Archive for September 20, 2008

రక్ష సినిమా చూసే హక్కు నాకుంది!

ఈ మధ్య మన సమాజంలో ఇది ఒక ఫాషన్ అయిపోయింది. ఎవడికి వాడు వాడే సమాజాన్ని ఊద్ధరించేవాడినని నమ్ముతున్నాడు. దాన్ని బలపరచుకునేందుకు ఒక పదిమందిని కూడగట్టుకుని గోల చేస్తున్నాడు. అరిచేవాడి గొంతు వినిపిస్తుంది. దాంతో అందరూ వీళ్ళకి లేని పోని ప్రాధాన్యం ఇచ్చి వారిని చూసి బెదురుతూన్నారు. దాంతో మన సమాజం పిరికి సమాజం అయిపోతోంది. పది మందిని పోగేసుకోగలిగిన ప్రతివాడూ సమాజ మార్గదర్శకుడయిపోతున్నాడు. సమస్త సమాజానికి తానే ప్రతినిధినన్నట్టు ప్రవర్తిస్తున్నాడు.

మొన్న థకరేలదేచేశారు. వాళ్ళకు నచ్చకపోతే మహారష్ట్ర ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. అందరూ భయపడి అపాలజీలు చెప్పుకున్నారు.

థాక్రేలను దూషించే హేతువాదులూ ఇప్పుడదే చేస్తున్నారు. రక్ష అనే సినిమా చూస్తే మూఢాచారాలు ఊపందుకుంటాయట. ప్రజలలో చేతబడులపయిన నమ్మకం పెరుగుతుందట. అందుకని ఆ సినిమా ప్రదర్శన నిలిపివేయాలట. మూర్ఖత్వం, అహంకారాం, అహేతుకం కాకపోతే మరేమిటిది?

అదొక సినిమా. రక్ష అనేది భీభత్స ప్రధానమయిన సినిమా. సాంఘిక, సాహస, ప్పుఒరాణిక ఇత్యాది రకరకాల సినిమా ప్రక్రియలలాగే ఇదీ ఒక పద్ధతికి చెందిన సినిమా. రేషనలిస్టుల పితామహులయిన పాశ్చాత్యదేశాలలో ఇలాంటి సినిమాలకు మంచి గిరకీ వుంది. ఎక్సార్సిస్ట్, ఓమెన్, డ్రాకులా, నైట్ మేర్ లాంటి సినిమాలనుంచి. కాండీమాన్, వాంపైర్లు, ఇంకా ఆడ్రే రోస్ లాంటి సినిమాలేకాక, ఇంకా క్రూర కర్కోటక సినిమాలుకూడా ఈ కోవకు చెందుతాయి. ఇలాంటివి చూసి సంతోషించేవారూ ఉన్నారు.రక్ష కూడా అలాంటి కొందరికి సంతృప్తి నిస్తుంది.అది వాళ్ళు చూస్తే వీళ్ళ సొమ్మేం పోయిందట. చూసి నమ్మితే వీళ్ళకేమి నష్టమట?

సినిమాలు చూసి ఇప్పుడు కొత్తగా నమ్మకాలు పెంచుకునే పరిస్థితి లేదిక్కడ. అయినా, ఈ రేషనలిస్టులకు అందరికీ ఏది మంచో తమకే తెలుసని అంత నమ్మకం ఏమిటి? తమ దేవుడినే అందరూ కొలవాలన్న మూర్ఖపు పట్టుదలకీ, తమకు నచ్చని సినిమా ఎవ్వరూ చూడకూడదన్న వీరి పట్టుదలకూ తేడ ఏమయినా వుందా?  అది మతం కాబట్టి మౌఢ్యం అయింది. ఇది సినిమా కాబట్టి గొప్ప అయిందా?

అదీగాక, ఈ సినిమా చూసి ప్రజలలో మూఢనమ్మకాలు పెరుగుతాయని వీరికి కలలో దేవుడు కనబడి చెప్పాడా?

నిజంగా వీళ్ళకి సమాజ శ్రేయస్సు గురించి తపన వుంటే, సినిమాల్లో వెర్రి మొర్రి పాటలు, నృత్యాలు, వెకిలి హాస్యాలు, వ్యక్తిత్వం లేని ఆడవాళ్ళు, లైంగికపరంగా రెచ్చగొట్టే నీచ దృష్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆడవారిని చులకన చేస్తూ, ఆత్మగఔరవ రహితులుగా చూపటం గురించి ఆందోళన చేయాలి. ప్రమను అదో గూప చర్యలా చూపిస్తూ నిక్కర్లు సరిగ్గా వేసుకోరాని వాళ్ళను తప్పుదారి పట్టించే సినిమాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అవన్నీ వదలి, ఏదో కాసేపు, ప్రజల్ని భీతిభ్రాంతులను చేసే సినిమా వెంట పడి లాభంలేదు.  ఈ సినిమాలు ఇష్టంలేనివారు వాటి జోలికి కూడా వెళ్ళరు.అవి చూసి తమకు మూఢనమ్మకాలొచ్చెస్తాయన్నంత బలహీన మనస్కులే ఈ హేతువాదులయితే ఆ సినిమా చుట్టుపక్కలకే వెళ్ళొద్దు. అంతేకానీ చూసేవారిని చూడొద్దనద్దు. సినిమా చూసే హక్కుని అడ్డుకోవద్దు.

అయినా, తాము ఒక మెట్టుపైనున్నట్టు భావించుకుంటూ మిగతావారంతా ఏమీ తెలియని అమాయకులనుకోవటం హేతువాదులకు అలవాటేకదా! ఆ అలవాటులో వున్న హేతు రాహిత్యం గ్రహించే విచక్షణవారికి దేవుడిచ్చుగాక!

అంతవరకూ వారు ఎవరినీ సినిమా చూడకుండా అడ్డుకోవద్దు. ఎవరి ఆనందం వారిదని వదిలేయాలి. సమాజొద్ధరణ మాని, సమాజోపయోగ కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలి.

అప్పుడప్పుడూ భగవద్గీతనో, రామాయణమో పారాయణం చేస్తూ, ఆంజనేయ దండకం చదువుకుంటే వారికి భూత ప్రేత పిశాచాల బాధలు, భయాలు వుండవు.

September 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized