Archive for September 11, 2008

నేను చదివిన మంచి పుస్తకం-10

కొన్ని పుస్తకాలు చదువుతూంటే సమయం ఎలా గడుస్తుందో తెలియదు. ఒక కథ చదివి పక్కన పెట్టేసి వేరే పని చూసుకోవచ్చు, మళ్ళీ తీరిక దొరికినప్పుడు చదవవచ్చు అనుకుంటాం. కానీ, ఒక కథ రెండుకథలు కాదు, పుస్తకంలోని 25 కథలూ పూర్తయిపోతాయి. ఇంకా కొన్ని కథలుంటే బాగుండును అనిపిస్తుంది. అలాంటి కథల పుస్తకం, దవులూరి శ్రీ కృష్ణమోహన రావు రచిందిన “ద్రాక్షారం కథలు”

నిజానికి ఈ కథలు చదువుతూంటే, ఒక విషయం మనసుకు స్ఫురిస్తుంది. చాలా చాలా కాలం తరువాత అసలయిన కథలు చదివామన్న భావన కలుగుతుంది.

తెలుగు సాహిత్యంలో కథలంటే, ఏదో నీతి చెప్పేవి, సందేశాలిచ్చేవి, ఉద్యమాలు సిద్ధాంతాలు, రకరకాల భావజాలాలకాలవాలాలు అన్న అభిప్రాయం స్థిరపడి వుంది.ఇవేవీ కాకపోతే, శ్రంగారం, ప్రేమ కథలే కథలు అన్న ఆలోచన వుంది. కానీ కథల ఉద్దేశ్యం లక్ష్యాలు ఇవి కావు.

కథలు వినోదాన్నివ్వాలి. ఆలోచనలివ్వాలి. మానవ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ, మానవ జీవితం గురించి అవగాహననివ్వాలి. పఠితకు తెలిసీ తెలియకుండానే బోలెడన్ని ఆలోచనలి విఞానం అందాలి.

ఇదిగో కథకుండాల్సిన ఈ లక్షణాలన్ని నూటికి నూరుపాళ్ళు నిండుగా నింపుకున్న కథలివి. ఈ కథల్లో ఆకలికేకలు, అణచివేతల వెతలు, ద్వేషాలు, ఆవేషాలు, ఉద్యమాలు, సిద్ధాంత రాద్ధాంతాలు కనిపించవు. ఈ కథలలో మామూలు మనుషులు కనిపిస్తారు. సామాజిక జీవనం కనిపిస్తుంది. మానవ జీవితంలోని మర్మాలు, ద్వైదీభావాలు, మంచి చెడులు, ఉచ్చ నీచాలు అన్నీ ఎలాంటి అతిశయోక్తులు ఆర్భాటాలు లేకుండా అతి సున్నితంగా, కానీ నిక్కచ్చిగా ప్రదర్శిస్తాడు రచయిత.నిజానికి ఈ కథలను హాస్యకథలని అనారు కానీ ఇవి హాస్య కథలు కావు. ఇవి మానవ జీవిత కథలు. ఒక తెల్లటి కాన్వాసుపయిన రచయిత గీసిన అక్షర చిత్రాలు.

ఈ కథలు చదువుతూంటే, స్వచ్చమయిన కొబ్బరి నీళ్ళు తాగుతున్నట్టు అనిపిస్తుంది. నిర్మలమయిన నది తీరంలో కూచుని, గల గల ప్రవించే నీటిని, నీటి అడుగున కదిలే ఇసుక రేణువులను, దొర్లే రంగు రంగుల రాళ్ళను, కదిలే చేపలను  చూస్తూంటే ఎలాంటి భావనలు మదిలో కలుగుతాయో ఈ కథలు చదువుతూంటే అలాంటి భావనలు కలుగుతాయి.కొండ శిఖరం పయిన ఉక్కిరి బిక్కిరి చేసే ఈదురుగాలి కలిగించే ఆనందాశ్చర్యాలు ఈ కథలు కలిగిస్తాయి. ఇలాంటి స్వచ్చమయిన ప్రాక్రితిక ఆనదం అనుభవించాలనుకునేవారు తప్పనిసరిగా చదవాల్సిన కథలివి.

ఈ కథలను ముగింపులు, ఆరంభాలు అంటూ కథాలక్షణాల కొలబద్దలతో కొలవకూడదు. ఎందుకంటే ఇవి అచ్చమయిన స్వచ్చమయిన కథలు. గాలిని, ధూళిని ఎవరూ బంధించలేనట్టే నిజమయిన కథలకూ తూనికరాళ్ళు పనికిరావు. కథలవి. కథలుగానే అనుభవించాలి. ఆనందించాలి.

ద్రాక్షారం కథలు
దవులూరి కృష్ణ మోహన రావు.
1-98/6/అ/66
ప్లాట్ నం;66
అరుణోదయ కాలనీ
మాధాపూర్
హైదెరాబాద్-81.
వెల-70/-

September 11, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu