Archive for September 27, 2008

మన మహాత్ముడు, విమర్శ-6

 when we talk about others it is our character that is revealed most  అన్నది అక్షర లక్షలిచ్చేమాట. ఎందుకంటే, మనసు ఏది చూడాలనుకుంటే మెదడు అదే చూపిస్తుంది. మెదడు చూసేది మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే, ఎదుటివారి గురించి మనము మాట్లాడేమాటలు, చేసే విమర్శలు, రక రకాల విషయాలను మనము చూసే దృష్టి మన వ్యక్తిత్వాన్నిబట్టివుంటాయి. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు అందుకే.

ఎప్పుడయితే ముందు మాటలో గాంధీని ధర్మపీఠం ముందు నిలబెడతానన్నారో అప్పుడే రచయిత గాంధీ ప్రతి పనిలో తప్పులెన్నాలని కంకణం కట్టుకున్నారన్న భావన కలుగుతుంది.

గాంధీ ప్రత్ష్టను ధ్వంసం చేయటానికో, కించపరచే వుద్దేశ్యంతోనో, ద్వేశంతోనో ఈ పుస్తకం రాయటంలేదని అనగానే, రచయిత తాను రాసిన దానికి వివరణ, సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడని తెలుస్తుంది. అంటే ప్రచారంలో ఉన్న అభిప్రాయాలకు భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తున్నారని అర్ధమవుతుంది. తానేవేవి తన ఉద్దేశ్యాలు కావన్నారో అవే ఆయన అసలు వుద్దేశ్యాలన్న భావన కలుగుతుంది. తన ఆలోచనను సమ్ర్ధించుకునేందుకు మజుందారు నుంచి ఉదాహరించారు రచయిత. మజుందారేకాదు మన ధర్మంలో ఎవరినీ మనము ప్రశ్నించి నిగ్గు తేల్చుకోకుండా గొప్పవాడనలేదు. అలా అనే అలవాటూ మనకులేదు. ఇప్పుడు ప్రతివాడూ విమర్శలకతీతమయి, సహనంకొల్పోవటం ఎందుకంటే ధర్మం తెలియక. సరయిన ఆదర్శం ప్రజలముందు లేక. ఉత్తమ ఆదర్శం వున్నవాడు తాత్కాలిక ప్రలోభాలకు లొంగడు. అవిలేని వారే ఆవేశకావేశాలకు లొంగుతారు.కాబట్టి గాంధీ నిగ్గు తేల్చుకోకుండా ఎవరూ ఆయనను మహాత్ముడని అనలేదు. ఇప్పుడు ఆయనను ధర్మ పీఠం ముందు నిలపాల్సిన అవసరమూ లేదు. ఆయనేమీ, మిలొస్లావిచ్, సద్దాం వంటివాడు కాడు, నేరాలెంచి శిక్షించేందుకు. వారుకూడా, వారి దేశకాల పరిస్థితులనుంచి చూస్తే అంత చెడ్డవారేమీ కాదు. జార్జి బుష్షు వారిని చెడ్డవారిని చేయాలనుకున్నాడు. చేశాడు. ఇప్పుడు గాంధీ విషయంకూడా అంతే.

గాంధీ గురించి దేశం మొత్తం సరిగ్గా అంచనావేయలేదు. అందరూ భక్తితో కళ్ళు మూసుకుని, గౌరవంతో చెవుల్లో సీసం పోసుకుని గాంధీని మహాత్ముడిని చేసారు. కానీ, గాంధీ ఒక పక్కా మోసగాడు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అసూయలకు పెట్టింది పేరు. ఆయన బ్రిటీషువారి ఏజెంటు. కావాలని బ్రిటీష్ వారు ఆయనని నాయకుడు చేసారు.  కాంగ్రెస్ వారు మాయ చేసి గాంధీని గొప్ప చేశారు. ఆ మాయలో పడి అంతా గాంధీని గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడీ పుస్తకం ద్వారా అందరి కళ్ళకు కమ్మిన పొరలను తొలగిస్తాను. చెవులకు పట్టిన తుప్పు వదలగొడతాను, అని రచయిత అంటున్నట్టనిపిస్తుంది ముందుమాట చదివితే. అయితే, తన ప్రయత్నం విఫలమవుతుందని రచయితకు తెలుసు. అందుకే, ముందు మాటలోనే, గాంధీ బ్రతికుండగానే తప్పుపట్టాల్సిన అంశాలన్నీ ప్రజలకు తెలిశాయి. అయినా గాంధీ పట్ల పూజ్యభావం తగ్గలేదు. ఇప్పుడు నేను రాసిన దాని వల్ల అది మసక బారుతుందన్న భ్రమ నాకు లేదు అంటారు రచయిత. అలాంటప్పుదు ఇంత వ్యధా, వృధా ప్రయత్నమెందుకన్న ప్రశ్న వస్తుంది.

నిజానికి, ఇప్పుడు గాంధీ పేరు మాత్రం ప్రజలకు తెలుసేమోకానీ ఆయన తత్వం, ఆయన జీవితం ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలనా ఆసక్తీ ఎవ్వరికీ లేదు. ఆయన విగ్రహాలు విరిగిపోయి, దుమ్ముపట్టి, చెత్తకుండీలపక్కన, కుక్కలకూ పందులకూ మాత్రమే పరిమితమయ్యాయి. యువకులకు గాంధీ అంటే, మున్నాభై గాంధీగిరే తప్ప ఇంకా ఏమీకాడు. అలాగే రాజకీయ నాయకులకూ గాంధీ ఆశయాలేమిటో తెలియదు. ఆసక్తీ లేదు. అర్ధం చేసుకునే శక్తీ లేదు. ఒక రకంగా చెప్పలంటే గాంధీ ఇప్పుదు,  condemned to ablivion, thought of as redundant, is almost on the brink of extinction.

యువకులకు కొత్త idols వచ్చారు. ప్రజలకు, నాయకులకు కొత్త దేవుళ్ళు రాజకీయంగా వెలిసారు. కొత్తగా రచనలు చేస్తున్నవారికి యండమూరికూడా సరిగ్గా తెలియనట్టే, నాయకులకూ, వారి అనుచరులకూ రాహుల గాంధీ దాటి తెలియదు. సోనియా కూడా మసకబారుతున్న ఙ్నాపకమే.

ఇలాంటి పరిస్థితులలో పనిగట్టుకుని గాంధీని ధర్మపీఠానికి లాగాల్సిన అవసరముందా? ఆయనని దూషించి, తప్పులెంచి తీర్పులు చెప్పి శిక్ష విధించాల్సిన అవసరముందా?

ఆయన జీవితకాలంలోనే ఆయన తప్పులకు ఘోరమయిన శిక్షలను అనుభవించాడు. దేశాన్ని విభజించేముందు నన్ను విభజించండి అన్నవాడు, నిజంగా దేశ విభజన జరుగుతున్నప్పుడు ఎంత క్షోభను అనుభవించాడో!

చిన్న హింస జరిగిందని ఆకాశం తాకుతున్న ఉద్యమాన్ని క్షణంలో చల్లార్చిన మనిషి ఇంత హింసను చూస్తూ ఎంత ఘోరంగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాడో!

నిజానికి గాడ్సే చపింది గాంధీ జీవచ్చవాన్ని. ఎందుకంటే,అసలు గాంధీ అంతకు ముందెప్పుడో చచ్చిపోయాడు.  మరి ఏ అసలు గాంధీని పట్టుకోవాలనుకున్నాడు రచయిత.

మరి ఎప్పుడో చచ్చి బ్రతికిన గాంధీని ఇప్పుడు ధర్మపీఠం ముందుకు లాగాల్సిన అవసరం వుందా? ఇది  flogging a dead and buried horse  లాంటిది.

రచయిత స్వభావం, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం అతని రచనలలో తెలుస్తుంది. రచయిత గురించి ఆయన కన్నా ఆయన రాసిన అక్షరాలే సరిగ్గా చెప్తాయి అంటారు.

ఇంతవరకూ ఎంవీయార్ శాస్త్రిగారి రచనలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయనకు ఒక పీఠం పైన వుండి తీర్పునివ్వటం, తప్పులెంచి, ఎదుటివారు పనికిరానివారని చూపటం సరదా అనిపిస్తుంది.

అంతకుముందు పుస్తకాలన్నీ చరిత్రకారులకు చరిత్ర పరిశోధన రాదని, వారు తప్పులు తడకలు కావాలని రాశారని నిరూపించిన రచనలు. ఆయన రచనలో నిజం వుండటంతో, రచనలో ఒక వ్యక్తినిగాక వ్యవస్థను విమర్శిస్తూండటంతో, పీఠం పైన వుండి తీర్పునిస్తున్న భావన రాదు. కానీ, 1857 రచనలో ఈ భావన కలుగుతుంది.

1857 పోరాటవీరులందరినీ పనికి రాని వారుగా, స్వార్ధపరులుగా, భీరువులుగా చిత్రించి దూషిస్తూంటే రచయితకు తప్పులెన్ని పనికిరాని వారిగా చూపటం సరదా అనిపిస్తుంది. ఎందుకంటే అలా చూపుతూండటంవల్ల ఇంతకాలం వారు గొప్పవారని నమ్మినవారు, ఇంకా వారిని గౌరవిస్తున్నవారూ, వెర్రి వెంగళప్పలని చూపిస్తునట్టవుతుంది. ఇది, నాస్తికులు, ఆస్తికులను చూసి హేళన చేయటంలాంటిది.తాము ఒక మెట్టుపైన వున్నట్టు, మిగతా అంతా మూర్ఖులు, దద్దమ్మలు అనుకున్నట్టు.

ఈ భావన మన మహాత్ముడు పుస్తకంతో బలపడుతుంది. ఇందులో గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు, ఆయన చర్యలను చూసిన దృష్టి, వాటిని విశ్లేషించిన తీరు ఈ ఆలోచనను నిరూపిస్తాయి.

ఇది రేపు.

September 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu