Archive for September 10, 2008

సగటు మనిషి స్వగతం-6

ఎండాకాలం వేడికి చిటపటలాడే వింటితో చిరాకు పడతాం. చల్లగాలితో సేద తీర్చే చిటపట చినుకుల వర్షాకాలం కోసం ఎదురుచూస్తాం. ఎదురు చూస్తున్న వర్షాకాలం ఎంతకీ రాదు. ఎంతకీ పోని ఎండాకాలాన్ని తిట్టుకుంటాం.ఇంతలో వరుణ దేవుడు కరుణిస్తాడు. వర్షాలొస్తాయి.

సగటు మనిషికి సహనం తక్కువ. చలికాలం చలిని తిట్టుకోకుండా వుండలేను. ఎండాకాలం కోసం ఎదురుచూస్తాను. ఎండాకాలం వేడిని భరించలేను.చెమటకి చర్మం పొక్కుతుంది. ఎండాకాలమే పవర్ కట్టులుంటాయి. అందుకే వర్షం చినుకు కోసం తపిస్తాను.

వర్షం వస్తుంది.

ఆహా!
నీటితో తడిసిన మట్టివాసన అద్భుతం. గాలిలోని నీటి స్పర్ష శరీరాన్ని తాకుతూంటే స్వర్గం కనిపిస్తుంది. మేఘాలతో నిండిన ఆకాశం, భూమితో దోబూచులాట ఆడుతూ మేఘాలమాటున నక్కే సూర్యుడు, ఆహాహా… వర్షాకాలం స్వర్గమే అనిపిస్తుంది.

నీరు భూమిని తాకటంతోటే, భూమి పులకరించినట్టు రకరకాల మొక్కలు జీవం పోసుకుంటాయి. ఆ మొక్కల ఆధారంగా బ్రతికే అనేక జీవాలు ప్రాణం పోసుకుంటాయి. జగతి పచ్చదనంతో అలంకరించుకుని వింత సోయగాలు ప్రదర్శిస్తుంది.వర్షంలో తడుస్తూంటే సుఖం అంటే ఏమిటో తెలుస్తుంది.నీటి బిందువుల స్పర్శకు జన్మ జన్మలుగా నిద్రాణమై ఉన్న సౌఖ్య భావనలు జాగృతమవుతున్న అనుభూతి కలుగుతుంది.

వర్షంలో తడుస్తూ వృక్షాలు స్థాణువులయినట్టు అనిపిస్తుంది. వర్షం పడిన తరువాత జగతి శుభ్రమై వినూత్న కాంతితో మెరిసిపోతూంటుంది. చెట్లనుండి జాలువారే నీటిచుక్కలలో పరావర్తనం చెందుతున్న కాంతి అందానికి నిర్వచనం ఇస్తున్నాట్టుంటుంది.

అయితే, వర్షం పడి ఆగిపోతే బాగుంటుంది. అదేపనిగా పడుతూంటే ఆనందం నీటితో కొట్టుకుపోతుంది.రోడ్లన్నీ బురదమయమయి పోతాయి. అప్పుడే వేసిన రోడ్లు కొట్టుకుపోయి గుంటలేర్పడతాయి.అవి, నడిచేవారికీ, వాహనాలవారికీ మృత్యుముఖానికి చేరవేసే రహదారులు.

వర్షంపడగానే ట్రాఫిక్ స్థంభించిపోతుంది. ఈ వర్షం కూడా సరిగ్గా ఆఫీసు కెళ్ళే సమయానికో, పిల్లలు స్కూళ్ళనుంచి ఇళ్ళకొచ్చే సమయానికో, ఆఫీసు వదిలే సమయానికో వస్తుంది. ట్రాఫిక్ జాములు దాటి ఇల్లు చేరేసరికి తాతలంతా స్వర్గంలో పకపక నవ్వుతూంటారు. అదేసమయానికి కరెంటు వుండదు.

ఇల్లంతా తడి. వుతికిన బట్టలు ఆరవు.కొత్తవి ఉతకలేము. ఇలా వర్షాలు పడుతూంటే వరదలు రాకుండావుంటాయా?నదులు, చెరువులు ఇళ్ళుగా మరితే నీరు ఇళ్ళలోకి కాక ఎటు ప్రవహిస్తుంది?ఇక వరదలు తూఫానులూ సరేసరి.

మొన్నటిదాకా నీళ్ళు నీళ్ళు అని ఏడ్చినవాళ్ళం ఇప్పుడు, నీళ్ళు బాబోయ్ నీళ్ళు, అని ఏడుస్తాం.వర్షంతో పాటూ ఏగలొస్తాయి. రోగాలొస్తాయి. ఏరోగమొచ్చిన పరవాలేదు కానీ జలుబు చేస్తే చావం, బ్రతకలేము. నరకం చూపిస్తుంది. అది తగ్గేలోగా మళ్ళీ తడుస్తాము. మళ్ళీ జలుబు.

తుమ్ముతూ, ముక్కుతూ, గుంటలలో పడుతూ, లేస్తూ ఈ పాడు వర్షాకాలం పోయి చలికాలమెప్పుడొస్తుందా, అని ఎదురుచూస్తాం. చలికాలంలో హాయిగా దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకోవచ్చు.

ఇదంతా చూస్తూంటే అనిపిస్తుంది, దేవుడు ఇన్ని రకాల కాలాలు సృజించాడు కానీ, సగటు మనిషి సుఖంగా వుండే ఒక్క కాలాన్నీ సృజించలేదని!

ఇది, 31.8.2008 ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితం.

September 10, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.