Archive for October 1, 2008

మన మహాత్ముడు, విమర్శ-8

వ్యక్తుల మనస్సులలో భావాలను వారి మాటలు చెప్తాయి. ఒకోసారి మాటలలో లేని అర్ధము దాని ధ్వనిలో వుంటుంది. అలాంటి పరిస్థితులలో మనము పై పై మాటల అర్ధాలను వదిలి ధ్వని ఆధారిత అర్ధాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. మన మహాత్ముడు పుస్తకంలో ఈ ధ్వని ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది.

స్సర్జెంటు మాజర్ గాంధీ అనే అధ్యాయంలో, గాంధీ గారు ఆఫ్రికాలో నల్లవారికి పోరాటంలో చేసిన సహాయం గురించిన ప్రస్తావన వుంటుంది. ఈ సందర్భంలో గాంధీగారు సహాయం నల్లవారికి కాదు తెల్లవారికి చేసారు అని చెప్పే రాతను చూడండి.

ఔను, గాంధీగారు చప్పునే స్పందించారు. రివ్వునే రంగంలోకి దిగారు. శాయశక్తులా సహాయ సహకారాలు అందించారు. కాని ఆఫ్రికన్లకు కాదు, వారిని వెంటాడుతున్న తెల్ల సర్కారుకు!

నిజానికి, గాంధీ, నల్లవారికే సహాయపడ్డారు. గాయపడిన నల్లవారికి సేవలు చేసే దళం గాంధీగారిది. ఎందుకంటే, నల్లవారికి సేవలు చేసేందుకు తెల్లవారెవరూ సిద్ధంగా లేరు.

ఆకాలంలో మనము బానిసలము. బ్రిటీష్ వారు మన పాలకులు. ఆఫ్రికాలో బ్రిటీష్ వారి దయతో వుంటున్నారు. అటువంటప్పుడు ఎవరయినా జులు వారివైపు పోరాడతారా? రాస్ బిహారీ బోసు కానీ, సుభాష్ బోసు కానీ వెరే దేశంలో సైన్యాన్ని ఏర్పాటు చేసారు. ఆయా దేశ ప్రభుత్వాల అనుమతిలేకపోతే వారికది సాధ్యమయ్యేదా? discretion is better part of valour అంటారు. గాంధీ చేసిందీ అదే. ఎలాంటి సాయుధపోరాటంలో శిక్షణ లేకుండా సైన్యంలోకి యుద్ధ సమయంలో తీసుకోరని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. జులులను తెగ నరకుతున్న బ్రిటీష్ వాడికి అలాంటి అవసరమే లేదని తెలుసు. అయినాసరే సహాయం చేస్తాననటం పౌరుడిగా ధర్మం. గాంధీ అదే చేసారు. గాయపడిన నల్లవారికి సేవ చేసారు.

గాంధీ రాంబో కాదు. నల్లవారికి అన్యాయం జరుగుతోందని తుపాకులు పట్టుకుని ధన ధన బ్రిటీష్ వాడిని కాల్చేసి నల్లవారిని గెలిపించేందుకు. గాంధీ ఒక మామూలు మనిషి. కాల క్రమేణా, అంచెలంచెలుగా ఎదుగుతూ, తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ  ఆయన మహాత్ముడయ్యాడు.

ఏ వ్యక్తీ కూడా పుట్టుకతో వికసిత వ్యక్తిత్వం వుండదు. వయసు, అనుభవాలు, వ్యక్తిని తీర్చి దిద్దుతాయి. తనలోకి తాను చూసుకుంటూ, అనుభవాల పాఠాలు గ్రహించేవారు మహాత్ములవుతారు. మిగతావారు మామూలు మనుషులుగా మిగులుతారు.

జులు తెగలకు సేవలు చేస్తూ గాంధీ బ్రహ్మచర్యం గురించి ఆలోచిస్తూంటే శాస్త్రి గారికి విపరీతమయిన అసహనం వచ్చేసింది. ఆయన మాటల్లోనే,

ఏపాపమెరుగని జనావాసాలు సైనికుల రఫిళ్ళ పేలుళ్ళతో అహరహం దద్దరిల్లుతూంటే, ఈ మహానుభావుడు తీరి కూర్చుని బ్రహ్మచర్యం గురించి, దానిలోని చిక్కులగురించి దీర్ఘాలోచన చేయటం ఏమిటి? ఇంటికెళ్ళగానే బ్రహ్మచర్య శపథం చేసి ధర్మపత్నితో మంచంపొత్తు మానుకోవటం ఏమిటి?

ఇక్కడ రచనలో ధ్వని చూడండి. ఒక వ్యక్తి గురించి వ్యాఖానించేటప్పుడు అతని మానసిక స్థితి గురించి వ్యాఖ్యానించేటప్పుడు లోతయిన అవగాహన అవసరం. కానీ ఇక్కడ అలాంటి ఆలోచనే కనపడదు. మహాను భావుడు తీరి కూర్చుని, ఎంత అవమానం! ఆలోచనలు తీరి కూర్చునే చేయనక్కర్లేదు. అత్యంత తీవ్రమయిన పనులు చేస్తూ కూడా ఆలోచనలు చేయవచ్చు. దెబ్బతిన్న రోగికి కట్లు కడుతూ కూడా ఆలోచించవచ్చు. మంచం పొత్తు. బ్రహ్మచర్యమనే పవిత్ర పదానికి రచయిత చూపిన వికృతార్ధం ఇది.

రచయిత ఒక్క సారి భారతీయ ధార్మిక గ్రంథాలు తిరగేస్తే భారత ధర్మం లో బ్రహ్మచర్య ప్రాధాన్యం అర్ధమవుతుంది. పైగా, ఇక్కడ ఇన్ని వేల సంఖ్యలో జనులు ప్రాణాలు కోల్పోతూంతే, వ్యక్తిలో వైరాగ్య భావనలు కలగటంలో ఆశ్చర్యం వుందా? మనకే అనిపిస్తూంటుంది, పాలెస్తీనా, ఇరాక్, కాష్మీర్, అఫ్ఘనిస్తాన్ లలో ప్రజలు ఎలా వుంతున్నారో అని? కానీ అక్కడ ప్రజలు సంసారాలు చేస్తున్నారు. పిల్లల్ని కంటున్నారు. ఇంతమంది చస్తూంటే మీరు తీరి కూర్చుని సంసారాలు చేస్తూ పిల్లల్ని కంటున్నారా? అంటే ఎలా వుంటుంది. గాంధీ గారి గురించి రచయిత చేసిన వ్యాఖ్య అలా వుంది.
జయా బచ్చన్ ను గుడ్డీ బుడ్డేఎ హోగయీ, అఖల్ నహీ అయీ అని రజ్ ఠక్రే అంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుందో, గాంధీ పత్ల రచయిత వ్యాఖ్య అంతే జగుప్సాకరంగా అనిపిస్తుంది.

మిగతా రేపు.

October 1, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu