Archive for October 4, 2008

మన మహాత్ముడు, విమర్శ-10

ప్రజలు వెర్రి గొర్రెల్లంటివారు. కర్ర పట్టుకుని ఎవరు పెత్తనం సాగిస్తే వారిని అనుసరిస్తారు అని ఒక సామెత వుంది. కాస్త చేదు అనిపించినా ఇది నిజం. వ్యక్తిగతంగా ప్రతివారూ స్వేచ్చను కోరతారు. కానీ తాము కోరుతున్న స్వేచ్చకోసం పోరాడాలన్న ఆలోచన రాదు. వచ్చినా దాన్ని ఆలోచనలో పెట్టరు. ప్రజలను ప్రేరేపించి, వారిలో ఆశలను రగిలించి, వారి బద్ధకాన్ని వదిలించి కార్యోన్ముఖులను చేసేందుకు నాయకుడవసరమవుతాడు.

ప్రతివాడికీ నాయకత్వం వహించాలనేవుంటుంది. కానీ అందరూ నాయకులు కాలేరు. నాయకులయినవారంతా అసలు నాయకులు కాలేరు. అసలు నాయకులంతా మహా నాయకులు కారు.

నాయకుడన్నవాడు ప్రజలకు నచ్చకున్నా, వారికి మేలు కలిగించే దారిలో వారిని తీసుకువెళ్ళగలగాలి. భవిష్యత్తుపైన విశ్వాసం, భూతకాలంగురించి అవగాహన, వర్తమానం గురించి ఆలోచనలుండాలి. ఇలాంటి నాయకుడు కఠినమయిన నిర్ణయాలు తీసుకుంటాడు. సమకాలీకులు మెచ్చకున్నా భవిష్యత్తు గురించి ఆలోచన వున్నవాడు కాబట్టి, సమకాలీకులకన్నా కొంత ఎక్కువ దూరం చూసేవాడు కాబట్టి, సమకాలీకుల అభ్యంతరాలను ఆమోదాలుగా మలచుకుంటాడు. ముందుకు సాగుతాడు. విమర్శలను. దూషణలను పట్టించుకోడు. ఎందుకంటే, తనపిన తనకు నమ్మకంవుంది కాబట్టి. మహాత్మా గాంధీ అలాంటి నాయకుడు.

గాంధీజీ కన్నా ముందు బోలెడంత మంది నాయకులున్నారు. తరువాత అనేకులు వచ్చారు. ఇంకా వస్తారు. గాంధీలా సమ్యక్ దృష్టి సమగ్రపుటాలోచనలు కల నాయకులు చాలా అరుదుగా వస్తారు. అందరూ స్వాతంత్ర్యం కావాలన్న అవేశాలు ప్రదర్శిస్తున్నారు. అందరూ ఉత్తేజితులయి ఉత్సాహంగా వున్నారు. కానీ గాంధీ దృష్టి కేవలం స్వాతంత్ర్య సాధనపైనే లేదు. ఆయన దృష్టి రాష్ట్ర నిర్మాణంపైన వుంది. రాష్ట్రం మనుషుల సమూహం. ఎప్పుడయితే వ్యక్తులు సత్ప్రవర్తనతో, విషిష్ట వ్యక్తిత్వంతో వుంటారో అప్పుడా రాష్ట్రం కూడా విషిష్టంగా ఎదుగుతుంది. అందుకే గాంధీ స్వాతంత్ర్యోద్యమం కేవలం ధర్నాలకు నిరసనలకూ పరిమితం కాలేదు. ఒక వైపు నుంచి వ్యక్తి నిర్మాణం, మరో వైపు నుంచి సాంఘికంగా అసమానతలు తొలగించి, నవ్య సమాజ నిర్మాణం, ఇంకో వైపు నుంచి స్వాతంత్ర్య పోరాటం, ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపెట్టి స్వతంత్ర్య సాధనతో ముది పెట్టాడు. సంపూర్ణ స్వరాజ్య సాధన అంటే గాంధీ గారి ఉద్దేశ్యంలో బ్రిటీషువారిని భౌతికంగా పార ద్రోలటం మాత్రమే కాదు. మానసికంగా కూడా వారినుంచి విముక్తులమయి మనల్ని మనము గుర్తించి, మన సంస్కృతీ సాంప్రదాయాల వైశిష్ట్యాన్ని గుర్తించి. ప్రపంచంలో మన ప్రత్యేకతను నిలుపుకుంటూ అభివృద్ధి సాధించటం.

గమనిస్తే, అరబిందో, తిలక్ వంటి వారి అభిప్రాయం కూడా ఇదే. అయితే, వారు తమ ఆలోచనలను ప్రకటించారు కానీ ఆచరణలో అమలు పరచలేదు. వాతిని పోరాటంలో ఒక భాగంగా చేయలేదు.

గాంధీగారు భారతీయుల మనస్తత్వాన్ని క్షుణ్ణంగా గ్రహించిన వ్యక్తి. మన ప్రజలకు డబ్బు, గొప్ప పదవి కన్నా అన్నీ పరిత్యజించిన సన్యాసి ఎక్కువ. ధార్మిక జీవితానికి ఉన్న విలువ మన ప్రజలు ఇంకెవరికీ ఇవ్వరు. రాజులు సైతం ఏమీలేని సన్యాసి ముందు మోకరిల్లుతారు. ఇది మన దేశం. గాంధీగారికిది తెలుసు. బాంబులు వేస్తాం. శతృవును చంపుతాం. కానీ వాడి స్థానన్ని ఇంకోకరు ఆక్రమిస్తారు. ఎంత మందిని చంపుతాం?

ఒక యువకుడు ఆత్మాహుతు దాడి చేశాడు. ఒక శతృవును చంపాడు. కానీ శతృవుతో పాటూ ఒక నిండు కీవితం కూడా బలయిపోయింది కదా? జీవించివుంటే దేశం కోసం ఎంతో పాటు పడేవాడు కదా! పైగా మనం హింస జరిపితే ఎదుటివాడూ హింసకు దిగుతాడు. శతృవు బలవంతుడు. మన ఒక తుపాకీ జవాబు వంద తుపాకులతో ఇవ్వగలడు. అలాంటప్పుడు మన పోరాటం శతృవులోని ంపశువుకు ఊపునివ్వకూడదు. అంటే ముందు మనము మనలోని పసువును చంపుకోవాలి. ఒకవైపు మనము వ్యక్తిగతంగా శతృవుపైన ఎలాంటి ద్వేశం లేదని చూపుతూ, మరోవైపు వ్యక్తిగతంగా గౌరవం, స్వాతంత్ర్యం కోరుతున్నామని మన పోరాటం అంతకే పరిమితమనీ చూపాలి. ఇది కత్తి మీద సాములాంటి పని. మనతో ఆపని చేయించాలని గాంధీ ఉద్దేశ్యం. అందుకే ఆయన సత్యాగ్రం సృజించారు. ఉపవాసానికి మనలోనే కాదు, ఇస్లాంలో కూడా ఉన్న ప్రాధాన్యం గాంధీగారికి తెలుసు. అందుకే ఉపవాసాన్ని ఆగ్రహ వ్యక్తీకరణకు ప్రతీకను చేశారు. అయితే ఉపవాసంతో ఆగ్రహం వ్యక్తీకరించటంతోటే మన ఆగ్రహం పవిత్రమయిపోతుంది. అందుకే అది సత్యాగ్రహమయింది. అయితే సత్యాగ్రం చేసేవారు సత్యవంతులయివుండాలి. వారి ప్రవర్తన ఉన్నతంగా వుండాలి. వారి పోరాటం కూడా శాంతియుతంగా వుండాలి. అప్పుడే మన ఆగ్రహానికి శక్తివస్తుంది. అప్పుడే మన పోరాటం భౌతిక స్థాయిని దాతి ఆధ్యాత్మిక స్థాయికి ఎదుగుతుంది. అందుకే ప్రతి వ్యక్తి నిరాడంబరంగా జీవించాలి.సత్యం పలకాలి. బ్రహ్మచర్యం పాతించాలి. పరమత సహనం చూపాలి. అంటరాని తనం నిర్మూలించాలి. భజనలు చేయాలి.

ఇప్పుడు గాంధీ గారి పోరాట పరిథి విస్తృతమయి కనిపిస్తుంది. ఆయన ఒకవైపు నుంచి బానిసత్వం నుంచి దేశాన్ని విముకతం చేయాలని తపన పడుతూనే మరో వైపునుంచి మానసిక దాస్యం నుంచీ మనల్ని జాగృతం చేయాలని ప్రయత్నించారు. అంటే స్వేచ్చ సాధించిన తరువాత మన సమాజ నిర్మాణం కోసం అప్పుడే ఆయన బీజాలు నాటటం ఆరంభించారన్నమాట. ఆయన్ సూచించిన విద్యావిధానంకానీ, ఆర్ధిక విధానంకానీ, సామాజిక నియమాలు కానీ, సర్వం వ్యక్తిని స్వేచ్చ స్వతంత్ర్యాలను నిర్మాణాత్మకంగా. సృజనాత్మకంగా ఉపయోగించుకునే మానసిక స్థాయికి సిద్ధంచేయటం లక్ష్యంగా ఏర్పడ్డాయి. ఆయన దృష్టి బ్రిటీష్ వారిని తరమటం పైనేకాదు, రాజ్యం మనదయిన తరువాత, సత్ప్రవర్తనతో ఎలా భారతదేసానికి రాబోయే తరాలు సేవచేయాలో అందుకు సిద్ధం చేయటంపైనే
వుంది. ఇది అర్ధంకాని వారికి ఆయన పోరాటాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు అనిపిస్తుంది.

ఆయన దృష్టిలో ప్రతి పౌరుడూ సైనికుడే. రాబోయే భవిష్యత్తు నిర్మాణంలో రాళ్ళెత్తవలసిన కూలీయే. అందుకే ఆయన ఒక్కరు క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినా మొత్తం ఉద్యమాన్ని నిలిపేసేవారు. ఒక పిల్లవాడు అల్లరి చేస్తే తరగతినంతా శిక్షించటం ద్వారా బుద్ధి చెప్పటంలాంటిదన్నమాట ఇది. ఇప్పుడే అవేశాన్ని అణచుకోలేనివాడు రేపు స్వతంత్ర్యం వచ్చిన తరువాత అడ్దూదుపులేకుండా ప్రవర్తిస్తాడు. అందుకే క్రమశిక్షణకు అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారాయన. ఇప్పుడు ఈ దృష్టితో చూస్తే, గాంధీ ప్రవర్తనలో అసంబద్ధాలుగా, అసమంజసాలుగా కనిపించినవాటన్నిటి వెనుక పరమార్ధం గోచరిస్తుంది. గాంధీజీ లక్ష్యంలోని ఔన్నత్యం ముందుచూపులు తెలుస్తాయి.

గాంధీకి తెలుసు ప్రజలు గొర్రెల్లంటివారని. ఒకడొక పనిచేస్తే మిగతా అంతా గుడ్డిగా అనుసరిస్తారని. అందుకే హింసను మొగ్గలోనే తుంచేశారు. ఉద్యమాలు ఆరంభించి దాన్ని నియంత్రించటం తెలియక, అది పట్టు తప్పిన తరువాత, ఇది నా జీవితంలో దురదృష్టకర దినం , అని వ్యాఖ్యానించి కార్యకర్తల బలిదానాలను అభాసుపాలు చేసిన నాయకులు మనకు తెలుసు. చంపంది కొట్టండి తన్నండి నరకండి అని రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ పబ్బం గడుపుతున్న నాయకులు మనకు తెలుసు. ఇందుకు భిన్నంగా ప్రజల ఆగ్రహావేశాలను నియంత్రించి, వారి శక్తిని నిర్మాణాత్మకంగా వాడుకోవాలని, భవిష్యత్తుకు బాటగా మలచుకోవాలని ఆలోచించిన నాయకుడు గాంధీజీ. అందుకే ఆయన మహాత్ముడయాడు. ఆ ఔన్నత్యం అర్ధంకాని వారు ఇంకా ఆయనౌ ధర్మపీథాంపైన నిలిపి తమ గొప్పను చాటుకుంటూనే వున్నారు.

ఇంకొన్ని చిన్న చిన్న సంఘటనల వివరణ రేపు.

October 4, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu