Archive for September 15, 2008

నేను చదివిన మంచి పుస్తకం-12

ఈ సారి నేను మూడు పుస్తకాలను ఒకేసారి పరిచయం చేస్తున్నాను.

ఈ మూడు పుస్తకాలూ ఒకదానితో మరొకటి సంబంధం లేనివి. ఏ పుస్తకానికి అదే ప్రత్యేకం. పుస్తకాలలోని అంశాలలోనూ సామ్యం లేదు.

అయితే, ఈ మూడు పుస్తకాలూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం వారు  ప్రచురించారు. అందుకే ఈ మూడు పుస్తకాలను కలిపి పరిచయం చేస్తున్నాను.

ఈ పుస్తకాల ముందుమాట చూస్తే మనకు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారు చేస్తున్న కృశి, పడుతున్న శ్రమలు అర్ధమవుతాయి. ఎంతో నిశ్శబ్దంగా వీరు అద్భుతమయిన సేవ మన సంస్కృతికి చేస్తున్నారని తెలుస్తుంది.

వీటిలో మొదటి పుస్తకం, అకారాది అమర నిఘంటువు.

ఇదొక అధ్బుతమయిన పుస్తకం.1915 నుండి 1934 వరకు శ్రమించి ఈ నిఘంటువును శ్రీ కొత్తపల్లి సుందరరామయ్యగారు పూర్తి చేసారు.ఈ నిఘంటువు ప్రతి ప్రాచ్య లిఖిత భాండాగారంవారు సేకరించి 20 ఏళ్ళు అయింది. దీనిని రవా శ్రీహరిగారు ముద్రణకు సిద్ధం చేసి 10 ఏళ్ళయింది. శ్రీ జయధీర్ తిరుమలరావు గారు నిర్దేశకులుగా వచ్చినతరువాతే ఈ గ్రంథంతో పాటూ మరెన్నో గ్రంథాలు వెలుగు చూస్తున్నాయి. ఒకరకంగా ఈ ప్రాచ్య పుస్తక భాండాగారం పనిచేస్తోందని ఆయన నిర్దేశకులయిన తరువాతే పదిమందికీ తెలుస్తోంది.

ఈ నిఘంటువులో పదాల అర్ధాలేకాక వాటి లింగాలు, వ్యుత్పత్తి అర్ధాలు, పర్యాయపదాలు, ఉదాహరణలు ఇచ్చారు. ఒకే వ్యక్తి ఈ గ్రంథాన్ని తయారుచేయటం అబ్బురం అనిపిస్తుంది. ఇందులో అనేక పదాలు ఇప్పుడు మరుగున పడ్డాయి. ఎంతగా మన భాష పదాలను కోల్పోయిందో తెలుస్తుంది.

ఈ పుస్తకానికి ముందు మాటలో తిరుమల రావు గారు, పూర్వం సంస్కృతం నేర్చుకునేవారంతా అమరకోశాన్ని వల్లెవేసేవారు.దాంతో వాళ్ళు కావ్యాలు చదివేటప్పుడు సులభంగా అర్ధమయ్యేవి అంటారు. ఇది అక్షరాలా సత్యం. సంస్కృతానికి దూరమవటం వల్లా మనం మన తెలుగుకు కూడా దూరం అయ్యాము. తల్లిని వదలి ఎంతదూరం వెళ్ళినా పిల్లవాడు ఆమె ప్రభావం నుంచి తప్పించుకోలేడు.దగ్గరవున్నవాడికి లోటేలేదు. ఈ నిజం గ్రహించి అయినా మనం సంస్కృతానికి సముచిత గౌరవం ఇవ్వాలి. తెలుగు భాషను బ్రతికించుకోవాలి.

ఈ పుస్తకం వెల 150/-

 
అముద్రిత జానపద గేయాల సంకలనం, దేశీ గేయ స్రవంతి.ఈ పుస్తకానికి సంపాదకులు రావి ప్రేమలత గారు.

ఈ పుస్తకంలో గౌరీ వివాహము, లక్ష్మణమూర్చ్చ, స్థితప్రఙ్నుని లక్షణము, గీతార్థసారము, సీతాకళ్యాణము అనే గేయాలున్నాయి. జానపదగేయాలే అయినా ఈ గేయాలలోని భాష, భావగాంభీర్యము, పదాలపొంకము చూస్తే సాంప్రదాయిక ప్రబంధాలకేమాత్రమూ ఇవి తీసిపోవని అర్ధమవుతుంది.

ఉదాహరణకు, జగన్మోహిని అయిన నారాయణుడి వర్ణన ఇది

సుందరంబులకెల్ల సుందరియు నగుచు/మదనుని చేనున్న మల్లెమొగ్గల బంతి/బంతి గాదది బలు వింత చామంతి/చామంతి గాదిది మేలు బంతి యీ యింతి/ యింతిగాదిది మాధవుని ముద్దులబంతి/ యింతి గాదిది రతికాంత కీల్బొమ్మ/ బొమ్మగాదిది మంచి పొలుపైన పూరెమ్మ/ పూరెమ్మగాదిది తులలేని వయ్యారి/ వయ్యారిగాదిది తియ్య విలుతుని చిలుక

ఇలా సాగుతుంది గేయం. ఇది ఆ కాలంలో జానపదమయినా ఈ కాలంలో పేరున్న గొప్ప గొప్ప కవులకు కూడా ఇంత వొకాబులరీ లేదన్నది చేదునిజం. అంటే ఆ కాలంలో నిరక్షరాస్యులకు ఎంత భాషవొచ్చేదో!

సీతాకళ్యాణం అనే గేయంలో ఆడవారిని పెళ్ళికి పిలవటం చూడండి.

రారమ్మ యీ వేళాకు పెళ్ళికినీ/ పట్టంచూ చీరలా పణితీ రావమ్మా/ మట్టెలు పిళ్ళేళ్ళూ మగువా రావమ్మా/ పారుటాకంచు చేరెలా పడతీ రావమ్మా/ నీలంచు చీరెలా నెలతా రావమ్మా/ చిలకలచూ చీరలా చెలియా రావమ్మా/ కరకంచు చీరెలా కలికి రావమ్మా/ చేరుకాంచూ చీరెలా చేడీ రావమ్మా/ మల్లెపువ్వులా చీరెలా మగువా రావమ్మా/ పుల్లి మల్లె చీరె యువిదా రావమ్మా/ గోరంచూ చీరెలా రెమ్మా రావే/ వారిజాక్షిరో రావే వనితా రావే

కవిత్వం సాహిత్యం భాషల పయిన ఆసక్తివున్న ప్రతివారూ కొని చదివి దగ్గరవుంచుకోవాల్సిన పుస్తకం ఇది.

వెల;60/-

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

సం వెం రమేష్ పరిషోధక గ్రంథం సజీవ సంప్రదాయంగా వేమన.

పరిశోధక గ్రంథం ఎందుకంటే,కన్నడ, తమిళ, మళయాళ భాషలపయి, ప్రజలపయిన వేమన ప్రభావాన్ని శోధించి ప్రదర్శిస్తుందీ చిన్ని పుస్తకం. తిరువళ్ళూరు, కాంచీపురం, విల్లిపురం, కడలూరులలో వేమన పద్యాలు పాడతారని, మైసూరు, కేరళలో జీవన విధానంలో వారికి తెలియకుండానే వేమన భాగం అయిన విధానం రచయిత చక్కగా సాధికారంగా వివరిస్తారు.వేమన అ ఎలా ప్రాంతీయ పరిథులు, భాష సంకుచితాలను అధిగమించి సార్వజనీనతను సాధించాడో ఈ పుస్తకం నిరూపిస్తుంది. రీసెర్చి పేరిట స్కాలర్షిప్పులు, ఇంకా అనేక సౌకర్యాలు పొందేవారున్నా, వారి తలదన్నే రీతిలో కేవలం భాష పయిన వున్న ప్రేమ వల్ల రమేష్ చేస్తున్న పరిశోధన అమోఘం. ఎందరికో కనువిప్పు కలిగిస్తుంది, సిగ్గుతో తలవంచుకునేట్టు చేస్తుందీ పుస్తకం. మొక్కుబడిగా చేసే పనులకు, ఇష్టంగా చిత్తశుద్ధితో చేసే పనులకూ ఎంతయినా భేదం వుంటుంది కదా!

ఈ పుస్తకం వెల 20/-

ఈ మూడు పుస్తకాలు ప్రతులకు

director, ap govt. o.m.l & r.i.
behind o.u. police station
o.u. campus.hyd-7
ph;040-27097709.

September 15, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized