Archive for September 25, 2008

మన మహాత్ముడు-విమర్శ-4

ప్రస్తుతం తెలుగు రచనా రంగంలో అత్యద్భుతమయిన తెలుగు, అతి శక్తి వంతమయిన రీతిలో రచించేవారిలో అగ్రస్థానం ఎంవీఆర్ శాస్త్రి గారిదే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన్ రాసే ప్రతి వాక్యం, వాడే ప్రతి పదమూ ఎంతో అర్ధవంతమూ, ఆలోచనాత్మకంగా వుంటాయి. ఆయన వాదన, తర్కం అత్యంత ఆహ్లాదకరంగానేకాదు, ఖండించలేని రీతిలో వుంటాయి. ఎదురువాదనకు తావుండదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విషయాలను ఈ దృష్టితో ఇలా కూడా అన్వయించవచ్చన్నమాట అనిపిస్తుంది. రచనాంశం ఎల్లాంటిదయినా ఏక బిగిన చదివించగల శైలి ఆయనది. తన వాదనను బలపరచుకునేందుకు ఆయన సేకరించే నిజాలు, వాటికోసం చేసే పరిశోధన ఆ నిజాలను వ్యక్తీకరించిన తీరు లాంటి విషయాలలోకూడా ఆయనకు ఆయనే సాటి.అందుకే ఆయన రచించే ప్రతి అక్షరమూ ఎంతొ విలువతో అలరారుతూంటాయి. ఆయన రాసే ప్రతి విషయాన్ని ప్రామాణికంగా భావిస్తారు అనేకులు. ఆయన పుస్తకాలను రిఫెరెన్స్ పుస్తకాలుగా కూడా వుపయోగిస్తారు చాలమంది. అందుకే మహాత్మా గాంధీ గురించి ఆయన రచించిన మన మహాత్ముడు పుస్తకాన్ని విశ్లేశించి విమర్షించాల్సిన అవసరము కలిగింది.

ముందు మాటలోనే ఆయన గాంధీనే ధర్మ పీఠంపైన నిలిపే ప్రయత్నం ఇది అన్నారు.

ధర్మ పీఠం అంటే ఏమిటి? గాంధీగారిని ధర్మ పీఠంపైన నిలపాల్సిన అవసరం ఇన్నేళ్ళతరువాత ఇప్పుడెందుకు కలిగింది? అసలు, ఆయన నేరమేమిటి? ఆయనను ధర్మ పీఠంపైన నిలిపే అర్హత మనకేముంది? అన్న ప్రశ్నలు తలలెత్తుతాయి.

ముందుమాటలోనే ఇలా తలలెత్తే ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ప్రయత్నించారు.గాంధీ చుట్టూ ఆవరించిన తేజో వలయాలను చేదించి అసలు మనిషిని పట్టుకునే ప్రయత్నమే ఇది అన్నారు. అయితే, అందకు ముందు, గాంధీగారి సుదీర్ఘ వ్యక్తిత్వాన్ని, రాజకీయ జీవితాన్ని, దాని సాఫల్య వైఫల్యాలను తులనాత్మక పరిశీలన చేయటం నా ఉద్దేశ్యంకాదు అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, మనస్తత్వాన్ని, దానిపై ప్రభావం చూపిన అనేక అంశాలనూ. ఆ సమయంలోని సామాజిక పరిస్థితులను విశ్లేషించకుండా అసలు మనిషిని వెతికి పట్టుకోవటం సాధ్యమా?

ఒక వ్యక్తితో ఎన్నో సంవత్సరాలు కలసి బ్రతికిన తరువాత కూడా మనకు ఆ వ్యక్తిలోని అసలు మనిషి తెలుసని ఖరా ఖండిగా చెప్పలేము. పైకి నవ్వుతూన్నా, ఒకే రకంగా ప్రవర్తిస్తూన్నా అసలు మనిషి లోపల ఎలా భావిస్తున్నాడో చెప్పగలమా?
ఒక సినిమాలో నాయకుడు నాయికతో శృంగారం జరిపిన తరువాత ఆమె వైపు చూస్తూ అడుగుతాడు, నీ మెదడులో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని వుంది, అని. అంటే భౌతికంగా, మానసికంగా ఇద్దరు వ్యక్తులు ఎంత సన్నిహితంగా వుండగలరో అంత సన్నిహితంగా వున్న తరువాత కూడా ఒకరి మనసులోభావాలు ఇంకొకరికి తెలియవన్నమాట. మరి ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు, కొందరి అభిప్రాయాల ఆధారంగా అసలు మనిషిని పట్టుకోవటం సాధ్యమా? పైగా, మనకు తరువాత జరిగిన సంఘటనలు తెలుసు.ఆయన నిర్ణయాల ఫలితాలు తెలుసు. కానీ ఆయన ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనకీ వెసులుబాటు లేదు.

ఒక మనిషి ఒక సందర్భంలో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే రకరకాల అమ్షాలు అతని మనస్సుపై ప్రభావం చూపిస్తాయి. అవన్నీ వదిలి ఒక మనిషిలోని అసలు మనిషిని పట్టుకోవటం సాధ్యమా? మానసిక శాస్త్రవేత్తలే జీవితాంతం పరిషోధించినా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితిలో గాంధీ అసలు మనిషిని కొన్ని పాపెర్ కట్టింగులు, కొన్ని రెఫెరెన్స్ పుస్తకాలు, కాస్త ఊహ, ఇంకొంత ఆలోచన ద్వారా తెలుసుకోగలమా? అది తెలుసుకోవటం అంత సులభమయితే, ప్రపంచంలో ఇన్ని భేదాభిప్రాయాలు, దృక్కోణాలే వుండేవి కావు. ఇంతకాలం గాంధీ మహాత్ముడిగా నిలిచేవాడే కాదు. ప్రజలను ప్రభావితం చేయగలిగేవాడే కాదు.

ఈ సందర్భంలో వాల్ట్ విట్మాన్ కవితా పంక్తులను స్మరించాలి మనము.

 when i read the book, the biography famous/ and is this then said what the author calls a man’s life?/ and so will someone when iam dead and gone write my life?/ as if any man really knew aught of my life/ why even i myself i often think know little or nothing of my real life?/ only a few hints, a few diffused faint clews and in directions/ i seek for my own use to trace out here.

migataa reapu.

September 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu