Archive for October, 2008

జీవితం-జాతకం మరో కథ చదవండి

నేను శ్రీపతి శర్మ తో కలసి రాసిన మరో కథ మూడు ప్రశ్నలు, ఏ వారం www.aadivaaram.com సంచిక లో ప్రచురితమయింది. ఈ కథలో జాతకాల ఆధారంగా ఒక ప్రధానమయిన నిర్ణయం తీసుకోవటాన్ని, అత్యంత తర్క బద్ధంగా, లాజికల్ గా చూపాము. వ్యక్తుత్వ వికాసానికి, పాజిటివ్ థింకింగ్ కూ, సరయిన నిర్ణయాలు తీసుకోవటానికీ జాతకాలెలా ఉపయోగపడతాయో చూపుతూ, జ్యోతిష శాస్త్రం ఎంత విస్తృతమయినదో, దాన్ని కేవలం భవిష్యత్తు తెలుసుకోటానికే వాడటం ఎంత సంకుచితమో చూపాలని ప్రయత్నించాము. అంతే కాదు, జ్యోతిష శాస్త్రం విఙ్నాన శాస్త్రమన్న ఆలోచనను ప్రదర్శించే ప్రయత్నం చేసాము. మా ప్రయత్నం ఎంత వరకూ సఫలమయిందో తేల్చాల్సింది మీరే. ఈ కథలు ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురితమయ్యాయి. కథ చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి.

October 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుందా?

సాధారణంగా సినిమాలు తీసేవారు రిస్కు తీసుకోటానికి ఇష్ట పడరు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఒక్క సారి నష్టం వస్తే దాదాపుగా దివాళా తీయటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే నష్టం పూడ్చుకోవాలన్నా ఇంకో సినిమా తీయటం తప్ప మరో దారి లేదు.

ఇటీవలే ఒక నిర్మాతను కలవటం తటస్థించింది. ఆయన చాలా మంచి సినిమాలు నిర్మించాడు ఒకప్పుడు. మాటల సందర్భంలో ఆయన సినిమాలు తీయటం ఎందుకు మానేశాడో చెప్పాడు.

హిట్ సినిమాలు నిర్మిస్తూ ఆయనకు ఒక సినిమా గురించిన ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనను ఒక ప్రఖ్యాత దర్శకుడికి చెప్తే, ఆయన ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడట. మొత్తం బాధ్యత అతడికి అప్పగించి నిర్మాత ఊరుకున్నాడు. ఎందుకంటే అతడు పేరున్న దర్శకుడు. అనవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు.

అయితే, షూటింగ్ జరుగుతూంటే, ఆయన దగ్గరకు అనేకులు వచ్చి సినిమా దారి తప్పుతోందని చెప్తూ వచ్చారట. కానీ దర్శకుడు పెద్దవాడు. మధ్యలో జోక్యం చేసుకుంటే బావుండదు. అందుకని నిర్మాత ఓపిక పట్టాడు. సినిమా రషెస్ చూస్తూంటేనే అది నడవదని అర్ధమయిపోయింది. కానీ ముందుకు తప్ప వెనక్కు వెళ్ళలేని పరిస్థితి. దాంతో, మొండిగా సినిమా పూర్తిచేసి, విడుదల చేశాడు. అనుకున్నట్టే ఘోరంగా దెబ్బతింది సినిమా. ఆ కాలంలో 50 లక్షలపైగా నష్టం వచ్చింది.

రెండు మూడేళ్ళలో 50 లక్షల నష్టం పూడ్చుకోవాలంటే, మరో 50 లక్షలు అప్పు తెచ్చి సినిమా తీయాలి. ఇంత తక్కువ సమయంలో అంతగా సంపాదించాలంటే అదొక్కటే మార్గం. కానీ, సినిమా నడవకపోతే, నష్టం కోటి దాటుతుంది. ఆయన సందేహంలో పడ్డాడు.

అప్పుడు ఆయన శ్రేయోభిలాషులు, ఓ మాంచి మసాల సినిమా తీయండి. మినిమం గారంటీ వుంటుందని అన్నారు. ఆయనకు అలవాటయినట్టు సినిమా తీస్తే నడవదన్నారు. అసలే దెబ్బ తినివున్నారు, మళ్ళీ రిస్కెందుకన్నారు. వాళ్ళా మాటలకాయన లొంగాడు. అప్పు చేసి మసాలా సినిమా తీశాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. అంత కాలం మంచి సినిమాలు నిర్మించిన పేరు పోయింది. మళ్ళీ సినిమా పేరెతాలేదు. ఆస్తులమ్మి అప్పులు తీర్చి, మూటా ముల్లె సర్దుకుని కూతురి ఇలు చేరుకున్నాడు. జీవితం గడిపేస్తున్నాడు.

అతని కథ విన్న తరువాత ఒక అనుమానం వస్తుంది. మసాలా సినిమాలు మనకు విజయానికి రహదార్లు. కానీ, ప్రతి మసాల సిన్మా హిట్ అవదు. అలా అయితే, ప్రతి సినిమా సూపెర్ హిట్ అవ్వాలి. ప్రతివారూ మసాలాలే తీస్తారు. కాబట్టి మసాలా సినిమాలే హిట్ అవుతాయని, ఒక ఫార్మూలా ప్రకారం తీస్తే హిట్ తప్పదని, అందుకు భిన్నంగా తీస్తే నడవవని అనుకోవటం కుదరదు.

ఒక సంస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. చివరి ప్రయత్నంగా వారు సినిమా తీయాలనుకున్నారు. మంచి కథ ఎన్నుకున్నారు. కళాకారులను ఎన్నుకున్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఉత్తమంగా నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. తరతరాలుగా వారికి ఎనలేని కీతిని సంపాదించిపెట్టింది. అది బైజూ బావ్రా అనే సినిమా!

రాజ్ కపూర్ ఎంత గొప్ప కళాకారుడో అంత తెలివయిన వ్యాపారి. దొంగలమనసుమారే అమ్షంతో హిట్ సినిమా తీసిన వ్యక్తి.( జిస్ దేష్ మె గంగా బహతీహై) అలాంటి వాడు మనస్ఫూర్తిగా ఉన్నదంతా ఖర్చుపెట్టి ఒక సినిమా తీసాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. మేరా నాం జోకర్ ఇప్పుడు క్లాసిక్ కాని విడుదలయినప్పుడు ఘోరంగా విఫలమయింది. దాంతో రాజ్ కపూర్ పూర్తిగా నష్ట పోయాడు. అయిదేళ్ళవరకూ తేరుకోలేదు. ఇప్పుడు హిట్ సినిమా తీయకపోతే కుదరదు. దాంతో ప్రేమ ఫార్మూలాపై పడ్డాడు. గ్రాడ్యుయేట్ అనే ఆంగ్ల సినిమాను భారతీయీకరణం చేసి బాబీ అన్నాడు. దాంతో భారతీయ సినిమాలలో నిక్కర్ల ప్రేమ అధ్యాయం మొదలయింది. అంత గొప్ప హిట్ అది.

బోనీ కపూర్ హిట్ సినిమాలు నిర్మించాడు. మరో హిట్ సినిమాను సంకల్పించాడు. అనిల్ కపూర్, శ్రీదేవిలు నాయికా నాయకులు. లక్ష్మి ప్యారె సంగీతం. ప్రతీకారాలు, మోసాలు, ఎత్తుకు పైఎత్తులు, పాటలు, యుద్ధాలు మొత్తం మాల్ మసాలాలన్ని నింపాడు. అడుగడుగునా మసాలాను దట్టించాడు. రూప్ కీ రానీ చోరోంకా రాజా ఎంత ఘోరంగా దెబ్బ తిన్నదంటే, ఆయన ఇంకా తేరుకోలేదు.

మూస సినిమాలకు భిన్నంగా విశ్వనాథ్, అన్ని వ్యాపరాల సలహాలను కాదని శంకరాభరణం నిర్మించాడు. అప్పుడు వస్తున్న సినిమాలకు పూర్తిగా భిన్నంగా, హీరోను మాఫియా లాంటివాడిని చేసి రాం గోపాల్ వర్మ శివ తో సినిమాల స్వరూపాన్నే మార్చాడు.  నాగేష్ కుకునూర్ తక్కువ బడ్జెట్ తో పెద్ద హిట్ హైదెరాబాద్ బ్లూస్ సాధించాడు. అస్సలు విలన్లు, యుద్ధాలు లేకుండా ఒక పెళ్ళి వీడియోలాంటి హం ఆప్కే హై కౌన్ ఘన విజయం సాధించింది. కమర్షియల్ సినిమా పరిథిలో వున్నా మూస సినిమాలకు భిన్న మయిన తారే జమీన్ పర్ సూపెర్ డూపెర్ హిట్.

వెస్టెర్న్ సినిమాలు అలవాటు లేని మనం అటు షోలే నూ ఇటు మోసగాళ్ళకు మోసగాడునూ ఆదరించాం. ఇలా చూస్తూ పోతే, హిట్ ఫార్మూల నిజంగా హిట్ ఫార్మూలా కాదని, కష్టపడి ఆలోచించి స్వయంగా సినిమా నిర్మించటం తప్పించుకునే బద్ధకానికి మారు పేరనీ అర్ధమవుతుంది.

నిజంగా హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుంటే, అది హిట్ ఫార్మూలా అంటూ ఏదీ లేదన్నదే. ఇంకొన్ని విజయవంతమయిన సినిమాలను పరిషీలిస్తే, ఈ హిట్ ఫార్మూలా అపోహ ఎలా వచ్చిందో అర్ధమవుతుంది.

October 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

సినిమా హిట్- ఫార్ములా ఫిట్!

హిట్ సినిమా కు ఫార్ములా ఏమిటి? పూర్వ కాలంలో ఇతర లోహాలను బంగారంలా మార్చాలని అనేకులు తపన పడ్డారు. పరుసవేది కోసం ప్రాణాలే ఇచ్చారు. అలాంటి పరుసవేది లాంటి మంత్రం ఇది. సినిమా తేసేది ప్రజలంతా చూసి మెచ్చటం కోసం. అప్పుడే డబ్బులొస్తాయి. ఇంకో సినిమా తీసి ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. అలాకాక కళాకారుడు తనకు నచ్చినట్టు సినిమా తీస్తే ప్రేక్షకుడు దాన్ని మెచ్చకపోతే ఇంకో సినిమా తీసేందుకు డబ్బులుండవు. అతడిని నమ్మి పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకురారు. కాబట్టి సినీ కళాకారుడికి సినిమా రంగంలో మనుగడ వుండాలంటే హిట్ ఫార్మూలా తెలిసివుండాలి. కానీ ఏ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుందో ఎవారూ కచ్చితంగా చెప్పలేరు. ఇక్కడే సినీ నిర్మాణంలో మజా తెలుస్తుంది. భరించలేని బాధ తెలుస్తుంది.

ఆరంభంలో కళాకారులకీ సమస్య లేదు. అప్పుడు సినిమాలొక వింత. తెరపైన బొమ్మ కదిలితే చాలు, అది అద్భుతం. దాంతో రైలు వచ్చి ఆగటం, పడవ నడవటం, పక్షి ఏగరటం చూపినా ప్రజలు పడీ పడీ చూసేవారు.

మనిషి రొటీన్ భరించలేడు. కొన్నాళ్ళకి కొత్త తీరిన తరువాత ప్రేక్షకులను ఆకర్శించాల్సిన అవసరం కలిగింది. దాంతో ఏదో చిన్న సంఘటనల అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని విదేశీయులు, రైలు దొంగతనాలు, హాస్యాలతో తీర్చుకుంటే మన వారు పౌరాణిక చిత్రాలతో తీర్చుకున్నారు. మాటలు లేకున్నా ఈ కథ అందరికీ అర్ధమయిపోతుంది. పైగా పవిత్ర మయిన భగవంతుని కథలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

కానీ ఇదీ ఎక్కువ కాలం సాగదు. ఆ కాలంలో ఇలాంటి ధార్మిక సినిమాలు ప్రజలలో ధర్మ భావనలను పెంపొందించి దేశభక్తిని జాగృతం చేస్తున్నాయని ప్రభుత్వం ఇలాంటి సినిమాలపైన ఆన్కలు విధించింది. నిర్మాతలను ఇబ్బందుల పాలు చేసింది. ఈలోగా పార్సీ, ఉర్దూ కళాకారులు రంగప్రవేశం చేసారు. చారిత్రికాలు, జానపదాలు మొదలయ్యాయి. ఇదేసమయానికి మరోవైపునుంచి ఆంగ్ల విద్యావంతులయినవారు వారి ప్రభావాన్ని మోసుకువచ్చారు. ఇంకోవైపునుంచి స్వతంత్రోద్యమాన్ని సాంఘిక సంస్కరణలతో ముడిపెట్టటంతో సాంఘికంగా సందేశాన్నిచ్చే సంస్కరణల సినిమాలు మొదలయ్యాయి. కొన్నాళ్ళకి కమ్యూనిజం ఆదర్శంగా సమాజంలో ప్రవేషించింది. దాంతో సాంప్రదాయ వ్యతిరేకత అభ్యుదయం అయ్యింది. ధనికులు మూకుమ్మడిగా విలన్లయ్యారు. పేదరికం హీరోయిజం అయ్యింది. సాంప్రదాయ నిరసన, సాంప్రదాయ ఉల్లంఘన హిట్ ఫార్మూలాల్లో ఒకటయింది.

ఇదే సమయానికి దేశంలో వాతావరణం మత పరమయిన ద్వేషాలతో కలుషితమయింది. ఇది కళాకారులపైన వారు నిర్మించే సినిమాలపయినా పడింది. దాంతో సినిమాలలో మతపరమయిన భావనలను ప్రదర్షించకూడదన్న నియమం ఎవరూ పెట్టకుండానే అమలులోకి వచ్చింది. ఒకవేళ చారిత్రిక సినిమాలు తీసినా అవి మహమ్మదీయుల గొప్పతనాన్ని చెప్పేవిగానే వుండాలని మతపరమయిన భావనలను రెచ్చగొట్టేవిగా వుండకూడదన్న్ నియమమూ మొదలయింది.

ఈ కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే మన సినిమాలు మూసలోకి ఎందుకు పరిమితమయ్యాయో బోధపడుతుంది. మన సినిమాలు కొన్ని ఫార్మూలలకే ఎందుకు కుచించుకుపోయాయో అర్ధమవుతుంది.

సినీ కళాకారుడికి ఫార్మూలా ఎందుకవసరమవుతుందో ముందే అనుకున్నాము. బోలెడన్ని డబ్బులు ఖర్చుపెట్టి ఒక సినిమా నిర్మిస్తాడు. ప్రేక్షకులు దాన్ని మెచ్చకపోతే దివాళా తీస్తాడు. దేన్నయినా పోగొట్టుకున్న చోటే వెతుక్కోమంటారు. అందుకని సినిమాలో డబ్బులు పోగొట్టుకున్న వారు మళ్ళీ సినిమాల్లోనే సంపాదించాలని చూస్తారు. ఇంతకుముందు తనకు నచ్చినట్టు తీసి భంగపడ్డవాడు, ఇప్పుడు ప్రక్షకులేది మెచ్చుతున్నారో అది తీయాలనుకుంటాడు. విజయం సాధిస్తే అది కొనసాగుతుంది. లేకపోతే, చెప్పేదేమీ వుండడు.

ఇలాంటి పరిస్థితి తప్పించుకోవాలంటే, ప్రేక్షకులు దేన్ని మెచ్చుతున్నారో గమనించాలి. ఇది తెలుసుకోవాలంటే హిట్ అయిన సినిమాలను గమనించటం తప్ప వేరే మార్గంలేదు. హిట్ అయిన సినిమాలో ఏయే అమ్షాలు ప్రజలు మెచ్చారో చూసి ఆయా అమ్షాలనే అనుసరిస్తే ఢోకాలేదనుకుంటారు. అలా ఏర్పడుతుంది ఫార్మూలా. ఈ అనుసరించటానికి మన సినిమాలేకాదు, విదేషీ సినిమాలూ పనికివస్తాయి.

ప్రపంచంలో దేశాలూ, భాషలూ, సంస్కృతులూ వేరయినా మానవ సంవేదనల స్వరూపమొక్కటే. కాబట్టి ఒకచోట సినిమా ప్రజలకు నచ్చిందంటే, దాన్ని దిగుమతిచేస్తే, మిగతా ప్రజలకూ నచ్చేవీలుంటుంది. కాబట్టి, తెలియనిదాంతో ప్రయోగం చేసేకన్నా, ఒక చోట విజయం సాధించిన దాన్నే ఆధారంచేసుకుంటే, మంచిది అనుకుంటారు. ఇలా కాపీలు, అనుకరణలూ మొదలవుతాయి.

మన చలనచిత్ర రంగం ఇలా పనిచేస్తుంది. స్వయంగా ప్రయోగం చేసి దెబ్బ తినేకన్నా నిరూపణ అయిన దానితో పరాచికాలాడటం మేలు అన్నది మనవారి అభిప్రాయం. known devil is better than unknown angel లాంటిదన్నమాట ఇది.

ఇలా safe గా సినిమాలాటలాడాలన్న ఆత్రంలో మనవారు వేరేవారు ప్రయోగాలు చేసి విజయం సాధించేవరకూ ఎదురుచూస్తారు. ఏదయినా విజయం సాధించగానే వెంటనే దాన్ని అనుకరిస్తారు. నకళ్ళకు నకళ్ళు తయారుచేస్తారు. అందుకే మనవారు మన స్థాయిలో విజయం సాధించినా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడున్నారో అక్కడేవుండిపోతున్నారు.

అయితే, ఈ పరిస్థితి ఆరంభమ్నుంచీలేదు. ఆరంభంలో, అక్కడినుంచి ప్రేరణపొందినా కళాకారులు తమదంటూ ప్రత్యేక సృజనాత్మక కళాకౌశలాన్ని ప్రదర్శించేవారు. చక్కగాతీసి ప్రజలను మెప్పించాలని చూసేవారు. అయితే, అనేక అంశాలలో ఇతర దేశాలకూ మనకూ తేడాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అక్షరాస్యత రక్కువ ఇది కూడా మనసినిమాల రూపు రేఖలను అత్యంత బలంగా నిర్దేషించిన విషయాలలో ఒక ప్రధానమయిన విషయం.

మూస సినిమాలేరావటం నుంచి కళాకారుల ప్రేరణ, నిరక్షరాస్యతా ప్రభావం వరకు తదుపరి వ్యాసాలలో చర్చిద్దాం.

October 24, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

సినిమా కళనా? వ్యాపారమా?

సినిమా తీయాలంటే డబ్బు కావాలి. సాధారణంగా కళాకారులు పేదవారే అవుతారు. కాబట్టి వారు తమ కళను వ్యక్త పరచేందుకు ధనవంతులపైన ఆధారపడాల్సివుంటుంది. ఆ ధనవంతుడు సహృదయుడయితే సమస్యలేదు. అలాకాక తాను పెట్టిన పెట్టుబడికి లాభం తప్పని సరిగా కావాలంటే కళాకారుడు ఇరుకున పడతాడు. వ్యాపారి కోర్కె సమంజసమే. కానీ కళాకారుడికి తన కళా నైపుణ్యం పయిన ఎంత నమ్మకం ఉన్నా తన కళను ప్రజలు ఆదరించి డబ్బులు కురిపిస్తారన్న భరోసా మాత్రం వుండదు. ఇక్కడే సినిమాకు సంబంధించిన డైలమ్మా ఆరంభమవుతుంది.

సినిమా కళనా? వ్యాపారమా? కళతో వ్యాపారమా? వ్యాపారమయిన కళనా?

పాతాళ భైరవి సినిమాలో ఎస్వీ రంగారావు పాత్ర ఒక మాటంటుంది. జనం కోరింది మనం ఇవ్వటమా? మనకు నచ్చింది ఇచ్చి మెప్పించటమా? అని. ఇది కళాకారుడిని పట్టి వేధించే అంతులేని సమస్య.

వ్యాపారం ప్రజలు కోరింది ఇమ్మంటుంది. కళ తన భావావేశాన్ని అనుసరించమంటుంది.

కవులు, రచయితలు, ఇతర కళాకారులకున్న సౌలభ్యం సినీ కళాకారులకు లేదు. ఎందుకంటే అది సమిష్టి కళ. డబ్బుతో కూదుకున్నది. దాంతో దేన్ని అనుసరించాలన్నది, డబ్బు అందించేవాడి పైన ఆధారపడివుంటుంది.

మన దేశంలో సినిమాలను కళాత్మక సినిమాలు, వ్యాపార సినిమాలుగా విభజిస్తారు. కళాత్మక సినిమాలంటే వ్యాపారం పైన దృష్టి లేక కేవలం తనలోని కళాకారుడిని సంతృప్తి పరచుకునేందుకు తీసిన సినిమాలు. వ్యాపార సినిమాలంటే, ప్రజలను మెప్పించటమే ప్రధానోద్దెశ్యంగా వున్న సినిమాలు.

కానీ, ఈ విభజన్ అర్ధం లేనిది. సినిమా ఏదయినా కళనే. ఆ కళ ప్రజలను ఆకర్షిస్తుందా, లేదా అన్నది వేరే విషయం.

కళాకారుడెప్పుడూ తన కళను ప్రజలు ఆదరించాలనే కోరతాడు. తనను ప్రజలు మెచ్చుకోవాలనే కోరతాడు. పేరు, ఖ్యాతి, ధనం ఎవరికీ చేదుకావు. కాబట్టి సినిమాలను కళాత్మకమనీ, వ్యాపారమనీ విభజించటం కుదరదు.

ఇటీవలే సావరియా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో దర్శకుడు ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఒక అద్భుతమయిన ద్రుష్య కావ్యాన్ని తెరపైన ప్రదర్శించాడు. కానీ దానిలో ప్రజల ఆత్మను స్పృషించగలిగే అమ్షంలొపించటం చేత అది విఫలమయింది. ఇప్పుడు ఆ సినిమా కళాత్మకమా? వ్యాపారమా?

అది వ్యాపారమే అయినా దాన్లో కళాత్మక విలువలు కాదనలేనివి. దాదాపుగా ప్రతి సినిమా అంతో ఇంతో కళను ప్రదర్శిస్తూంటుంది. కాబట్టి, ఏ కళాకారుడయితే, తనలోని కళాకారుడికి, వ్యాపారికీ నడుమ సమన్వయం సాధిస్తాడో అతడు సినీ మాధ్యమంలో నిలవగలుగుతాడు. ఈ రెంటి మధ్య సమన్వయం సాధించలేనివాడు ఎంత గొప్ప కళాకారుడయినప్పటికీ నిలవలేకపోతాడు.

రాజ్ కపూర్ గొప్ప కళాకారుడు. గొప్ప వ్యాపారి. అతని సినిమాలన్నీ వ్యాపారపరంగా విజేతలే. కళా పరంగా కూడా అతని సినిమాలు అధ్భుతాలే!

పాత్రల మానసిక సంఘర్షణలూ, వ్యక్తిత్వాలూ, ఎంతో గొప్పగా ప్రదర్శిస్తాయి అతని సినిమాలు. అంటే, కళ వ్యాపారమా, కళనా అని మీమాంసను జరిపేకన్నా, కళాకారుడు తనలో తాను సమన్వయం సాధించటం ఉత్తమం అన్నమాట.

హిందీలో శాంతారాం, బిమల్ రాయ్, హృషీకేష్ ముఖెర్జీ తదితరులు, తెలుగూలో విజయావారు, బీ ఎన్ రెడ్డి వంటివారూ ఈ సమన్వయం సాధించారు. అందుకే వారి చిత్రాలు వ్యాపారంగా హిట్టు. కళాత్మకంగా సూపెర్ హిట్టులు.

మరి ఇప్పుడు కళాకారులెందుకు ఆ సమన్వయం సాధించలేక పోతున్నారు?

కళాత్మక చిత్రాలంటే, కొద్ది మందికే అవార్డులకే పరిమితమయి, వ్యాపార చిత్రాలంటే సమాజంలో అందరినీ అలరించగలిగి ప్రభావం చూపేవిగా ఎందుకయ్యాయి?

October 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

సినిమాలెవరు తీస్తారు? ఎందుకు తీస్తారు?

ఇది అడగవలసిన ప్రశ్ననా? అనిపిస్తుంది.

సరే, అడిగేశాము కదా, సమాధానం కోసం ప్రయత్నిద్దాం.

సినిమా నిర్మాత తీస్తాడు. కానీ, నిర్మాత పని సినిమా తీయాలనుకోవటం వరకే. మిహతా సినిమాను నిర్మించాల్సింది వేరేవారు.

ఇతర కళలకూ సినిమాకూ ఇది ప్రధానమయిన తేడా.

రచయిత ఎవరి ప్రమేయంలేకుండా రచనలు చేయగలుగుతాడు. చిత్రకారుడు రెండో వ్యక్తితో సంబంధం లేకుండా చిత్రాలు గీయ గలుగుతాడు. కానీ, వొంటరిగా సినిమాలు నిర్మించటం కుదరదు.

సినిమాకు కథా రచయిత అవారం. నటీ నటులు అవసరం. దర్శకుడు అవస్రం. కెమేరామాన్ అవసరం. ఎడిటర్ అవసరం. సంగీతం అవసరం. ఇదంతా అయిన తరువాత సినిమాను పంపిణీ చేసేవారు అవసరం. పంపిణీతో సరిపోదు. సినిమాను ప్రదర్శించేవారు అవసరం. అంటే, ఇతర కళలకు భిన్నంగా సినిమా ఒక్కరితో అయ్యేపనికాదు. ఇది సమిష్టి కృషి ఫలితం. దానికి తోడు ధనం చాలా అవసరం. పేదవాడు రచనలు చేయగలడు. బొమ్మలు గీయగలడు. పాట పాడగలడు. నాట్యం చేయగలడు. కానీ సినిమా తీయలేడు.

కళాకారులకు ఆరంభమ్నుంచీ పోషకుల అవసరం వుంది. కానీ ఒకప్పటి వ్యవస్థలో కళాకారులు సమాజంపైన ఆధారపడేవారు. ప్రజలే వారి పోషకులు. బుర్ర కథలు, తోలు బొమ్మలాటలు వంటి వాటిని ఒక గ్రామంలో ప్రదర్శిస్తే, ఆ ప్రదర్శనలున్నన్నినాళ్ళు ఆ గ్రామ జమీందారో, పెద్దలో వారి పోషణ చూసుకునేవారు. దాంతో కళాకారులెన్నడూ తమ సామాజిక బాధ్యతను విస్మరించాల్సిన అవసరమూ రాలేదు. ప్రతి క్షణం వారు తమ సామాజిక బాధ్యతను స్మరిస్తూండేవారు. సమాజాదరణ పొందుతూండేవారు.

అయితే, సమాజాదరణ లేనివారు కూడా తమ కళను భగవద్దతంగా భావించి, బుద్ధిగా, చిత్త శుద్ధితో కళను సృజించేవారు.

పోతన రాజాశ్రయం పొందలేదు. కేవలం తాను అనుకున్న రీతిలో రచన సాగించాడు. సమాజం అతని కళను హృదయానికి హత్తుకుంది. పోతన రచనను చిరంజీవిని చేసింది. నన్నయ, తిక్కన, ఎర్రన తదితర కవులు రాజాశ్రయంలో వున్నా తమ సామాజిక బాధ్యతను నిర్వహించారు.

సినిమా ఈ పరిస్థిని మార్చింది. ఎందుకంటే, సినిమా తీయటం అంత తేలిక కాదు. తీసిన తరువాత చూపటమూ అంత తేలిక కాదు. కాబట్టి సినిమా లో డబ్బులు ప్రాధాన్యం వహిస్తాయి.

దాదాఫాల్కే సినిమాకోసం తన ఆస్తిని ఫణంగా పెట్టాడు. అయితే, ఆ కాలం వేరు. సినిమా మనకు కొత్త. పైగా మాటలు లేవు. కాబట్టి అందరికీ అర్ధమయ్యే పౌరాణిక గాధలనే తెర కెక్కించారు. కానీ ప్రజలకు అద్భుతాలు చూపాలి. గొప్పగా తీయాలి అన్న తపన ఆనాటి కళాకారుల్లో కనిపించేది. నిర్మాత సైతం పెట్టుబడి పెట్టినా కళాకారులను గౌరవించేవాడు. గమనిస్తే దాదా ఫాల్కే చివరి దశలో ఆయన వ్యాపార కళాకారులతో పోటీ పడలేకపోయాడు.

అంటే సినిమా నిర్మించాలంటే, కళాభినేవశం అవసరంలేదన్నమాట. తపన అవసరంలేదు. ఆదర్శం అవసరంలేదు. ఊహలు కూడా అవసరంలేదు. సినిమా నిర్మించాలంటే డబ్బు వుంటే చాలు.

ఒకప్పుడు డబ్బుతో పాటూ హృదయంవుండేది. సమాజానికి ఏదో చేయాలన్న తపన వుండేది. ముఖ్యంగా కళాకారులలో కళ ను ప్రదర్శించాలని, తమ కళా ప్రదర్శనద్వారా గుర్తింపుపొందాలని వుండేది. తమ కళను సమాజంకోసం ఉపయోగించాలన్న ఆలోచనవుండేది. ఇవేవీలేకున్నా కనీసం ప్రజలకు ఆనందం కలిగించాలని, వినోదాన్నివాలని వుండేది.

కమాల్ అమ్రోహీ, గొప్ప కళాకారుడు. ఒక దశలో తన కళా ప్రదర్శన అవకాశాలు సరిగా దొరకటంలేదనిపించింది. దాంతో తానే నిర్మాత అయ్యాడు. కళాఖండాలను నిర్మించాడు. అశోక్ కుమార్ అంతే. దేవానంద్ అంతే. రాజ్ కపూర్ అంతే.

మహబూబ్ ఖాన్ కళాకారుడు కాదు. కానీ సినిమా కళ ద్వార సమాజనికి లాభం కలిగించాలన్న తపన వుంది. ఆయన సినిమాలు ఔరత్ నుంచి, సన్ ఆఫ్ ఇండియా వరకూ ఇదే తపనను చూపుతాయి. మదర్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన సినిమా అందాజ్ ఈనాటి సమాజానికీ గుణ పాఠాలు నేర్పుతుంది.

శాంతారాం నటుడు. తనకు నచ్చిన సినిమాలు తానే నిర్మించాడు. తాను నటించలేనప్పుడు వేరే వారితో నిర్మించాడు. దేవదాసు సినిమా దుష్ప్రభావం ఆనాడే గ్రహించి ఆ సినిమాను ఖండిస్తూ ఆద్మీ అనే మహత్తరమయిన సినిమాను నిర్మించాడు. ఆ సినిమా అంతగా ప్రజాదరణ పొందలేదు అది మన సమాజ దురదృష్టం!

తెలుగూలో కూడా ఇది చూడవచ్చు. ఎంటీ రామారావు బయట సినిమాలతో తృప్తి కలగనప్పుడు తనే సినిమాలు నిర్మించాడు. కమల్ హాసన్ సైతం తన కళాప్రదర్శన కోసం సినిమాలు నిర్మించుకుంటాడు. భానుమతి కూడా ఇదేపద్ధతి అవలంబించింది. అనేక నటీనటులు మంచి పాత్రల కోసం సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు.

హాలీవుడ్ లో కూడా సరయిన పాత్రలు దొరక్క కిర్క్ డగ్లస్, సిల్వెస్టర్ స్టాలన్, వూడీ అలన్, టాం హాంక్స్, జూలియా రాబెర్ట్స్, సూసన్ సారండన్, గోల్డీ హాన్, టాం క్రూయిజ్, వంటివారు నిర్మాతలయ్యారు. ఒక దశలో స్పీల్ బెర్గ్ సైతం తన నిర్మాణ సంస్థ స్థాపించుకున్నాడు.

ఇలా చూస్తూ పోతే, నిర్మాత కళాకారుడయినా, కళ పట్ల అవగాహన వున్నా సినిమా కళగా అభివృద్ధి చెందుతుంది.

అలాకాక కళాకారుడు వేరు అయి, నిర్మాతకు కళపట్ల అవగాహనలేక సినిమా నిర్మాణం కేవలం ఒక వ్యాపార మాధ్యమం అయితే, వ్యాపరం జరుగుతుంది. కళగా సినిమా దెబ్బతింటుంది. తద్వార సమాజమూ నష్టపోతుంది.

కాబట్టి, సినిమాలు ఎవరు తీస్తారు అన్నదానికి వ్యాపారులు అన్న సమాధానం వస్తే, ఎందుకు తీస్తారోకూడా అర్ధమయిపోతుంది. సినిమా నిర్మించేది కళాకారులు అన్న సమాధానం వస్తే, వ్యాపారంతో పాటూ కళకూడా మిళితమయివుంటుందని తెలుస్తుంది.

ఇది సినిమాలు నిర్మించేవారికి ఏవయినా అర్హతలుండాలా, సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే రాజకీయ నాయకులకు అర్హతల అవసరం లేనట్టె, సినిమా నిర్మాతలకూ అవసరం లేదా అన్న చర్చకు దారి తీస్తుంది. 

ఇది భవిష్యత్తులో అనేక ఇతర చర్చలకు కారణం అవుతుంది.

October 21, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

అక్కడే మరో కథ నాదే చదవండి!

ఈ వారం www.aadivaaram.com పత్రిక సంచికలో నావే రెండు కథలున్నాయి. జీవితం- జాతకం లోని మొదటి కథ మారకదశ తో పాటూ, 4క్ష్5 సంకలనంలోని ఇంకో కథ మట్టిగుట్ట-మేరుశిఖరం కూడా ఈ సంచికలోనే ప్రచురించారు. కథకుడిగా రచయితగా నేను ఎలాంటి పరిథులు పరిమితులు నాపైన విధించుకోలేదు. ఇలాంటి కథలే రాశ్తాడు అన్న చట్రంలో బిగించుకోలేదు. వివిధ అంశాల ఆధారంగా కథలు రాయాలని ప్రయత్నించాను.

ఒక వైపు సాంఘిక కథలు రాస్తూ మరో వైపు జీవితం-జాతం, రాజతరంగిణి కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, భగవద్గీత ఆధారంగా కథలు, ఇప్పుడు పారానార్మల్ కథలు ఇలా రకరకాల కథలు సృజిస్తూ వస్తున్నాను. ఇమేజ్ అన్నది కథకుడి అభివృద్ధికి ప్రతిబంధకం అన్నది నా అభిప్రాయం.

కానీ, మన సాహిత్య ప్రపంచంలో అనేక అపోహలు, సంకుచితాలు ఉన్నాయి. అందువల్ల specialisation కే పెద్ద పీట వేస్తారు. ప్రాంతీయ కథలు, పేదల కథలు, మాండలీక కథలు ఇలా వర్గీకరించి రచయితలను ముద్రల చట్రాల్లో బిగిస్తారు. ఆ చట్రాలకతీతంగా రాస్తున్న వారిని ఏ వర్గంలో చేర్చాలో తెలియక ఆ రచయితను కథా రచయితగానే పరిగణించరు. అందుకే నా కథలు మీకు ఏ ఇతర సంకలనాల్లోనూ కనబడవు.

ప్రతి రచయితకూ కొన్ని పరిమితులుంటాయి. నా పరిమితులను అర్ధంచేసుకుని, ఆ పరిమిత పరిథిలోనే విభిన్నమయిన కథలు విస్తృతంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను.

ఇప్పటికి ఈ పత్రికలో నావి నాలుగు కథలు చదివారు. ఈ నాలుగు కథల ఆధారంగా మీ అభిప్రాయాన్ని, నిర్మొహమాటమయిన విశ్లేషణనూ ఆహ్వానిస్తున్నాను. ఎదురు చూస్తున్నాను.

October 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu