నించారు.ఒకరిది తప్పు,ఇంకోరిది ఒప్పు అని నిర్ణయాత్మకంగా చూపే బదులు ఎవరి స్థాయిలో వారు సబబే అన్న సమన్వయ ధోరణి ప్రదర్శిస్తూ,తన సిద్ధాంతాన్ని చెప్పాలని చూశారు.అదే ఈ కథలో బలహీనాంశం అయింది.
రంగనాయకమ్మ సూచించినట్టు,అప్పల్రాముడు పేదవాడయి,గోపన్న ధనవంతుడయివుంటే మంచి చెడు అని రచయిత ఎదో ఒక పక్షం వహించినట్టయ్యేది.అది రామారావుగారి స్వభావానికే విరుద్ధం.గమనిస్తే,శ్రీరాములు పాత్రను కూడా విలన్లా చూపలేదు.వేరేవారి మాయాజాలంలో తనకు తెలియకుండా చిక్కుకున్న మంచివాడిలా చూపాలని ప్రయత్నించారు.చెడ్దవారిగా చిత్రించాల్సిన వారు కథలో నీడలో మిగిలిపోతారు.వారి స్పష్టరూపం కనబడదు.దాంతో హీరో విలన్లు నలుపు తెలుపుల్ల కనిపించాలని కోరుకున్నవారికి కథ కొరుకుదు పడలేదు.ఎందుకంతే ఆ కాలంలో వామపక్షాలవారికి అగ్రవర్ణాలవారు చెడ్డవారు.పేదలు మంచివారు.అంతే.ఇందుకు భిన్నంగా అసమానతలు మౌలికంగా సమాజంలోనే వున్నాయని మనుషుల స్వభావాలు దానికి కారనం అని రామారావుగారు చూపటం విప్లవ సమర్ధకులకు నచ్చలేదు.కథలో రక్తపాతం లేదు.కారిన రక్తం పేదవాడిది.ఇక ఈ కథను ఎలా మెచ్చుతారు?
రామారావుగారికి మధ్యతరగతి మనస్తత్వంతో వున్న పరిచయం పేదవారి జీవన విధానంపైన లేదు.ఆయనకు పల్లెటూరి వారి మీద సానుభూతి వున్నా వారంతా అమాయకులన్న నమ్మకంలేదు.గతంలో ఒక చోట ఆయన పల్లెవాళ్ళు అంత అమాయకులు కాదు అనే అర్ధంవచ్చే వ్యాఖ్య చేయటాన్ని మనం గమనించాము కూడా.అంటే అమాయకపు ముసుగులో పల్లెల్లోనూ మోసాలు కుట్రలూ వున్నాయన్నది ఆయనకు తెలుసు.అది ఈ కథలో కనిపించటంతో రచయిత అప్పల్రాముది ఆవేదనను సమర్ధించటంలో విఫలమయ్యారు.కథను పూర్తిగా దెబ్బతీసిన అంశమిది.
అప్పల్రాముడు అప్పు తీసుకున్నాడన్నది నిజం.గోపన్న అప్పిచ్చాడన్నదీ నిజం.ఇప్పుడు గోపన్న పేదవాడయ్యడన్నదీ నిజం.అతడికి డబ్బు అవసరం వుంది.డబ్బు తీసుకున్నట్టు అప్పల్రాముడు ఒప్పుకున్నాడు.అప్పు తీరుస్తాననీ అన్నాడు.మూడేళ్ళ గడువు అడిగాడు.అయినా తీర్చలేక పోయాడు.ఇప్పుడు తనకు న్యాయంకావాలని అడుగుతున్నాడు.ఏ న్యాయం కావాలి?అప్పు చెల్లదని తీర్పు ఇవ్వాలని వాంచిస్తున్నాడా?గోపన్నది తప్పనాలని కోరుకుంటున్నాడా?అందరూ గోపన్న పట్ల సానుభూతి చూపుతున్నారని అంటాడు.అది అన్యాయమన్నట్టు అంటాడు.అప్పల్రాముడు మాల,పేదవాడు అన్న విషయం పక్కనబెడితే,ఎవరయినా తీర్పు ఎలా ఇస్తాడు.పోనీ ఇతర వడ్డీ వ్యాపారుల్లా గోపన్న దొంగలెక్కలు రాయలేదు.జలగలా పీడించటంలేదు.ఆగమంటే అగాడు. వూళ్ళో వాళ్ళూ పెద్దగా అన్యాయంచేస్తున్న దాఖలాలు లేవు.తన వాదనను సమర్ధించుకునేందుకు అప్పల్రాముడు,శ్రీరాములు తెచ్చిన అభివృద్ధి వైపు వేలు చూపుతున్నాడు.ఇదీ అంత బలమయిన అంశంకాదు.అభివృద్ధిలో లాభపడేవారు కొందరు నష్టపోయేవారు కొందరు.కంప్యూటర్లు రావటంవల్ల ఎంతో మంది వుద్యోగాలు కోల్పోతున్నారు.ఏ-మెయిలు.కొరియర్లవల్ల తపాల శాఖ నష్టపోతోంది.కొత్తనీరు వచ్చి పాతనీటిని పక్కకు నెట్తేస్తుంది.ఇది లోక రీతి.దీన్లో ఎవరు ఎవరికీ కావాలని నష్టం చేసేదేమీ లేదు.సామాజిక పరిణామ క్రమంలో తప్పనిసరిగా జరిగే మార్పులివి.సినిమాలొచ్చాయి.తోలుబొమ్మలాటలు,యక్షగానాలు,నాటకాలు అన్నీ దెబ్బతిన్నాయి.దానికి ఎవరు దోషి?in the struggle for existence, it is the fittest who survive.తాను అప్పు పడటానికీ,అప్పు తీర్చలేకపోవటానికీ అప్పల్రాముడు చూపిన వాదనలన్నీ ఇలాంటివే.అప్పల్రాముడితో పాటూ గోపన్న కూడా పేదవాడయ్యాడు.అతని కొడుకులు దేశాలు పట్టిపోయరు. కానీ,అప్పల్రాముదికే అన్యాయం జరిగిందన్నట్టు చూపటం కథను దెబ్బ తీసే అంశం.
తీర్పు విషయంలో అప్పల్రాముడి పట్టుదల కథను మరీ బలహీనం చేస్తుంది.అప్పు తీర్చమంటే అన్యాయం అంటాడు.సరే నీ వంతుకి నేను తీరుస్తానంటే కనబడకుండా దెబ్బ కొట్టావంటాడు.అప్పులేదు అంటే గోపన్న న్యాయం సంగతేమిటి?అప్పు వున్నదనే వ్యవస్థను కూలదోయాలంటాడు. ఇది చూస్తే అప్పల్రాముడు అనుకున్నంత అమాయకుడు కాడేమో అనిపిస్తుంది.అవసరమయినప్పుడు తిరిగిస్తానని వస్తువు తీసుకుని,అవసరమయింది ఇమ్మంటే నేరం అనటం అమాయకత్వం కాదు.ఇది ఈ కథను మరింత దెబ్బ తీసిన అంశం.అందుకే ,ఇలాంటి తర్కానికి కథ నిలవదనే రంగనాయకమ్మగారు,ఇది పేద ధనికుల పోరాటమయితే బాగుండేదని సూచించారు.కానీ ఎవరిలో తప్పు చూడటానికి ఇష్టపడని రామారావుగారు ఎంత ప్రయత్నించినా వ్యక్తిని వర్గాన్ని నేరస్తులను చేయలేక పోయారు.వ్యవస్థను దోషి చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు.ఇప్పుదు చూస్తే,సీతారాముడు తన కొడుకుని చంపుకోవటం అర్ధరహితం,మూర్ఖత్వం అనిపిస్తుంది.ఎప్పుడయితే అలా అనిపించిందో యజ్ఞం కథ లక్ష్యం దెబ్బతిన్నట్టే.
దేశం  రెండుగా విభజన జరిగిన తరువాత పాకిస్తాన్ వారు తమకు రావాల్సిన డబ్బులను అడిగారు.వారికి డబ్బులివ్వద్దని దేశంలో కొందరు వ్యతిరేకించారు.కానీ కొత్త దేశం ఎటువంటి పరిశ్రమలూ,వనరులూ లేని దేశం డబ్బులేకపోతే నిలద్రొక్కుకోలేదని వారి డబ్బు వారికి ఇవ్వాలని గాంధీ గారు పట్టుబట్టారు.అందరూ అన్యాయమన్నారు.చివరికి కోపంతో ఆయనను చంపారు.ఇప్పుడు ఆలోచిస్తే గాంధీగారి చర్యల వెనుక ఎంత దూరదృష్టి వుందో అర్ధమవుతుంది.కానీ అప్పటి ఆవేశంలో అర్ధంకాదు. ఈ కథలోకూడా శ్రీరాములు తీర్పు అర్ధంకాక తన కొడుకుని చంపుకున్నాడు సీతారాముడు.ఆ చర్యలోని అర్ధవిహీనత అర్ధంకావాలంటే కథను సిద్ధాంత దృష్టితో కాక సామాజిక చరిత్ర పరిణామక్రమాన్ని గమనిస్తూ,భూతభవిష్యత్ వర్తమానాలను అర్ధంచేసుకుంటూ విశ్లేషించాల్సి వుంటుంది.కథను కథగా చూడాల్సి వుంటుంది.అప్పుడు యజ్ఞం ఒక మంచి వ్యక్తి తన స్వభావానికి విరుద్ధంగా అందరూ మెచ్చే కథ రాయాలని ప్రయత్నించి విఫలమయిన కథగా మిగులుతుంది.సమాజంలోని అపోహలు,ఉద్యమాలు ఎలా మన సాహిత్యాన్ని నిర్దేశిస్తున్నాయో తెలుస్తుంది.
యజ్ఞం తరువాతి కథల విశ్లేషణ కొద్ది విరామంతరువాత.

June 21, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu