Archive for June 22, 2008

నేను పాండురంగని చూచి తరించితినీ!

ఏ పూర్వ జన్మ పుణ్యమో,ఎన్ని నోముల ఫలమో అత్యంత సృజనాత్మక,ఉన్మత్త ఊహాశాలురకాలవాలమయిన తెలుగుసినిమాలు చూసి తరించు భాగ్యము నాకు కలిగినది. అందునా,భక్తి తత్వ విచారాత్మకమయిన భావ మోహపారవశ్యమునొందించు అపూర్వ కళాఖండాలను ఖండ ఖండాలుగా, తుండ తుండాలుగా తృంచి ఉప్పు కారంతో పాటుగా విదేశీ సినిమాలందించు మాల్ మసాలాలతో,స్వంత పాశవిక ప్రవృత్తీ జనితాలయిన కామ వికార కుకార టక్కు టమారాది ఐంద్రజాలికా  సహిత అర్ధరహిత దుర్భర కువినోదాత్మకయిన దృష్యమాలాతోరణాల నిలయమయి, తర్కమే మర్కటమై, మస్తకము చెదలుతిన్న పుస్తకమై, ఆధునికాధునిక భావజాల విలయమై,విలయ ప్రళయ వికృత తాండవాలయమయినటువంటి,అసమాన,అప్రమేయ,అద్వితీయ,అచింత్యమగాధమమేయ మయిన తుచ్చకళాప్రదర్శనలను చూసి తరించు ఈ భాగ్యం కోసం ఎన్నెన్ని జన్మల నోములు పున్యాలూ చేసుకొన్నానో!ఒక్క రెండుగంటల సినిమాతో జన్మ జన్మాల బూజును దులిపేంత శక్తి వంతమయిన సినిమాలను నిర్మిస్తున్న మన కళాకారుల కళాకౌశలమెంత అద్భుతమో!ఒక్క రెండు గంటలలో గత జన్మల జ్ఞాపకాలను తాజా చేసి,ఎందుకొచ్చిన పాడు మానవ జన్మము,హాయిగా పక్షినో,పిల్లినో,బల్లినో అయితే కృత్రిమ ఆనందాల వెంట పడేవేలుండదుకదా అన్నంత దుర్భర వైరాగ్య భావనలు కలిగిస్తున్న మన కళాకారుల కళా ప్రదర్శనమెంత గొప్పదో కదా!
నిన్న పాండురంగడను కదిలే బొమ్మల చిత్రా విచిత్ర విన్యాస ప్రదర్శనకు వెళ్ళితిని.సినిమాను చూచు సరికి నాకేదో అయినది.నా డెందము అమందానందకందళిత హృదయారవిందమయి,భావావేశ సంజనిత వెర్రి పదింతలయి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయిచున్నది.ఆహా,అది సినిమాయా,సినీ మాయా,ఓసి నీ మాయా,మాయ నీ మాయ నను మాయ చేసి మాయని గాయము చేసినది.ఆ గాయము మెదడులో కలిగినదా?తనువులోని అణువణువులో కలిగినదా ?లేక నా ఆత్మ లోలోపల గాయమయినదా?అర్ధమగుటలేదు.నా ప్రమేయము లేకుండా నా నోటి వెంట వ్యర్ధ ప్రేలాపనల ఆలాపనల విలాపానలకీలలు వెలువడుచున్నవి.  అవి అక్షర రూపము ధరించి బిర బిర జాలువారుచున్నవి.
పాండురంగని మొదటి దృష్యములో ఒక ముసలి నాస్తికుడు ఆస్తికుని వేశము ధరించి రంగా నువ్వు దొంగా అంటూ ప్రాస సహితంగా దూషిస్తాడు.ఆ అనందం నుంచి తెరుకొనేలోగా నాస్తిక పుత్రాధముడు తండ్రి అడుగుజాడలలో నడుస్తూ కృష్ణుడు చేసే మంచి పనులను విడిచి రాసలీలలనే ఆదర్శముగా తీసుకుంటూ,మానాధములు క్ర్ష్నుని ఆదర్శముగా తీసుకొన్న కలిగే అనర్ధాలను ప్రదర్శిస్తాడు.క్ర్ష్నుడు ప్రపంచాన్ని తప్పు దారిపట్టిస్తున్నాడని నిరూపిస్తాడు.బాలుడిగా నున్నపుడే ఇంత ఘోరముగా ప్రవర్తించినా ఆ వీర నాస్తిక షిఖామణి ఎదిగిన తరువాత కృష్ణుడే సిగ్గుపడి మాటి మాటికీ దిగివచ్చే రీతిలో వుంటాడని వేరే చెప్పనేల?
ఆహా,మన కళాకారులెంత ఊహా శాలురో!పాత కాలమునందు మహిళలను పరదా చాటున బంధించి వుంచేవారు.ఆ ధునిక కాలమున మహిళలు బంధనాలు తెంచుకుని,విశ్రుంఖలముగా ప్రవర్తించుచూ తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తున్నారు.అది రంగని పాత్రద్వారా కసి కసిగా చూపినారు.పెళ్ళి చేసుకోరా పిల్లవాడా అంటే,ఆధునిక భావజాల యువకునిలా ఇల్లువదలి పారిపోయి,కనబడ్డ అమ్మాయితో ఎటుల వీలు దొరికిన అటుల,ఎంత వీలు దొరికిన అంత శృంగార కేళీ విలాసాలు జరుపుతాడు.అంతటితో అయిపోలేదు,తానేయే ప్రాంతాల అమ్మాయిలతో ఎలా ఎలా ఏమేమి చేశాడో పాట రూపమున ప్రజలందరికీ ప్రకటిస్తాడు.యువతులను పూలతో పళ్ళతో(fruits,teeth) మోదుతూ తన ప్రావీణ్యాన్ని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాడా మగవాడు.వొట్టికుండ శబ్దముచేయును,చేతకాని వాడు మాట్లాడును,కొంచెమున్న కొండంతలు చేసి చెప్పును,లేని దాన్ని అందరికీ చూపి సంత్ర్ప్తి పడును అంటుంది మానసిక శాస్త్రం.ఈ సినిమా దర్శకుడికింకనూ వివాహము కాలేదు.కావున,స్వాభావికముగా రతికేళీ పయిన అధిక కుతూహలముండును.ఆ కుతూహలమునంతయూ.రంగని పాత్ర ద్వార,ఆ పాత్ర తుచ్చ ప్రవర్తన ద్వార ఆయన తీర్చుకుని సంతృప్తిపడినాడేమోనని మానసిక శాస్త్ర నిపుణులననినారు.ఏది ఏమయిననూ ఈ పాటలో రతి,రతిలో పాటలు సెన్సారు వారిని పారవశ్యాంబుధిని ముంచి నిర్వీర్యులను చేసినదని తెలియుచున్నది. ప్రచీన బంధనాలు తెంచుకున్న ఆధునిక  యువతులందరూ తమ లైంగిక తృప్తులకోసము ఆ కాలములో సమరము,స్వయంప్రకాషూలు లేని కారణాన రంగని చుట్టూ మూగుతారు. ఇది మన సమాజమున సకల రుగ్మతలకూ కారణమయిన తుచ్చ బ్రాహ్మణులకాగ్రహము కలిగించును.ఎప్పటిలాగే వారంతా కబాబ్మే హడ్దీలలాగా ఎవరినీ ఆనందించనీయరు.తాము ఆనందించరు. పోయి,నాయకుడి నాస్తిక తండ్రితో కంప్లయింటు చేస్తారు. ఆయన మొసలి కన్నీళ్ళు కార్చి కొదుకును మందలించినట్టు చేసి రెచ్చగొడతాడు.
మరచితిని ఈ సినిమాలో బ్రాహ్మణులు తిండిపోతులను సిద్ధాంతమును నిరూపించుతూ ఒక తిండిపోతు బ్రాహ్మణుడుడుండును.ఆయాన గంధమును నాకి మనలను ఆనంద పరచును.దేశమున తిండి అంతయూ ఎవరు తినేస్తున్నారో మరో సారి మనకు హాస్యముగా తెలియును.నవ్వి నవ్వి కంట నీరు పొంగును.
ఇక,ఈ చిత్ర విచిత్ర చిత్రమునందు నాయిక బహు దొడ్డ నాస్తికురాలు.ఆమెకు కోంత మతి భ్రమణము కలదు.అయిననూ,ఆమె కిట్టూ కిట్టూ అంటూ కృష్ణుని దూషించును.చూచు వారు భక్తి అని భ్రమ పడుదురు.కానీ ఆ భక్తి లో ఎంతయో రక్తియున్నది.కృష్ణుని తలలో మంటలు వచ్చును.అప్పుడామె మంతెన సత్యనారాయణరాజున కాదర్శమవు రీతిన ప్రకృతి వైద్యము చేయును.ఆమెకాలికంటిని ధూళి రాసిన తల మంటలు తగ్గునని వికారాకారముతో వికృతముగా,గౌరవశూన్యంగా,ముగ్గురుపిల్లల తండ్రికి తాతలా కనిపించు నారదుడు చీప్పును.దాంతో విజృంభించిన ఆ పరమ నాస్తికాస్తికనవలా శిరోమణీరత్నము,కసికసిగా బురదలో పేడలో కాలిని రాసి రాసి,పాతాళమునందు పేరుకునివున్న పాతకాలాన్నిటినీ తన కాలికి పూసుకొని,ఆ ధూళిని చేతితో కస్సున గీచికోని కృష్ణ విగ్రహమునకు పూయును.ఆ దుర్గంధభూయిష్ట,సర్వపాతక సహిత ధూళి కృష్ణుని తల మంటలు తగ్గించును.తగ్గకున్న ఆమె ఇంకేమేమి ఎక్కడెక్కడనుంచి తీసి,పూయునో అని భయప్పడినట్టున్నాడు భగవంతుడు.ఎంతయినా,మనిషి ఊహకు అంతులేదు కదా!ఇకనుంచీ మన ప్రకృతి వైద్యులు యువతి పాదధూళీ లేపనాలు తయారు చేసి సకలరోగాలు తగ్గింతురనుటలో సందేహము లేదు.ఆమెకు ఒకరోజు కలలో కృష్ణుడు కనబడి,నీ పాదలేపనాలు పూసి నా తల తీసినావు.పోయి ఆ నాయకుడి పనిపట్టుమూ అని చెప్తాడు.అతడు అమ్మాయిల వెనక పడి ఎయిడ్సు రోగము తెచ్చుకొన యత్నించుచున్నాడు.గతములో కాసనోవా యను మహానుభావుడి రికార్డు బద్దలుకొట్టాలని చూచుచున్నాడు.వాడి యజ్ఞము భంగము చేయుము అని ఆదేశిస్తాడు.ఎంతయినా భగవంతుడికి ఎవరూ పైకి వచ్చుట నచ్చదుకదా.అందరి యాగాలనూ భగ్నం చేస్తాడు.దాంతో ఈ వనిత కిట్టునిమీద ఆనపెట్టి నాయకుడి ఇల్లు చేరును.
ఆహా,ఆధునిక మహిళలు సిగ్గుపడేరీతిలో తన మొగుడిని ఎంచుకోవటమేకాదు,వాడి ఇంటిముందు తిష్టవేసి దొంగ కొంగ జపాలుచేసి తొడగొట్టి సవాల్చేసి,కలలో వాడితో డ్యూయెట్టుపాడేసి,పాతకాలపు పతివ్రతలంతా పనికిరాని పచ్చళ్ళని నిరూపిస్తుంది.మహిళాలంతా ఈమెను ఆదర్శముగా తీసుకొని ఆచరించిన ఎంత బాగుండునో కదా!
 చెప్ప మరచితిని నాయిక వెర్రి మొర్రి నటనలు చూసి ఇంటివారందరూ ఉబ్బితబ్బిబ్బయి అబ్బయని ఆమెను పెళ్ళికాకముందే కోడలిగా ఒప్పుకొందురు.ఎలాగో నాయకుడి రతి శక్తి ఆ వూరి అమ్మాయిలందరికీ తెలుసుకాబట్టి ఎవారూ పెళ్ళిచేసుకొన ఇచ్చ్గించుటలేదు.కాబట్టి ఈ మతిలేని పొరుగూరిపిల్ల కోరి వచ్చి ఇంటిముందు మౌన పోరాటము సాగించుచున్నది.ఈమెకు ఇచ్చి కట్టిన నాయకుడి సెక్సు భ్రమణమునకీమె మతి భ్రమణము సరిపోయి సకల జనుల చిత్త చాంచల్యములణగిపోవునని భావిస్తారు.
అయ్యయ్యో చెప్ప మరచితిని,నా మతి పండా(నా మతి పండయిన ఈ పాటికీ సినిమాలో ఏయువతి బొడ్డునో కక్ష్యగా చేసుకొని యుండెడిది.) అసలు యువతీ రత్నమును చెప్పమరచితిని.ఈ చిత్రమునందు ప్రత్యేక ఆకర్షణగా ఒక వొళ్ళుతప్ప ఇంకేమీ లేని వారవనితాకాంత ఉన్నది.మన నాయకుడికి కూడా వొళ్ళుతప్ప మరేమీ అవసరములేదుకదా!అందుకే ప్రధమవీక్షణముననే వారి ఉన్న కాస్తంత మతికూడా కోతి అగును.ఆమె తొడపయిన తబలావాయిస్తూ,థా థా అంటూంటే నాయకుడు బలిష్తులయిన వస్తాదులను,ముత్యాలగొలుసులతో కొట్టి చిత్తు చేస్తాడు.అంత రాతి కండలు ముత్యాల గొలుసుతాకిడికెంతగానో నొచ్చియుండును.ఈ దృష్యమునందు దర్శకాగ్రేసరుడు ఒక చమత్కారము నింపినాడు.బలిష్టులు కొట్టినట్టు నటించగానే నాయకుడు వారవనిత తొడపయిన పడతాడు.అయ్యో దెబ్బ తగిలిందా అనేబదులా వయసు మళ్ళిన వనిత లైంగికసౌఖ్యానుభూతి పొందును.కామాంధునికి కత్తిపోటులోకూడ రతివేటు కనిపించునుకదా!
ఇక ఆ వారవనిత నాయకునితో లివిన్ రిలేషన్షిప్పు ఆరంభించును.ఇదంతా చూస్తున్న ఏషియంపెయింటు దిట్టంగా పూసుకున్న కృష్ణుడు రంగ ప్రవేశం చేస్తాడు.ఇదిగో ఇలా మాటి మాటికీ దివినుంచి దిగివస్తూ,భక్తుల పనులు చేయిపట్టి భగవంతుడు చేస్తూండటంవల్లనే కదా ఆస్తికులంతా సోమరిపోతులవుతున్నారు.అయితే,ఆ కృష్ణ మాయ కన్న మనిషి మాయనే గొప్పది అని ఈ సినిమా నిరూపిస్తుంది.నాయిక మోహంలో పడి నాయకుడు వారవనితను విస్మరిస్తున్నాడన్న అక్కసుతో మళ్ళీ ప్రకృతి వైద్యం చేసి నాయకుడి కడుపులో మంట రగిలిస్తారు.ఆహా అప్పుడు నాయకుడి నటననేమని వర్ణించను.ఆ కడుపులో మంట మనకే ఉన్నట్టు భావిస్తాము.ఆ మంటకూడా మాటలనేటప్పుడు మరచిపోతాడు.అప్పుడే నాయకుడి నాస్తికత తెలుస్తుంది.భజన చేస్తున్న వారిని ఆపమంటాడు.వొచ్చిన సాధువుని దూషిస్తాడు.తల్లిని తండ్రిని తిడతాడు.భార్యను పొమ్మంటాడు.పురుషాహంకారపు పందికి ప్రతిబింబంలా ప్రవర్తిస్తాడు.అయితే ఇదంతా,మంట ప్రభావం వల్ల తప్ప వేరే కాదు.స్వతహాగా నాయకుడు మంచివాడే.కనబడ్డ అమ్మాయిలనంత ప్రేమించి,ప్రపంచాన్ని ప్రేమమయం చేయాలని ప్రయత్నిస్తున్న మహానుభావుడు.అయితే ఈ దుష్ట దేవుడు,తుచ్చ బ్రాహ్మణులు అతనికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు.ఇప్పుడో దృష్యం వుంది.నాయకుడు భగవద్గీత విసరగానే దాన్ని అందుకున్న నాస్తిక తండ్రి వెంటనే ఆ బరువును భార్యకిచ్చేస్తాడు.పాత కాలంలో స్త్రీలను పురుషులు ఎంతగా హింసించి,బరువులన్నీ వారిమీద పెట్టేస్తారో ఈ సన్నివేశం చూపుతుంది.ఆడవాళ్ళ బరువులగురించి,ఎనిమిది మాతలతో కృష్ణుడే ఒక వ్యాఖ్య చేస్తాడనుకోండీ సినిమాలో.
ఇక ఇక్కడినుంచీ సినిమా వేగంగా సాగుతుంది.ఒకటిన్నరగంటలు దుష్చర్యలు చేసిన నాయకుడు,క్షణంలో తన తప్పు గ్రహించేస్తాడు.కాళ్ళుపోగానే కళ్ళు తెరచుకుంటాయి.పార్టీ మార్చి,పదవిపోగానే మళ్ళీ అమ్మ అంటూ పాత పార్టీకి ఆవచ్చి హోం కమింగ్ అనే నాయకులలాగా తల్లి తండృల పాదాలు వొత్తుతాడు.ఆ దృష్యంలో తండ్రి ఎంత సంతృప్తిగా పడుకుంటాడంటే, ఇది మన తెలుగు సినిమా అని గుర్తులేకపోతే ఇదేదో బ్రోక్ బాక్ మౌంటయ్న్ అనుకునేవాడిని.కృష్ణుడు,నాయకుడిని కౌగలించుకున్న దృష్యంలో వారి ముఖ కవళికలు కూడా ఇదే భావనను కలిగించాయి.
మళ్ళీ అందరూ అనందిస్తుంటే చూడలేని దేవుడు నాయకుడిని డిస్టర్బ్ చేస్తాడు.కానీ పాద స్పర్షాసౌఖ్యాన్ని అనుభవిస్తున్న నాయకుడు నేను రాను పోరా అంటాడు.వెళ్ళలేక దేవుడు రాయి అయి నిలుచుంటాడు.కానీ,భార్యకు బాగాలేదనగానే అన్నీ వదలి పరుగెత్తుతాడు.కిట్టూను చూడనివ్వటంలేదని ఆమె నిరాహార దీక్ష చేస్తుంది.దాంతో కోపం వచ్చి కృష్ణ విగ్రహం తల తిరిగేలగా,గోడవిరిగి రాళ్ళు పడి అడ్డుపడ్డ బ్రాహ్మలు చచ్చేలాగా పాట పాడతాడు హీరో.అయితే ఆపాట మాధుర్యము భరించలేకనో,మరెందుకో,నాయిక చచ్చి పోతుంది.ఎందుకు పెళ్ళి చేసుకుందో,ఎందుకు పొమ్మనగానే వదిలేసిందో ఎందుకు చచ్చిపోయిందో దేవుడికే తెలియాలి.ఇక ఇక్కడినుంచీ సినిమా పాటలతో,దేవ నాయకుల ఎత్తుకు పైఎత్తుగా సాగుతుంది.చచ్చిన భార్యను బ్రతికిస్తానంటాడు దేవుడు.కానీ మగవాడు భార్య చచ్చిపోవాలని కోరుకుంటాడని ఆ మధ్య ఒక మేధావి చెప్పిన మాటను నమ్మిన హీరో అది తప్ప అన్ని వరాలూ కోరుకుంటాడు.చివరికి ఎందుకు చూస్తున్నామో,ఏమి సాధిస్తున్నామో అర్ధం కాక చీ పాడు దేవుడు అని నాస్తికులమయిపోవాలనిపిస్తుంది.
పాత సినిమాలో నాయకుడి కుటుంబమే కాదు,మిగతా బోలెడంత భక్తులు విఠలుడిలో కలవటం చూపుతారు.కానీ,ఆధునిక వ్యక్తిగత సమాజానికి దర్పణంపడుతూ,నాయికా నాయకులిద్దరే పైకి పోతారు.ముసలితనంలో తల్లి తండ్రులను వొత్తిన కాళ్ళు చాలని వదిలి పోతారు.
ఇప్పుడే అందిన తాజా వార్త,పాత భక్తులు,దేవుళ్ళూ అంతా నాస్తుకులయిపోతున్నారట.లేకపోతే,మతం మారి పోతున్నారట.రాఘవేంద్రరావు,భారవిల బారిన పడేకంటే,అన్నమయ్య,రామదాసు,పుండరీకుల గతి పట్టేకంటే నాస్తుకులయిపోవటం మంచిదని అనుకుంటున్నారట.మతం మారితే,తమ జోలికి వచ్చే ధైర్యం వుండదని మారిపోతున్నారట!    

June 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.