Archive for September 18, 2008

నేను చదివిన మంచి పుస్తకం-13

పుస్తకం చాలా కాజువల్ గా చదవటం ఆరంభించాను. హాయిగా, నవ్వుతూ సాగింది. ఆసక్తి కరంగా వుంది. నెమ్మదిగా, ఎలా మారిందో తెలియకుండానే నవల మూడు మారింది. ఒక రకమయిన ఉద్విఙ్నత ఆవరించింది.అది ఆవేదనగా మారింది. ఆలోచనల అలలు ఎగసిపడటం మొదలయింది. ఒకో అలా వస్తూ, తీరాన్ని తాకి వెనక్కివెళ్తూ, మళ్ళీ నీరు ప్రోగుచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో తీరాన్ని తాకుతూంటే, ఒకోసారి నీరు అధికంగా చేరి అల ఉవ్వెత్తున ఎగసిపడితుంది. తీరాన్ని అతి శక్తివంతంగా తాకుతుంది. అలా మనసులో ఆలోచన అలలు, బాధావీచికలు ఎగసిపడుతూ నవల చివరికి చేరేసరికి ఒక ఎదనుకలచివేసే క్లైమాక్స్ గా తయారవుతాయి. నవల పూర్తయిన తరువాత శరీరం మొత్తం కంపిస్తుంది. హృదయం ద్రవిస్తుంది. మనసులో చెలరేగిన అలజడి స్థిరంగా వుండనీయదు.అక్షరాలద్వారా మానవ మనస్సులో చిత్రాలను చిత్రిస్తూ అతడిని అనుభూతులలోకంలో విహరింపచేస్తూ అతడిలోని మనిషిని తట్టిలేపుతుంది ఈ నవల. నవలా రచనలో అత్యంత నైపుణ్యానికి, ప్రతిభకు తిరుగులేని తార్కాణం అశోకమిత్రన్ రచించిన ది ఎయిటీంత్ పారలెల్.

హైదెరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమవటం ఈ నవల నేపధ్యం.

అశోకమిత్రన్ 1931లో సికిందెరాబాద్ లో జన్మించాడు. అంటే పోలీసు చర్య జరిగినప్పుడు అతనికి 19 ఏళ్ళుంటాయి. నూనూగుమీసాల నూత్న యవ్వనం. అనాటి అతని అనుభవాల కాల్పనిక రూపమే ఈ నవల.

కథానాయకుడు చంద్రుని అశోకమిత్రకు ప్రతిరూపంగా తీసుకోవచ్చు. చంద్రు క్రికెట్ ఆడటానికి సిద్ధమవుతూండటంతో నవల ఆరంభమవుతుంది. చంద్రు తండ్రి రైల్వేలో పనిచేస్తూంటాడు.దాంతో సికిందెరాబాదులో లాన్సెర్ బారాక్స్లోని క్వార్టెర్స్లో వుంటూంటారు.

అశోకమిత్రన్ చంద్రు బాల్యాన్ని వర్ణించినతీరు అలరిస్తుంది.ఆయన్ ఆకాలమ్నాతి సికిందెరాబాదుగురించి చెప్తూంటే రోజూ ఆవైపే తిరుగుతూన్నా వాతి చారిత్రిక ప్రాధాన్యం తెలియకుందా ఎంత గుడ్డిగా బ్రతికేస్తున్నామో అనిపిస్తుంది. ఆకాలంలో ఈ ప్రాంతం ఎలావుండేదో ఊహిస్తూంటేనే గమ్మత్తుగావుంటుంది.

ఇప్పటి మనోహర్, ప్లాజా, తివోలి, డ్రీంలాండ్ సినిమాహాళ్ళగురించి రాస్తూంటే ఆనందంగా. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కింగ్స్వే రోడ్డు ఎలానిర్మించారో తెలుస్తుంది. అప్పటి వాతావరణం కళ్ళకుకట్టినట్టు వర్ణించాడు.ఎలా అప్పుడు సికిందెరాబాదుకు రైల్వే స్టేషన్ కేంద్రమో, మిగతాన్నిటికీ హైదెరాబాదు అవసరమో తెలుస్తుంది. టాంక్ బండ్ వర్ణన అద్భుతం.

నవల ఆరంభం, చంద్రు ఇంతి పరిసరాలవాతావరణం, ఆంగ్లో ఇండియన్లు, వారి జీవన విధానం, తమిళులు, తెలుగువారు….. క్రికెట్టు ఆడటం, ఇతర ఆటలు ఆడటం, కొట్లాటలు లాంటి వాటితో నవ్విస్తూ సాగుతుంది.

కాలేజీలో క్రికెట్టు ఆడి సాయంత్రం చీకటి పడినతరువాత ఇంటికి వస్తూన్న చంద్రుపైన రజాకార్లు దాడి చేస్తారు. నెమ్మదిగా కథలోకి ఆనాతి రజాకార్లు, వారి ఆగడాలు, బితుకు బితుకు మంటూన్న హిందువులు, ఇస్లామీయుల అహంకారాలు, వారి దౌర్జన్యాలు, అత్యాచారాల సమర్ధనలు వంటి గాంభీర్యమయిన విషయాలు ప్రవేశిస్తాయి.

ఒకోపాత్ర, ఇస్లామీయులు జరిపిన దౌష్ట్యాల గురించి, స్వేచ్చకోసం, ఆర్యసమాజ్, కాంగ్రెస్ వారు జరిపిన పోరాటం గురించీ చెప్తూంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది. ఆనాడు ఎంతమంది ఎన్నెన్ని త్యాగాలు చేస్తే ఈనాడు ఇంత హాయిగా వుండగలుగుతున్నామో అర్ధమవుతుంది. అయితే ఎక్కడా రచనలో మెలోడ్రామా వుండదు. రచయిత మామూలుగా చెప్తాడు. అది పదింతలయి మన మనస్సులో ప్రతిధ్వనిస్తుంది.

ఈ సందర్భంలో మనము ఒక విషయాన్ని స్పృషించాల్సి వుంటుంది. ఇప్పుడు ఆరెస్సెస్, ఆర్యసమాజ్ లు మన మేధావులు, రాజకీయనాయకుల దృష్టిలో మత చ్చాందస పార్టీలయ్యాయికానీ, ఆ కాలంలో, హిందువులు ఇస్లామీయుల దారుణ మారణ కాండకు, రాక్షస అక్రుత్యాలనూ తట్టుకుని బ్రతికి బట్టకట్టగలిగారంటే, వీరు చేసిన ప్రాణత్యాగాలే కారణం. ఈ నిజం మనకు ఆకాలంలో, మతకల్లోల ప్రాంతాలలోంచి ప్రాణాలు అరచేతపట్టుకు వచ్చినవారి అనుభవాలు, జీవిత చరిత్రలు చదివితే తెలుస్తాయి. ప్రభుత్వ చరిత్ర పుస్తకాలలొ దొరకవు.ఈ నవలలోనూ అలాంటి నిజాలే నిక్కచ్చిగా పొందుపరిచాడు రచయిత.

ఇప్పుడు చంద్రు జీవితంలో భయాలు ప్రవేశిస్తాయి. రెజిమెంటల్ బజారు మొతాం, ఇతర ప్రాంతాలనుంచి ప్రాణాలు అరచేత పట్టుకువచ్చిన ఇస్లామీయులతో నిండుతుంది.హిందువులు భయంతో అన్నీ వదిలేసి పారిపోతూంటారు.

ఇస్లామీయుల రాజ్యం వస్తోందని తెలియగానే ఇరుగు పొరుగున వున్న ఇస్లామీయుల ప్రవర్తన మారిపోతుంది. ఒకరు,తనకు అందబోయే పదవులు ఊహిస్తూ, అన్యాయంగా అత్యాచారాలు చేస్తున్నారంటూ కాంగ్రె వారిని దూశిస్తూ, రజాకార్లను పొగుడుతూంటాడు. ఇంకోకడు, చంద్రు ఇంట్లోకి వచ్చి దాష్టీకం చేస్తూంటాడు. అరుస్తూ తిడుతూ ఆధిక్యాన్ని చూపుతూంటాడు.

ఇంతలో భారత సైన్యం వస్తోందని తెలుస్తుంది. పరిస్థితి మారిపోతుంది. ఇస్లామీయులు ఇళ్ళాల్లోదూరి తలుపులు వేసుకుంటారు. హిందువులు ఎదురయితే వంగి సలాములు చేస్తూ అతివినయం ప్రదర్శిస్తూంటారు. హిందువులు రోద్లమీదకు వస్తారు. స్మబరాలు చేసుకుంటారు. ఇది చూడటానికి చంద్రు బయటికి వస్తాడు.

హటాత్తుగా గొడవలు మొదలవుతాయి. ఇంతకాలం ఇస్లామీయుల  దౌర్జన్యాలు గురయిన హిందువులు తిరగబడతారు. ఇస్లామీయుల ఊచకోత ఆరంభవుతుంది. దొమ్మీలు మొదలవుతాయి.

ఇదంతా చూస్తున్న చంద్రు పైకి ఇస్లామీయులు దాడి చేస్తారు. హిందూ గుంపు అడ్డువస్తుంది. చంద్రు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెత్తుతాడు. ఇస్లామీయులు వెంబడిస్తారు. వారినుంచి తప్పించుకునేందులు చంద్రు గోడదూకి ఒక ఇంటిలోకి దూకుతాడు.

ఆ ఇంట్లో బోలెడంతమంది ఇస్లామీయులు బిక్కు బిక్కు మంటూంటారు. అంతమంది వున్నా వారు చంద్రుని చూసి బెదరుతారు. అప్పుడు ఒక పదహారేళ్ళ అమ్మాయి ముందుకు వస్తుంది. మావారినేమీ చేయకు అని వివస్త్ర అయి అతని ముందు నిలుస్తుంది.

చంద్రులో కోరికలు కలగటం అంతకు ముందు వర్ణిస్తాడు. అది స్త్రీని నగ్నంగా చూడటం ప్రథమం. కానీ చంద్రువేకాదు మన గుండెలు అదురుతాయి. లజ్జతో మనసు కుమిలిపోతుంది.చంద్రు ఇల్లువదలి పరుగెత్తుతాడు. తెల్లవారుతూంటుంది.

ఇదీ కథ.చివరి సన్నివేసం ఎంత అలజడి కలిగిస్తుందంటే ఏదో నిలవలేని ఆందోళానతో ఉక్కిరి బిక్కిర్ అవుతాము. ఆరుద్ర త్వమేవాహం మనసులో మెదులుతూంది. మనిషి రాక్షసుడయితే ఎలావుంటుందో అర్ధమవుతుంది.

తెలంగాణా విమోచన అంటూ నాయకులు ప్రసంగాలు చేయటం చూస్తే రక్తం మరుగుతుంది.మనదీ ఒక బ్రతుకేనా అనిపిస్తుంది.

అశోకమిత్రన్ తమిళంలో రచించిన ఈ నవలను ఆంగ్లంలోకి అద్భుతంగా అనువదించారు గోమతి నారాయణన్.ఓరియంట్ లాంగ్మాన్ ప్రచురణ. 1993 లో వెల 65/-

తప్పకుండా చదవాల్సిన అతిగొప్ప పుస్తకం ఇది.

September 18, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu