Archive for September 23, 2008

మన మహాత్ముడు-విమర్శ-3

ఒక సమాజంలో వందమంది సగటు మనుషులుంటే ఒకరో ఇద్దరో అసాధారణమయిన ప్రతిభ కలవారయివుంటారు. ఈ అసాధారణమయిన ప్రతిభ కలవారంటే మిగతా వారికి భయం అసూయలతో పాటూ ద్వేషం కూడా వుంటుంది. ఎందుకంటే, తమలో నిద్రాణమయివున్న శక్తిని వీరు ఎత్తి చూపించటమే కాదు, దాన్ని గుర్తించక వ్యర్ధం చేస్తున్నారనీ నిరూపిస్తారు. అందుకే నిప్పులు చిమ్ముకుంటూ ఒక వ్యక్తి పైకి ఎగిరిపోతూంటే ఎలాగయినా అతడిని తమ స్థాయికి దింపి లాగేయాలని ప్రయత్నిస్తారు. విజయం సాధించకుంటే, ఆ వాడి గొప్ప ఏముంది, పరిస్థితులు కలసివచ్చాయి, అని కొట్టిపారేస్తారు. అందుకే, ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించి, ఒప్పుకోవటం ఎంతో అరుదు. ఎంతో కఠినమయిన విషయం.

యండమూరి వీరేంద్రనాథ్ ఒక ప్రభంజనంలా తన రచనా చాతుర్యంతో ప్రజలను ఉర్రూతలూపుతూంటే, ఆయనది క్షుద్ర సాహిత్యమని, కాపీ సాహిత్యమని తక్కువ చేయాలని ప్రయత్నించారు. యద్దనపూడి నవలలను ఇప్పటికీ తేలికగా కొట్టేసేవారున్నారు. కానీ, ఈనాటికీ, నవల ఏభాగంలోంచి ఆరంభించినా పూర్తయ్యేదాకా వదలబుద్ధికాదావిడ నవలలు. ఎన్నిసార్లు చదివినా వాటి ఇదే పరిస్థితి. ఆవిడవి వంటింటి నవలలనీ, ప్రేమ నవలలనీ ఈసడిస్తారు.

వీళ్ళనొదిలేయండి, కొందరు పనిగట్టుకుని నారాయణ రెడ్డ్య్, మానిప్యులేటరనీ, కృష్ణ శాస్త్రి ఆబద్ధాలకోరని, దాశరథి అలాగనీ, ఇంకో గొప్పమనిషి ఇలాగనీ చులకనగా మాట్లాడేసి తమ ఆధిక్యతను నిరూపించుకుని అహాన్ని సంతృప్తి పరచుకుంటారు. సగటు మనుషుల మనస్తత్వము, జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగలేక, ఆశించినంత గుర్తింపు పొందలేకపోయిన వారి మనస్తత్వం ఇది.

ఆడవాళ్ళగురించి చులకనగా మాట్లాడటమూ, కథలల్లేసి లేనిపోనివి కల్పించి ఆనందించటమూ ఈ కోవకే చెందుతుంది. అందుకే, సెలబ్రిటీల వ్యవహారాలు మనము చెవికోసుకుని మరీ వింటాము. గాస్సిప్పులు, మత్తు గుక్కలకన్నా మత్తునిస్తాయి మనకు.

ఈ నేపధ్యంలో చూస్తే ప్రతి పేరు పొందిన వ్యక్తి గురించీ రకరకాల కథలు ప్రచారంలో వుంటాయనీ, వ్యక్తి ఎంత గొప్ప వాడయినా అందరి ఆమోదమూ పొందలేడనీ అర్ధమవుతుంది. శ్రీ కృష్ణుడిని దేవుడిగా ఒప్పుకోనివారూ, దూషించేవారూ ఆయన కాలంలోనే వున్నారు.

వివేకానందుడు అమెరికాలో విజయం సాధించిన తరువాత ఆయన గురించి ఎంత దుష్ప్రచారం జరిగిందంటే, చివరికి ఆయన ఇక్కడ తన సహచరులను తనని అభినందిస్తూ సభలు జరిపి ఆ వర్త వచ్చిన వార్తాపత్రికల కట్టింగులు అమెరికా పంపమని కోరాడు. ఎందుకంటే ఆయన తాగుబోతనీ, తిరుగుబోతనీ, హుక్కతాగుతాడని, దొంగ సన్యాసి అనీ, శూద్రుడనీ రకరకాల ఆరోపణలు చేశారు. ఆయన మాంసం తింటాడని ఏసడించారు. క్రీస్టియన్ మిషనరీలేకాదు, బ్రహ్మసామాజికులు, ఆయన వల్ల లాభంలేదని గ్రహించిన పెద్దలూ ఈ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ప్రచారమంతా చూసి వివేకానందుదు పనికిరాడని తేలుస్తామా? ఆ రాతలు గొప్ప వారు, మేధావులు రాసారు. అనేకులు నమ్మారు. అలాగని వివెకానందుడిని మనము కాదంటామా?

వివేకానందుడు గొప్పవారిని ఆశ్రయించాడని, రాజప్రాసాదాలలో కులికాడనీ విమర్శిస్తారు. విదేశీ మహిళలతో ఆయనకు సంబంధాలు అంటగట్టినవారూ వున్నారు. నివేదితగురించి ఓ రకంగా వ్యఖ్యలు చేసిన వారూ ఉన్నారు. అవన్ని ప్రామాణికాలుగా తీసుకుని వివేకానందుడిని సన్యాసి కాదంటామా? ఆయన రాజకీయాలజోలికి వెళ్ళలేదు. కాబట్టి ఆయన దేశభక్తుడు కాదంటామా? కష్టాలలో ఉన్న కుటుంబాన్ని వదలి సన్యాసి అయాడు. అందుకని ఆయన బాధ్యతలనుంచి తప్పించుకునేందుకు సన్యాసి అయ్యాడని అంటామా?

ఇటువంటి సందర్భాలలోనే విచక్షణ అవసరం.

మనిషి దృష్టి అసంపూర్ణం. ఒకే విషయాన్ని పదిమంది పది రకాలుగా చూస్తారు. పది రకాలుగా అర్ధం చేసుకుంటారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి గురించి ఎవరు నిజంగా వివరించగలరు? ఒకే వ్యక్తిలో అనేకరకాల వ్యక్తులుంటారు. ఒకే మనిషి ఒకే రకమయిన సందర్భాలలో వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు ఇలాగే ఎందుకు ప్రవర్తించలేదని నిలదీయటంలో అర్ధంవుందా?

మనిషి సంపూర్ణుడు కాడు. పొరపాట్లు చేస్తాడు. ప్రతి వ్యక్తిలో కొంత మంచి వుంటుంది. కొంత చెడు వుంటుంది. కొన్ని ంవిషయాల్లో తెలివి చూపుతాడు. కొన్ని విషయాల్లో మూర్ఖుడిలా వుంటాడు. ఒక వ్యక్తి గురించి విశ్లేషించాలంటే అనేక అమ్షాలను పరిగణణలోకి తీసుకోవాల్సి వుంటుంది. అయినా, మనము అనుకున్నదే నిజమని చెప్పలేము.

ఒక వ్యక్తిలో చెడు వుంది.మంచి వుంది. చెడు వుందని వదిలేస్తామా? మంచి వుందని ఆదరిస్తామా?

ఇల్లంటి అనేక సందర్భాలను ఎదుర్కొన్న కృష్ణుడే దీనికి పరిష్కారమూ చూపాడు. భగవద్గీతలో ఒక సందర్భంలో పొగ వుందని నిప్పును కాదంటామా? అనము. కాబట్టి సదోషమపి నత్యజేత్ అంటాడు. దోషముందని ఏదీ వదిలేయకూడదు. విచక్షణనుపయోగించాలి.

శ్రీశ్రీ తాగుబోతు. ఇద్దరు పెళ్ళాలు. బూర్జువాలకు పాటలు రాశాడు. ఇదేవీ ఆయన కవిత్వంలో గొప్పతనాన్ని తగ్గించవు.

బిల్ క్లింటన్ ఫోనులో మాట్లాడుతూ మోనికా తో సరసాలాడేడు. అది మనకు అనవసరం. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు మనకు ప్రాధాన్యం.

ఇలా చూస్తూపోతే మనకు ప్రతి వ్యక్తిలో మంచి చెడు కనిపిస్తాయి. ఎక్కువ మంచిని మనము తీసుకోవాలి. వీలయినంత వరకు అందరి దృష్టినీ మంచి వైపే మళ్ళించాలి. భద్రం కర్ణేభి శృణుమాయ దేవా అంటాం. మనము మంచే వినాలి. మంచే చూడాలి. మంచి పనులు చేస్తూ నూరేళ్ళు బ్రతకాలి. అలాగని చెడును విస్మరించకూడదు. చెడును పక్కకునెట్టి, సమాజ శ్రేయస్సుకోసం మంచినే ప్రకటించాలి.

అంగుళిమాలి కథ మనకు తెలుసు. అతడిలో అంత చెడులోనూ మనిషిని చూశాడు బుద్ధుడు. అది మన సాంప్రదాయం. అది మన ధర్మం.

ఈ ఆలోచనల నేపధ్యంలో మనము మన మహాత్ముడు పుస్తకాన్ని విశ్లేసిస్తే కనిపించే కనపడే నిజాలను రేపు పరామర్శిద్దాం.

September 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu