Archive for October 5, 2008

ప్రేమ వేదనకు దివ్య ఔషధం ఈ పాట!-1

కొన్ని పాటలు సినిమా పరిథిని దాటి నిత్యజీవితంలో అనేక సందర్భాలలో ప్రతి ఒక్కరికీ సాంత్వనను కలిగించే సార్వజనీన స్థాయికి చేరుకుంటాయి. అవి విన్న సందర్భంలో బహుషా మనసు వాటి మర్మాన్ని గ్రహించే స్థాయిలో వుంటుందేమో, మొదటి సారి వినగానే గుండెలోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇక జీవితాంతం, ఆ ప్రతిధ్వని తరంగాలు ఎదలో మోగుతూనే వుంటాయి. మనసు విషాదానికి గురయినప్పుడో, ఉదాసీనంగా వున్నప్పుడో, జీవితం పైన నిరాషకలిగినప్పుడో, విరక్తి కలిగినప్పుడో, తమ తరంగాల ద్వారా ఉత్పన్నమయిన మధురిమలో ఓలలాడిస్తాయి. వేదనను, ఆవేదనను, నిరాశా నిసృహలను మాయం చేస్తాయి. ఎదలో తీయని బాధను రగిలించి, ఆ బాధలోనే ఆనందాన్ని మరగించి, ఒక అలవికాని ఆధ్యాత్మికపుటంచులకు తీసుకువెళ్తాయి. అవును సినిమా పాటలకు కూడా ఆ శక్తి వుంది. గంగా జలం ఏ ప్రాంతంలో నయినా పవిత్రమే అయినట్టు సంగీతం శాస్త్రీయమయినా, లలిత మయినా, జానపదమయినా. సినిమా గేయమయినా దాని శక్తి దానిదే!

నేను పరిచయం చేస్తున్న ఈ పాట నేను, నా జీవితంలో ఒక కీలకమయిన దశలో వినటం తటస్థించింది. విన్న వెంటనే నా అపురూపమయిన, అత్యధ్భుతమయిన పాటల జాబితాలో చేరిపోయింది. ఆనాటి నుంచి ఈ నాటి వరకూ విన్న ప్రతిసారీ పాటపైన మక్కువ పెరుగుతోందేతప్ప తరగటంలేదు. అంటే, జీవితంలో అనేక అనుభవాల ఆధారంగా నా ఆలోచనా విధానం మారుతూన్న, ఈ పాట గురించిన ఆలోచనలో మాత్రం మార్పు రావటంలేదన్నమాట. పైగా, నాతో అడుగులో అడుగు కదుపుతూ నాతో పాటూ ఎదుగుతూ వస్తోందన్నమాట ఈ పాట!.

ఈ పాట నాకే కాదు, సంగీత దర్శకుడు, శంకర్-జైకిషన్ లలో శంకర్ జీవితంలో, గాయకుడు మహమ్మద్ రఫీ జీవితంలోనూ ఎంతో ప్రత్యేక స్థానం వహిస్తుంది. వారి జీవితాలలోనూ అత్యంత కీలకమయిన దశను ప్రతిబింబిస్తుందీపాట.

ప్రతిభాశాలురు సాధారణంగా అహంకారులవుతారు. కళాకారుడికది ఆత్మ విశ్వాసం. మిగతావరికది అహంకారం. అందుకే, శంకర్ ను ఎంతోమంది అహంభావిగా భావిస్తారు. కానీ జైకిషన్ వల్ల, వారి పాటలు విజయం సాధిస్తూండటం వల్ల శంకర్ అహంకారాన్ని భరిస్తూ వచ్చారు. జైకిషన్ మరణం తరువాత అందరూ కలసికట్టుగా శంకర్ ను అణగద్రొక్కటం ఆరంభించారు. శంకర్ కు తన ప్రతిభపయిన ఎంత నమ్మకమంటే అందరినీ ఒక్కడే ఎదుర్కోగలనన్న నమ్మకం ఆయనది. ఇంతకు ముందులాగే ఎవరినీ లెక్కచేయలేదు.

కానీ పరిస్థితి మారింది. తరం మారుతోంది. సినిమాలు మారుతున్నాయి. ప్రజల ఇష్టాలు మారుతున్నాయి. శంకర్ ఇది గమనించలేదు. శంకర్ తో ట్యూన్ అయి పాటలు రాసే శైలేంద్ర మరణించాడు. అతని తరువాత ఎందరు పాటల రచయితలతో పని చేసినా శంకర్ కు శైలేంద్రతో కుదిరినట్టు కుదరలేదు. దీనికి తోడు రాజ్ కపూర్ శంకర్ ను వదిలేసాడు. లతా ప్రతీకారం ఆరంభించింది. అప్పటికే శారద శంకర్ జీవితాన్ని చిన్నభిన్నం చేసింది. శంకర్ గొప్పతనం అతని ఆర్కెస్ట్రాలో తెలుస్తుంది. కానీ అందరూ కూడబలుక్కుని శంకర్ కు ఆర్కెస్ట్రా అతను కోరినట్టు ఇవ్వలేదు. దాంతో వున్న దానితో రాజీ పడాల్సి వచ్చింది. అతనికి వచ్చే సినిమా అవకాశాలు కూడా బీ గ్రడు నుంచి. సీ గ్రడు స్థాయికి పడిపోయాయి. అయినా శంకర్ కు పరిస్థితి అర్ధం కాలేదు. ఒక్క హిట్ సినిమా వస్తే మళ్ళీ అందరూ పరుగెత్తుకు వస్తారని అతనికి తెలిసు. అయితే సమయం తనకు వ్యతిరేకంగా వుందని అతడు గ్రహించలేక పోయాడు. ప్రతిదానికీ అంతం వుంటుంది. సంగీతకారుడిగా తన చివరి దశ ఇది అని ఆయన గ్రహించలేక పోయాడు. అందరినీ ఎదిరిస్తూ ముందుకు సాగాడు. ఆదశలో ఆయన సృజించిన పరమాధ్భుతమయిన పాట ఇది.

మహమ్మద్ రఫీ సున్నితమనస్కుడు. 70 దశకం ఆరంభంలో రఫీని గద్దె దింపాలని కుట్రలు జైర్గాయి. పాడటం ఇస్లాం వ్యతిరేకమనీ అది నేరమనీ రఫీని నమ్మించారు. దాంతో రఫీ పాటలు మాని ప్రాయశ్చిత్తంలో పడ్డాడు. ఎవరెంత చెప్పినా వినలేదు. ఒప్పుకున్న పాటలు సైతం పాడుతూంటే మైకు ముందు నిలచి తప్పులు చేసేవాడు. దాంతో రఫీ పని అయిపోయిందని పుకార్లు మొదలయ్యాయి. ఇదే సమయానికి కిశోర్ ప్రభంజనం వీయటం ఆరంభమయింది. రఫీకి పాటలు అడుగంటాయి. రఫీ పాడే హీరోలంత సినిమాలు వదలేస్తున్నారు. దాంతో రఫీని ఆదరించేవారులేరు. రఫీ అన్నీ వదలి మక్కా వెళ్ళివచ్చాడు. తిరిగి వచ్చిన తరువాత అతనికి ఆదరణ కరవయింది. రఫీ పని అయిపోయిందన్నారంతా. తనకు ఒక్క సినిమా వున్నా రఫీ గొప్ప తనం నిరూపిస్తానని ఓ పి నయ్యార్ వాపోయాడు. ఈ సమయంలో రఫీకి ఈపాటపాడే అవకాశం వచ్చింది. ఈపాట కనక విఫలమయితే రఫీ పని ఖతం. అంటే ఈ పాట అటు రఫీకి ఇటు శంకర్ కూ జీవన్మరణ సమస్య అన్నమాట.

ఈ పాట విన్నప్పుడు నేను కనబడిన ప్రతి అమ్మాయిని చూసి చలించిపోయే దశలో వున్నాను. ఒక అమ్మాయి చౌదవీక చాంద్ అయితే ఇంకో అమ్మాయి ఖొయా ఖొయా చాంద్. ఒక అమ్మయిని చాహూంగ సాంఝ్ సవేరే అయితే ఇంకో అమ్మాయి తుం బిన్ జావూ కహాన్? ఒక వైపు మేరి మొహబ్బత్ పాక్ మొహబ్బత్ అయితే ఇంకో వైపు మెరీ మొహబ్బత్ సదారహేగీ. ఓసారి లాఖోహై నిగాహమే అయితే ఇంకోసారి జవాని హాయె మస్త్ మస్త్ బిన్ పియే.  ఒక అమ్మయితో సౌ సాల్ పహలే ముఖే తుంసె ప్యార్ థా అయితే ఇంకో అమ్మయితో హం బేఖుదీ మె తుంకొ పుకారే చలేగయే. ఒక చోట సౌ బార్ జనం లేంగే అయితే ఇంకో చోట హం తుం సె జుదా హోకర్ మర్ జాయెంగె రో రో కర్. ఇలాంటి దశలో ఆ అమ్మాయిని చూశాను.

ఆ అమ్మయిని చూడగానే మనసులో విచిత్రమయిన సంచలనం కలిగింది.ఎంత ఆనందం కలిగిందో అంత వేదన జనించింది. ఎంత ప్రశాంతి కలిగిందో అంత అశాంతి జనించింది. ఎంత ఉన్నతమయిన భావాలు కలిగాయో, అంత పశుత్వం ప్రకోపించింది. ఆమె బస్సులో ఎక్కినప్పతినుంచి దిగేవరకూ నాకు వేరే ప్రపంచం లేదు. ఎన్నో సార్లు ఆమె వెనకే నడుస్తూ వెళ్ళాను. ఎందుకో తెలియదు. ఏమి సాధించాలనుకుంటున్నానో తెలియదు. నాకు నేనే అర్ధంకాని విచిత్రమయిన పరిస్థితి. నా మీద నాకే నియంత్రణలేని స్థితి. నాకో అలవాటుంది. వీలయినంత వరకూ అందరికీ దూరంగా ఎతాయిన ప్రదేశాలలో ఒంటరిగా వుంటాను. అప్పుడు, మా ఇంటి దగ్గరలో ఒక  కొండ వుండేది. రోజూ సాయంత్రం అది ఎక్కి ఎత్తయిన ప్రదేశంలో ఒక్కడినే కూచునేవాడిని. దూరంగా బేగంపెట్ విమానాశ్రయంలో విమానాలు కనిపించేవి. మరోవైపు విశాలంగా పరచుకుని భూమి. అవి చూస్తూ ఎదేదో ఆలోచించుకుంటూండేవాడిని. ఆ సమయంలో ఈ పాట ఎక్కడినుంచో గాలిలో తేలుతూ నా దరికి చేరింది. ఒక్క సారిగా మనసుకు సాంత్వన కలిగింది. అప్పుడు అస్పష్టంగా వినిపించిన ఈ పాటను వెతికి పట్టుకుని పూర్తిగా విన్నాను. అప్పటి నుంచీ ఎప్పుడు నా హృదయం అశాంతి మయమయినా, ఈ పాట నా వేదనకు దివ్యమయిన ఔశధంలా పనికొస్తోంది.

ఉపోద్ఘాతమే ఇంత అయింది. కాబట్టి అసలు పాట రేపు. ఈ పాట ఏమితో అని తెలుసుకోవాలనుకునే వారికి ఒక క్లూ. ఈ పాట రాసింది గుల్జార్. శంకర్ జైకిషన్లకు ఆయన రాసిన ఒకే పాట ఇది.

October 5, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.