Archive for September 26, 2008

మన మహాత్ముడు-విమర్శ-5

ఒక మనిషిలో అనేక మనుషులుంటారు. అనేక భిన్న సంధర్భాలలో వ్యక్తిలోని భినమయిన మనుషులు తొంగిచూస్తూంటారు.  అందుకే కవి గుంటూరు శేశేంద్ర శర్మ, ఒక తరాన్ని ప్రసవించటమంటే తమాషాకాదు/ ఒక నిండు కలల జగత్తునే మేల్కొల్పటం/ అన్నో అవ్యక్తాత్మలు చిత్ర విచిత్రానుభూతుల ఒడిలో స్పందన పొందిన తౠణాలు ఈ తరాలు, అంటాడు. ఈ కవిత భారతీయ దృక్కోణంలో మానవ మనస్తానికి సంబంధించిన ఆలోచనలను ప్రదర్శిస్తుంది.

మన సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తిలో అతని తల్లితండృలే కాదు, అతని పూర్వీకులంతా వుంటారు. ఒక వ్యక్తి ఒక సంఘటనకు ఒక రకంగా స్పందించాడంటే, ఈ పూర్వీకులతో పాటు, ఆ వ్యక్తి అనుభవాలు కూడా అందుకు కారణం. ఆధునిక జన్యు సిద్ధాంతం, మానసిక శాస్త్రం కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే, అతని పూర్వీకులను గురించి కూడా తెలుసుకోవాల్సి వుంటుంది. అందుకే మనవారు, కొన్ని తరతరాల చరిత్రలను తెలుసుకుని వుండేవారు. పరిచయం చేసుకునేటప్పుడు, ప్రవర కూడా చెప్పేవారు.

అందుకే, ఏ మనిషి గురించి అంచనా వేయాలన్నా, అతనిలోని అసలు మనిషిని గ్రహించాలన్నా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. కొన్ని సంఘటనలు, కొందరి వ్యాఖ్యలు, ఇంకొందరి అభిప్రాయాలు పరిషీలిస్తే సరిపోదు. అందుకే, శాస్త్రి గారు తన పుస్తకంలో ఆవిష్కరించాలనుకున్న అసలు గాంధీ ఎవరు? అన్న ఆలోచన వస్తుంది.

ముందుమాటలోనే తన పరిశీలన పరిథి పరిమితమయింది అని అన్నారు.

మరో సందర్భంలో, ఎవరి ఊహకు అందని, ఏ ప్రమాణానికీ ఒదగని వాడని చాలామంది చేతులెత్తేశారనీ రాశారు. అయితే, ఇందుకు కారణం, వారికి వారు తగిలించుకున్న భక్తి విశ్వాసాల గంతలు అడ్డొస్తాయనీ రాశారు. అంటే కళ్ళకు కట్టుకున్న గంతలు తొలగించుకుంటేఅ గాంధీ అసలు మనిషి అర్ధమవుతాడని రచయిత అభిప్రాయమని తేలుతోంది.

కానీ రచయిత తన పరిషీలనను నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా చేసారన్న ఆలోచన ముందుమాటలోనే అడుగంటుతుంది.

ముందుమాటలోనే నేను మాట్లాడుతున్నది మనం పూజించే గాంధీగురించి కాదు, మనం గుర్తించని రాజకీయ గాంధీ గురించి అన్నారు.

మనము పూజించే గాంధీ, రాజకీయ గాంధీ వేర్వేరు కారు. ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం పడుగులో పేకలా కలసి పోయాయి. వాటిని విడ దీసి చూడటం నూనె, నీరు వేరుచేసినంత సులభం కాదు. అలా చూస్తే గాంధీనే కాదు, ఏ వ్యక్తి గురించీ సరయిన, సమగ్రమయిన అవగాహన ఏర్పడదు.

వివేకానంద వ్యక్తిగత జీవితం నుంచి, ఆయన ప్రవక్త జీవితాన్ని వేరు చేయగలమా? అలా చేస్తే నాస్తికుడయిన యువకుడు యోగి అవటం అర్ధమవుతుందా?  ఆయన బాల్య అనుభవాలను విస్మరిస్తే, ఎదిగిన తరువాత ఆయన ప్రవర్తన మనకు బోధపడుతుందా? ఆరోగ్యవంతమయిన బాల్యం వ్యక్తిత్వ వికాసానికి రాజమార్గం అంటారు. వ్యక్తి వ్యక్తిత్వాన్నుంచి అతని అనుభవాలు వేరు చేసి చూడటం కుదురుతుందా?

ఇది గాంధీ, వివేకానందకే కాదు ఏ వ్యక్తికీ వర్తించదు. ఇందిరాగానంధీ వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితం అని విభజించవచ్చు, కానీ ఒకదానితో ఒకటి కలసి వున్నాయి. ఒక దాన్ని విస్మరిస్తే మరొకటి బోధ పడదు.

చార్లెస్ దికెన్స్ జీవితం నుంచి అతని నవలలను వేరు చేయగలమా? అలాగయితే, డేవిడ్ కాపర్ ఫీల్డ్ ఈ జన్మకు అర్ధం కాదు. ఇది ప్రతి రచయితకూ వర్తిస్తుంది.

అంటే, ఆదిలోనే మనకు రచయిత పరిషీలనా పద్ధతి సమగ్రమూ, సంపూర్ణమూ కాదని తెలుస్తుంది. పైగా రచయిత తన పరిమిత పరిథి గురించీ చెప్పుకున్నాడు. అలాంటప్పుడు, చిన్న సందులోంచి, విశాలమయిన గదిలోకి తొంగి చూసి గది అసలు రూపాన్ని వర్ణించటం సాధ్యమని అనటం కుదురుతుందా?

ఇతరులకు ఆపాదించిన దోశాలు రచయితకూ వర్తిస్తాయికదా!

ఇతరుల కళ్ళకు భక్తి గంతలు కడితే రచయిత కళ్ళకు భక్తి తప్ప మిగతా అన్నీ  గంతలు కట్టినట్టే అవుతుంది కదా?

గాంధీ వ్యక్తి గత జీవితాన్ని రాజకీయ జీవితాన్ని వేరు చేసానన్న రచయిత, ఆఫ్రికాలో అల్లర్లు జరుగుతూంటే గాంధీ బ్రహ్మచర్యం గురించి మాట్లాడేఅరని విమర్శించటం తర్కానికి నిలుస్తుందా? గాంధీ బ్రహ్మచర్యం పాటించాలని నిశ్చయించటం వ్యక్తి గతమా? రాజకీయమా? వ్యక్తిగతమయితే ఆ నిర్ణయం గురించి వ్యాఖ్యానించే అర్హత రచయిత కోల్పోతాడు. ఎందుకంటే, మనము పూజించే మహాత్మా గాంధీలో బ్రహ్మచర్యం ఒక భాగం. రాజకీయమయితే, ఒక వ్యక్తి ఆంతరంగిక నిర్ణయం రాజకీయమెలా అవుతుంది? అందుకే, మనము పూజించే గాంధీ, రాజకీయ గాంధీ అని వేర్వేరు లేరు. వున్నది ఒకటే గాంధీ అది మహాత్మా గాంధీ!

రాజకీయాలకు, ధర్మానికీ, వ్యక్తిగత ప్రవర్తనకూ తిరుగులేని రీతిలో ముడిపెట్టాడు మహాత్మా గాంధీ. అందుకే ఆయనను పూజించాల్సిన విషయాల్లో పూజిస్తూనే విభేదించిన విషయాల్లో విభేదిస్తూనే వున్నారు ఆకాలంలో రాజకీయనాయకులు, ప్రజలు.

అంబేద్కర్, అరబిందో, సుభాష్ బోస్ లు ఆయనను దుయ్యబట్టారు. అది రాజకీయంగా. సైద్ధాంతిక పరంగా. కానీ వ్యక్తిగతంగా వారూ గాంధీని పూజించారు. ఆరాధించారు. వారు విమర్శించిన రాతలే చూస్తే సరిపోదు. వారు గాంధీని మహాత్ముడిగా అభివర్ణించిన రాతలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

అరబిందో గాంధీ పద్ధతులని ప్రశంసించారు. బోసు గాంధీ భక్తుడు. అంబేద్కర్ కూడా గాంధీ అభిమాని. అంటే ఒక రకంగా గాంధీ మహాత్ముడవటంలో వీరందరి పాత్రా వుంది.అంటే రచయిత తనకు నచ్చి, తన వాదనను బలపరిచే సత్యాలని మాత్రమే ఎంచుకున్నారన్నమాట.selective election of material and selective look out for material  అన్నమాట.

తాను ఎంచుకున్న సత్యాలను విశ్లేషించే దృష్టి కూడా selective అవటంలో ఆశ్చర్యం ఏమయినా వుందా?

ఇక, గాంధీగారిని కించపరిచే వుద్దేశ్యమూ లేదని రాశారు. పుస్తకం చదువుతూంటే కించపరచటం తప్ప మరో ఉద్దేశ్యమూ లేదని స్పష్టమవుతుంది.

ఇదేలాగో రేపు చూద్దాము.

September 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu