Archive for June 27, 2008

దశావతారం-ఒక దోషావతారం.

నార్సిస్సస్ గురించి అందరికీ తెలుసు.తన అందం చూసి తనని తానే మోహించిన వ్యక్తి అతడు. తన అందం చూసి మురిసిపోవటాన్ని నార్సిసం అంటారు. ప్రతి కళాకారుడిలో నార్సిజం తప్పనిసరిగా వుంటుంది. అది లేకపోతే, కళాకారుడు కళను సృజించలేడు.అయితే, ఈ నాసిజం హద్దులుదాటితే, అతని కళ దెబ్బతింటుంది.కళ స్థానాన్ని కూడా కళాకారుడే ఆక్రమిస్తాడు. ఇందుకు మంచి ఉదాహరణ కమలహాసన్ నిర్మించి నటించిన దశావతారం!

కమలహాసన్ నటనాపటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. మన దేశంలో వున్న అత్యద్భుతమయిన నటులలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. మన సినిమాల్లో నటులకు తమ నటనను ప్రదర్శించేందుకు సరయిన అవకాశాలు రావు. అయినా సరే, తానే తన నటన ప్రతిభను ప్రకటించే రీతిలో సినిమాలు రూపొందిస్తూ వస్తున్నాడు కమల్. ఇది చేయటానికి కూడా నటుడికి ఆత్మ విశ్వాసంతో పాటూ, నార్సిజం కూడా అవసరమే. అయితే, దశావతారం చూస్తూంటే, కమల్ నార్సిజం హద్దులు దాటిందని పిస్తుంది.

ఎప్పుడయితే, నటుడి ఇమేజీ కోసమని స్క్రిప్టును విస్మరిస్తారో అప్పుడు నటుడే కాదు సినిమా కూడా దెబ్బ తింటుంది. దశావతారం సినిమాలో కమల్ ఉన్నాడు. అద్భుతమయిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ స్క్రిప్తు లేదు.

సినిమాలో ఎంత సేపూ కమల్ పాత్రలను ఎలా తెరపైకి తేవలన్న ఆత్రం తప్ప వారిని కథలో విడదీయరాని భాగంగా చేయాలన్న తపన కనబడదు.ఎదో ఒకటి చేసి తెరపైన గోల చేయాలన్న ఆత్రం తప్ప కథను ఒక పద్ధతి ప్రకారం, ఒక సన్నివేశంలోంచి, మరో సన్నివేశంలోకి, అవిచ్చిన్న ధారలా కథనాన్ని రూపొందించాలన్న ఆలోచన లేదు. దాంతో, తెరపైన ఒకదాని తరువాత మరొకతి అర్ధంలేని సన్నివేశాల పరంపరలు,  కాలము, స్థలాలతో సంబంధం లేకుండా, వస్తూంటాయి. పోతూంటాయి. కొన్ని నవ్విస్తే, మరికొన్ని విసుగు కలిగిస్తాయి. చిరాకు తెప్పిస్తాయి.

time and space గురించి ఆలోచిస్తే,  దశావతారం లో అవి ఏకోశానా కనబడవు. లాజిక్ సునామీకన్నా 1200 సవంత్సరాలముందే ఎక్కడికో కొట్టుకు పోతుంది. సినిమా అంతా ఏపాత్రను చూసినా అది కమల్ హాసనా అని వెతకటంలో సరిపోతుంది. ఒక దశలో మల్లికా అనిచెప్పి ఆ పాత్రకూడా అతనే వేశాడేమో అన్న అనుమానం వచ్చింది. పది పాత్రలు వేసేయాలన్న ఆత్రం తప్ప ఆ పాత్రలను సరిగా తీర్చిదిద్ది, వాటికి విషిష్టమయిన వ్యక్తిత్వాన్నిచ్చి, ప్రత్యేకంగా నిలిపి, మరపురాని నటన ప్రదర్శించాలన్న ఆలోచనను కమల్ ప్రదర్శించలేదు. పొడుగు వాడిలా, సిక్కు గాయకుడిలా, ముసలామెలా కమల్ వేయాల్సిన అవసరమే లేదు. అవి అర్ధం లేని పాత్రలు. దళిత నాయకుడి పాత్ర కావాలని చొప్పించారు. పదో పాత్ర కావాలి కదా! ఇక కిరాయి హంతకుడిలా, దట్టించిన మేకప్ తో అసహ్యంగా వున్నాడు. కృత్రిమత్వం తెలుస్తూనేవుంది. బుష్ పయిన జాలి కలిగింది. 13 వ శతాబ్దం వీరుడిని చూస్తే పాపం పిచ్చివాడు అనిపించింది. గుడిలో అంత రక్త పాతం చేసి, హీరోయిజం తప్ప సాధించిందేదీ లేదు. హీరోగా కమల్ ముసలివాడయిపోయాడని తెలిసింది. వయసుకు తగ్గ విభిన్న పాత్రలపయిన దృష్టి పెడితే మంచిది. దేవుడున్నాడా లేడా అన్న చర్చ తెలికగా, పనికిరాని రీతిలో వుంది. చివరి దృష్యంలో, హీరో, హీరోయిన్లు, పడవ దగ్గర నిలబడి, ప్రేమ మాటలు మాట్లాడుతూంటే, నేపధ్యంలో ప్రజలు అటూ ఇటూ పరుగిడుతూంటారు. అంతా సునామీలో చిక్కి గోలగా వుంటే వీళ్ళాకసలీ చర్చ ఎలా చేయాలనిపించిందనిపిస్తుంది. గమనిస్తే, వెనక మనుషులు, అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ వేదన నటిస్తున్నారని తెలుస్తుంది. కమల్ తన మేకప్పుపయిన చూపిన శ్రద్ధ సినిమాలో ఇంకే అంశంపయిన చూపలేదని ఇది నిరూపిస్తుంది.

ఇక జపాన్ వాడి పాత్రలో కమల్,  deformed చీనా వాడిలా అనిపించాడు. సీబీఐ వాడి పరిశోధన చూస్తే, మన దేశంలో తీవ్ర వాదులు ఇంత స్వేచ్చగా ఎలా తిరుగుతున్నారో అర్ధమవుతుంది.ఇక సంగీతం గోల గోలగా వుంది. ఒక్క నాయిక పాడే పాట వినసొంపుగా వుంది. ఇళయరాజా లేని లోటు తెలుస్తోంది. సునామి స్పెషల్ పరవాలేదనిపిస్తుంది.అయితే, సినిమా చూసిన తరువాత రోడ్డు మీద కనబడిన ప్రతివాడూ వేశమేసుకున్న కమల్ అనిపిస్తారు.

కమల్ కు ఒక ఉచిత సలహా.వొచ్చే సినిమాలో అన్ని వేశాలూ ఆయనే వేస్తే, ప్రేక్షకులకు కమల్ ను వెతికే బాధ తప్పుతుంది. స్క్రిప్టు పయిన అప్పుడూ దృష్టి పెట్టకపోతే, ఆ సినిమా కమల్ ఒక్కడే చూసుకోవాల్సివస్తుంది.          

June 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.