Archive for September, 2008

మన మహాత్ముడు, విమర్శ-7

ఏదయినా విశ్లేషించేముందు వీలయినంత వరకు రచయిత నిష్పాక్షింకంగా వుండటం అభిలషణీయం. ఇందుకు భిన్నంగా రచయిత ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తే అతని విశ్లేషణ ప్రామాణికత కోల్పోతుంది. ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించి, అతని దోసాన్ని నిరూపించాలని పరిశోధన చేస్తే పోలీసులకు ఆధారాలన్నీ వారి దృష్టికి అనుగుణంగానే లభిస్తాయి. ఆ పరిశోధన లోప భూయిష్టమవుతుంది. అసలు నిజం మరుగున పడుతుంది.

మన మహాత్ముదు పుస్తకంలో కూడా అదే జరిగింది. రచయిత ముందుగానే, గాంధీని అందరూ ఆయన మహాత్ముడి జిలుగు వెలుగు మోహంలో పది సరిగా అర్ధం చేసుకోలేదని నిస్చయించేశారు. ఆయనని ధర్మ పీఠం పైన నిలిపి నిగ్గు తేలుస్తానని ప్రకతించేశారు. అంతే కాదు, గాంధీని అర్ధం చేసుకోవటం కష్టంకాదని, ఈ పుస్తకం చదివితే చిన్న పిల్లవాడుకూడా అర్ధం చేసేసుకుంటాడనీ ముందుమాటలోనే రాశారు. అంటే రచయిత గాంధీ దోశి అని నిశ్చయించేసి, ఆయన ఎందుకూ పనికిరాని వాడని, ఒక మాయ మోసాల ముద్ద అని తేల్చాలని కంకణం కట్టుకున్నారని మనకు అర్ధమవుతుంది. ఇక పుస్తకమంతా ఈ దృష్టిలో పక్షపాత ధోరణితో వుండటంలో ఆశ్చర్యం లేదు.

మొదటి అధ్యాయంలో గాంధీవల్ల స్వాతంత్ర్యం వచ్చిందనటం కల్ల అని నిరూపించి, రెండవ అధ్యాయంలో గాంధీని పొగిడినవారంతా మూర్క్జులు అన్నట్టు రాస్తారు.

ఐన్స్టీన్ పొరబడ్డాడు.గాంధీని కలిసేందుకు నిరాకరించినా పోప్ జాన్ పాల్ ఆయనని మహాత్ముడన్నాడు. రొమైన్ రాలాండ్ వంటి మేధావి కూడా గాంధీని సరిగా అంచనావేయలేకపోయాడు.చివరికి గాంధీ సినిమాను తీసిన ఆటెన్ బరో కూడా గాంధీని పొగొడి ఆయన జీవిత కాలంలో లభించని ఖ్యాతిని ఆయనకు ఆర్జించి పెట్టాడంటారు. ఇక్కడే మనకు శాస్త్రి గారి దృష్టి తెలిసేది. గాంధీని పొగిడి గొప్పవాడని అన్నవారంతా ఆయన గురించి తెలుసుకోకుండా పైపైన చూసేసి అన్నారు. వాతి వారి స్వార్ధాలు వారికున్నాయి. కానీ గాంధీని దూశించినవారు మాత్రం గొప్పవారు. ఆటెన్ బరో గాంధీ గురించి సినిమా తీస్తే గాంధీ ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధం. కానీ ముందుమాటలో మాత్రం గాంధీని అర్ధం చేసుకోవటం చాలా సులభం అంటారు. దీన్ని బట్టి చూస్తే రచయిత గాంధీని దూశించి, పనికిరానివాడని నిరూపించాలన్న ఆత్రంలో ఏమి రాస్తున్నారో కూడా ధ్యాస లేకుండా రాసేసారన్నమాట. తాను చేస్తె సరి, ఎదుటివాడేమి చేసినా నేరం అన్నట్టుంది ఇది.

గాంధీ సినిమా స్క్రిప్టు రచయిత, john briley తనకు ముందు గాంధీ గురించి సరిగా తెలియదని అంటాడు.

 i had a vague notion of gandhi, a man whose ideas i too admired but felt were wildly unrealistic in a world as harsh as the one i had grown up in.

కానీ స్క్రిప్టు కోసం పరిశోధన మొదలు పెట్టిన తరువాత గాంధీ గురించి ఆయన అభిప్రాయం మారింది.

 gradually the personality of this open, questing, unpretentious man began to unfold for me. the wellsprings of his courage, his humility, the humor, the compelling power of his sense of human dilemma- a power which when allied to his striving for decency made devoted disciples of men as diverse as the cultured nehru, the cynical patel, and the village peasant who had never been five miles from the mudbrick house where he was born.

ఇదీ గాంధీ గారి వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరూ ఆయన వ్యక్తిత్వ ప్రభావానికి లొంగిన వారే. ఆకాలంలో దేశం మొత్తం ఒక్కటిగా ఆయన పిలుపుకు స్పందించింది. ఆయన మాటలకు జాగృతమయింది.

నాయర్ సాన్ అనే ఆయన an indian freedom figher in japan- a memoir అన్న పుస్తకంలో ఆయన కేరళలోని ఓ మారు మూల ప్రాంతంలో కూడా గాంధీగారి పేరు చెప్పితేచాలు ప్రజలు ఎలా స్పందించేవారో వర్ణించాడు. అంతవరకూ లొంగని అగ్రవర్ణాలవారుకూడా గాంధీ గారి పేరుచెప్పగానే ఎలా అస్పృష్యత నివారణకోసం సిద్ధమయ్యారో వివరిస్తాడు.

శాస్త్రిగారికి మాత్రం గాంధీ సినిమా వల్లనే గాంధీగారికి ఇంటా బయటా అంత పేరు వచ్చినట్టు అనిపిస్తుంది. ఐన్శ్తీన్ తో సహా ఇతర విదేశీయులంతా మరి గాంధీ గారి గురించి ఎలా తెలుసుకున్నారో. మార్టిన్ లుథర్ కింగ్, మండేలాలు కూడా బహుషా ఆటెంబరో ద్వారా వినే గాంధీ గురించి తెలుసుకునివుంటారు. ఈ పుస్తకంలో రచయిత వాదన చూస్తే, గాంధీ గారి ప్రేతాత్మ ఆటెంబరోను ఆవేశించి ఈ కుత్ర చేసినదని అన్నా అంటారు.

సినిమాలో ఆఫ్రికాలో గాంధీ జీవితం సరిగా చూపలేదన్న విమర్సను ఉదహరించి రచయిత ఇదంతా కుట్ర అని తీర్మానించారు. కానీ మూడు గంటల సినిమాకు ఉన్న పరిమితులు అర్ధం చేసుకుంటే ఆ విమర్శ అర్ధ రహితం అని స్పష్టమవుతుంది. కానీ గాంధీ గొప్పతనమంతా  ప్రచారంలోనీ వుందని నమ్మేవారికి ఇది గొప్ప నిదర్సనంలా అనిపిస్తుంది.

గాంధీ గారిపై ఈ పుస్తకంలో రచయిత చేసిన ఇతర విమర్శలకు సమాధానం రేపు.

September 30, 2008 · Kasturi Murali Krishna · One Comment
Posted in: pustaka paricayamu

మహేంద్ర కపూర్ కు గీతాంజలి

కొందరు ప్రతిభావంతులుంటారు. వారి దురదృష్టము ఎలాంటిదంటే వారిలో ఎంత ప్రతిభ వున్నా జీవితాంతం వారు ద్వితీయ శ్రేణి కళాకారులుగానే పరిగణనకు గురవుతారు. ఒక్క సారి ఏ కళారంగాన్ని పరిషీలించినా ఇలాంటి పరమాధ్భుతమయిన ప్రతిభ వుండీ అనేక కారణాలవల్ల నీడలలో మిగిలి, అప్పుడప్పుడూ మేఘాలమాటునుండి వెలికి వచ్చి కళ్ళు జిగేల్మనిపించి మళ్ళీ మేఘాల మాటుకి వెళ్ళిపోతారు. అలాంటి అత్యద్భుత ప్రతిభవుండీ నీడలలో మిగిలిన కళాకారులలో మహేంద్ర కపూర్ ఒకరు.

జయదేవ్, సర్దార్ మాలిక్, గులాం మహమ్మద్,సజ్జద్, వసంత్ దేశాయ్, మన్నాడే  ఇంకా అనేక కళాకారులు మురిపించి, మెరిపించి, తమ ప్రతిభ తాలూకు మెరుపులు ప్రదర్శించి, ఊరించి, నిశ్శబ్దమయిపోతారు. ఇందుకు కారణాలనేకం. కానీ మహేంద్ర కపూర్ ద్వితీయ శ్రేణి కళాకారుడిగా మిగిలిపోవటానికి ప్రధాన కారణం అతను పేద వారి మహమ్మద్ రఫీగా గుర్తింపు పొందటమే!

మహేంద్ర కపూర్ చినీ గేయ ప్రపంచంలో అడిగిడినప్పుడు దివ్యమయిన గంధర్వుల లాంటి గాయకులు రంగంలో వున్నారు. రఫీ, తలత్, ముఖేష్, కిషోర్ వంటి గాయకులు తమదయిన ప్రత్యేక గాన శైలిని ఏర్పాటు చేసుకున్నారు.

రఫీ స్వరం నీటిలాంటిది. ఏపాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని నీరు ధరించినట్టు, అయినా జీవం పోసేట్టు, రఫీ స్వరం పలకని భావం లేదు. చిలికించని హొయలు లేవు. పోని లయలు లేవు. ఎటువంటి, గానం, వాయిద్యం లేకున్నా కేవలం తన స్వర విన్యాసంతో పాటను పండించగలడు రఫి. అప్పటికే రాజ్యం ఏలుతున్న తలత్ ను మూగవాడిని చేసి పనికిరాని వాడిని చేశాడు.

ముఖేష్ ప్రత్యేకత ముఖేష్ దే. రాజ్ కపూర్ కాంప్ లో ఆస్థాన గాయకుడు ముఖేష్. ఆ స్థానం నుంచి ఆయనను ఎవారూ కదల్చలేరు.

కిషోర్ పద్ధతేవేరు. అనితర సాధ్యం అతని మార్గం. పైగా యోడెలింగ్ నుంచి విషాదగీతాలవరకూ రఫీకి దీటుగా అన్నిరకాల భావాలను, హోయళు లయలను పలికించగలడు.

వీరంతా  ఉచ్చదశలో వున్నప్పుడు రంగంలో ప్రవేశించాడు మహేంద్ర కపూర్. మన సినిమాల్లో కళాకారుడికి ఏవరిదయిన మద్దతు వుండాలి. ఏదయినా కాంప్ కు చెంది వుండాలి. కానీ, మహేంద్ర కపూర్ అడుగుపెట్టేనాటికి కాంపులలో ఖాళీలు లేవు. పైగా అతడి మొదటి పాట చాంద్ చుపా ఔర్ తారే డూబే రఫీ లాంటి పాట. మహేంద్ర కపూర్ బాగానే పాడినా, రఫి స్వరం లోని మృదుత్వము, మాధుర్యమూ, flexibility లు మహేంద్ర కపూర్ స్వరంలో లేవని స్పష్టమయిపోయింది. దాంతో రఫీ లాంటి అసలు గాయకుడుండగా, రఫీ నీడలాంటి మహేంద్రకపూర్ దండగా, అన్న భావం స్థిర పడింది. దాంతో ఎవరికయితే రఫీ నచ్చడో, రఫీకి తీరికలేదో వారికి, మహేంద్ర కపూర్ గుర్తుకు వచ్చేవాడు.

సీ. రామ చంద్రకు, అనిల్ బిశ్వాస్ కు శాంతా రాం కూ రఫీ పాడే విధానం నచ్చదు. వారి దృష్టిలో ఏడ్చేపాటలో గాయకుదు ఏడుస్తూ పాదాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడయితే మహేంద్ర కపూర్ రంగ ప్రవేసం చేశాడో వారు మహేంద్ర కపూర్ ను ఆహ్వానించారు. అవకాశాలిచ్చారు.

ఆతరువాత, చోప్రాకు, రఫీకి భేదాభిప్రాయాలు రావటంతో చోప్రా కాంపులో మహేంద్ర కపూర్ కు స్థానం లభించింది. తన ప్రతిభను ప్రదర్శించే వీలు దొరికింది. మళ్ళీ రఫీ లతాలకు గొడవవల్ల, లతా రఫీతో పాడననటంతో లత తో పాడే వీలు మహేంద్ర కపూర్ కు చిక్కింది. అలా, అతనికి సంగంలో హర్ దిల్ జో ప్యార్ కరేగా పాడే వీలు దొరికింది. ఇదే సినిమాలో రాజేంద్ర కపూర్ పైన చిత్రించిన సొలో పాట రఫీ పాడాడు. యె మేరా ప్రేం పత్ర్ పఢ్కర్.  మనోజ్ కుమార్ కు మహేంద్ర కపూర్ స్వరం నచ్చింది. రఫీ కన్న అతనికి మహేంద్ర కపూర్ lucky mascot అన్న నమ్మకం కలిగింది. ఫలితంగా అతని కాంపులో మహేంద్ర కపూర్ చేరాడు. కానీ మనోజ్ కుమార్ కు ముఖేష్ ఎక్కువగా నప్పటంతో ప్రధాన పాటలన్నీ ముఖేష్ కు దక్కేవి.

70వ దశకంలో రఫీ అనేక కారణాలవల్ల పాటలు తగ్గించేశాడు. దాంతో దిలీప్ కుమార్, శమ్మి కపూర్ వంటి వారికి పాడేవీలు మహేంద్ర కపూర్ కు చిక్కింది. గోపి సినెమాతో దిలీప్ కుమార్ గొంతయ్యాడు మహేంద్ర కపూర్. కానీ, రఫీ దొరికితే మాత్రం దిలీప్ కు రఫీతోనే పాడించారు. బైరాగ్, దాస్తాన్ లలో దిలీప్ గొంతు రఫీదే. చివరికి క్రాంతిలో వేలు దొరకగానే దిలీప్ కు రఫీదే గొంతు. (చన్నా జోరుగరం పాట.)అలాగే, రఫీకి ఓపీ నయ్యర్తో విభేదాలు రావటంతో ఆ కాంపులోకి మహేంద్ర కపూర్ అడుగుపెట్టాడు.రఫీ మరణం తరువాతనే నౌషాద్ మహేంద్ర కపూర్ తో పాడించాదు.

చోప్రా, రవిలతో మహేంద్ర కపూర్ అనుబంధం సునీల్ దత్ తో సంబంధంగా పరిణమించింది. దాంతో తరువాత సినిమాలలో సునీల్ దత్ గొంతయ్యాడు మహేంద్ర కపూర్. కానీ, సునీల్ దత్ సినిమాలఓ పాటల ప్రాధాన్యం తక్కువ.(చోప్రా సినిమాలు మినహా)

చోప్రా కాంపులో రఫీని నిషేదించటం వల్ల రవి మహేంద్ర కపూర్ ని వాడాడు కానీ, రవీ కి రఫీ అంటేనే ఇష్టం. వక్త్ సినిమాలో వక్త్ సే దిన్ ఔర్ రాత్ పాటను రఫీనే పాడాలని పట్టుబట్టాడు రవి. రఫీయే ఆ పాటలో భావానికి తగ్గ ఎమోషన్లు చూపగలడని రవి నమ్మకం. అందుకే చోప్రా రఫీని నిషేధించినా ఆ పాట మాత్రం రఫీనే పాడాడు.

ఇలా, జీవితాంతం రఫీ నీడలోవుండిపోవాల్సి వచ్చింది మహేంద్ర కపూర్ కు.రఫీ మరణం తరువాత రఫీ అనుకరణతో అనేకులు రంగ ప్రవేశం చేశారు. అప్పటికి మహేంద్ర కపూర్ స్వరం కూడా బండ బారి పోయింది. అయినా రవి కి మాత్రం పాడుతూ వచ్చాడు మహేంద్ర కపూర్.

గమనిస్తే, మహేంద్ర కపూర్ కు రఫీ నీడ అని ముద్ర పడింది కానీ తన దయిన ప్రత్యేక గాన పద్ధతి వుంది. అతను గొంతు చించుకుని హై పిచ్ లో పాడే పద్ధతి అనితర సాధ్యం. చివరి వరకూ అలా పాదగలిగేడు. ఒక స్థాయికి చేరిన తరువాత రఫీ హై పిచ్ లో పాడలేదు. కానీ నమూ చుపాకె జియో, అబ్ కే బరస్, ఔర్ నహీ ,మెరె దేశ్ కి ధర్తీ లాంటి పాటలలో మహేంద్ర కపూర్ గొంతు విప్పి పాడుతూంటే మనసు రెక్కలు కట్టుకుని విహాయసంలోకి విహరిస్తుంది.

ఆరంభంలో నాకూ మహేంద్ర కపూర్ అంటే చులకన అభిప్రాయం వుండేది. రఫీ వీరాభిమానిని నేను. కానీ, రాను రాను మహేంద్ర కపూర్ పాతలు వింటూంటే, ఏ ఇతర గాయకుడికీ మహేంద్ర కపూర్ ఏ రకంగానూ తీసి పోడని అర్ధమయింది. దిగాజాల నడుమ వుంటూ కూడా తన దయిన ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకోవటం చాలా కష్టం. ఆ కష్టమయిన పనిని సాధ్యం చేశాడు మహేంద్ర కపూర్.

దిల్ లగాకర్ హం యె సంఝె జిందగీ క్యా చీజ్ హై, అన్న పాటలో మహేంద్ర కపూర్ స్వరం భావాలను మధురంగా పలుకుతుంది. ఉఖ్యంగా హోష్ ఖో బైఠే తొజానా బేఖుదీ క్యా చీజ్ హై, అన్నప్పుడు అతని స్వరంలో ఒక రకమయిన మత్తు జాలువారుతుంది. అయితే, ఇదే రఫీ పాడితే ఇంకా మత్తుగా వుండేదనిపిస్తుంది. ఇక్కడే మహేంద్ర కపూర్ ఎందుకని ద్వితీయ శ్రేణి గాయకుడిగా మిగిలిపోయాడో తెలిసేది.

శ్యామల్ శ్యామల్ బరన్, కోమల్ కోమల్ చరన్ మహేంద్ర కపూర్ జీవితంలో అత్యద్భుతమయిన పాటలలో ఒకటి. పదాల లాలిత్యానికి అతని స్వర గాంభీర్యం తోడయి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి.ఇక్కడ కూడా అతని స్వరంలో కొంత లాలిత్యం వుంటే? అన్న భావన కలుగుతుంది.

ఇక రవి చోప్రాలకు ఆయన పాడిన పాటలు మహేంద్ర కపూర్ కు ప్రత్యేక వ్యక్తిత్వాన్నిచ్చాయి. ఇక్కడ కూడా రఫీ గుర్తుకు వచ్చినా నెమ్మదిగా రఫీ నీడలోంచి మహేంద్ర కపూర్ బయట పడటం చూడవచ్చు.

హే నీలె గగన్ కె తలే, వింటూంటే అలా నీలి మబ్బులపయిన తేలియాడుతున్న భావన కలుగుతుంది. తుం అగర్ సాథ్ దేనేక పాట అయితే రొమాన్స్ కు ప్రతీక. కిసీ పత్థర్ కే మూరత్ సే, సున్నిత భావాల సముద్రం. అయితే, ఇక్కడ మహేంద్ర కపూర్కు సాహిర్ కవితలు ఎంతో సహాయం చేసాయి. పాటలలోని భావాలు మనలను మధురిమలో ముంచెత్తుతాయి. మహేంద్ర కపూర్ స్వరం ఆ మాధురీ స్రవంతిలో ప్రయాణించే వీలు కల్పించే పడవ.

ఆప్ అయీ తొ ఖయాలే దిల్ ఎ నాషాదాయా పాటలో మ్ని సున్నిత భావాలను మహెంద్ర కపూర్ పలికిన తీరు అమోఘం. అలాగే చలో ఎక్ బార్ ఫిర్సే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సినిమాలో, ఇన్ హవావోమే విషాదంగా మహేంద్ర కపూర్ ఒక్కడే పాడతాడు. అది నా వుద్దేశ్యంలో మహేంద్ర కపూర్ పాటలన్నిటిలోకి తలమానికమయినది.

కల్ బాహోంకా హార్ మిలాథ/ ఆజ్ అష్కోంకా హార్ పుకారే/
ఉంకో కుచ్ బీ యాద్ నహీ హై/ అబ్ కోయీ సౌబార్ పుకారే వంటి పాదాలలో ఆయన భావం చిలికించిన తీరు పరమాధ్బుతం. నటుడు ఏడుపు మొహం పెడితే చాలు గొప్ప నటన అనిపించే రీతిలో పాడాడు.

అయితే, 70 ల తరువాత మహేంద్ర కపూర్ పాటలు తగ్గాయి. మళ్ళీ రఫీ రంగ ప్రవేశం చేశాడు. పాటల తీరు మారింది. ముఖేష్, మహేంద్ర కపూర్, మన్నడే  లాంటి వారి పాటల అవసరం తగ్గింది.

అయినా, రవి సంగీతంలో బీతే హువే లమ్హోంకి కసక్ సాథ్ తొ హోగీ, దిల్కీ యె ఆర్జూ థి కొయీ లాంటి పాటలు అద్భుతంగా పాడాడు. కానీ నాకు, ఇన్సాన్ కీ హర్ షైకా ఇత్నాహీ ఫసానా హై/ ఎక్ ధుంద్ సే ఆనాహై, ఎక్ ధుంద్ మే జానా హై/ చాలా చాలా చాలా నచ్చుతుంది. సాహిర్ రచనలోని తాత్వికత, లోతయిన భావాల గనులను మన అనుభూతికి తెస్తాదీపాటలో తన స్వరంతో. ఎంతో గంభీరంగా, భారంగా ఒకో పదాన్ని స్పష్టంగా. అనుభవిస్తూ పలుకుతూంటే, కళ్ళముందు పొగ మంచు కమ్మినట్టుంటుంటుంది. నిజం, మనమంతా పోగ మంచులోంచే వస్తాము. పొగ మంచులోకే పోతాము. ఎటునుంచి వస్తామో తెలియదు. ఎతు పోతామో తెలియదు. వెళ్ళిన వారూ చెప్పలేరు. ఇప్పుడా పోగమంచులోకే అదృశ్యమయ్యాడు మహేంద్ర కపూర్. కానీ తన స్వరంద్వారా ఆయన సృజించిన మధుర గేయాల మధుర భావాలు జీవితాంతం మనలని రంజింప చేస్తూనే వుంటాయి. తర తరాలకు సున్నిత భావనలను నేర్పుతూనే వుంటాయి.

ఒకేసారి అత్యద్భుతమయిన కళాకారులు రంగంలో వుంటే,  first among equals కు గుర్తింపు వస్తుంది. మిగతా అంతా అతని నీడలో వుండిపోతారు. ఇందుకు మహేంద్ర కపూర్ తిరుగులేని నిదర్శనం. అతడికి ఇదే నా గీతాంజలి.

ఘటామే చుప్కే సితారే ఫనా నహీ హోతే
అంధేరి రాత్కే దిల్మే దియే జలాకె జియో

అన్నదానికి మహేంద్ర కపూర్ మచ్చుతునక.

యె జిందగీ కిసి మంజిల్ పె రుక్ నహీ సక్తీ
హర్ ఎక్ మకాం సే ఆగె కదం బఢాకె జియో

అన్నదానికీ అతని జీవితం నిదర్శనం.

September 28, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

మన మహాత్ముడు, విమర్శ-6

 when we talk about others it is our character that is revealed most  అన్నది అక్షర లక్షలిచ్చేమాట. ఎందుకంటే, మనసు ఏది చూడాలనుకుంటే మెదడు అదే చూపిస్తుంది. మెదడు చూసేది మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే, ఎదుటివారి గురించి మనము మాట్లాడేమాటలు, చేసే విమర్శలు, రక రకాల విషయాలను మనము చూసే దృష్టి మన వ్యక్తిత్వాన్నిబట్టివుంటాయి. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు అందుకే.

ఎప్పుడయితే ముందు మాటలో గాంధీని ధర్మపీఠం ముందు నిలబెడతానన్నారో అప్పుడే రచయిత గాంధీ ప్రతి పనిలో తప్పులెన్నాలని కంకణం కట్టుకున్నారన్న భావన కలుగుతుంది.

గాంధీ ప్రత్ష్టను ధ్వంసం చేయటానికో, కించపరచే వుద్దేశ్యంతోనో, ద్వేశంతోనో ఈ పుస్తకం రాయటంలేదని అనగానే, రచయిత తాను రాసిన దానికి వివరణ, సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడని తెలుస్తుంది. అంటే ప్రచారంలో ఉన్న అభిప్రాయాలకు భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తున్నారని అర్ధమవుతుంది. తానేవేవి తన ఉద్దేశ్యాలు కావన్నారో అవే ఆయన అసలు వుద్దేశ్యాలన్న భావన కలుగుతుంది. తన ఆలోచనను సమ్ర్ధించుకునేందుకు మజుందారు నుంచి ఉదాహరించారు రచయిత. మజుందారేకాదు మన ధర్మంలో ఎవరినీ మనము ప్రశ్నించి నిగ్గు తేల్చుకోకుండా గొప్పవాడనలేదు. అలా అనే అలవాటూ మనకులేదు. ఇప్పుడు ప్రతివాడూ విమర్శలకతీతమయి, సహనంకొల్పోవటం ఎందుకంటే ధర్మం తెలియక. సరయిన ఆదర్శం ప్రజలముందు లేక. ఉత్తమ ఆదర్శం వున్నవాడు తాత్కాలిక ప్రలోభాలకు లొంగడు. అవిలేని వారే ఆవేశకావేశాలకు లొంగుతారు.కాబట్టి గాంధీ నిగ్గు తేల్చుకోకుండా ఎవరూ ఆయనను మహాత్ముడని అనలేదు. ఇప్పుడు ఆయనను ధర్మ పీఠం ముందు నిలపాల్సిన అవసరమూ లేదు. ఆయనేమీ, మిలొస్లావిచ్, సద్దాం వంటివాడు కాడు, నేరాలెంచి శిక్షించేందుకు. వారుకూడా, వారి దేశకాల పరిస్థితులనుంచి చూస్తే అంత చెడ్డవారేమీ కాదు. జార్జి బుష్షు వారిని చెడ్డవారిని చేయాలనుకున్నాడు. చేశాడు. ఇప్పుడు గాంధీ విషయంకూడా అంతే.

గాంధీ గురించి దేశం మొత్తం సరిగ్గా అంచనావేయలేదు. అందరూ భక్తితో కళ్ళు మూసుకుని, గౌరవంతో చెవుల్లో సీసం పోసుకుని గాంధీని మహాత్ముడిని చేసారు. కానీ, గాంధీ ఒక పక్కా మోసగాడు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అసూయలకు పెట్టింది పేరు. ఆయన బ్రిటీషువారి ఏజెంటు. కావాలని బ్రిటీష్ వారు ఆయనని నాయకుడు చేసారు.  కాంగ్రెస్ వారు మాయ చేసి గాంధీని గొప్ప చేశారు. ఆ మాయలో పడి అంతా గాంధీని గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడీ పుస్తకం ద్వారా అందరి కళ్ళకు కమ్మిన పొరలను తొలగిస్తాను. చెవులకు పట్టిన తుప్పు వదలగొడతాను, అని రచయిత అంటున్నట్టనిపిస్తుంది ముందుమాట చదివితే. అయితే, తన ప్రయత్నం విఫలమవుతుందని రచయితకు తెలుసు. అందుకే, ముందు మాటలోనే, గాంధీ బ్రతికుండగానే తప్పుపట్టాల్సిన అంశాలన్నీ ప్రజలకు తెలిశాయి. అయినా గాంధీ పట్ల పూజ్యభావం తగ్గలేదు. ఇప్పుడు నేను రాసిన దాని వల్ల అది మసక బారుతుందన్న భ్రమ నాకు లేదు అంటారు రచయిత. అలాంటప్పుదు ఇంత వ్యధా, వృధా ప్రయత్నమెందుకన్న ప్రశ్న వస్తుంది.

నిజానికి, ఇప్పుడు గాంధీ పేరు మాత్రం ప్రజలకు తెలుసేమోకానీ ఆయన తత్వం, ఆయన జీవితం ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలనా ఆసక్తీ ఎవ్వరికీ లేదు. ఆయన విగ్రహాలు విరిగిపోయి, దుమ్ముపట్టి, చెత్తకుండీలపక్కన, కుక్కలకూ పందులకూ మాత్రమే పరిమితమయ్యాయి. యువకులకు గాంధీ అంటే, మున్నాభై గాంధీగిరే తప్ప ఇంకా ఏమీకాడు. అలాగే రాజకీయ నాయకులకూ గాంధీ ఆశయాలేమిటో తెలియదు. ఆసక్తీ లేదు. అర్ధం చేసుకునే శక్తీ లేదు. ఒక రకంగా చెప్పలంటే గాంధీ ఇప్పుదు,  condemned to ablivion, thought of as redundant, is almost on the brink of extinction.

యువకులకు కొత్త idols వచ్చారు. ప్రజలకు, నాయకులకు కొత్త దేవుళ్ళు రాజకీయంగా వెలిసారు. కొత్తగా రచనలు చేస్తున్నవారికి యండమూరికూడా సరిగ్గా తెలియనట్టే, నాయకులకూ, వారి అనుచరులకూ రాహుల గాంధీ దాటి తెలియదు. సోనియా కూడా మసకబారుతున్న ఙ్నాపకమే.

ఇలాంటి పరిస్థితులలో పనిగట్టుకుని గాంధీని ధర్మపీఠానికి లాగాల్సిన అవసరముందా? ఆయనని దూషించి, తప్పులెంచి తీర్పులు చెప్పి శిక్ష విధించాల్సిన అవసరముందా?

ఆయన జీవితకాలంలోనే ఆయన తప్పులకు ఘోరమయిన శిక్షలను అనుభవించాడు. దేశాన్ని విభజించేముందు నన్ను విభజించండి అన్నవాడు, నిజంగా దేశ విభజన జరుగుతున్నప్పుడు ఎంత క్షోభను అనుభవించాడో!

చిన్న హింస జరిగిందని ఆకాశం తాకుతున్న ఉద్యమాన్ని క్షణంలో చల్లార్చిన మనిషి ఇంత హింసను చూస్తూ ఎంత ఘోరంగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాడో!

నిజానికి గాడ్సే చపింది గాంధీ జీవచ్చవాన్ని. ఎందుకంటే,అసలు గాంధీ అంతకు ముందెప్పుడో చచ్చిపోయాడు.  మరి ఏ అసలు గాంధీని పట్టుకోవాలనుకున్నాడు రచయిత.

మరి ఎప్పుడో చచ్చి బ్రతికిన గాంధీని ఇప్పుడు ధర్మపీఠం ముందుకు లాగాల్సిన అవసరం వుందా? ఇది  flogging a dead and buried horse  లాంటిది.

రచయిత స్వభావం, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం అతని రచనలలో తెలుస్తుంది. రచయిత గురించి ఆయన కన్నా ఆయన రాసిన అక్షరాలే సరిగ్గా చెప్తాయి అంటారు.

ఇంతవరకూ ఎంవీయార్ శాస్త్రిగారి రచనలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయనకు ఒక పీఠం పైన వుండి తీర్పునివ్వటం, తప్పులెంచి, ఎదుటివారు పనికిరానివారని చూపటం సరదా అనిపిస్తుంది.

అంతకుముందు పుస్తకాలన్నీ చరిత్రకారులకు చరిత్ర పరిశోధన రాదని, వారు తప్పులు తడకలు కావాలని రాశారని నిరూపించిన రచనలు. ఆయన రచనలో నిజం వుండటంతో, రచనలో ఒక వ్యక్తినిగాక వ్యవస్థను విమర్శిస్తూండటంతో, పీఠం పైన వుండి తీర్పునిస్తున్న భావన రాదు. కానీ, 1857 రచనలో ఈ భావన కలుగుతుంది.

1857 పోరాటవీరులందరినీ పనికి రాని వారుగా, స్వార్ధపరులుగా, భీరువులుగా చిత్రించి దూషిస్తూంటే రచయితకు తప్పులెన్ని పనికిరాని వారిగా చూపటం సరదా అనిపిస్తుంది. ఎందుకంటే అలా చూపుతూండటంవల్ల ఇంతకాలం వారు గొప్పవారని నమ్మినవారు, ఇంకా వారిని గౌరవిస్తున్నవారూ, వెర్రి వెంగళప్పలని చూపిస్తునట్టవుతుంది. ఇది, నాస్తికులు, ఆస్తికులను చూసి హేళన చేయటంలాంటిది.తాము ఒక మెట్టుపైన వున్నట్టు, మిగతా అంతా మూర్ఖులు, దద్దమ్మలు అనుకున్నట్టు.

ఈ భావన మన మహాత్ముడు పుస్తకంతో బలపడుతుంది. ఇందులో గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు, ఆయన చర్యలను చూసిన దృష్టి, వాటిని విశ్లేషించిన తీరు ఈ ఆలోచనను నిరూపిస్తాయి.

ఇది రేపు.

September 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

మన మహాత్ముడు-విమర్శ-5

ఒక మనిషిలో అనేక మనుషులుంటారు. అనేక భిన్న సంధర్భాలలో వ్యక్తిలోని భినమయిన మనుషులు తొంగిచూస్తూంటారు.  అందుకే కవి గుంటూరు శేశేంద్ర శర్మ, ఒక తరాన్ని ప్రసవించటమంటే తమాషాకాదు/ ఒక నిండు కలల జగత్తునే మేల్కొల్పటం/ అన్నో అవ్యక్తాత్మలు చిత్ర విచిత్రానుభూతుల ఒడిలో స్పందన పొందిన తౠణాలు ఈ తరాలు, అంటాడు. ఈ కవిత భారతీయ దృక్కోణంలో మానవ మనస్తానికి సంబంధించిన ఆలోచనలను ప్రదర్శిస్తుంది.

మన సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తిలో అతని తల్లితండృలే కాదు, అతని పూర్వీకులంతా వుంటారు. ఒక వ్యక్తి ఒక సంఘటనకు ఒక రకంగా స్పందించాడంటే, ఈ పూర్వీకులతో పాటు, ఆ వ్యక్తి అనుభవాలు కూడా అందుకు కారణం. ఆధునిక జన్యు సిద్ధాంతం, మానసిక శాస్త్రం కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే, అతని పూర్వీకులను గురించి కూడా తెలుసుకోవాల్సి వుంటుంది. అందుకే మనవారు, కొన్ని తరతరాల చరిత్రలను తెలుసుకుని వుండేవారు. పరిచయం చేసుకునేటప్పుడు, ప్రవర కూడా చెప్పేవారు.

అందుకే, ఏ మనిషి గురించి అంచనా వేయాలన్నా, అతనిలోని అసలు మనిషిని గ్రహించాలన్నా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. కొన్ని సంఘటనలు, కొందరి వ్యాఖ్యలు, ఇంకొందరి అభిప్రాయాలు పరిషీలిస్తే సరిపోదు. అందుకే, శాస్త్రి గారు తన పుస్తకంలో ఆవిష్కరించాలనుకున్న అసలు గాంధీ ఎవరు? అన్న ఆలోచన వస్తుంది.

ముందుమాటలోనే తన పరిశీలన పరిథి పరిమితమయింది అని అన్నారు.

మరో సందర్భంలో, ఎవరి ఊహకు అందని, ఏ ప్రమాణానికీ ఒదగని వాడని చాలామంది చేతులెత్తేశారనీ రాశారు. అయితే, ఇందుకు కారణం, వారికి వారు తగిలించుకున్న భక్తి విశ్వాసాల గంతలు అడ్డొస్తాయనీ రాశారు. అంటే కళ్ళకు కట్టుకున్న గంతలు తొలగించుకుంటేఅ గాంధీ అసలు మనిషి అర్ధమవుతాడని రచయిత అభిప్రాయమని తేలుతోంది.

కానీ రచయిత తన పరిషీలనను నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా చేసారన్న ఆలోచన ముందుమాటలోనే అడుగంటుతుంది.

ముందుమాటలోనే నేను మాట్లాడుతున్నది మనం పూజించే గాంధీగురించి కాదు, మనం గుర్తించని రాజకీయ గాంధీ గురించి అన్నారు.

మనము పూజించే గాంధీ, రాజకీయ గాంధీ వేర్వేరు కారు. ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం పడుగులో పేకలా కలసి పోయాయి. వాటిని విడ దీసి చూడటం నూనె, నీరు వేరుచేసినంత సులభం కాదు. అలా చూస్తే గాంధీనే కాదు, ఏ వ్యక్తి గురించీ సరయిన, సమగ్రమయిన అవగాహన ఏర్పడదు.

వివేకానంద వ్యక్తిగత జీవితం నుంచి, ఆయన ప్రవక్త జీవితాన్ని వేరు చేయగలమా? అలా చేస్తే నాస్తికుడయిన యువకుడు యోగి అవటం అర్ధమవుతుందా?  ఆయన బాల్య అనుభవాలను విస్మరిస్తే, ఎదిగిన తరువాత ఆయన ప్రవర్తన మనకు బోధపడుతుందా? ఆరోగ్యవంతమయిన బాల్యం వ్యక్తిత్వ వికాసానికి రాజమార్గం అంటారు. వ్యక్తి వ్యక్తిత్వాన్నుంచి అతని అనుభవాలు వేరు చేసి చూడటం కుదురుతుందా?

ఇది గాంధీ, వివేకానందకే కాదు ఏ వ్యక్తికీ వర్తించదు. ఇందిరాగానంధీ వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితం అని విభజించవచ్చు, కానీ ఒకదానితో ఒకటి కలసి వున్నాయి. ఒక దాన్ని విస్మరిస్తే మరొకటి బోధ పడదు.

చార్లెస్ దికెన్స్ జీవితం నుంచి అతని నవలలను వేరు చేయగలమా? అలాగయితే, డేవిడ్ కాపర్ ఫీల్డ్ ఈ జన్మకు అర్ధం కాదు. ఇది ప్రతి రచయితకూ వర్తిస్తుంది.

అంటే, ఆదిలోనే మనకు రచయిత పరిషీలనా పద్ధతి సమగ్రమూ, సంపూర్ణమూ కాదని తెలుస్తుంది. పైగా రచయిత తన పరిమిత పరిథి గురించీ చెప్పుకున్నాడు. అలాంటప్పుడు, చిన్న సందులోంచి, విశాలమయిన గదిలోకి తొంగి చూసి గది అసలు రూపాన్ని వర్ణించటం సాధ్యమని అనటం కుదురుతుందా?

ఇతరులకు ఆపాదించిన దోశాలు రచయితకూ వర్తిస్తాయికదా!

ఇతరుల కళ్ళకు భక్తి గంతలు కడితే రచయిత కళ్ళకు భక్తి తప్ప మిగతా అన్నీ  గంతలు కట్టినట్టే అవుతుంది కదా?

గాంధీ వ్యక్తి గత జీవితాన్ని రాజకీయ జీవితాన్ని వేరు చేసానన్న రచయిత, ఆఫ్రికాలో అల్లర్లు జరుగుతూంటే గాంధీ బ్రహ్మచర్యం గురించి మాట్లాడేఅరని విమర్శించటం తర్కానికి నిలుస్తుందా? గాంధీ బ్రహ్మచర్యం పాటించాలని నిశ్చయించటం వ్యక్తి గతమా? రాజకీయమా? వ్యక్తిగతమయితే ఆ నిర్ణయం గురించి వ్యాఖ్యానించే అర్హత రచయిత కోల్పోతాడు. ఎందుకంటే, మనము పూజించే మహాత్మా గాంధీలో బ్రహ్మచర్యం ఒక భాగం. రాజకీయమయితే, ఒక వ్యక్తి ఆంతరంగిక నిర్ణయం రాజకీయమెలా అవుతుంది? అందుకే, మనము పూజించే గాంధీ, రాజకీయ గాంధీ అని వేర్వేరు లేరు. వున్నది ఒకటే గాంధీ అది మహాత్మా గాంధీ!

రాజకీయాలకు, ధర్మానికీ, వ్యక్తిగత ప్రవర్తనకూ తిరుగులేని రీతిలో ముడిపెట్టాడు మహాత్మా గాంధీ. అందుకే ఆయనను పూజించాల్సిన విషయాల్లో పూజిస్తూనే విభేదించిన విషయాల్లో విభేదిస్తూనే వున్నారు ఆకాలంలో రాజకీయనాయకులు, ప్రజలు.

అంబేద్కర్, అరబిందో, సుభాష్ బోస్ లు ఆయనను దుయ్యబట్టారు. అది రాజకీయంగా. సైద్ధాంతిక పరంగా. కానీ వ్యక్తిగతంగా వారూ గాంధీని పూజించారు. ఆరాధించారు. వారు విమర్శించిన రాతలే చూస్తే సరిపోదు. వారు గాంధీని మహాత్ముడిగా అభివర్ణించిన రాతలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

అరబిందో గాంధీ పద్ధతులని ప్రశంసించారు. బోసు గాంధీ భక్తుడు. అంబేద్కర్ కూడా గాంధీ అభిమాని. అంటే ఒక రకంగా గాంధీ మహాత్ముడవటంలో వీరందరి పాత్రా వుంది.అంటే రచయిత తనకు నచ్చి, తన వాదనను బలపరిచే సత్యాలని మాత్రమే ఎంచుకున్నారన్నమాట.selective election of material and selective look out for material  అన్నమాట.

తాను ఎంచుకున్న సత్యాలను విశ్లేషించే దృష్టి కూడా selective అవటంలో ఆశ్చర్యం ఏమయినా వుందా?

ఇక, గాంధీగారిని కించపరిచే వుద్దేశ్యమూ లేదని రాశారు. పుస్తకం చదువుతూంటే కించపరచటం తప్ప మరో ఉద్దేశ్యమూ లేదని స్పష్టమవుతుంది.

ఇదేలాగో రేపు చూద్దాము.

September 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

మన మహాత్ముడు-విమర్శ-4

ప్రస్తుతం తెలుగు రచనా రంగంలో అత్యద్భుతమయిన తెలుగు, అతి శక్తి వంతమయిన రీతిలో రచించేవారిలో అగ్రస్థానం ఎంవీఆర్ శాస్త్రి గారిదే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన్ రాసే ప్రతి వాక్యం, వాడే ప్రతి పదమూ ఎంతో అర్ధవంతమూ, ఆలోచనాత్మకంగా వుంటాయి. ఆయన వాదన, తర్కం అత్యంత ఆహ్లాదకరంగానేకాదు, ఖండించలేని రీతిలో వుంటాయి. ఎదురువాదనకు తావుండదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విషయాలను ఈ దృష్టితో ఇలా కూడా అన్వయించవచ్చన్నమాట అనిపిస్తుంది. రచనాంశం ఎల్లాంటిదయినా ఏక బిగిన చదివించగల శైలి ఆయనది. తన వాదనను బలపరచుకునేందుకు ఆయన సేకరించే నిజాలు, వాటికోసం చేసే పరిశోధన ఆ నిజాలను వ్యక్తీకరించిన తీరు లాంటి విషయాలలోకూడా ఆయనకు ఆయనే సాటి.అందుకే ఆయన రచించే ప్రతి అక్షరమూ ఎంతొ విలువతో అలరారుతూంటాయి. ఆయన రాసే ప్రతి విషయాన్ని ప్రామాణికంగా భావిస్తారు అనేకులు. ఆయన పుస్తకాలను రిఫెరెన్స్ పుస్తకాలుగా కూడా వుపయోగిస్తారు చాలమంది. అందుకే మహాత్మా గాంధీ గురించి ఆయన రచించిన మన మహాత్ముడు పుస్తకాన్ని విశ్లేశించి విమర్షించాల్సిన అవసరము కలిగింది.

ముందు మాటలోనే ఆయన గాంధీనే ధర్మ పీఠంపైన నిలిపే ప్రయత్నం ఇది అన్నారు.

ధర్మ పీఠం అంటే ఏమిటి? గాంధీగారిని ధర్మ పీఠంపైన నిలపాల్సిన అవసరం ఇన్నేళ్ళతరువాత ఇప్పుడెందుకు కలిగింది? అసలు, ఆయన నేరమేమిటి? ఆయనను ధర్మ పీఠంపైన నిలిపే అర్హత మనకేముంది? అన్న ప్రశ్నలు తలలెత్తుతాయి.

ముందుమాటలోనే ఇలా తలలెత్తే ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ప్రయత్నించారు.గాంధీ చుట్టూ ఆవరించిన తేజో వలయాలను చేదించి అసలు మనిషిని పట్టుకునే ప్రయత్నమే ఇది అన్నారు. అయితే, అందకు ముందు, గాంధీగారి సుదీర్ఘ వ్యక్తిత్వాన్ని, రాజకీయ జీవితాన్ని, దాని సాఫల్య వైఫల్యాలను తులనాత్మక పరిశీలన చేయటం నా ఉద్దేశ్యంకాదు అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, మనస్తత్వాన్ని, దానిపై ప్రభావం చూపిన అనేక అంశాలనూ. ఆ సమయంలోని సామాజిక పరిస్థితులను విశ్లేషించకుండా అసలు మనిషిని వెతికి పట్టుకోవటం సాధ్యమా?

ఒక వ్యక్తితో ఎన్నో సంవత్సరాలు కలసి బ్రతికిన తరువాత కూడా మనకు ఆ వ్యక్తిలోని అసలు మనిషి తెలుసని ఖరా ఖండిగా చెప్పలేము. పైకి నవ్వుతూన్నా, ఒకే రకంగా ప్రవర్తిస్తూన్నా అసలు మనిషి లోపల ఎలా భావిస్తున్నాడో చెప్పగలమా?
ఒక సినిమాలో నాయకుడు నాయికతో శృంగారం జరిపిన తరువాత ఆమె వైపు చూస్తూ అడుగుతాడు, నీ మెదడులో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని వుంది, అని. అంటే భౌతికంగా, మానసికంగా ఇద్దరు వ్యక్తులు ఎంత సన్నిహితంగా వుండగలరో అంత సన్నిహితంగా వున్న తరువాత కూడా ఒకరి మనసులోభావాలు ఇంకొకరికి తెలియవన్నమాట. మరి ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు, కొందరి అభిప్రాయాల ఆధారంగా అసలు మనిషిని పట్టుకోవటం సాధ్యమా? పైగా, మనకు తరువాత జరిగిన సంఘటనలు తెలుసు.ఆయన నిర్ణయాల ఫలితాలు తెలుసు. కానీ ఆయన ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనకీ వెసులుబాటు లేదు.

ఒక మనిషి ఒక సందర్భంలో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే రకరకాల అమ్షాలు అతని మనస్సుపై ప్రభావం చూపిస్తాయి. అవన్నీ వదిలి ఒక మనిషిలోని అసలు మనిషిని పట్టుకోవటం సాధ్యమా? మానసిక శాస్త్రవేత్తలే జీవితాంతం పరిషోధించినా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితిలో గాంధీ అసలు మనిషిని కొన్ని పాపెర్ కట్టింగులు, కొన్ని రెఫెరెన్స్ పుస్తకాలు, కాస్త ఊహ, ఇంకొంత ఆలోచన ద్వారా తెలుసుకోగలమా? అది తెలుసుకోవటం అంత సులభమయితే, ప్రపంచంలో ఇన్ని భేదాభిప్రాయాలు, దృక్కోణాలే వుండేవి కావు. ఇంతకాలం గాంధీ మహాత్ముడిగా నిలిచేవాడే కాదు. ప్రజలను ప్రభావితం చేయగలిగేవాడే కాదు.

ఈ సందర్భంలో వాల్ట్ విట్మాన్ కవితా పంక్తులను స్మరించాలి మనము.

 when i read the book, the biography famous/ and is this then said what the author calls a man’s life?/ and so will someone when iam dead and gone write my life?/ as if any man really knew aught of my life/ why even i myself i often think know little or nothing of my real life?/ only a few hints, a few diffused faint clews and in directions/ i seek for my own use to trace out here.

migataa reapu.

September 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

మన మహాత్ముడు-విమర్శ-3

ఒక సమాజంలో వందమంది సగటు మనుషులుంటే ఒకరో ఇద్దరో అసాధారణమయిన ప్రతిభ కలవారయివుంటారు. ఈ అసాధారణమయిన ప్రతిభ కలవారంటే మిగతా వారికి భయం అసూయలతో పాటూ ద్వేషం కూడా వుంటుంది. ఎందుకంటే, తమలో నిద్రాణమయివున్న శక్తిని వీరు ఎత్తి చూపించటమే కాదు, దాన్ని గుర్తించక వ్యర్ధం చేస్తున్నారనీ నిరూపిస్తారు. అందుకే నిప్పులు చిమ్ముకుంటూ ఒక వ్యక్తి పైకి ఎగిరిపోతూంటే ఎలాగయినా అతడిని తమ స్థాయికి దింపి లాగేయాలని ప్రయత్నిస్తారు. విజయం సాధించకుంటే, ఆ వాడి గొప్ప ఏముంది, పరిస్థితులు కలసివచ్చాయి, అని కొట్టిపారేస్తారు. అందుకే, ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించి, ఒప్పుకోవటం ఎంతో అరుదు. ఎంతో కఠినమయిన విషయం.

యండమూరి వీరేంద్రనాథ్ ఒక ప్రభంజనంలా తన రచనా చాతుర్యంతో ప్రజలను ఉర్రూతలూపుతూంటే, ఆయనది క్షుద్ర సాహిత్యమని, కాపీ సాహిత్యమని తక్కువ చేయాలని ప్రయత్నించారు. యద్దనపూడి నవలలను ఇప్పటికీ తేలికగా కొట్టేసేవారున్నారు. కానీ, ఈనాటికీ, నవల ఏభాగంలోంచి ఆరంభించినా పూర్తయ్యేదాకా వదలబుద్ధికాదావిడ నవలలు. ఎన్నిసార్లు చదివినా వాటి ఇదే పరిస్థితి. ఆవిడవి వంటింటి నవలలనీ, ప్రేమ నవలలనీ ఈసడిస్తారు.

వీళ్ళనొదిలేయండి, కొందరు పనిగట్టుకుని నారాయణ రెడ్డ్య్, మానిప్యులేటరనీ, కృష్ణ శాస్త్రి ఆబద్ధాలకోరని, దాశరథి అలాగనీ, ఇంకో గొప్పమనిషి ఇలాగనీ చులకనగా మాట్లాడేసి తమ ఆధిక్యతను నిరూపించుకుని అహాన్ని సంతృప్తి పరచుకుంటారు. సగటు మనుషుల మనస్తత్వము, జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగలేక, ఆశించినంత గుర్తింపు పొందలేకపోయిన వారి మనస్తత్వం ఇది.

ఆడవాళ్ళగురించి చులకనగా మాట్లాడటమూ, కథలల్లేసి లేనిపోనివి కల్పించి ఆనందించటమూ ఈ కోవకే చెందుతుంది. అందుకే, సెలబ్రిటీల వ్యవహారాలు మనము చెవికోసుకుని మరీ వింటాము. గాస్సిప్పులు, మత్తు గుక్కలకన్నా మత్తునిస్తాయి మనకు.

ఈ నేపధ్యంలో చూస్తే ప్రతి పేరు పొందిన వ్యక్తి గురించీ రకరకాల కథలు ప్రచారంలో వుంటాయనీ, వ్యక్తి ఎంత గొప్ప వాడయినా అందరి ఆమోదమూ పొందలేడనీ అర్ధమవుతుంది. శ్రీ కృష్ణుడిని దేవుడిగా ఒప్పుకోనివారూ, దూషించేవారూ ఆయన కాలంలోనే వున్నారు.

వివేకానందుడు అమెరికాలో విజయం సాధించిన తరువాత ఆయన గురించి ఎంత దుష్ప్రచారం జరిగిందంటే, చివరికి ఆయన ఇక్కడ తన సహచరులను తనని అభినందిస్తూ సభలు జరిపి ఆ వర్త వచ్చిన వార్తాపత్రికల కట్టింగులు అమెరికా పంపమని కోరాడు. ఎందుకంటే ఆయన తాగుబోతనీ, తిరుగుబోతనీ, హుక్కతాగుతాడని, దొంగ సన్యాసి అనీ, శూద్రుడనీ రకరకాల ఆరోపణలు చేశారు. ఆయన మాంసం తింటాడని ఏసడించారు. క్రీస్టియన్ మిషనరీలేకాదు, బ్రహ్మసామాజికులు, ఆయన వల్ల లాభంలేదని గ్రహించిన పెద్దలూ ఈ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ప్రచారమంతా చూసి వివేకానందుదు పనికిరాడని తేలుస్తామా? ఆ రాతలు గొప్ప వారు, మేధావులు రాసారు. అనేకులు నమ్మారు. అలాగని వివెకానందుడిని మనము కాదంటామా?

వివేకానందుడు గొప్పవారిని ఆశ్రయించాడని, రాజప్రాసాదాలలో కులికాడనీ విమర్శిస్తారు. విదేశీ మహిళలతో ఆయనకు సంబంధాలు అంటగట్టినవారూ వున్నారు. నివేదితగురించి ఓ రకంగా వ్యఖ్యలు చేసిన వారూ ఉన్నారు. అవన్ని ప్రామాణికాలుగా తీసుకుని వివేకానందుడిని సన్యాసి కాదంటామా? ఆయన రాజకీయాలజోలికి వెళ్ళలేదు. కాబట్టి ఆయన దేశభక్తుడు కాదంటామా? కష్టాలలో ఉన్న కుటుంబాన్ని వదలి సన్యాసి అయాడు. అందుకని ఆయన బాధ్యతలనుంచి తప్పించుకునేందుకు సన్యాసి అయ్యాడని అంటామా?

ఇటువంటి సందర్భాలలోనే విచక్షణ అవసరం.

మనిషి దృష్టి అసంపూర్ణం. ఒకే విషయాన్ని పదిమంది పది రకాలుగా చూస్తారు. పది రకాలుగా అర్ధం చేసుకుంటారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి గురించి ఎవరు నిజంగా వివరించగలరు? ఒకే వ్యక్తిలో అనేకరకాల వ్యక్తులుంటారు. ఒకే మనిషి ఒకే రకమయిన సందర్భాలలో వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు ఇలాగే ఎందుకు ప్రవర్తించలేదని నిలదీయటంలో అర్ధంవుందా?

మనిషి సంపూర్ణుడు కాడు. పొరపాట్లు చేస్తాడు. ప్రతి వ్యక్తిలో కొంత మంచి వుంటుంది. కొంత చెడు వుంటుంది. కొన్ని ంవిషయాల్లో తెలివి చూపుతాడు. కొన్ని విషయాల్లో మూర్ఖుడిలా వుంటాడు. ఒక వ్యక్తి గురించి విశ్లేషించాలంటే అనేక అమ్షాలను పరిగణణలోకి తీసుకోవాల్సి వుంటుంది. అయినా, మనము అనుకున్నదే నిజమని చెప్పలేము.

ఒక వ్యక్తిలో చెడు వుంది.మంచి వుంది. చెడు వుందని వదిలేస్తామా? మంచి వుందని ఆదరిస్తామా?

ఇల్లంటి అనేక సందర్భాలను ఎదుర్కొన్న కృష్ణుడే దీనికి పరిష్కారమూ చూపాడు. భగవద్గీతలో ఒక సందర్భంలో పొగ వుందని నిప్పును కాదంటామా? అనము. కాబట్టి సదోషమపి నత్యజేత్ అంటాడు. దోషముందని ఏదీ వదిలేయకూడదు. విచక్షణనుపయోగించాలి.

శ్రీశ్రీ తాగుబోతు. ఇద్దరు పెళ్ళాలు. బూర్జువాలకు పాటలు రాశాడు. ఇదేవీ ఆయన కవిత్వంలో గొప్పతనాన్ని తగ్గించవు.

బిల్ క్లింటన్ ఫోనులో మాట్లాడుతూ మోనికా తో సరసాలాడేడు. అది మనకు అనవసరం. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు మనకు ప్రాధాన్యం.

ఇలా చూస్తూపోతే మనకు ప్రతి వ్యక్తిలో మంచి చెడు కనిపిస్తాయి. ఎక్కువ మంచిని మనము తీసుకోవాలి. వీలయినంత వరకు అందరి దృష్టినీ మంచి వైపే మళ్ళించాలి. భద్రం కర్ణేభి శృణుమాయ దేవా అంటాం. మనము మంచే వినాలి. మంచే చూడాలి. మంచి పనులు చేస్తూ నూరేళ్ళు బ్రతకాలి. అలాగని చెడును విస్మరించకూడదు. చెడును పక్కకునెట్టి, సమాజ శ్రేయస్సుకోసం మంచినే ప్రకటించాలి.

అంగుళిమాలి కథ మనకు తెలుసు. అతడిలో అంత చెడులోనూ మనిషిని చూశాడు బుద్ధుడు. అది మన సాంప్రదాయం. అది మన ధర్మం.

ఈ ఆలోచనల నేపధ్యంలో మనము మన మహాత్ముడు పుస్తకాన్ని విశ్లేసిస్తే కనిపించే కనపడే నిజాలను రేపు పరామర్శిద్దాం.

September 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu