Archive for June 25, 2008

అక్కసు-కక్కసు-రక్కసు!

ఆంధ్రజ్యోతి,మంద కృష్ణ,ప్రభుత్వం నడుమ జరుగుతున్న వివాదాన్ని ఈ మూడు మాటలు చక్కగా చెప్తాయి.ప్రజాస్వామ్యంలో వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్చకు పత్రికలు ప్రతీకలు.సామాన్యుడికి అతని హక్కులను రక్షించి,న్యాయాన్నిచ్చేవి న్యాయస్థానాలు.న్యాయం జరిగేట్టు చూసేది, రక్షక భటులు.వీరందరినీ గమనిస్తూ ప్రజలకు సక్రమ పాలననిచ్చేది ప్రభుత్వం.కానీ,మన రాష్ట్రంలో ఏ ఒక్కరూ,తమ బాధ్యత సక్రమంగా నిర్వహించటంలేదని.ఎవరికి వారు,తామే బలవంతులమనుకుంటూ,ఇతరులను అణచాలని ప్రయత్నించటం, అందుకు అవసరమయితే అన్ని వ్యవస్థలనూ దుర్వినియోగ పరచటము మనకు కనిపిస్తోంది.

పత్రికలు ప్రజలవంతుకి ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూండే watch dog ల వంటివి.ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలను నిష్పాక్షింగా వివరించి,విశ్లేశించి అందించాలి.ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయాలలో హెచ్చరికలు చేయాలి.

కానీ,ఇప్పుడు పత్రికలు నిష్పాక్షిక పత్రికలు కావు.ఇవి పార్టీల పత్రికలు.ప్రతి పత్రికకూ ఒక అజెండా వుంది.ప్రతి పత్రిక తన అజెండాకు తగ్గ రీతిలో వార్తలను అందిస్తుంది.దాంతో,కాస్త శక్తి వున్న ప్రతి రాజకీయ నాయకుడూ ఒక పత్రికను పెడుతున్నాడు.తనకు తగ్గ రీతిలో విషయాలను ప్రజలకు అందిస్తున్నాడు.అంటే ఇప్పుడు ప్రజలకు ఏ పత్రిక మీద విశ్వాసం లేదన్నమాట.ఏ పత్రిక వార్తనూ చూడగానే నమ్మడన్నమాట.ఇది పత్రికల సంపాదకుల పయిన గౌరవంలా ప్రతిబింబిస్తూంది.

పత్రికలకు పార్టీలుండతం, పాత్రికేయుల ఐకమత్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.ఒక పార్టీ పత్రికకు అన్యాయం జరిగినప్పుడు,ప్రతిపక్ష పార్టీ పత్రిక పట్టించుకోదు.దాంతో,పత్రికలతో పాటూ పాత్రికేయులూ విలువ కోల్పోయారు.

ఈనాడును లక్ష్యంగా చేసుకొని,మార్గదర్శి పయిన తూటాలు పేల్చినప్పుడు,మిగతా పత్రికలు మిన్నకున్నాయి.హిందూ ఒక్కటి రామోజీరావు సహాయానికి బహిరంగంగా ముందుకు వచ్చింది.తెలుగు పత్రికలు మూసిన గుడ్డికళ్ళా వాళ్ళలా ప్రవర్తించాయి.

ఆ రెండు పత్రికలు,ఆ మూడు పత్రికలు, అంటూ ముఖ్యమంత్రి, వ్యాఖ్యానిస్తూ,పోటీగా పత్రికను రంగంలో దింపినప్పుడూ ఎవారూ ఏమీ అనలేదు.ప్రజలు,అన్ని పత్రికలూ చూస్తూ,వార్తలను పోలుతూ,ఎవరిఎవరెన్నెన్ని ఆభద్ధాలు చెప్తున్నారో జోకులు చేసుకుంటూంటే, తమ ప్రతిష్ఠ దిగజారుతోందని ఒక్క పాత్రికేయుడూ అనుకోలేదు.ఒక్క పత్రికా అనుకోలేదు.

పత్రికలు ఒక పాలసీగా కొన్ని సంఘాలను.కొందరు వ్యక్తులను,కులాలను వెనకేసుకురావటమూ మనకు తెలుసు.కొన్ని రకాల వార్తలకు ప్రాధాన్యాన్నిచ్చి పెద్దగా ప్రచురుంచటమూ మనకు తెలుసు.అలా,కొందరు, లేని ప్రాముఖ్యాన్ని సంపాదించారు.దానికీ, పత్రికల రంగుల దృష్టీ,హ్రస్వ చూపులు కారణాలు.అలా, వ్యక్తులు ఎంత ఎదిగారంటే, ఇప్పుడు, విమర్శలను సైతం సహించలేని స్థితికి వచ్చారు.తమను ఏమయినా అంటే,తంతామని, బెదిరించటమే కాదు,ఆచరించి చూపే స్థితికి ఎదిగారు.వారినీ స్థితికి తెచ్చిందీ పత్రికలే.వారిపయిన దాడులనే ప్రచురించి, వారి దాడులను ఖండించకపోవటం వ్యక్తులకు ధైర్యాన్నిచ్చింది.ఆంధ్రజ్యొతి పై దాడి జరిగిదే,కొన్ని పత్రికలు,అది ఆ పత్రిక తప్పే అన్నట్టు వ్యాఖ్యానించటము పత్రికా రంగంలోని వారు తమ తప్పులు గ్రహించటంలేదని నిరూపిస్తుంది.తమ దాకా వస్తే కానీ వీరికి అర్ధంకాదని చూపిస్తుంది.

ఇక ఉద్యమమన్నది హింసాత్మకమయితేనే గుర్తింపు వస్తుందని మన ఉద్యమకారుల ప్రగాఢ విశ్వాసం.హింసకే ప్రభుత్వాలు దిగి వస్తాయనీ మన వారు అనుభవంతో తెలుసుకున్నారు.అందుకే,ప్రతి వాడూ కోర్కెల సాధనకు హింసకు దిగుతున్నాడు.ప్రభుత్వం దిగివస్తోంది.పబ్బం గడచి పోతోంది.ఇటీవలే గుజ్జర్ల విషయం నుంచీ అతి చిన్న విషయాల దాకా ఈ ధోరణి మనం చూస్తున్నాము.మొన్న,ఒక బస్సులో ఏవొ అభ్యంతర కర రాతలు కనిపించాయని,నాలుగు బస్సులను తగులబెట్టారు.అంటే,మన సమాజంలో చట్టాలు,న్యాస సూత్రాలూ కన్న, వ్యక్తులకు కోర్కెల సాధనకు హింస దొడ్డిత్రోవగా స్థిరపడిందన్నమాట.పైగా,హింసకు దిగినా,తరువాత తప్పించుకోవటం జరుగుతూంటే, హింసను వదిలి చట్టబద్ధంగా కోర్కెల సాధనకెవడు ముందుకు వస్తాడు?  దాడీ చేసి,పెట్రోలు పోసి తగులబెట్టాలని ప్రయత్నించి,ఇంకా దడీలు చేస్తామన్న వాడిని వదిలి, దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టిన వారిని ఘోర నేరస్తులుగా పరిగణించటం, వ్యవస్థను సంపూర్ణంగా దెబ్బ తీసే అంశం. ఇది అరాచకాన్ని ప్రోత్సహిస్తుంది.గాంధీ దిష్టి బొమ్మలను తగులబెట్టారు.అద్వానీ,సోనియా, బుష్హు లతో సహా నటీ నటులవి,ప్రముఖులవీ ఎందరెందరి దిష్టి బొమ్మలో తగుల బెట్టారు.చెప్పులతో కొట్టారు.అవన్నీ నేరాలు కానప్పుడు, ఇప్పుడిదెలా ఘోరమయిన నేరమయింది? తెలంగాణాలో రక్తపుటేరులుపారిస్తామని ఎందరో బెదిరిస్తున్నారు.పట్టించుకున్న నాథుడేడి? పార్లమెంటులో మైకులు విరిచి, చీరలు లాగి, బల్లలు విరగ్గొట్టి, నేతల విగ్రహాలకు మసిపూసి, ఎందరెందరో ఎన్నెన్నో అనాగరిక పనులు చేస్తున్నారు.అవన్నీ నేరాలు కావా? మాట్లాడితే దిష్టిబొమ్మలు తగులబెట్టే మనకు ఇప్పుడే ఇంతఘోరమయిన నేరమెలాయింది? ఇక్కడే ప్రభుత్వం రంగ ప్రవేశం చేస్తుంది.

అధికారం మనిషిలోని రాక్షసుడికి ఊపు నిస్తుంది అంటారు.అది నిజం.తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతివాడినీ ఏదో కేసులో ఇరికించటం,ముప్పు తిప్పలు పెట్టటం ఏ అధికారికీ శోభనివ్వదు.ప్రజల దృష్టిలో అతడిని నాయకుడిలా నిలపదు.కక్ష సాధింపు కసిగాడిలా నిలుపుతుంది. ఆంధ్ర జ్యోతి విషయంలో నాకు సంబంధం లేదని ప్రభుత్వం అన్నా నమ్మేవారు లేరు.ఒక సంఘటన యాదృచ్చికం అనుకుంటాం.ఒకే రకమయిన సంఘటనలు పదే పదే జరుగుతూంటే, అసలు నిజం గ్రహిస్తాం.ఆరంభమ్నుంచీ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవారందరూ ఏదో రకంగా ఏవేవో కేసుల్లో ఇరుక్కోవటం,దడులనుభవించటం మనము చూస్తూనే వున్నాము. ఈనాడు,పాల్, ఇపుడు ఆంధ్రజ్యోతి,  పెద్దలకే రక్షణ లేనప్పుడు ఇక సామాన్యుడికి భద్రత ఏది.ప్రజాస్వామ్యమయినా, రాచరికమయినా, నియంతృత్వమయినా, పాలకుడిని బట్టి పాలన అని స్పష్టమవుతోంది.

ఇది ఏ రకంగానూ మంచిది కాదు.వోట్ల కోసం, కులాలను, మతాలనూ ప్రత్యేకంగా చూడటం సామాన్యుడికన్నా వారు మిన్న అన్నట్టు ప్రభుత్వమే ప్రవర్తించటం, వ్యవస్థ పట్ల, నాయకుల పట్ల, ప్రజలకు విశ్వాసాన్ని తగ్గిస్తుంది. డాక్టర్లపై దాడులు నేరంకావు.తశ్లీమ పై దాడి చేసిన వాళ్ళు నేరగాళ్ళు కారు.పైగా వారి మనోభావాలు దెబ్బతిన్నాయని తస్లీమ పైనే కేసు.  ఆఫీసులపయి దాడులు చేయటం, ఆస్తి నష్టం కలిగించటం, ఆడపిల్లలపయిన అత్యాచారాలు చేయటం నేరాలు కావు. ఒక దిష్టి బొమ్మను తగులబెట్టటం ఘోరమయిన నేరము.సామాజిక అణచివేతకు నిదర్శనం.

ప్రస్తుత పరిస్థితికి పరతి ఒక్కరూ బాధ్యులే.తలా పాపం తిలా పిడికెడు.కానీ, వీరందరి పాపలను పరిహారం చెల్లిస్తున్నది ప్రజలు.హింసకూ, నియమ రాహిత్యానికి, సమాజం నిలయమవుతోందంటే, దాని బాధ్యత, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరిదీ!

ఇకనయినా,పత్రికలూ,పాత్రికేయులు, మీడియా వారూ, మేధావులూ అందరూ నిద్రలు లేచి, తమ తమ రంగులను కడిగేసుకుని ఒకటిగా పరిస్థితి మార్చేందుకు నడుము కట్టాలి.అది జరగక పోతే………

అక్కసులూ, రక్కసులూ, కక్కసులూ = మన దేశం అవుతుంది.

మేరా భారత్ మహాన్!   

June 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized