Archive for September 28, 2008

మహేంద్ర కపూర్ కు గీతాంజలి

కొందరు ప్రతిభావంతులుంటారు. వారి దురదృష్టము ఎలాంటిదంటే వారిలో ఎంత ప్రతిభ వున్నా జీవితాంతం వారు ద్వితీయ శ్రేణి కళాకారులుగానే పరిగణనకు గురవుతారు. ఒక్క సారి ఏ కళారంగాన్ని పరిషీలించినా ఇలాంటి పరమాధ్భుతమయిన ప్రతిభ వుండీ అనేక కారణాలవల్ల నీడలలో మిగిలి, అప్పుడప్పుడూ మేఘాలమాటునుండి వెలికి వచ్చి కళ్ళు జిగేల్మనిపించి మళ్ళీ మేఘాల మాటుకి వెళ్ళిపోతారు. అలాంటి అత్యద్భుత ప్రతిభవుండీ నీడలలో మిగిలిన కళాకారులలో మహేంద్ర కపూర్ ఒకరు.

జయదేవ్, సర్దార్ మాలిక్, గులాం మహమ్మద్,సజ్జద్, వసంత్ దేశాయ్, మన్నాడే  ఇంకా అనేక కళాకారులు మురిపించి, మెరిపించి, తమ ప్రతిభ తాలూకు మెరుపులు ప్రదర్శించి, ఊరించి, నిశ్శబ్దమయిపోతారు. ఇందుకు కారణాలనేకం. కానీ మహేంద్ర కపూర్ ద్వితీయ శ్రేణి కళాకారుడిగా మిగిలిపోవటానికి ప్రధాన కారణం అతను పేద వారి మహమ్మద్ రఫీగా గుర్తింపు పొందటమే!

మహేంద్ర కపూర్ చినీ గేయ ప్రపంచంలో అడిగిడినప్పుడు దివ్యమయిన గంధర్వుల లాంటి గాయకులు రంగంలో వున్నారు. రఫీ, తలత్, ముఖేష్, కిషోర్ వంటి గాయకులు తమదయిన ప్రత్యేక గాన శైలిని ఏర్పాటు చేసుకున్నారు.

రఫీ స్వరం నీటిలాంటిది. ఏపాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని నీరు ధరించినట్టు, అయినా జీవం పోసేట్టు, రఫీ స్వరం పలకని భావం లేదు. చిలికించని హొయలు లేవు. పోని లయలు లేవు. ఎటువంటి, గానం, వాయిద్యం లేకున్నా కేవలం తన స్వర విన్యాసంతో పాటను పండించగలడు రఫి. అప్పటికే రాజ్యం ఏలుతున్న తలత్ ను మూగవాడిని చేసి పనికిరాని వాడిని చేశాడు.

ముఖేష్ ప్రత్యేకత ముఖేష్ దే. రాజ్ కపూర్ కాంప్ లో ఆస్థాన గాయకుడు ముఖేష్. ఆ స్థానం నుంచి ఆయనను ఎవారూ కదల్చలేరు.

కిషోర్ పద్ధతేవేరు. అనితర సాధ్యం అతని మార్గం. పైగా యోడెలింగ్ నుంచి విషాదగీతాలవరకూ రఫీకి దీటుగా అన్నిరకాల భావాలను, హోయళు లయలను పలికించగలడు.

వీరంతా  ఉచ్చదశలో వున్నప్పుడు రంగంలో ప్రవేశించాడు మహేంద్ర కపూర్. మన సినిమాల్లో కళాకారుడికి ఏవరిదయిన మద్దతు వుండాలి. ఏదయినా కాంప్ కు చెంది వుండాలి. కానీ, మహేంద్ర కపూర్ అడుగుపెట్టేనాటికి కాంపులలో ఖాళీలు లేవు. పైగా అతడి మొదటి పాట చాంద్ చుపా ఔర్ తారే డూబే రఫీ లాంటి పాట. మహేంద్ర కపూర్ బాగానే పాడినా, రఫి స్వరం లోని మృదుత్వము, మాధుర్యమూ, flexibility లు మహేంద్ర కపూర్ స్వరంలో లేవని స్పష్టమయిపోయింది. దాంతో రఫీ లాంటి అసలు గాయకుడుండగా, రఫీ నీడలాంటి మహేంద్రకపూర్ దండగా, అన్న భావం స్థిర పడింది. దాంతో ఎవరికయితే రఫీ నచ్చడో, రఫీకి తీరికలేదో వారికి, మహేంద్ర కపూర్ గుర్తుకు వచ్చేవాడు.

సీ. రామ చంద్రకు, అనిల్ బిశ్వాస్ కు శాంతా రాం కూ రఫీ పాడే విధానం నచ్చదు. వారి దృష్టిలో ఏడ్చేపాటలో గాయకుదు ఏడుస్తూ పాదాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడయితే మహేంద్ర కపూర్ రంగ ప్రవేసం చేశాడో వారు మహేంద్ర కపూర్ ను ఆహ్వానించారు. అవకాశాలిచ్చారు.

ఆతరువాత, చోప్రాకు, రఫీకి భేదాభిప్రాయాలు రావటంతో చోప్రా కాంపులో మహేంద్ర కపూర్ కు స్థానం లభించింది. తన ప్రతిభను ప్రదర్శించే వీలు దొరికింది. మళ్ళీ రఫీ లతాలకు గొడవవల్ల, లతా రఫీతో పాడననటంతో లత తో పాడే వీలు మహేంద్ర కపూర్ కు చిక్కింది. అలా, అతనికి సంగంలో హర్ దిల్ జో ప్యార్ కరేగా పాడే వీలు దొరికింది. ఇదే సినిమాలో రాజేంద్ర కపూర్ పైన చిత్రించిన సొలో పాట రఫీ పాడాడు. యె మేరా ప్రేం పత్ర్ పఢ్కర్.  మనోజ్ కుమార్ కు మహేంద్ర కపూర్ స్వరం నచ్చింది. రఫీ కన్న అతనికి మహేంద్ర కపూర్ lucky mascot అన్న నమ్మకం కలిగింది. ఫలితంగా అతని కాంపులో మహేంద్ర కపూర్ చేరాడు. కానీ మనోజ్ కుమార్ కు ముఖేష్ ఎక్కువగా నప్పటంతో ప్రధాన పాటలన్నీ ముఖేష్ కు దక్కేవి.

70వ దశకంలో రఫీ అనేక కారణాలవల్ల పాటలు తగ్గించేశాడు. దాంతో దిలీప్ కుమార్, శమ్మి కపూర్ వంటి వారికి పాడేవీలు మహేంద్ర కపూర్ కు చిక్కింది. గోపి సినెమాతో దిలీప్ కుమార్ గొంతయ్యాడు మహేంద్ర కపూర్. కానీ, రఫీ దొరికితే మాత్రం దిలీప్ కు రఫీతోనే పాడించారు. బైరాగ్, దాస్తాన్ లలో దిలీప్ గొంతు రఫీదే. చివరికి క్రాంతిలో వేలు దొరకగానే దిలీప్ కు రఫీదే గొంతు. (చన్నా జోరుగరం పాట.)అలాగే, రఫీకి ఓపీ నయ్యర్తో విభేదాలు రావటంతో ఆ కాంపులోకి మహేంద్ర కపూర్ అడుగుపెట్టాడు.రఫీ మరణం తరువాతనే నౌషాద్ మహేంద్ర కపూర్ తో పాడించాదు.

చోప్రా, రవిలతో మహేంద్ర కపూర్ అనుబంధం సునీల్ దత్ తో సంబంధంగా పరిణమించింది. దాంతో తరువాత సినిమాలలో సునీల్ దత్ గొంతయ్యాడు మహేంద్ర కపూర్. కానీ, సునీల్ దత్ సినిమాలఓ పాటల ప్రాధాన్యం తక్కువ.(చోప్రా సినిమాలు మినహా)

చోప్రా కాంపులో రఫీని నిషేదించటం వల్ల రవి మహేంద్ర కపూర్ ని వాడాడు కానీ, రవీ కి రఫీ అంటేనే ఇష్టం. వక్త్ సినిమాలో వక్త్ సే దిన్ ఔర్ రాత్ పాటను రఫీనే పాడాలని పట్టుబట్టాడు రవి. రఫీయే ఆ పాటలో భావానికి తగ్గ ఎమోషన్లు చూపగలడని రవి నమ్మకం. అందుకే చోప్రా రఫీని నిషేధించినా ఆ పాట మాత్రం రఫీనే పాడాడు.

ఇలా, జీవితాంతం రఫీ నీడలోవుండిపోవాల్సి వచ్చింది మహేంద్ర కపూర్ కు.రఫీ మరణం తరువాత రఫీ అనుకరణతో అనేకులు రంగ ప్రవేశం చేశారు. అప్పటికి మహేంద్ర కపూర్ స్వరం కూడా బండ బారి పోయింది. అయినా రవి కి మాత్రం పాడుతూ వచ్చాడు మహేంద్ర కపూర్.

గమనిస్తే, మహేంద్ర కపూర్ కు రఫీ నీడ అని ముద్ర పడింది కానీ తన దయిన ప్రత్యేక గాన పద్ధతి వుంది. అతను గొంతు చించుకుని హై పిచ్ లో పాడే పద్ధతి అనితర సాధ్యం. చివరి వరకూ అలా పాదగలిగేడు. ఒక స్థాయికి చేరిన తరువాత రఫీ హై పిచ్ లో పాడలేదు. కానీ నమూ చుపాకె జియో, అబ్ కే బరస్, ఔర్ నహీ ,మెరె దేశ్ కి ధర్తీ లాంటి పాటలలో మహేంద్ర కపూర్ గొంతు విప్పి పాడుతూంటే మనసు రెక్కలు కట్టుకుని విహాయసంలోకి విహరిస్తుంది.

ఆరంభంలో నాకూ మహేంద్ర కపూర్ అంటే చులకన అభిప్రాయం వుండేది. రఫీ వీరాభిమానిని నేను. కానీ, రాను రాను మహేంద్ర కపూర్ పాతలు వింటూంటే, ఏ ఇతర గాయకుడికీ మహేంద్ర కపూర్ ఏ రకంగానూ తీసి పోడని అర్ధమయింది. దిగాజాల నడుమ వుంటూ కూడా తన దయిన ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకోవటం చాలా కష్టం. ఆ కష్టమయిన పనిని సాధ్యం చేశాడు మహేంద్ర కపూర్.

దిల్ లగాకర్ హం యె సంఝె జిందగీ క్యా చీజ్ హై, అన్న పాటలో మహేంద్ర కపూర్ స్వరం భావాలను మధురంగా పలుకుతుంది. ఉఖ్యంగా హోష్ ఖో బైఠే తొజానా బేఖుదీ క్యా చీజ్ హై, అన్నప్పుడు అతని స్వరంలో ఒక రకమయిన మత్తు జాలువారుతుంది. అయితే, ఇదే రఫీ పాడితే ఇంకా మత్తుగా వుండేదనిపిస్తుంది. ఇక్కడే మహేంద్ర కపూర్ ఎందుకని ద్వితీయ శ్రేణి గాయకుడిగా మిగిలిపోయాడో తెలిసేది.

శ్యామల్ శ్యామల్ బరన్, కోమల్ కోమల్ చరన్ మహేంద్ర కపూర్ జీవితంలో అత్యద్భుతమయిన పాటలలో ఒకటి. పదాల లాలిత్యానికి అతని స్వర గాంభీర్యం తోడయి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి.ఇక్కడ కూడా అతని స్వరంలో కొంత లాలిత్యం వుంటే? అన్న భావన కలుగుతుంది.

ఇక రవి చోప్రాలకు ఆయన పాడిన పాటలు మహేంద్ర కపూర్ కు ప్రత్యేక వ్యక్తిత్వాన్నిచ్చాయి. ఇక్కడ కూడా రఫీ గుర్తుకు వచ్చినా నెమ్మదిగా రఫీ నీడలోంచి మహేంద్ర కపూర్ బయట పడటం చూడవచ్చు.

హే నీలె గగన్ కె తలే, వింటూంటే అలా నీలి మబ్బులపయిన తేలియాడుతున్న భావన కలుగుతుంది. తుం అగర్ సాథ్ దేనేక పాట అయితే రొమాన్స్ కు ప్రతీక. కిసీ పత్థర్ కే మూరత్ సే, సున్నిత భావాల సముద్రం. అయితే, ఇక్కడ మహేంద్ర కపూర్కు సాహిర్ కవితలు ఎంతో సహాయం చేసాయి. పాటలలోని భావాలు మనలను మధురిమలో ముంచెత్తుతాయి. మహేంద్ర కపూర్ స్వరం ఆ మాధురీ స్రవంతిలో ప్రయాణించే వీలు కల్పించే పడవ.

ఆప్ అయీ తొ ఖయాలే దిల్ ఎ నాషాదాయా పాటలో మ్ని సున్నిత భావాలను మహెంద్ర కపూర్ పలికిన తీరు అమోఘం. అలాగే చలో ఎక్ బార్ ఫిర్సే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సినిమాలో, ఇన్ హవావోమే విషాదంగా మహేంద్ర కపూర్ ఒక్కడే పాడతాడు. అది నా వుద్దేశ్యంలో మహేంద్ర కపూర్ పాటలన్నిటిలోకి తలమానికమయినది.

కల్ బాహోంకా హార్ మిలాథ/ ఆజ్ అష్కోంకా హార్ పుకారే/
ఉంకో కుచ్ బీ యాద్ నహీ హై/ అబ్ కోయీ సౌబార్ పుకారే వంటి పాదాలలో ఆయన భావం చిలికించిన తీరు పరమాధ్బుతం. నటుడు ఏడుపు మొహం పెడితే చాలు గొప్ప నటన అనిపించే రీతిలో పాడాడు.

అయితే, 70 ల తరువాత మహేంద్ర కపూర్ పాటలు తగ్గాయి. మళ్ళీ రఫీ రంగ ప్రవేశం చేశాడు. పాటల తీరు మారింది. ముఖేష్, మహేంద్ర కపూర్, మన్నడే  లాంటి వారి పాటల అవసరం తగ్గింది.

అయినా, రవి సంగీతంలో బీతే హువే లమ్హోంకి కసక్ సాథ్ తొ హోగీ, దిల్కీ యె ఆర్జూ థి కొయీ లాంటి పాటలు అద్భుతంగా పాడాడు. కానీ నాకు, ఇన్సాన్ కీ హర్ షైకా ఇత్నాహీ ఫసానా హై/ ఎక్ ధుంద్ సే ఆనాహై, ఎక్ ధుంద్ మే జానా హై/ చాలా చాలా చాలా నచ్చుతుంది. సాహిర్ రచనలోని తాత్వికత, లోతయిన భావాల గనులను మన అనుభూతికి తెస్తాదీపాటలో తన స్వరంతో. ఎంతో గంభీరంగా, భారంగా ఒకో పదాన్ని స్పష్టంగా. అనుభవిస్తూ పలుకుతూంటే, కళ్ళముందు పొగ మంచు కమ్మినట్టుంటుంటుంది. నిజం, మనమంతా పోగ మంచులోంచే వస్తాము. పొగ మంచులోకే పోతాము. ఎటునుంచి వస్తామో తెలియదు. ఎతు పోతామో తెలియదు. వెళ్ళిన వారూ చెప్పలేరు. ఇప్పుడా పోగమంచులోకే అదృశ్యమయ్యాడు మహేంద్ర కపూర్. కానీ తన స్వరంద్వారా ఆయన సృజించిన మధుర గేయాల మధుర భావాలు జీవితాంతం మనలని రంజింప చేస్తూనే వుంటాయి. తర తరాలకు సున్నిత భావనలను నేర్పుతూనే వుంటాయి.

ఒకేసారి అత్యద్భుతమయిన కళాకారులు రంగంలో వుంటే,  first among equals కు గుర్తింపు వస్తుంది. మిగతా అంతా అతని నీడలో వుండిపోతారు. ఇందుకు మహేంద్ర కపూర్ తిరుగులేని నిదర్శనం. అతడికి ఇదే నా గీతాంజలి.

ఘటామే చుప్కే సితారే ఫనా నహీ హోతే
అంధేరి రాత్కే దిల్మే దియే జలాకె జియో

అన్నదానికి మహేంద్ర కపూర్ మచ్చుతునక.

యె జిందగీ కిసి మంజిల్ పె రుక్ నహీ సక్తీ
హర్ ఎక్ మకాం సే ఆగె కదం బఢాకె జియో

అన్నదానికీ అతని జీవితం నిదర్శనం.

September 28, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.