Archive for September 22, 2008

మన మహాత్ముడు-విమర్శ-2

సాధారణంగా ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసం అతని తల్లితండృలు, కుటుంబ వాతావరణం, సామాజిక పరిస్థితులనుంచి వస్తాయి. కానీ దీనికి ఆరంభం తల్లితండృల దగ్గరే అవుతుంది. పిల్లవాడి దృష్టిలో వారిద్దరూ అతి గొప్పవారు. ఆ భావన వాడికి ఆత్మవిశ్వాసాన్నివ్వటమేకాదు, ఆత్మగౌరవానికీ బీజం వేస్తుంది. ఆరోగ్యకరమయిన కుటుంబ వాతావరణం ఆరోగ్యవంతమయిన వ్యక్తిత్వానికి దారి తీస్తుంది. ఎప్పుడయితే పిల్లవాడికి తల్లితండ్రులంటే చులకన వుంటుందో అది అతడిలో న్యూనతా భావాన్ని కలిగిస్తుంది.

కుటుంబం తరువాత వ్యక్తిని అంతగా ప్రభావితం చేస్తుంది సమాజం. వీటన్నిటినీ ప్రభావితం చేస్తుంది, అతనికి తన సంస్కృతీ, సాంప్రదాయాలపట్ల, పూర్వీకుల పట్ల వుండే గౌరవం, అభిమానాలు అతని వ్యక్తిత్వానికి వన్నె నిస్తాయి. తన పూర్వీకులు ఎంత ఉన్నతులో వారినిమించి తాను ఉన్నతుడవాలని, వారికి తగిన వారసుడనిపించుకోవాలని తపన పడతాడు. దాంతో అతని ఆలోచనాసరళిలో ఒక ఉదాతత, గాంభీర్యలు ప్రవేశిస్తాయి. అతడి కళ్ళముందున్న ఉత్తమ ఆదర్శమూర్తులు అతడికి మార్గదర్శనం చేస్తాయి.

ఇజ్రాఎల్ దేశం గురించి మనకందరికీ తెలుసు. ఎవరెంత విమర్శించినా వారి పట్టుదలనూ, దేశ భక్తినీ పొగడక తప్పదు. చుట్టూ శతృ దేశాలు పొంచివున్నా, తమని తాము రక్షించుకుంటూ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న విధానం ప్రశంసనీయం. వారికీ ఆత్మవిశ్వాసాన్నీ, పట్టుదలనూ ఇచ్చింది వారి మతం పట్ల వారికున్న అచంచల విశ్వాసం. ప్రపంచం నలుమూలల అనెక అష్ట కష్టాలు పడుతున్నా వారు తమ సంస్కృతిని మరచిపోలేదు. తమ భాషను వదలలేదు.

ఇప్పటికీ ఏదేశం వారయినా ఆదేశానికి చెందిన గొప్పవారిని తలచుకుంటారు. ఆదర్శంగా తీసుకునటారు. చివరికి ఇప్పుడు రష్యా వారి ఆత్మగౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు పుతిన్ వారి చరిత్ర పుస్తకాలను తిరగ రాయిస్తున్నాడు. రష్యా గొప్పతనం పిల్లలకు బాల్యం నుంచీ నేర్పాలని నిశ్చయించాడు.

చివరికి కమ్యూనిస్టులు కూడా మావో, లెనిన్, మార్క్స్ ల పేర్లు చెప్పి కార్యకర్తలను ప్రేప్రేపిస్తారు. పోరాటంలో బలిదానాలు చేసిన వారు అమర్ రహే అంటూ కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తారు. పోరాటా కథలు బలిదానాల కథలు బోదిస్తారు. ఇదంతా ఎందుకంటే వ్యక్తి ముందు ఒక ఆదర్శం నిలిపి అతడిని ఆ ఆదర్శ పాలనకు ప్రేరేపించేందుకే.

అంటే, వ్యక్తికి ఉత్తమ ఆదర్శం అత్యవసరం అన్నమాట. ఏదేశ ప్రజలకు వారి చరిత్ర అన్నా, పూర్వీకులన్నా, పురాణ పురుషులన్నా గౌరవం  వుందో ఆ దేశ ప్రజలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు. తమ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు పాటుపడతాడు. అందుకే, ప్రజలలో దేశమనే సంకుచిత భావాన్ని, మతము, ప్రాంతాలనే భావాలను తొలగించాలని ప్రయత్నించే కమ్యూనిస్టులు ముందుగా, వాటిపైనే దాడి చేస్తారు. ప్రజలలో తమ వారంటే న్యూనతా భావం కలిగించి తమ భావాలను చొప్పిస్తారు.

మన దేశ ప్రజలను బానిసలు చేసేందుకు బ్రిటీషువారు కూడా ఇదే పద్ధతిని పాటించారు. మనమన్నా, మన పద్ధతులన్నా, మన వారన్నా చులకన భావం కలిగించారు. మన భాషలను, మన పురాణాలను, మన చరిత్రను, ఆదర్శ మూర్తులను చులకన చేసి గౌరవ భావం పోగొట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతకూడా అనేక పరిస్థితుల వల్ల ఇవే పరిస్థితులు కొన సాగుతూవస్తున్నాయి. మన ఆదర్శపురుషులను కించపరచి, వారిపైన ఉన్న గౌరవాన్ని దెబ్బ తీస్తూనే వున్నారు. అందుకే సరయిన ఆదర్శం లేక యువత గాలి ఎటు వీస్తే అటు కూటుకుపోయే గడ్డిపోచలా తయారయింది. మన సమాజమూ వెన్నెముకలేక వంగిపోతోంది.ఈ పరిస్థితి గుర్తించే వివేకానంద ఉక్కునర్రల యువకులు కావాలని తపించాడు. అడుగడుగునా మన గొప్పతనాన్ని వివరిస్తూ, ఆత్మ గౌరవాన్ని తట్టిలేపాలని తపన పడ్డాడు.

కానీ ఆధునిక సమాజంలో ఎదుటివాడు ఎవరినయినా గౌరవిస్తున్నాడని తెలిస్తే, ముందుగా ఆ వ్యక్తి గౌరవించేవాడిని హేళన చేస్తేకానీ నిద్రపట్టదు. అతడు అనుసరిస్తున్న ఆదర్శాలు పనికి రావని నిరూపించి అతడిని సందేహాలలో పారేసి అతడి లక్ష్యాన్ని దెబ్బ తీస్తేకానీ నిద్రపట్టదు. గోడలు పగులగొట్టటమే తెలుసు. అందువల్ల నిరాశ్రయులయినవారికి నీడ కల్పించటం గురించిన ఆలోచన లేదు.దాంతో దేనిపైన నమ్మకంలేక, సరయిన ఆదర్శంలేక, చివరికి తనని తానూఒ నమ్మలేక సమాజం దెబ్బతింటోంది.

మదర్ తెరెస్సా ప్రజలముందు ఒక ఆదర్శం వుంచింది.  దేఇవత్వ భావన వ్యక్తిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తుందో మనకు తెలియచేస్తుంది ఆమె. మానత్వానికి నిలువెత్తు దర్పణం ఆమె.

అందరూ అసహ్యించుకునే అభాగ్యులను దగ్గర తీసి, అంత ప్రేమ కురిపించి ఆదర్శం గా నిలిచిన ఆమె గురించి అవాకులూ చవాకులూ పేలటం వల్ల ఎవరికి నష్టం? తెరెస్సకేమీ నష్టం లేదు. కానీ ఆమెను ఆదర్శంగా తీసుకున్న వారిలో సందేహాలు కలుగుతాయి. వారు ఆమె చూపిన మార్గంలో నడుస్తూ జీవితానికి సార్ధకత కల్పించుకునే దారి వదిలి గమ్యం లేని వారవుతారు.
అంటే, తల్లితండ్రులపై గౌరవమున్న వ్యక్తికి హఠాత్తుగా వారి గురించి చెడుగా తెలిస్తే ఎలా ఆందోళనకు గురవుతాడో అలాగే ఆదర్శమనుకున్నవారి గురించి చెడు తెలిస్తే మనిషి, సమాజం అంతే ఆందోళనకౌ గురవుతుంది. ఒక పద్ధతి ప్రకారం మనము ఆదర్శమనుకున్న వారంతా పనికిరాని వారనో, మోసగాళ్ళనో, తెలిస్తే?

ప్రస్తుతం మన సమాజం అలాంటి స్థితిలో వుంది. హీరోలు లేని వారు హీరోలను సృష్టించుకుంటూ వుంటే, మనము వున్నవాళ్ళాను పాడు చేసుకుని ఆదర్శమన్నది లేకుండా బికారీల్లాగా మిగిలిపోతున్నాము.అందుకే ఇప్పుడు క్రికెటరో సినిమా నటుడో ఆదర్శమవుతున్నారు. యువతీ యువకుల జీవితాలు గమ్యంలేక గుడ్డివాడి ప్రయాణంలా మారుతున్నాయి. సమాజం అనుభవిస్తోంది.ఇది ఆదర్శం ప్రాధాన్యాన్ని సూచిస్తుంది.

ఆదర్శంగా వుండే వ్యక్తి నడవడి సమాజానికి అనుసరణీయం అవుతుంది.

రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, సీత, సావిత్రి, ఝాన్సీ, శివాజీ, కాళిదాసు, ఆర్యభట్ట, శంకరాచార్య, బుద్ధ ఇలా మనకు బోలెడన్ని అద్భుతమయిన ఆదర్శమూర్తులున్నారు. కానీ వారెవరూ ప్రస్తుతం మనకు ఆదర్శం కాదు. ఎందుకంటే, మనకు ఆదర్శం అనగానే ఆవ్యక్తిలోని లోపాలు, దోశాలు చూపించేందుకు ఉత్సాహపడుతున్నారు. బురదచల్లుతున్నారు. బ్రిటీష్ వారు తమ ఆధిక్యాన్ని నిలుపుకును మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయటంకోసం చేస్తే, మన వారు తమ అహాలను సంత్రుప్తి పరచుకుని, గొప్ప నిరూపించుకునేందుకు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో చూస్తే, మనకు ఒక హీరో అవసరమని తెలుతుంది. ఆధునిక సమాజంలో వివేకాంద, గాంధీ వంటివారు మన హీరో అవసారలను తీరుస్తారు. ఎందుకంటే, వారున్నారని మనకు తెలుసు. వారి చిహ్నాలున్నాయి. వారిని చూసినవారున్నారు. రాముడిలాగా మిథికల్ మూర్తులని కొట్టేయటానికి లేదు. శివాజీ లాగా ప్రాంతీయతను ఆపాదించటానికీ వీలు లేదు. సకల ప్రపంచం వారికి నివాళులర్పించింది. వారి ఔన్నత్యాన్ని, ఆధిక్యతను ఆమోదించింది. వారు ప్రాంతీయ, భాషా, జాతి మత భేదాలను ఎల్లలను దాటి సకల విశ్వ జనుల నీరాజనాలు అందుకున్నారు.అటువంటి వారు సమాజానికి ఆదర్శం అయితే, వారిని మార్గదర్శకులుగా స్వీకరిస్తే హీరో రాహిత్యం నుంచి సులభంగా తప్పుకోవచ్చు. గత హీరోలను గౌరవిస్తూ ఈ హీరోలను అనుసరించవచ్చు. ఎందుకంటే, ఈ ఇద్దరూ తాము ఏదో కొత్తగా కనుక్కున్నవారు కారు. ఒక ప్రాచీన పరంపరకు అత్యుత్తమ వారసులు. తమ పూర్వీకులగొప్పతనానికి ప్రతీకలు. భారతీయ సమాజిక సంస్కృతీ సాంప్రదాయ పాలన వల్ల కలిగే లాభాలకు నిదర్శనాలు.

అలాంటి వారిద్వారా మనము సమాజాన్ని ఉత్తేజితం చేయటం మంచిదా? వారిని క్రిందకులాగి బురదచల్లటం శ్రేయస్కరమా?

మిగతా రేపు.

September 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu